లెఖ్ఖల పరీక్ష

(కవిగా, కథకుడిగా తానా, ఆటా సువనీర్లలో దర్శనమిచ్చే శ్రీనివాస్‌ ఫణికుమార్‌ డొక్కా గారి “ఈమాట” తొలిరచన ఇది. అందరికీ అనుభవమైన చిన్ననాటి ముచ్చట్లు
గుర్తుకుతెస్తూ సున్నితమైన హాస్యాన్ని రంగరిస్తుంది ఈ వ్యాసం.)

అయిదింటికల్లా బడి వదిలితే, సినిమా హాళ్ళూ, బజారూ చూసుకుంటూ ఇంటికొచ్చేసరికి ఆరు. ఆడుకుందుకు ఇలా వెళ్తామో లేదో, అప్పుడే చీకటి పడిపోతుంది. స్కూల్లో కూడా ఆటల పీరీడు వుంటుంది కానీ, అక్కడ మేష్టార్లతో ఆడడం ఏం బావుండదు. ఇప్పుడూ..చాకలిబాన ఆడామనుకోండి..మరి లెఖ్ఖ ప్రకారం, మనకి దొరికిన వాళ్ళని దొరికినట్టు రుమాలు పెట్టి నడ్డిమీద వుతికెయ్యాలి కదా?..నాకేమో లెఖ్ఖల మేష్టారు దొరికితే సుభ్భరంగా పరిగెత్తించి, బాగా బాదెయ్యాలని అనిపించేది. బాదడం అంటే..వుత్తుత్తినే బాదడమే అనుకోండీ..కానీ, అసలే ఆయనకీ మనకీ మాటల్లేవు. దానికితోడు, ఇలా కొట్టేస్తే, రేప్పొద్దున్న, అమ్మ లంచి కారేజీ పట్టుకొచ్చినప్పుడు ” మీ రొండో వాడికి ఆటలమీద వున్న శ్రద్ధ లెఖ్ఖలమీద లేదండి..మీరు కూడా ఇంట్లో కాస్త కొట్టి, కూచోపెట్టి చెప్పాలండి ” అనేస్తారు. పా..పం, అమ్మకి మాత్రం..చేతులు నొప్పెట్టవూ? అందుకనీ, యే శ్రీలక్ష్మీ వాళ్ళింటికో, రాధికా వాళ్ళింటికో వెళ్ళి, ఆడుకుని వచ్చేవాడిని. వచ్చి, కాళ్ళూ చేతులూ కడిగేసుకుని, అన్నయ్యతో భోయనానికి రెడీ అయిపోయేవాణ్ణి. ” ఏవండీ..చిన్న రాజాగారూ, మనకి ఇవాళ స్కూల్లో హోమ్‌వర్కు ఏమీ ఇవ్వలేదాండీ? “అదిగేది అమ్మ.
” ఇచ్చారూ…కానీ ” అనే వాణ్ణి నేను కంచంకేసి చూస్తూ. ” ఆ వేషాలేవీ కుదరవు..ఇవాళ హోమ్‌వర్కు చేస్తేనే తిండి ” అనేది. ” అదికాదే..మరి ఇవాళేమో మావిడికాయ పప్పు కదా, అందుకనీ..గబగబా తినేసి, అప్పుడూ.. హోమ్‌వర్కు ” అనేవాణ్ణి. ఇంతలో నాన్నగారొచ్చిపోన్లేవే, తిన్నాకా చేస్తాడు, సరేనా?అనేవారు.
” మీరిలాగే తగలెయ్యండి వాణ్ణి.. రేప్పొద్దున్న భాస్కర్రావు కొట్లో పొట్లాలు కట్టుకుందుక్కూడా పనికిరాడు. ఏం? తోటివాడు చదువుకోటల్లేదా, బుద్ధిగా? ” అంటూ కాసేపు పాఠం చెప్పేసేది. ఈ సందడిలో నేను పప్పూ అన్నం సగంలో వుండేవాణ్ణి. ” పోనీలే..తిన్నాకా చేస్తాడు ” అనుకుంటూ చక్కగా భోజనం పెట్టేసేది అమ్మ. నేను ఎప్పటిలాగే, మజ్జిగా అన్నం తింటూండగానే నిద్ర పోవడం, నాన్నగారు చెయ్యికడిగేసి, ఎత్తుకుని, మంచం మీద పడుకోపెట్టేయటం. ” వుత్తదీ, దొంగ నిద్ర. హోమ్‌వర్కు చెయ్యాలనీ…నేవస్తున్నా వుండు, వంటిల్లు కడిగేసి” అమ్మ మాటలు వినిపిస్తూనే వుండేవి. కానీ వంటిల్లు కడిగి, సద్ది, అమ్మ వచ్చేసరికి నేను నిజంగానే నిద్రపోయేవాణ్ణి.

హోమ్‌వర్కు చెయ్యడం కష్టం కాదుగానీ.. అదేవిటో..హోమ్‌వర్కంటే..అన్నీ లెఖ్ఖలే వుంటాయి. మిగితా మేష్టార్లు అంతలేసి హోమ్‌వర్కులు యివ్వరు. తెలుగు మేష్టారు చక్కగా పా..డుతూ చెప్పేస్తారు పజ్జాలు. మనం కూడా చక్కగా అష్టమీ..రోహిణీ..పోద్దుట అని పాడేసుకుంటే అదే వచ్చేస్తుంది కిష్ణ శెతకవైనా, బాలరామాయణవైనా..యింగ్లీషు మేష్టారు అచ్చుపుస్తకం లోనే ఆన్సర్లన్నీ టిక్కులుపెట్టి ఇచ్చేస్తారు. అవి బట్టీ పట్టేయడమే..వచ్చిన చిక్కల్లా లెఖ్ఖల మేష్టారితోటే..క్లాసులో మూడో నాలుగో లెఖ్ఖలు చెప్పేసీ..

” మిగిలిన ఇరవైరెండూ, ఇంట్లో చేసుకురండర్రా ” అంటారు.
ఇంట్లో చేసుకోడానికి అవేవైనా కాయితం పడవలా?
లెఖ్ఖంతా అర్థమైనట్లే వుంటుంది, కానీ చెయ్యడం మొదలెడితే, సగం తరవాత యింక రాదు. పాపం..అన్నకి వచ్చును కాబట్టి సరిపోయిందిగానీ, లేకపోతే, నా హోమ్‌వర్కు పుస్తకం నిండా, నారాత తక్కువా, మేష్టారి రాత ఎక్కువా వుండదూ?

అయినా చిన్నప్పటి లెఖ్ఖలే నయం. చక్కగా ” గోపాలుని వద్ద నాలుగు ఎర్ర గోళీలు కలవు. వాటిలో రెండు గోళీలు గోవిందునకు యిచ్చినచో, గోపాలునివద్ద ఎన్ని గోళీలు మిగులును? ” అనివుండేది.

మరి మనకి బండ గుర్తులు కూడా వుండేవి. ” మొత్తం”  అనగా..కలపడం, “మిగలడం” అనగా..తీసేయడం. కాబట్టి ఠకీమని చెప్పేసేవాణ్ణి. ఇప్పుడు అల్లా కాదు కదా..ఏవేవో బోల్డు అంకెలూ గట్రా ఇచ్చేసి..చివర్లో..” గరిష్ట సామాన్య భాజకము తెలుపునది “అని వుంటుంది. అసలు ఆపేరు వింటే నాకు వశిష్టముని ఆశ్రమముఅని వినిపిస్తుంది. ఇంక లెఖ్ఖెలా అర్థమవుతుంది? అలాగే ఇంకో లెఖ్ఖ. “పదివేల రూపాయలు అసలు మొత్తం అప్పు తీసుకున్నచో, యేడాదికి పది శాతం సాధారణ వడ్డీ చొప్పున, అయిదేళ్ళ తరవాత ఎంత చెల్లించవలెను…” అని వుంటుంది. అసలు యీ అప్పెందుకు తీసుకుంటారో మన ప్రాణానికి !! పోనీ, మొత్తం అని వుంది కదా, కలిపేద్దాం అనుకుంటే..కొన్ని అంకెలూ, కొన్నేమో శాతాలూ..కుదిరేది కాదు. దాంతో కోపం వచ్చి, వాడిచ్చిన అంకెలకి ఇంకో రెండు అంకెలు కలిపి కూడేసి, చివర్లో మళ్ళీ నాలుగు పెట్టి గుణించేసి, ఆన్సరు వేసేసేవాణ్ణి. అదేవిటో! ఒఖ్ఖసారి కూడా ఆ ఆన్సరు కరక్టయ్యేదికాదు.

ఈ లెఖ్ఖలన్నీ ఒక ఎత్తు. ఇంకోరకం లెఖ్ఖవుండేది. దాన్ని చూస్తేనే వళ్ళు మండేది ” ఫలానా పనిని, ఇద్దరు మనుషులు, నాలుగు రోజుల్లో చేస్తే, అదేపనిని, ఎనమండుగురు, ఎన్నిరోజుల్లో చేస్తారూ..?” అనుకుంటూ. ఆ లెఖ్ఖ ఇచ్చినవాడికి యేవయినా బుర్రా బుద్ధీ వున్నాయా? అనిపిస్తుంది నాకు. పని చెయ్యడం చెయ్యకపోవడం అనేది వాళ్ళ వాళ్ళ యిష్టాన్ని బట్టి వుంటుంది. ఇష్టవైతే చేస్తారు, లేకపోతే లేదు. వుదాహరణకి, హోమ్‌వర్కు వుందనుకోండి, దాన్ని అన్న అయిదు నిమిషాల్లో చేసేస్తాడు. అదే నేనైతే? గంటలో చెయ్యచ్చు, అయిదు గంటల్లో చెయ్యచ్చు, అసలు చెయ్యకపోవచ్చు !! మరి ఇలాంటి పిచ్చిలెఖ్ఖలిస్తే కోపం రాదూ? వచ్చేది.

అందుకే త్రైమాసిక పరీక్షల్లో నా యిష్టం వచ్చినట్టు ఆన్సర్లు రాసేసి, వేసేసి వచ్చేసేవాణ్ణి. ఓసారి, ” ఫలానా ఘనపరిమాణం గల నీటితొట్టెకు గల రంధ్రము ద్వారా, ఫలానా వేగంతో నీరు బయటకు పోవుచున్నది.ఆ తొట్టె నిండవలెనన్నచో, పంపులోని నీటి వేగము ఎంత వుండవలెను? ఏమిచేయవలెను? ” అన్న ప్రశ్నకి.. ” ముందుగా రంధ్రము మూసివేయవలెను ” అని రాసి వచ్చేశాను. ఆ మర్నాడు లెఖ్ఖల మేష్టారు అమ్మని పిలిచి, ” అమ్మా..ఇలాగైతే మీవాడో, నేనో..ఎవరో ఒకరం స్కూలుమానేయాల్సి వుంటుంది” అని చెప్పేయడంతో, నాపని ఇంకా కష్టమైపోయింది.

అప్పట్నించీ ప్రతీ లెఖ్ఖల పరీక్ష ముందూ, తరవాతా మాయింట్లో వో పేద్ద కురుక్షేత్రం.
వీధి.. వీధంతకీ తెలిసిపోయేది, నాకు లెఖ్ఖల పరీక్షని. పునశ్చరణ అభ్యాసాలూ, పువ్వుగుర్తున్న లెఖ్ఖలూ, మళ్ళీ మళ్ళీ చేయించేది.
పరీక్ష పేపరుమీద ఆన్సర్లు వేసుకుని రమ్మనేది అమ్మ. కొన్ని లెఖ్ఖలు వచ్చేవీ..వాటికి ఆన్సర్లు వేసుకుని వచ్చేవాణ్ణి. కానీ, సగానికి పైగా లెఖ్ఖలకి యే ఆన్సర్లు వెయ్యనూ?

అందుకే ఇంటికొచ్చాకా పే..ద్ద రేవు. చేసిన లెఖ్ఖల్లో కూడా మూడో, నాలుగో తప్పని, అన్న చూడంగానే చెప్పేసేవాడు. మళ్ళీ ఇంకో చిన్న రేవు. ఇలా కాదని వోయేడాది వార్షిక పరీక్షలకి వో వుపాయం కనిపెట్టా. పరీక్ష రాసేసి, ఇంటికొచ్చేసేముందు, బల్లమీంచి ప్రకాష్‌ గాడి అట్ట తీసుకుని, వాడు ప్రశ్నపత్రం లో రాసుకున్న ఆన్సర్లన్నీ గబా గబా హడావిడిగా యెక్కించేసుకుని, యింటికొచ్చేసా. ప్రకాష్‌ గాడు లెఖ్ఖల్లో యెప్పుడూ ఫష్టు కాబట్టి, మనకి దెబ్బలు తప్పాయి అనుకుంటూ యింటికొచ్చి, స్టైలుగా అన్నదగ్గిరికెళ్ళి ” యిదిగో యివాల్టి పేపరు, అన్నీ సరిగా వున్నాయో లేదో చూసుకో…” అని పేపరు విసిరేసి, కాళ్ళు కడిగేసుకుని, ఆఖరి పరీక్ష కూడా అయిపోయింది కదా..అని ఎగురుకుంటూ..ఆటలకెళ్ళిపోయా.

రాత్రి యింటికొచ్చేసరికి, గుమ్మంలోనే అమ్మ, వెనకాతలే అన్న. ఏవైందో తెలిసేలోపు పేద్ద దరువు. సమాధానాలన్నీ తప్పుట. ఈ సారి పరీక్ష గుడ్డెక్కటం ఖాయం అని అమ్మ చెప్పేసింది. సరే…సెలవలు అయిపోయాయి. నేను పాసు కూడా అయిపోయాను. నాకు తెలుసు, నేను కనీసం…కొన్ని లెఖ్ఖలైనా సరిగా చేసానని. కానీ, ప్రకాష్‌ గాడి అట్టా, బాషా గాడి అట్టా అచ్చం వొకేలా వుంటాయని నాకేంతెలుసూ?!! బాషాగాడింకా ” వొరేయ్‌! మొత్తం అంటే కూడాలా?, తీసేయాలా? ” అని, నన్నే అడిగేరకం. అదీ సంగతి.

అలా దినదిన గండం .. నూరేళ్ళాయుష్షులా..ఏదో..నెట్టుకొచ్చేశాను. ఫదోక్లాసులోకెళ్ళాకా, యింక యింట్లో “రేవులు” తగ్గిపోవడంతో, కొంచెం భయం తగ్గింది. లెఖ్ఖలపేపరు సరిగ్గా చెయ్యకపోయినా, మన వంటికి రేవుండదు..అనే ధైర్యం వచ్చినప్పట్నించీ, అదేం చిత్రమో! అంతకుముందుకన్నా, లెఖ్ఖల పేపరు బాగానే చేసేవాణ్ణి, మార్కులూ బాగానే వచ్చేవి. రాను రాను లెఖ్ఖలంటే భయం పోయింది. లెఖ్ఖల పేపరు కూడా మిగిలిన పేపర్లలో ఒకటైపోయింది. ఒక్కోసారి, యేడాదికి రెండేసి లెఖ్ఖల పేపర్లు కూడా రాసేసేవాణ్ణి. రాసి, యింటికొచ్చేసి, మర్నాటి పరీక్షకి ప్రిపేరవడమో, లేకపోతే యే సినిమాకో పోవడమో.

కానీ, నాదృష్టిలో యివన్నీ వుత్తుత్తి పరీక్షలే.

లెఖ్ఖల పరీక్షంటే కష్టంగానే వుండాలి. భయంగానే వుండాలి. కొన్ని రావాలి. కొన్ని రాకూడదు. కొన్ని చివరికంటా వచ్చి…అక్కడ పెంట పెట్టాలి. అన్న తిట్టాలి, అమ్మ కొట్టాలి. యి….న్ణి జరిగితే, అదీ…లెఖ్ఖల పరీక్షంటే. లేకపోతే అదేం పరీక్ష?….గింజలు తీసేసిన మెరపకాయ బజ్జీలా…..చా…ప్ప..గా !!


శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

రచయిత శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్‌ సైన్స్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ...