- సుమతి శతకములో పద్యము లన్నియు పథ్యా కందములే, అనగా ఏ పాదమునకు ఆ పాదము స్వతంత్రముగా నిలిచి యుండును. ఒక పాదమునునుండి పదము మఱొక పాదమునకు చొచ్చుకొని వెళ్ళదు. కాని కవి చౌడప్ప శతకములో 200 పాదములలో 23 పాదములకు విపులత్వము గలదు, అనగా సుమారు నూటికి పది కుఱుచ పాదములలో చివరి పదము తఱువాతి పాదములోనికి వెళ్ళును, ఉదా. పై పద్యములో “అఖండిత” అను పదము మూడవ, నాలుగవ పాదములలో గలదు. చౌడప్ప వ్రాసిన పద్యములలో 11 పద్యములలో పదము రెండవ పాదమునుండి మూడవ పాదమునకు చొచ్చుకొని పోవును. కొన్ని వేళలలో పై ఉదాహరణమునందలి ‘ఎవ్వండో’ వలె ఇది సంధిగతముగా నుండును, మఱి కొన్ని వేలలలో ‘సం-క్రందన’ వలె ఒకే పదము రెండు పాదములను ఆక్రమించును. సంస్కృతములోని ఆర్యా భేదములలో, ప్రాకృతములోని గాథా భేదములలో ఇట్టి ప్రయోగమును మనము పరికించము. అనగా, రెండవ పాదమువద్ద పదము తప్పక అంతమగును. కాని ఎన్నో అతివిపులా కందములను మనము తిక్కన భారతములో చదువవచ్చును. దీనిని అలాగుంచితే, కవి చౌడప్ప రచించిన కంద పద్యములలో సుమారు 80 శాతము పథ్యా కందములే. ఈ వివరణలను బట్టి మనము ఒక నిర్ణయమునకు రావచ్చును, అదేమనగా అత్యవసరమైన పరిస్థితులలో తప్ప కంద పద్యములలో అన్ని పాదములకు పాదాంత యతి ఉండినప్పుడు, చదువుకొనుటకు రమ్యముగా నుండును. సుమతి శతకమును ఒక్కరే వ్రాసినారా లేక వివిధ కవులు వ్రాసినారా అనే ప్రశ్న ఒకటున్నది. నా ఈ ఛందస్సు పరిశోధన ద్వారా ఒక విషయము మాత్రము నిజము. కంద పద్యములో ఏ పాదమునకు ఆ పాదము స్వతంత్రముగా నిలుచుట, నల-జ గణములో విరామయతిని పాటించుటను బట్టి అవి ఒకే నియమచట్రములో వ్రాయబడినవి అని మాత్రము చెప్ప వీలగును.
- కుఱుచ పాదములలో పదముల విఱుపు ఎక్కువగా 5-3-4, 4-4-4, 6-6 మాత్రలకే పరిమితము. ఐదు మాత్రల పదములయందలి గురులఘువులు ఈ విధముగా నుండును – UIII, UUI, IIIII, IIUI.
- ఇక నిడుద (రెండవ, నాలుగవ) పాదములలోని మొదటి 12 మాత్రల అమరికను ఇప్పుడు చర్చిద్దాము. ఇందులో ఎక్కువగా 6-3-3, 4-5-3 మాత్రలతో నుండే పదములే ఎక్కువ. ఏవో చాల తక్కువ చోటులలో తప్ప మిగిలిన అన్ని సమయములలో మొదటి 12 మాత్రలలో చివరి పదము ఎప్పుడు మూడు మాత్రలకు పరిమితము. కందములో గణములు చతుర్మాత్రా గణములైనను, నల-జ గణములో మొదటి మాత్రతో పూర్వ పదము అంతమై, రెండవ మాత్రతో మఱొక చిన్న పదము ప్రారంభమవుతుంది. ఇంతకు ముందే ఆర్య లేక గాథలో ఈ గణము నలమైనప్పుడు ఈ నియమము ఉన్నదని తెలిపియున్నాను, కాని అక్కడ జ-గణమునకు ఈ నియమము లేదు. కాని కన్నడ, తెలుగు భాషలలో పూర్వమునుండి నేటివఱకు కవులందఱు ఈ నియమమును పాటించుచున్నారు. నేను తెలుగులో మనకు లభించిన మొదటి ఛందోగ్రంథమైన కవిజనాశ్రయములో ఈ నియమము పాటించబడినదా లేదా అన్న విషయమును కూడ పరిశీలించినాను. ఈ గ్రంథములో వృత్తములకు తెలిపిన ఉదాహరణములు తప్ప మిగిలినవి కంద పద్యములే. వీటిలో సుమారు ప్రతి ఏడు పద్యములలో ఆఱింటికి ఈ నియమము పాటించబడినది. తెలుగులో వడి లేక అక్షరసామ్య యతి మాత్రమే ఆచరించబడును, సంస్కృతములోవలె పదచ్ఛేదయతి లేదు. కాని కంద పద్యములలో నల-జ గణములో ఈ పదచ్ఛేద యతిని పాటించని పద్యములు చాల తక్కువ. మఱి ఈ నియమమునుగుఱించి ఎందుకు లాక్షణికులు చర్చించలేదో? ఒక్క గిడుగు సీతాపతి మాత్రమే దీనిని చర్చించినారు.
6-3-3 అమరికకు ఉదా. – చెడిపోయిన కార్య మెల్ల (సుశ-49), పనిఁ బూనిన వేళ మొదట (చౌశ-7).
4-5-3 అమరికకు ఉదా. – పాముల కిరవైన యట్లు (సుశ-46), భానుని కిరణములు మీఁద (చౌశ-24).
5-4-3 అమరికకు ఉదా. – భయమునను విషమ్ము నైన (సుశ-64), విడియమును బొగాకుఁ దన్ను (చౌశ-77).
6-6 అమరికకు ఉదా. – సలలితముగ నారికేళ (సుశ-107), పొగడంగా నియ్యలేని (చౌశ-75).
సుమతి శతకములో నల-జ గణమును ఒకే పదముగా నుపయోగించిన రెండు పద్యములు గలవు. అవి – చొచ్చునదే మగతనంబు (సుశ-11), కప్ప వసించిన విధంబు .(సుశ-19) కవిచౌడప్ప శతకములో ఒక పద్యములో నల-జగణ పదమును తఱువాతి పదముతో కవి కలుపుకొన్నాడు, అది – గాడిద కొడుకంచుఁ దిట్టఁ-గా (చౌశ-63).
- ఇంతకు ముందు చెప్పినట్లు కవిచౌడప్ప శతకములో ఒక పద్యములో తప్ప సరి పాదములలోని చివరి 8 మాత్రలు ముందుండు 12 మాత్రలతో సంబంధము లేక స్వతంత్రముగా నుండును. అవి ఎక్కువగా 4-4 మాత్రలుగా విఱుగును [ఉదా. ఔరా యనగా (సుశ-1) , కుంతీ సుతులన్ (చౌశ-2)]. కొన్ని సమయములలో 6-2 [ఉదా. మోహరమునఁ దా (సుశ-2)] లేక 2-6 [ఉదా. బహు దోషములన్ (చౌశ-1)] మాత్రలుగా కూడ విఱుగును, మఱికొన్ని సమయములలో ఎనిమిది మాత్రల నిడివిని ఒకే పదము ఆక్రమించును [ఉదా. వివరింపంగా (సుశ-56), రాజిల్లదుగా (చౌశ-20)]. చాల తక్కువ చోటులలో పదములు 5-3, 3-5, 2-4-2 మాత్రలుగా కూడ విఱిగిన సందర్భములు గలవు.
5-3-4 – రెండవ మాత్రాగణము జ-గణమైనప్పుడు పదము గురువుతో ప్రారంభమైనప్పుడు మనకు మొదటి రెండు మాత్రాగణములలోని పదములు 5-3 మాత్రలుగా విఱుగును, ఉదా. అక్కరకు రాని చుట్టము (సుశ-2). రెండవ మాత్రాగణము నలము ఐనప్పుడు కూడ ఇది సాధ్యము, ఉదా. ఉపమింప మొదలు తియ్యన (సుశ-17).
4-4-4 – ఈ అమరిక కూడ కంద పద్యములలోని కుఱుచ పాదములలో మనకు సామాన్యముగా సాక్షాత్కరించును, ఉదా. ఎప్పటి కెయ్యది ప్రస్తుత (సుశ-18).
6-6 – కుఱుచ పాదములలోని 12 మాత్రలు ఈ అమరికలో 6-6గా మనకు గోచరించును, అనగా రెండవ మాత్రాగణములోని మొదటి రెండు మాత్రలు ఒక పదముతో, చివరి రెండు మాత్రలు మఱొక పదముతో నుండును, ఉదా. అపకారికి నుపకారము (సుశ-16), పెద్దనవలెఁ గృతిఁ జెప్పిన (చౌశ-10).
4-8 లేక 8-4 – కొన్ని చోటులలో ఒక పదము రెండు మాత్రాగణములుగా కూడ నుండును, ఉదా. కనకపు సింహాసనమున (సుశ-27), నాయకములురా కాకర (చౌశ-22).
పైన వివరించిన విషయములను దృష్టిలో నుంచుకొనినప్పుడు మనము ఈ నిర్ణయమును తీసికొనవచ్చును – కుఱుచ పాదములలో పదములు 5-3-4, 4-4-4, 6-6 మాత్రలుగా విఱిగినప్పుడు కంద పద్యము చదువుటకు రమ్యముగా నుండును.
ఇప్పుడు పైన చర్చించిన ఈ వివరములను సంక్షిప్తముగా తెలియజేస్తున్నాను – (1) కందము చతుర్మాత్రా గణములతో నిర్మింపబడినను ఇందులో పదములు చతుర్మాత్రలుగా విఱుగవు. (2) కంద పద్యములలో సామాన్యముగా ఏ పాదమునకు ఆ పాదము స్వతంత్రముగా నుండును, అనగా పాదాంత యతి యెక్కువగా పాటించబడును. (3) బేసి పాదములలో 4-4-4, 5-3-4, 6-6 మాత్రల అమరిక జనరంజకముగా నుండును. (4) సరి పాదములలో నల-జ గణములో మొదటి మాత్ర వద్ద పదమంతమై రెండవ మాత్రవద్ద నూతన పదము ఆరంభమగునట్లు కంద పద్యమును కవులందఱు అల్లినారు. ఈ పదవిచ్ఛేదయతి లక్షణగ్రంథాలలో చెప్పబడకున్నను విధిగా పాటించబడినది. (5) సరి పాదములలో మొదటి 12 మాత్రలకు పదములు 6-3-3, 4-5-3, 5-4-3 మాత్రలుగా విఱుగును. (6) సరి పాదములలోని చివరి 8 మాత్రలు సామాన్యముగా 4-4 మాత్రల పదములుగా నుండును. (7) కుఱుచ పాదములో జ-గణములోని గురువుతో పదము ప్రారంభించగా నడక బాగుండును, కాని నిడుద పాదములోని మొదటి గణమును జ-గణముగా వాడినప్పుడు నడక కుంటువడును.
కంద పద్యపు నడకనుగుఱించి చర్చించినవారిలో నగ్రగణ్యులు గిడుగు సీతాపతి. వీరు వ్రాసిన తెలుఁగులో ఛందోరీతులు గ్రంథములో ఏయే మాత్రలపైన ఊత (stress) నుంచినయెడల కంద పద్యపు నడక సొగసుగా నుండునో అనే విషయమును సోదాహరణముగా వివరించారు. దీనిని కంద పద్యమును వ్రాయ దలచిన వాఱందరు తప్పక చదువ వలయును. వారు చేసిన పరిశోధనల రీత్యా 1 (మొదటి అక్షరము), 9 (మొదటి పాదపు మూడవ మాత్రా గణపు మొదటి అక్షరము), 13 (నిడుద పాదములోని మొదటి అక్షరము), 19 (నిడుద పాదములోని రెండవ మాత్రాగణపు మూడవ మాత్ర), 22 (నల-జ గణములోని రెండవ మాత్ర), 25 (యతి స్థానపు మొదటి అక్షరము), 29 (నిడుద పాదములోని చివరి మాత్రాగణపు మొదటి అక్షరము), 31,32 (అంత్య గురువు) మాత్రలపై ఊత నుంచి వ్రాసినప్పుడు కందము వినుటకు అందముగా, ఆనందముగా నుండునని చెప్పినారు.
బంధ కవిత్వము
కంద పద్యమును ఎన్నో చిత్ర బంధములలో చిత్రకవులు వాడినారు. క్రింద నేను కంద పద్యములతో గోమూత్రికా, కాంచీ, నవాంబుజ, శైల లేక సోపాన బంధములను సచిత్రముగా చూపుచున్నాను. గోమూత్రికా బంధములో రెండు పాదములకు ఒక అక్షరము విడిచి మఱొక అక్షరము ఒక్కటిగా నుండును. కాంచీబంధములో గోమూత్రికలోని ఒక అక్షరమువలె కాక రెండు అక్షరములను విడిచి రెండక్షరములు ఒకే విధముగా నుండును. నవాంబుజ బంధము తామర పూవు నమూనాలో కంద పద్యము వ్రాయబడినది. శైల లేక సోపాన బంధములో ఒక్కొక్క సోపానములో 1, 2, 3, … అక్షరములు ఉండును. ఇట్టివి కొన్ని కవులు వ్రాసినను, వారు పదములను ఒక సోపానమునుండి మఱొక సోపానమునకు తీసికొని వెళ్ళారు. నా ప్రయత్నములో పదము(లు) సోపానములలో అంతమగును, మఱొక పంక్తికి వెళ్ళవు. కందములో తొమ్మిది (సోపాన బంధము), పది సోపానములు (శైల బంధము) సాధ్యములు.
గర్భ కవిత్వము
కంద పద్యములను కొన్ని వృత్తములలో గర్భితము చేయుటకు వీలగును. ఇట్లు గర్భితము చేయదగు కందములను కూడ పొత్తపి వేంకటరమణకవి కందభేదములుగా పేర్కొన్నాడు. వీటిని గుఱించి ఇప్పుడు చర్చించబోవుచున్నాను. ఇవి – (1) చతుశ్చతుర్మాత్రా గణ వృత్తములు, (2) అష్ట చతుర్మాత్రా గణ వృత్తములు, (3) ఇతర వృత్తములు, జాతులు, ఉపజాతులు. ఇట్టి పద్యములను చదువునప్పుడు ఒక విషయమును గుర్తులో నుంచుకొనవలయును. గర్భ కవితలను వ్రాయునప్పుడు రెండు పద్యములకు ఆ పద్యముల గతులు ఎల్లప్పుడు సరిగా నుండవు. ఉదాహరణముగా పాదములు చతుర్మాత్రలుగా విఱిగినప్పుడు కందములోని నల-జ గణము మొదటి మాత్రవద్ద పదచ్ఛేద యతి ఉండదు. అలా ఉంచి వ్రాసినప్పుడు చతుర్మాత్రల గతి తప్పును.
1. చతుశ్చతుర్మాత్రా గణ వృత్తములు
చతుర్మాత్రలు ఐదు, కావున పాదమునకు నాలుగు చతుర్మాత్రలు ఉండే వృత్తములు 5^4, అనగా 625. ఇట్టి వృత్తముల రెండు పాదములు కొన్ని సమయములలో కంద పద్యపు రెండు పాదముల ఎనిమిది గణములతో సరిపోతుంది. అది ఎలా సాధ్యమో తెలుపుచున్నాను. కందములో చివరి గణము గుర్వంతము, కావున ఈ వృత్తములలో చివరి గణము గగము లేక స-గణముగ నుండి తీరాలి. కందములో రెండవ పాదములోని మూడవ గణము నల లేక జ-గణము. కావున చతుర్మాత్రా వృత్తములలో రెండవ గణము నలము లేక జ-గణముగా నుండి తీరాలి. అదే విధముగా మొదటి మూడవ గణము జ-గణముగా నుండ రాదు. ఈ నియమములుంచినప్పుడు, కందముతో సరిపోయే నాలుగు చతుర్మాత్రాగణముల వృత్తముల అమరిక ఇలాగుంటుంది –
మొదటి గణము – UU, UII, IIU, IIII
రెండవ గణము – IIII, IUI
మూడవ గణము – UU, UII, IIU, IIII
నాలుగవ గణము – UU, IIU
పట్టిక 4. చతుశ్చతుర్మాత్రా గణ వృత్తములు
మొదటి గణము గురువుతో (లఘువుతో) ప్రారంభమయితే నాలుగవ గణము కూడ గురువుతో (లఘువుతో) ప్రారంభము కావాలి, అప్పుడే గర్భితమైన కంద పద్యములో ప్రాసోల్లంఘనము కాదు. గురువుతో ప్రారంభించే పద్యములకు (2 x2x4x1) విధములుగా, అనగా 16 విధములుగా, పాదపు అమరిక ఉంటుంది. అదే విధముగా లఘువుతో మొదలు పెట్టిన పద్యములకు (2 x2 x4x1) విధములుగా, అనగా 16 విధములుగా, ఈ అమరికలు సాధ్యము. 625 చతుశ్చతుర్మాత్రా గణముల పద్యములలో 32కి మాత్రమే కంద పద్యపు పోలికలు ఉన్నాయి. ఇందులో రెంటిని, మణిగణనికరమును, ప్రమితాక్షరమును, పొత్తపి కవి పేర్కొన్నాడు. ప్రముదితవదనలో కూడ కంద పద్యము ఇమిడించబడినది. ఇవి కాక కూలం, ఉపసరసి, హరవిజయ వృత్తములు ఛందోగ్రంథములలో పేర్కొనబడినవి. మిగిలిన 26 వృత్తములకు లక్షణములు పేర్కొనబడ లేదు. ఈ 32 వృత్తములకు (నాలుగవ పట్టిక) లక్షణ, లక్ష్యములను అందులో గర్భితము చేయబడిన కంద పద్యములను రెండవ అనుబంధములో వివరముగా వ్రాసియున్నాను. ఇలా సంపూర్ణముగా నాలుగు చతుర్మాత్రాగణముల వృత్తములకు కంద పద్యములకు గల సంబంధము ఇంతవఱకు ఎవ్వరు తెలుపలేదు. క్రింద మచ్చున కొక ఉదాహరణము –
(29) చెలువము – న/న/స/న/లగ, యతి (1, 9) IIII IIII – UII IIU
14 శక్వరి 7936
మధురము మధురము – మాధవ యనఁగా
మధురము మధుముర – మర్దనుఁ డనఁగా
మధురము యదుకుల – మానిక మనఁగా
మధురము మధురము – మాలినిఁ గనఁగా
చెలువము చెలువము – చిన్మయుఁ డనఁగా
చెలువము చెలువము – శ్రీకరుఁ డనఁగా
చెలువము చెలువము – శ్రీపదుఁ డనఁగా
చెలువము చెలువము – చెలువునిఁ గనఁగా
విలసిత మయెనుగ – వింతల యలలై
యల లనఁగఁ గదలు – నా చికురములై
కళలను గనఁబడుఁ – గాటుక వలయా?
వలయము లనఁగను – భ్రాంతుల కలయా?
కందముగా –
విలసిత మయెనుగ వింతల
యలలై యల లనఁగఁ గదలు – నా చికురములై
కళలను గనఁబడుఁ గాటుక
వలయా? వలయము లనఁగను – భ్రాంతుల కలయా
చెలువముల సుధను – జిందెడు చెలియా
శిలవలెఁ గనఁబడు – చిత్రపు నెలయా
చెలువపు సరసునఁ – జిత్తకమలమా
మలహరి స్వరముల – మాలల పదమా
కందముగా –
చెలువముల సుధను జిందెడు
చెలియా, శిలవలెఁ గనఁబడు – చిత్రపు నెలయా
చెలువపు సరసునఁ జిత్తక-
మలమా, మలహరి స్వరముల – మాలల పదమా