కొత్తపల్లి – పిల్లల పత్రిక సంపాదకుడు నారాయణ శర్మతో ముఖాముఖి

[కొత్తపల్లి – అనంతపురం నుంచి వెలువడుతున్న పిల్లల మాసపత్రిక. తెలుగు పిల్లలకు మానవీయ స్పర్శ ఉన్న కథలను, ఆటపాటలను, విద్య, విజ్ఞాన, వినోదాలను, పిల్లల స్వీయ దృక్పథంలో బేషరతుగా అందించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్న ఈ పత్రికలో రచయితలు చాలామంది చిన్న పిల్లలే. ఒక చక్కటి ఆశయంతో వస్తున్న ఈ పత్రిక ప్రధాన సంపాదకుడు నారాయణ శర్మతో, రిషివేలీ పాఠశాలలో ఉపాధ్యాయులైన పిడూరి రాజశేఖర్ జరిపిన ముఖాముఖీ మీకందిస్తున్నాం. కొత్తపల్లి వంటి పత్రికలను స్వచ్ఛందంగా ఈమాట పాఠకులు ప్రోత్సహించి ఆదరిస్తారని ఆశిస్తున్నాం.]


నమస్కారం నారాయణ గారూ! కొత్తపల్లి పిల్లల పత్రిక ఎలా మొదలయింది అని రొటీన్ ప్రశ్నలు తరవాత అడుగుతాను కాని అసలు పిల్లలు కథలు చదవడం, రాయడం అనేవి భాష పట్ల వాళ్ళకున్న సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో – ఈ మౌలిక భావన గురించి కొంచెం చెప్పండి.

పిల్లల్లో భాష పట్ల ఉత్సాహం కలిగించడానికి కథల పుస్తకాలు చదవడం అనేది ఒక ముఖ్యమైన అంశం అని నేను అనుకుంటాను. మొదటగా చిన్న కథల పుస్తకాలు చదవడం, తర్వాత ఆసక్తి కలిగి ఇంకొంచెం పెద్ద పుస్తకాలు చదవడం, దాని తర్వాత ఇంకా పెద్ద పుస్తకాలు చదవాలనిపించడం, తర్వాత పాత పుస్తకాల్లో ఏముందో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగి వాటిని కూడా చదవడం — ఇదంతా ఓ పరిణామ క్రమంలో జరిగి అందరికీ, భాషకీ ఎంతో ప్రయోజనం జరుగుతుందని నేను అనుకుంటాను.

ఇలా కేవలం చదవడమే కాక ఇంకొక ముఖ్యమైన కోణం కూడా దీనికి ఉంది. ఒకప్పటి చందమామకీ ఇప్పుడు మనం చేస్తున్న ఈ కొత్తపల్లి అనే ప్రయోగానికీ ఉన్న ముఖ్యమైన తేడా (చందమామలాంటి పత్రికలతో పోల్చుకోవడం అని కాదు కాని) — పిల్లల చేత రాయించడానికీ, వాళ్ళు రాసిన కథలకీ ప్రాముఖ్యాన్నివ్వడం.

నిజానికి ఈ పనిని దశాబ్దాల కిందట ‘బాల’ పత్రిక చాలా బాగా చేసిందని చెప్పవచ్చు. అంటే రేడియో అన్నయ్యగారు చేసిన పని చాలా ఇన్‌స్పైరింగ్ అండ్ పాత్‌బ్రేకింగ్ అన్నమాట. పాత బాల పత్రికలు తిరగేస్తే ఆ పత్రిక పిల్లలకి చాలా ఎక్కువ సంతోషం కలిగించిందని అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ 67 కొత్తపల్లి సంచికలు వచ్చాక కూడా ఓ సారి తిరిగి చూసుకుంటే కొత్తపల్లి బాల స్థాయిలో లేదనిపిస్తుంది. బాలలో కథలు రాసిన వాళ్ళు, బొమ్మలు వేసిన వాళ్ళు చాలా మంది తర్వాత తరాలలో భాష పట్ల అభిమానాన్ని పెంచుకొని కృషి చేసిన వారయ్యారని మనం గమనించవచ్చు.

బాపు, ముళ్ళపూడి…

ఆఁ అవును. కాబట్టి పిల్లల పార్టిసిపేషన్ ఉన్నట్లయితే అది ఇంకా సంతోషం కలిగించి భాష వాళ్ళకి బాగా పట్టుపడుతుంది. మొదటి డైమన్షన్ పిల్లల చేత కథల పుస్తకాలు చదివించడం అయితే రెండవది ఈ సృజనలో వాళ్ళు పాలు పంచుకోవడం. ఈ రెండు డైమన్షన్లూ కొత్తపల్లి పత్రిక చూసిన వారికెవరికైనా అర్థమయ్యేవే.

ఇవి కాకుండా కనపడని కోణాలు ఇంకేమైనా ఉన్నాయా?

అదే చెప్తున్నాను. ఈ రెండూ కనపడేంత స్పష్టంగా కనపడనివి ఇంకొన్ని ఉన్నాయి. ఎవరైనా ఏ పనైనా సంతోషంగా నేర్చుకుంటే అది వాళ్ళకీ, సమాజానికీ ఎంతో కొంత ఉపయోగపడుతుంది. దీనిని అంతర్లీనంగా చెప్పే కథలని కొత్తపల్లిలో ఉండేటట్లు చూడటం అనేది కూడా మా మౌలికోద్దేశాలలో ఒకటి. ప్రస్తుత విద్యావిధానంలో ఇష్టంగా సంతోషంగా నేర్చుకోవడం అనేది తక్కువైపోతోంది. కాబట్టి దాని వల్ల సమాజానికి జరిగే హానిని కొత్తపల్లి కథల ద్వారా పరోక్షంగా చెప్పడం అనేదే ఈ డైమన్షన్.

ఇంకో డైమన్షన్ ఏమిటంటే – టెక్నాలజీ అంటే సాంకేతికత. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ వాడటం. అసలు కొత్తపల్లి వెనుక ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అనేది ఒక ముఖ్యమైన మౌలికాంశం. ఈ సాంకేతికతను వాడటం వెనక ఉన్న కారణం కొత్తపల్లి చదివే పెద్దవాళ్ళకి అర్థం కావాలి.

దీన్ని గురించి వివరంగా చెప్తారా?

ఈ రోజున ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరైనా కనిపెట్టినప్పుడో లేదా అభివృద్ధి చేసినప్పుడో దాన్ని డబ్బు పెట్టి కొనుక్కుంటేనే మనకి అందుబాటులోకి వస్తుంది అనే భావన ఉంది. కాని కొత్తపల్లి వెనక వాడుతున్న సాంకేతికత ద్వారా మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఒక మంచి పిల్లల పత్రికని అందరికీ అందుబాటులో ఉంచే వీలు ప్రస్తుత టెక్నాలజీ కల్పిస్తోంది అనేది. మనకందరికీ అది అందుబాటులో ఉంది. ‘ఇది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వీలైతే దీన్ని అభివృద్ధి చేయండి,’ అని టెక్నాలజీ మనందరినీ ఆహ్వానిస్తోంది. ఈ రకంగా అందరికీ ఉపయోగపడే సాంకేతికతని అభివృద్ధి చేయడంలో, దాన్ని ఉచితంగా అందరికీ అందించడంలో మనల్ని పాలు పంచుకోమని టెక్నాలజీ ఆహ్వానం పలకడం ప్రస్తుతం జరుగుతున్న ఓ అద్భుతం. దీన్ని చాలా మంది గుర్తించవలసిన వాళ్ళు గుర్తించడం లేదు. లాభాపేక్ష లేకుండా విజ్ఞానఫలాలు అందరికీ అందించాలన్న సదుద్దేశంతో సమాజానికి వాళ్ళ శ్రమ ఫలితాలని (ఉబుంటు, లినక్స్, జి-ఎడిట్, లిబ్ర ఆఫీసు, గింప్, అడాసిటీ) ఉచితంగా ఇచ్చి వేసిన కంప్యూటర్ నిపుణులందరినీ గుర్తు చేయడం ఒక అంశం.

ఓపెన్ సోర్స్ మూవ్‌మెంట్ అనేది చాలా కష్టనష్టాలతో మొదలయ్యింది. దీని కోసం సమయం, శ్రమ, డబ్బు, ఓపిక ఎవరైతే వెచ్చించారో వాళ్ళందరూ వేరే వేరే ఉద్యోగాలు చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. దీని వెనకాల ఉన్న స్పిరిట్ ఏమిటంటే (ఇలాంటి ఆలోచనలు దశాబ్దాల క్రితం మొదటిసారి విన్నప్పుడు నవ్వి హేళన చేసి ఉంటారు; ఇప్పుడూ నవ్వుతారేమో) — కొంతమందితో పని చేసే ఓ వ్యాపార సంస్థ చేయగలిగే పని కన్నా ఒక పరిమితి లేని (అంటే ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చేరగల) సమూహం చేయగలిగే పని ఎన్నో రెట్లు శక్తివంతంగా ఉంటుందన్నది.

అఫ్‌కోర్స్, ఇదంతా జరగగలిగేది తగిన పద్ధతిని ఎన్నుకోవడమూ, పనిని సమన్వయం చేసుకోవడమూ అనే విషయాలకి లోబడేననుకోండి. ఒక్కసారి సరియైన పద్ధతిని కనుక సరిగా ఏర్పరచుకోగలిగితే ఒక స్వచ్ఛంద సమూహం లాభాపేక్ష ఉన్న వ్యాపార సంస్థ కన్నా ఎన్నో రెట్లు బాగా పని చేయగలదు. విండోస్ అనే నిర్వహణ వ్వవస్థని ప్రజాకర్షకంగా తయారు చేసి అందరూ వాడాల్సిన అవసరాన్ని కల్పించడం ఒక వ్యాపార సంస్థ చేసిన గొప్ప పనే కావొచ్చు. బహుశా ఇంతకన్నా గొప్ప విషయం ఏమిటంటే ఎంతో మంది వేరే వేరే ప్రదేశాలలో కూర్చుని వాళ్ళ పరిమితులకి లోబడి లినక్స్ అనే నిర్వహణ వ్యవస్థని తయారు చేసి విండోస్‌కి దీటుగా నిలబెట్టగలగడం. అందుకే ఎల్లలు లేకుండా పెరగగల సమూహం చేసే పని ఎప్పటికైనా ఎక్కువ ప్రయోజనకారి అని తెలుస్తుంది. పనిని ఛానలైజ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళూ చేసే పనిని అప్పటికే జరిగిన పనికి కూడేట్టుగా చేయడమే ఇందులో ముఖ్యంగా జరుగుతున్నది.

ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసిన వాళ్ళకి కొత్తపల్లి ప్రతి నెలా కృతజ్ఞతాభావం వ్యక్తం చేస్తుంది. దీని వెనక ఉన్న ఇంకొక కోణం ఏమిటంటే – “అయ్యా! ఇంత మంచి సాంకేతికత ఇక్కడ ఉంది. దీన్ని మీరు నేర్చుకోండి. వాడండి. వ్యాపారాత్మక సాంకేతికత (ప్రొప్రైటరీ టెక్నాలజీ) నించి కొంచెం కొంచెంగా దూరం జరుగుతూ ఎదగండి. ఎందుకంటే భవిష్యత్తు ఈ టెక్నాలజీదే!” అని కొత్తపల్లి పరోక్షంగా అందరికీ విజ్ఞప్తి చేస్తోంది.

సాంకేతికత, జ్ఞానం అనేవి అందరివీ, అందరికీ! ఈ థీమ్ పెద్దవాళ్ళందరూ గమనిస్తూ ఉండాలి.

కొత్తపల్లి నేపధ్యంలో ఉన్న ఈ అంశాలను పిల్లలకి సాంకేతికతాస్థాయిలో చెప్పలేకపోయినా కథలు రాయడం అనే లిటరరీ ఎఫర్ట్‌ని ఓపెన్ సోర్స్ స్పిరిట్‌కి అన్వయిస్తూ వివరించవచ్చు. ఉదాహరణకి ఎవరైనా కొత్తపల్లి లోని కథలని ఎప్పుడైనా ఎక్కడైనా ముద్రించి ఎవరితోనైనా పంచుకోవచ్చు. హక్కులు అన్నీ పిల్లలవే. కథలకి బొమ్మలు వేయించి ఒక వేదికని ఏర్పరచడం, ఒక సమన్వయ కర్తగా వ్యవహరించడం మాత్రమే కొత్తపల్లి చేసే పని. ఒకసారి వెబ్‌సైట్‌లో పెట్టాక ఇక అన్ని హక్కులూ సమూహానివే అన్న ఈ నమూనా (మోడల్) కొత్తపల్లి వెనకాల ఉన్న ముఖ్యమైన కోణం.

కాపీరైట్ కాదిది; కాపీ లెఫ్ట్. అంటే అన్ని హక్కులూ సమూహానికే వదలబడ్డాయన్నమాట. ఓపెన్ సోర్స్ స్పిరిట్ అంటే ఇదే.

ప్రపంచంలో కనుమరుగైపోతున్న అనేక పుస్తకాలున్నై. వాటితో సహా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పుస్తకాలు అన్నింటినీ కంప్యూటర్ల ప్రపంచంలోకి తెచ్చి అతి పెద్ద విజ్ఞాన భాండాగారాన్ని తయారు చేయటం, దాన్ని రాబోయే తరాలవాళ్ళు ఎలాంటి ఆంక్షలూ లేకుండా ఉపయోగించుకొనే వెసులుబాటు కల్పించటం కోసం వికీపీడియా, ఆర్కైవ్.ఆర్గ్ లాంటి సంస్థలు పని చేస్తున్నాయి. ఈ ఒరవడికి అనుగుణంగానే కొత్తపల్లి తన పిడియఫ్ ప్రతుల్ని అమ్ముకోవటం లేదు. వాటిని ఉచితంగా అందరికీ అందేట్లు ఉంచుతున్నది.

బాగుంది. చాలా వివరంగా చెప్పారు. కొత్తపల్లి అసలు ఎలా మొదలయింది, పత్రిక నడపడంలో మీరు ఎదుర్కున్న ఇబ్బందులూ — వీటి గురించి చెప్తారా?

కొత్తపల్లిని మొదలు పెట్టేప్పటికి నేను, సుబ్బ (పత్రిక రూపకర్త: ఉప్పలపాటి సుబ్బరాజు) ఇద్దరం ‘ప్రకృతిబడి’లో పాఠాలు చెప్తున్నాం. నేను తెలుగు, లెక్కలు చెప్తుంటే సుబ్బ ఇంగ్లీషు, సైన్సు, సోషల్ చెప్పేవాడు పదోతరగతి పిల్లలవరకూ. మధ్యాహ్నం సమయాల్లో క్రాఫ్ట్ క్లాసులు, సంగీతం — ఇట్లాంటి అంశాలుండేవి రోజూ. అట్లా పిల్లలకు చాలా పాటలు, కథలూ చెప్పటం, వాళ్ళ చేత చెప్పించుకోవటం జరుగుతుండేది. సంవత్సరాలు గడిచిన కొద్దీ పాత కథలు, పాత పాటల స్థానే కొత్తవి రావటం, పాతవి మరుగున పడటం జరిగింది. ‘వాళ్ళ పాటల్ని, కథల్ని అచ్చేసి ఉంచితే ఇలా జరగదు కదా,’ అనిపించేది. అప్పటికే మేం నడిపించిన గోడ పత్రిక, బావుండింది. కానీ ఒకసారి గోడమీద పెట్టాక ఆ కాయితాలు మళ్ళీ ఫైలు చేసుకునే దశలో ఉండేవి కావు. పెట్టినా వాటిని మళ్ళీ చదవబుద్ధయ్యేది కాదు. ఆ సమయంలో బెంగుళూరులో పనిచేసే ఆనంద్, లక్ష్మి కలవటం, ‘ఇంటర్నెట్లో పెట్టచ్చు- పత్రికలాగా,’ అని ఐడియా ఇవ్వటం, వాళ్ళే దానికి కావలసిన పునాది వెబ్సైటును తయారు చేసి పెట్టటం చకచకా జరిగిపోయాయి. మేం ఇక్కడినుండి ఆ వెబ్సైటుకు కంటెంటు ఇస్తూ పోయాం.

ఆరోజుల్లో ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండేది. అందువల్లనే పిల్లలెవ్వరికీ వాళ్ళ కథల్ని నెట్‌లో చూసుకునే వెసులుబాటు దొరకలేదు. ఇంక దాని వల్ల ఉపయోగం ఏముందీ!? పిల్లలు తాము రాసిన కథల్ని తాము చదువుకోగలగాలి కదా! అందుకని మూడు నాలుగు కాపీలు ప్రింటు చేయటం మొదలెట్టాం, మా దగ్గరున్న ఇంక్‌జెట్ ప్రింటర్లతో. మొదట్లో నాలుగు కాపీలు ప్రింటు చేయటం పెద్ద బరువనిపించలేదు. అంతలోనే, ‘చవగ్గా దొరికే పిగ్మెంటు ఇంకును ఇంజక్షన్ సిరెంజిలతో క్యాట్రిజ్‌లలోకి పోసి, 400 రూపాయల పనిని 4 రూపాయలతో చేయవచ్చు’ అని తెలిసింది. సుబ్బ ఆ సాంకేతికతకు చకచకా మెరుగులు దిద్దేశాడు. ఎక్కువ కాపీల్ని తక్కువ ధరకు ఇంట్లో ప్రింటు చేసుకున్నాం.

ఇంట్లో ముద్రించుకోవటం సులభమేనా?

ఏమంత సులభం కాదండి. కానీ చూడండి: కొత్తపల్లి సంగతి కాసేపు పక్కన పెట్టి వేరే ఒక సంగతి చెబుతాను. ఎవరైనా ఒక చిన్న కవితా సంకలనాన్ని అచ్చు వేయించారనుకోండి. ఈ చిన్న పుస్తకం 1000 కాపీలు ముద్రించడానికి 22 వేల రూపాయలవుతుందనుకుందాం. అంటే ఒక్కో దానికీ 22రూపాయలు ఖర్చు అయ్యింది. కాని ఆ పుస్తకం ధర 66రూపాయలు పెట్టుకోవాలి. ఎందుకంటే 22రూపాయలు ప్రింటు ఖర్చు, 22రూపాయలు అమ్మి పెట్టిన వారికి ఇచ్చేది, మరో 22 రవాణా/ నిలువ ఇతర ఖర్చులకు. అంటే వాళ్ళు 22,000రూపాయలు పెట్టుబడిగా పెడితే 1000 కాపీలు వాళ్ళకొచ్చిపడతాయి.

ఇంతా చేసి కవితా సంకలనాలు ఎవరు కొంటారు, ఎప్పటికి కొంటారు? కొన్నవాళ్ళు డబ్బులిస్తారా, ఇచ్చినా ఈ డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు అందిస్తారా? మధ్యలో ఉచిత కాపీలు – ఇవన్నీ‌ చూస్తే కవులూ, రచయితలూ భయపడాల్సిన పరిస్థితి.

నేను చెబుతున్న, ‘ఇంట్లో ముద్రించుకునే పద్ధతి’లోనయితే, ఈ చిన్న కవితల పుస్తకాన్ని 22రూపాయలకే, మహా అయితే 30రూపాయలకు అనుకోండి, చక్కగా ముద్రించుకోవచ్చు. వంద కాపీలు ముద్రించితే అయ్యేది మూడు వేలు మాత్రమే. మళ్ళీ అవి అమ్ముడవుతుండగా ఎన్ని కావలిస్తే అన్ని, ఎప్పుడు కావలిస్తే అప్పుడు ముద్రించుకోవచ్చు! పెట్టుబడిని ఇరికించుకోవాల్సిన అవసరం తప్పుతుంది.

సరే, మళ్ళీ కొత్తపల్లి దగ్గరకు వద్దాం. ఇలా ఇంట్లో ఎన్ని కాపీలు వేసేవారు?

మొదట్లో పది కాపీలు వేశాం. ఒక్కో కాపీ ఏడెనిమిది రూపాయలు పడేది. సులభమే అనిపించాక, వాళ్ళకు వీళ్ళకు అంటూ కాపీల సంఖ్యని పెంచుకుంటూ పోయాం. అంతా తెలిసిన వాళ్ళే! ‘చందాలు కట్టిస్తే?’ అనుకున్నాం. చకచకా చందాదారులూ తయారయ్యారు. వాళ్ళూ‌ మనకు బాగా తెలిసినవాళ్ళే, మా చవక ప్రింటింగుని ఇష్టపడ్డవాళ్ళే! అంతలోనే దెబ్బ పడింది. మేం ‘ప్రకృతిబడి’ని వదిలిపెట్టాల్సి వచ్చింది! అప్పటివరకూ కథలూ, పాటలూ రాస్తూ, టైపు చేస్తూ, ఎడిట్ చేస్తూ ఉన్న పిల్లలంతా అకస్మాత్తుగా పరాయి వాళ్ళయ్యారు. ఏం చెయ్యాలి? వెంటనే ‘కథలు ఎక్కడి పిల్లలైనా రాయచ్చుగా’ అనుకున్నాం. వేరే వేరే బడుల పిల్లలు, వేరే వేరే ఊళ్ళ పిల్లలు కథలు రాయటం‌ మొదలు పెట్టారు. కొత్తపల్లి రచయితల పునాది అలా విస్తరించింది.

రాను రాను మాకు తెలీని కొత్తవాళ్ళు కూడా చందాదారుల లిస్టులో చేరటం మొదలైంది. ఈలోగా మా ఫార్మాటింగు వ్యవస్థ కూడా మెరుగయ్యింది. ‘ఇంటి ప్రింటింగు’ క్వాలిటీ మెరుగైంది. దానిలో సమస్యలూ తెలిశాయి. వాటిని దాటుకోవటమూ అలవడింది. ముఫ్ఫై రెండో సంచిక వచ్చేసరికి, ప్రతినెలా మూడువందల కాపీలు ‘ఇంట్లో’ ప్రింటు చేయాల్సి వచ్చింది. శ్రమ తెలిసింది. సుబ్బ ప్రతి నెలలోనూ వారం రోజులు నిద్రపోకుండా పని చేయాల్సి వచ్చింది. అంతలో మళ్ళీ సాయం కృపాకరరావుగారి రూపంలో ప్రత్యక్షమైంది. “ఇన్నిన్ని ప్రింటు చేశారు, చాలు. ప్రింటింగు మాకు ఇవ్వండి. ఆఫ్‌సెట్‌లో వేస్తాం, రెండు వేల కాపీలు. పుస్తకం వెలువరించే పని, పంపిణీ పని మీరు చూసుకోండి. డబ్బులకోసం తొందర పడకండి, నేను కొంచెం ఆగగలను.” అన్నారాయన. తటపటాయిస్తూనే ఆఫ్‌సెట్ ప్రింటింగులోకి దిగాం.

ఆఫ్‌సెట్ ప్రింటింగ్ ఖరీదు కదా! ఆర్థిక ఇబ్బందులు ఎదురవలేదా?

ఎప్పటికప్పుడు ప్రింటు పత్రికని ఆపేద్దాం అనిపించేది. మళ్ళీ ‘అది లేకపోతే కథలు రాసిన పిల్లలు, ముఖ్యంగా అల్పాదాయ వర్గాలవాళ్ళు, పల్లెల్లో వాళ్ళు, తమ కథల్ని తాము చూసుకోవడానికి కూడా వీలుకాదు కదా,’ అనిపించేది. ఆనంద్ తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో వచ్చిన జీతం లోంచే నాకు, సుబ్బకి జీతం ఇవ్వటం మొదలెట్టాడు. ఒకసారి మేమిద్దరం ‘కవర్’ అయ్యాక, ఇంక ‘సమస్యల్ని అధిగమించటం మా పనేగా?’ అని, ప్రింటు చేస్తూ పోయాం. ఎప్పటికప్పుడు మా అవసరాన్ని కనుక్కునే మిత్రులు డబ్బులు ఇస్తూ పోయారు. ఏ నెలైనా ఎవ్వరూ ఇవ్వకపోతే కృపాకరరావుగారికి అప్పుపెట్టాం!

అప్పు తీర్చే మార్గం? పుస్తకం ధర పెంచుకొని ఉండచ్చుగా?

2010లో చందమామ ధర 18రూపాయలుండేది. చందమామకూ కొత్తపల్లికీ పోలికెక్కడ గాని, దానికంటే ఎక్కువ ధర పెడితే ఎవ్వరూ కొనరని ఓ పిచ్చి నమ్మకం ఉండి, ధర పద్ధెనిమిది రూపాయలుగా నిర్ణయించాం. అప్పట్లో ప్రింటింగ్ చేసినందుకు కృపాకరరావుగారికి 13 రూపాయలు, రవాణాకు ఒక రూపాయి – వెరసి 14 రూపాయలు నేరుగా ప్రింటు ఖర్చే అయ్యేది. మరి పంపిణీ చేసిన వాళ్ళకి? (వాళ్ళూ మా పిల్లలే, బడిలో చదివి పెద్దయి, పట్నాలలో చదువుకుంటున్నవాళ్ళు,) బొమ్మలు వేసినవాళ్ళకి? (వాళ్ళు కూడా మా విద్యార్థులే, అయినా అంత ఇష్టంగా బొమ్మలు వేసిన వాళ్ళ కనీస అవసరాలకి ఏ కొంచెం డబ్బులో ఇవ్వకపోతే ఎలాగ?) ఆఫీసు అద్దె, మా ఇంటి ఖర్చులు? అన్నీ కలిసి మోపెడయ్యేవి.

వాటిలో కొంత ఆనంద్ తన జీతం లోంచి మోసేవాడు. తెలిసిన మిత్రులు, పాత విద్యార్థులు ఆపైన కొంచెం కొంచెంగా ఇచ్చి కాపాడేవాళ్ళు. సంవత్సరాంతంలో హైదరాబాదు, విజయవాడల్లో జరిగే పుస్తక ప్రదర్శనల్లో కొంత స్టాకు అమ్మితే, కృపాకరరావుగారి అప్పు కొంత సర్దవీలయ్యేది.

అంత కష్టపడటం ఎందుకు? ప్రకటనలు తీసుకొని ఉండొచ్చుగా?

ప్రకటనలు పిల్లలకు ఏమంత మంచివి కాదు. వాటినుండి పిల్లల్ని పూర్తిగా ‘స్క్రీన్’ చేయటం వీలవ్వదులెండి గాని, కొత్తపల్లిని చదివేప్పుడు మటుకు ఎవ్వరికీ — పిల్లలకు గాని, పెద్దలకు గాని — ఇతర ఆలోచనలు రేకెత్తకూడదని మాకు గట్టిగా అనిపించేది. అందుకనే ఎంతకష్టమైనా మొదటినుండీ కొత్తపల్లివెబ్‌సైటులో గాని, ప్రింటుపత్రికలో గాని ప్రకటనలు స్వీకరించలేదు. ‘మంచి ప్రకటనలైతే…?’ అని కొందరన్నారు. అదీ పెద్దగా నచ్చలేదు. మెల్లగా ‘మంచివి’ పోయి, అవసరార్థం ‘ఏవైనా’ వచ్చేస్తాయని అనిపించేది.

అయినా కొత్తపల్లిలో ప్రకటనలు ఇచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళూ మిత్రులేగా? వాళ్ళు ఊరికే అయినా ఇస్తారు. ప్రకటనల ద్వారా అయితేనే ఇస్తామనే వాళ్ళు కారు. ఇలాంటి మంచి పని కోసం డబ్బులు వాళ్ళే ఇస్తారులే అని సర్దుకునేవాళ్ళం.

కొత్తపల్లిని మొదలు పెట్టింది, నడిపిస్తున్నది లాభాపేక్షతో కాదు. పిల్లలు తమ భావనల్ని, తమలోని కథల్ని కాయితం మీదికి తేవాలని, వాళ్ళ కథల్ని చదివి మిగిలిన పిల్లలు స్ఫూర్తి పొంది, తామూ రాస్తారనీ, ఆ క్రమంలో వాళ్ళల్లో భాష బలపడుతుందని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న పని ఇది. అయినా పత్రిక మనుగడ కోసం అవసరం అయితే ముందు ముందు ‘మంచి’ ప్రకటనలు తీసుకోవాల్సొస్తుందేమో! అవి కూడా పిల్లలకి ఉపయోగిస్తాయి అనుకున్నప్పుడు.

ప్రస్తుతం ఎన్ని కాపీలు వేస్తున్నారు?

ప్రతినెలా ముద్రిస్తున్న కొత్తపల్లి ప్రతులు రెండువేలు. ‘రెండువేలు మాత్రమే!’ సాధారణంగా పత్రికలు ఎన్ని కాపీలు ముద్రించబడుతున్నాయో చెప్పవు. ఎంతమంది చేత చదవబడుతున్నాయో చెబుతాయి. సర్క్యులేషన్ అంకెల గారడీల ప్రపంచంలోకి కొత్తపల్లి రాదు.

కొత్తపల్లికి ఏ రకమైన సహాయాలు అందుతున్నాయి?

కొత్తపల్లికి విదేశీ నిధులు స్వీకరించే అవకాశం లేదు. పెద్ద పెద్ద మొత్తాలు, సంస్థాగత నిధులు కూడా కొత్తపల్లి తీసుకోలేదు. మాతృభాష ప్రాధాన్యం తెలిసిన వ్యక్తులు, ‘తమ పిల్లలకు మేలు జరిగింది,’ అని గుర్తించే తెలుగువాళ్ళు, ‘గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు సాయం అవుతోంది కదా,’ అనుకునే సహృదయులు — ఇలాంటి వాళ్ళు మిత్రులుగా కొత్తపల్లికి సహాయం చేస్తున్నారు.

కొత్తపల్లికి ఇంకొక రకంగా అందే సహాయం పాత సంచికల పునర్మద్రణ కోసం వచ్చే ఆర్డర్లు.

కొత్తపల్లి పత్రికను 2011 జనవరి నుండి అంటే, ముఫ్ఫైమూడో సంచికనుండి ఆఫ్‌సెట్లో ముద్రిస్తూ వస్తున్నాం. అలా ముద్రించిన సంచికల్లో మొదటి పన్నెండూ (కొత్తపల్లి-33 నుండి కొత్తపల్లి-44 వరకు) పూర్తిగా అమ్ముడైపోయాయి. ప్రస్తుతం ఆ ప్రతులు స్టాకులో లేవు. వాటిని మళ్ళీ ఆఫ్‌సెట్లో ప్రింటు చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకని అడిగిన వాళ్ళకు గతంలో మాదిరి ఇంక్‌జెట్ ప్రింటర్లలో ముద్రించి ఇచ్చే పని మొదలుపెట్టాం.

ఈ మధ్యే ఒక ప్రైవేట్ స్కూలు వాళ్ళు – వాళ్ళ పిల్లలు వేసవి సెలవల్లో చదువుకోవడం కోసం 2010వి ఒక ఆరు వందల పుస్తకాలు కావాలని అడిగితే ముద్రించి ఇచ్చాం. ప్రస్తుతం తిరుపతిలోని మిత్రులు దుర్గాప్రసాద్ గారి కోసం 2010వి ఆరువందలు, 2011వి మరో ఆరువందల పుస్తకాలు ‘ఇంట్లోనే’ ముద్రించి ఇచ్చే పనిలో ఉన్నాం. ఇలా ఒకటో సంచికనుండి 67వరకూ అడిగిన వారికి ‘ఇంట్లోనే’ ముద్రించి ఇవ్వడం కూడా కొత్తపల్లికి ఉన్న ఆదాయమార్గాలలో ఒకటి.

కొత్తపల్లి కోసం ఎవరెవరు కథలు రాస్తున్నారు? మీరు వాళ్ళచేత కథలు ఎలా రాయిస్తారు?

పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని వాళ్ళంతట వాళ్ళే కథలు రాసి పంపిస్తున్నారు ప్రస్తుతం. మేము ఏదైనా బడికి వెళ్ళినప్పుడు అక్కడి పిల్లలతో కూర్చొని కథలు తయారు చేయటం, ఒకటి రెండు కథలు అక్కడే రాయిస్తూ కథలు రాయటంలో మెళకువలు కొద్ది కొద్దిగా చెప్పటం చేస్తున్నాం. అయితే ఎక్కువ మంది పిల్లలు తామే సొంతంగా కథలు రాసి పోస్టులో పంపుతున్నారు. కొందరు పెద్దవాళ్ళు ఇ-మెయిలు ద్వారా కథలు పంపుతున్నారు. కొత్తపల్లిలో పిల్లల రచనలకు ప్రాధాన్యం ఉంటుంది. అయితే పెద్దల రచనలూ కావాల్సిందే కదా! పిల్లలకు మంచి రచనల ఒరవడి నేర్పాల్సింది పెద్దలే.

పత్రికను 2008 నుండి నడిపిస్తున్నారు కదా! ఇప్పటికి 67 సంచికలు వెలువరించారు. మీకెలా అనిపిస్తున్నది?

బాగుంది. ’67పుస్తకాలు వచ్చేశాయా?’ అని సంతోషం కలుగుతుంది. తెలుగు పిల్లలు చదువుకోటానికి ఇన్ని కథలు ఒకేచోట ఉన్నాయి అని తృప్తిగా ఉంటుంది. ‘పిల్లల్ని పుస్తకాల ప్రపంచంలోకి అడుగుపెట్టించేందుకు కథలు మంచి సాధనాలు,’ అని మాకున్న నమ్మకానికి బలం చేకూరినట్లనిపిస్తుంది.

నారాయణ గారూ! మీరు ఐ.ఐ.టి లాంటి అత్యున్నత విద్యాసంస్థలో ఎమ్.టెక్ చదువుకుని పల్లె పిల్లలకి ఓ దశాబ్దం పైగా పాఠాలు చెప్పి ప్రస్తుతం ఈ పిల్లల పత్రికని ఎంతో శ్రమకోర్చి నడుపుతున్నారు. ఇలాంటి పనులు చేయడం వెనక మీ బాల్యం, కుటుంబ నేపథ్యాల స్ఫూర్తి ఉండే ఉంటుంది…

మా ఇంట్లో నేను రెండవ అబ్బాయినవ్వడం వల్ల నాకు చిన్నప్పటి నుండి ఓ రకమైన స్వేచ్ఛ లభించింది — మా అన్నయ్య చాలా వరకు కుటుంబ బాధ్యత తీసుకోవడం వల్ల. పెద్ద పెద్ద కాన్వెంట్లలో చదివించగలిగే స్థోమతు ఉన్నా కూడా మా నాన్నగారు చిన్నప్పుడు నన్ను తక్కువ ఖర్చుతో మధ్య తరగతి వాతావరణపు పాఠశాలల్లో చదివించారు. పిల్లలందరికీ తెలుగు పట్ల అభిమానాన్ని పెంపొందించాలనే ఆశయాన్ని తక్కువ ఖర్చుతో నెరవేర్చుకోగలం అన్న నమ్మకం ఇలాంటి వాతావరణంలో చదువుకోవడం వల్లనే నాకు కలిగి ఉంటుంది.

ఎడిటింగ్ నుంచి పుస్తకాలు పోస్ట్ చేసే వరకు అన్ని పనుల్లో మునిగిపోయి ఇంటి పనిని వదిలేసినా, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఓర్చుకున్న నా భార్య సమత, మా పాప సత్యలక్ష్మి కూడా నా వెనక ఉన్నారు.

మళ్ళీ సమయం వస్తుందో రాదో, ఇప్పుడే చెప్తాను: కొత్తపల్లి ఇన్నాళ్ళపాటు కొనసాగగలిగిందంటే, దానికి ఎంతోమంది మిత్రుల సమిష్టి కృషే కారణం. వాళ్ళందరి సహకారం లేకపోతే ఈ పని ఇన్నాళ్ళు జరిగేదే కాదు. వీళ్ళంతా తమ తమ పనులు చేసుకుంటూ, పనిలో పనిగా కొత్తపల్లికీ పని చేస్తూ వచ్చారు.

సుబ్బరాజు ఐదేళ్ళకు పైగా కొత్తపల్లి నిర్వహణ బాధ్యతలు మోశాడు. ఆనంద్, లక్ష్మి(దేవి) కొత్తపల్లికోసం వెచ్చించినంత డబ్బులు, సమయం మరెవ్వరూ వెచ్చించలేదేమో. ఇప్పటికీ కొత్తపల్లి వెబ్సైటు నిర్మాతలు, ఓనర్లు వాళ్ళే. మొదట్లో చక్కని కామెంట్ల వ్యవస్థను రాసిపెట్టింది లీలక్క; సాయం చేస్తూ ఎదిగాడు మాబు; ఇన్నేళ్ళూ బొమ్మలు వేయటంలో చురుకైన పాత్ర వహించాడు అడవి రాముడు; ఇప్పటికీ బొమ్మలు వేసిపెడ్తున్నాడు వీరాంజనేయులు; టైపు సెటింగు సాయాలు చేసి పెట్టిన సుచరిత, లక్ష్మి, బలం లేకపోయినా వెనక నిలబడే అలివేలమ్మ; కొత్తపల్లి కోసం చిన్నప్పుడు టైపు చేసి, పెద్దయ్యాక ప్రతులు దుకాణాల్లో వేసి పెడుతున్న కేదార్; ఇప్పుడు రకరకాల బరువులు మోస్తున్న మంజునాధ్, మల్లికార్జున, వెనకనుండి నెట్టే రాధగారు; ప్రోత్సహించే శివబాబు, విజయలక్ష్మిగార్లు; సోమిరెడ్డిగారు; ఆపదల్లో ఆదుకున్న సత్య ఫౌండేషన్ వారు, ఏనెలకానెల ప్రింటు ఖర్చుల్ని అందించిన మిత్రులు; కొత్తపల్లిలో శీర్షికలు నడిపిస్తున్న పుస్తకం.నెట్ సౌమ్య, వివియస్ మూర్తిగారు; గతంలో పిల్లలు మెచ్చేట్లు శీర్షికలు నడిపి, చక్కని పేరు తెచ్చిపెట్టిన తెలుగు4కిడ్స్ లలితగారు, మాలతికృష్ణగారు, దేవి, లలితగీతాల వెంకట్రావుగారు — నేను తలచుకోవాల్సిన మిత్రుల పట్టిక ఇంకా చాలా ఉంది! మరి రచనలు చేసిన పిల్లలు, చదివి పెద్దయిన పిల్లలు — తలచుకున్నకొద్దీ వస్తూనే ఉన్నారు!

చివరగా ఏమైనా చెప్తారా?

కొత్తపల్లి ఒక సామూహిక ప్రయత్నం. సమూహం దీని పట్ల ఎంత ఉత్సాహంతో స్పందిస్తే అంత మంచి జరుగుతుంది. సామాజిక స్ఫూర్తికి అది ఓ ప్రతీక. ఇలాంటి మంచి ప్రయత్నాలను నిలపటం, వీటిలోని లోటుపాట్లను పూరించటం, చేయూతనివ్వడం అందరి బాధ్యత.

కొత్తపల్లి పత్రిక ఇ-మెయిల్:team@kottapalli.in
ఫోన్: 94901 80695.