త్రిశంకు స్వర్గం

(ముందు మాట చాట్‌ రూం లో మొదలైన పరిచయం ప్రణయమైంది. పెళ్ళి సంబంధాలువెదుకుతున్న తనవారికి, ఓ అమ్మాయి యీ విషయం చెప్పవలసి వచ్చింది. ప్రేమ కీ, బాధ్యత కీ మధ్య ఆ అమ్మాయి మనసు నలిగిపోయింది. ఈ కవిత అలాంటి అమ్మాయి(ల) మనోభావాల గురించే..)

మెరిసే కన్నొకటి, కురిసే కన్నొకటి
నవ్వే పెదవొకటి, నలిగే పెదవొకటి

ఎగసే మనసొకటి, వగచే తలపొకటి
వెలుగు చీకటి నడుమ, నలిగే సంధ్యొకటి

చేయీ చేయీ కలిపి, ఎందాకా ప్రయాణం ?
గమ్యం దొరకంగానే మళ్ళీ ఎవరికి వారం

“విడిపోతామన్న” నిజం తెలిసీ చేసిన స్నేహం
తప్పో వొప్పో తెలియని మానస త్రిశంకు స్వర్గం

కనిపెంచిన మమకారం కోరి తెచ్చె పంజరం
“కడ దాకా బందీనని” తలచి వగచె పావురం

ఉత్తరాల ప్రేమలన్ని ఉత్తవాయెనీదినం
పుత్తడి పూర్ణమ్మ కిపుడు మరల జరిగె అన్యాయం !!


శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

రచయిత శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్‌ సైన్స్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ...