నీడ

కొడుకలా అంటాడని కలలో కూడా అనుకోలేదు రామిరెడ్డి. ఆ మాటలు విన్నప్పటి నుంచి మనసు మనసులో లేదతనికి. తన నెవరో పాతాళానికి తొక్కుతున్నట్లు, గుండెను వాడి బాణాలతో తూట్లు చేస్తున్నట్లు విలవిలలాడుతున్నాడు.

కోడలు కుర్చీలో కూర్చోబెట్టి కమ్మటి కాఫీ ఇచ్చింది. కోడలుకు తనపై పుట్టిన అకారణ అభిమానానికి ఆనందించాడు. ఆ ఆనందపు అనుభూతి నుంచి తేరుకోక ముందే బాంబులాంటి విషయాన్ని పేల్చారు ఆలూమగలు. అది తలచుకొంటూంటె రామిరెడ్డిలో బాధ సుడులు తిరుగుతోంది. అవే ఆలోచనలు అంతకంతకు పెరుగుతుండడంతో పల్చటి దుఃఖపు తెరలు ప్రారంభం కాసాగాయి. ఆ ఆలోచన్ల నుంచి దూరం కావడాని కన్నట్లు పై గుడ్డ తీసి భుజం మీద వేసుకొని మడి వేపు బయల్దేరాడు.

ఐదున్నరడుగుల పొడవు. కాయకష్టపు దేహం. వయసు అరవై ఐదు. వార్ధక్యపు గుర్తుగా ముఖంలో ముడుతలు, తలలో తెల్ల వెంట్రుకలు. చేతికి కర్ర రాకపోయినా నడుము కాస్త వంగింది. చకచకా నడుస్తున్నా ననుకొంటున్నాడు రామిరెడ్డి కానీ అడుగులు అనుకున్నంత జోరుగా పడడం లేదు.

“ఏం మామా .. ఒంట్లో బాగలేదా?” దార్లో ఎదురు పడిన నారాయణ అడిగాడు.

“దిగ పొద్దు పడిపోలేదంట్రా .. నీ మాదిర్తో ఉండాలంటే అవుతుందా,” అన్నాడు బలవంతంగా నవ్వును ముఖాన పులుముకొంటూ.

“దిగ పొద్దా .. నీకా? నిన్నంతా చిన్న పిలగోడి మాదిరి సంబరంగా ఉంటివే. కొడుకు మిల్ట్రీ నుంచి ఇంటికొచ్చేసినాడనేలకు నిన్ను పట్టనలివి గాలేదే. ఈ పొద్దు అదొక మాదిర్తో ఉంటే అడిగితిలే. వస్తా, నాకు పనుంది,” అంటూ నారాయణ వెళ్ళిపోయాడు.

రామిరెడ్డి తిరిగి నడక కొనసాగించాడు. నడీధి మలుపు తిరిగి, దిగవీధి దాటి “ఇప్పలకుంట ” చెరువు కట్ట మీద నడవసాగాడు.
“చిన్నప్పుడు ఈ చెరువు ఎంత నిండుగా ఉండేది. ఎండాకాలంలో మాత్రం నీళ్ళు అడుక్కు పొయ్యేటియి. కార్తీకము, వైశాఖమంతా నీళ్ళు నిండుగా ఉండి రెండు కార్లు పంటలు బంగారులా పండేటియి. అదో .. చాకిరేవు. ఆడోళ్ళు మోకాళ్ళపైకి కుచ్చిళ్ళు ఎగచెక్కి నీళ్ళల్లో దిగి ఉస్సో ఉస్సో అంటా గుడ్డలుతికేటోళ్ళు. పిల్లకాయలు వంటిమీద గుడ్డల్లేకుండా ఈదులాడేటోళ్ళు. ఇపుడయన్నీ యాడుండాయి. వానల్లేక జల అడుగంటె .. బాయిలు ఎండ బట్టె .. బోర్లు ఎయ్యబట్టిరి. వానలొచ్చి చెరువు నిండినా రెండు నెల్లు కూడా ఉండవు నీళ్ళు. తమకేం ఇబ్బంది లేదులే. గంగ లాంటి బాయి రెండెకరాల మడి. వాడెందు కలాంటి నిర్ణయం తీసుకున్నాడు.” రామిరెడ్డి మనసు వికల మయింది. ఎంత వద్దనుకొన్నా, ఆ ఆలోచన్లను మరవాలని ఏవేవో జ్ఞాపకం చేసుకొన్నా మళ్ళీ అక్కడికే వచ్చి ఆగుతోంది మనసు. రామిరెడ్డికి పదైదేండ్ల కిందటి సంఘటనలు గుర్తుకు రాసాగాయి.


“ఓ సుబ్బయ్యా .. ఆ గొడ్డునట్లా అదిలించు .. దొంగయిపోతోంది, దీంతో నా పరువు పోయేట్లుంది. దొంగలతోలేస్తే పోతాది. దీంతో ఏగలేం,” అన్నాడు రామిరెడ్డి చేన్లో పడబోతున్న కర్రావును చూసి.

సుబ్బయ్య “హయ్‌ .. హయ్‌ హయ్‌ ..” అంటూ రాయి విసిరి,
“అన్నీ తెలిసిన మనుషులె దొంగలయితాంటె గొడ్లదేముందిలె రామా. అయ్యి దొంగతనం జేసినా ఏం చేస్తాయి? కడుపుకు తిండే కదా! అదే మనిషి .. ఎందర్ని ఎన్ని రకాలుగా ఏమారుస్తాడు .. ఎంతెంత కూడ బెడతాడు,” అన్నాడు పొలంలొ మట్టిని తీసి నీళ్ళని మరొక వైపుకు మళ్ళిస్తూ.

“నిజమేరోయ్‌ సుబ్బా .. మంచిమాట చెప్పినావు. పక్కూరి శెట్టి చూడు. అవసరంలో ఆదుకొంటాడా. నిమ్మళంగా వాళ్ళుండే ఇంటికొ, చేనుకొ మడికొ ఎసరు పెడ్తాడు. ఇప్పుడు వాళ్ళకుండాయే, ఆ బూములన్ని అట్ల సంపాయించినయే గదా? రెండు వడ్ల మిషన్లు, సినిమా టెంటు ఆ దుడ్డుతో కట్టిచ్చినోటియే కదా,” అన్నాడు రామిరెడ్డి, సుబ్బయ్య మాటలకు బలాన్ని చేకూరుస్తున్నట్లుగా.

“శెట్టి గాదు రామా .. లోకం మీద యాడన్నా జూడు. ఎవడన్నా మిద్దెలు మేడలు కడతాండాడన్నే, పొలం పుట్రా కొంటాడాడన్నే ఎదుటోళ్ళ నెత్తిన చెయ్యి పెట్టింటేనే. ఎవురో .. నూటికి ఒకరొ ఇద్దురే ధర్మంగా సంపాదించేది,” అన్నాడు నీళ్ళ వెంట తనూ నడుస్తూనే సుబ్బయ్య.

“అదో దొంగ నాయాలి గొడ్డు .. మళ్ళా వస్తాంది చూడు. హయ్‌ .. హయ్‌ ..” అంటూ తనే రెండు రాళ్ళు తీసుకొని విసుర్తూ దాని వైపు వెళ్ళాడు రామిరెడ్డి.

“అన్నో .. ఓ రామిరెడ్డన్నో .. నీ కోడుక్కి ఉద్దోగం వచ్చిందంటనే,” అనరిచాడు అంతదూరం నుంచే క్రిష్ణారెడ్డి.

క్రిష్ణారెడ్డి సన్నగా ఎదురుగడలా ఉంటాడు. మాటలు మాత్రం మైలు దూరం విన్పిస్తాయి.

“వాడికేం ఉద్దోగం వస్తాదీ .. పెద్దపెద్ద చదువులు చదివినోళ్ళకే రాలేదే,” అన్నాడు రామిరెడ్డి. ఎదురుగాలికి ఇతని మాటలు అతనికి విన్పించలేదు. క్రిష్ణారెడ్డి దగ్గరికొస్తూనే,

“నీ కొడుక్కు మిల్ట్రీలో ఉద్దోగం వచ్చిందంట,” అన్నాడు.

“తమాసలు పడను నేనే దొరికినానా?”

” నీతో నేనెందుకు తమాసలు పడతాన్నా ? నాగిరెడ్డి ఉద్దోగం వచ్చిందని ఊరంతా దండోరా ఏస్తాంటె .. పేపరెత్తుకొని, ” అన్నాడు క్రిష్ణారెడ్డి.

“నువ్వు జూస్తివా ”

” చూస్తి .. నీకు తెలుసు గదా .. నాది గోడ కింద చదువని. పోస్టు రామచంద్రయ్య వచ్చి ఇచ్చినాడంట. ఊరంతా ఉద్దోగం గురించే చెప్పుకొంటాండారు, ” అంటూ వెళ్ళిపోయాడతను.

” ఏం రామా, ఏం తక్కువని కొడుకుని మిల్ట్రీకి పంపుతాండావు ? ” అడిగినాడు సుబ్బయ్య.

” నేనెందుకు పంపుతాను సుబ్బా .. నాకు తెలీకుండానె వాడే ఏదో చూసుకొన్నేడు. ఇంటికి పోతాండ, ” అన్నాడు గొడ్లను అదిలిస్తూ.

” ఇంగా అంత పొద్దుందే. అప్పుడే ఏం తొందరొచ్చింది ? ”

” పోవాల .. మనసొక మాదిర్తొ అయిపాయె. వాని ఉద్దోగం సంగతి చూడాల, ” అంటూ గొడ్లని ఇంటికి మళ్ళించాడు.

” పెండ్లయిన రెండేండ్లకు కూతురు పుట్టింది. మొగ నలుసుకోసం ఎన్నో మొక్కులు మొక్కితే ఐదేండ్లకు కొడుకు పుట్టినాడు. ఆపైన పిల్లల్లేరు. కూతురుకు పెండ్లి చేసి అత్తవారింటికి పంపి ఆరేండ్లయింది . కంటికెదురుగా కనుబడుతుండేది వీడొకడు. చదువుకోరా అంటే ఇనకపాయె. కాలేజీ చదువు సగంలొ ఆపేశ. ఏదో తనకు తోడుగా ఉండి సేద్దం చేస్తాడ్లే అనుకొంటె ఇప్పుడీ పాట పాడతండాడే. తమకేం తక్కువని మిల్ట్రీకి పోతా నంటాండాడు. మిల్ట్రీకి పోయినోళ్ళ సంగతి తనకు తెలీదా ? ఎంతమంది ఆడ్నే చావడం లేదు, కాలు చెయ్యి ఇరిగిపోయి ఇంటికి రావడం లేదు. ” రామిరెడ్డి ఆలోచన్లలో ఉండగానే అలవాటు పడిన గొడ్లు ఇంటిని చేరి కుడితితొట్టికి మళ్ళినాయి.

“ఏయ్‌ .. ఏమేవ్‌ .. ” భార్యను కేకేశాడు.
“ఆ .. పొయ్యి కింద మంటేస్తాండా, ” అంటూ లోపలనుంచే సమాధాన మిచ్చింది పద్మావతమ్మ.
గొడ్లు కుడితి తాగనిచ్చి గాట్లో వాటి వాటి చోట్లలో కట్టేసి లోపలికొచ్చాడు రామిరెడ్డి.

పొయ్యిలో మంట ఎర్రగా ధగధగా వెలుగుతోంది. కొండల మీద సూర్యుడు తళతళ లాడుతున్నాడు. పొయ్యి మీద పాత్రలో అన్నం కుతకుత ఉడుకుతోంది.

తదేకంగా భార్యనె చూశాడు. భర్త వైపు చూస్తె మాట్లాడాల్సి వస్తుందనొ ఏమో మరి, మండుతున్న పొయ్యిలొ కట్టెలు కలబెడుతుంది. ఊదన బుర్రతొ ఊదుతుంది. గరిటెతొ కాగుతున్న ఎసరును కలబెడుతోంది. తన ఉనికిని గమనించని భార్య మీద, కంటికి కన్పించని కొడుకు మీద .. అప్పటికే ఉన్న కోపం మరింత పెరిగింది. మంచాన్ని విసురుగా వాల్చి కూచ్చొంటూ,

“యాడ్నే వాడు,” రౌద్రంగా అడిగాడు రామిరెడ్డి.

“ఊరుమీద ఊరేగను పోయినాడుబో,” అంది తనూ అంతే కోపంగా.

“పోతాడు, పోతాడు .. అమ్మ ముదిగారం చేస్తే వాడు ఊరిమిందే గాదు, దేశం మింద గూడా పోతాడు. నీళ్ళు తే,” భార్యకు పురమాయించి, పైగుడ్డ తీసి ఒళ్ళో వేసుకొన్నాడు.

“ముంచుకోని తాగు. అన్నం ఉడకతాండ్లా,” అంది గరిటెతో కలబెడ్తూ.

“ఏమే .. పొగరెక్కువైందే .. కొడుకు మాదిర్తొ .. ఇంటికొచ్చిన మొగోనికి నీళ్ళిచ్చే తీరిగ్గూడా లేదా,” అన్నాడు కోపంగానె.

“ఎనకటి కెవరొ అత్తమింద కోపం దుత్తమీద చూపించినాడంట. అదేందొ మీ కొడుకు మింద చూపించు. బాగు పడతాం,” అంటూ లేచి చెంబుతో కుండలోని నీళ్ళు తెచ్చి విసురుగా అతని దగ్గర పెట్టి వెళ్ళి పొయ్యి ముందు కూర్చుంది.

“వాడు నాకు పుట్టినోడే. నేను గాదు వాడికి పుట్టుండేది. రానీ వాడి పని చెప్తా. మిల్ట్రీకి పోతాడా నా కొడుకు. ఏం తక్కువంట ఈడ. కూడా .. గుడ్డా ..” చెంబు చేత్తో పట్టుకొనే మాట్లాడుతున్నాడు.

“నీ కెవరు చెప్పిరి ?”

“ఊరంతా ఈడు పలకెత్తుకొని దండోరా ఏస్తాంటె ఒకరేంది, ఎవురైనా చెప్తారు. అపుడే సుబ్బయ్య ఏమన్నేడొ తెల్సా ? ఏం తక్కవని కొడుకుని మిల్ట్రీకి పంపుతాండావు అనేశ మొగం మిందె. ఇంగ ఈడు పొయ్యినాడంటె ఎవురెన్ని మాట్లంటరొ,” అని చెంబులోని నీళ్ళు గటగటా తాగేశాడు.

“చెట్టు ముదిరేలకు కుక్క మూతి పిందెలంట. ఈడు మనిషి పెరిగేలకు బుద్ధి తగ్గుతాండాదె,” అండామె గంజి వంచుతూ.

“రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళమీద నడుస్తాదంట. ఈ నా కొడుక్కి పరీక్ష ఎన్నిసార్లు పోయినా మనమేం అనలా గదా. కడీధిలో బలిజోళ్ళ పిల్లతొ తిరగతాన్నే .. ఏదో పోనీలే .. వయసు దుల అని గమ్మునున్నేమే. అందుకు అలుసయిపోయినాం. దేనికయినా అద్దూ పద్దూ ఉండాల. లేకుంటే ఎట్లా ?”

“ఏంది నాయనా .. అమ్మా నువ్వూ ముచ్చట్లాడు కొంటాండారా?” అంటూ వచ్చాడు నాగిరెడ్డి.

“ఆ .. కొడుకు కుచ్చల కుళ్ళాయి పెట్టినాడని సంతోషంతొ ముచ్చట్లాడుకొంటాండాము,” అంది పద్మావతమ్మ.

“పెట్టేదానికే గదా నేను మిల్ట్రీకి పోతాండేది”

“మాకేం అక్కరలేదు. రైతుగా బతికితే చాలు. నువ్వుగూడా నోర్మూసుకొని ఇంట్లో పడుండు. సమ్మందాలు వస్తాండాయి. హాయిగా పెళ్ళి చేసుకొని సేద్దిం చేసుకో,” అన్నాడు రామిరెడ్డి.

“నా వల్ల కాదు సేద్దిం”

“నీ వల్ల గాక పోతే మనుషుల పెట్టి చేయించుకో .. అంతే గాని మిల్ట్రీకి పోతానంటే మేమొప్పుకోము,” అనునయంగా అన్నాడు రామిరెడ్డి.

కొడుకును చూడగానే అంతకు ముందు వరకు ఉన్న కోపమంతా తగ్గి పోయింది. మొదట్నుంచి అతనంతే. కొడుకెన్ని అతిపనులు చేసినా ఎదుర పడినాడంటే ఇతన్లోని కోపమంతా ఎగిరి పోతుంది.

“నువ్వింగా పదిరవై ఏండ్లు కష్టపడతావు గదా నాయినా. నేనంత లోపే తిరిగొచ్చేస్తా. ఎంత .. పదైదేండ్లు .. ఆ పైన ఎవ్వరం కష్టపడాల్సిన పనే ఉండదు,” అన్నాడు తండ్రికి నచ్చ చెబుతున్నట్లుగా.

“కమ్మార పల్లెలో కుంటిచేతి రామిరెడ్డిని చూడలేదంట్రా .. మిల్ట్రీకి పొయ్యే కదా ఆయన చేయి పోయింది. మా మాటిను. ఆ సంపాదనొద్దు. ఆ సుఖమూ వద్దు,” అంది పద్మావతమ్మ.

తల్లీ తండ్రీ ఎంతగా చెప్పినా విన్లేదు నాగిరెడ్డి. మిలటరీలో చేరి పోయాడు. అప్పట్నుంచి అతని రాకకోసం ఎదురు చూడని క్షణం లేదు. ఎపుడేమవుతుందో అని భయపడని దినం లేదు. ఒకసారి శలవుల్లో వచ్చి పెండ్లి చేసుకొని భార్యను కూడా తీసుకెళ్ళాడు.

“పెదరెడ్డీ .. ఈ లోకంలో ఉన్నట్టు లేవే,” అని పలకరించాడు రామయ్య.

ఆలోచనలు అనేక సంవత్సరాలు వెనక్కు పరుగులు తీసినా అలవాటు పడిన కాళ్ళు యాంత్రికంగా మడివద్దకే వచ్చాయి. ఆలోచన్లనుంచి తేరుకొని పచ్చదనంతో కళకళలాడుతున్న వరిపైరును, పైరు బాగుండడంతో కళకళలాడుతున్న రామయ్య ముఖాన్ని పరిశీలనగా చూశాడు. రామయ్యను మడిని చూస్తుంటే కొడుకన్న మాటలు మళ్ళీ గుర్తుకి రాసాగాయి.

“ఎందుకు రెడ్డీ అట్ల చూస్తాండావే,” అనడిగాడు రామయ్య.

రామిరెడ్డి మౌనంగా నడుచుకొంటూ వెళ్ళి బాయి షెడ్డు దగ్గర బండమీద కూర్చొన్నాడు. అతనప్పుడప్పుడు కొడుకు మీద బెంగతొ వచ్చి అక్కడ కూర్చోవడం మామూలే కాబట్టి మడికి నీళ్ళు పెట్టే కార్యక్రమంలో మునిగిపోయాడు రామయ్య.

తూర్పున చంద్రుడు కొండలమధ్య మొలుస్తున్నాడు. రామిరెడ్డిని పాత జ్ఞాపకాలు తొలుస్తున్నాయి.

కొడుకు మిల్ట్రీకి పోయిన ఐదేండ్లకు భార్య పోయింది. భార్యాభర్తలు ఒకరికొకరు ఆసరాగా ఉండడంతొ కొడుకు లేని దిగులు కొంతలొ కొంత మరచిపోయే వాళ్ళు. ఒంటరితనం ఎక్కువయింది. మానసిక జబ్బు చాలా పెద్ద జబ్బేమో. ముందులాగా పనులు చేయలేకున్నాడు. అప్పట్నించి రామయ్య కౌలుకు చేస్తున్నాడు. నాగిరెడ్డి తండ్రిని బలవంతం చేశాడు తమ దగ్గర ఉండమని. అందుకతను ఒప్పుకోలేదు.

“యాడేడ తిరిగినా దూడ తల్లి దగ్గిరికి పాలకొచ్చినట్లే మనంగోడా ఏ ఊళ్ళల్లో ఉన్నే మళ్ళీ మనూరికి రావల్సిందే గదా. నేను రాను .. ఇంకెంత పదేండ్లే కదా. మీరొచ్చేయరా,” అన్నాడు రామిరెడ్డి.

నాగిరెడ్డి మాట సామెతకు పిల్చాడు. నిజంగా తండ్రి వచ్చింటె తన భార్యతొ ఇబ్బందయ్యేది. అతని తల్లి బతికుండగా కొడుకు ఎన్నోసార్లు అడుక్కోంగా ఒకసారి దంపతులిద్దరూ కొడుకు దగ్గిర కెళ్ళారు .. ఢిల్లీకి. అక్కడ కోడలు అత్తమామల్ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించింది. నాగిరెడ్డి భార్యను గదమాయించలేడు, తల్లిదండ్రులను సముదాయించలేడు. కొడుకూ కోడలు మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఇక అక్కడ ఉండడం మంచిది కాదని భార్యా భర్తలు పల్లెకొచ్చేశారు. ఆ విషయాలన్ని గుర్తుకు రావడంతొ తండ్రి రాకపోవడమె మంచిదనుకొన్నాడు నాగిరెడ్డి.

రామయ్య రేయింబగళ్ళు యంత్రంలా కష్టపడుతుంటాడు. అతనికి భార్యా, ఇద్దరు కూతుండ్లు. అందరిది కష్టపడె స్వభావమె. రామయ్య మేడి పట్టి మడక దున్నుతుంటె ఒక కూతురు పార పట్టి అండ చెక్కేది, ఇంకో కూతురు ఎరువుకుప్పలు చిల్లాడేది. అతని భార్య వంట చేసుకొని వచ్చేది.

రామిరెడ్డి షెడ్డు దగ్గర బండమీద కూచ్చొని వాళ్ళను చూస్తూ కాలం గడిపేవాడు. తామూ తమ కొడుకుతొ అలా ఉంటె ఎంత బాగుండు అనుకొనే వాడు. అప్పుడప్పుడు లోకాన్ని వదిలి వెళ్ళిన భార్యను, ఊరును వదిలి వెళ్ళిన కొడుకును తన ఆలోచనల్లోకి ఆవాహన చేసుకొని తను దున్నుతుంటె కొడుకు అండ తీస్తున్నట్లు, భార్య సద్ది తెస్తే చెట్టుకింద చేరి కలిసి మాట్లాడుకొంటూ సద్ది తాగుతున్నట్లు ఊహించుకొంటాడు. అలాంటి సమయాల్లో,

“ఏంది పెద రెడ్డి, నీలో నువ్వే నవ్వుకొంటాండావె,” అని అడిగేవాడు రామయ్య.

“ఏం లేదులే రామయ్య” అనే వాడు. తన అందమైన ఊహలు భగ్నం చేసినందుకు రామయ్యపై చిరుకోపం కూడ వచ్చేది. తన అసమర్ధతతో వాస్తవం కావల్సిన వాటిని ఊహల్లొ తలచుకొని ఆనందించవల్సి వచ్చినందుకు బాధ కలిగేది.

రామయ్య తమ కివ్వాల్సిన కౌలులో ఏనాడు మోసం చేయలేదు. అంతకు ముందువరకు కూలీనాలీ చేసుకు బతుకుతుండిన రామయ్యకు కాస్త నిమ్మళం వచ్చింది. అంతో ఇంతో కూడ బెట్టుకొని మరి కొంత అప్పుచేసి పెద్దమ్మాయి పెండ్లి చేశాడు. ఇంకా చిన్నమ్మాయికి పెండ్లి కావలసి ఉంది.

“పెదరెడ్డి .. ఇంగా ఏమాలోచిస్తాండావు. ఇంతకు ముందంటె కొడుకు దగ్గిర లేడని దిగులు పడతాంటివి. ఇప్పుడేమయింది, ” అన్నాడు రామిరెడ్డి కెదురుగా మడి గట్టు మీద కూర్చొంటూ రామయ్య.

ఆలోచన్లనుంచి తేరుకొన్న రామిరెడ్డి అసలు విషయం గుర్తు రావడంతొ రామయ్యకి చెప్దామా వద్దా అని కొంతసేపు తటపటాయించాడు.

“దరిద్దురినికి యాడికి బోయినా వడగండ్ల వానేనంట. అట్లుండాది బతుకు. బిడ్డలుంటే ఒక బాధ .. లేకుంటే ఒక బాధ. చానా మందికి బిడ్డల్తొ సుఖమొస్తుంది. నాకు మాత్రం దుఃఖం మిగుల్తాంది,” అన్నాడు దిగులుగా.

“ఏమయింది పెదరెడ్డి. .. చినరెడ్డి మళ్ళా పోతండాడా మిల్ట్రీకి? ”

“అట్ల కాలబడిన్నే బాగుండు .. ఈ దిగుల్లేకుండా ఉండు,” అంటూ తిరిగి ఆలోచనల్లో కూరుకు పోయాడు. రెండు రోజులకు ముందు విషయాలు గుర్తుకు రాసాగాయి రామయ్యకు.

గత పదేండ్ల నుంచి ఒక్క సారిగూడా రామిరెడ్డి ఆనందంగా ఉండగా రామయ్య చూసింది లేదు. రెండు రోజులకు ముందు,

“ఏం పెదరెడ్డి పెళ్ళి కొడుకు మాదిర్తొ ఉండావే, ” అనడిగాడు తను.
“మా కొడుకు కోడలు రేపొస్తండారంట. జాబొచ్చింది, ” అన్నాడు రామిరెడ్డి.
“వచ్చినా ఉంటారా పాడా .. మళ్ళీ పొయ్యేదే గదా. ”
“ఇంగ పోరంట .. పదైదేండ్లూ సర్వీసయి పోయింది, ” అన్నాడు రామిరెడ్డి సంబరంగా.
“ఇంగ నీకు ఎదురుచూసే బాధుండదు, ” అన్నాడు తనూ సంతోషంగా.
“ఈ సారి గర్నిమిట్టమ్మ తిరణాలకు బండి కట్టాల. రెండు పొట్టేండ్లు కొట్టాల. కొడుకు క్షేమంగా తిరిగొచ్చినాడంటె అయ్యన్నీ చేస్తానని వాళ్ళమ్మ మొక్కోనుంది. మొక్కు తీర్చుకోకుండానే ఎల్లిపోయింది. దాని మొక్కు తీర్చాల. యాడన్నా మంచి పొట్టేండ్లు చూడు. రేటెక్కువైనా బాధలేదు,” అన్నాడు రామిరెడ్డి.

రామిరెడ్డి కళ్ళల్లో మెరుపు, మాటల్లో ఉత్సాహం చూస్తుంటె రామయ్యకు ముచ్చటేసింది.

“అట్లే పెదరెడ్డి చూస్తాను, ” అన్నాడు.
అన్నట్లుగానే నాలుగైదు చోట్ల విచారించాడు. తూర్పు హరిజనవాడలో చెంగన్న దగ్గరుండె పొట్టేండ్లు బాగుండాయి, బేరం కూడా చేసొచ్చాడు. రామిరెడ్డిని తీసుకుపోయి చూపించాలనుకొన్నాడు. అటువంటిది కొడుక్కోసం అంతగా ఎదురు చూసిన మనిషి ఇప్పుడెందుకు దిగులు పడుతాండాడో అర్ధం కాలేదు రామయ్యకు.

“రెడ్డి .. పెదరెడ్డి, ” అని పిల్చాడు మెల్లగా.

“ఊ ..” అన్నాడు పరధ్యానంగా.

“ఎందుకు పెదరెడ్డి, అంతగా బాద పడతాండావు,” అనడిగాడు రామయ్య.
అంతకు ముందు ఇంటివద్ద జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి రామిరెడ్డికి.

“నాయినా, మన రెండెకరాల మడి అమ్మేద్దాం,” అన్నాడు కొడుకు. కుర్చీలో దర్జాగా కూర్చుని తాగుతున్న తియ్యటి కాఫీ చేదుగా మారింది. పొలమారింది. తిరిగి కొడుకే,”మడమ్మేసి ఆరెకరాల చేన్లో కోళ్ళ ఫారాలు పెడతాను,” అన్నాడు.

“ఇప్పుడు మడెందుకురా అమ్మేది,” అనడిగాడు కోపంగా.

“అదున్నే ఒగటే లేకున్నే ఒగటే. మనం చేస్తాండామా పాడా,” అంది కోడలు.

“.. నిజమే .. ఆ మడి ఉన్నే చేసే మొగాడు ఎవుడు మనింట్లో .. నువ్వా పదేండ్లాయె మేడి చేతబట్టి. నేనా .. నా మాటేం చెప్తావులే. ఆది చెయ్యలేకే కదా మిల్ట్రీకి పోయింది. నా కొడుకా .. వాడు పల్లె మొగమే చూడడు. చదువులని, ఆ తర్వాత ఉద్యోగాలని పట్నమేలే వాడింగ. మనం చేయని దానికి బీటికెందుకది. అమ్మేస్తే రెండు మూడు లక్షలొస్తాయి. పల్లె కానుకునే మన చేనుంది. దాంట్లో కోళ్ళ ఫారాలు ఏస్తే ఎంత దుడ్డో. ఈ చుట్టు పక్కల యాడా లేవు గదా. అందరూ ఇరవై కిలోమీటర్లు దూరం పీలేరుకు పోయి తెచ్చుకొంటాండారు. చుట్టూ పల్లెలెక్కువ. మంచి దుడ్డు వస్తాది,” అన్నాడు కొడుకు భవిష్యత్తును కళ్ళముందు ఆవిష్కరిస్తూ.

“మన మడినే నమ్ముకొని బతుకుతాండే రామయ్యోల్లు ఏం గావాల్రా?”

“వాళ్ళా? మనది గాకుంటె ఇంగొకరిది అయితాది. ఏదో ఒక విధంగా బతకతార్లే. నారు పోసినోడు నీరు పొయ్యడా. అయినా ఎవురి తిప్పలు వాళ్ళు పడతారు, మనకెందుకు,” అంది కోడలు.

“ఇప్పటి కిప్పుడు ఎవరు కొంటారు ?” అన్నాడు, కొడుకూ కోడలూ కల్సే నిర్ణయం తీసుకొన్నారు అనుకొంటూ.

“రాఘవరెడ్డి మామ కొంటాడంట” అన్నాడు కొడుకు.

రామిరెడ్డి మరేం మాట్లాడ లేదు. అన్నీ మాట్లాడుకొనే వాళ్ళు తనకు చెప్పారు. తను వద్దన్నా బాగుండదు. కొడుక్కు ఆ మడితో ఇరవై రెండేండ్ల అనుబంధమయితె తనకు అరవై ఐదేండ్లు. తను తప్పటడుగులు వెసింది ఆ మడిలోనే. పరుగులు తీసింది ఆ మడిలోనే. జీవితం గడుపుతున్నదీ ఆ మడిలోనే. అటువంటి మడిని అమ్ముతానంటాడే.

“పెదరెడ్డి .. అడుగడుక్కీ ఆలొచనల్లోకి పోతాండావే. ఏమయింది చెప్పు,” అడిగాడు రామయ్య. గతం నుంచి వర్తమానానికి వచ్చిన రామిరెడ్డి చెప్దామా వద్దా అని కొంతసేపు ఆలోచించి, ఈ పొద్దు గాక పోయినా రేపయినా తెలిసేదే గదా అని,
“ఈ మడి అమ్మేస్తాడంట,” అన్నాడు.

“ఆ .. ” అన్నాడు రామయ్య.

” అవును రామయ్య. మడి అమ్మేసి పల్లెనక చేన్లో కోళ్ళ ఫారాలు ఏస్తాడంట,” అనేసి రామయ్య ముఖంలోకి చూడలేక తప్పు చేసిన వాడిలా తలొంచుకొని ఇంటికి బయల్దేరాడు.

** ** **

“అన్నా .. మీది ఏమదృష్ట మన్నా .. ఐదించి నీళ్ళు పన్నేయే,” అన్నాడు నారాయణ.

“ఆ .. ఐదించి నీళ్ళా !” ఆశ్చర్యంగా అడిగాడు రామిరెడ్డి.

“అవునన్నా .. మన ఊరు ఊరంతా ఆడ్నే ఉండాది. ఏరు మాదిర్తొ పోతాండాయనుకో నీళ్ళు,” అనేసి నారాయణ వెళ్ళి పోయాడు.

మంచం మీద లేవలేని తన అశక్తతకు దుఃఖమొచ్చింది రామిరెడ్డికి. కొడుకు మడి అమ్మేశాడు. సంతకం చేయడానికి తనూ కోర్టుకు వెళ్ళాడు. సంతకం చేసేప్పుడు చేయి వణికింది. వార్ధక్యం కదా అనుకొన్నాడు. అక్కడినుంచి బస్టాండు వరకు రాగలిగాడు. తమ ఊరి బస్సు ఎక్కబోయి కుప్పలా కూలిపోయాడు. పక్షవాతం .. అట్నుంచటే కలికిరి స్వామి ఆస్పత్రికి పోయి చూపించుకొని వచ్చారు. రెండు వారాలు దాటినా అనారోగ్యం పట్టు సడలించ లేదు. అన్నీ మంచం మీదనే. వేళకన్నీ రామయ్య చిన్న కూతురు వచ్చి చూస్తుంటుంది. తన చేతగాని తనం వల్లనే ఆ అమ్మాయి పెళ్ళి ఆలస్యమవుతోందని రామిరెడ్డి మరింత దిగులు పడుతుంటాడు. నాగిరెడ్డి మడి అమ్మడంతో రామయ్య కుటుంబం మళ్ళీ కూలికి పోవడం తప్పలేదు.

చేన్లో నీళ్ళు పడినందుకు ఒకవైపు బాధ, ఒకవైపు సంతోషం. ఇంతకు ముందు తన ప్రయత్నాలు తలపు కొచ్చాయి.

తనూ రెండుసార్లు బోరు వేయించాడు. నీళ్ళు పడ్డాయంటే ఆరెకరాలు సాగవుతుందని ఆశపడ్డాడు. పల్లెకు తాగే నీళ్ళతో ఇబ్బంది. ఎండాకాలం వచ్చిందంటె పల్లెలో ప్రభుత్వం వాళ్ళు వేసిన రెండు బోర్లు ఎండిపోతాయి. నీళ్ళ బాయి ఎండి పోయి చాలా సంవత్సరాలే అయింది. మైలు దూరం నడిచి పోయి నీళ్ళు తేవాల్సిందె.

తమ చేన్లో నీళ్ళు పడితె ఆడోళ్ళు నీళ్ళకోసం మైళ్ళ దూరం నడిచె బాధ తప్పుతుం దనుకొన్నాడు. ఒకసారి పూర్తిగా బండే తెగింది. మూడు వందల అడుగులకి ఆపేశాడు. రెండవసారి నాలుగు వందల అడుగుల లోతు వేయించినా ఇంచిలావు కూడా నీళ్ళు రాలేదు. అరవై వేలు ఖర్చు, కొడుకునుంచి మందలింపుతో నిండిన ఉత్తరం మాత్రం లభించాయి. అటువంటిది ఇప్పుడు నీళ్ళు పడ్డాయంటే .. ఒకవైపు సంతోషం. మరో వైపు నీళ్ళు పడ్నే ఆ నేలంతా పచ్చని పైర్లతో కళకళలాడదు గదా అనే బాధ. కొడుకును అడిగి చూడాల. దాన్ని సేద్దిం చేస్తే ఎంత పంట పండుతుందని! ఎంతమంది కడుపులు నిండుతాయని! అనుకొని కొడుకు కోసం ఎదురు చూడసాగాడు. మరో గంటకు కొడుకు వచ్చాడు.

“నాగా ..” పిల్చాడు రామిరెడ్డి.

“ఆ .. నాయినా. మనకు నీళ్ళు బలే పడ్నేయి,” అన్నాడు తలుపు దగ్గిరే నిల్చొని లోపలకు తొంగి చూస్తూ.

“కూచ్చో నీతో మాట్లాడాల,” అన్నాడు రామిరెడ్డి.

నాగిరెడ్డి లోపలికొచ్చి మంచం అంచు మీద కూర్చున్నాడు.

“ఐదించిల నీళ్ళు పడ్నేయంట గదరా .. ఇంగన్నా దాంట్లో సేద్దిం చేయించు.”

“సేద్దిమా? నీకేమన్నా తిక్కా? .. నా వల్ల గాదా పని. రేయింబగలు సంవత్సరమంతా కష్టపడాల. అందులో వచ్చేదెంత? ఒకోసారి పెట్టుబడి గూడా రాదు. అదే కోళ్ళ ఫారాల్లో అయితె .. లక్షలు .. లక్షలొస్తాయి,” అన్నాడు చిటికెలేస్తూ.

ఆ విషయంలొ తన ఆశ అత్యాశే అని తెలుసు రామిరెడ్డికి. అయినా కొడుకు ఆలోచనల్లో ఏమన్నా మార్పు వస్తుందేమో అనే ఆశతో అడిగాడు.

“సేద్దిం చేయకుంటె పొయ్యినావు .. ఊరంతటికి నీళ్ళ బాధ తప్పింది,” అన్నాడు రామిరెడ్డి.

“ఊరంతా కాదు, నాయినా .. డబ్బులుండే వాళ్ళకు! ”

“అంటే ..?” అర్ధం కాలేదు కొడుకు మాటాలు రామిరెడ్డికి.

“అంటేనా .. మనం అన్ని వేలు గుమ్మరించి బోరేయించింది అందరికి ఉసరాగా నీళ్ళీడానికా? బిందెకు పావలా ఇస్తేనే నీళ్ళు,” నవ్వుతూ చెప్పాడు నాగిరెడ్డి.

“పావలా ..?” నమ్మలేకుండా ఉన్నాడు రామిరెడ్డి.

“అవున్నాయినా. నూరిండ్లుండాయా, ఇంటికి నాలుగు బిందెలు అయినా రోజుకు నూర్రూపాయలొస్తాయి. నియ్యన్ని ఆదాయం రాని ఆలోచన్లు. నువ్వు గమ్మునుండు,” అనేసి వెళ్ళిపోయాడు నాగిరెడ్డి.


“పెదరెడ్డీ .. పెదరెడ్డీ .. ” అంటూ వచ్చాడు యల్లయ్య.

“ఏంట్రా? ” అడిగాడు రామిరెడ్డి.

“చిన్రెడ్డితో చెప్పి నాకో ఎయ్యి రూపాయలిప్పీరాదు?” ప్రాధేయపడ్డాడు యల్లయ్య.

“వెయ్యా! ” అన్నాడు మంచం మీద కూర్చోనున్న రామిరెడ్డి. ఈ రెండేండ్లలో కాస్త కోలుకున్నాడు. మెల్లిగా లేచి కూర్చో గలుగుతున్నాడు.

“అవున్రెడ్డీ. వారం వారం ఇచ్చేస్తా. ”

“వారం వారం ఇచ్చేదేందిరా? ”

“అదే రెడ్డీ, తండల్‌కు ఇమ్మను. నిండా అవసరం రెడ్డి. నా భార్య పురుడు బోసుకుంది. దుడ్డవసరం, ” అన్నాడు యల్లయ్య వేడికోలుగా

“సరేలే .. సాయంత్రం రా. నాగిరెడ్డితో మాట్లాడతాను,” అని చెప్పి పంపించాడు యల్లయ్యను.

‘తండల్‌ .. అంటె .. తనెప్పుడొ పదేండ్ల కిందట పట్నం పోయినప్పుడు అక్కడ ఇన్నేడీ మాట. వెయ్యి రూపాయ లిస్తమంటారు. నూర్రూపాయలు పట్టుకొని తొమ్మిది నూర్లిస్తారు. వారం వారం డెబ్భై కట్టాల. మొత్తం వెయ్యీ కట్టాల. అత్యాశోళ్ళు కొందరు వారానికి నూరు కట్టించుకొంటారు. చాలా వడ్డీ! పల్లెల నుంచి చానా మంది పొలం పుట్రా అమ్ముకొని పోయి పట్నాల్లో ఇదే వృత్తిగా బతకతాండారు. అక్కడ కూలీనాలీలను చిన్న యాపారస్తులను జలగల్లా పీడిస్తాండారు. తండల్‌ తీసుకోవడం అనేది ఊబి లాంటిది. అందులో దిగితే బయట పడడం కష్టం. తన కొడుక్కూడా ఈ జలగలా మారాడా?’ అని ఆశ్చర్య పోయాడు రామిరెడ్డి. అతని ధన దాహానికి బాధ పడ్డాడు. ఇంతలో కొడుకె వచ్చాడు.

“నాగిరెడ్డీ .. ఇట్లా రా” అని పిల్చాడు.

“ఏంది నాయినా” అంటూ వచ్చాడు కొడుకు.

“ఇంతకు ముందు యల్లయ్య వచ్చిడ్నేడురా”

“వచ్చిన్నేడా .. వాడు నా ప్రాణం తీస్తాండాడే. వెయ్యి రూపాయలు గావాలంట. ఇస్తే మరి వారం వారం కడతాడా?” అన్నాడు నాగిరెడ్డి అసహనంగా.

“నువ్వేందిరా .. ఇట్లాటి పని చేస్తాండావు. నూటికి రెండురూపాయల వడ్డీ అంటేనే బాద పడతాండారే .. నువ్వు నూటికి పది రూపాయల వడ్డీ తీస్తాండావె. పాపం కాదంట్రా. నీకు వేరే ఏ యాపారము దొరకలేదా?” అడిగాడు కొడుకును.

“వేరే యాపారమా? .. దేంట్లో ఉంది నాయినా ఇంత లాభం? రెండేండ్లకు ముందు తెలిసింటె కోళ్ళ ఫారాలు పెట్టేవాడ్నె కాదు. ఐదు నెల్లకు ముందు తిరపతి పోయింటి. ఆడ నాతో పాటు పన్చేసినోళ్ళు ఐదారు మందుండారు. వాళ్ళందరూ ఇదే పని చేస్తాండారు. వాళ్ళంతా లక్ష రూపాయలను ఒకటిన్నర సంవత్సరంలోనే రెండు లక్షలు చేసినారు. కష్టం లేని పని. అందుకే నేనూ మొదలు పెట్టినా!” అన్నాడు వివరిస్తున్నట్లుగా.

“అన్నేయం కాదంటరా!”

“ఎందుకు .. అవసరం వాడిది. మనం డబ్బు ఇస్తాండాము. దానికి వడ్డీ వస్తుంది. అన్యాయమో న్యాయమో .. అవసరానికి ఆదుకొనే వాడు కావద్దా. ఇంగో సంగతి నాయినా. ఈ ఇల్లు కొట్టేసి కొత్తిల్లు కట్టిద్దామని ఉండాను,” అన్నాడు కొడుకు.

“.. ఎందుకు?” అడిగాడు రామిరెడ్డి ఆశ్చర్యంగా.

“ఎందుకేముంది నాయినా. నువ్వెప్పుడొ ఇరవై ఏండ్లకు ముందు కట్టించినావు. కాలం మారిండ్లే. ఇల్లు బాగ లేదు.”

“కాలం కాదురా .. మనుషులు మారినారు. ఈ ఇంటికేమయింది ? కట్టించి ఎన్నేండ్లయినా యాడన్నా పగులొచ్చిందా పెచ్చు బారిందా? కొట్టేదెందుకు, మళ్ళీ కట్టేదెందుకు?” అడిగాడు కోపంగా.

“నీకు తెలీదులే నాయినా. ఇదంతా పాతకాలం మోడల్‌ మొన్న సంక్రాంతి పండక్కి నీ మనవడు ఫ్రెండ్స్‌ తో వచ్చినాడు గదా. వచ్చిన వాళ్ళంతా ఇల్లు బాగలేదన్నారంట. నీ మనవడు ఇల్లు మార్చమంటాండాడు. నీ కోడలు ఢిల్లీలో ఉండగా ఒకిల్లు చూసిందంట. తనకు చాలా నచ్చిందంట. ఆ మోడల్లో కట్టమంటాంది. అదీ గాక ఇంటికి వాస్తుగూడా బాగలేదంట,” అనిచెప్పి అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు నాగిరెడ్డి.

‘వాస్తు బాగలేందే వాడికి ఉద్యోగం వచ్చిందా. ఇన్నాళ్ళు తమకే ఇబ్బంది లేకుండా గడిచిందా,’ అనుకొన్నాడు రామిరెడ్డి మనసులొ.

కొడుకు ఎటు పరుగులు తీస్తున్నాడొ అర్ధం కాలేదు రామిరెడ్డికి. మంచం మీదకు అలాగే వెనక్కు వాలాడు నిస్సత్తువగా. తను ఇల్లు కట్టిన నాటి రోజులు కళ్ళ ముందు మెదిలాయి.

“ఉండేది ఒక్క కొడుకు. ఇంత పెద్దిల్లు కడతాండావే ఎందుకురా?” అనడిగాడు అప్పట్లో శిట్టయ్యగారి తిమ్మారెడ్డి మామ.

“ఇల్లన్నేక ఒక నాటితో ఒక తరంతొ పోయేదా మామా? మాకుండేది ఒక నలుసే. వాడికి నలుగురయితె మళ్ళా ఎతుకులాడద్దా ఇంటికోసం.”

“అవున్రొరె. చాలా దూరం ఆలోచించినావే.”

“చిన్నాయన్తో మాటలాడి పన్జూస్తావా .. పొద్దు పోతాండ్లా,” అంది పద్మావతమ్మ గోడలకు నీళ్ళు పోస్తూ.

“ఆడోళ్ళకు ఆగింతమెక్కువేరోయ్‌ ఎంతగా కొడుక్కోసరం ఇల్లు కడ్తాండారే అనుకొ. అల్లుడ్ని ఐదు నిముషాలన్నా ఊరికే ఉండనిచ్చేట్లు లేవు గదమ్మా.”

“అదేం లేదు చిన్నాయినా. పిల్లోడు వస్తాడు బడి నుంచి. రాత్రికి ట్యూసనుకు పోవాల. అన్నం వండాలా ఇంగా. ఈ మనిషి అరువులు పెట్టుకొన్నాడంటె అట్లుండె పొద్దు ఇట్లవాలినా చెయ్యడు. బిన్నే నీళ్ళు తెచ్చి పోస్తే పనయిపోతాది. సందేళ టాకటరొస్తాదంట. ఇసిక ఏసుకొని రావాల. ఈయనెళ్ళి పోతాడు. మళ్ళీ నేనొక్కదాన్నే. నీళ్ళకు ఇబ్బంది కదా?” అంది చేస్తున్న పనిని ఆపకుండానే.

“పిల్లోణ్ణి రెండ్రోజులు బడి మాన్పించేది.”
“అయ్యో .. వాడ్నా .. చదువుకోనీ చిన్నాయినా. బిడ్డ బాగా చదవతా ఉండాడు. మేముండాం గదా కష్టపడే దానికి. ”

“తాతో .. పక్కకు జరుగు. ఎద్దులొస్తాండాయి,” అంటూ వచ్చింది రామిరెడ్డి కూతురు జయలక్ష్మి.

“ఈ యమ్మి మొగ పుట్టక పుట్టాల్సింది. ఎట్లో ఆడదిగా పుట్టింది. మొగోని మాదిర్తొ అన్ని పనులు చేస్తాది,” అన్నాడు తిమ్మారెడ్డి మెచ్చుకోలుగా.

“కష్టపడుతుంటేనే గదా మామా ఐదేళ్ళు నోట్లోకి పొయ్యేది” అన్నాడు రామిరెడ్డి.

“అవున్రొరే. మీతో పెట్టుకుంటె నాకు పొద్దు పోతాది. కమ్మార పల్లె దాకా పొయ్యి రావాలె,” అని తిమ్మారెడ్డి వెళ్ళిపోయాడు.

అలాగ రేయిబవళ్ళు కష్టపడ్డారు .. కూలీలకన్నా ఎక్కువగా !

గృహప్రవేశం నాడు
“ఎట్లా ఉందిరా ఇల్లు .. ” అడిగాడు తను కొడుకును.

“సూపర్‌ నాయినా,” అన్నాడు నాగిరెడ్డి.

కొడుకు ముఖంలోని ఆనందాన్ని చూసి అతని నోట్లోంచి వెలువడిన ఇంగ్లీషు పదాన్ని విని మరింత ఆనందించాడు తను.

“మనూర్లో ఎవ్వరికీ లేదు నాయినా ఇంత పెద్దిల్లు. చుట్టు పక్కలూర్లల్లో గూడా లేదు. మా బళ్ళో అయితే అయవేర్లంతా ‘ఏం నాగిరెడ్డీ, పెద్దిల్లు కడతాండారంటనే’ అనడిగినారు. మా బళ్ళో పిల్లకాయలంతా చానా మంది మనిల్లు చూడాలన్నేరు. ఒకరోజు పిల్చుకోనొస్తా నాయినా,” అంటున్నాడు నాగిరెడ్డి ఉత్సాహంగా.

కొడుకు వైపు ముదిగారంగా చూశాడు తను. తమ శ్రమకు తగిన ఫలితం దక్కిందని సంతోషించాడు. “అట్లే గాని.. తీసికొనిరా.” అన్నాడు.

“ఆ తరువాత తరువాత కూడా కొడుకు తమ చుట్ట పక్కాలతో, తన మిత్రులతో, అంతెందుకు మిల్ట్రీలో ఉండంగా ఇంటికొచ్చిన తన తోటి జవాన్లతో కూడా తమ ఇంటిని గురించి గొప్పగా చెప్పేవాడు. వాళ్ళూ ఎంత పెద్ద ఇల్లు అంటూ ఆశ్చర్య పోయేవాళ్ళు . అటువంటి ఇంటిని కొట్టేయాలంటాడే,” అనుకొంటుంటె రామిరెడ్డి కాళ్ళు చేతులు ఆడడం లేదు.

రామయ్య చేత కూతురుకు కబురంపాడు. కూతురు అల్లుడు వస్తే వాళ్ళ మాటలు వినయినా కొడుకు ఇంటిని కొట్టడేమో అనే ఆశ రామిరెడ్డిలో మిణుకు మిణుకు మంటోంది.


“ఏంది నాయినా .. నీ చాదస్తం గాకపోతే ఇంత పెద్ద ఇల్లా? గోడౌన్‌ మాదిర్తొ ఉండ్లా,” అంది కూతురు.

“అవును మామా .. తలుపులు చూడు .. వర్సగా ఉండాయి.”

“అట్లుంటేనే గదల్లుడు, గాలీ ఎల్తురొచ్చేది.”

“ఈ మాదిర్తోనా .. అయినా వాస్తు బాగలేదంట గదా మామా. నీకు పక్షవాతం రావడానిక్కూడా కారణం వాస్తు బాగలేకనే నంట గదా!”

“వాస్తు బాగ లేకనా .. ఈ ఇల్లు కట్టి ఇరవై ఐదేండ్లయితాంది. అప్పట్నుంచి రాంది ఇప్పుడే ఎందుకొచ్చింది అల్లుడు? వాస్తు బాగ లేక్కాదు నాకు పక్షవాతం వచ్చింది.”

“మరి ..?”

“అయ్యన్నీ ఎందుగ్గానీ నాయినా .. ఇప్పుడు నీకెందుకు బాధ. ఇంతకన్నా బాగా కడ్తాను గదా ఇల్లు,” అన్నాడు నాగిరెడ్డి.

“అవున్నాయినా. నువ్వేం దిగులు పడొద్దు. చూడు ఇల్లంతా దూలాలు. పాత కట్టడం కదా. ఇప్పుడు పిల్లర్లేసి దూలాలే కన్పించకండా కడ్తాండారు. అట్ల కట్టిస్తాడంట . ఆ మాదిర్తొ కట్టిస్తె నీకే గదా గౌరవం. ఫలానా రామిరెడ్డి కొడుకు గొప్పిల్లు కట్టినాడంటారు గదా. మేమొస్తాం నాయినా. వాడిష్టమొచ్చినట్లు చెయ్యనీలే,” అంది కూతురు ఊరుకు బయల్దేరుతూ.
“అది కాదమ్మా ..” అంటూ ఏదో చెప్పబోయాడు. మాటలు స్పష్టంగా రాలేదు రామిరెడ్డికి. తనకొస్తున్న కోపం వలన అనుకొన్నాడు.
“నువ్వేం ఆలోచన్లు పెట్టుకోకు. పోయొస్తాం,” అన్చెప్పి అల్లుడు కూతురు వెళ్ళారు. వాళ్ళతో పాటు కొడుకూ వెళ్ళాడు.

కూతురు వంటి మీద కొడుకిచ్చిన రెండు వేల రూపాయలు విలువ చేసే పట్టు చీర, అల్లుడు వేసుకోనుండె విలువైన బట్టలు వాళ్ళ చేత కొడుకు పక్షం మాట్లాడించాయి అని అర్ధం చేసుకోలేనంత వెర్రి వాడేం కాదు రామిరెడ్డి. జీవితాంతం పుట్టింటి ఆశ ఉండేది ఇక తమ్ముని మీదనే కదా. మంచాన పడ్డ నాన్నేం మంచీ చెడ్డా చూడగలడు ? తెలివైంది కూతురు. అందుకే తమ్ముడ్ని వెనకేసుకొచ్చింది. అంతా బ్రతుక నేర్చినోళ్ళు అనుకొన్నాడు రామిరెడ్డి.

అక్కను బావను బస్సెక్కించి ఇంటికి వచ్చాడు నాగిరెడ్డి. రామిరెడ్డి కొడుకును పిల్చి ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ మాట పెగలడం లేదు. అప్పుడర్ధం చేసుకొన్నాడు, “ఇంతకు ముందు పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు మాత్రమే పడిపోయాయి. కానీ ఈసారి నోరు కూడా పోయింది .. ” అనే విషయం.

కళ్ళలోంచి నీళ్ళు చిక్కిపోయిన బుగ్గలపై కాలవలు గడుతున్నాయి. తుడుచుకోను చేతులు సహకరించక మరింతగా ఏడుస్తున్నాడు రామిరెడ్డి.


” .. .. ఆ యాపారానికి ఎంతవుతాది బాబు? ”

“దాదాపు ఇరవై ముప్ఫై లక్షలు పట్టచ్చు డేడీ. ”

“అంత డబ్బు మనకాడ యాడుంది? ”

“డబ్బు లేకుంటే నేం .. ఇల్లూ, కోళ్ళ ఫారాలు ఉన్నాయి గదా. ”

“ఆదాయం వచ్చే ఫారాల్ని, తలదాచుకొనే ఇంటిని అమ్ముకో మంటావా బాబూ. ”

“ఏంటి డేడీ సిల్లీగా ఆలోచిస్తావ్‌ ఎన్ని సంవత్సరాలు వీటితో కష్టపడితే కోటీశ్వరుడయ్యేది ? నేను చెప్పే బిజినెస్‌ స్టార్ట్‌ చేసినామంటే రెండు మూడు సంవత్సరాలకంతా కోటి రూపాయలు ఈజీగా సంపాదిస్తాం,” అంటున్న పాతికేళ్ళ కొడుకును తదేకంగా చూస్తున్నాడు నాగిరెడ్డి.

కొడుకు మాటలు వింటుంటె తను తన తండ్రితో గతంలొ మడి అమ్మడం గురించి, కోళ్ళ ఫారాలు వేయడం గురించి మాట్లాడిన మాటలు గుర్తుకు రాసాగాయి. అప్పుడు తండ్రి పడ్డ బాధ ఇప్పుడిప్పుడే అర్ధమవసాగింది నాగిరెడ్డికి.