పరిచయము
ఇంతకు ముందు కంద పద్యము సంస్కృతములోని ఆర్యా లేక ప్రాకృతమునందలి గాథనుండి జనించిన తీరు, కంద పద్యములోని భేదములు, విభిన్న రీతులలో నుండు కంద పద్యములనుగుఱించి చర్చించినాను. ప్రస్తుత వ్యాసములో కంద పద్యపు నడక, సుందరమైన కందపద్యమును రచించు విధానము, కందముతో గర్భ, బంధ కవిత్వములు, కంద పద్యముతో క్రొత్త పోకడలు, కంద పద్య నిర్మాణ సూత్రములను అనుసరించి అదే విధముగా నూతన ఛందోబంధములను కల్పించు అవకాశములు మున్నగువాటిని చర్చించబోవుచున్నాను.
వివిధ గతులలో కందపద్యము
కందము చతుర్మాత్రాబద్ధమైనను, దానిని వివిధ గతులతో వ్రాయుటకు వీలగును. కంద పద్యమును త్ర్యస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర గతులలో కూడ వ్రాయుటకు వీలగును. నాలుగు, ఆఱు మాత్రలతో నిండినవి తప్ప మిగిలినవి మనకు అలవాటు పడిన కందమువలె నుండదు. అయినను క్రింద ఈ గతులతో నా ఉదాహరణములను ఇచ్చుచున్నాను.
త్ర్యస్ర గతి (మూడు మాత్రలు) –
చూడఁ దలఁచినాను సకియ
పాడఁ దలఁచినాను చెలియ – పదము నొకటి నే
నాడఁ దలఁచియుంటి నతివ
నేఁడు వదల నిన్ను మగువ – నిజ మిదొకటియే.
(చూడఁ / దలఁచి/నాను / సకియ / పాడఁ /దలఁచి/నాను / చెలియ / పదము / నొకటి / నే
నాడఁ / దలఁచి/యుంటి / నతివ / నేఁడు / వదల / నిన్ను / మగువ / నిజ మి/దొకటి/యే)
ఇలా వ్రాస్తే కంద పద్యపు లక్షణములన్నియు ఉన్నను, ఇది ఉత్సాహవలె ధ్వనిస్తుంది కాని కందమువలె కాదు.
చతురస్ర గతి (నాలుగు మాత్రలు) –
మందము మందము పవనము
సుందరి వేచితి వనమునఁ – జూడగ నిన్నున్
వందల విరులను మాలగ
నందము లలరఁగ రచింతు – నప్సర నీకున్
ఖండ గతి (ఐదు మాత్రలు) –
లేచినవి భావములు నినుఁ
జూచి నిముసమున శుభమను-చు మనసు పలికెన్
వేచినది యీ మనసు నినుఁ
జూచి హరుసమున దడబడు-చుఁ బిలువఁ దలఁచెన్.
(లేచినవి / భావములు / నినుఁ జూచి / నిముసమున / శుభమనుచు / మనసు పలి/కెన్
వేచినది / యీ మనసు / నినుఁ జూచి / హరుసమున / దడబడుచుఁ / బిలువఁ దలఁ/చెన్)
ఇది నిజముగా కంద పద్యము అని అనిపించుకొనదు.
ఆఱు మాత్రలతో –
కోరికలే నేఁడు విరిసెఁ
దారకలే నేఁడు మురిసెఁ – దరళతతోడన్
జేరఁగ రా నీవు చెలియ
మారునితో మాట కలియ – మక్కువతోడన్.
దీని చదువుచున్నప్పుడు సాఫీగా కంద పద్యమువలె నున్నది.
మిశ్రగతి (మూడు, నాలుగు మాత్రలు) –
దేవి యననా వనజ నే-
త్రా వలపు విరులను గొనుము – రాతిరి యిపుడున్
భావి మనకున్ విమల గా-
త్రా వఱలు సొబగుగ నిజము – తప్పక నెపుడున్.
(దేవి యననా / వనజ నేత్రా / వలపు విరులను / గొనుము రాతిరి
భావి మనకున్ / విమల గాత్రా / వఱలు సొబగుగ / నిజము తప్పక)
సరి పాదములలోని చివరి మాత్రలు తప్పించి, మిగిలినది మత్తకోకిలవలె ధ్వనిస్తుంది కాని కందములా కాదు.
మిశ్రగతి (ఐదు, నాలుగు, మూడు మాత్రల కూడిక) –
గోపెమ్మ వెదకెఁ గృష్ణునిఁ
బాపము కనరాఁడు వెళ్ళె – వాఁడెక్కడికో
కోపమ్ము మీఱ నుడివెను
నీ పనిఁ బట్టెదను చూడు – నేఁ గన్నయ్యా
దీని నడక ఒక చక్కని కంద పద్యపు నడకతో సరిపోవును.
కంద పద్యములలో పదముల విఱుపులు
కంద పద్యము చతుర్మాత్రా గణములతో నిర్మితమైనవి. కంద పద్యమును ‘నోరూరగఁ జవులు పుట్ట నుడివెడి’ విధానమును తెలిసికొనినచో అందమైన కంద పద్యములను వ్రాయ వీలగును. ఆ ప్రయత్నమే ఇప్పుడు చెప్పబోయే నా పరిశోధన. నేను శతకందసౌరభము వ్రాసేటప్పుడు, నా మొదటి ప్రతిని వారి మొదటి అభిప్రాయములకోసము శ్రీ వేలూరి వేంకటేశ్వరరావుగారికి పంపినాను. వారు దానిని చదివిన పిదప, ఒక రెండు చోటులలో పద్యముల నడక అంత సంతృప్తికరముగా లేదని చెప్పి, కంద పద్యముల నడక సుమతి శతకములోని (సుశ) పద్యాలవలె ఉంటే బాగుంటుందన్నారు. అప్పటికి ఆ నా శతకమును ముగించినను, వారి సలహా నా మెదడులో అలాగే ఉండినది. ఇప్పుడు కంద పద్యముపైన వ్రాసే వ్యాసములో దానిని పునః పరిశీలించవలయుననే కోరిక జనించినది. సుమతి శతకము మాత్రమే కాక, కవి చౌడప్ప శతకమును (చౌశ) కూడ ఈ పరిశీలనలో భాగముగా ఎన్నుకొన్నాను. ఎందుకంటే, కంద పద్యములను వ్రాయుటలో తన నేర్పునుగుఱించి తానే ఇలాగంటాడు చౌడప్ప.
ముందటి దినముల లోనం
గందమునకు సోమయాజి – ఘనుఁడందురు నేఁ
డందఱు నిను ఘనుఁ డందురు
డందురు కందమునకుఁ గుందవరపు – కవి చౌడప్పా (చౌశ-12)
అంటే తిక్కన తఱువాత కంద పద్యములను అల్లుటలో తనకు సాటి మఱెవ్వరు లేరనే ధీమా చౌడప్పకు ఉండినది.
ఈ పరిశోధనలోని ముఖ్యాంశము కంద పద్యములో ప్రతి పాదములోని పదములలోని మాత్రల సంఖ్య ఏ విధముగా ఉండునన్నదే. కందము చతుర్మాత్రలతో నిండినదైనను, అందులోని పదములు కూడ ఎల్లప్పుడు చతుర్మాత్రలతో నిండి ఉండునా లేక ఇతర విధములుగా నుండునో అన్నదే ఇందులోని కీలకము. ఇట్టి పరిశోధనను ఇతర వృత్తములకు, జాత్యుపజాతులకు కూడ చేయ వచ్చును. ఉదాహరణకు, క్రింద సుమతి శతకమునుండి ఒక పద్యము, కవి చౌడప్ప శతకమునుండి ఒక పద్యమును ఇచ్చాను. ఇందులో చౌడప్ప పద్యములో రెండవ పాదమునుండి మూడవ పాదమునకు అతివిపులత్వము (పదము చొచ్చుకొని పోవుట), మూడవ పాదమునుండి నాలుగవ పాదమునకు విపులత్వము (పదము చొచ్చుకొని పోవుట) గలదు. ఈ విపులత్వమును ‘=’ గుర్తుతో చూపినాను.
ఎప్పుడు సంపద కలిగిన (4-4-4)
నప్పుడు బంధువులు వత్తు – రది యెట్లన్నన్ (4-5-3) (2-6)
దెప్పలుగఁ జెఱువు నిండినఁ (5-3-4)
గప్పలు పదివేలు చేరుఁ – గదరా సుమతీ (4-2-3-3) (4-4) (సుశ-19)
పాండవు లిడుములఁ బడరే (4-4-4)
మాండవ్యుఁడు కొఱుతఁ బడఁడె – మహిఁ బ్రాకృత మె- (6-3-3) (2-4-2=)
వ్వండోపు మీఱి చనఁగ న- (5-3-3-1=)
ఖండితయశ కుందవరపు – కవి చౌడప్పా (3-2-3-3) (2-6) (చౌశ-72)
ఇట్లు చేసినప్పుడు లభించిన ఫలితములను మూడవ పట్టికలో చూడ వీలగును. ఐదు మాత్రలనగా ‘రామునికి’ లాటి పంచమాత్రల పదములైనా కావచ్చును లేక ‘పనిఁ జేయు’ లాటి 2-3 మాత్రల పదముల చేరికగా కూడ నుండవచ్చును. అదే విధముగా ఆఱు మాత్రలనగా “రాగమయీ” లాటి ఒకే పదము లేక “పనిఁ జేసిన” లాటి రెండు పదముల కూడికగా నుండవచ్చును. “నిన్ను గోరి” వంటి పదములు బేసి పాదములలో ఆఱు మాత్రలుగా పరిగణించినను, సరి పాదములలో 3-3 మాత్రలుగ మాత్రమే పరిగణించబడినవి. దీనికి కారణము చర్చలో విదితమగును. ఈ పరిశోధన ఫలితములు మూడు విధములుగా విభజించబడినవి:
- కుఱుచ పాదములు, అనగా మొదటి, మూడవ పాదములు,
- నిడుద పాదములలో మొదటి 12 మాత్రలు (యతి స్థానమునకు ముందుండు గణములు),
- నిడుద పాదములలో చివరి 8 మాత్రలు (యతి స్థానమునకు తఱువాతి రెండు మాత్రా గణములు).
చౌడప్ప శతకములో చివరి పాదము గ్రహించబడలేదు, ఎందుకనగా ఈ శతకములోని మకుటము, కుందవరపు కవి చౌడప్పా, మొదటి 12 మాత్రలలో చివరి ఆఱు మాత్రలు కూడ (కుందవరపు). అందువలన చివరి పాదములో మొదటి ఆఱు మాత్రలలో మాత్రమే వైవిధ్యము గలదు. సుమతి శతకములో చివరి పాదములోని చివరి 8 మాత్రలను కూడ గ్రహించలేదు, ఎందుకనగా అందులో మకుటమైన – సుమతీ, నాలుగు మాత్రల పదము, దానికి ముందున్న పదము కూడ తప్పక నాలుగు మాత్రల పదముగా నుండవలయును. ఈ ఉపోద్ఘాతముతో ఫలితములను ఇప్పుడు పరిశీలిద్దామా?
- సుమతి శతకములో పద్యము లన్నియు పథ్యా కందములే, అనగా ఏ పాదమునకు ఆ పాదము స్వతంత్రముగా నిలిచి యుండును. ఒక పాదమునునుండి పదము మఱొక పాదమునకు చొచ్చుకొని వెళ్ళదు. కాని కవి చౌడప్ప శతకములో 200 పాదములలో 23 పాదములకు విపులత్వము గలదు, అనగా సుమారు నూటికి పది కుఱుచ పాదములలో చివరి పదము తఱువాతి పాదములోనికి వెళ్ళును, ఉదా. పై పద్యములో “అఖండిత” అను పదము మూడవ, నాలుగవ పాదములలో గలదు. చౌడప్ప వ్రాసిన పద్యములలో 11 పద్యములలో పదము రెండవ పాదమునుండి మూడవ పాదమునకు చొచ్చుకొని పోవును. కొన్ని వేళలలో పై ఉదాహరణమునందలి ‘ఎవ్వండో’ వలె ఇది సంధిగతముగా నుండును, మఱి కొన్ని వేలలలో ‘సం-క్రందన’ వలె ఒకే పదము రెండు పాదములను ఆక్రమించును. సంస్కృతములోని ఆర్యా భేదములలో, ప్రాకృతములోని గాథా భేదములలో ఇట్టి ప్రయోగమును మనము పరికించము. అనగా, రెండవ పాదమువద్ద పదము తప్పక అంతమగును. కాని ఎన్నో అతివిపులా కందములను మనము తిక్కన భారతములో చదువవచ్చును. దీనిని అలాగుంచితే, కవి చౌడప్ప రచించిన కంద పద్యములలో సుమారు 80 శాతము పథ్యా కందములే. ఈ వివరణలను బట్టి మనము ఒక నిర్ణయమునకు రావచ్చును, అదేమనగా అత్యవసరమైన పరిస్థితులలో తప్ప కంద పద్యములలో అన్ని పాదములకు పాదాంత యతి ఉండినప్పుడు, చదువుకొనుటకు రమ్యముగా నుండును. సుమతి శతకమును ఒక్కరే వ్రాసినారా లేక వివిధ కవులు వ్రాసినారా అనే ప్రశ్న ఒకటున్నది. నా ఈ ఛందస్సు పరిశోధన ద్వారా ఒక విషయము మాత్రము నిజము. కంద పద్యములో ఏ పాదమునకు ఆ పాదము స్వతంత్రముగా నిలుచుట, నల-జ గణములో విరామయతిని పాటించుటను బట్టి అవి ఒకే నియమచట్రములో వ్రాయబడినవి అని మాత్రము చెప్ప వీలగును.
- కుఱుచ పాదములలో పదముల విఱుపు ఎక్కువగా 5-3-4, 4-4-4, 6-6 మాత్రలకే పరిమితము. ఐదు మాత్రల పదములయందలి గురులఘువులు ఈ విధముగా నుండును – UIII, UUI, IIIII, IIUI.
- ఇక నిడుద (రెండవ, నాలుగవ) పాదములలోని మొదటి 12 మాత్రల అమరికను ఇప్పుడు చర్చిద్దాము. ఇందులో ఎక్కువగా 6-3-3, 4-5-3 మాత్రలతో నుండే పదములే ఎక్కువ. ఏవో చాల తక్కువ చోటులలో తప్ప మిగిలిన అన్ని సమయములలో మొదటి 12 మాత్రలలో చివరి పదము ఎప్పుడు మూడు మాత్రలకు పరిమితము. కందములో గణములు చతుర్మాత్రా గణములైనను, నల-జ గణములో మొదటి మాత్రతో పూర్వ పదము అంతమై, రెండవ మాత్రతో మఱొక చిన్న పదము ప్రారంభమవుతుంది. ఇంతకు ముందే ఆర్య లేక గాథలో ఈ గణము నలమైనప్పుడు ఈ నియమము ఉన్నదని తెలిపియున్నాను, కాని అక్కడ జ-గణమునకు ఈ నియమము లేదు. కాని కన్నడ, తెలుగు భాషలలో పూర్వమునుండి నేటివఱకు కవులందఱు ఈ నియమమును పాటించుచున్నారు. నేను తెలుగులో మనకు లభించిన మొదటి ఛందోగ్రంథమైన కవిజనాశ్రయములో ఈ నియమము పాటించబడినదా లేదా అన్న విషయమును కూడ పరిశీలించినాను. ఈ గ్రంథములో వృత్తములకు తెలిపిన ఉదాహరణములు తప్ప మిగిలినవి కంద పద్యములే. వీటిలో సుమారు ప్రతి ఏడు పద్యములలో ఆఱింటికి ఈ నియమము పాటించబడినది. తెలుగులో వడి లేక అక్షరసామ్య యతి మాత్రమే ఆచరించబడును, సంస్కృతములోవలె పదచ్ఛేదయతి లేదు. కాని కంద పద్యములలో నల-జ గణములో ఈ పదచ్ఛేద యతిని పాటించని పద్యములు చాల తక్కువ. మఱి ఈ నియమమునుగుఱించి ఎందుకు లాక్షణికులు చర్చించలేదో? ఒక్క గిడుగు సీతాపతి మాత్రమే దీనిని చర్చించినారు.
6-3-3 అమరికకు ఉదా. – చెడిపోయిన కార్య మెల్ల (సుశ-49), పనిఁ బూనిన వేళ మొదట (చౌశ-7).
4-5-3 అమరికకు ఉదా. – పాముల కిరవైన యట్లు (సుశ-46), భానుని కిరణములు మీఁద (చౌశ-24).
5-4-3 అమరికకు ఉదా. – భయమునను విషమ్ము నైన (సుశ-64), విడియమును బొగాకుఁ దన్ను (చౌశ-77).
6-6 అమరికకు ఉదా. – సలలితముగ నారికేళ (సుశ-107), పొగడంగా నియ్యలేని (చౌశ-75).
సుమతి శతకములో నల-జ గణమును ఒకే పదముగా నుపయోగించిన రెండు పద్యములు గలవు. అవి – చొచ్చునదే మగతనంబు (సుశ-11), కప్ప వసించిన విధంబు .(సుశ-19) కవిచౌడప్ప శతకములో ఒక పద్యములో నల-జగణ పదమును తఱువాతి పదముతో కవి కలుపుకొన్నాడు, అది – గాడిద కొడుకంచుఁ దిట్టఁ-గా (చౌశ-63).
- ఇంతకు ముందు చెప్పినట్లు కవిచౌడప్ప శతకములో ఒక పద్యములో తప్ప సరి పాదములలోని చివరి 8 మాత్రలు ముందుండు 12 మాత్రలతో సంబంధము లేక స్వతంత్రముగా నుండును. అవి ఎక్కువగా 4-4 మాత్రలుగా విఱుగును [ఉదా. ఔరా యనగా (సుశ-1) , కుంతీ సుతులన్ (చౌశ-2)]. కొన్ని సమయములలో 6-2 [ఉదా. మోహరమునఁ దా (సుశ-2)] లేక 2-6 [ఉదా. బహు దోషములన్ (చౌశ-1)] మాత్రలుగా కూడ విఱుగును, మఱికొన్ని సమయములలో ఎనిమిది మాత్రల నిడివిని ఒకే పదము ఆక్రమించును [ఉదా. వివరింపంగా (సుశ-56), రాజిల్లదుగా (చౌశ-20)]. చాల తక్కువ చోటులలో పదములు 5-3, 3-5, 2-4-2 మాత్రలుగా కూడ విఱిగిన సందర్భములు గలవు.
5-3-4 – రెండవ మాత్రాగణము జ-గణమైనప్పుడు పదము గురువుతో ప్రారంభమైనప్పుడు మనకు మొదటి రెండు మాత్రాగణములలోని పదములు 5-3 మాత్రలుగా విఱుగును, ఉదా. అక్కరకు రాని చుట్టము (సుశ-2). రెండవ మాత్రాగణము నలము ఐనప్పుడు కూడ ఇది సాధ్యము, ఉదా. ఉపమింప మొదలు తియ్యన (సుశ-17).
4-4-4 – ఈ అమరిక కూడ కంద పద్యములలోని కుఱుచ పాదములలో మనకు సామాన్యముగా సాక్షాత్కరించును, ఉదా. ఎప్పటి కెయ్యది ప్రస్తుత (సుశ-18).
6-6 – కుఱుచ పాదములలోని 12 మాత్రలు ఈ అమరికలో 6-6గా మనకు గోచరించును, అనగా రెండవ మాత్రాగణములోని మొదటి రెండు మాత్రలు ఒక పదముతో, చివరి రెండు మాత్రలు మఱొక పదముతో నుండును, ఉదా. అపకారికి నుపకారము (సుశ-16), పెద్దనవలెఁ గృతిఁ జెప్పిన (చౌశ-10).
4-8 లేక 8-4 – కొన్ని చోటులలో ఒక పదము రెండు మాత్రాగణములుగా కూడ నుండును, ఉదా. కనకపు సింహాసనమున (సుశ-27), నాయకములురా కాకర (చౌశ-22).
పైన వివరించిన విషయములను దృష్టిలో నుంచుకొనినప్పుడు మనము ఈ నిర్ణయమును తీసికొనవచ్చును – కుఱుచ పాదములలో పదములు 5-3-4, 4-4-4, 6-6 మాత్రలుగా విఱిగినప్పుడు కంద పద్యము చదువుటకు రమ్యముగా నుండును.
ఇప్పుడు పైన చర్చించిన ఈ వివరములను సంక్షిప్తముగా తెలియజేస్తున్నాను – (1) కందము చతుర్మాత్రా గణములతో నిర్మింపబడినను ఇందులో పదములు చతుర్మాత్రలుగా విఱుగవు. (2) కంద పద్యములలో సామాన్యముగా ఏ పాదమునకు ఆ పాదము స్వతంత్రముగా నుండును, అనగా పాదాంత యతి యెక్కువగా పాటించబడును. (3) బేసి పాదములలో 4-4-4, 5-3-4, 6-6 మాత్రల అమరిక జనరంజకముగా నుండును. (4) సరి పాదములలో నల-జ గణములో మొదటి మాత్ర వద్ద పదమంతమై రెండవ మాత్రవద్ద నూతన పదము ఆరంభమగునట్లు కంద పద్యమును కవులందఱు అల్లినారు. ఈ పదవిచ్ఛేదయతి లక్షణగ్రంథాలలో చెప్పబడకున్నను విధిగా పాటించబడినది. (5) సరి పాదములలో మొదటి 12 మాత్రలకు పదములు 6-3-3, 4-5-3, 5-4-3 మాత్రలుగా విఱుగును. (6) సరి పాదములలోని చివరి 8 మాత్రలు సామాన్యముగా 4-4 మాత్రల పదములుగా నుండును. (7) కుఱుచ పాదములో జ-గణములోని గురువుతో పదము ప్రారంభించగా నడక బాగుండును, కాని నిడుద పాదములోని మొదటి గణమును జ-గణముగా వాడినప్పుడు నడక కుంటువడును.
కంద పద్యపు నడకనుగుఱించి చర్చించినవారిలో నగ్రగణ్యులు గిడుగు సీతాపతి. వీరు వ్రాసిన తెలుఁగులో ఛందోరీతులు గ్రంథములో ఏయే మాత్రలపైన ఊత (stress) నుంచినయెడల కంద పద్యపు నడక సొగసుగా నుండునో అనే విషయమును సోదాహరణముగా వివరించారు. దీనిని కంద పద్యమును వ్రాయ దలచిన వాఱందరు తప్పక చదువ వలయును. వారు చేసిన పరిశోధనల రీత్యా 1 (మొదటి అక్షరము), 9 (మొదటి పాదపు మూడవ మాత్రా గణపు మొదటి అక్షరము), 13 (నిడుద పాదములోని మొదటి అక్షరము), 19 (నిడుద పాదములోని రెండవ మాత్రాగణపు మూడవ మాత్ర), 22 (నల-జ గణములోని రెండవ మాత్ర), 25 (యతి స్థానపు మొదటి అక్షరము), 29 (నిడుద పాదములోని చివరి మాత్రాగణపు మొదటి అక్షరము), 31,32 (అంత్య గురువు) మాత్రలపై ఊత నుంచి వ్రాసినప్పుడు కందము వినుటకు అందముగా, ఆనందముగా నుండునని చెప్పినారు.
బంధ కవిత్వము
కంద పద్యమును ఎన్నో చిత్ర బంధములలో చిత్రకవులు వాడినారు. క్రింద నేను కంద పద్యములతో గోమూత్రికా, కాంచీ, నవాంబుజ, శైల లేక సోపాన బంధములను సచిత్రముగా చూపుచున్నాను. గోమూత్రికా బంధములో రెండు పాదములకు ఒక అక్షరము విడిచి మఱొక అక్షరము ఒక్కటిగా నుండును. కాంచీబంధములో గోమూత్రికలోని ఒక అక్షరమువలె కాక రెండు అక్షరములను విడిచి రెండక్షరములు ఒకే విధముగా నుండును. నవాంబుజ బంధము తామర పూవు నమూనాలో కంద పద్యము వ్రాయబడినది. శైల లేక సోపాన బంధములో ఒక్కొక్క సోపానములో 1, 2, 3, … అక్షరములు ఉండును. ఇట్టివి కొన్ని కవులు వ్రాసినను, వారు పదములను ఒక సోపానమునుండి మఱొక సోపానమునకు తీసికొని వెళ్ళారు. నా ప్రయత్నములో పదము(లు) సోపానములలో అంతమగును, మఱొక పంక్తికి వెళ్ళవు. కందములో తొమ్మిది (సోపాన బంధము), పది సోపానములు (శైల బంధము) సాధ్యములు.
గర్భ కవిత్వము
కంద పద్యములను కొన్ని వృత్తములలో గర్భితము చేయుటకు వీలగును. ఇట్లు గర్భితము చేయదగు కందములను కూడ పొత్తపి వేంకటరమణకవి కందభేదములుగా పేర్కొన్నాడు. వీటిని గుఱించి ఇప్పుడు చర్చించబోవుచున్నాను. ఇవి – (1) చతుశ్చతుర్మాత్రా గణ వృత్తములు, (2) అష్ట చతుర్మాత్రా గణ వృత్తములు, (3) ఇతర వృత్తములు, జాతులు, ఉపజాతులు. ఇట్టి పద్యములను చదువునప్పుడు ఒక విషయమును గుర్తులో నుంచుకొనవలయును. గర్భ కవితలను వ్రాయునప్పుడు రెండు పద్యములకు ఆ పద్యముల గతులు ఎల్లప్పుడు సరిగా నుండవు. ఉదాహరణముగా పాదములు చతుర్మాత్రలుగా విఱిగినప్పుడు కందములోని నల-జ గణము మొదటి మాత్రవద్ద పదచ్ఛేద యతి ఉండదు. అలా ఉంచి వ్రాసినప్పుడు చతుర్మాత్రల గతి తప్పును.
1. చతుశ్చతుర్మాత్రా గణ వృత్తములు
చతుర్మాత్రలు ఐదు, కావున పాదమునకు నాలుగు చతుర్మాత్రలు ఉండే వృత్తములు 5^4, అనగా 625. ఇట్టి వృత్తముల రెండు పాదములు కొన్ని సమయములలో కంద పద్యపు రెండు పాదముల ఎనిమిది గణములతో సరిపోతుంది. అది ఎలా సాధ్యమో తెలుపుచున్నాను. కందములో చివరి గణము గుర్వంతము, కావున ఈ వృత్తములలో చివరి గణము గగము లేక స-గణముగ నుండి తీరాలి. కందములో రెండవ పాదములోని మూడవ గణము నల లేక జ-గణము. కావున చతుర్మాత్రా వృత్తములలో రెండవ గణము నలము లేక జ-గణముగా నుండి తీరాలి. అదే విధముగా మొదటి మూడవ గణము జ-గణముగా నుండ రాదు. ఈ నియమములుంచినప్పుడు, కందముతో సరిపోయే నాలుగు చతుర్మాత్రాగణముల వృత్తముల అమరిక ఇలాగుంటుంది –
మొదటి గణము – UU, UII, IIU, IIII
రెండవ గణము – IIII, IUI
మూడవ గణము – UU, UII, IIU, IIII
నాలుగవ గణము – UU, IIU
పట్టిక 4. చతుశ్చతుర్మాత్రా గణ వృత్తములు
మొదటి గణము గురువుతో (లఘువుతో) ప్రారంభమయితే నాలుగవ గణము కూడ గురువుతో (లఘువుతో) ప్రారంభము కావాలి, అప్పుడే గర్భితమైన కంద పద్యములో ప్రాసోల్లంఘనము కాదు. గురువుతో ప్రారంభించే పద్యములకు (2 x2x4x1) విధములుగా, అనగా 16 విధములుగా, పాదపు అమరిక ఉంటుంది. అదే విధముగా లఘువుతో మొదలు పెట్టిన పద్యములకు (2 x2 x4x1) విధములుగా, అనగా 16 విధములుగా, ఈ అమరికలు సాధ్యము. 625 చతుశ్చతుర్మాత్రా గణముల పద్యములలో 32కి మాత్రమే కంద పద్యపు పోలికలు ఉన్నాయి. ఇందులో రెంటిని, మణిగణనికరమును, ప్రమితాక్షరమును, పొత్తపి కవి పేర్కొన్నాడు. ప్రముదితవదనలో కూడ కంద పద్యము ఇమిడించబడినది. ఇవి కాక కూలం, ఉపసరసి, హరవిజయ వృత్తములు ఛందోగ్రంథములలో పేర్కొనబడినవి. మిగిలిన 26 వృత్తములకు లక్షణములు పేర్కొనబడ లేదు. ఈ 32 వృత్తములకు (నాలుగవ పట్టిక) లక్షణ, లక్ష్యములను అందులో గర్భితము చేయబడిన కంద పద్యములను రెండవ అనుబంధములో వివరముగా వ్రాసియున్నాను. ఇలా సంపూర్ణముగా నాలుగు చతుర్మాత్రాగణముల వృత్తములకు కంద పద్యములకు గల సంబంధము ఇంతవఱకు ఎవ్వరు తెలుపలేదు. క్రింద మచ్చున కొక ఉదాహరణము –
(29) చెలువము – న/న/స/న/లగ, యతి (1, 9) IIII IIII – UII IIU
14 శక్వరి 7936
మధురము మధురము – మాధవ యనఁగా
మధురము మధుముర – మర్దనుఁ డనఁగా
మధురము యదుకుల – మానిక మనఁగా
మధురము మధురము – మాలినిఁ గనఁగా
చెలువము చెలువము – చిన్మయుఁ డనఁగా
చెలువము చెలువము – శ్రీకరుఁ డనఁగా
చెలువము చెలువము – శ్రీపదుఁ డనఁగా
చెలువము చెలువము – చెలువునిఁ గనఁగా
విలసిత మయెనుగ – వింతల యలలై
యల లనఁగఁ గదలు – నా చికురములై
కళలను గనఁబడుఁ – గాటుక వలయా?
వలయము లనఁగను – భ్రాంతుల కలయా?
కందముగా –
విలసిత మయెనుగ వింతల
యలలై యల లనఁగఁ గదలు – నా చికురములై
కళలను గనఁబడుఁ గాటుక
వలయా? వలయము లనఁగను – భ్రాంతుల కలయా
చెలువముల సుధను – జిందెడు చెలియా
శిలవలెఁ గనఁబడు – చిత్రపు నెలయా
చెలువపు సరసునఁ – జిత్తకమలమా
మలహరి స్వరముల – మాలల పదమా
కందముగా –
చెలువముల సుధను జిందెడు
చెలియా, శిలవలెఁ గనఁబడు – చిత్రపు నెలయా
చెలువపు సరసునఁ జిత్తక-
మలమా, మలహరి స్వరముల – మాలల పదమా
అర్ధసమ, విషమ, ఉపజాతి వృత్తములు:
ఈ 32 వృత్తములను వివిధ రీతులలో అర్ధసమ వృత్తములుగా, విషమ వృత్తములుగా, ఉపజాతులుగా కూడ కల్పించవచ్చును. అందులో కొన్నిటికి కూడ కంద పద్యపు లక్షణములు గలవు. మచ్చుకు రెండు ఉదాహరణములు –
మంద్ర, అలరు వృత్తములతో ఉపజాతి –
మొదటి రెండు పాదములు –
మంద్ర – భ/జ/భ/గగ, యతి (1, 7) UII IUI – UII UU
11 త్రిష్టుభ్ 431
చివరి రెండు పాదములు –
అలరు – త/భ/న/గగ, యతి (1, 6) UU IUI – IIII UU
11 త్రిష్టుభ్ 581
చారుతరమైన – చక్కని పారా-
వారము వెలింగె – వన్నెలతోడన్
నీరంధ్రమైన – నెల కళ గారెన్
గారమ్ము నిండెఁ-గద యెదలోనన్.
కందపద్యముగా –
చారుతరమైన జక్కని
పారావారము వెలింగె – వన్నెలతోడన్
నీరంధ్రమైన నెల కళ
గారెన్ గారమ్ము నిండెఁ-గద యెదలోనన్
భాను, రజని వృత్తములతో అర్ధసమవృత్తము లేక ఉపజాతి –
పాదము 1 – UII IIII – IIU UU భాను, యతి (1, 8) 12 జగతి 511
పాదము 2 – UII IIII – UII UU రజని, యతి (1, 8) 12 జగతి 895
పాదము 3 – UII IIII – IIU UU భాను
పాదము 4 – UII IIII – UII UU రజని
అంగము పులకిత – మయెఁగా రంగా
రంగుల నినుపర – రాధను నేఁడున్
బొంగెను హృదయము – ముదమై సంగో-
త్సంగపు సమయము – శ్యామల నేఁడే
కందముగా –
అంగము పులకిత మయెఁగా
రంగా రంగుల నినుపర – రాధను నేఁడున్
బొంగెను హృదయము ముదమై
సంగోత్సంగపు సమయము – శ్యామల నేఁడే
ఇదే విధముగా ఆర్యా లేక గాథకు కూడ గ్రంథములలో పేర్కొనబడిన వృత్తములతో క్రింది పద్యమును నిర్మించినాను –
మొదటి, మూడవ పాదములు – మాణవక వృత్తము
రెండవ పాదము – పీణశ్రోణి – యతి ఆర్యకు సరిపోయేటట్లు
నాలుగవ పాదము – హంసి – యతి ఆర్యకు సరిపోయేటట్లు
శ్రీతిలకున్ మాణవకున్
జూతమ్మా నేఁడు వనినిఁ, – జూతమ్ముల్
ప్రీతముగాఁ బూఁచెఁ గదా,
చేతమ్ముల్ బూయుఁ – జెలువముతో
పట్టిక 5. కుఱుచ నిడుద పాద లక్షణములు
ఇంతకు ముందే కుఱుచ, నిడుద పాదములతో కంద పద్యమును 16 విధములుగా వ్రాయ వీలగునని తెలిపియున్నాను. అందులో పదునాలుగు కుఱుచ, నిడుద పాదములతో నుండును. మిగిలిన రెండింటిలో నొకటి కుఱుచ పాదములతో, మఱొకటి నిడుద పాదములతో మాత్రమే నుండును. కుఱుచ పాదములలో ఆఱు (అన్నియు గురువులు) నుండి 12 (అన్నియు లఘువులు) వఱకు అక్షరములు ఉండును. నిడుద పాదములలో 11 (9 గురువులు, రెందు లఘువులు) నుండి 19 (ఒక గురువు, 18 లఘువులు) అక్షరముల వఱకు నుండును. అట్టి వృత్తములను కొన్ని ఐదవ పట్టికలో చూపబడినవి.
ఇట్టి వృత్తములతో కంద పద్య లక్షణములతో నుండు అర్ధసమ వృత్తములను సృష్టించ వీలగును. మచ్చునకు క్రింద ఒక ఉదాహరణమును ఇచ్చుచున్నాను –
అక్షి – స/జ/స, IIU IUI IIU
9 బృహతి 236
విటుఁడైతి వేల తగునా
మటుమాయ మైతివి నిశిన్
ద్రుటిలోన మాయమవగా
నెటులో మనస్సు గలిగెన్
కుటిల – స/భ/న/య/గగ, యతి (1, 11) IIU UII IIII – UU UU
14 శక్వరి 1012
కుటిలా బూటకముఁ బలుకఁ – గోపమ్మౌగా
నటనల్ జాలునుర యలుక – నాశమ్మౌనా
యిటులన్ వీడితివి గదర – యింతిన్ జింతన్
గటికుండా వలదు వలదు – కాంతన్ జేరన్
అక్షి, కుటిల వృత్తములను చేర్చి కంద పద్యములను క్రింది విధముగా వ్రాయనగును. ఇట్టి కంద పద్యములను మోహన కందము అని పిలువ దలచినాను –
మోహన కందము –
బేసి పాదములు – అక్షి – స/జ/స
సరి పాదములు – కుటిల – స/భ/న/య/గగ
విటుఁడైతి వేల తగునా
గుటిలా బూటకముఁ బలుకఁ – గోపమ్మౌగా
మటుమాయ మైతివి నిశిన్
నటనల్ జాలునుర యలుక – నాశమ్మౌనా
త్రుటిలోన మాయమవఁగా
నిటులన్ వీడితివి గదర – యితిన్ జింత-
న్నెటులో మనస్సు గలిగెన్
గటికుండా వలదు వలదు – కాంతన్ జేరన్
మోహన కందము –
బేసి పాదములు – తరళనయనా – న/న/న/న
సరి పాదములు – కల్పాహారీ – న/న/న/న/మ/గ
కలలు గను సమయ మిది గద
తళతళ మని వెలిఁగెఁ జదలఁ – దారాజ్యోతుల్
చెలియఁ గను సమయ మిది గద
చెలువము వదనమునఁ గదల – శ్రీలన్ జూతున్
2. అష్ట చతుర్మాత్రా గణ వృత్తములు
పట్టిక 6. అష్టచతుర్మాత్రా గణ వృత్తములు
పాదమునకు ఎనిమిది చతుర్మాత్రా గణములు గలిగిన వృత్తములు 5^8, అనగా 390,625. అందులో 12800 కందములు ఒక ఉపవర్గము (subset). ఈ 12800 పద్యముల నిడివి 17 నుండి 31 అక్షరములు. ఇందులో చాల తక్కువ సంఖ్యగల వృత్తములు మాత్రమే ఛందోగ్రంథములలో ఉదహరించబడినవి. పొత్తపి వేంకటరమణకవి భాస్కరవిలసిత, క్రౌంచపదములను మాత్రమే పేర్కొన్నాడు. ఇవిగాక మత్తాక్రీడ, సరసిజ వృత్తములకు కూడ కంద పద్యపు లక్షణములు గలవు. నేను చదివిన లక్షణగ్రంథములలోని అట్టి వృత్తములను ఐదవ పట్టికలో చూపినాను. కంద గర్భితమైన ఈ వృత్తములకు ఉదాహరణములను మూడవ అనుబంధములో చదువవచ్చును. క్రింద మచ్చునకు ఒక ఉదాహరణమును మాత్రము ఇచ్చుచున్నాను –
మణికిరణము – కందము:
మణికిరణము – న/న/భ/న/జ/న/న/న/న/లగ, ప్రాసయతి (1, 7), యతి (1, 15, 23)
IIII IIU – IIII IIU – IIII IIII – IIII IIU
పదముల చెలి స-త్పదముల వదలన్ – బ్రణవముఁ బలుకుచు – భరముగఁ గొలుతున్
సదమల మతితో – ముదముగ సదయన్ – జదువుల కొఱకయి – సదసునఁ బిలుతున్
నిదుర మెలకువన్ – జెదరని నిధికై – నిజముగ నడిగెద – నియత సువదనన్
మృదు పదములు నా – పెదవుల మెదలన్ – మెలయుచుఁ బొగడెద – మినుకుల పడఁతిన్.
కంద పద్యములుగా –
పదముల చెలి సత్పదముల
వదలన్ బ్రణవముఁ బలుకుచు – భరముగఁ గొలుతున్
సదమల మతితో ముదముగ
సదయన్ జదువుల కొఱకయి – సదసునఁ బిలుతున్.
నిదుర మెలకువన్ జెదరని
నిధికై నిజముగ నడిగెద – నియత సువదనన్
మృదు పదములు నా పెదవుల
మెదలన్ మెలయుచుఁ బొగడెద – మినుకుల పడఁతిన్.
3. ఇతర వృత్తములు, జాతులు, ఉపజాతులు
గర్భ కవిత్వములో సామాన్యముగా మనము ఒక వృత్తములో మఱొక వృత్తమును లేక ఒక వృత్తములో జాత్యుపజాతులను చదువుతాము. అదే విధముగా జాత్యుపజాతులలో కూడ వృత్తములను గర్భితము చేయ వీలగును, ఉదా. సీసములో మత్తేభవిక్రీడితము. ఇట్టి ప్రక్రియ కందములో కూడ సాధ్యమే. కాని వీటికి ఉదాహరణములను నేను చూడలేదు. ఈ రంగములో పరిశోధన ఎంతయో అవసరము. కందములో వృత్తములను, జాత్యుపజాతులను గర్భితము చేయ వీలగుననుటకు క్రింద కొన్ని ఉదాహరణములను ఇచ్చుచున్నాను.
చంపకోత్పలమాలలలో కూడ కంద పద్యమును అల్లవచ్చును. క్రింది ఉదాహరణములో కందము మాత్రమే కాక ఒక తేటగీతి పద్యము కూడా గర్భితమై యున్నది. రావిపాటి లక్ష్మీనారాయణగారు తేటగీతి గర్భితమైన ఉత్పలమాలలలో రామాయణ భారత కథను చెప్పియున్నారు.
i. ఉత్పలమాల- కందము:
ఉత్పలమాల –
రా మధుసూదనా వడిగ – రా, వ్యధ దీరు, భవమ్ము పూయు నా-
రామములో నిలన్, సరస – రాగము పాడుమ చక్కఁగాను, దే-
వా మధురమ్ముగన్ బిలువ-వా, సుధలూర జపింతుఁ బేరు సు-
శ్యామ హరీ, సదా విడువఁ-జాలను నిన్ శిఖిపింఛధారి నేన్
కందము-
మధుసూదనా వడిగ రా
వ్యధ దీరు భవమ్ము పూయు – నారామములో
మధురమ్ముగన్ బిలువవా
సుధలూర జపింతుఁ బేరు – సుశ్యామ హరీ
తేటగీతి-
వడిగ రా వ్యధ దీరు భవమ్ము పూయు
సరస రాగము పాడుమ చక్కఁగాను
బిలువవా సుధలూర జపింతుఁ బేరు
విడువఁజాలను నిన్ శిఖిపింఛధారి
ii. చంపకమాల – కందము:
చంపకమాల –
పలు పలు రాగముల్ వినుము – వాంఛల వీణియ మ్రోఁగె నిందుఁ జం-
చలతరమై ప్రియా మనసు – సంతసమందెను డోలలూఁగుచున్
కల కల రాగముల్ గదిలెఁ – గాంక్షల సుస్వరగీతియందుఁ గం-
దళితములై సఖీ మనసు – తల్లడిలెన్ నినుఁ గాంచు వేళలో
కందము –
పలు రాగముల్ వినుము వాం-
ఛల వీణియ మ్రోఁగె నిందుఁ – జంచలతరమై
కల రాగముల్ గదిలెఁ గాం-
క్షల సుస్వరగీతియందుఁ – గందళితములై
ఒకే పదమును రెండుమారులు ఉపయోగించినచో, చంపకోత్పలమాలలలో ఒక కందమునకు బదులు రెండు కంద పద్యములను ఇమిడించ వీలగును. ఈ ప్రక్రియ నాకెక్కడ కనిపించలేదు. దానికి ఒక ఉదాహరణము –
చంపకమాల –
స్వర వరదా వినన్ బదము సాదరమై యొసగంగ వేడెదన్
వరచరణాంబుజమ్ము గడు భాసురమౌ విరులన్ భజింతు సుం-
దర తరుణీ మనోజ్ఞకవితామరధామ పురాణపుష్ప మం-
దిర తరణీ యనంత శరధీ సరసాంగి విపంచిలాలసా
చరణా, తరుణీ, తరణీ, వరదా అనే నాలుగు పదములను రెండు మారులు ఉపయోగించి అదనపు నాలుగు మాత్రలను కంద పద్యమునకు ఇచ్చి చంపకమాల పద్యములో రెండు కంద పద్యములను గర్భితము చేసినాను.
కందము –
వరదా వినన్ బదము సా-
దరమై యొసగంగ వేడె-దన్ వరచరణా
చరణాంబుజమ్ము గడు భా-
సురమౌ విరులన్ భజింతు – సుందర తరుణీ
తరుణీ మనోజ్ఞకవితా-
మరధామ పురాణపుష్ప – మందిర తరణీ
తరణీ యనంత శరధీ
సరసాంగి విపంచిలాల-సా స్వర వరదా
iii. మత్తేభవిక్రీడితము – కందము:
మత్తేభవిక్రీడితము-
ననుఁగానన్ వరదా బిరాన నిట రా, – నా నేత్రముల్ వెల్గు దీ-
నను నే నిచ్చట వేచియుంటి నిశిలో-నన్, సన్ముహూర్తాన మా-
నిని యల్లున్ మృదువౌ స్వరాల సరముల్ – నీకై హరీ దివ్య మో-
హన గానమ్ము వినంగ రమ్ము కమనీ-యాంగా శుభమ్మౌనురా
కందము-
రా ననుఁగానన్ వరదా
నే నిచ్చట వేచియుంటి – నిశిలోనన్ స
న్మానిని యల్లున్ మృదువౌ
గానమ్ము వినంగ రమ్ము – కమనీయాంగా
iv. కందము – సాధ్వీ:
కందము –
జన మోహన మురళియు మ్రోఁ-
గెను వనమున మోదమున స-కియ ముచ్చటగా
విని నా హృదియు నవ నం-
దిని యయె నిట నవ్వె సుమల-తిక నవ్యతతో
నును దేహపుటణువులు తే-
లినవి మురిసి తీయనగు ల-లియు దీపితమౌ
మన యా హరి వచనము లా-
మని విరులుగ నల్లె సరిగ-మల హారములన్
సాధ్వి – భ/న/జ/న/స/న/న/భ/గ, యతి (1, 8, 15, 22) – (భ-నల) (భ-నల) (భ-నల) (భ-గురు)
(UII IIII) (UIIIIII) (UIIIIII) (UIIU)
మోహన మురళియు – మ్రోఁగెను వనమున – మోదమున సకియ – ముచ్చటగా
నా హృదియు నవ – నందిని యయె నిట – నవ్వె సుమలతిక – నవ్యతతో
దేహపుటణువులు – తేలినవి మురిసి – తీయనగు లలియు దీపితమౌ
నా హరి వచనము – లామని విరులుగ – నల్లె సరిగమల – హారములన్
v. కందము – మణిమాల:
కందము –
నన లెల్ల పూచె సిరులై
వనాన పలు రంగు లిచ్చు – పసిమిన్ మిసిమిన్
నిను వీడి నేడు మనలే-
ను నేను వడి రమ్ము మంచి – నుడులన్ సడులన్
నను చూడ వేల నిట నా
మనస్సు వ్యధతో తపించె – మసియై నుసియై
నునులేఁత గుండెఁ గనరా
యనుంగు చిరునవ్వు వెల్గు – లలరన్ సరులై
మణిమాల – స/జ/స/జ/స/జ/స, యతి (1, 11)
IIUIUI IIUIUI IIUIUI IIU
నన లెల్ల పూచె సిరులై వ-నాన పలు రంగు లిచ్చు పసిమిన్
నిను వీడి నేడు మనలేను – నేను వడి రమ్ము మంచి నుడులన్
నను చూడ వేల నిట నా మ-నస్సు వ్యధతో తపించె మసియై
నునులేఁత గుండెఁ గనరా య-నుంగు చిరునవ్వు వెల్గు లలరన్
vi. ద్విపద – కందము:
ద్విపద – (ఇం-ఇం) – (ఇం-సూ)
చదువుల తల్లివి – స్వర సంపదలను
బదములకు నొసఁగు – పలు విధములుగ
హృది నిఁకఁ జేయుము – సృజనాస్పదమగు
సదనముగఁ గవిత – స్వర్మణి యవఁగ
కందము –
చదువుల తల్లివి స్వర సం-
పదలను బదములకు నొసఁగు – పలు విధములుగన్
హృది నిఁకఁ జేయుము సృజనా-
స్పదమగు సదనముగఁ గవిత – స్వర్మణి యవఁగన్
ఫలకభేదముతో ద్విపద – కందము
ద్విపద – (ఇం-ఇం) – (ఇం-సూ)
వరముల శిఖరను – వాణిన్ బరమను
సరసిజ నయనను – సరసంపుఁ గళనుఁ
గరుణను స్వరముల – కలిమిన్ జిరమగు
సిరులకు నిలయను – శిరసా కొలుతును
కందము –
పరమను సరసిజ నయనను
సరసంపుఁ గళనుఁ గరుణను – స్వరముల కలిమిన్
జిరమగు సిరులకు నిలయను
శిరసా కొలుతును వరముల – శిఖరను వాణిన్
vii. శుద్ధమంజరి ద్విపద – కందము:
శుద్ధమంజరి – నాలుగు చతుర్మాత్రలు, యతి (1.1, 3.1) ప్రాస, అంత్యప్రాస
గురువులు మీరే – గురు గుణ సరితా
చరణముల దలతు – సదమల చరితా
మెఱయును విశ్వా-మిత్రా చిరమై
స్థిరమై యశస్సు – శిష్యుల వరమై
కందము –
గురువులు మీరే గురు-గుణ-
సరితా చరణములఁ దలఁతు సదమల-చరితా
మెఱయును విశ్వామిత్రా
చిరమై స్థిరమై యశస్సు శిష్యుల వరమై
(ఈ పద్యము మా PhD గురువుగారు M A విశ్వామిత్రగారికి అంజలిగా వ్రాసినది)
viii. తెలుగు షట్పద – కందము:
షట్పద – (ఇం-ఇం) (ఇం-ఇం) (ఇం-ఇం-చం)
బేలను వదలకు – లీలలు చాలును – లీలాత్మ యిపుడు శ్యామా లలితా
కాలము గడిచెర – యాలన పాలనఁ – జాలించ వెతలు భార మ్మయెగా
ఆలయ మయె హృది – మేలగు మాలల – మాలీ యొసఁగెద మంగళకరమై
జాలము వలదుర – డోలలఁ దేలగఁ – గాలమ్ము వచ్చె దేవా కనరా.
కందము –
బేలను వదలకు లీలలు
చాలును లీలాత్మ యిపుడు – శ్యామా లలితా
కాలము గడిచెర యాలన
పాలనఁ జాలించ వెతలు – భార మ్మయెగా.
ఆలయ మయె హృది మేలగు
మాలల మాలీ యొసఁగెద – మంగళకరమై
జాలము వలదుర డోలలఁ
దేలగఁ గాలమ్ము వచ్చె – దేవా కనరా.
ix. ఆటవెలది – కందము:
ఆటవెలది – (సూ/సూ/సూ) (ఇం-ఇం) / (సూ-సూ-సూ) (సూ-సూ)
కనఁగనఁ గనువిందు – గదర కనకమయ
మగు జలదముల గగ-నాంకమునను
వినవినఁ జెవివిందు – వివిధ నినదముల
రసముల నొలుకు నృతి – రాగములను.
కందము –
కనఁగనఁ గనువిందు గదర
కనకమయమగు జలదముల – గగనాంకమునన్
వినవినఁ జెవివిందు వివిధ
నినదముల రసముల నొలుకు – నృతి రాగములన్
పై గర్భకవితలో ఆటవెలదిలోని అన్ని అక్షరములు ఉపయోగించబడినవి.
ఆటవెలది –
శ్రీధర నిను నే మ-ఱిమఱి మోదమ్ముగఁ
దలఁతు వలతు ముగ్ధ-త నెపుడు హరి
సాదరముగ రమ్ము – సరస నీ దర్శన
మీయ నాకు నెయ్య-మి విరియ దరి
కందము –
శ్రీధర నిను నేమ-ఱిమఱి
మోదమ్ముగఁ దలఁతు వలతు ముగ్ధ-త నెపుడు హరి
సాదరముగ రమ్ము సరస
నీ దర్శన మీయ నాకు – నెయ్యమి విరియన్
పై గర్భకవితలో ఆటవెలదిలోని బేసి పాదములలో చివరి రెండక్షరములు ఉపయోగించబలేదు.
x. తేటగీతి – కందము:
తేటగీతి – (సూ-ఇం-ఇం) (సూ-సూ)
గూటఁ గల రామ చిల్కొక – కోటి తడవ
పేరుఁ బిలిచె గోవింద హ-రీ, రమించి
మీఁటు మిఁక హృద్విపంచిని – మూట ముదము
లీయ మధుర మోహానన – రా యజింతు
కందము-
గూటఁ గల రామ చిల్కొక
కోటి తడవ పేరుఁ బిలిచె – గోవింద హరీ
మీఁటు మిఁక హృద్విపంచిని
మూట ముదము లీయ మధుర – మోహానన రా
xi. సీసము – కందము:
సీసము – (ఇం-ఇం) (ఇం-ఇం) / (ఇం-ఇం) (సూ-సూ)
ఇనకులమణి యపు – డింపుగ జనకత-
నయఁ జూచి యనెను సా-నందముగను
ఘనముగ జవముగఁ – జనియెను వననిధి
దెస గౌతమి యతి ప్ర-స్థితమతియయి
దిన మిరువురు నదిఁ – దేలుచు మన మల-
రఁగ స్నాన మాడి మై – రంజిలఁగను
వనమునఁ బూఁచిన ననలను మన మల్లి-
తిమి యవి దో@చె మౌ-క్తిక తతులయి
ఆటవెలది-
వనమున మన వాస మెనఁగ – సునయము ని-
జముగ నదివలె సుఖ-దము సుధయయి
మనము మఱువ లే మ-వనిజ యనఘ మగు
నదినిఁ బ్రదుకున హస-నపు వరమయి
కందము –
ఇనకులమణి యపు డింపుగ
జనకతనయఁ జూచి యనెను – సానందముగన్
ఘనముగ జవముగఁ జనియెను
వననిధి దెస గౌతమి యతి – ప్రస్థితమతియై
దిన మిరువురు నదిఁ – దేలుచు
మన మలరఁగ స్నాన మాడి మై – రంజిలఁగన్
వనమునఁ బూఁచిన ననలను
మన మల్లితిమి యవి దోఁచె – మౌక్తికతతులై
వనమున మన వాస మెనఁగ
సునయము నిజముగ నదివలె – సుఖదము సుధయై
మనము మఱువ లే మవనిజ
యనఘ మగు నదినిఁ బ్రదుకున – హసనపు వరమై
xii. మహాక్కర – కందము:
మహాక్కర – (సూ/ఇం/ఇం/ఇం) (ఇం/ఇం/చం).
మనసునఁ దలఁతున్ నిను నే ననయము ప్రే-మమయుఁ డనుచు ననఘా వరదా
కనులకు సొబగై నిలువన్ బ్రణమిలెదన్ – గమలనయన వర మియ్యఁగ రా
అణువణువులలో వరదా నినుఁ గన న-త్యతిశయముగ నిశిలో వెదుకన్
గనబడవు గదా నిను నేఁ గనుగొను టె-క్కడయొ యెఱుఁగఁ గలనా యిలపై.
కందము –
మనసునఁ దలఁతున్ నిను నే
ననయము ప్రేమమయుఁ డనుచు – ననఘా వరదా
కనులకు సొబగై నిలువన్
బ్రణమిలెదన్ గమలనయన – వర మియ్యఁగ రా
అణువణువులలో వరదా
నినుఁ గన న త్యతిశయముగ – నిశిలో వెదుకన్
గనబడవు గదా నిను నేఁ
గనుగొను టెక్కడయొ యెఱుఁగఁ – గలనా యిలపై.
xiii. మధురగతి రగడ – కందము:
మధురగతి రగడ – నాలుగు చతుర్మాత్రలు (జ-గణము ఉండదు), యతి మూడవ చతుర్మాత్రతో, ప్రాస, అంత్యప్రాస.
మనసన్నది యొక – మంజుల వనమా
వనమందు రవళి – వాంఛల స్వనమా
నినుఁ గన్నది యొక – నిర్మల దినమా
దినమందలి కల – తీయని క్షణమా
కందము –
మనసన్నది యొక మంజుల
వనమా, వనమందు రవళి – వాంఛల స్వనమా
నినుఁ గన్నది యొక నిర్మల
దినమా, దినమందలి కల – తీయని క్షణమా
xiv. ఉత్సాహ – కందము:
కందము –
మానస మొక దీప మయెను
మానిని వెలుఁ గీయ రావె – మాయక నెపుడున్
మానస మొక గీతమయెను
మానిని స్వర మీయ రావె – మధురతరమ్మై
మానస మొక రంగ మయెను
మానిని పద మాడ రావె – మంజుల గతులన్
మానస మొక చషక మయెను
మానిని మధు వీయ రావె – మత్తున దేలన్
ఉత్సాహ –
మానస మొక దీప మయెను – మానిని వెలుఁ గీయ రా
మానస మొక గీత మయెను – మానిని స్వర మీయ రా
మానస మొక రంగ మయెను – మానిని పద మాడ రా
మానస మొక చషక మయెను – మానిని మధు వీయ రా
క్రొత్త ఆలోచనలు కొన్ని
ఈ భాగములో మనమెఱిగిన కంద పద్యములో క్రొత్త పోకడలను గుఱించి తెలుపదలచుకొన్నాను. ఇవి రెండు విధములు: మొదటిది – కంద పద్యమును ఇంకను సుందరతరముగా చేయు పద్ధతులు, రెండవది – కంద పద్య శిల్ప నిర్మాణమును ఇతర పద్యములకు ఉపయోగించుటకు పద్ధతులు.
1. షట్పద కందము – నాలుగు పాదముల కందమును ఆఱు పాదముల షట్పద కందముగా కూడ వ్రాయనగును. సరి పాదములలో యతితోబాటు ప్రాసయతిని కూడ నుంచినప్పుడు ఇది సాధ్యమగును. ఇట్టి కంద పద్యములకు షట్పద కందములని నేను పేరునుంచినాను. క్రింద ఒక చతుర్విధ షట్పదకందము –
కందము –
ముదమునఁ జదువుల తల్లీ
హృదయపు టూహలఁ దెలిపెద – మృదు మధురముగన్
బదములు మెదలగ మదిలో
సదయారస పాడెద నీ – సదసునఁ గవితల్
షట్పదకందము –
ముదమునఁ జదువుల తల్లీ
హృదయపు టూహలఁ దెలిపెద –
మృదు మధురముగన్
బదములు మెదలగ మదిలో
సదయారస పాడెద నీ
సదసునఁ గవితల్
పై పద్యములో రెండవ, నాలుగవ, ఐదవ పాదముతో ప్రారంభించి పద్యమును వ్రాసినప్పుడు కూడ మనకు అదనముగా మూడు షట్పద కందములు లభించును, కావున ఇది చతుర్విధ కందము కూడ. ఆగస్టు 2003లో పై పద్యమును వ్రాసిన తఱువాత వెంకయ్యకవి రచించిన రామరాజీయము అను గ్రంథములో నిట్టి షట్పద కందము నాకు కనబడినది. ఆ పద్యము –
గిరిధర కమలాధ్యక్షా
సరసీరుహపత్రనయన శరనిధిశయనా
మురహర సన్నుత నామా
కరుణాకర నరసఖ హరి కరివరరక్షా – (వెంకయ్యకవి, రామరాజీయము, 339.)
2. కందార్ధ(ర్థ)ములు – యక్షగానములలో ఒక అసంపూర్ణ కందమును వ్రాసి దానికి పిదప ఒక పాటను జత చేస్తారు. దానిని యక్షగానములలో కందార్ధములు అంటారు. ఒక కంద పద్యమును వ్రాసి చివరి రెండు గణములను వదలి, తరువాత మఱొక కంద పద్యమును వ్రాసి, దానితో మఱొకటి తగిలించి, చివర ఒక కంద పద్యమును మాత్రము పూర్తిగా రచించినప్పుడు మనకు ఒక కడవకములా కంద పద్యములు తోచును. అట్టి కందార్ధముల కడవకమునకు ఒక ఉదాహరణము:
నవ్వులతో ననుఁ జక్కగ
నవ్వించెడువాఁడు వాఁడు – నా కలలోనన్
బువ్వులఁ బూజించుచు నన్
గవ్వించెడువాఁడు వాఁడు –
కమలమ్ములు నా కనులని
విమలమ్ములు నాదు నుడులు – ప్రియతమ మనుచున్
భ్రమరమ్ములు నా కురులని –
భ్రమ లిచ్చెడు వాఁడు వాఁడు –
పలు గీతములను నాకై
పలు రాగములందుఁ గ్రొత్త – పల్లవితోడన్
కలమురళీనాదమ్ముల
వెలిగించెడు వాఁడు వాఁడు –
పెను మనసు వాఁడు వెలసెను
మనుగడలో సిరిగ నాకు – మధు విచ్చుచు నా
దనువునఁ దాకిన చోటుల
ననలన్ గను వాఁడు వాఁడు –
నా వల్లభుఁడు వలపు విరి
నా వల్లభుఁడు వలరాజు – నను మురిపించున్
భావమ్ముగ రావమ్ముగ
జీవమ్ముగ నుండువాఁడు – జీవిత మతఁడే
3. త్రిభంగి వలె కందము – ప్రతి పాదములో మూడు అంత్యప్రాసలను ఉంచి వ్రాసినప్పుడు అది త్రిభంగి అవుతుంది. త్రిభంగి పేరితో ఒక ఉద్ధురమాలా వృత్తమే ఉన్నది. కందములో కూడ మూడు అంత్య ప్రాసలను ఉంచి వ్రాసినప్పుడు అది సొగసుగా నుండును. క్రింద ఒక ఉదాహరణము:
కందము-
సరసకళానిశ్రేణీ
విరించి రాణీ సురుచిర-వేణీ వినతుల్
చిరవిజ్ఞానశ్రేణీ
వర గీర్వాణీ విపంచి-పాణీ ప్రణతుల్
త్రిభంగి రూపములో –
సరసకళానిశ్రేణీ
విరించి రాణీ
సురుచిరవేణీ వినతుల్
చిరవిజ్ఞానశ్రేణీ
వర గీర్వాణీ
విపంచిపాణీ ప్రణతుల్
4. పంచపాదిగా కందము – మామూలు కంద పద్యపు నడక లోపించినను, కంద పద్యమును అంత్యప్రాసలతో ఒక పంచపాదిగా వ్రాయ వీలగును.
కందము –
మనసా వద్దమ్మ తలఁపు
కనులా వద్దమ్మ వలపు – కనరాఁడు గద
మ్మ నలుపు మణులకు నద్దం-
పు నిలుపు నినుఁ జూడ వచ్చి – ముద్దుల నిడునో.
పంచపాది రూపములో –
మనసా వద్దమ్మ తలఁపు
కనులా వద్దమ్మ వలపు
కనరాఁడు గదమ్మ నలుపు
మణులకు నద్దంపు నిలుపు
నినుఁ జూడ వచ్చి ముద్దుల నిడునో
5. 88 మాత్రల కంద షట్పదలు – ఈ షట్పదులలో మొదటి, రెండవ, నాలుగవ, ఆఱవ పాదములు కంద పద్యపు కుఱుచ పాదములు. మూడవ, ఆఱవ పాదములు కంద పద్యపు నిడుద పాదములు. కందముకన్న రెండు కుఱుచ పాదములు ఎక్కువ గనుక ఈ కంద షట్పదకు మొత్తము 88 మాత్రలు (64 + 24). క్రింద నా ఉదాహరణము –
88 మాత్రల కంద షట్పద –
స-రి-గ-మ-ప-ధ-ని-స స్వరముల్
స్వరదయు నొసఁగిన వరముల్
మఱిమఱి మదిలోన మ్రోఁగు – మంజుల రవముల్
మురియఁగ ముదమిడు గీతుల్
తరియఁగ మనసునఁ బ్రీతుల్
స్థిరముగ మదిలోన నిల్చు – చిత్రజ్యోతుల్
కందములఁ జూడ భూమియు
తొందరగ నయ్యెఁ గామియు
సందడితోఁ గురిసె వాన – సమ్మదకరమై
విందులయెఁ బూలు బలు జల
బిందువులఁ దడియఁగా నిల
సుందర షట్పదులు మ్రోఁగె – సుమధురతరమై
6. సుగంధ – కంద పద్యమునకు ఉన్న నియమములలో అతి ముఖ్యమైనది జ-గణ రహితమైన బేసి గణములు, యతి స్థానమునకు ముందుండు గణము నల లేక జ-గణముగా నుండుట. ఈ నియమమును సడలించి ఏ చతుర్మాత్రను ఎక్కడైనా వాడి వ్రాసిన కందమునకు సుగంధ అని పేరుంచినాను (సుకంద అని పిలువదలచి దానికి బదులు సుగంధ అని వాడినాను). క్రింద సుగంధకు ఉదాహరణములు –
సుగంధ –
జగాన పాపముఁ జేసెనొ
జగణము నాదిని నుంచరు – జగదాధారా
జగణముతో పద్యములను
సొగసుల నింపుచు వ్రాసెద – సుగంధ మయమై
యతి మాత్రమే కాక ప్రాసయతిని కూడ ఉంచినందువలన ఇది ఒక షట్పద కూడ.
విశ్వానలకణము నీవు
విశ్వానలకణము నేను – విశ్వ సృజనలో
ఉచ్ఛ్వాసములోనఁ బ్రేమ
నిశ్వాసములోనఁ బ్రీతి – నిస్వన మిదియే
7. ఆభాస కందము – ఒక అష్టమాత్ర ఎప్పుడు రెండు చతుర్మాత్రలు కావు. ఉదాహరణమునకు శ్రీజయదేవుని. లలిత లవంగ లతా పరిశీలన అను అష్టపదిలో నాలుగవ పదము –
మదన మహీపతి కనక దండ రుచి కేసర కుసుమ వికాసే
మిలిత శిలీముఖ పాటల పటలకృత స్మరతూణ విలాసే
ఇందులో మదనమ/ హీపతి రెండు చతుర్మాత్రలు, కాని కనక దండరుచి రెండు చతుర్మాత్రలు కావు, ఒక అష్టమాత్ర. కందములోని రెండు చతుర్మాత్రలను ఒక అష్టమాత్రగా కూడ పరిగణించవచ్చును. తెలుగులో ఇలాటివి నేను చూడలేదు, కాని కన్నడములో ఇలాటి కందములు ఉన్నవని వెంకటాచలశాస్త్రిగారు “కన్నడఛందఃస్వరూప”లో చెప్పియున్నారు, ఉదా. కుఱుచ పాదము – “గరుడతుండాగ్రదిందం”. ఇందులో మొదట రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్ర గలదు. దీనినే మఱొక రీతిలో మనము పరిశీలించవచ్చును. ఇంతకు ముందే కంద పాదములలో పదములు 5-3 మాత్రలుగా విఱుగునని విశదీకరించినాను. అంగీకృతమయిన ఐదు మాత్రలు – UIII, UUI, IIIII, IIUI. ఇవి గాక IUU, IUII, UIU, IIIU లు కూడ పంచమాత్రలే. ఇందులో IUU, IUII ఎదురు నడకతో కూడినవి, వీటిని తొలగించినప్పుడు మనకు UIU, IIIU మిగులును. వీటికి ఒక త్రిమాత్ర తగిలించినప్పుడు మనకు అష్టమాత్రలు ఈ విధముగా లభించును – UIU UI, IIIU UI, UIU III, IIIU III. వీటితో కంద పద్యములు వ్రాసి చదివినచో అవి కంద పద్యములవలెనే మనకు తోచును. అట్టి పద్యములకు క్రింద నా ఉదాహరణములు –
తలఁచితి నిన్ను మనసులో
వలచితి నే మనసునందు – వాంఛల నదియై
పై రెండు పాదములు కంద పద్యపు లక్షణములు కలిగినవి. వీటిని క్రింది విధముగా వ్రాసినయెడల రెండు చతుర్మాత్రలు ఒక అష్టమాత్రగా మారిన తీరు మనకు బోధపడును.
తలఁచితి నిన్ను మానసము
వలచితి నే మనోజగతి – వాంఛల నదియై
మఱొక పూర్తి పద్యము –
వలదురా యిట్టు లుండుట
కలఁగుచు వలపులో సతముఁ – గమరచు వ్యధతో
వెలుఁగు లేదాయె నిక్కడ
తొలకరి చినుకు లేదాయెఁ – ద్రోవలు గనవే
వాస్తవము కాకపోయినను వాస్తవమువలె గోచరించు ఇట్టి కంద పద్యములను నేను ఆభాస కందములని పిలువ దలచినాను.
8. త్రినంద, పంచనంద, తేట కందము – సమ వృత్తములలో, జాతులలో, ఉపజాతులలో ఎక్కువగా అన్ని పాదములు ఒకే విధముగా నుండును. అర్ధసమ వృత్తములలో, ఉపజాతి వృత్తములలో, ఆటవెలదివంటి ఉపజాతులలో అన్ని పాదములు ఒకే విధముగా నుండవు. అందువలన చదువునప్పుడు మనకు రెండు పాదములలో ఒక భేదత్వము (contrast) గోచరించును. ఈ సిద్ధాంతము కందములో కూడ నున్నది. మొదటి పాదములో మూడు చతుర్మాత్రా గణములు, రెండవ పాదములో ఐదు చతుర్మాత్రా గణములు కందపు ప్రత్యేకత. చతుర్మాత్రలకు బదులు, త్రిమాత్రలను, పంచమాత్రలను ఉపయోగించి కందములవలె పద్యములను వ్రాయవచ్చును. ఇట్లు వ్రాసిన పద్యములకు నేను త్రినంద, పంచనంద అని పేరుల నుంచినాను. త్రిమాత్రలలో జ-గణపు స్థానమును లగము, పంచమాత్రలలో జ-ల, య-గణములు ఆక్రమించును. క్రింద నా ఉదాహరణములు –
త్రినంద –
శ్రీ గణనాయకుని
రాగసుధలఁ జిలుకు – రసధుని నా
వాగనుశాసనుని
నాగమనుతుఁ గొలుతు – నగజసుతున్
పంచనంద –
అలవోలె ముంచె నన్నందములు
వలలోనఁ జొచ్చితిని వలపులను – వలయమును జేరితిన్
బలు వన్నె వెన్నెలలఁ జూచితిని
తళుకారు తారకలఁ బిలిచితిని – దాఁకితిని దివము నేన్
ఇదే విధముగా తేటగీతివంటి పద్యములను కూడ రచించవచ్చును. క్రింద ఒక ఉదాహరణ –
తేట కందము –
ఎదయు పిడికిలి పూవులై
ముదముతో కొన్ని వేళల – మురిసిపోవు
నెదయు పిడికిలి పూవులై
వ్యధలతో కొన్ని వేళల – వాడిపోవు
నాకు నచ్చిన కొన్ని కంద పద్యములు
నాకు నచ్చిన కొన్ని కంద పద్యములను క్రింద మీ పఠనానందముకోసము ఇస్తున్నాను –
నీ పుణ్య తనువువలనన
యీ పుత్త్రకుఁ డుద్భవిల్లి – యెంతయు నొప్పున్
దీపంబువలన నొండొక
దీపము ప్రభవించినట్లు – తేజం బెసఁగన్ – (నన్నయ భారతము, ఆదిపర్వము, 4.90)
గిరిసుత మైఁ గామాగ్నియు
హరుమై రోషాగ్నియుం ద-దంగజుమై ను-
ద్ధుర కాలాగ్నియు రతిమై
నురు శోకాగ్నియును దగిలి – యొక్కట నెగసెన్ – (నన్నెచోడుని కుమారసంభవము, 5.52)
కలిమికి నొప్పగు నీగియు
బలిమికిఁ దొడవైనయట్టి – బలగమునై లో-
కుల చిత్తములకు వ్రేఁగగు
కొలఁది మనన్ గొంతి పెద్ద – కొడుకున కమరున్ – (తిక్కన భారతము, విరాటపర్వము, 2.190)
నెలనెల దప్పక యుండఁగ
నెల భాస్కరుఁ జొచ్చుటెల్ల – నియమముతోడన్
గలహంస వేఁడి వెన్నెల
సొలయక నా యంగకములు – సూఁడుటకుఁ జుమీ – (శ్రీనాథుని శృంగార నైషధము, 2.33)
ఉన్నాఁడు లెస్స రాఘవుఁ
డున్నాఁ డిదె కపులఁ గూడి – యురుగతి రానై
యున్నాఁడు నిన్ను గొనిపో-
నున్నాఁ డిది నిజము నమ్ము – ముర్వీతనయా – (మొల్ల రామాయణము, సుందరకాండము, 91)
లీలన్ రామవిభుం డొక
కోలన్ గూలంగ నేసె – గురు నయశాలిన్
శీలిన్ సేవిత శూలిన్
మాలిన్ వాలిన్ దశాస్య – మానోన్మూలిన్ – (పోతన భాగవతము, 9.273)
అంధునకుఁ గొఱయె వెన్నెల
గంధర్వాంగనల పొందు – గాదని సంసా-
రాంధువునఁ బడియె దకట ది-
వాంధము వెలుఁగు గని గొంది – నడఁగినభంగిన్ – (పెద్దన మనుచరిత్ర, 2.56)
మేల్కొనుము దేవ యివె రా-
చిల్కలు కను మొగిచియున్న – చెలువలఁ దమకున్
బల్కులు నేర్పఁగ ముద్దులు
గుల్కెడు పల్కులను మేలు-కొలిపెడుఁ గృష్ణా – (తిమ్మన పారిజాతపహరనము, 2.58)
గడగడ వడఁకుచు నుడువులు
తడఁబడ సిగ్గడర నెడఁద – దడదడ మనఁగా
జడువున్ జెమ్మట నొడలున్
దడియ దశాస్యుఁ గని రంభ – తడయక పలికెన్ – (పాపరాజు ఉత్తరరామాయణము, 4.203)
ముగింపు
తెలుగు సాహిత్యపు ఛందోగగనములో మిక్కిలి ప్రకాశవంతముగా మెరిసే మినుగుతార కందపద్యము. ఒక చిన్న పద్యములో అనేకానేక భావములను సంతరించుకొనే శక్తి సామర్థ్యములు గలిగిన పద్యము కందపద్యము. కథ గాని, కావ్యము గాని, చాటువు గాని, శతకము గాని కవులు ఎంచుకొనే మొదటి పద్యము కందపద్యము. ఇట్టి కంద పద్యపు పుట్టు పూర్వోత్తరాలను, అందచందాలను, భూతభవిష్యత్తులను నా శక్తి మేరకు ఈ రెండు వ్యాసములలో తెలిపినాను. సహృదయులు బాగోగులను విమర్శనాపూర్వకముగా తెలిపినచో నేను కృతకృత్యుడయినానని భావిస్తాను.
కందము మాకందముపై
నందముగా పాడుచుండు – నా పిక గీతుల్
డెందము నూపుచు నుండును
బృందావని మోహనాఖ్యు – ప్రియ భాష్యములై
[కృతజ్ఞతలు: నేను ఈ వ్యాసములో ప్రచురించిన పద్యములను ఒక మారు చదివి అక్కడక్కడ దొరలిన కొన్ని దోషములను సవరించిన శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను అర్పిస్తున్నాను. – JKM.]
ఉపయుక్త గ్రంథసూచి
సంస్కృతము –
(1) ఛందఃశాస్త్రం – పింగలాచార్య – సం. అనంతశర్మ, కేదారనాథ – పరిమల పబ్లికేషన్స్ – ఢిల్లీ, 2001.
(2) జయదామన్ (జయకీర్తి చందోనుశాసనము, హేమచంద్రుని ఛందోనుశాసనము) – సం. హరి దామోదర్ వేళంకర్, హరితోష సమితి, బాంబే, 1949.
(3) వృత్తరత్నాకరః – కేదారభట్ట – చౌఖంభా సంస్కృత సంస్థాన, వారాణసీ, 1995.
ప్రాకృతము –
(1) ప్రాకృత పింగలసూత్రాణి – సం. శివదత్త, నిర్ణయసాగర్ ముద్రణాలయము, 1894.
(2) స్వయంభూఛంద – సం. హరి దామోదర్ వేళంకర్, రాజస్థాన ప్రాచ్యవిద్యా ప్రతిష్ఠాన, జోధ్‌పుర్, 1962.
(3) వృత్తజాతి సముచ్చయ – సం. జినవిజయముని, ఆజస్థాన ప్రాచ్యవిద్యా ప్రతిష్ఠాన, జోధ్‌పుర్, 1962.
కన్నడము –
(1) నాగవర్మన కన్నడ ఛందస్సు – ఎఫ్. కిట్టెల్, Basel Book and Mission Tract Depository, మంగళూరు, 1875.
(2) కన్నడ ఛందఃస్వరూప, తోగరె వెంకటాచల శాస్త్రీ, DVK మూర్తి ప్రకాశన, 2012.
తెలుగు –
(1) కవిజనాశ్రయము – రేచన / భీమకవి – ఆంధ్రసాహిత్య పరిషత్తు, 1932.
(2) ఛందోదర్పణము – అనంతామాత్యుడు, సం. చిర్రావూరి శ్రీరామశర్మ, రోహిణీ పబ్లికేషన్స్, రాజమండ్రి, 1998.
(3) అప్పకవీయము – కాకునూరి అప్పకవి, సం. గిడుగు రామమూర్తి పంతులు, ఉత్పల వేంకటానరసింహాచార్యులు, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి, 1934.
(4) లక్షణశిరోమణి – పొత్తపి వేంకటరమణకవి, సం. రావూరి దొరస్వామిశర్మ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1979.
(5) ఆంధ్రచ్ఛందోవికాసము – మోడేకుర్తి వేంకట సత్యనారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్టణం, 1990.
(6) తెలుగులో ఛందోరీతులు – గిడుగు వేంకట సీతాపతి, విశాలా పబ్లికేషన్స్, హైదరాబాదు, 1961.