విముక్తం

ఇంట్లో ఒకళ్ళనొకళ్ళం తప్పించుకుని పారిపోతున్నాం. నాకు అతని పట్ల అసహ్యం. అతనికి నేను తనని అర్థం చేసుకోలేకపోతున్నానని అసహనం. ముందు ముందు ఏం జరగబోతుందో తెలీని అయోమయస్థితి ఇల్లంతా ఆవరించుకుని ఉంది.

“మమ్, ఆర్ యు ఓకే?” అంటోంది సృజన.

మాట్లాడితే ఎక్కడ భోరుమంటానో అని తల ఊపాను. నా దుఃఖానికి కారణం నాకెంతో ఇష్టమైన, నా మనస్సులో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న రాధిక అనుకుంటే భళ్ళున వాంతి వస్తోంది.

“ఆమె మంచితనం, ఆమె చూపించే ఆత్మీయతల్లోని స్నేహాన్నే నేను చూస్తున్నాను. అలా అని వాస్తవాన్ని కాదనటం లేదు. ఒక్క క్షణం గీత దాటితే చాలు ఆ స్నేహపు రంగు మారిపోవడానికి. ఆ సంగతి మా ఇద్దరికీ తెలుసు. ఇందులో కప్పిపుచ్చుకున్నదేమీ లేదు. నువ్వు అర్థం ఎందుకు చేసుకోవు ఇది కేవలం స్నేహమని?”

తనడుగుతున్న ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఏమీ లేదు. హద్దులు లేని మంచితనం, స్నేహం, అభిమానం, సహాయం ఆవిడ అని నాకూ తెలుసు. కాని ఇదేమిటి ఈ రోజు నాలో ఇంత ఈర్ష్యని కలగచేస్తుంది? లోపం నాలోనా లేక ఆవిడ లోనా? అసలు ఇక్కడ నాకు జరిగే హాని ఏమిటి? ఆవిడ స్త్రీ కాబట్టి ఈయనతో స్నేహం చేయకూడదా? అది ధర్మానికి విరుద్ధమా? ధర్మబద్ధంగా, నియమబద్ధంగా జీవించక పోయినంత మాత్రాన ఆమె మంచితనం చెడుగా అవుతుందా? ఆ స్నేహం నా భర్తతో కాకుంటే నా ఆలోచన ఇలానే ఉండేదా?

అయితే నాలో ఈ బాధ ఏమిటి? ఎవరు చెప్తారు? ఇలాంటి విషయాన్ని మరొకరికి అసలెలా చెప్తాం? నాకు నచ్చినట్లుగా కాక దానికి వ్యతిరేకంగా జరుగుతోంది కాబట్టి ఈ బాధ కలుగుతోందా? నా బాధని దాటి చూసి, అతనిలా ఆలోచిస్తే నా ప్రశ్నకి సమాధానం లభిస్తుందేమో!

వెనక తలుపు వైపు నుంచి చెప్పులు లేకుండానే బయటికి నడిచాను. దూరంగా – అతనికి దూరంగా వెళ్ళాలని నా ప్రయత్నం. బ్యాక్‌యార్డ్ అంతా ఆకులు. ఆకులు రాలే కాలం. వృక్షాలు వృద్ధాప్యపు ఛాయలని వదిలించుకుంటున్నాయి ఏ చెట్టు కింద రాలిన ఆకులని ఆ చెట్టే శక్తిగా మలుచుకొని. ఎగిరిపోయే ఆకుకి విలువేముంటుంది?

కాలుతున్న మధ్యాహ్నపు ఎండ నేల మీద పడి ఎండిన ఆకుల్లోనుండి నా కాళ్ళలోకి, నా లోపలకి చేరి, “మీ ఇద్దరూ ఇ-మెయిల్స్ రాసుకుంటున్నారన్న సంగతి నాకు చెప్పకపోవడానికి కారణం ఏమిటి? ఒక విషయానికీ, నీకూ ఉన్న సంబంధం అసహజం అయినప్పుడు, నువ్వు అలా అనుకున్నప్పుడు దాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటావు కాదా?” అని నేనతన్ని అడిగిన ప్రశ్నని తాకి మనసులో నుండి కళ్ళనుండి నిప్పురవ్వల్ని చిందిస్తూ బయటకి వెళ్ళకొస్తున్నది.

“నీకు చెప్పకపోవడం కేవలం కాకతాళీయం. ఇద్దరి మధ్య సంబంధాన్ని ప్రపంచం అర్థం చేసుకోలేదన్న సందేహం కలిగితే కూడా అది రహస్యం అవుతుంది.”

“నేను ప్రపంచాన్ని ఎలా అవుతాను మురళీ? నేను నీ భార్యను.”

“నీకు చెప్పకుండా దాచడానికి ఇక్కడ ఏముంది మధూ! రాధిక ఎక్కడికైనా వెళ్ళినప్పుడే నాకు రాస్తుంది. ఇక్కడున్నప్పుడు కూడా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. ఎన్నో సార్లు నువ్వు మా సంభాషణలను విన్నావు కూడా. అప్పుడు లేని అనుమానం నీకు ఈమెయిల్స్ చూస్తే ఎలా వస్తోందనే నా బాధ. ”

“అంటే నేను ఊరికే అనుమానపడుతున్నానా? నాకూ రాశావు నేను విజయవాడలో ఉన్న సంవత్సరం పాటు — నాకు రాయలేదే నువ్వు అలా? ఆ సంగీతం గురించీ, ఆ తాదాత్మ్యం గురించీ.”

“ఏం రాస్తాను? నీకు అర్థం కాని విషయాలని, నీకు ఇష్టం లేని సంగతులని…”

“ఏం ఆమెకి అర్థమైనవి నాకు అర్థం కావా? నేను చదువుకోలేదా?”

“మరి నీకు రాసిన సంగతుల్లాంటివి ఆమెకు నేను రాయలేదే! నీతో మాట్లాడినట్టు నేను ఆమెతో మాట్లాడటంలేదే! ఇమేజెస్ ఏర్పరుచుకుని అడ్డంగా వాదించే వారికి నేను సమాధానం చెప్పలేను. నీకున్న బాధంతా నిన్ను నేను తక్కువ చేస్తున్నానని ఆమెని గౌరవంగా చూస్తున్నానని. కాదంటావా? ఆలోచించు. ప్రతి వాళ్ళకీ వేరు వేరు ప్రపంచాలుంటాయి. దీన్లో ఎక్కువ తక్కువలు పెట్టుకోవడం తెలివి తక్కువతనం, మూర్ఖత్వం. కానీ ఇది ఎవరు వింటారు? ఎవరికి అర్థం అవుతుంది? ఎవరో నాకనవసరం. నువ్వెందుకు అర్థం చేసుకోవు?” కాఫీ బల్ల మీద వాలి భుజంపై తల పెట్టుకున్న అతని శరీరమంతా ఉద్వేగంతో వణకడం చూసి కూడా నాకు బాధ కలగలేదు ఆ క్షణంలో.

“ఇమేజెస్ ఉండకూడదనీ, వాటి వల్ల నష్టాలుంటాయని నాకు తెలియదా? ఎంత మందికి ఎన్ని సార్లు చెప్పి ఉంటాను?”

“అది చెప్పడం వరకేనా? ఇమేజెస్ పెట్టుకోకూడదనుకుంటూనే ఇంకొకళ్ళు తమ మనసులో నీ గురించి గౌరవమైన ఇమేజ్ పెట్టుకోలేదని నీ బాధ. నువ్వంటే నాకు గౌరవం తక్కువేమీ లేదనీ, కాదనీ, బహుశా ఇది నీ ఆత్మన్యూనతో, నువ్వు కట్టుకున్న గూడు కూలిపోతుందనే అభద్రతాభావమో అయివుండచ్చని ఒక్క క్షణం ఆలోచించావా?” అతని గొంతులో కఠినత్వం.

ఎలా అన్నాడు అంత కఠినంగా? మేమిద్దరం ఒకప్పుడు ప్రేమికులం. ఇంట్లో అందరినీ కాదని భార్యాభర్తలమయాం. నన్నో దేవతగా ఆరాధిస్తూ నాకు అతను రాసిన ప్రేమలేఖల్లో, ఆ తర్వాత అతని భార్యగా జీవించిన ఇన్నేళ్ళల్లోనూ ఏనాడూ లేదే ఈ కఠినత్వం!? ఈ రోజు మరో ఆడదాని పైకి మళ్ళిందా ఆ ఆరాధన? ఇలా జరగడం అతనికి తప్పుగా అనిపించడం లేదా?

కానీ, మురళి అలాంటి వాడు కాదు. రాధిక అలాంటిది కాదు. నమ్మలేకపోతున్నాను. నేనే తప్పుగా ఆలోచిస్తున్నానా? కానీ ఎందుకిలా నా మనసులో ఈ అశాంతి. ఏమిటిది? లోపల ఏదో తప్పు అని చెప్తోంది – నాలో ఊడలుగా దిగి ఉన్న అసూయా ఇది? ఇంత ఆలోచించగలిగీ నేనెందుకు అతని వాదనను ఒప్పుకోలేకపోతున్నాను. అతడు నావాడు, నా ఇష్టానుసారంగా ఉండాలి అన్న ఈగోనా? అతడి ప్రతీ క్షణము, ప్రతీ ఊహ, భార్యనైన నాతోనే పంచుకోవాలి అన్న స్వార్థమా?

రాధిక గుర్తొస్తోంది. ఆమె రూపం నవ్వుతోంది నిష్కల్మషంగా. నేను ఆమె ఫోన్లు ఎత్తకపోవడానికి కారణం తెలియక ఆందోళన పడుతూ ఉంటుంది – ప్రాజెక్ట్ పని మీద బెంగుళూర్లో ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే పరిగెత్తుకొచ్చేదే. నాలోని ఈ బాధకి కారణం ఆమేనని తెలిస్తే… ఆవిడ వల్ల నా జీవితంలో చీకటి అలుముకుంటుందని నేననుకుంటున్న సంగతి ఆమెకి తెలిస్తే… ఏమవుతుందో ఊహిస్తేనే భయంగా ఉంది.

స్నేహమయి ఆవిడ. ఆవిడతో పరిచయం నాకు బాగా గుర్తుంది.

వేంకటేశ్వర స్వామి ఆలయంలో పాటల పోటీకి వాళ్ళబ్బాయి, మా అమ్మాయి పాల్గొన్నారు. ఆవిడ నా ప్రక్కనే కూర్చుంది. స్టేజీ మీద పాడుతున్న ఆ అబ్బాయిని చూసి “ఎంత బాగా పాడుతున్నాడో కదా!” అన్నాను ఆవిడని చూస్తూ.

ఆవిడ ముఖంలో సంతోషంతో కూడిన గర్వం కదలాడింది. “మా అబ్బాయేనండీ” అంది.

“అవునా! ఎంత బాగా పాడుతున్నాడో! మీ పోలికలు లేవు వాళ్ళ నాన్నగారి పోలికలనుకుంటా,” అన్నాను.

“అవునండీ! ఆయన లేరు. సంవత్సరం క్రితం యాక్సిడెంట్‌లో పోయారు. ఉంటే ఈ రోజు ఆయన ఎంత పొంగిపోయేవారో,” అంది. ఆమె కంఠం స్తిమితంగానే ఉంది కాని కళ్ళల్లో కనపడీ కనపడని తడి.

అప్రయత్నంగా ఆమె చేతి పైన చెయ్యి వేశాను. ప్రోగ్రాం అయ్యాక బాబుని అభినందించి ఆవిడ దగ్గర శెలవు తీసుకున్నాను. మా పాప, నేను గుడిలోకి వెళ్ళి దేవుడిని మరోసారి దర్శించుకుని మా కారు దగ్గరకి వచ్చాము. పార్కింగ్ లాట్లో ఆవిడ మళ్ళీ కలిసింది. తన కారులో కూర్చోబోతూ మమ్మల్ని చూసి, “మీ పేరు అడగడం మర్చిపోయానండీ!” అంటూ మాకు దగ్గరగా వచ్చింది.

“నా పేరు మైథిలి – మీ పేరు?”

“నా పేరు రాధిక. నేను డి. ఆర్. డి. ఎల్ లో సైంటిస్ట్ నండీ – మీరు??”

“స్టేట్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్ని. మీకు పనేమీ లేకపోతే మా ఇంటికి భోజనానికి రాకూడదూ! కబుర్లు చెప్పుకోవచ్చు,” అన్నాను ఆత్రంగా. ఆవిడ సంతోషంగా ఒప్పుకుంది. నా కారుని ఫాలో అవుతూ ఆవిడ తన కారులో మా ఇంటికి వచ్చింది.

ఇద్దరం వంట చేస్తూ ఒకరి గురించి మరొకరం సంగతులని కలబోసుకున్నాం. రెండవుతుండగా మురళి వచ్చారు లైబ్రరీ నుండి. శని ఆదివారాలు వస్తే లైబ్రరీకి వెళతాడీయన. రాగానే రాధికని పరిచయం చేశాను. భోంచేస్తూ చాలా మాట్లాడుకున్నాము ముగ్గురం. వాళ్ళిద్దరూ సైంటిస్ట్లే కాబట్టి ఎక్కువగా ఆ విషయాల గురించి మాట్లాడుకున్నారనిపించింది. భోంచేశాక ఆయన తన గదిలోకి వెళ్ళిపోయారు.

ఈసారి మా సంభాషణ అంతా మా ఆయన చుట్టూ తిరిగింది. ఆవిడ ఎంతో ఆసక్తిగా ఈయన గురించి, మా ఇద్దరి పరిచయం గురించి అడుగుతుంటే నాకు భలే గర్వం కలిగింది. మురళికి ఎన్ని విషయాలు తెలుసో, తెలిసినా అతనెంత మాడెస్టీతో ఉంటారో ఆవిడకి గొప్పగా చెప్పుకున్నాను. పిల్లలు కూడా బాగా కలిసిపోయి ఆడుకున్నారు. అప్పటినుండి రాధిక నాకు చాలా మంచి స్నేహితురాలయింది. ఒక రకంగా మా ఇంటి అమ్మాయి అయిపోయింది. వాళ్ళమ్మ రాధికతోనే ఉంటుంది. ఆవిడ నాకు అమ్మ అయింది.

రాధిక పరిచయం అయ్యాక రెండేళ్ళకి నన్ను మా బ్యాంక్ వాళ్ళు విజయవాడకి ట్రాన్స్‌ఫర్ చేశారు. పాపని తీసుకుని విజయవాడ వచ్చేశాను. ఈయన ప్రతి వీకెండ్ మా దగ్గరకి వచ్చేవారు. రాధిక ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడేది. నేను విజయవాడలో సంవత్సరం వర్క్ చేశానేమో! ఇలా ట్రాన్స్‌ఫర్ వచ్చిన ప్రతి సారీ పాపని స్కూల్స్ మార్చడం మంచిది కాదనిపించింది. వాలంటరీ రిటైర్ మెంట్ తీసేసుకున్నాను.

ఆరోజు ఆదివారం. చీరలని ఐరన్ చేసుకుందామని త్వరగా వంట చేసేశాను. ఈయన ఉదయం లైబ్రరీకి వెళుతూ బెడ్ మీద పడేసి వెళ్ళిన లాప్‌టాప్ లోంచి ‘టింగ్’ మంటూ మెసేజ్ వచ్చిన శబ్దం. ఐరన్ చేసుకుంటున్న నేను తల తిప్పి చూశాను. రాధిక నుండి అది. ఆశ్చర్యం కలిగింది. రాధిక నుండి ఈయనకి మెయిల్ ఎందుకొచ్చింది. ఏదైనా అర్జంట్ మెసేజేమో! ఏమయిందో ఏమోనని ఆందోళనతో, ఆతృతతో మెయిల్ ఓపెన్ చేశాను.

మురళీ,

‘పరమహంస హృదయోత్సవకారీ, పరిపూరిత మురళీరవధారీ’ అంటున్నప్పుడు బాల మురళి కంఠంతో పాటు వయొలిన్ తీగ నడిచి వెళ్తున్నట్లుంది కదా! అంత సుదీర్ఘంగా ఒకటే స్వరం లాగా వినపడేట్లు అన్ని వంపులు ఎలా తిప్పాడో అంపోలు మురళి వాయులీన శబ్దాన్ని. ధన్యులు మంగళంపల్లి, అంపోలు మురళీకృష్ణలిద్దరూ. నువ్వు ఇంత మంచి పాట గురించి చెప్పకపోయినట్లయితే విని ఉండే దాన్ని కాదేమో!

సుగుణాలని గురించి నువ్వన్నది నిజమే. నువ్వు చెప్తున్నది నాకు అర్థం అయింది. వీటి నుంచి కనీసం మొదలయితే కొన్ని జన్మలకవతలైనా ‘నేను’ని తెలుసుకోవచ్చు కాదా? వచ్చే ఆదివారం వస్తానుగా అప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడదాం. మైథిలికి వీలయితే ఒకసారి మా అమ్మ దగ్గరకి వెళ్ళమని చెప్పు.

బై –
రాధిక.

చదువుతున్న నేను హతాశురాలినయ్యాను. ఇంతగా మెయిల్స్ రాసుకుంటున్నారా!? నాకు తెలియకుండా! మొదట చిన్నగా ఉక్రోషం కలిగింది. తర్వాత ఇంకా ఏం రాసుకున్నారో చదవాలనే కోర్కె. దాని కన్నా ముందు వాళ్ళల్లో ఏమన్నా తప్పుందేమో వెతకాలనే ఆతృత నన్ను చుట్టుముట్టింది. సంస్కారం కాదని తెలిసినా నా కళ్ళు త్రెడ్ కిందికి వెళ్ళసాగాయి.

:ఇదిగో లింక్…

::మురళీ, ‘గాయతి వనమాలీ’ పాట ఎవరు పాడింది విన్నావు? గూగుల్‌లో కొడితే వందల సెర్చ్ రిజల్ట్స్ వస్తున్నాయి. నాకు లింక్ పంపగలవా?

:రాధికా, మనల్ని ఎవరన్నా తక్కువ చేసి మాట్లాడినపుడు ఏమీ స్పందించకుండా ఉండే మనసు వెనుక ఉన్న కారణం ‘నేను’ తక్కువవడం. ఈ స్థితి చూచాయగానో, బలంగానో కలిగినప్పుడు అగ్రెసివ్‌నెస్ లేని ప్రశాంతతని ఒక పెద్ద ‘సుగుణం’గా పొరబడుతుంటాం. ఇది నిజానికి నిర్గుణపు ఛాయ. ఈ నిర్గుణాన్ని అంటే ‘నేను’ తగ్గిపోవడాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని దాన్నే ఒక ఐడియల్‌గా అనుకుంటున్నామేమో! నీకు నేను చెప్పేది అర్థమవుతోందా రాధికా?

:అహింస, దయలని పెద్ద సుగుణాలుగా అందలాలెక్కించి (అవి ‘మంచివి కాదు’ అని నేను అనడం లేదు), అవి ఉంటే చాలదా అనుకుని ‘నేను’ని అర్థం చేసుకోవడాన్ని పోగొట్టుకోకూడదని నా ఉద్దేశం.

:ఈ మెయిల్ రాస్తూ నేను ‘గాయతి వనమాలీ’ పాట వింటున్నాను. చాలా మంచి పాట వీలు చేసుకుని విను.

బై –
మురళి.

:::మురళీ, ప్రాజెక్ట్ పని బాగా ఎక్కువగా ఉంది. ప్రాజెక్ట్ మొదలు పెట్టిన మొదట్లో కొన్ని నెలలు మనుషుల ఉదాసీనత చూసో, స్వార్థం చూసో కంట్రోల్ లేక కోపం, బాధ తన్నుకొస్తాయి. అయిపోయి క్లోజింగ్ స్టేజ్‌లో అంతా విత్‌డ్రా అయిపోతున్న ఫీలింగ్‌తో కూడిన అమితమైన హాయి. ఇవన్నీ లేకపోతే ఎలా ఉంటుందో చూడాలన్న తీవ్రమైన కోరిక నాలో.

:::ధ్యానం మాత్రం మానడం లేదు. సెల్ఫ్ వాచింగ్ జరుగుతున్నపుడు కోపం, విసుగు బాగా తగ్గిపోవడం తెలుస్తోంది. ప్రశాంతంగా ఉంటోంది. ఆఫీసులో ఒకరినొకరు చేసుకునే అవహేళనలు, వెకిలి మాటలు వింటుంటే నాలో ఏ స్పందనా లేదు. అందరి పట్ల దయ కలిగి ఉంటే చాలేమో కదా శాశ్వతమైన ఆనందాన్ని పొందటానికి!!?

:::మీకు దూరంగా ఉన్నప్పుడు నీ మెయిల్స్, మీ దగ్గరున్నప్పుడు నీ సన్నిథి, మైథిలి ఆప్యాయత నాకెంతో శాంతిని ప్రసాదిస్తాయి మురళీ. తీరిక చేసుకుని రిప్లై ఇవ్వు.

బై –
రాధిక.

త్రెడ్ కింద నుండి పైకి మళ్ళీ మళ్ళీ చదివాను. ఎన్ని సార్లు చదివినా ఆ ఉత్తరాల్లో ఏం తప్పుందో చెప్పలేకపోతున్నాను. కాని చదువుతున్న నాకు ఆవేదనో, ఆరాటమో, సహించలేని ఆలోచనో ఏదో మరి వలయాలు వలయాలుగా తిరుగుతూ మెదడుని సుడిగుండంలో తిప్పుతున్న భావన. రెండు భుజాలనీ ఎవరో గట్టిగా నొక్కినట్లు, ఆ నొక్కుడు గొంతు ద్వారా గుండెల్లోకి పాకుతున్నట్లు బాధ. బుగ్గటెముకలు చిట్లిపోయాయి కోపంతో. మన గురించి చెడ్డ మాట విన్నప్పుడు మనసు కలుక్కుమనడం, నొచ్చుకోవడం వేరు. అమితంగా ఊహించుకున్న సౌధం బద్దలవడం వేరు. ఆరోజు బయట గ్రీష్మపు సూర్యుడు తాపాన్ని ఎగజిమ్ముతున్నాడు. ఆవిడ గురించిన అందమైన జ్ఞాపకాలు వర్తమానంలో వికృతరూపాన్ని సంతరించుకున్నాయి. చిత్రవధ చేస్తున్న నిశ్శబ్దాన్ని భరించలేక ఆయనకి ఫోన్ చేశాను త్వరగా రమ్మని.

ఏమైందోనన్న ఆందోళనతో ఇంటికి వచ్చిన అతన్ని చూడగానే నా కళ్ళల్లోంచి రాలిన నిప్పు కణికలు, నోట్లోంచి ఆగి ఆగి వచ్చిన ఆవిర్లు, నా కోసం, నేననుకున్నట్లుగా ఉండని మనుషుల్ని కొరికి నమిలి మింగుతున్న మాటలు. వెళ్ళగక్కిన భయం, ద్వేషం, ఈర్ష్య, కోపం, క్రౌర్యం – నా మాటలు వింటూ మురళి కళ్ళలో కదలాడిన బాధ, నువ్వేనా ఇలా ఆలోచించగలిగింది? అని నిస్సహాయతతో కుమిలిపోతూ నన్ను చూస్తూ నిలబడిపోయిన అతని చూపులు…

ఇప్పుడు తలుచుకుంటుంటే నా శరీరాన్ని నేనే భరించలేనంత ఫీలింగ్.

వేపచెట్టు కింద బద్దకంగా పడుకుని ఉన్న ఎద్దు నన్ను చూసి గభాల్న లేచి తల విసిరింది. అదిరిపడి దూరంగా జరిగాను. ప్రహరీ గేటు తీసుకుని బజార్లోకి వచ్చానన్న సంగతి గమనించుకోలేదు. వేడి – తలని, అరిపాదాలని కాల్చేస్తుంది. పేడ కంపు – వెనక్కి ఇంట్లోకి వెళ్ళాలని ఉన్నా కాళ్ళు ముందుకే పడుతున్నాయి. ఎక్కడికి తీసికెళుతున్నాయి? గమ్యం లేని నా ఆలోచనల్లా…..

అతనికి నేనే కేంద్ర బిందువుగా ఉండాలనుకొన్న నా ఊహ ఛిద్రమై పోతూ ఉబికి ఉబికి వచ్చిన అలలా నన్ను ఈడ్చి ఈడ్చి కొట్టి చప్పున విరిగింది. అదీ… అసలు నాలో ఈ అశాంతికి మూలకారణం! అదెంత అర్థం లేని ఆలోచన! అతని పట్ల నాకున్న సంబంధం వేరు. ఆమెతో అతని బంధం వేరు – అదేగా అతను చెప్తోంది.

రాధిక ఒక స్త్రీ కాకుండా పురుషుడైతే నాకు ఇంత ఈర్ష్య ఉండేది కాదేమో! వేల సంవత్సరాలుగా ఇలాంటి అర్థం లేని అసహ్యపు మేకులు దిగగొట్టుకుని లోకం వేసిన రహదారులు ఇవి. ఈ దారుల్లో ఎటు చూసినా అవే – భయం, ద్వేషం, అసూయ. దారాలు దారాలుగా ఎంత లాగి పారేసినా మళ్ళీ మళ్ళీ ఊరుతూ… వీటిని దాటలేక ఏవేవో భ్రమలతో కాపురాలని కూలదోసుకుంటూ, పిల్లల మనస్సులని నలిపేస్తూ…

మనోదౌర్బల్యంతో కళ్ళనుండి బుగ్గల మీదకి జారుతున్న కన్నీరు. నా సంస్కారమంతా ఆయన పట్ల దౌర్జన్యపూరిత క్రోధంగా మారిన తీరుని తల్చుకుంటే హృదయం అసహ్యంతో వణుకుతోంది. ప్రేక్షకపాత్రలో నిలబడి నన్ను నిలదీస్తోంది.

అబ్బ – పేడవాసన.

గోడ మీద పిడకలు కొట్టుకుంటున్న గౌరి, “యాడకమ్మా చెప్పులు గూడా లేకుండా ఎండన పడి పోతన్నావు?” చెవుల్లో పెద్దగా అరుస్తోంది. అమ్మా! తెరలు తెరలుగా మీద పడుతున్న ఈ ఆలోచనలేమిటి? గునపంతో ఎవరైనా ఈ తలపుల అద్దాన్ని పగలగొట్టండి – పడిపోతున్నాను – పట్టుకోండి – గోవిందా – పేడ… గౌరీ… పేడ.

ఇరుకు నుంచి విశాలంగా మారుతున్న గదిలో కూర్చుని ఉన్నానో, నిలబడి ఉన్నానో గుర్తులేదు. నీరసం ఒళ్ళంతా. కళ్ళు వాలిపోతున్నాయి. ప్రేతకపు శక్తి ఏదో నుదురు, కళ్ళు, ముక్కు, పెదాల నుంచి జారిపోతుంది కల మెలకువల మధ్య ఊగిసలాట. పడిపోతున్నాను – తెరువు – కళ్ళు తెరువు.

“మైథిలీ! ఈ షర్బత్ తాగు. లే!”

అమ్మో! ఎక్కడున్నాను? రాధిక ఎలా వచ్చింది? గబుక్కున కళ్ళు తెరిచాను. లేపి కూర్చోపెట్టి నిమ్మకాయ నీళ్ళు తాపుతోంది. మురళి నా ప్రక్కనే కూర్చుని ఉన్నారు – నా చేయి మీద చెయ్యి వేసి. సృజన వాళ్ళ నాన్న పక్కనే నిలబడి నా వైపే దిగులు ముఖం వేసుకుని చూస్తుంది.

“ఏమయింది?” అన్నాను.

“ఎండలో తోట పని చేస్తారా మైథిలీ ఎవరైనా? చెట్లకి పేడని ఎవరినన్నా తెచ్చి పెట్టమంటే తేరా? గౌరి చూసింది కాబట్టి సరిపోయింది.” మంచం ప్రక్కనున్న అల్మరాలోంచి కొబ్బరి నూనె తెచ్చి తల మీద అంటుతూ ఆందోళనగా మాట్లాడుతున్న రాధిక నడుమును వాటేసుకొని ఆమె గుండెల్లో ముఖాన్ని దాచుకున్నాను.

నాలోని ఈర్షాసూయలని జయించే ప్రక్రియలో నేను అతని హృదయానికి ఏర్పరచిన గాయం మానడానికి ఎన్నాళ్ళు పడుతుందో… తల తిప్పి అతని వైపు చూశాను. నా భావం అర్థమైనట్లుగా నా చేతిని మెత్తగా నిమిరారు.

రాధిక ఏమిటేమిటో మాట్లాడుతూనే ఉంది. అవ్యాజమైన ఆ మాటల ప్రేమవాహినిలో అన్ని కల్మషాలూ కరిగిపోతున్నాయి.

రాధ మండువ

రచయిత రాధ మండువ గురించి: భర్త ఉద్యోగరీత్యా మద్రాస్ లో 4ఏళ్ళు, పూనాలో 4ఏళ్ళు, అమెరికాలో 9ఏళ్ళు ఉన్నారు. ప్రస్తుతం జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి రిషీవ్యాలీ స్కూలు, మదనపల్లి, చిత్తూరు జిల్లాలో ఇద్దరూ తెలుగు టీచర్స్ గా పని చేస్తున్నారు. రాయడం 2013 మార్చి, ఏప్రిల్ లోనే మొదలు పెట్టిన వీరి కథలు సారంగ, వాకిలి, ఈమాట, భూమిక, ఆంధ్రజ్యోతి, సాక్షి, కౌముది, విపుల, తెలుగువెలుగు, చినుకు, పాలపిట్ట పత్రికలలో వచ్చాయి. బాలసాహిత్యం కూడా రాశారు. దాదాపు 30 కథలు కొత్తపల్లి పత్రికలో వచ్చాయి. ...