అన్నమయ్య సంకీర్తనల్లో కవిసమయాలు

“కవీనాం సమయః కవిసమయః” అని కవిసమయ సమాసానికి విగ్రహవాక్యం. కవుల ఆచరణే కవిసమయం అని అర్థం.
శిష్టసాహిత్యమైన కావ్యాలు, ప్రబంధాలలో కవిసమయాలను ప్రయోగించడముంది. కాని సంకీర్తనా సాహిత్యంలో కవిసమయప్రయోగాలను చూడడం అరుదు. ఐతే అన్నమయ్య సంకీర్తనల్లో ఈ కవిసమయాలను విస్తృతంగా చూడవచ్చు. సంప్రదాయ సిద్ధమైన వాటిని సందర్భానుకూలంగా మలుచుకోవడం, వాటితో సరితూగే కొత్తవాటిని సృష్టించడం స్వతంత్రుడైన అన్నమయ్య రచనల్లో మనకు సాక్షాత్కరిస్తాయి. వాటిలో ప్రత్యేకతను సంతరించుకున్న కొన్నిటిని పరిశీలిద్దాం.

దేవతామూర్తులను ఆపాదకేశాంతం వర్ణించడం ఆచారం. పాదాలను తామరలు, ఎర్రకలువలు, చిగురుటాకులు, పగడాలతో పోల్చడం కవిసమయం. అన్నమయ్య పాదాలను తామరలు, తులసీదళం, చిగురు, చింతకొమ్మ, కూర్మం, సంతముద్రకోల, నాగళ్ళతో పోల్చాడు.

పొంచి తామరపువ్వుల బోలిన పాదాలాతడు
వంచి తుమ్మెదల కొప్పు వడిసోక మొక్కవే (24251)

అని శ్రీనివాసుని పాదాలను తామరలతో పోల్చాడు. తామరలు అందమైనవి, మకరందంతో నిండినవి, ఆస్వాదించే వారి బడలికను పోగొట్టేవి. అట్టివే స్వామివారి పాదాలు. ఆశ్రయించిన వారి అలసటను తీర్చేవి. ఆ తామరలలోని మకరందాన్ని ఆస్వాదించేవి తుమ్మెదలు. తుమ్మెద షట్పది. ఇక్కడ పంచేంద్రియాలు, మనస్సు అనే ఆరు ఇంద్రియాలే పాదాలుగా గల జీవుడు షట్పది. తామర తుమ్మెదల అనుబంధాన్ని ప్రేయసీప్రియానుబంధంగా వర్ణించడం కవిసమయం. అన్నమయ్య జీవుడు భగవంతుడి పాదాలను ఆశ్రయించి శాశ్వతానంద మకరందాన్ని పొంది జీవన్ముక్తుడు కావడమే పరమావధిగా తుమ్మెద తామరల బంధాన్ని మధుర భక్తి విశేషంగా పేర్కొన్నాడు. భగవంతుని దివ్య పాదధూళి శిరసుపై సోకడం దివ్యానుగ్రహం. పాదాలను తామరలతోనూ కురులను తుమ్మెదలతోనూ పోల్చడం కవిసమయసిద్ధం.

పాదాలను చిగురులతో పోల్చడం కూడా కవిసమయం. అయితే అన్నమయ్య దృష్టికి చిగురులను బోలిన అమ్మవారి పాదాలు స్వామి మెడలోని తులసిదండలుగా భాసించడం అపురూపం. స్వామికి సమర్పించే పూజాద్రవ్యాలలో విశిష్టస్థానాన్ని ఆక్రమించింది తులసీదళం. ఈ పోలికతో అన్నమయ్య నాయిక స్వామి కెంత ప్రీతిపాత్రురాలో గ్రహించవచ్చు.

ఆపోలికౌనో కాదో అట్టే నీవు చూచుకోమ్మా
పూపలై వలపులెల్లా పూచినట్లున్నది
తగులుకొనెనో మెడ, దరుణి చూపులెల్లా
అగపడి బాదాల నిగ్గు జెడగట్టెనో అప్పటి
తగియల్లదె తులసిదండ వలె నున్నది (13218)

ఇదొక రతిక్రీడా విశేషం. ఆ సమయంలో సున్నితము, సుకుమారము అయిన చిగురులాంటి అమ్మవారి పాదాలు స్వామి మెడ చుట్టు పెనగొని ఉండడం విశేషం. అందుచేత అవి తులసిమాలలుగా భాసిస్తున్నాయి.

తనను ఆశ్రయించేవారికి గట్టి ఆధారాన్నిచ్చే స్వామివారి పాదాలను చింతకొమ్మలతో పోల్చాడు.

కొనల నీ పాద చింతకొమ్మయే దిక్కు (2146)

చెట్లలో చింతకొమ్మ చాల గట్టిది. ఆ కొమ్మను పట్టుకుని వేలాడే వారికి అది విరిగిపోతుందనే భయం లేదు. స్వామి పాదాలు జీవికి చింతకొమ్మ లాంటివే.

స్త్రీ శరీరంలో ఉన్నతం, ఆకర్షణీయం అయినవి ఏవో అందరికీ తెలుసు. ఇవి కవుల కావ్యాలలో విస్తృత కల్పనలకు ఆలవాలాలు. గుండ్రంగా దృఢంగా వుండే వీటి ఆకృతిని బట్టి కొండలు, కుండలు, కరికుంభాలు, చక్రవాకాలు, తామరమొగ్గలు, పూలగుత్తులు, దబ్బపండ్లు, దానిమ్మపండ్లు, తాటిపండ్లు ఇత్యాదిగా పోల్చడం కవిసమయం. వీటితోనే గాక శంఖం, చక్రం, సంగడాలు, తలగడబిళ్ళలు, మంచంకోటిగుబ్బలు, కిన్నెరకాయలతో కూడ పోల్చడం అన్నమయ్య సంకీర్తనల్లో కనిపిస్తుంది.

చెలియ తన కుచగిరులు శ్రీవేంకటాచలపు
నిలువు శిఖరములనుచు నిధుల నిలిచె (30176)

నాయకుడు వేంకటగిరీశుడు ఎందుకైనాడనడానికి వేరే వివరణ అవసరం లేదు.

చెలుల జవ్వనమెల్లా చేరువ బృమ్దావనము
కలుకు జన్నులు పెక్కు గోవర్ధనాలు (27100)

ఇక్కడ నాయకుడు కృష్ణుడు. ఇక గోవర్ధనాలేవో వూహించుకోవచ్చు.

వీటిని చక్రాల్తో కూడ పోల్చే సంప్రదాయముంది. అయితే సామాన్యుల దృష్టికి అవి బండిచక్రాలైతే అన్నమయ్య దృష్టికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి చేతి సుదర్శనచక్రం!

ఒక్క చక్రమె నీకున్నది గాని యింతి
రెక్కల చక్రాలె పో రెండు గుబ్బలు (1271)

చక్రాలతోనే కాదు, శంఖంతో కూడా.

పడతి గుబ్బలు నీకు పాంచజన్యములుగా
కడివోని మొనలోలి గదియనొత్తి
తడయక మదన యుద్ధమున గెలిచితినంటా
వొడలి చెమటలార నూదితివిగా నీవు (12116)

జెట్టి సాధన కుపకరించే ఇనుపగుండ్లు సంగడాలు. బలిష్టుడు మరింత బలిష్టుడు కావడానికి ఉపకరించే పరికరాలివి. మదనుడి సాముగరిడీ నాయిక శరీరం. అందులోని సంగడాలో?

కాముని సాముగరిడి కాంతపురము
ఆమని చను సంగడాలమరె గాన (29196)

స్త్రీశరీరంలో ఎ్తౖతెనవి వక్షోజాలైతే లోతైనది నాభి. నతనాభిగా స్త్రీని వర్ణించడం కావ్యాలలో సుపరిచితం. నాభిని గుహ, కూపం, పాతాళం, కూపం ఇత్యాదులతో పోల్చడం సర్వసాధారణం. అయితే అన్నమయ్య దృష్టికి అదొక పవిత్రమైన హోమగుండంగా గోచరించడం విశేషం.

మలయు నీనాభి హోమగుండమునను
నెలకొన్న విరహాగ్ని నిండా బోసి
పొలయు నిట్టూరుపుల విసరుచును
వొలుకు జెమటల నాహుతి వోసె నతడు (12288)

నాయిక శరీరమే వేదికగా నాయకుడు జవ్వనయాగం చేస్తున్నాడు. అందులో భాగమే ఇది.

జెట్టి సాధన పరికరమైన బొందెకోలతో చేతులను పోల్చడం అన్నమయ్య సంకీర్తనల్లో ప్రత్యేకం. నాయకుని చేతిలో నలిగిన సుకుమారి అయిన నాయిక

బోరన బట్టేవు చేయి బొందికోలా (29217)

అని నిలదీయడం చూడొచ్చు.

మధురమైన స్త్రీ కంఠస్వరాన్ని కోకిలకూతతోనూ చిలుకపలుకులతోనూ వర్ణించడం మనమెరుగుదుం. ఆ మధురస్వరాలకు నిలయమైన నాయికకంఠాన్ని “కీరపులాయం”గా అన్నమయ్య వర్ణించడం విశేషం.

ఇరవై కీరపు లాయమీపె గళము
సరసపు మాట లెల్ల జరిపె గాన (29196)

లాయమంటే అశ్వశాల. మదనుడి అశ్వాలు కీరాలు. ఆ కీరాలకు నెలవు కీరపు లాయం. మగువ మేనే మదనుడి భాండాగారమట.
కంఠంలోని మధురరాగాలు పెదాల మధ్య నుంచి బయటకొస్తే ఆ పెదాలు పిల్లనగ్రోవులట.

ఇత్తరి శ్రీవేంకటేశ్వరు గూడగ
గుత్తిక లోపలి కోవిలలా
బిత్తరి యధరపు బిల్లగోవిలో
నొత్తి నిలిపి తనివొందించీని (3063)

అందమైన కళ్ళను కలువలు, కమలాలు, చకోరాలు, చాతకాలు, చేపలు, లేడి కళ్ళతో పోల్చడం సంప్రదాయం.

కలువరేకుల వంటి కన్నులాతడు నీపతి
తొలుత నీమోము జందురు జూపవే (24251)

కలువ కళ్ళు గల నాయకుడు తన ప్రేయసి ముఖచంద్ర దర్శనాన్ని ప్రతీక్షిస్తున్నాడు. నాయకుడు సూర్యవంశ సంజాతుడైతే నాయిక కమలాక్షి.

కమలాప్త కులుడ నీ కమలాక్షి నీపాద
కమలములు దలపోసి కమలారి దూరె (26229)

ఇలా సందర్భానుసారంగా కవిసమయాలను వినియోగించుకోవడంలో దిట్ట అన్నమయ్య.

చూపుల బాణాలను విసిరే కళ్ళను రక్షించే కనురెప్పలు అమ్ములపొదులట!

పంచల వాడమ్ములివె పట్టవయ్య కానికె
పొంచి తొంగలి రెప్పల పొది నున్నవి (1235)

కుపిత అయిన నాయిక కళ్ళలో కావిమొయిళ్ళు ఆవరిస్తే నిలువెల్ల చెమటల వర్షం కురుస్తుంది. ఆ నీటిబిందువుల ద్వారా ఎర్రని సూర్యకిరణ ప్రసారం చేత ఏర్పడేదే ఇంద్రధనువు.

ఎలమి బొమ్మల జంకె లింద్రధనువులు వొడిచె
మొలచె గన్నుల గావిమొయిలు ఘనమై
కొలది కగ్గలపు గుంకుమ చెమట నెత్తురులు
పొలతిపై గురియుటకు బోటి వలె నాయె (4100)

విరహిణి అయిన నాయిక కనుబొమలు అరిష్టదాయకములైన ధూమకేతువులట.

పడతి వేనలి జారి పగలు చీకట్లాయ
వొడల బులకల చుక్కలురక పొడమె
తొడరి కనుబొమ్మలనె ధూమకేతువు దోచె
పొడమె నుత్పాతములు పూటపూటకును
పరిగొనుచు విరహంపు పతి సూర్యుడుదయించె (29580)

విరహిణి అయిన నాయిక శరీరంలో కలిగే మార్పులను చూచి ఎటువంటి ఉత్పాతం రానుందో అని చెలుల కలవరమిది. వేనలి (జడ) జారి చీకట్లు కమ్మడం, పులకలనే చుక్కులు పొడమడం, కనుబొమలనే ధూమకేతు దర్శనం, తర్వాత విరహపు పతి సూర్యుడుదయించడం ఇదీ క్రమం.

స్త్రీల ముంగురులు మరుడు పన్నిన గాలాలట.

చింత చేతనిదె చెలియనుదిటిపై
చెంతల జెదరిన చిరునెరులు
కాంత కన్నులను గండుమీలకును
కంతుడు వేసిన గాలములే (12174)

గాలానికి చిక్కిన చేప కాసేపు గిలగిల కొట్టుకుని తర్వాత చేష్టలుడిగిపోవడం కద్దు. అలాగే నాయకునిపై చింతతో నిశ్చేష్టురాలైన నాయిక కళ్ళు ఆమె ముంగురులనే మరుని గాలాలకి చిక్కాయట!

స్త్రీ ముఖాన్ని చంద్రబింబంతో, కొప్పును రాహువుతో పోల్చడం కవిసమయం. అయితే అన్నమయ్య ఈ రెంటిని జత చేసి చమత్కరించడం విశేషం.

పొలతి వదనమను పున్నమ చంద్రుడు
బలిమి నెగయునని భయమునను
మెలుత చికుర ధమ్మిల్లపు రాహువు
తల జెదరగ నిదె దైవమె సేసె (417)

రాహుకేతువులు చంద్ర, సూర్య బింబాలను కబళించడం వల్లే గ్రహణాలొస్తాయని పురాణభావన. నాయిక వదనమనే పూర్ణచంద్రుడు నింగి పైకి ఎగిసిపోకుండా కబళించడానికి సిద్ధంగా ఉన్న రాహువే నాయిక కొప్పట!
పూలతో కూడిన మగువకొప్పు మరుని ఆయుధశాల!

మరుని ఆయుధశాల మగువకొప్పు
తొరలించి విరులెల్లా దురిమె గాన (29196)

మగవారి మనసుల దోచే మగువల కొప్పు మదనుడి బాణాలైన పూలకు నెలవు.

గోపాలుడైన నాయకుడికి గోపిక కొప్పు కొత్తపేయల గూడుగా గోచరించింది.

కొత్తపేయల గూడంటా కొప్పంటేవు (13156)

కొత్తగా పాలు విడిచిన ఆవుదూడ పెయ్య. ఆ పెయ్యదూడ మూపురమే గూడు. నాయిక కొప్పు తనకు సుపరిచితమైన కొత్తపేయల గూడుగా భాసించింది.
కొంటె కృష్ణుడికి సతులకొప్పులు చక్కిలాలు అనే తినుబండారం గంపలా గోచరించడంలో వింత లేదు.

సతుల పెద్దకొప్పులు చక్కిలాల గంపంటా
బతిమాలి వేడీనప్పటి కృష్ణుడు (23206)

జడలుగాటిన కురుల తోడి బాలకృష్ణుడి శిరసు చింతకాయల గంప.

చిన్నిశిశువూ చిన్నిశిశువూ
ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు
తోయంపు గురుల తోడ దూగేటి శిశువు చింత
కాయల వంటి జడలగముల తోడ
మ్రోయుచున్న కనకంపు మువ్వల పాదాల తోడ
పాయక యశోద వెంట బారాడు శిశువూ (41)

స్త్రీశరీరాంగాల్ని వర్ణించడం సాధారణమే గాని పురుషశరీరాన్ని వర్ణించడం అరుదు. అయితే అన్నమయ్య నాయకుడి శరీరాన్ని కూడా రకరకాలుగా వర్ణించాడు.
తరతమ భేదాలు గ్రహించలేని దక్షిణనాయకుడి పాదాలు సంతముద్రకోల.

ఇందరు సతులలోనా యెచ్చుకుందుల చూడవు
సందడి కాలు దొక్కేవు సారెసారెకు
చందమైన నీపాదము సంతముద్రకోలాయ
యిందుకు నేనూ లోనై యిరవుకోవలెనా (13185)

ప్రాచీనకాలంలో సంతల్లో ముద్ర వేయించుకుని సరకు నమ్ముకునే పద్ధతి వుంది. దక్షిణనాయకుడు అక్కడి సతులందరి పాదాలను తన పాదాలతో తొక్కి వాటి విలువను నిర్ణయిస్తుంటే కుపిత అయిన నాయిక ఆవేదన ఇది.

అలమేలు మంగకు నిలయమైన స్వామి ఉరాన్ని ఆమెకు సింహాసనంగా, కమలాల పానుపుగా, జపశాలగా, పొదరిల్లుగా అన్నమయ్య అభివర్ణించాడు. అయితే అదే ఉరము సవతులైన శ్రీదేవి, భూదేవులకు నిలయం గనక నురిపే కళ్ళమయిందట!

ఇక్కువ శ్రీవేంకటేశ యెనసి ఇద్దరివల్లా
అక్కర నురిపే కళ్ళమాయెను నీ వురము (13404)

ధాన్యాన్ని కాళ్ళతో తొక్కి రాల్చే ప్రదేశం నురుపుకళ్ళం. పలువుర కాళ్ళతొక్కిడిని భరించడం దాని లక్షణం. సవతిపోరు లోకవిదితం. ఆ ఇద్దరినీ ఒకచోట చేర్చిన శ్రీనివాసుని ఉరం నురిపేకళ్ళమయింది.

స్త్రీల పెదవులను అందమైన దొండపండ్లతో పోలిస్తే కాముకుడైన నాయకుడి నోటిని బందె యెద్దు మోరతో పోల్చాడు.

జంగిలి కాంతల నెల్లా సంగతులెంచక నీవు
యెంగిలి సేసేవు మోవి యేకము గాను
పంగించ నీ నోరు బందె యెద్దు మోరాయ (13185)

ఎక్కడ బడితే అక్కడ మేసి బందెలదొడ్డికి తోలబడ్డ యెద్దు బందెయెద్దు. విచక్షణారహితంగా అనాగరిక స్త్రీలను సైతం చుంబించిన నాయకుడి నోరు బందెయెద్దు మోర. పలుకాంతలను చుంబించే నాయకుడి పెదాలను గాడిపట్టుగా వర్ణించడం కూడ చూస్తాం.

కాంతలకు నీ మోవి గాడిపట్టు (31451)

పశువులన్నీ కలిసి సామూహికంగా మేయడానికి రాతితో నిర్మించిన తొట్టి గాడిపట్టు. పలువురు స్త్రీల పొందు ననుభవించే నాయకుడి కౌగిలే విడిదిల్లు. శరీరమే దాయిమాను, శిరసే బొడ్రాయి.

పంతమెల్లా నాదె కాక భావించి చూచితేను
యింతులకు మ్రొక్కే నీకు యెమ్మె వున్నదా
ఇంతటి శ్రీ వేంకటేశ ఇట్టే నన్ను గూడితివి
పొంతలనే శిరసిది బొడ్రాయిగదా (31451)

ఊరికి తూర్పు పొలిమేరల్లో వుండే రాయిని బొడ్రాయి అంటారు. సాధారణంగా ఊర్లోకి వచ్చీ పోయే బళ్ళన్నీ బొడ్రాయిని ఒరుసుకుంటూ పోయే సంప్రదాయం రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వుంది. ఈ బొడ్రాయితో నాయకుడి శిరసుకు పోలిక.
అయితే ఈ నిందలన్నీ కుపిత అయిన నాయిక నాయకుణ్ణి నిందించిన సందర్భాలే.

అన్నమయ్య మాత్రం తన చేతిలోని వీణను మీటుతూ శ్రీవేంకటేశ్వరుణ్ణి కీర్తించడమే కాదు, తన తనువునే వీణ వొళవుగా మార్చిన తీరు అద్భుతం, అనన్యం.

పాడేము నేము పరమాత్మ నిన్నును
వేడుక ముప్పది రెండు వేళల రాగాలను
తనువే వొళవు తలయే దండెకాయ
ఘనమైన వూర్పులు రెండు కట్టిన తాళ్ళు
మనసే నీ బద్దితాడు మరి గుణాలే జీవాళి
మొనసిన పుట్టుగే మూలకరడి (9178 )

భగవంతుడికి నిత్యపూజ లర్పించడం మానవధర్మం.

పలుకే మంత్రమట పొందైన నాలుకే
కలకలమను పిడిఘంటయట (282)

భగవంతుని కీర్తించే నాలుక గుడిలోని ఘంట. భగవంతుని చేరని మానవజీవితం వ్యర్థం.

మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినము దుఃఖమందనేలా (1196)

బూరుగ మాకున జెందిన కీరము చందమున
ఆరయ నిష్ఫలమగు మరి యన్యుల జేరినను (1194)

మధురఫలాలను ఆస్వాదించే చిలక శుష్కమైన బూరుగఫలాలను చేరడం లాగా భగవంతుణ్ణి ఆశ్రయించక అన్యుల్ని ఆశ్రయించడం వ్యర్థం.