సాధారణంగా కవులూ, సాహితీ వేత్తలూ అయిన వారు తెలుగు సినిమాలలో మాటల, పాటల రచయితలుగా స్థిరపడడం, వారి రచనలు బహుళ జనాదరణ పొందడం అనాదిగా వస్తున్నదే. అట్టి రచయితలూ, కవులూ తమ సినిమా రంగ ప్రవేశానికి పూర్వం తాము వ్రాసుకొన్న, తమకు నచ్చిన కవితలనూ, గీతాలనూ అనేక సినిమాలలో ప్రవేశ పెట్టడం కూడా జరిగింది. అయితే, సినిమా రచయితగా స్థిరపడిన తరువాత కూడా తమ రచనా వ్యాసంగాన్ని ఒక్క సినిమా రంగానికే పరిమితం చేయకుండా, పలువిధాల తమ తమ పాఠకాభిమానులని ఆదరించి, అలరించిన సుకవులూ, రచయితలూ ఈ కాలంలో అరుదు. అట్టి కోవలోకి చెందిన వారిలో కొందరు సర్వశ్రీ వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల (చెంబోలు) సీతారామశాస్త్రి మరియు సామవేదం షణ్ముఖ శర్మ గార్లు.
శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తమ పద, లయ విన్యాసంతో పరమశివుని మెప్పించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా “సహస్ర భావ పుష్ప మాలిక” గా 1000 గీతాలను వ్రాయ సంకల్పించి, గత పదేండ్లుగా వ్రాస్తూ వచ్చారు. అభిమానుల ప్రోత్సాహంతో తొలి విడతగా 54 గేయాలను “శివ దర్పణం” గా ముద్రించారు. అందలి విశేషాలను పరిశీలిద్దాం.
ఈ గేయాలు చాలా చోట్ల సరళ సుందర పదలాలిత్యంతోనూ, కొండొకచో గంభీర పద సౌష్టవంతోనూ నిర్మింపబడి భావ పరిపుష్టంగా వున్నాయి. “ఆశ కైలాసాద్రి శిఖరమంత, అర్హత ఇసుకరేణువంత” అని ముందు మాటలో శాస్త్రి గారు వినయంగా చెప్పుకొన్నా, ఈ ప్రతిభావంతుడి సాహితీ వనంలో వికసించిన కవితా కుసుమాలు అద్భుత పరిమళాలు వెదజల్లుతున్నాయనడంలో సందేహం లేదు.
సినిమాల ద్వారా శ్రోతలనలరించిన “శ్రీ శారదాంబా నమోస్తుతే, నా పాట పంచామృతం, శివానీ భవానీ శర్వాణీ, వైష్ణవి భార్గవి వాగ్దేవి, ఆనతి నీయరా హరా, ఆది భిక్షువు వాడి నేది కోరేది, సాగెనే నాట్య వేదం, అందెల రవమిది పదములదా” మొదలైన గీతాలే కాక మరెన్నో సుందర సుమధుర గేయాలు ఈ మాలికలో కూర్చ బడినవి. “అగజా సూనుడు అందునట, అఖిల జగమ్ముల కైజోత, ఆ గజాననుని, ఆదిపూజగొను, అయ్యకు అంకితమౌ గాత, నా తలపోత, కైతల సేత” అంటూ ఆది దైవమైన గణపతి ద్వారా సర్వేశ్వరునికి జోతలర్పిస్తూ మొదలైన ఈ గేయ పరంపర, “చిన్నారి చిట్టెలుకెలా సహించెరా లంబోదరా, పాపం కొండంత పెనుభారం, ముచ్చెమటలూ కక్కిందిరా, ముజ్జెగములూ తిప్పిందిరా, ఓహోహో జన్మ ధన్యం” అని పరవళ్ళు తొక్కింది. “అంబారిగా అమరిన ఇంతటి వరం, అంబాసుతా ఎందరికి లభించురా ?” అని ప్రశ్నిస్తూ, “గళ పీఠమే రత్న సింహాసనంగా, సరిగమల స్వర సలిల సంప్రోక్షణలతో, శ్వాస తీవెల స్వర నర్తన” తో, ఆ గీర్వాణి సాహితీ స్నానాలు చేసిన వైనం కవితా రూపంలో మన ముందుంచుతుంది. “ఆపాత మధురము సంగీతము, అంచిత సంగాతము, సంచిత సంకేతము, శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము, అమృత సంపాతము, సుకృత సంపాకము ఆలోచనామృతము సాహిత్యము, సహిత హిత సత్యము, శారదా స్తన్యము, సారస్వతాక్షర సారథ్యము, జ్ఞాన సామ్రాజ్యము, జన్మ సాఫల్యము” అంటూ సంగీత సాహిత్యాలకు సరిక్రొత్త నిర్వచనాన్ని, ప్రయోజనాన్నీ ప్రతిపాదిస్తుంది.
“వేదాల వాణితో విరించి రచియించిన విశ్వ నాటక రంగస్థలంపై, విసపు నాగులను సంక నెత్తుకొని జంగమదేవర చేసే కాలనృత్యం మన కళ్ళెదుటే సాక్షాత్కరింప జేస్తుంది. “రామేశ్వరా రమ్ము రమ్మంటిరా, కామేశ్వరా కాపు కమ్మంటిరా” అని అర్థిస్తూ, ” వంక జాబిలి నీడ మంచు మంచము మీద చల్లంగ శయనించే శంకరయ్యను” మేలుకొలిపి, “అంత కాని వాడనా అంతకాంతకా, పంతమేల చెంతగా చేరనియ్యక” అని నిలదీస్తుంది. “నెలవంకకు ఉన్నంత కళంకమైన లేదా, నాతలపుల నెలకొన్న నలుపు నీకు తెలియదా, చదలవాకలోని చపల బుధ్ధి నాకు లేదా, క్షణము కుదురు లేని కుటిల మతిని నేను కాదా” అని ప్రశ్నిస్తూ, “నమ్ము నమ్మకపో, నమ్ముకొంటి నిన్నే సుమ్మీ నిప్పుకంటి సామీ, ఇవ్వూ ఇవ్వకపో, వీడనంటి నిన్నే సుమ్మీ, వెల్ల ఒంటి సామీ, గీర్వాణ పతి ధాత వేదాల తాత, తెలివితో నాల్గు తలలూ పండి ఉన్న నలువ నా తెలిసీ తెలియని పలుకులు వినుట అంతటి సులువా ?, నా కేకలలో ఆ వాక్పతి మెచ్చుకొనే వ్యాకరణముండునా? సిరి గల శ్రీహరి, నేనో పేదను మరి, శిరసొంచి చూచేనా నా దెసనొక్కపరి, కలిగిన ఆ దొరకు కానుకలీగలనా” అంటూ వారెవ్వరూ “నీ వలె అల్ప సంతసులు గారు, పశుపతీ, నీదీ నాదీ వీబూది జాతి, నిన్ను కాదని నాకు పరమార్థమేది ? నన్ను కాదని నీకు పరివారమేది ?” అని సర్వస్య శరణాగతి కోరుతుంది.
“విబూది దేవయ్యా, వివాదవేందయ్యా, అమ్మతో చెబుతానయ్యా” అంటూ ” కుడిపాదవట్టుకుంటే యిదిలించుకుంటానంటే, ఎడవపాదవట్టుకుంటా, అమ్మ తోటే చెప్పుకుంటా” అంటూ అర్థనారీశ్వర స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ, “ఎలికరౌతు నీ కొమరుడా, సిలకరౌతు నీ పెరవోడా, పూలిసిరిన పున్నేత్ముడిని ఉరివిసూసి ఉసురణిసావు, రాల్లవోరి బొట్టెని సూసి జపతపాలు నీళ్ళిడిసావు, నొష్ఠ నిప్పు బొట్టెట్టావు, నీటితోటి సిగ జుట్టావు, తామసోడివయ్యా నువ్వు, తాపసోళ్ళ జేజైనావు ఏటీ సిత్రాలు నాయనా, ఇయన్నీ సిట్టాలు రాయనా” అని “తెయి తక్కల ఆటకు నువ్వే ఆటపట్టువైనావయ్యా, దెయ్యాలకు దేవరా, నువు సెయ్యలేనిదేవిరా” అంటూ నిందాస్తుతికి దిగుతుంది. “అప్పులో నిండా మునిగావు లింగా” అన్న పాటలో అప్పు అనే శ్లేషార్థంతో “అందుకే పారింది తలపైన గంగ” అని ప్రస్తావించి, “అప్పనంగా ఆర్తులందజేయంగా, ఆయువులు మింగవా యమ నిమ్మళంగా, అప్పు చెల్లించావ అందరెరుగంగా ?” మూఢ తిన్నడికి “కైలాస మిస్తివా గుంభనంగా, కాబోసులే కాని ఖచ్చితంగా అప్పుచెల్లించావ అందరెరుగంగా”, “భక్త శిరియాళుడే చవులూరు విందా, విసము మరిగిన నోట తేనూరుతుందా, తేరగా త్రేన్చి దీవెనీయంగా, సాయుజ్యమిస్తివా సుబ్బరంగా, సాక్ష్యవేదీ లేదె సావిరంగా” అంటూ నిలదీస్తుంది.
ఆది భిక్షువు వాడి నేది కోరేదీ గీతంలో “పగటి వెలుగును వేడితోటి రగిలించి పనికి ఫలితమ్ముగా చెమట చిందించి, నిదురించు నిశిలోన శశికాంతి దించి, చల్ల దనమును కల్ల కలలుగా మిగిలించు ” మొదలైన సినిమా పాటలో లేని చరణాలను శివ శరణాగతి లో సమర్పిస్తూ, “ఊహకైన అందవేమి ఉమామహేశా, ఉన్నావు గద ఊ అనవేమి హిమాలయేశా? ఉండబట్టలేక ఇలా ఉన్నమాటనేశా, ఉలుకొచ్చైనా ఊడిపడవా అనే చిన్ని ఆశ !” అని వేడుకొంటూ “ఎంత కష్టపడి కూడబెట్టితిని పిసరంత భక్తి, పరమేశా, పాడుచేయకు పరీక్ష బెట్టి..” అని ముక్తాయిస్తుంది. “నయన తేజమే నకారమై, మనో నిశ్చయం మకారమై, శ్వాస చలనమే శికారమై, వాంచితార్థమే వకారమై, యోచన సకలము యకారమై”న పంచాక్షరీ మంత్రంతో పరమేశ్వరానుగ్రహం కోరుకొంటూ, “కుమార సంభవ పూర్వ రంగాన్నీ, దక్షాధ్వర ధ్వంస రచనా విధానాన్నీ, క్షీర సాగర మథనాన్నీ” మన ముంగిట నిలుపుతుంది ఈ శివ దర్పణం.
విబూది వలువల ఆది భిక్షువుకి సిరివెన్నెలతో పంచామృతాభిషేకం చేయించిన సీతారామ శాస్త్రి గారి కలం చిందులు పాఠక హృదయాలను ఆనంద తాండవం చేయిస్తాయి. వెల అముద్రితం. కాపీలు కావలసిన వారు రచయిత శ్రీ సీతారామ శాస్త్రి గారిని Srl Lalitha Publications, 301, Western Plaza, Yellareddyguda, Hyderabad – 500873 వద్ద గాని, ఈమెయిలు ద్వారా sirivennela@usa.net OR sri.lalita@usa.net వద్ద గాని సంప్రదించండి.