అస్తిత్వానికి అటూ యిటూ …

తన ముందున్న గుంపును రెండు చేతుల్తోనూ పక్కకు తొలగించుకుంటూ కంపార్టుమెంటు గేటు ముందుకెళ్ళి “సంజీవీ! .. సంజీవీ!” అంటూ మరోసారి అరిచాడు జానీ.

“జానీ .. యిక్కడ .. నేనిక్కడ..” అన్న సమాధానం వినవచ్చింది. గేటులోంచి కిందికి దిగిన లావుపాటి ఆకారం వెనకనుంచి వోచేత్తో సూట్‌కేసూ, మరోచేత్తో జిప్‌బాగూ పట్టుకుని, సన్నగా, రివటలా వున్న శరీరం ప్లాట్‌ఫాం పైకి దూకింది.

“యేదీ ఆ బాగ్‌ నాకియ్యి” అంటూ బలవంతంగా మిత్రుడి చేతిలోని బరువును అందుకోబోయాడు జానీ.
“అది వద్దు .. యీ సూట్‌కేసు తీసుకో” అని కంగారుగా అరిచాడు సంజీవి జిప్‌బాగ్‌ను గుండెలకత్తుకుంటూ.
“ప్రయాణాలు చేసేటప్పుడు డబ్బును అండర్‌పాకెట్‌లో దాచుకోమని యెన్నిసార్లు చెప్పినాను నీకు! యీ రష్‌లో ఎవరైనా జిప్‌బాగ్‌ను లాక్కొనిపోతే యేం చేస్తావ్‌” అంటూ దాన్ని లాక్కోబోయాడు జానీ.
“వద్దొద్దు..” అని ప్రాణమంతా వుగ్గపట్టుకుని అరిచాడు సంజీవి. జానీ విస్తుపొయి చూస్తూ వుండగా, “డబ్బు పాకెట్లోనే వుంది. నువ్వీ సూట్‌కేసు తీసుకో ముందు ..” అన్నాడతను తమాయించుకోడానికి ప్రయత్నిస్తూ.

నలుపురంగు మఫ్లరూ, స్వెట్టర్లతో చీకట్లో కలసిపోతున్న మిత్రుడి ఆకారం కేసి చికిలిచూపుల్ని సారించి, దేనికోసమో వెదుకుతున్నట్టు పైకీ కిందికీ కలయజూశాడు జానీ. అంతలో తేరుకుని మెల్లగా నవ్వేస్తూ “యీ అర్థరాత్రి ప్రయాణం అలవాటులేక యెక్కడో పడినిద్రపొయినావనుకుంటిని. బోగీలోకెక్కి, సీటు కనిపెట్టి, బయటికి మోసుకోని రావల్సిందేనేమో ననిపించింది ..” అన్నాడు.

ప్లాట్‌ఫాం పైన నడుస్తున్న జనాలకు దారివ్వడం కోసం దూరంగా వచ్చి నిల్చున్నాక “నిద్రనేది పోతే గదా మేల్కొనేదానికి! బెర్త్‌లు వాల్చుకున్నామనే మాటేగానీ పాసెంజెర్లు నిద్రే పోలేదు. పన్నెండు గంటల నుంచీ అలహాబాదొచ్చేసిందొచ్చేసిందని ఆపసోపాలు పడతానే వున్నారు” అన్నాడు సంజీవి.
“సరే, అయితే త్వరగా బయటపడదాం పద! యిప్పుడు గంట మూడు కావస్తా వుంది. రూం చేరుకుంటే గంటయినా కునుకు తీయచ్చు” అంటూ అతగాణ్ణి ముందుకు లాగాడు జానీ.
స్నేహితుడి చేతిని పక్కకు తొలిగిస్తూ “వుండుండు. మనమిప్పుడు మీరూంకు పోవడం లేదు. నాకోసరం మనిషిని స్టేషనుకే అంపిస్తానన్నాడాయన” అన్నాడు సంజీవి. “యెవరు? యెవరిని?” అన్న ప్రశ్నలు జానీ పెదవుల మధ్య నుంచీ దొర్లకమునుపే వెనక్కు తిరిగి, “ఆ పక్కన ఎవురో అరస్తా వుండారు చూడు” అన్నాడతను.

వొకటి రెండు నిముషాల తర్వాత “లక్ష్మీనారాయణశాస్త్రి” అన్న మాట వినిపించింది. మరో రెండు నిముషాల తర్వాత మరింత బిగ్గరగా అదేమాట వినవచ్చింది. యింకో రెండు నిముషాల తర్వాత ఆమాటను ప్రసారం చేస్తున్న వ్యక్తి సైతం ముందుకు వచ్చేశాడు.

దాదాపు ఆరడుగుల పొడవున్న బలిష్టమైన ఆవ్యక్తి వయస్సు చీకటిలో స్పష్టంగా గోచరించడం లేదు. పొడవాటి లాల్చీకింద గోచీపోసి కట్టుకున్న పంచె, బాగా పొట్టిగా కత్తిరించుకున్న తలవెంట్రుకల మధ్య పొడవాటి పిలక. చేతిలో గొడుగు. పహిల్వాన్‌లా కనిపిస్తున్న ఆవ్యక్తి ముందుకు గెంతుతూ “నేనే! నేనేనండీ లక్ష్మీనారాయణశాస్త్రి గారి గెస్టును” అన్నాడు సంజీవి.
అతను తన నడక వేగాన్నయినా తగ్గించకుండా, గొడుగును ముందుకు చాపుతూ, “దేఖియే! వుస్‌ బంబాకేపాస్‌ ఖడే హోజాయియే! సబ్‌లోగ్‌ వహీ యింతెజార్‌ కర్‌రహే హై!” అంటూ ముందుకు కదలిపొయాడు.

జానీ ముఖం ముడుచుకుని సంజీవి వెంట నడుస్తూ “యీ లక్ష్మీనారాయణశాస్త్రి యెవురు?” అని అడిగాడు.
“మా కొలీగ్‌కు తెలిసిన మనిషి. యిక్కడే అలహాబాదులో వుంటాడు. నేనొస్తా వున్నట్టుగా ముందుగా జాబు రాసినాను. ఆయన నేరుగా ఫోన్‌ జేసినాడు. వాళ్ళ యింటికే వచ్చేయమన్నాడు. పన్లన్నీ ఆయినే దగ్గిరుండి జరిపిస్తానన్నాడు” అన్నాడు సంజీవి.

జట్లుజట్లుగా నిలబడ్డ జనాల్ని దాటుకుంటూ వోగుంపు దగ్గరికొచ్చాక “లక్ష్మీనారాయణశాస్త్రి … లక్ష్మీనారాయణశాస్త్రి” అంటూ తన కోడ్‌ సందేశాన్ని వినిపించాడు సంజీవి. వాళ్ళు పట్టించుకోకుండా అతడికి అర్థంకాని వేరేభాషలో మాట్లాడుకోసాగారు. “ఆపెద్దమనిషి చెప్పిన తావు యిదిగాదేమో!” అని గొణుక్కుంటూ మరోగుంపు దగ్గరికి వెళ్ళి, మరోసారి తనకోడ్‌ను పలికాడతను. “మేమూ అక్కడికే! లక్ష్మీనారాయణశాస్త్రి … అక్కడికే! అక్కడికే!” అంటూ కొన్ని గొంతుకలు వంత పలికాయి. మరికొంచెం పక్కకు జరిగి, ఆగుంపులో కలిసిపొయే ప్రయత్నం చేశాడు సంజీవి. తానూ వచ్చి అతడి పక్కన నిల్చుంటూ వాళ్ళనందర్నీ పరీక్షించి చూడసాగాడు జానీ. మూటలూ, మనుషులూ, చీకటీ, మసకవెలుతురూ కలగలసిన ఆసమూహంలో ఎవరెవరు యేమిటో తెలుసుకోడానికి విశ్వప్రయత్నం చేయసాగాడు. యీలోగా గొడుగు పట్టుకున్న హిందీమనిషి ఆగుంపు ముందే పెద్దపెద్ద అంగలు సారిస్తూ మరోవైపుకు దూసుకెళ్ళాడు. గుంపుగుంపంతా వొకేగొంతులా “యిక్కడ .. యిక్కడ .. మేమిక్కడ” అంటూ హోరెత్తింది. అతనూ అదేజోరుతో “వహీ రహియే!” అని అరుస్తూ వెళ్ళిపొయాడు. యీలోగా మరికొన్ని నీడలు ఆగుంపులో కలిశాయి.

“యింతమంది అతిథులూ వొక యింటికేనా?” అంటూ ఆశ్చర్యపొయాడు జానీ.
యీలోగా సమూహంలోని వ్యక్తులు కొందరు పరస్పర పరిచయాలు మొదలుపెట్టారు. తిరుపతి, గుంటూరు, వరంగల్లు, కాకినాడ, ఆదోని, అనంతపురం వివిధప్రాంతాలకు చెందిన వూరిపేర్లు వినబడుతున్నాయి.
మరికాస్సేపటి తర్వాత గొడుగుపహిల్వాను తిరిగొచ్చాడు. “సబ్‌ టేషన్‌కే బాహర్‌ చలియే! వహాసే ఆటోమే జానాహై” అంటూ ఫర్మానా జారీచేశాడు. అతడివెనకే గుంపంతా కదిలింది. సంజీవితో బాటూ జానీ గూడా నడవసాగాడు.
యెక్కువమంది ప్రయాణీకుల్ని అలహాబాదులోనే విడిచేసిన వారణాసి యెక్స్‌ప్రెస్‌ ప్లాట్‌ఫాం పక్కన యింకా నసుగుసులు పడుతోంది. పక్కనే చాయ్‌వాలాలు సుప్రభాతం పలుకుతున్నారు. వోవర్‌బ్రిడ్జి పైన్నుంచీ చూస్తున్న జానీకి తెలుపూ, యెరుపూ, ఆకుపచ్చ దీపాలతో జోగుతున్న రైల్వేస్టేషను, పగటివేషగాడి చమ్కీదుస్తుల్లా వెలవెలబోతూ కనిపిస్తోంది. తెలుగుభాషనే మాధ్యమాన్ని వూతగా పట్టుకుంటూ లక్ష్మీనారాయణశాస్త్రిగారి అతిథులందరూ స్టేషను బయటకు తరలివచ్చేశారు.

మంచులో తడిసిన చిత్తడి నేలపైన పెద్దపెద్ద ఆటోలూ, గుర్రపుబండ్లూ అడ్డదిడ్డంగా వేచి వున్నాయి. గొడుగుపహిల్వాను అస్పష్టమైన గొంతుకతో ప్రయాణీకులకేవో సలహాలు చెబుతున్నాడు. జట్లుజట్లుగా వాళ్ళు పెద్దసైజు ఆటోల్లోకి బదిలీ అవుతున్నారు.

ఆటో చిన్నసైజు వానులాగుంది. మూడువరసల సీట్లు. సీటుకారుగురు మనుషులు. వాహనమంతా స్ప్రింగుల సంచయంలా వూగుతుండగా బడబడమని శబ్దం చేస్తూ ఆటో బయల్దేరింది. “విక్రమ్‌ అంటార్లే యీ ఆటోను యీవూళ్ళో!” అంటూ సంజీవికి దాన్ని పరిచయం చేశాడు జానీ.

నిద్రపోతున్న రోడ్లవెంట విక్రమ్‌ పరుగులు తీయసాగింది. ముందుగా వెళ్తున్న ఆటోల తాలూకు యెర్రటి లైట్లు మంచుతెరల మధ్య మినుకుమినుకుమంటున్నాయి. రోడ్లకిరువైపులా ముసుగులు కప్పుకున్న వ్యక్తుల్లా యిండ్లు గూడా నిద్రలో కునుకుతున్నాయి. విశాలమైన వీధుల్ని దాటి, సన్నటి సందుల్లోకి దూరింది విక్రమ్‌. నేలపైన యిటుకలు పరిచిన సన్నటిగొందులు .. రెండువైపులా పెచ్చులూడిన పాలకాలపు యిండ్లు … బాగా పల్లంగా కనిపిస్తున్న దారి … వీధి దీపాలు వెలగడం లేదు. యెక్కడికి వెళ్తున్నామో అంతుపట్టని అగమ్యగోచరమైన దారి… చివరికి యిద్దరువ్యక్తులు మాత్రం నడవడానికి వీలయ్యే సన్నటిగొంది ముందు వరసగా విక్రమ్‌లు ఆగిపొయాయి. అంతటితో తమ పని అయిపొయినట్టుగా విక్రమ్‌ డ్రైవర్లు తిరిగి వెళ్ళిపొయారు.
“యెక్కడికి పోతావుండాం మనం? యిక్కడేం పని మనకు?” అంటూ ప్రశ్నించాడు జానీ అందోళనతో నిండిన గొంతుకతో. అతడి మాటల్ని పట్టించుకోకుండా “మనమూ పోదాం రా” అంటూ తోటిప్రయాణీకుల్ని అనుసరించసాగాడు సంజీవి.

యేటవాలుగా, పెద్ద అగడ్తలోకి లాక్కెళ్తున్నట్టున్న సన్నటి వీధి. రెండువైపులా పాడుబడిన పాతయిండ్లు…  యెక్కడా దీపాలు వెలగడం లేదు. అయిదునిముషాలలా నడిచిన తర్వాత వోమలుపులో చిన్న గుడ్డి విద్యుద్దీపం కనిపించింది. దానిముందు ప్రయాణీకుల సంరంభమూ వినిపించింది. ముందుగా గుడ్డిదీపం కింద, పాతకాలపు గారమిద్దె పైన, రంగులు వెలిసిపొయిన చెక్కతలుపుల పక్కన, బాగా నొక్కులు పడిన రేకు పైన, వంకరటింకరగా, తప్పులతడకగా వున్న తెలుగు అక్షరాలు జానీ దృష్టిని ఆకర్షించాయి. “ప్రనామం హయిగ్రీవశాస్త్రుల ధర్మసత్రము … క్షీరోద్రము లక్ష్మీనారాయణశాస్త్రులు .. ఆంధ్రపండా; .. తీర్థపురోహితులు ..”

పొట్టిగా వున్న పాతకాలపు ద్వారం గుండా, సంజీవి వెంట యింటిలోపలికి అడుగుపెట్టాడు జానీ. అది చేయెత్తితే తగిలేట్టున్న చిన్న గది. మూడువైపులా ద్వారాలున్నాయి. వోద్వారం గుండా ముందుకెళ్ళారిద్దరూ. సన్నగా పొడవాటి సొరంగం లాంటి మార్గం. మరోగది. తర్వాత మరోసన్నటిదారి. మరో పాతబడిన గుమ్మం దాటగానే పెద్దనడవా. మధ్యలో ఆకాశం కనిపిస్తోంది. దాదాపు యిరవై అడుగుల పొడవూ వెడల్పులతో పెద్ద వసారా. చుట్టూ రకరకాల గదులు… పెచ్చులూడిపొయిన వసారా గారనేలపైన రకరకాల చెత్తాచెదారం… మురికినీళ్ళ వెల్లువలు… నడవా అరుగు పైన కూర్చున్న గొడుగుపహిల్వాను పెద్దపెద్ద తాళాల గుత్తి చేతబట్టుకుని, చుట్టూమూగిన జనాల్ని గదమాయిస్తున్నాడు. “మాకోగది .. మాకూ వొక రూం … మారూమేడయ్యా?” అంటూ గొంతుకలు అతడ్ని ప్రాధేయపడుతున్నాయి.

జిప్‌బాగ్‌తో సహా గుంపులోకి జొరబడి, అతిప్రయత్నం పైన అతగాడిని సమీపించాక “లక్ష్మీనారాయణశాస్త్రి గారెక్కడ?” అని అరిచాడు సంజీవి.
అతను సంజీవి వైపు తిరిగైనా చూడకుండా “వో సోరహే హై! కల్‌మిలేంగే!” అన్నాడు.
“అయితే నాకు గూడా వొక రూం యియ్యండి. నాకు అన్ని సౌకర్యాలు అమిరిస్తానని శాస్త్రిగారే ఫోన్‌చేసి రమ్మన్నారు” అన్నాడు సంజీవి విసుగ్గా.
“తుమ్హారా నామ్‌?” అతను వాకబు చేశాడు.
“సంజీవి ఫ్రమ్‌ మదనపల్లె .. చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌..” అంటూ మళ్ళీ గొంతుచించుకున్నాడు సంజీవి.
“క్యోం షోర్‌మచారహేహో! యే తాళా లేలో! కమరా నెమ్మర్‌ బత్తీస్‌ మే జావో!” అని కసురుకుంటూ అతడిచేతికో తాళం అందించాడు గొడుగుపహిల్వాను.

తాళం చెవిని చేతబట్టుకుని తమ గదికోసం వెదకసాగారు స్నేహితులిద్దరూ. సొరంగాల్లాంటి దారుల్ని కలుపుతున్న నడవాల మధ్య కావాల్సిన గదిని కనిపెట్టడమంత సులభసాధ్యంగా తోచడం లేదు. వాకబుచేసి తెలుసుకోవడానికి యాత్రికులు గాని వ్యక్తులెవరూ యెదురుపడడం లేదు. చివరికోమూల రూం నెంబరు ముప్పయిరెండును కనిపెట్టాడు జానీ. నామమాత్రం గానే వేలాడుతున్న బీగం తెరిచి గదిలోపలి కడుగుపెట్టారు యిద్దరూ. విరిగిపొయిన స్విచ్‌బోర్డును చీకట్లో వెదికిపట్టి స్విచ్‌ నొక్కేసరికి జానీ తలప్రాణం తోకకొచ్చింది. గుడ్డిదీపం వెలిగింది. అలమరాలూ, మంచాలూ లేని నిరలంకారమైనగది. వోమూల చెదలు పట్టిన ద్వారం. అవతల బాత్రూం వుండొచ్చు. తలుపును వోరవాకిలిగా వేశాక, జిప్‌బాగ్‌లోంచి పాతశాలువాను పైకిలాగాడు సంజీవి. దానితోనే నేలపైని చెత్తను వోమూలకు చిమ్మి, ఆతరువాత దాన్ని నేలపైన పరిచేశాడు.
శాలువాపైన చేరగిలపడుతూ “యిదేనా నీకోసం ఆయనగారు యేర్పాటుచేసిన అతిథి సత్కారం?” అంటూ చిరునవ్వు నవ్వాడు జానీ.

తానుగూడా నడుం చేరేస్తూ “అలహాబాదుకు అస్థికల నిమజ్జనం కోసరం పోవాలని చెప్పినప్పుడు మాకొలీగ్‌ వొకాయన యీఅడ్రస్సు నాకిచ్చి జాబు రాయమన్నాడు. జాబుకు బదులుగా టెలిఫోనే వచ్చింది. పగటిపూట అంత ఖర్చు భరించుకోని ఫోన్‌చేసి రమ్మని పిలిచినాడు ఆయన. తీరావచ్చినాక యిప్పుడు యింతవరకూ మన అతీగతీ పట్టించుకోలేదు” అన్నాడు సంజీవి.
“నువ్వు గమనించినావో లేదో! యిక్కడికొచ్చినోళ్ళంతా నీమాదిరి అస్థినిమజ్జనానికొచ్చినోళ్ళే! అందురుకీ ఫోన్లూ, జాబులూ అందినాయి. చూడబోతే యిదే ఆయన వృత్తిగా వుండాది” అన్నాడు జానీ.
“అయితే మంచిదే! తెల్లారిపోతా వుంది. యీపొద్దు పౌర్ణమి. మధ్యానం పన్నెండు గంటల్లోపల నిమజ్జనం జరిపించాలని ఫోన్లో హెచ్చరించినాను…” కళ్ళు మూసుకునే చెబుతున్నాడు సంజీవి.
“ఆర్నెల్లకు ముందు, నేను అలహాబాదుకొచ్చే దానికి ముందు, మీ యింటికొచ్చినప్పుడు బాగానే కనిపించింది కదా మీ అమ్మ! యింతలోపల అంత ఖాయిలా యెట్ల పడింది?” చాలాసేపటినుంచీ అడగదలుచుకుంటున్న ప్రశ్నను చివరికి సంధించాడు జానీ.
“ఆపొద్దు తెల్లారి నేను ఆఫీసుకు బయల్దేరతా వున్నప్పుడు గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పింది. ” సంజీవి గొంతుక బొంగురుపోసాగింది. పడుకున్నందువల్ల అతడి కనుకొలుకుల్లోకొచ్చిన కన్నీటిబొట్లు రెండూ అలాగే అక్కడే నిలిచిపొయాయి. “ఆమాదిరి అప్పౌడప్పుడూ అనడం ఆమెకు అలవాటే! ఆపొద్దుగూడా అంతేలే అనుకున్నాను. పన్నెండు గంటలప్పుడు పక్కింటి పిల్లోడు పరిగెత్తుకోనొచ్చి అమ్మ పడిపొయిందని చెప్పినాడు. గబగబా యింటికిపొయి, వెమ్మట్నే ఆస్పత్రికి తీసుకొనిపొయినాను. ఇంటెన్సివ్‌ వార్డులో చేర్పించినారు. వారం దినాలు కోమాలో వుండి పొయింది. అప్పటికే ముప్పయివేలు ఖర్చయింది. అర్జెంటుగా యాభైవేలు అడ్వాన్సుగా కడ్తే ఆపరేషను చేస్తామన్నారు. డబ్బుకోసరం వెతుకులాడతా వుండిపొయినాను యింకోవారాం దినాలు. యీలోపల అంతా అయిపొయింది.”
“టయానికి దుడ్డెందుకు కట్టలేదు? పోనీ తర్వాత డబ్బు అడ్వాన్సు గడ్తానని చెప్పి ఆపరేషనయినా చెయ్యించలేకపొయినావా? డాక్టర్లు గూడా డబ్బుకోసరమని పేషంటును నిర్లక్ష్యం చేస్తారా? వీళ్ళేం మనుషులు?” కోపంతో ఆక్రోశించాడు జానీ.
సంజీవి బదులు పలకలేదు.
“పోనీ నాకైనా టెలిగ్రామిచ్చుంటే యేమి? నేనెక్కడైనా ప్రయత్నం చేసుందును గదా?”
” మనప్రాప్తం తీరిపొయింది. మనుషుల ప్రయత్నాల్తోనే అన్నీ జరిగేట్టుంటే యింక మనుషుల్ని పట్టలేం. కర్మ చేసేదే మన పని. ఫలితం మాత్రం మన చేతిలో లేదు” అన్నాడు సంజీవి.
“నీ వేదాంతాన్నీ, భక్తినీ గంగలో కలిపెయ్‌. యిట్లాంటప్పుడు అవేవీ నిన్ను కాపాడవు. నీకైనా, నాకైనా, ఆడాక్టరుకైనా దుడ్డొక్కటే దిక్కు. నాకు టెలిగ్రామిస్తే నా అగచాట్లేవో నేను పడుందును” జానీ మండిపడ్డాడు.
“యెంతని అడగమంటావు? ” సంజీవి మాత్రం నెమ్మదిగా చెప్పుకుపోతున్నాడు. “యిప్పటికే నీకియ్యాల్సిన అప్పు వడ్డీతో కలిసి పాపం మాదిరిగా పెరిగిపొయింది. యిచ్చేదానికి నీకు అభ్యంతరం లేకపొయినా, అడిగేందుకు నాకైనా నోరుండాల గదా?”

యిద్దరూ మౌనంగా వుండిపోయారు. కాస్సేపటి తర్వాత సంజీవి గురక పెట్టడం గమనించాడు జానీ. బయటనుంచీ మానవసంరంభం స్పష్టంగా వినబడుతోంది. అతడి చేతిగడియారంలో సమయం అయిదుగంటల్ని దాటింది. యిక ఆరోజుకు నిద్రపోయే అవకాశం తనకు లేదని జానీకర్థమయింది.
తలుపు తెరిచిన శబ్దం వినబడగానే తిరిగిచూశాడు జానీ. పావడ పైన పొడవాటి జాకెట్టు తొడుక్కున్న పన్నెండు పద్మూడేళ్ళ అమ్మాయి లోపలికొచ్చింది. “వుదయానికి మీకు టిఫెను తయారుచెయ్యాలంటే ముందుగా ఆర్డరివ్వాలి” అంది.
“యేం టిఫిను?” అని అడిగాడు జానీ.
“ప్లేటు యిడ్లీ పదిరూపాయలు. దోసె పదిహేను. వుప్మా పది. కాఫీ అయిదు. టీ నాలుగు. కావాలంటే రూంకు తీసుకొస్తాను. లేకపోతే అక్కడికైనా వచ్చి తినచ్చు…”

“యెక్కడికి?”
“యిక్కడే! ఆ తూర్పువైపు వసారా దగ్గర మాగది”
కాస్సేపు ఆలోచించాక, “యింతబాగా తెలుగు మాట్లాడతా వుండావు. మీది యేవూరు?” అని ప్రశ్నించాడు జానీ.
“నాపేరు సత్యవతి. మావూరు తెనాలి..”
“యిక్కడి కెప్పుడొచ్చినావు?”
“మా అమ్మానాన్నా యీవూరొచ్చి నాలుగేళ్ళవతాంది. నేనేమో రెండేళ్ళ క్రితం వచ్చాను.”
“యిక్కడ్నే చదువుకుంటా వుండావా?”
“లేదు. యిక్కడ సప్లయి చేయడానికి మనిషి కావల్సివచ్చి మావాళ్ళు నన్ను రప్పించుకున్నారు. ఆర్డరు చెప్తారా?”
“లక్ష్మీనారాయణశాస్త్రి యెక్కడుంటారు?”
“యిక్కడే! మూడో అంతస్తులో వుంటారాయన. ప్రొద్దున ఆరింటికల్లా కచేరీకొస్తారు. ఆసరికి మీరు స్నానం చేసి రెడీగావుంటే సంగమానికెళ్ళొచ్చు. నిమజ్జనం చేసేవాళ్ళు మాత్రం వుపవాసం వుండాలి. మిగిలిన వాళ్ళు టిఫెను తినచ్చు…”
“శాస్త్రిది యీవూరేనా?”
“ఆయనది గూడా తెనాలే! ముందున్న ఆంధ్రాపండాకు పిల్లలు లేకపోతే వీరిని దత్తుకు తెచ్చుకున్నారట!..”
“యీయనకు బిడ్డలెందురు?”
“నలుగురు. యిద్దరమ్మాయిలు. యిద్దరబ్బాయిలు. ఆర్డరు చెప్పండి. వెళ్ళాలి..”
“చెప్తాన్లే వుండు! యీయన కొడుకులేం చేస్తారు?”
“కొడుకులూ, అల్లుళ్ళూ, అందరూ యిక్కడే వున్నారు. అందరూ ఆయన లైన్లోనే పనిచేస్తన్నారు. క్షణం తీరికుండదాయనకు. ఆర్డరు చెప్పండి..”
“రెండు ప్లేట్లు యిడ్లీ … రెండు కాఫీలు”
ఆ అమ్మాయి మరోమాటకు అవకాశమివ్వకుండా వెనుదిరిగి వెళ్ళిపోయింది.

“సంజీవీ! పైకి లేచి స్నానం చెయ్యి! ఆరుగంటలకంతా నీపని ఆరంభమయితిందంట!” అంటూ స్నేహితుడ్ని లేపి కూచోబెట్టాడు జానీ.
“పొయ్యేది గంగ దగ్గిరికే గదా! ఆడ్నే స్నానంజేస్తాను” అన్నాడు సంజీవి బద్ధకంగా.
“యిక్కడ టాప్‌లో వస్తావుండేది గూడా ఆనీళ్ళే! ముందిక్కడ స్నానం జెయ్యి! ఆపైన అక్కడాజేద్దువు గానీ!” అంటూ అతడ్ని బాత్రూంలోకి నెట్టాడు జానీ.
“మరి నీస్నానం?” అని అడిగాడు సంజీవి స్నానం చేశాక బట్టలు మార్చుకుంటూ.
“యీచన్నీళ్ళు పోసుకుంటే నాకు జరమొస్తింది. యీపొద్దుకు స్నానం పోస్ట్‌పోన్‌” అన్నాడు జానీ. అతడు ముఖం కడుక్కునేసరికి టిఫిను ప్లేట్లతో సత్యవతి గదిలోకొచ్చింది.
“నేను వొకపొద్దుండాలని చెప్పినారు నువ్వు తిను..” అన్నాడు సంజీవి.
“మీరు కాఫీమాత్రం తాగొచ్చు” అంది సత్యవతి.
“చూసినావా! అదీ అమెండ్‌మెంటు. అందుకే యివేవీ లెక్కపెట్టొద్దన్నాను..” అంటూ విసుక్కున్నాడు జానీ.
“ఆర్డరిచ్చాక, టిఫెనుకంతా డబ్బులివ్వకుంటే వొప్పుకోరు. మొత్తం ముప్పయ్యీ యివ్వాలి మీరు!” అంది సత్యవతి.
“యిదేం రూలు! తినకుండా డబ్బులెందుకియ్యాల? అంతగా అయితే ఆప్లేటుకూడా యిట్లియ్యి. రెండూ నేనే తింటాను” అంటూ కోపగించుకున్నాడు జానీ.
టిఫెనుప్లేట్లు కిందపెట్టిన తరువాత “నిమజ్జనానికెళ్ళే వాళ్ళు దోవతీ, టవలూ మరచిపోకండా పట్టుకెళ్ళాలి!” అంది సత్యవతి వెనుదిరిగి వెళ్ళిఫోతూ.
టిఫిన్‌ తిన్నతర్వాత “ఆరయిపోయింది. పద కచేరీకి. మీ లక్ష్మీనారాయణశాస్త్రిని కలద్దాం” అన్నాడు జానీ.
జిప్‌బాగ్‌ను భుజానికి తగిలించుకుని సంజీవి బయల్దేరాడు.

గదికి తాళం వేసి వసారాలోకొచ్చిన తర్వాత తల పైకెత్తి చూశాడు జానీ. రెండవ అంతస్తుగూడా కిందిభాగంలాగే నానాకంగాళీగా వుంది. మూడవ అంతస్థు మాత్రం మెరుస్తున్న రంగులతో, బయటికే కనిపిస్తున్న యేసీమిషన్లతో జబర్దస్తీగా వెలుగుతోంది. “అదే మీశాస్త్రి నివాసం!” అంటూ చూపెట్టాడు జానీ.
రెండు మూడు సొరంగాలు దాటిన తర్వాత కచేరీగది తారసపడింది.
రెండడుగుల యెత్తున్న సిమెంటువేదికపైన, రాతబల్లకవతల, తెల్లటిపరుపుపైన కూర్చుని వున్నాడో వ్యక్తి. మూటలా వొదిగొదిగి కూచోవడం వల్ల అతడెంత పొడవున్నాడో తెలియడం లేదు. దూదికుచ్చులా తెల్లబడిపోయిన అతడిజుట్టు బయటికి కనిపించని శారీరకరుగ్మతని బయటపెడ్తోంది గానీ, అతడి వయస్సెంతో తెలపడం లేదు. అతడి వెనక గోడకు వేలాడుతున్న ఫోటో యేటవాలుగా వుండటం చేత అందులోని చిత్రమెవరిదో తెలియరావడం లేదు. దస్తావేజు పుస్తకమొకటీ, బిల్లుపుస్తకమొకటీ ముందుంచుకుని అతనేదో రాసుకుపోతున్నాడు. చుట్టూ గుమికూడిన జనం వొకేసారిగా అతడితో మాట్లాడడం కోసం గింజుకులాడుతున్నారు.

“నిమజ్జనానికి రెండువందలా యాభై. వేణీదానానికి అయిదు వందలు. గోదానానికి వెయిన్నీ నూటపదహార్లు. అవి మినిమమ్‌ రేట్లు. ఆపైన యెంత మనస్సుకు తృప్తో అంత యివ్వచ్చు. .. చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలి. వాళ్ళ పరలోకయాత్ర నిర్విఘ్నంగా సాగాలి. అందుకు మీరెంతయినా చెల్లించవచ్చు..”
రాతబల్ల ముందున్న వ్యక్తి కీచుగొంతుక పదేపదే యిదేమాటల్ని వల్లిస్తోంది. ఫీజు చెల్లించిన వాళ్ళు రసీదు కాగితాలతో బాటూ వెలుపలికొచ్చి సంగమానికి ప్రయాణమౌతున్నారు.
యింతలో చివ్వున బిల్లుపుస్తకం మూసిపెడుతూ “మిమ్మల్ని కాస్సేపు అవతల కూచోమన్నాను గదా!” అంటూ కోపంగా అరిచాడతను. గుంపుగా అతడ్ని చుట్టుముట్టిన జనమంతా యెవరికి వారు కంగారుపడిపోతూ వెనక్కుతప్పుకున్నారు.
వొకవ్యక్తి మాత్రం జోడించిన చేతుల్ని కిందికి దించకుండా “శాస్త్రిగారూ! జేబులోని సొమ్మునంతా యెవరో రైల్లో కాజేశారు. యిప్పుడు నాదగ్గర పైసా గూడా లేదు. నిమజ్జనం మీరే యెదోలా జరిపించాలి. యింటికి తిరిగి వెళ్తూనే వడ్డీతో బాటూ టీ యెమ్వో చేస్తాను” అంటూ ప్రాధేయపడసాగాడు.
“ఆలోచిద్దాం. ముందు అవతలికెళ్ళండి. డబ్బుల్తోబాటూ నిల్చున్నవాళ్ళకు రశీదులివ్వనివ్వండి!” అని గింజుకున్నాడు శాస్త్రి.
“శాస్త్రులు గారూ! పుణ్యమంతా మీదే! యీపని జరిపించండి” అతను పట్టినపట్టు వదలలేదు.
“నాపుణ్యం సంగతి సరేలేవయ్యా! మరి మీపెద్దలు పుణ్యలోకాల కెళ్ళాలా వద్దా? నాదక్షిణ సంగతి సరేననుకో! అవతల మిగిలిన వాళ్ళకివ్వవలసిన సొమ్ము సంగతేం జేస్తావు?…”
“యిదిగాకుండా యింకానా? అదెంత ఖర్చవుతుంది?”
“యెంతలేదన్నా యింకో రెండు వందలు..”
“శాస్త్రిగారూ!” గుంపులోనుంచీ ఎవరో అరిచారు. “ఆ మిగిలిన సొమ్ము మేము యేర్పాటు చేస్తాం. యింటికెళ్ళాక పంపుతానంటున్నాడు గదా! మీరే సహాయం చేయకపోతే యీవూళ్ళో దిక్కింకెవరున్నారు వీరికి! మీవంతుగా రశీదు యిప్పించండి”

శాస్త్రి వోసారి పెద్దగా నిట్టూర్చాడు. “యింటికెళ్తూనే డబ్బు పంపించు. లేకపోతే మీవాళ్ళకు పంచపాతకాలూ చుట్టుకుంటాయి. ఆపైన నీ యిష్టం” అంటూ హెచ్చరించాక వో తెల్లకాగితం ముక్కని అతడి చేతికిచ్చాడు.
సంజీవి యీసారి బలప్రదర్శనలో పాలుపంచుకుంటూ ముందుకుతోసుకెళ్ళాడు. “శాస్త్రిగారూ! నేను సంజీవిని. మాది మదనపల్లె! మీరు ఫోన్‌చేసి రమ్మన్నారు” అని పెద్దగా అరిచాడు.
శాస్త్రి అతడివైపుకు తిరిగైనా చూడకుండా, “చెప్పండి! నిమజ్జనమా? వేణీదానమా? గోదానం గూడా వుందా?” అంటూ రేట్లజాబితా చదివాడు. సంజీవి రెండు వందలా యాభై యిచ్చి రశీదు తీసుకున్నాడు.
“పద పద .. విక్రమ్‌లు యెదురు చూస్తా వుండాయి మనకోసరం” అన్నాడు జానీ.
యింటి బయటికొచ్చి కొద్దిదూరం నడచాక వోసారి వెనుదిరిగి చూశాడు జానీ. పాతబడిన గారమిద్దెల మధ్య, కూలిపోవడానికి సిద్ధంగా వున్నట్టున్న రెండు కింది అంతస్థుల పైన, అధునాతనంగా, దర్జాగా, డాబుగా, తళతళలాడుతూ కనిపిస్తోంది శాస్త్రి నివాసం.
“చూడు! మీశాస్త్రి అంగిడి యెంత బాగా జరగతా వుందో!” అన్నాడు జానీ. “నిజానికది స్వంతయిల్లు గూడా గాదు. యెవరో కట్టించిన పాతసత్రం. కిందంతా అస్థినిమజ్జనాల కోసం వచ్చే జనాల బస. ప్రతి రూంలోనూ, ప్రతిమనిషి చేతుల్లోనూ అస్థికల మూట. పైన మాత్రం కొట్టికోలాహలం. హైస్కూల్లో మన టీచరు “సమాధుల మధ్యలో జయకేతనాలు” అని చెప్తా వుండేవాడు. ఆమాట జ్‌ నాపకమొస్తా వుంది నాకు..”

యిద్దరూ యిటుకరాళ్ళు పరిచిన సన్నటిరోడ్డు పైన నడుస్తూ ముందుకు వస్తున్నారు. రెండువైపులా పొగచూరి, కూలిపోవడానికి సిద్ధంగా వున్న యిండ్లు. వంటిల్లూ, బాత్రూం, పడకగదీ అన్నీ అదే అయిన చిన్నచిన్న కాపురాలు. సైడుకాలువలే పిల్లలకూ పెద్దలకూ కక్కుసులైపోయినట్టు తెలిసిపోతోంది. వీధిలోనే పెద్ద ప్లాస్టిక్‌ బక్కెట్టు పెట్టుకుని నడివయసు స్త్రీ యేకంగా స్నానం జేస్తోంది. యెటుచూసినా మురికి, దారిద్య్రం.

ఆగిన విక్రమ్‌లో కూర్చోగానే “హర్‌ ఆద్మీకో సత్తర్‌ రుపాయా బాడా! రాత్‌మే యహా ఆనేకా బీస్‌ రుపయా! అబ్‌ సంగమ్‌కో ఆనేజానే కేలియే పచాస్‌ రుపయా!” అన్నాడు డ్రైవరు. “పాపం, యిచ్చేవానిదా, తీసుకునేవానిదా అనేదిగదా ప్రశ్న!” అని నవ్వేశాడు జానీ. సీట్లన్నీ నిండాక విక్రమ్‌ వెనక్కు తిరిగి పరుగులు తీయసాగింది. సన్నటి గతుకుల రోడ్డు దాటి, కాస్త పెద్దదైన తారురోడ్డు మీదికొచ్చి, రకరకాల సెంటర్లను అధిగమించి, మళ్ళీ సన్నటి రోడ్లను ఆశ్రయించి, దాదాపు అరగంటసేపటి తర్వాత, వాలుగా వున్న రోడ్డుపైన పరుగెడుతూ, చివరికి గంగాయమునల సంగమస్థలాన్ని యాత్రికుల దృక్కోణంలో నిలిపింది విక్రమ్‌.
***********************

… వచ్చి, అటువైపునుంచీ తెల్లటిప్రవాహమూ, యిటువైపునుంచీ నల్లటిప్రవాహమూ, రెండూ కలిశాక లేతనలుపురంగు ప్రవాహమై, కనిపించని మరోప్రవాహాన్ని తనలోకలుపుకుంటోందన్న విషయం భ్రమో, నిజమో, యితరులకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడుతూ, వొడ్లను వొరుస్తూ, గట్లను తడుపుతూ, క్షణక్షణానికీ మారుతూ, మార్పన్నదే లేనట్టుగా గలగలా రవళిస్తూ, భూమ్యాకాశాల్ని కలుపుతున్నట్టుగా దిగంతరేఖ దాకా సాగుతూ, దిగంతరేఖను మరికాస్త ముందుకు నెట్టుకుంటూ కదలుతూ, అనాదిగా, అజరామరంగా, తానే గంగై, తానే యమునై, తానే సరస్వతి గూడానై, తానే సంగమంగా మారి, తన అస్తిత్వానికి తానే పెక్కుభంగుల్ని కల్పించుకుంటూ, వెళ్తూ….
***********************

విక్రమ్‌ ఆగినచోటునుంచీ సంగమానికి దారిచూపెడుతున్నట్టుగా భిక్షగాళ్ళ వరస కనబడుతోంది. అక్కడక్కడా డేరాల కింద బొరుగులు, దేవుళ్ళపటాలు, కాశీదారాలు అమ్మే అంగళ్ళు గూడా కనిపిస్తున్నాయి. గట్టునుంచీ నీళ్ళు ప్రవహిస్తున్న చోటువరకూ, కిలోమీటరుదూరం ఇసుక మేటవేసి వుంది. దూరంగా, నీటిప్రవాహం దగ్గర రకరకాల పందిళ్ళూ, జనసంచారమూ కనబడుతోంది. అవతలిగట్టు పైన గుబురుగా పెరిగిన వృక్షాల మధ్యలోంచీ తెల్లటి గుడిశిఖరాలు కనిపిస్తున్నాయి.

విక్రమ్‌ క్లీనరు కుర్రాడు గట్టు దగ్గరినుంచీ యాత్రీకుల్ని తూర్పువైపుకు నడిపించసాగాడు. చిత్తడినేలపైన చెప్పులముద్రలు స్పష్టంగా పడుతుండగా అందరూ ముందుకు కదిలారు. అస్థిపంజరాలకు పలచటి చర్మం తొడిగినట్టున్న ఆవుదూడల్ని తోలుకుంటూ యెదురొచ్చాడో వ్యక్తి. అతడిశరీరంలో గూడా యెముకలు బయటికి పొడుచుకొస్తున్నాయి. జంబుమొక్కల్లా పెరిగిన గడ్డపువెంట్రుకలు అటూయిటూ వొరుగుతుండగా, “గోదాన్‌ కీజియే బాబూజీ!” అంటూ వెంటపడ్డాడతను. క్లీనరు కుర్రాడు “లక్షీనారాయణ్‌శాస్త్రీజీ కా ఆద్మీ!” అన్నాడు జవాబుగా. “కోయీ బాత్‌ నహీ! దాన్‌కర్‌నే మే క్యాబురాహై! దాన్‌ కీజియే!అప్‌కేపురకోంకో పుణ్య్‌ మిలేగా!” అన్నాడతను. సంజీవి అతడివైపుకు అనుమానంగా చూశాడు. అతడి చూపులతో చూపుకలుపుతూ “సిర్ఫ్‌ హజార్‌రూపాకో ఖరీద్‌లో! దాన్‌ ముజేహీ దీజియే! ఆప్‌కోతో పుణ్య్‌ మిలేగా!” అంటూ వివరించాడతను.
“మీశాస్త్రి వ్యాపారం కంటే లాభసాటి పనియిది. ఆవు ఆమనిషిదే! మనకు అమ్ముతాడు. మళ్ళా ఆయినే దానం తీసుకుంటాడు. సాయంత్రానికి యెంతమందికి వీలయితే అంతమందికి అమ్మచ్చు. దానమూ తీసుకోవచ్చు” కిళారిస్తున్నట్టుగా నవ్వుతూ అన్నాడు జానీ.
“నైతో పాంచ్‌సౌ దేకర్‌ ఖరీద్‌లో!” ఆవు యజమాని బేరంలోకి దిగాడు.
సంజీవి మౌనంగా ముందుకు నడవసాగాడు.
ఆవూ, దూడా వెంటరాగా ఆగంతకుడు గూడా వెనకే కదిలాడు.
“తీన్‌సౌ..”
సంజీవి అతడివైపుకు తిరిగయినా చూడలేదు.
“దోసౌ … యేక్‌సౌ… పచ్చీస్‌…”
“…”
“ఆప్‌కే పురకే జరూర్‌ నరక్‌మే జాయేంగా! వైతరిణీ పార్‌కర్‌నే సమయ్‌ హర్‌కిసీకో గాయ్‌కీ పూంచ్‌ పకడ్‌కర్‌ తైర్‌నా పడేగా! ఆప్‌నే పురాన్‌ నహీ పఢా? గంగా మాయీకే పాస్‌ ఆకర్‌ గోదాన్‌నహీ కరేంగే తో వుస్సే బడా దూసరా పాప్‌ నహీహై! ..”

నడకదారి నీళ్ళదగ్గరికి చేరేవరకూ బేరంచేస్తూనే వున్నాడతను. విక్రమ్‌ క్లీనరు అక్కద ఆగిన పడవవాళ్ళతో బేటీ వేస్తున్నాడు. కాస్సేపటి తర్వాత “సంగమ్‌కో ఆనే జానే కో హర్‌ ఆద్మీకో తీస్‌రూపా పడేగా! నావ్‌వాలేకో పహ్‌లేహీ పైసాదేనాహోగా!” అంటూ ప్రకటించాడు.
తమ టికెట్టు డబ్బుల్ని పడవవాడికి సమర్పించుకున్నాక జానీతో బాటూ సంజీవిగూడా పడవెక్కాడు. గోదానాలస్వీకర్త పశువుల్ని వెనక్కుమరల్చుకుని, యాత్రీకుల్ని తిట్టుకుంటూ, మరోగుంపు దగ్గరికి వెళ్ళిపోయాడు.
వొడ్డుకు కట్టిన మోకును విప్పేశాక, పడవ ముందుకు కదిలింది. దూరంగా రెండునదులూ కలుస్తున్నచోట ప్రవాహం వుధృతంగా సాగుతోంది. అక్కడక్కడా పడవలు కనబడుతున్నాయి. రకరకాల సంచీలను పదిలంగా పట్టుకుని కూచున్న యాత్రికులు నదినీళ్ళకేసి విభ్రమంతో చూడసాగారు. నిశ్శబ్దం బరువుతో పడవసైతం నీళ్ళలోకి యెక్కువగా మునిగినట్టు కనబడుతోంది. తీరం వెంబడే అరగంటసేపు నత్తనడకగా ప్రయాణం చేశాక పడవ సంగమస్థలాన్ని చేరింది.
పడవవాడు పందిళ్ళకేసి చేయిచాపుతూ “వహా జావ్‌” అంటూ ఆజ్ఞాపించాడు. యాత్రికులందరూ పడవదిగారు.
సంజీవి వోసారి వెనుదిరిగి చూశాక “యిక్కడికి యిసుకపైన్నుంచి నేరుగా నడిచేరావొచ్చు గదా! సంగమమంటే నదిని దాటాలని అనుకున్నాం మనం. యీపడవవాడు అనావశ్యంగా మనల్ని పడవెక్కించినాడు” అన్నాడు.
“నువ్వు నడిచి వచ్చేటట్టయితే పడవవాడెట్ల బతకాల?” అన్నాడు జానీ కిసుక్కుమని నవ్వుతూ.

సంగమం తీరం వెంబడే వెదురుకర్రలతో రకరకాల పందిళ్ళు వేశారు. పైన కొబ్బరిచేతులూ, తార్‌బాల్‌పట్టలూ పరిచారు. పందిళ్ళకింద అక్కడక్కడా చెక్కబెంచీలున్నాయి. కొన్ని బెంచీల పైన యేవేవో దేవుళ్ళ ఫోటోలూ, రకరకాల పూజసామగ్రీ వున్నాయి. కొన్నిపందిళ్ళు జనాలతో కిటకిటలాడుతున్నాయి. మరికొన్ని పందిళ్ళు ఖాళీగా బోసిపోతున్నాయి. తీరం దగ్గర స్నానాలు చేసేవాళ్ళ సంరంభం మిన్నుముట్టుతోంది.
వో పందిరి కింద వెదురుబుట్టలో యేదో సర్దుకుంటూ గొడుగుపహిల్వాను కనిపించాడు సంజీవికి. అదేపందిరికింద కూర్చున్న యాత్రికుల దగ్గరికెళ్ళి “లక్ష్మీనారాయణశాస్త్రి గారు యింకా రాలేదా?” అని ప్రశ్నించాడు సంజీవి.
“ఆయన యిక్కడికి రారట! మనల్ని యిక్కడికి రవాణా చేయటం వరకే ఆయనగారి పని. యిక్కడి  తతంగమంతా యింకోపురోహితుడు చేస్తాడు. మేమంతా ఆయనకోసమే యెదురుచూస్తున్నాం” అన్నాడో వ్యక్తి.
“ఆరేడు నెలలుగా యీవూళ్ళోనే వుండావు. యీమాత్రం సమాచారమైనా తెలుసుకోకుండా యేంచేస్తావుండావు?” అని విసుక్కుంటూ వోబెంచీపైన కూర్చున్నాడు సంజీవి.
“యీవూర్లో యీమాదిరి లోకమొకటుందని యిప్పటిదాకా నాకు తెలియనే తెలియదు” అంటూ నవ్వేశాడు జానీ. “మా ఆఫీసు ఆనందభవన్‌కు కిలోమీటరు దూరంలో వుంది. అక్కడికి దగ్గర్నే క్వార్టర్సు. రోజుకు పన్నెండు గంటలు పనిచేసినా టయిం సరిపోవడం లేదు. కొత్తగా రిక్రూటయ్యే జవాన్లందరికీ సైకలాజికల్‌ టెస్టులు చెయ్యాల. వాళ్ళకు హిందీ తప్ప యింకోభాష రాదు. నాకొచ్చే హిందీ అంతంత మాత్రమే! సైకాలజీ పుస్తకాలు, డిష్నరీ పక్కపక్కనబెట్టుకోని కాలం తోస్తావుండాను. డిఫెన్సు సర్వీసులో వుద్యోగమంటే మనవూర్లో అందరూ నాపక్క సోద్యంగా చూసినారు. కానీ యింతదూరంలో, వొంటిబసివిగా బతికేది సులువేమీ గాదు. మా అమ్మ మాటిని పెండ్లిజేసుకున్నా బాగుండు. నోటికి హితవుగా తిండయినా దొరికితింది…” కాస్సేపాగాక మళ్ళీ అన్నాడు ” మీశాస్త్రయినా, నేనయినా, యింతదూరం వచ్చింది కడుపాత్రానికే గదా!”
“అన్నిట్నీ దుడ్డుతోనే కొలవలేం! నీపనికీ ఆయినపనికీ తేడానే లేదా?” అంటూ కసురుకున్నాడు సంజీవి.
“తేడా యెందుకు లేదు? నాదేమో చిన్నవుద్యోగం. ఆయనిది టాక్సుగూడా కట్టాల్సిన పనిలేని లాభసాటి వ్యాపారం!” అంటూ నవ్వేశాడు జానీ. “దేవుడికంటే సులభంగా దొరికే వస్తువేముంది యీదేశంలో! యీ అలహాబాదులో గూడా వీధివీధికీ వొక మసీదుందంట! నేనెప్పుడూ ఆపక్కనే పోలేదు…”

చేవబారిన రోజ్‌వుడ్‌కొయ్యతో తయారుచేసిన శిల్పంలా నిగనిగలాడుతున్న నడివయసు పురోహితుడొకడు పందిరిలోకి వచ్చీరాగానే “అస్థివాలాలంతా యిలా వచ్చి కూర్చోండి” అంటూ ప్రకటించాడు.
“యిక్కడ అస్థివాలాలు కాని వాళ్ళెవరు? అందరిశరీరాల్లోనూ వున్నవి యెముకలే గదా!” అన్నాడు జానీ ముఖం చిట్లించుకుంటూ.
“అస్థివాలా అంటే అస్థికలు నిమజ్జనం చేసే వ్యక్తి అని అర్థం” అన్నాడు పక్కనే కూర్చున్న వ్యక్తి.
“అందరూ చొక్కాలు విప్పేసి, దోవతులు కట్టుకోవాలి!” అంటూ రెండో సూచనను ప్రసారం చేశాడు పురోహితుడు.

విప్పిన బట్టల్ని జానీకప్పగించి, అస్థికల పాత్రను జిప్‌బాగ్‌లోంచీ బయటకి తీసుకుని, మిగిలిన అస్థివాలాలతో బాటూ పురోహితుడి ముందు కూర్చున్నాడు సంజీవి.
గొడుగుపహిల్వాను అస్థివాలాల ముందు మర్రి ఆకుల విస్తరాకుల్ని పరచి, వాటి పైన క్రతువుకవసరమైన వస్తువులన్నీ అమర్చసాగాడు. విస్తరాకుపైన అస్థికలపాత్రనుంచుకుని వాళ్ళందరూ పురోహితుడి సూచనలను పాటించసాగారు.
తెలుపూ నలుపూ కలగలసిన పురోహితుడి బవిరిగడ్డమూ, పిలకజిట్టూ యీదురుగాలికి రెపరెపలాడుతున్నాయి. నిత్యగుట్కాసేవనంతో నల్లగా గారగట్టిన అతడి పలువరస అవ్యక్తమయిన అతడి జీవనయాతనకు ప్రతీకలా వెలవెలబోతోంది. శరీరంలోని మిగిలిన యితరభాగాలకంటే యెక్కువగా పనిచేయడంవల్ల అతడి నోరూ, పెదవులూ బలంగా దృఢంగా కనిపిస్తున్నాయి.

ముందుగా పురోహితుడు తన ముందు కూర్చున్న దాదాపు యాభైమంది అస్థివాలాల పేర్లూ, నిమజ్జనం చేయబడుతున్న అస్థికల తాలూకు వ్యక్తుల పేర్లూ, వాళ్ళ సంబంధాలూ, గోత్రాలూ తెలుసుకున్నాడు. రకరకాల మంత్రాలు వల్లిస్తూ, ప్రతి వ్యక్తి దగ్గరా ఆగి, వాళ్ళ వివరాలన్నింటినీ అలవోకగా వల్లించేశాడు. అతడి జ్ఞాపకశక్తికి వాళ్ళు విస్తుపోయి చూస్తుండగా “రోజుకు వందల మంది చేత శ్రాద్ధ కర్మలు చేయిస్తాను. యింతవరకూ యెవరిపేర్లు గానీ, గోత్రాలుగానీ తప్పుగా రిపీట్‌ చెయ్యలేదు. అసలైన అవధానమంటే యిదే!” అంటూ పరవశంగా నవ్వేశాడు.
అతడి స్వరం మెగాఫోన్ల కంటే బిగ్గరగా పలుకుతోంది. దూరంగా మిగిలిన పందిళ్ళనుంచీ వినిపిస్తున్న మంత్రధ్వనులూ, నదిలో మునుగుతున్న మనుషుల కేకలూ, నదినీటి హోరూ అతడికి నేపథ్యసంగీతాన్ని సమకూరుస్తున్నాయి. భార్యల్ని పోగొట్టుకున్న యువకులూ, తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న ముసలివాళ్ళూ, కన్నబిడ్డల్ని పోగొట్టుకున్న నడివయసు వాళ్ళూ, కూడబుట్టినవాళ్ళని పోగొట్టుకున్న వ్యక్తులూ … యెటుచూసినా రకరకాల వ్యథలు. తన తల్లి స్మృతులు బలంగా కమ్ముకోవడంతో విచలితుడైపోయిన సంజీవి గుడ్లనీళ్ళు కుక్కుకుంటూకూర్చున్నాడు.
పురోహితుడు వాళ్ళందరిచేతా గోధుమపిండితో పిండాలు తయారుచేయించి, వాటికి రకరకాల నైవేద్యాలు సమర్పింపజేశాడు. చిన్న అరటిపండు తోలువొలిపించి “మీవాళ్ళకు మీరు యిస్తున్న చివరి ఆహారమిదే! తృప్తిగా సమర్పించండి” అంటూ హెచ్చరించాడు. చివరగా అస్థికల్నీ, పిండాల్నీ నీళ్ళల్లో వదిలిపెట్టి, స్నానం చేసి రమ్మన్నాడు.

అస్థికలకుండ చేతబట్టుకుని, బుగ్గలపైన కన్నీటిచారలు గట్టుతుండగా, నదిదగ్గరికి నడవసాగాడు సంజీవి. జానీ అతడి దగ్గరికొచ్చి నడుస్తూ “మనకూ యీ అస్థికలకూ పెద్దతేడా లేదు. అవి నేరుగా నీళ్ళలో కలిసిపోతాయి. మనకూ, మన యెముకలకూ మధ్య చర్మం అడ్డంగా వుంది. లేకపోతే మనశరీరాలు గూడా నిమజ్జనమై పోయినట్టే లెక్క!” అన్నాడు నిర్వికారంగా ముఖం పెట్టుకుంటూ.
సంజీవి ముభావంగా నీళ్ళలోకి దిగాడు.
గట్టుదగ్గర పదిపన్నెండేళ్ళ కుర్రాళ్ళ రొద ఎక్కువగా వుంది.
రెండుమూడు బారలకవతల నీళ్ళలో ఆగిన పడవలపైనుంచీ కొందరు పిల్లలు నీళ్ళల్లోకి యెగిరెగిరి దూకుతున్నారు. నిమజ్జనం చేసిన రకరకాల వస్తువులు ప్రవాహం పైన నదికి అంచులా తెట్టగట్టుకుపోయి వున్నాయి.
సంజీవి మరో అడుగు ముందుకేశాడు.
పదిపెన్నెండు మంది కుర్రాళ్ళు అతడివైపుకు వొక్కుమ్మడిగా యీదుకొచ్చారు.
సంజీవి మరికాస్త ముందుకు కదిలాడు. ప్రవాహం వేగంగా అతడి నడుముదాకా తడుపుతోంది. చివరిసారిగా తల్లి ఆత్మీయస్పర్శను అనుభవిస్తున్నట్టుగా అస్థికలపాత్రను గుండెలకత్తుకున్నాడు. కుర్రాళ్ళు అతడిచుట్టూ కోటలా వొకరిచేతులు యింకొకరు కూర్చుకొని నిల్చున్నారు.
“త్వరగా కానీ! నీతో వచ్చిన వాళ్ళంతా యెనక్కు మళ్ళేసారు..” అంటూ అరిచాడు జానీ.
పెద్దగా నిట్టూరుస్తూ అస్థికల కుండను నీటిలోకి ముంచాడు సంజీవి. నీటిలోపల అతడి చేతుల్లోంచీ యెవరో కుండను లాక్కున్నారు. ధిగ్గున వులిక్కిపడ్డాడు సంజీవి.

నీటిలోపల చేపపిల్లలా వో ఆకారం ముందుకు కదిలిపోయింది. నాలుగైదు బారలు వెళ్ళాక ఆ ఆకారం నీళ్ళపైకి లేచింది. పదిపన్నెండేళ్ళ కుర్రాడొకడు అస్థికల పాత్రలో చేయిపెట్టి దేనికోసమో వెదుకుతున్నాడు. నలుగురైదుగురు పిల్లలు తమ చేతుల్ని గూడా కుండలోకి బలవంతంగా జొనుపుతున్నారు. పెళ్ళుమంటూ కుండ పగిలిపోయింది. అందులోని యెముకలూ బూడిదా నీళ్ళలోకి పడిపోయాయి.
గట్టు పైన్నుంచి జానీ మరిరెండుసార్లు కేకేశాక గానీ సంజీవి నీళ్ళలోపలికి తలముంచలేదు. తల నీటిలోపలికి వెళ్ళగానే అసంఖ్యాకమైన మానవశరీరాలు వొక్కసారిగా తనను స్పృశించినట్టు తోచడంతో సంజీవి నిలువునా వొణికిపోయాడు. పూనకం పట్టినవాడిలా వూగిపోతూ వొడ్డుపైకి విసురుకొచ్చాడు.
“అస్థికలతో బాటూ కొందరు బంగారమూ, చిల్లరనాణాలూ నిమజ్జనం చేస్తారంట! దానికోసరమే వాళ్ళ దేవులాట! అది వాళ్ళ బతుకు తెరువు!” అన్నాడు జానీ అడగని ప్రశ్నకు సమాధానం చెబుతున్నట్టుగా.
మొద్దుబారిన బుర్రతో, స్థబ్ధమైన శరీరాన్ని పందిరిదాకా లాక్కొచ్చాడు సంజీవి. “గుండు గీయించుకోండి! లేకపోతే తలపైన మూడు గాట్లయినా పెట్టించుకోండి. అది శాస్త్రం” అంటూ యెదురొచ్చాడు పురోహితుడు. అతడి వెనకే కత్తి చేతబట్టుకుని మంగలివాడూ వస్తున్నాడు.

సంజీవి నిమిత్తమాత్రుడిగా మంగలివాడి ముందు కూర్చున్నాడు. అతను సంజీవి తలపైన మూడుచోట్ల కత్తితో బరికి, గుప్పెడు వెంట్రుకల్ని తీసి కిందికి పారేశాడు. ఆతరువాత “పచ్చీస్‌ దేవ్‌!” అన్నాడు ముక్తసరిగా.
“పచ్చీస్‌ నై .. దస్‌ లేవ్‌!” అంటూ దబాయించాడు జానీ.
“యిదర్‌ రేట్‌ పచ్చీస్‌. ఫిక్స్‌డ్‌ ..” అన్నాడు మంగలి.
జానీ సంజీవి చొక్కాలోంచీ డబ్బుదీసి, లెక్కపెట్టి, మంగలికిచ్చేశాడు.
“మళ్ళీ స్నానం చేయాలి!” అన్నాడు పురోహితుడు.

సంజీవి కీసారి గంగను చూస్తే భయమేసింది. తక్కుతూ, తారుతూ నీళ్ళలోకి దిగి, కళ్ళు మూసుకుని, ఆదుర్దాగా మూడుమునకలు మునిగేశాడు. అతనీసారి పందిరి దగ్గరికి తిరిగొచ్చేసరికి పురోహితుడి కంఠస్వరంలో మార్పు స్పష్టంగా ధ్వనిస్తోంది. “మీపెద్దలకు శ్రాద్ధకర్మలు సక్రమంగా జరిగినందుకు బ్రాహ్మణులకు సంతర్పణ చేయండి. మీశక్తి కెంత వీలయితే అంత చేయొచ్చు. బలవంతం లేదు. అయితే మీరు పెట్టిన ఖర్చంతా మీపెద్దలను పుణ్యలోకాలకు చేరుస్తుందని మరచిపోవద్దు. యీవూళ్ళో నాసిరకం భోజనం చేయాలన్నా మనిషికి పాతికరూపాయలు ఖర్చవుతుంది. పదహారుమందికో, పన్నెండుమందికో, తొమ్మిదిమందికో, ముగ్గురికో, కనీస సంతర్పణ చేయండి. యెంతమందికి చేయదలుచుకున్నారో అన్నిపాతికలు నాచేతికివ్వండి. మీచేత యీకర్మ చేయించటంకోసం మన దేశాన్నొదిలి, పొట్టచేతబట్టుకుని, యింతదూరం వచ్చాను. శాస్త్రిగారికిచ్చిన దక్షిణతో నాకేం సంబంధం లేదు. నాకివ్వదలుచుకున్నదేదో తాంబూలంలో పెట్టి యివ్వండి. నాపాదాలకు నమస్కారం చేసుకోండి. ఆశీర్వదిస్తాను.”

దూరంగా వొడ్డుదగ్గర కలకలం ప్రారంభమైంది. పిల్లలందరూ ప్రవాహం నుంచీ దూరంగా పరుగులు తీస్తున్నారు.
“వూపర్‌సే ప్రవాహ్‌ ఆతీహై!” అంటూ వో కీచుగొంతుక పెద్దగా అరుస్తోంది.
“యిది వర్షాకాలం గదా! రోజూ యిదో గొడవ. పైన్నుంచీ వెల్లువ ముంచుకొస్తోందని రోజూ భయపడ్డమే! కృష్ణానదితో ఆడుకుంటూ పెరిగిన శరీరం నాది. వరదలెప్పుడు ముంచుకొస్తాయో నాకు తెలియనిది గాదు. మీరు కంగారు పడకుండా దక్షిణ సమర్పించండి” అంటున్నాడు పురోహితుడు.

పురోహితుడికి దక్షిణ యిచ్చుకున్నాక, జానీ దగ్గరనుంచి తన దుస్తుల్ని తీసి తొడుక్కున్నాడు సంజీవి.
మరోసారి ప్రవాహం దగ్గర గగ్గోలు చెలరేగింది. పైకొచ్చిపడిన నీటి వురవడికి తట్టుకోలేక పెద్దపందిరొకటి పటపటావిరిగి ప్రవాహంలో పడి కొట్టుకుపోసాగింది. పెద్దగా అరుస్తూ జనం పరుగులు మొదలుపెట్టారు. యింతలోమరోపందిరి కూలింది. కార్చిచ్చు వ్యాపించినంత వేగంగా ప్రవాహం ముంచుకొస్తోంది. పురోహితుడు సైతం పంచెపైకెగ గట్టుకుని పరుగులు తీస్తున్నాడు.
” పద .. పద .. పరిగెట్టు” అంటూ దౌడు తీశాడు సంజీవి. అప్పటికే జానీ పరుగందుకునేశాడు. తమ పరివారాన్నీ, వస్తువులనూ, సర్వస్వమూ మరిచిపోయి జనమంతా గుండెలరచేత బట్టుకుని గట్టుకేసి పరిగెడుతున్నారు. వెనకనుంచీ ప్రవాహం చావులా తరుముకొస్తోంది. చూస్తుండగానే సంజీవి కాళ్ళకిందికి నీళ్ళు ముంచుకొచ్చాయి. పాదాలు తడిసిపోయాయి. మరికొన్ని క్షణాల్లోనే అతడి మోకాళ్ళు కూడా నీటిలో మునిగిపోయాయి.
“బాబూజీ! యిదరాయియే!” అన్న కేక వినిపించింది. కొయ్యపడవ పైన్నుంచీ నావ్‌వాలా కేకేస్తున్నాడు. చప్పున అటుతిరిగి పడవలోకెగిరి దూకేశాడు సంజీవి. ఆవెనకే జానీగూడా పడవలోకి గెంతడం కనిపించిందతడికి.

నీటివాలుపైన పడవ వేగంగా కదులుతోంది. దూరంగా తీరం కనబడుతోంది. కొంతమంది మనుషులు యింకా తీరం దగ్గర పరిగెడుతున్నారు. యింకొందరు పడవల్లోకి చేరుకున్నారు. రెండునదులూ కలిసినచోట పాతగుడి వొకటి నీటిలో మునిగిపోతోంది. రెండునదుల్లోనూ వర్షం నీళ్ళు పొంగుకొస్తున్నాయి