కోవెలలో పకపకలు

నారాయణకి దేవుడంటే ఇష్టం. అంత మాత్రం చేత ప్రతీ వారం గుడికెళ్ళడం ఎలా కుదురుతుంది చెప్పండి? ఏదో, చుట్టం చూపుగా అప్పుడప్పుడూ వెళ్ళి, ఆయన క్షేమం కనుక్కుని రమ్మంటే, అదో పద్ధతిగా వుండేది, అల్లా కాక ప్రతీ శనివారం వెళ్ళాలి, అందునా సుప్రభాతానికెళ్ళాలంటే, అదంత ఆచీపూచీగా తేలే యవ్వారం కాదు కదా.. అదుగో, ఆ మాటే అంటాడు నారాయణ. కానీ నారాయణకి కొత్తగా పెళ్ళవడం వల్ల..తప్పు తప్పు, పెళ్ళయిన కొత్త రోజులు కావడం వల్ల, పెళ్ళాం మాటని మరీ అంత తీసిపారేయలేక, అప్పుడప్పుడూ వెడుతూనే వున్నాడు పాపం.

శుక్కురారం రాత్రి ఏ తలమాసిన ఫ్రెండ్లో డిన్నరుకి పిలిచారంటే ఇహ అంతే సంగతి. వాళ్ళింటినించి ఊడిపడి రావాలి, పొద్దున్నే లేవాలి..రెండు చిక్కులు. అసలీ సుప్రభాతం పొద్దున్నే ఎందుకు పాడడం ? హాయిగా ఏ మధ్యాన్నాన్నో, లేకపోతే కాస్త ఎండ తగ్గాకా, నీడపట్టున యే సాయంకాలవో పాడుకోవచ్చును కదా, పాడరు.

పాపం..వారాంతానికి కూడా సెలవుండదు దేవుడికి. ఆయన్ని దబా, దబా లేపేసి, నీళ్ళోసేసి, పాలు, పసుపు, నెయ్యి, తేని, కాఫీ..ఇల్లా ఏది పడితే అది పోసేసి కడిగేసి, సొడ్డు పెట్టేసి, సీరామ రక్ష చెప్పేసి నించోబెట్టేస్తారు పాపం. అంతే, ఆ నించోవడం నించోవడం మళ్ళీ రాత్రి తలుపులు మూసే వరకూ వచ్చే వాడికీ, పోయే వాడికీ నవ్వుతూ దర్శనాలివ్వడం, అడిగినదీ, అడగనిదీ వరాలివ్వడం, ఇదే పని పెద్దాయనకి. మధ్యలో “సోషొస్తోందర్రా మొర్రో..” అంటే, కాసేపు తలుపులు మూసి, బాగా ఫాట్ వున్న తిళ్ళూ, పళ్ళూ అన్నీ ఎదురుగా పెట్టి, చెయ్యి తిప్పేసి, మహా నైవేద్యం అయిపోయిందంటారు, ఎంత దేవుడైతే మాత్రం అంతంత కొవ్వు పదార్థాలు ఎలా హరించుకోగలడు చెప్పండి? నోరు విడిచి చెప్పలేడు కదా అంచెప్పంచెప్పంచెప్పి, మనం ఇష్టా రాజ్జెం భరతుడి పట్టం చేసేయ్యడవే ? హన్నా, తప్పు కాదూ ?

ఇన్ని లాజిక్కులూ పెళ్ళాం కోరిక ముందు తీసి కట్టే… కాబట్టి ఆ రోజూ బయల్దేరాడు పెళ్ళాన్నేసుకుని. అక్కడికీ బయల్దేరే ముందు గుడికి ఫోను చేసాడు యేవైనా ప్రత్యేక కార్యక్రమాలూ, పఠనలూ, బోధలూ వున్నాయేమో కనుక్కుందామని. అల్లాంటివి వుంటే పార్కింగు దొరకదు (మనవాళ్ళకి పాప భీతి కూసింత ఎక్కువ). ఆ వంకతోనన్నా ఎగ్గొడదావని అతని వుద్దేశం. అవతలెవరో ఫోనెత్తారు.

” ఇవాళ మన గుళ్ళో ఏవైనా స్పెషల్ ప్రోగ్రాంస్ వున్నాయాండీ? ” అడిగాడు నారాయణ.

” తెలియదు..వుండే వుంటాయి” అవతలి కంఠం.

“మరెవరికి తెలుస్తుందండీ ?” అమాయకంగా అడిగాడు నారాయణ.

“పూజార్లకి..”

” పోనీ వాళ్ళకివ్వండి ఫోను”

“వాళ్ళు లేరు, పూజలో వున్నారు”

వళ్ళు మండింది నారాయణకి.

“పోనీ, ఇంకెవరినన్నా కనుక్కుని చెప్పగలరా”

అవతలిగొంతు : (అసహనంగా) ” మీకు ఇంటర్నెట్టుందా? ”

నారాయణ : లేదండీ, టయోటా కరోలా వుంది.

అవతలిగొంతు : అయితే, దాన్లో తిన్నగా ఇక్కడికి వచ్చేయండి.

నారాయణ : మరి, ప్రోగ్రాముల సంగతి ?

అవతలిగొంతు : అబ్బా తెలియదండీ, రోజుకి లక్ష ప్రోగ్రాములుంటాయి, ఎంతమందికి చెప్పగలం ?

నారాయణ : అయితే, వెంఠనే మీరో పని చెయ్యండి.

అవతలిగొంతు : చెప్పండి

నారాయణ : మీ కుర్చీలో ఎవరన్నా పెద్ద మనిషిని కూర్చోబెట్టండి

ఠక్కున ఫోను పెట్టేసాడు నారాయణ. “హన్నా, భక్తుల మీద ధాష్టీకమా? ఎంత మద మెంత…, ఇల్లాంటివాళ్ళే గుడికీ, దేవుడికీ చెడ్డపేరు తెస్తున్నారు “, అనుకుని, తప్పదని బయల్దేరాడు.కాపోతే రవ్వంత ఆలీసం చేసాడు కావాలనే. పదకొండు గంటల కెళితే, అటు దర్శనం, ఇటు మధ్యాన్న భోజనం రెండూ లాగించెయ్యచ్చని పన్నాగం. యీ కుట్ర తెలియని రాధమ్మ, పోనీలే మొత్తానికి ఎగ్గొట్టకుండా వస్తున్నారు కదా అని సంతోష పడి, కారెక్కేసింది.

గుడికెళ్ళి చెప్పులు విడిచేసి, అష్టోత్తరానికి టిక్కెట్టు కొంటూంటే ఒకాయన వచ్చి “యామండీ..చేతలు ఎంగే కడగాలి?” అని అడిగాడు. చూడ్డానికి కే.వీ మహదేవనల్లే బావున్నాడు పొన్న కాయలా. అర్థం అయినా కానట్టు మొహం పెట్టి “యేవిటీ?” అని అడిగాడు నారాయణ. ఆ ఆసామి చేతులు చూపిస్తూ “చేతలు సామీ చేతలు..వాషింగ్”అని పళ్ళికిలించాడు. “చేతలు కడిగే పంపు యింకా రాలేదు గానీ, చేతులు అం..గె, అక్కడ కడుక్కోవచ్చు ” అని పంపుకేసి చూపించాడు నారాయణ.

మెల్లిగా మెట్లెక్కి పైకి నడుస్తూంటే ఎవరో ఒకాయన వెనకాలనించి “బావున్నారా” అన్నారు మంద్ర స్థాయిలో. భయమేసి, గబుక్కున వెనక్కి తిరిగి చూసాడు. ఓ పెద్దాయన..పేరు గేపకం రాలేదు, అయినా ధైర్యం చేసి చెప్పేసాడు ” బావున్నామండి, మీరు?”. మాటపూర్తయ్యేలోపులో ఆ పెద్ద మనిషి వీళ్ళని దాటుకుని పైకెళ్ళిపోయాడు (మెట్లెక్కి !). అంత అర్జెంటు పని వున్నాయన తనని ఎందుకు పలకరించాడో అర్థం కాలేదు నారాయణకి.

సరే, మెట్లెక్కి దేవుడి దెగ్గరకెళ్ళారు. తిన్నగా వెంకన్న దెగ్గిరికెళ్ళకూడదని, ముందు వినాయకుడి దెగ్గిర కెళ్ళారు. రాధ ప్రదక్షిణాలు మొదలెట్టింది. నారాయణ నమస్కారం చేస్తున్నాడు (దేవుడికి). “బుర్ర్..బుర్ర్” మని శబ్దం వినిపించి, ఎవరో పిల్లాడు అల్లరి చేస్తున్నాడేమోననుకున్నాడు నారాయణ. అంతలోనే మళ్ళీ అదే శబ్దం వినిపించింది. పక్కకి తిరిగి చూసాడు. ఒకాయన రెండూ బుగ్గలూ పట్టేసుకుని, బైటకి లాగేసుకుంటూ, దేవుణ్ణి వెక్కిరిస్తున్నట్లున్నాడు, అంతలోనే మొట్టికాయలు మొట్టుకుంటున్నాడు. నవ్వాపుకోలేకపోయాడు నారాయణ. పనిలో పని, తనూ ఓ చెయ్యేద్దామా అనుకుంటూండగా, “ఏవిటా సకిలింపులు, తప్పు, కళ్ళు మూసుకు దణ్ణం పెట్టుకోండి” అంది రాధమ్మ. వెంఠనే కళ్ళు మూసుకుని దణ్ణం పెట్టేసుకున్నాడు నారాయణ, లెంపలు కూడా వేసుకున్నాడు, బోనస్ మార్కుల కోసం.

ఇటుగా తిరిగి పెద్దాయన దెగ్గిరికొచ్చే సరికి చాంతాడంత లైన్లు, అటోటీ, ఇటోటీని. ఇంతలో మంత్రాలు మొదలయ్యాయి. లోపల పూజార్లు మహా జోరుగా చదివేస్తున్నారు. బయట ఓ ముక్క తెలిసిన వాళ్ళు అక్కడక్కడా గొంతు కలుపుతున్నారు. నారాయణ చెవిలో స్టీరియో మోగినట్టుగా దడదడలాడిస్తున్నాడో పెద్దాయన, పూజారులతో సమంగా. కాసేపు చూసాడు పెద్ద పూజారి. తరవాత వళ్ళుమండి, ఆ మంత్రం ముగించి, ఏదో వేరే భాషలో మొదలెట్టాడు. అలవాటు లేని భాష వినేసరికి నారాయణ చెవులు ఎలర్టు అయిపోయాయి. పక్కనున్న స్టీరియో ఎఫెక్టు కూడా ఠపీ మని ఆగిపోయింది. “తిక్క కుదిరిందా?” అన్నట్టు ఓ చూపు, మందహాసం విసిరి, గొంతు పెంచి మరీ పాడసాగారు పెద్ద పూజారి గారు.

అయితే ఆడాళ్ళలో కొందరు అందుకున్నారు. వాళ్ళెంత రాగంలో పాడినా “ళ”కారం తప్ప యింకేవీ వినపడలేదు నారాయణకి. సరే, అదీ పూర్తైంది.

తరవాత సహస్రనామాలు మొదలయ్యాయి. అవి చాలామందికి కొట్టిన పిండి కాబట్టి అందరూ రెచ్చిపోయి చదవసాగారు. అందరు సుబ్బులక్ష్ముల్ని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరైపోయడు నారాయణ.

తరవాత తీర్థం, ప్రసాదం, అర్చన అయ్యాయి. తీర్థం తాగి చెయ్యి నెత్తిమీద ఎందుకు రాసుకుంటారో అర్థం కాదు నారాయణకి. యింకా చాలా విషయాలు అతనికి అంతు పట్టవు. సంస్కృతంలో సుప్రభాతం, ఆనక వేద మంత్రాలూ చదివి, అరవంలో తిరుప్పావయ్యో మరేదో చదువుతారు కదా, మరి తెలుగులో ఏవీ చదవరెందుకు? యింతకీ వెంకటేశ్వర స్వామిది యే భాష? ఇవే ప్రశ్నలు ఓ సారి రాత్రి భోజనాలూ, తాంబూలం అయ్యాకా రాధమ్మనడిగాడు. “దేవుడికి యే భాషైనా ఒకటే. మన తృప్తి కోసం ఏదో చదువుతాం..” అంది. ఆ సమాధానంతో తృప్తి పడలేదు నారాయణ. కనీసం తెలుగులో ఓ పద్యమో, అన్నమాచార్య కీర్తనో విధిగా పాడాలి..అనిపించింది అతని ఫాక్షనిష్టు బుర్రకి.

“ఎవరన్నా ఓ పాట…”. పూజారి గారి గొంతు ఖంగుమని వినిపించేసరికి తెలివిలోకొచ్చాడు నారాయణ. వెనకాల ఎవరో ఒకావిడ అప్పుడే కూర్చుని వాసింపట్టేసుకుని సిద్ధమైపోయింది పాటకి. “సీజండు ఆర్టిస్టు కాబోలు..”ననుకున్నాడు నారాయణ. ఆవిడ గొంతు విప్పేసరికి హాలంతా నిశ్శబ్దం. ఏదో రేడియోనో, టేపో వింటున్నంత అద్భుతంగా వుందా గొంతు. “సామజవర గమనా..” నడుస్తోంది.

ఏవిటో..మనవాళ్ళకి యీ శ్రద్ధ లేదుకదా. యెప్పుడు చూసినా తన్నుకోడాలూ, కుమ్ములాటలూ తప్ప, ఓ పాటా, ఓ పద్యవా?..” ఒక్కసారి పెదవి విరిచి నిట్టూర్చాడు నారాయణ.

“యాదవ గుల మురళీ వాదన..”

ఒక్కసారి ఎవరో ఫేడీ మని తన్నినట్టై ఉలిక్కిపడి చూసాడు నారాయణ. మళ్ళీ అదే వాక్యం, వేరే వేరే సంగతులేస్తూ. చక్రపొంగలిలో రాయొచ్చినంత బాధ పడిపోయాడు నారాయణ. “వీళ్ళ సంగీతం మేష్టారెవరో గానీ, వీళ్ళకి సాహిత్యం కూడా సరిగా అర్థంతో నేర్పించుంటే ఎంత బాగుణ్ణు..” అనుకున్నాడు. యింకక్కడ వుండలేక రాధతో సహా కాంటీను కొచ్చి, పులిహోరా, చక్ర పొంగలీ బిగించాడు. అక్కడ కనబడ్డ వాళ్ళందరికీ భాషా భేదం లేకుండా ఓ రబ్బరు నవ్వొకటి పారేసి బైటికొచ్చేసాడు. ” యివాళ గుడి ఎంత బావుందో..కదండీ” అంది రాధ బైటికొస్తూ.

“అవును చక్రపొంగలి బాగా కుదిరింది. అచ్చం తిరపతిలో టేష్టు పడింది” అన్నాడు నారాయణ. ఇంకా ఏదో అనబోయాడు గానీ..రాధ కళ్ళు పెద్దవి చేసి “హన్నా” అన్నట్టుగా చూడ్డం గమనించి, ఆగిపోయాడు. కిందకొచ్చి కారెక్కుతూంటే, మొదట్లో కనిపించిన పెద్దాయన మళ్ళీ కనిపించి, అదే గొంతుతో “బావున్నారా” అన్నాడు మళ్ళీ.

“లేరు. కాంపుకెళ్ళారు. సోంవారం వస్తారన్నమాట..”. ఆయన రియాక్షన్ కోసం చూడకుండా, కారెక్కి తుర్రుమన్నాడు రాధతో సహా.

శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

రచయిత శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్‌ సైన్స్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ...