2003 తానా కథాసాహితి కథనవలల పోటీ బహుమతి విజేతల సమీక్ష

కథా సమీక్ష

ఈ పోటీలో బహుమతులందుకున్న కథలన్నీ సమకాలీన పరిస్థితుల్ని విశ్లేషించేవే అయినా ఎంచుకున్న కథాంశాల్లో భిన్నత్వం ఉన్నవి. కష్టాల ఊబిలో కూరుకొని పోయి, దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు సైతం పాల్పడుతున్న రైతుల జీవన నేపధ్యం ఒక కథది అయితే, బ్రతుకు బరువై, నమ్ముకున్న తనవాళ్ళే పరాయివాళ్ళలా ప్రవర్తించడంతో జీవన పోరాటంలో ఓటమి నంగీకరించిన స్త్రీ కథ మరొకటి. వాద దృక్పధంతో స్త్రీ జాతి విముక్తికి ఆర్ధిక స్వాతంత్య్రం ఒక్కటే సరిపోదని చెప్పడానికి ప్రయత్నించిన కథ ఒకటైతే, జీవచ్ఛవమైన భర్తకు శుశ్రూష చేస్తూ, సేవాతత్పరత, దయాపరత వల్లనే ప్రపంచంలో శాంతి సాధ్యం అని చెప్పగోరిన కథ ఇంకొకటి. ఇలా మనచుట్టూ ఉన్న సమాజాన్ని అనేక కోణాల్నుండి పరిశీలించిన ఈ కథలన్నీ కూడా తమదైన కథనశైలితో మనల్ని చదివింపచేసేవే, ఆలోచింపచేసేవే. కానీ, ఈ కథలన్నింటిలో ఏ ఒక్క కథ కూడా మన మనసుల్లో చెరగని ముద్ర వేసేదిగా లేదు. విషయ అవగాహనా లోపమో, శైలీ శిల్పాలపై తగినంత శ్రద్ధ చూపించకపోవడమో, కథనంలో ఒడిదుడుకులో, అసహజమైన సంఘటనల పేర్పులో ఇలా ఏవో కారణాల వల్ల ఈ కథలన్నీ బలహీనం కావడం నిరాశ కలిగించే విషయం.

మొదటి బహుమతి కథలు

నందిని– అక్కిరాజు భట్టిప్రోలు: ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి కథ. ఇది చదువుకున్న, అన్ని రకాల స్వాతంత్య్రాలు కలిగిన, ఆడపిల్ల కథ. తన సిద్ధాంతాలపై గట్టి నమ్మకం కలిగి వుండటం, ఆ నమ్మకాలపై తను నిలదక్కుకోగలనన్న ధైర్యముండటం, మన వివాహ వ్యవస్థను అంగీకరించకపోవటం, తన శరీరాన్నీ, ఆలోచనల్నీ, జీవితాన్నీ ఎవరిష్టం కోసమో ఆడించడం తనకు కుదరని పని అని నిస్సంకోచంగా చెప్పడం, ఆకలీ దాహం లాగానే సెక్సు కూడా తనకు అవసరమే అని నిరభ్యంతరంగా ఒప్పుకోవడం, ఇష్టపడితే ఎవడితో కావాలంటే వాడితో పడుకోగల్ననడం, కావాలంటే పిల్లల్ని కంటాననడం, తన ఒళ్ళు తన ఇష్టం అనడం ఇవన్నీ నందిని పాత్రకు పునాది రాళ్ళు ఈ కధలో. ఐతే, కథాంతంలో వివాహానికి ఒప్పుకున్న నందినిలో అంత మార్పు ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకు వచ్చే సమాధానాలు రచయిత ముందునుంచీ గట్టిగా చెప్పటానికి ప్రయత్నించిన విషయాలకు విరుద్ధంగా ఉన్నాయన్న అనుమానం వచ్చి, చివరకు రచయిత ఉద్దేశమేమిటో మనకు అంతు పట్టదు.

కథలో క్రొత్తదనం వుంది. మొదటినుండి చివరదాకా చదివించిన కధ ఇది. రచయిత చెప్పదలిచిన విషయాన్ని సూటిగా చెప్పినా ఆ తొందరలో కథనాన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. ఈ కథలో అక్కడక్కడా కొన్ని చమత్కారమైన సంభాషణలున్నాయి. పాత్ర పోషణ చక్కగా ఉంది. సంభాషణలపై ఆధారపడిన కధ ఇది. కధలో అనవసరమైన వాదనలు ఉండటం, ఉన్న వాదనలు కూడా పేలవంగా ఉండటం ఈ కథలో లోపం. రచయిత కథ గురించి మర్చిపోయి సందేశపు తపనలో పడటంతో కధ అప్పుడప్పుడు వ్యాసంలాగా మారింది.

మిత్తవ– మంచికంటి వెంకటేశ్వర రెడ్డి: స్థూలంగా చూస్తే ఇది కరువు కథ. హత్యల, ఆత్మహత్యల కథ. అయితే అంతకుమించి ఇది గోయిందమ్మ కథ. గొడ్డులా చాకిరీ చేసి పొలాన్ని పండించి గుట్టుగా సంసారాన్నీదుకొచ్చే కష్టజీవి గోయిందమ్మ. తిండిగింజ దొరకని కరువుకి తోడు మొగుడు అయిపూ అజా లేకుండా పోవటంతో పొట్ట నింపుకునే దారి కానక పిల్లల్ని తీసుకుని పుట్టింటికి చేరి, అక్కడా అవమానాల పాలవడంతో పిల్లల్ని చంపి తానూ ప్రాణాలు తీసుకున్న అభిమానవతి గోయిందమ్మ. విఛ్ఛిన్నమయే కుటుంబ సంబంధాలకి దరిద్రం ఎట్లా కారణమవుతుందో చెపుతుందీ కథ.

కరువు నేపథ్యం కథ అంతటా మిత్తవలా పరుచుకుని కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బస్సు ప్రయాణంలో ఎదురయ్యే కరువు దృశ్యాలు పాఠకుడిని ఒకంతట వదలవు. ముగింపు జాలిగొలిపేదిగా ఉండక భయానక చిత్రంగా మిగిలి, వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని బతుకుతున్న అభాగ్యుల భవిష్యత్తుని తలుచుకుని వొణికేలా చేస్తుంది. కథ ఉపన్యాసాల జోలికి వెళ్ళదు. ఏదో నిరూపించాలని తాపత్రయమూ పడదు. అందువల్ల కథలో మనకి రచయిత కనిపించి ఇబ్బంది పెట్టడు. అయితే, అపరిశుద్ధమయిన తాగునీరూ, దాని వలన కలిగే అనారోగ్యాలూ వీటి ప్రసక్తి వరకూ బాగానే ఉన్నప్పటికీ, సీను కొడుకు చావు కథకు పెద్దగా దోహదపడినట్టు కనిపించదు. ఎంత కష్టానికయినా వెనుదీయని గోయిందమ్మ అంత తేలికగా చావుకి వొడిగట్టటానికి కారణం బలంగా చిత్రించబడలేదు. చివరికి ఆమె తల్లి కూడా చనిపోవటం కృతకంగా కనిపిస్తుంది. కరువు చిత్రాన్ని గొప్పగా చూపించినా కథావస్తువులో గాఢతను వ్యక్తీకరించడంలోనూ, పాత్రపోషణలోనూ ఇంకొంత పరిణతి అవసరం.

హాలాహలం– వి.ప్రతిమ: నాగలి పట్టిన రైతు జీవితంలో చిమ్ముతున్న విషాన్ని ఉద్దేశిస్తూ రాసిన కథ. ఇది హేమ కథ. సన్నిహితుడూ, సున్నిత మనస్కుడూ అయిన దయాకర్‌ ఆత్మహత్య ఆమెను తీవ్రంగా బాధిస్తుంది. రైతుల జీవితాల్లో నిండుకున్న సంక్షోభం గురించి లోతుగా ఆలోచించేలా చేస్తుంది. నేలతల్లిపై ఉన్న మమకారాన్ని ఒదులుకోలేకా, కృంగతీస్తున్న ఆర్ధిక పరిస్థితుల్ని తట్టుకోలేకా సతమతమౌతున్న రైతుల ఆవేదన ఆమెను కదిలించివేస్తుంది. నిరాదరణకూ, అవమానాలకూ గురౌతున్న వారి దుస్థితికి కారణాలను వెతుకుతుంది. ఈ కొత్త అవగాహన హేమ దృక్పధంలో తెచ్చిన మార్పుతో కథ ముగుస్తుంది.

కథాంశం చిరపరిచితమే ఐనా కథనంలో నూతనత్వం ఉంది. రైతుల చుట్టూ కమ్ముకుంటున్న ఆర్ధిక మాయాజాలాన్ని పొగమంచు గానూ, వారిని కదులుతున్న శవాలు గానూ కల్పిస్తూ మొదలయ్యే ఈ కథ చివరివరకూ చక్కగా సాగుతుంది. ప్రత్యేకించి, హఠాత్తుగా సన్నిహితులెవరైనా చనిపోయారన్న వార్త మనసులో కలిగించే స్తబ్ధతనూ అగమ్యతనూ రచయిత్రి కథలో మనసుకు తట్టేలా చూపించిన తీరు బాగుంది. అలాగే, శవజాగరణ సమయంలో ఇంటిలో నెలకొన్న వాతావరణాన్నీ, కుటుంబ సభ్యుల పరిస్థితినీ ప్రవర్తననీ అత్యంత సహజంగా వర్ణించిన పద్ధతి రచయిత్రి సునిశితమైన పరిశీలనా దృష్టికి అద్దం పడుతుంది. కానీ, ఆత్మహత్యకు నిజమైన కారణాలని లోతుగా చర్చించకుండా చేసిన ఆరోపణల వల్లనూ, ఈ పరిస్థితి ఎప్పుడో మారకపోదు అన్న అస్పష్టమైన పడికట్టు ముగింపు వల్లనూ, ఈ కథ కొంచెం పేలవంగా ముగిసింది.

రెండవ బహుమతి కథలు

అతడు, నేను– కె. వరలక్ష్మి: విభిన్నమైన కథాంశం, చక్కటి కథనంతో అతడునేను అన్న కథ, అక్కడక్కడా “టీవీలో వారు ఇలా అంటున్నారు, పుస్తకంలో వీరు ఇలా అన్నారు ” అంటూ ఇరికించిన ఘటనలు కథను ముందుకు నడిపేవిగా లేకుండా పంటికింద రాయిలా తగుల్తున్నా, చివరిదాకా చదివిస్తుంది. కానీ రచయిత్రి చెప్పదల్చుకొన్న విషయం కథాంతంలో సంభాషణల ద్వారా చెప్పవలసిరావటం ఎబ్బెట్టుగా ఉండి, కథానాయికలో అనుగతంగా వచ్చిన మార్పు నిజమైనదో ఆత్మస్తుతో అన్న ప్రశ్న మనలో మిగల్చడంవల్ల కథ చివరికి తేలిపోయింది. కానీ, ఈ కథలో వాతావరణ కల్పన, కథాస్థలాన్ని మనకళ్ళముందు నిలిపేదిగా చెయ్యడం రచయిత్రి ప్రతిభకు నిదర్శనం.

ఆ ఇల్లు మూతపడ్డది: పెద్దింటి అశోక్‌ కుమార్‌: ఈ కథలో క్రమక్రమంగా బడుగు రైతు జీవితం చుట్టూ ఉచ్చులా బిగుసుకుంటున్న షావుకారు అధికారాన్ని చాలా చక్కగా వర్ణించిన విధానం పాఠకుల్ని ఆకట్టుకుంటుంది. ఏ హెచ్చుతగ్గులూ లేకుండా చివరిదాకా ఒకేలా చదివించే కథనం ఈ కథలో ఇంకో మంచి గుణం. కానీ, చివరికి రైతు తన సొంతంగా తీసుకున్న నిర్ణయాలవల్లే బానిసైనాడు తప్పితే షావుకారు దుష్టత్వం వల్ల కాదనీ, చివరికి నష్టపోయింది షావుకారు కూడానూ అనీ పాఠకులకు అనిపించేలా ఉండటం కథనంలో లోపమే. వ్యవసాయం తప్ప లౌకిక జ్ఞానం లేని రైతును షావుకారు తన వ్యాపార దక్షతతో లొంగదీసుకున్నాడని సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించినా, దాన్ని ప్రస్ఫుటం చెయ్యడంలో రచయిత సఫలీకృతులు కాలేక పోయారని చెప్పక తప్పదు. ఈ ఆర్థికసంబంధ మూలాలగురించి రచయితకు లోతైన అవగాహన కానీ, తాత్విక దృక్పథం కానీ లేవన్న అనుమానం కలుగుతుంది.

చలివేంద్రం– జాతశ్రీ : ప్రజలకు దగ్గర ఔదామనే ప్రయత్నంలో భాగంగా పోలీసు శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో చిత్తశుద్ధి లేదని చూపించడానికి రాసిన కథ చలివేంద్రం. మంచి శైలితో రాయబడి చాలా సహజంగా ఉన్న కథే అయినా, పల్లెలో కుమ్మరి జీవితాన్ని చాలా చక్కగా వర్ణించినా, అది కథలో చెప్పదలచుకున్న విషయానికి ఏమాత్రమూ సహకరించలేదు. అదేవిధంగా, కథ ముగింపులో సంఘటనలు కూడా కృతకంగా, కేవలం పోలీసు వారిని దుయ్యబట్టటానికే రాసినట్లుండడంతో, రచయిత చెప్పదలుచుకున్న అసలు విషయం మరుగున పడిపోయింది.

నవలా సమీక్ష

మనోప్రస్థానం- చంద్రశేఖర ఆజాద్‌: మనిషి పుట్టినదాదిగా ఎన్నో పరిస్థితుల ప్రభావాలకు లోనుగావడం సహజం. జీవితంపై ప్రతీ సంఘటన యొక్క ప్రభావం విలక్షణమైనదే అయినా, కొన్ని కొన్ని సంఘటనలు జీవితంపై చెరగని ముద్ర వేస్తాయి. మనిషి జీవితకాలంలో జరిగే మానసిక పరిణామం ఈ విభిన్న సంఘటనల ప్రభావాన్నుండి ఉద్భవిస్తుందని వివరించడానికి ఈ నవల ప్రయత్నిస్తుంది.

అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన కథానాయకుడు తండ్రి మరణం ద్వారా కుటుంబంలో కలిగిన శోకానికి, తనలో కలిగిన వెలితికి ప్రభావితుడై ప్రపంచంలో అన్నీ అసత్యాలని, మృత్యువు ఒక్కటే నిజమనే నమ్మకానికి లోనవుతాడు. చావు కలిగించిన ఎడబాటులోని శాశ్వతత్వాన్ని జీర్ణించుకో లేకపోతాడు. ఈ అనుభవం జీవితాంతం అతణ్ణి వెంటాడుతూనే ఉంటుంది. స్వతహాగా భావుకుడు కావడంతో తన జీవితంలో తారసపడిన వ్యక్తుల ఎడబాటు అతనికి చావులోని శాశ్వతత్వాన్ని గుర్తుకుతెస్తూ ఉంటుంది. అయితే, ఒక్కో ఎడబాటు ఒక నూతన అనుభవానికి నాందికాగా, సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలోని అనుభవాలు ఒక్కొక్కటి ఒక్కో ముద్రై మృత్యువుపై తన దృక్పధాన్నే మారుస్తాయి. మృత్యువుని జయించాలన్న చిన్ననాటి అమాయకపు కోరికకు ఒక తాత్విక సమాధానం దొరకడంతో కథ ముగుస్తుంది.

మృత్యువును గురించిన తాత్విక చింతన అనాదిగా వస్తున్నదే. అయితే ఆ తాత్విక చింతనకు ఒక జీవిత కాలపు సంఘటనలను జోడించి ఒక నిర్దుష్టమైన ఆకృతి తీసుకు రావడానికి ప్రయత్నించిన రచయిత అభినందనీయులు. నవల పూర్వార్ధం చక్కని భాషతో కవితా శైలిలో సాగింది. అయితే నవల మొదటి సగభాగంలోని సంఘటనల్లో ఒక్కొక్క అనుభవంతో క్రమంగా చైతన్యవంతమవుతూ సజీవంగా కనిపించిన కథానాయకుని పాత్ర తరువాత ఘట్టాల్లో నిర్జీవంగా కనిపించింది. మొదటిభాగంలో ప్రస్తావించిన ముద్రలు కథానాయకుని తరువాయి జీవితంపై చూపించిన ప్రభావం అస్పష్టంగా ఉంది. కథను ప్రారంభించడంలోను, అభివృద్ధి చెయ్యడంలోను రచయిత చూపిన శ్రద్ధ, కొనసాగింపులోను, ముగింపులోను తీవ్రంగా లోపించింది. మొదటి సగంలో ఉన్న ఘట్టాలన్నీ ఎంతో సహజంగా చిత్రించిన రచయిత, ఉత్తరార్ధంలో వాటిని బలవంతంగా ఇరికించినట్లున్నారు. దీనికి కథా వస్తువులో లోపం కంటే రచయిత నిర్లక్ష్యమే కారణమనిపిస్తుంది. లేదా తాను ప్రస్తావించిన తాత్విక సమస్య పట్ల రచయితకు ఉన్న అవగాహనాలోపం కూడా కారణమా అన్న అనుమానం కూడా వస్తుంది. ముగింపు మరీ “ఐదవగానే డెస్క్‌ వదిలేసే ఆఫీసు ఉద్యోగి” లా హడావిడిగా సాగిపోయింది. చక్కని కథావస్తువు, మంచి కవితాశైలితో ప్రారంభమైన నవల చివరి వరకూ శ్రద్ధ తీసుకుని వ్రాసినట్లైతే ఒక మంచి రచనగా తెలుగు పాఠకులకు దక్కేది.

ఆఖరుగా

మనల్ని పట్టి ఊపేసి, మన అస్థిత్వాన్నీ, దాని అర్ధాన్నీ, ప్రయోజనాన్నీ ప్రశ్నించే సంఘటనలే మన రచనలకి ఆధారం. మన మనసులో రేగే అనుభవాల అనుభూతుల అల़జడిని పదిమందితో పంచుకోడమే రచన. కానీ, మనం చెప్పదలచుకున్నది చెప్పాక పాఠకులు మనలాగే ఆ అల़జడిని తమలో నింపుకోగల్గుతున్నారా అనేది ప్రతీ రచయిత రచయిత్రి తనని తాను ప్రశ్నించుకోవాలి. అలా చెప్పగల్గాలంటే తాను చెప్పదలచిన విషయంపై అచంచలమైన నమ్మకమూ, లోతైన అవగాహనా ఉండాలి. అదేవిధంగా అనుభూతికి నిర్దిష్టమైన రూపాన్నిచ్చే పనిముట్లు సమకూర్చుకోవడం ఒక ముఖ్యమైన అవసరం. ఇవన్నీ కూడా కొంచెం శ్రమ పడితే పొందుపర్చుకోగల్గినవే. ఆమాత్రం కష్టం మన రచయితలూ, రచయిత్రులూ పడగలరనీ ఆశిస్తూ, ఆ శ్రమను సాహిత్యాభిమానులు గుర్తించి అభినందించగలరనీ విశ్వసిస్తాము.