అమెరికా తెలుగు కథానిక 6

వంగూరి ఫౌండేషన్‌ వారు 2000 సంవత్సరానికి వెలువరించిన ఈ ఆరవ సంకలనంలో మొత్తం పన్నెండు కథలున్నాయి. గత ఐదు సంకలనాలలో ఆయా సంవత్సరపు ఉగాది కథల పోటీలకి వచ్చిన కథలన్నీ చేరుస్తూ వచ్చారు. ఎందుచేతనో 1999 లో సంకలనం రాక పోవటం వలన రెండు సంవత్సరాల పోటీలనూ కలిపి ఐదు బహుమతి విజేతలతో పాటు ఏడు ఇతర కథలు ఇందులో చోటు చేసుకున్నాయి. ఇలా రెండేళ్ళ కొకసారి సంకలనం తీసుకురావటం వలన ఎంపిక చేసుకోవటానికి విస్తృతి పెరగటంతో పాటు సంకలనం నాణ్యత ఇదివరకటి కంటే మెరుగ్గా వుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

కథల సంకలనాన్ని సమీక్షించటం, అందులోనూ అమేచర్‌ రచయితల కథలున్న దాన్ని, చాలా శ్రమతో కూడిన బాధ్యత. సంకలనంలోని ప్రతి కథనూ విమర్శించాలా, లేక మంచికి గానీ చెడుకి గానీ దృష్టిని ఆకట్టుకున్న కథలనే స్పృశించి మిగతా వాటిని ఒదిలెయ్యాలా, విమర్శ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. తన సమీక్ష వలన ఏమైనా ప్రయోజనం జరగాలంటే సమీక్షకుడు ఈ ప్రశ్నలకి కనీసం తనకైనా సంతృప్తి కలిగించే సమాధానం ముందుగా చెప్పుకో గలగాలి. సంకలనంలో వున్న కథలన్నీ ఏకరువు పెడితే అదొక చాకలి పద్దులాగా తయారవుతుందే తప్ప అటు రచయితలకీ ఇటు పాఠకులకీ ఏమీ ఉపయోగం ఉండదు. అలాగని కొన్ని కథలని మాత్రమే ఏరుకుని సమీక్షిస్తే మిగిలిన కథలకీ వాటి రచయితలకీ అన్యాయం జరుగుతుంది. అందువల్ల ఈ సమీక్షలో విడివిడి కథల గురించి కాక అన్ని కథలలోనూ కామన్‌గా వున్న కొన్ని గుణాలని వెలికి తెచ్చేందుకు ప్రయత్నిస్తాను.

ఈ సంకలనం అమెరికాలో తెలుగు డయాస్పోరా సాహిత్యమని ముందుమాటలో సంపాదకులు వేణుగోపాలరావు గారు చెప్పారు. ఎవరైనా కొత్త దేశంలోకి, కొత్త సంస్కృతిలోకి హఠాత్తుగా వచ్చి పడ్డప్పుడు తమకి ఎదురయ్యే వింత అనుభవాల్ని ఆశ్చర్యంగానూ, కొంత హాస్యం గానూ, ఒక్కోసారి ఒకింత చిరాకుతోనూ కథలుగా రాసుకోవటం చాలా కాలంగా జరుగుతున్నదే. అమెరికా తెలుగు సాహిత్యం ఈ స్థితిని దాటి పైకి ఎదిగిందని ఈ సంకలనం రుజువు చేస్తోంది. తమకో, తమ స్నేహితులకో జరిగిన అనుభవాలని డాక్యుమెంటరీల్లాగా రికార్డు చేసి ఊరుకోకుండా తమ చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించి, అందులోని సాంఘిక గతిని ( social dynamics ) తేటగానూ సునిశితంగానూ పరీక్షించి తాము గమనించిన నిజాల్ని కథల రూపంలో చిత్రించాలన్న తాపత్రయం ఈ సంకలనంలోని కథలన్నిటిలోనూ కనిపిస్తుంది. ఇది చాలా మంచి విషయం. ఈ విషయంలో రచయిత లందరూ అభినందనీయులే.

ఈ కథలన్నిటిలోనూ కనిపించే మరొక అంతస్సూత్రం కొత్త సమాజంలో మానవ సంబంధాలను గురించిన ఆలోచన. తరాల మధ్య అంతరాలు, ప్రవాసంలో స్థిరపడిన తమ వారిని కల్పతరువుల్లా కనిపింప చేసే బాంధవ్యాలు, కొత్తగా అనుభవానికి వస్తున్న పాశ్చాత్య సాంఘిక వాతావరణంలో మార్పు చెందుతున్న స్త్రీ పురుష సంబంధాలూ, కుటుంబ వ్యవస్థా, ఈ తాకిడిలో తల్లక్రిందులవుతున్న పాత భావజాలపు విలువలూ వీటన్నిటి మధ్యనా నిశ్శబ్దంగా మనుషుల్ని ఆవరిస్తున్న ఒంటరితనం ఇవన్నీ వివిధ కథా వస్తువుల రూపాల్లో ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. అమెరికా తెలుగు కథ ఇలా అమెరికా ప్రవాసాంధ్ర జీవనానికి ప్రతిబింబంగా రూపుదిద్దుకోవటం కూడా అభినందనీయమే.

అయితే, ఒక కథా పాఠకుడిగా నాకు ఈ సంకలనంలోని కథలు దాదాపుగా అన్నీ కొంత నిరాశ  కలిగించాయి, పుస్తకంలో మొదట కనిపించే నా కథతో సహా. ఈ నిరాశకి స్థూలంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి  ఒకటి, రచయితలకి చిన్నకథల శిల్పం మీద తగినంత పట్టు లేక పోవటం, రెండు, ఎంచుకున్న కథా వస్తువు మీద అవసరమైనంత అవగాహన లేక పోవటం.

ఇంచుమించుగా కథలన్నిటిలోనూ ఏదో కథ చెప్పెయ్యాలన్న తాపత్రయం కనపడుతోంది తప్ప చెప్ప దల్చుకున్న కథని ఇంకా బాగా ఎలా చెప్పగలం పాత్రల చిత్రణా, పాత్రల ఎదుగుదలా ఎలా వ్యక్త మవుతున్నాయి కథలో ఎవరి గొంతు ఎక్కువగా వినిపిస్తోంది, ఇటువంటి శిల్ప పరమైన విషయాల గురించి రచయితలు ఆలోచించినట్టు గానీ, ఆత్మపరిశీలన చేసుకున్నట్టు గానీ కనపడదు. మంచి సాహిత్యం శిల్పం ద్వారానే పుడుతుందని ఈమధ్య బాలగోపాల్‌ గారు అంటే చాలా మంది మేధావులు ఆయన మీద విరుచుకు పడ్డారు గానీ ఆ మాటలో ఎంతో సత్యం వుంది.

వస్తువు దృష్య్టా ఈ కథలలో వేరువేరు రచయితలు వేరువేరు రకాల పరిణతిని చూపిస్తున్నారు. కొంతమంది ఫలానా విషయం ఇలా జరుగుతోంది అని చెప్పేసి వదిలేస్తే మరి కొందరు సంఘటనల వెనుక కొద్దిగా లోతుకి వెళ్ళి పరిశీలించారు. వీటిల్లో చాలా సమస్యలు మనకంటే ముందే ఈ దేశానికొచ్చిన అనేక వలస జాతుల వారు అనుభవించి వున్నవే. మన తోడుగా వలస వచ్చిన ఇతర భారతీయ, ఆసియా ఖండ వాసులు ఎదుర్కుంటున్నవే. వీటిల్లో ఏవి అందరు వలస ప్రజలకీ ఉండే సమస్యలు, ఏవి తెలుగు వారికి మాత్రమే ఎదురయ్యేవి అని ఆలోచించాలి. కథకోసం ఎంచుకున్న వస్తువుల మీద, సమస్యల గురించి ఇంకా గాఢమైన ఆలోచన జరగాలి. సంఘటనల చుట్టూ ఉన్న సోషల్‌ డైనమిక్సునూ, దానికి అంతర్గతంగా ఉండే ఆర్ధిక సామాజిక సంబంధాలనూ లోతుగా పరిశోధించాలి. పోయిన ఏడాది షికాగోలో జరిగిన సాహితీ సదస్సులో ప్రధానోపన్యాసం ఇస్తూ వేణుగోపాల రావు గారు, “మన సాహిత్యంలో మన జీవితాల్ని డీకన్స్ర్టక్ట్‌ చేసుకోవలసిన సమయం ఆసన్నమైం”దని హెచ్చరించారు. మారుతున్న సామాజిక నిజాల్ని శోధించటానికి, వెలికి తీయటానికి ఇది అవసరం.

పుస్తకంలో అచ్చుతప్పులు పరమాన్నంలో పలుకురాళ్ళలా విసిగిస్తూనే వున్నై. ఒక్కో కథా ఒక్కో రకమైన టైప్‌ సెటింగ్‌లో ఉండటం దీన్ని ఒక సంపూర్ణమైన కృతిలా కాక కొంత అతుకులబొంత లాగా కనిపింప చేస్తున్నది. ఈ విషయాల్లో ఇద్దరు ముగ్గురు ఔత్సాహికులు ముందుకొచ్చి సాయం పడితే పుస్తకం గెటప్‌ చాలా అభివృద్ధి చెయ్యవచ్చు.

ఈ సంకలనంలో శైలి పరంగా కె.వి.ఎస్‌ రామారావుగారి కథ “అటా? ఇటా?”, వస్తుపరంగా సోమ సుధేష్ణ గారి “చైతన్యం” నన్ను ఆకర్షించాయి.


ఎస్‌. నారాయణస్వామి

రచయిత ఎస్‌. నారాయణస్వామి గురించి: కథకుడిగా, అనువాదకుడిగా, సమీక్షకుడిగా అమెరికాలోనూ, ఇండియాలోనూ, బ్లాగుల లోకంలోనూ పేరు గడించిన ఎస్‌. నారాయణ స్వామి అమెరికా ఆంధ్రుల జీవన తలాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న కథకుడిగా ఈమాట పాఠకులకు చిరపరిచితులు.  ...