అంపశయ్య: మరొకసారి కొత్తగా!

అంపశయ్య నవల పేరు ఎన్నో ఏళ్ళుగా వింటున్నా, దాన్ని చాలా ఆలస్యంగా, అంటే కాలేజీలో ఉండగా చదివాననుకుంటాను. చాలామంది లాగే మొదలు పెట్టిన క్షణం నుంచీ పూర్తి చేసే వరకూ మధ్యలో ఎక్కడా ఆపకుండా నవల పూర్తయ్యాకే ఊపిరి తీసుకున్నంత ఉద్వేగం అనుభవించిన గుర్తు. గుండెలో ఏదో భారమూ, తేలిక తనమూ, నిర్వేదమూ, ఆనందమూ, ఒకేసారి అనుభవం లోకి వచ్చినట్లు గుర్తు. ఇలాగే ఎంతోమంది అనుకుని ఉంటారేమో! ఎన్నోసార్లు దీని గురించి స్నేహితుల మధ్య ప్రస్తావన వచ్చి మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు ఎన్నిచోట్ల విన్నా, దీని గురించి చదివినా, ఈనాటికీ ఆ నవల మళ్ళీ చదివినపుడు అదే అనుభూతి, అప్పుడే మొదటి సారి చదివినట్టు.


అంపశయ్య (6వ ముద్రణ)

కోఠీలో మూడో నంబర్ సిటీ బస్సెక్కి తార్నాకో, మౌలాలీయో వెళ్ళేప్పుడు ఓయూ కాంపస్‌లో ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ చూడగానే, ఆ నవలంతా అక్కడ జరిగినట్లు, అదంతా ఆ బిల్డింగ్ పరిసరాల్లోనే ఎక్కడో సంచరిస్తూ స్వయంగా చూసినట్లూ… ఆ రోజులన్నీ గతించి పోయినట్టూ… గొప్ప పెద్దరికంతో పలకరించే ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ బస్సు కిటికీ లోంచి దూరమై పోతుంటే దిగులు! యూనివర్సిటీకి వెళ్ళినపుడల్లా ఆ పరిసరాల్లో రవి, వేణు, సాగర్, రెడ్డి, ఖాన్, ఆచారి, గుర్నాధం, కిరణ్మయి, గోపి, నిధి — వీళ్ళంతా గానీ, వీళ్ళలో ఎవరో ఒకరు గానీ కనిపిస్తే బాగుండన్న ఒక వింత కోరిక. అక్కడ తిరిగే వాళ్ళందరిలో వీళ్ళంతా ఉన్నారన్న గుర్తెరగాలని తట్టని పిచ్చి, నోస్టాల్జిక్ ఊహ.

నలభై ఐదు ఏళ్ళ క్రితం (1969) మొదటిసారి సృజన త్రైమాసిక పత్రికలో రెండు భాగాల పాటు ప్రచురితమై ఆ తర్వాత నవలగా బయటికి వచ్చిన అంపశయ్య, ఇవాళ్టికీ తొమ్మిది ముద్రణలతో నిత్య నూతనంగా, సరికొత్త విద్యార్థుల్ని, పాఠకుల్ని ఆకర్షిస్తూనే ఉంది. ఎన్నో ప్రశంసలు, విమర్శలు, విశ్లేషణలు, మనస్తత్వ శాస్త్ర ఆధారంగా పరిశీలనలు, చర్చలు — ఇన్నేళ్ళ తెలుగు నవలా చరిత్రలో ప్రత్యేకతను నిలుపుకుంటూ నిల్చి, ఇంకా ఎన్నో ఏళ్ళు నిలిచి ఉండే నవల ఇది! చివరికి నవలే రచయిత ఇంటిపేరుగా మారిపోయిన అపురూపమైన, అరుదైన సందర్భం! ఆంధ్రజ్యోతి వేసిన కమిటీ గత వెయ్యి సంవత్సరాల్లో తెలుగు సాహిత్యంలో వచ్చిన వంద ఉత్తమమైన పుస్తకాలలో ఒకటిగా ఎంపిక చేసిన పుస్తకాల్లో అంపశయ్య కూడా ఉంది. నిస్సందేహంగా ఉండాలి కూడాను! హిందీ తమిళం, ఇంగ్లీష్ భాషల్లోకి అనువాదం అయింది కూడా.

కథ, పాత్రలు – కొన్ని మాటలు

ఈ నవల ఒకానొక తెల్లవారుజామున యూనివర్సిటీ హాస్టల్ గదిలో కథానాయకుడు రవికి ఒక కల రావడంతో మొదలవుతుంది. ఆ కలకు అర్థమేమిటో రవికి బోధ పడదు. ఆ కలనుంచి మేలుకున్న రవిలో మొదలైన ఆలోచనల ప్రవాహం నిరంతరంగా పరిగెడుతూ 18గంటల పాటు నడిచి చివరికి ఆ రాత్రి అదే గదిలో ముగుస్తుంది.

ఇదొక 20 ఏళ్ళ యువకుడి అంతరంగ ఘోష. తెరలు తెరలుగా పొరలు వీడి నగ్నంగా పరిగెత్తే అతని ఆలోచనలు, అతని ఊహలు, అతని పశ్చాత్తాపం, అతని ధర్మాగ్రహం, అతని నిస్సహాయత, అతని ఓటమి, అవమానం, అతని గెలుపు, అతని హృదయోల్లాసం, అతని మోహం, అతని లైంగిక అశాంతి, అతని ఆకలి, అతని ప్రేమ, ఇంకా అతనివే స్నేహం, అభిరుచులు, దుఃఖం — అన్నీ అతడివే!

రవి తల్లి దండ్రులు ఇంటి నుంచి చెమటోడ్చి పంపే డబ్బుతో ఎమ్మే చదువుతుంటాడు ఉస్మానియా యూనివర్సిటీలో. తెలివైన వాడే అయినా, పరీక్షలు దగ్గర పడేవరకూ చదవకుండా తిరిగేసి అవి ముంచుకొస్తుంటే కొద్దిగా అయినా చదవలేక పోతున్నాననే అపరాధ భావనలో పడి కొట్టుకుంటుంటాడు. దానికి తోడు ఇంటి దగ్గర రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బు పంపించే తల్లి దండ్రులు, వాళ్ళ కష్టాలు గుర్తొచ్చి కలవర పెడుతుంటాయి. మెస్ బిల్లు మూడు నెల్ల నుంచీ బాకీ. ఆ రోజుతో భోజనం బంద్.

క్రమేణా మిగతా విద్యార్థులు పరిచయం అవుతారు మనకి. డబ్బుతో మిడిసి పడే రెడ్డి, అతడి బృందం; వేడి రక్తంతో అభ్యుదయం గురించి మాట్లాడే వేణు; ప్రతినాయక ఛాయల్లో కనిపించే శ్రీశైలం, రంగారెడ్డి; వెధవ బోరింగ్ యూనివర్సిటీ చదువు అయిపోతే అమెరికాకి స్వేచ్ఛగా ఎగిరి పోదామనుకునే డబ్బున్న కిరణ్మయి; రవి గత జీవితంలోని రత్తి. రవిని నిష్కల్మషంగా, నిజంగా ఇష్టపడిన రత్తి పట్ల రవి ధైర్యం చేయలేక పోతాడు. ఆ పైన రత్తి పట్ల తాను ప్రవర్తించిన తీరు రవిని ఆలోచనల్లో నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. రత్తిని కలలో చూడటంతోనే ఈ నవల మొదలవుతుంది. అలాగే లెక్చెరర్ ఉపేంద్ర బాబు, వేణు, రవి సీనియర్ ఆనందరావు, గుర్నాధం, ఆచారి, అన్నీ జాగ్రత్తగా మలిచిన పాత్రలే! అయితే, ఎవ్వరూ ఈ అంపశయ్యకు అతీతులు కారు. ఎవరి స్థాయిలో వాళ్ళకు ఆ శయ్య సిద్ధం!

రవికి కొంతమంది మంచి మిత్రులు, మిత్రులైనా కాకపోయినా మరికొందరు హాస్టల్‌మేట్లూ ఉంటారు. సాటి విద్యార్థుల్లో కొందరు బాగా డబ్బున్నవాళ్ళు, ఆ ధనమదాన్ని ప్రదర్శిస్తూ తిరిగేవాళ్ళు, ఉంటారు. వాళ్ళంటే రవికి అసహ్యం. కానీ వాళ్ళతో తలపడాలంటే భయం. ధనం తెచ్చిన బలంతో వాళ్ళదే పై చేయిగా ఉంటుంది యూనివర్సిటీలో. న్యాయం తమ వైపు ఉందని తెలిసినా గట్టిగా పోరాడలేని విద్యార్థుల గ్రూప్ రవిది. కానీ వాదనకు దిగాల్సి వచ్చినపుడు రెచ్చిపోయి మాట్లాడేసి ఆ తర్వాత వాళ్ళు తనను చంపేస్తారేమో అని భయపడతాడు. ఒకానొక దుర్బల క్షణంలో వాళ్ళు మెచ్చేలా ఉండి, తన డబ్బు అవసరాలు తీర్చుకుందామని కూడా భావిస్తాడు. కానీ అతని ఆత్మాభిమానం ఆ పని చేయనివ్వదు. ప్రతి విషయంలోనూ, ప్రతి క్షణం ఇలా ద్వైదీభావంతో కొట్టుమిట్టాడుతుంటాడు రవి. కిరణ్మయితో సినిమా చూసే క్షణికమైన ఆనందం కోసం అప్పు చేసి మరీ వెళ్ళిన రవి అక్కడ జరిగిన జ్ఞానోదయంతో యూనివర్సిటీకి తిరిగి వస్తాడు. ఆ రోజు ప్రతి నాయక బృందంతో జరిగిన ఘర్షణలో బలహీనులంతా ఏకమై రవితో పాటు వారిని ఎదుర్కోవడంతో కథ ముగుస్తుంది.

ఇదే అంపశయ్య కథ! రక రకాల మనస్తత్వాల మధ్య చేతిలో పైసా లేని స్థితిలో రవి జీవితంలో జరిగే కొద్ది గంటల కాలం ఈ నవల. కానీ ఈ 18 గంటల కథ విశ్వరూపం నవల చదివితే కాని పూర్తిగా గోచరం కాదు! ఈ నవల్లో ఆకలి కేకల నుంచీ అమెరికా వెళ్ళాలని పాట్లు పడే కిరణ్మయి బాధల వరకూ రచయిత స్పృశించారు. యూనివర్సిటీలో, ప్రొఫెసర్లలో ఉండే కులతత్వం, మత తత్వం, యూనివర్సిటీ రాజకీయాలు, విద్యావిధానం రోజు రోజుకు కునారిల్లుతున్న దుర్గతి, ప్రొఫెసర్లు రీడర్ల మధ్య వైషమ్యాలు, విద్యార్థుల సాంఘిక సమస్యలు, వాళ్ళ మనస్తత్వాలు, భవిష్యత్తు గురించిన వాళ్ళ ఆలోచనలు — ఇవన్ని ఈ నవలలో కనిపిస్తాయి. చర్చకు వస్తాయి. రవి కానివ్వండి, అతడి మిత్ర బృందంలో మరెవరైనా కానివ్వండి. ప్రతి ఒక్కడూ ఈ అంపశయ్య మీద పవళించి తీరాల్సిందే.

రవి తెలివైన వాడే కానీ ఒక సాధారణమైన యువకుడు. కళా హృదయం ఉన్నవాడు. నిజానికి అతడి స్నేహితులు కూడా అతడితో సాటి రాగల వారే! మంచి సాహిత్యాభిరుచి, అభ్యుదయ భావాలు, సమాజ దృష్టి కల్గిన వాళ్ళు అందరూనూ. కాగజ్ కే పూల్ సినిమా గురించి, దానితో లింక్ అయిన గురుదత్ వ్యక్తిగత జీవితం గురించీ ఎంతో బాధ పడతారు. “ఫారిన్ సినిమాల్ని గప్‌చిప్‌గా కాపీ చేయడంలో ముళ్ళపూడి మొనగాళ్ళకి మొనగాడు, ప్రాణమిత్రులు బెకెట్‌కి కాపీ అని ఎంత గుండెలు బాదుకున్నా ఏం లాభం,” అంటాడో చోట రవి. అపూర్ సంసార్ వంటి బెంగాలీ సినిమాల గురించీ, కమ్ సెప్టెంబర్ వంటి ఇంగ్లీష్ సినిమాల గురించీ స్నేహితుల మధ్య చర్చలు నడుస్తాయి. కృష్ణశాస్త్రిని, శ్రీశ్రీని ఆర్ద్రంగా తల్చుకుంటారు. చలం కథలు చదివి వాస్తవ ప్రపంచానికి పనికిరాకుండా పోయామని బాధ పడతారు. స్వాతంత్ర్యసాధనలో ఏ నాయకుడి పాత్ర ఎంత, రాష్ట్రాల విలీనీకరణ, అలీనోద్యమం, వియత్నాం గెరిల్లా యుద్ధం, అమెరికా రష్యా సంబంధాల వంటి విషయాల్ని విద్యార్థులంతా అవలీలగా చర్చిస్తారు. ఆసక్తికరంగా నడిచే ఆ చర్చలు కూడా ఒక్క అక్షరంముక్క వదలకుండా చదివిస్తాయి. అంతే కాదు, అవన్నీ చదువుతుంటే హ్యుమానిటీస్ గ్రూప్స్ ప్రాముఖ్యం విద్యాలయాలలో తగ్గి అంతర్ధానం అయిపోవడం వల్ల ఎంత నష్టపోతున్నామో, ఒక సమాజంగా మనం ఏం పోగొట్టుకుంటున్నామో మర్చిపోతున్న మనకు గుర్తుకొస్తుంది.

“యూనివర్సిటీ జీవితాన్ని, ముఖ్యంగా హాస్టల్ జీవితాన్ని చవి చూసిన ప్రతి వారూ, ఈ నవలలో తమ నీడను చూసుకుని చకితులవుతారని చెప్పడం సాహసం కావొచ్చు కానీ సత్యం మాత్రం కాకపోదు,” అంటారు సృజన పత్రికలో ఈ నవల ప్రారంభానికి ముందు సంపాదకులు. ఇది అక్షర సత్యమే!

రవి అంతర్గత ఘర్షణ

రవి ఆలోచనలలో కుదురు, క్రమం ఉండవు. దగ్గర పడుతున్న పరీక్షల కోసం శ్రద్ధగా చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ పని చేయలేడు. నిద్ర మత్తు నుంచి బయట పడలేడు. పడ్డాక కూడా కాలం అలా క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా మారి గడిచి పోతూనే ఉంటుంది తప్ప చదువు సాగదు. ఏవేవో ఆలోచనలు! కష్టాల్లో ఉన్న తల్లిదండ్రులు, పల్లెలో అన్యాయమైపోయిన రత్తి, ఇంకా ఏవేవో పాత జ్ఞాపకాలు మెదడులో సుళ్ళు తిరుగుతుంటాయి. ఆ ఆలోచనల సంఘర్షణలోనే టాయ్‌లెట్ గోడల మీది బూతురాతలు గుర్తొస్తుంటాయి. బయటికి చెప్పలేని లైంగిక అశాంతి రేగుతూ ఉంటుంది. దాన్ని జయించాలని చూసినా ఫలితం ఉండదు. పక్క గది ఆచారి లాగా అగరొత్తులు వెలిగించి పూజ చేస్తే అయినా ఏకాగ్రత దొరుకుతుందని ఆశిస్తాడు. అనుకోడమే తప్ప చెయ్యడు. చెయ్యలేడు. ఈ సంఘర్షణలని కలుపుకుంటూ కథ నడుస్తుంది యూనివర్సిటీ ప్రాంగణంలో.

శ్రద్ధగా చదవాలనుకుని గట్టిగా నిశ్చయించుకుని లైబ్రరీకి వెళ్ళిన రవికి కిరణ్మయి కనిపించగానే పాత జ్ఞాపకాలు రేగి ఆ క్షణంలో సర్వమూ మరిచి, కిరణ్మయితో కలిసి సినిమా చూస్తే చాలన్న బలహీనతకి లోనవుతాడు. తాను అసహ్యించుకునే గుర్నాధం వద్దే చేయి చాచి అయిదు రూపాయలు సంపాదించి సినిమా చూడాలని వెళ్తాడు. ఆర్థిక స్థోమత విషయానికొస్తే తాను కిరణ్మయి సమీపానికి కూడా చేరలేనని తెలుసు. అయినా సరే యవ్వన చాపల్యంతో, ఆమె గాలి సోకినా అదృష్టమే అనుకుంటాడు. నాగార్జున సాగర్ యాత్రలో ఆమె అందానికి ముగ్ధుడైన రవి ఆమెకు సినిమాలంటే ఇష్టమని తెలిసి తన సినిమా పరిజ్ఞానమంతా వెలగబెట్టి ఆమె దృష్టిలో పడాలని కాంక్షిస్తాడు. సత్యజిత్ రాయ్ సినిమాలు నచ్చని కిరణ్ రవిని నిరాశ పరుస్తుంది. జీవితంలో విషాదపు కోణాన్ని కిరణ్ ఏ మాత్రం సహించదనీ, ఆమెది కలతలే లేని రంగుల లోకమనీ ఆ తర్వాత గ్రహిస్తాడు. తామిద్దరూ సమాంతర రేఖలన్న సత్యం బోధ పడుతుంది. ఇదంతా జరిగాక కూడా కిరణ్ కనిపించి పలకరించగానే లైబ్రరీ వదిలి అప్పు చేసి మరీ ఆమె వెంట పరిగెత్తేంత పిచ్చి! యవ్వనోద్రేకం! అక్కడ తన కోసం కారులో వేరే వూరునుంచి మరీ వచ్చిన మిత్రుడి కోసం కిరణ్మయి వీళ్ళందరినీ వదిలేసి చెంగుమని ఎగిరిపోతే — గుణపాఠం నేర్చుకున్న భావన. మళ్ళీ రేపెప్పుడో ఇదే కిరణ్మయి కనిపించి, ‘హాయ్ రవీ!’ అని పలకరిస్తే రవిలోని ప్రేమికుడు మళ్ళీ పరవశించడని హామీ ఏమీ ఉండదు.

ఇలాటి (సహజమైన) వైరుధ్యాలు రవిలో అడుగడుగునా కనిపిస్తుంటాయి. మార్క్స్ ఆలోచలని ప్రేమించే అభ్యుదయవాది రవికి రిక్షావాడు తన దగ్గర రూపాయి వసూలు చేయడం దోపిడీగా కనిపిస్తుంది. ఎక్కేటపుడు ఎలా ఉన్నాడో గమనించని రవికి, అతడు రూపాయి డిమాండ్ చేయగానే రౌడీ లాగా కనిపిస్తాడు. రిక్షావాడి ప్రవర్తన అతని రూపాన్ని కూడా బూచిలా చేసి చూపిస్తుంది రవికి. ఆఫీస్‌లో పనెక్కువైందనీ జీతాలు పెరగడం లేదనీ ఆక్రోశించే అభ్యుదయవాది ఇంట్లో పనిమనిషి పదిరూపాయలు ఎక్కువ అడిగితే అది అన్యాయంలా కనిపించడం లాంటిదే ఇది. ఇలా మనుషులందరిలోనూ కామన్‌గా ఉండే అనేక సహజ ప్రవృత్తుల్ని, బలహీన క్షణాలని, భావావేశాల్ని నవీన్ ఈ నవల్లో రవిలో చిత్రిస్తారు.

చేతిలో పైసా లేక పోగానే అంతిమంగా రవి ఆలోచనలు చావు వైపు మళ్ళుతాయి. శ్రీశైలంతో గొడవ జరిగినపుడు, ‘అతడు తనని చంపేస్తే?’ అన్న భావనతో సతమతమవుతాడు. తను శ్రీశైలం చేతిలో మరణించినట్టు, తల్లి కుమిలి కుమిలి ఏడ్చినట్టు, ఊహించుకుని తృప్తి పడతాడు. తను కూడా ఆ దుఃఖపు బరువుని మోస్తాడు. రోడ్డు మీద మోటార్ సైకిల్ వాడు తప్పుకోమని గద్దించినపుడు తాను దాని కింద పడి మరణించినట్లు, ‘మోటార్ సైకిల్ కింద పడి విద్యార్థి మరణం,’ అనే వార్తను కూడా ఊహించుకుంటాడు. ఎలుకల మందో ఎండ్రినో తాగి తాను కాస్తా చస్తే యూనివర్సిటీలో నలుగురూ ఏమనుకుంటాడో వాళ్ళ వాళ్ళ ధోరణుల్ని బట్టి ఊహించుకుంటాడు. ‘నా కొరకు చెమ్మగిల్లు నయనమ్ము’ ఉండాలని ప్రతి మనిషీ కోరుకున్నట్టే రవి తన చావుకి ఎవరెలా స్పందిస్తారో ఊహించుకుని సానుభూతి ఆశిస్తాడు.

రవి లైంగిక అశాంతి

ఇరవయ్యేళ్ళ వయసులో ప్రతి యువకుడూ అనుభవించే స్పష్టమైన, అస్పష్టమైన లైంగిక అశాంతి నవలంతా విస్తృతంగా పరుచుకుని ఉంటుంది. నవీన్ దీన్ని దోబూచులాడే వర్ణనల మాటున దాచక విస్పష్టంగా రవి కోణం నుంచి వ్యక్తపరుస్తూ పోవడం చాలా మందికి మింగుడు పడినట్టు కనిపించదు. అందుకేనేమో ఈ నవల్లో అశ్లీలత ఉందని కొందరు సమీక్షకులు అభిప్రాయపడ్డారు.


అంపశయ్య (7వ ముద్రణ)

స్నేహితులు వేసే అశ్లీలమైన జోకుల్ని అసహ్యించుకుంటూనే మరో పక్క ఆ ఆలోచనలకు ఆనకట్ట వేయలేని సహజ బలహీనత రవిలో కనిపిస్తుంది. సరళ మీద భజగోవిందం వేసే జోకుల్ని మనసులో ‘ఛీ’ అని తిరస్కరిస్తూనే మరో వైపు క్లాసులో పడీ పడీ నవ్వుతున్న అమ్మాయిల అందాల్ని పరికించకుండా ఉండలేక పోతాడు. రత్తి నుంచీ గుర్నాధం భార్య వరకూ ఊహల్లో ఎవరినీ వదిలి పెట్టడు. ప్రాణాలు పోయేంత ఆకలితో లెక్చరర్ ఇంటికి వెళ్ళినపుడు కూడా లోపలి నుంచి బోర్నవిటా పంపిన లెక్చరర్ భార్య ఒక్కసారి కనిపిస్తే బాగుండనుకుంటాడు. ఆమె గొంతు విని ఆమె అందచందాలను ఊహించాలని ప్రయత్నిస్తాడు. ఒక పక్క కిరణ్మయిని ఆరాధిస్తూనే నీరజ, లిల్లీ, శశి, సుధ, నళిని, వీళ్ళందరి అందాలనూ మొహమాటం లేకుండా కళ్ళతోనే అంచనాలు వేస్తాడు. వీళ్ళతో పాటు ఆదారిన పోయే ఫ్రెంచ్ లేడీని, బ్రిగటా బార్డాట్ అంత సెక్సీగా ఉందంటాడు. హాస్టల్లో ఎవరో ఒకమ్మాయితో ఇద్దరు స్టూడెంట్స్ లవ్ మేకింగ్‌లో దొరికారని అంతా చెప్పుకునే వార్త పట్ల ఆశ్చర్యంతో కూడిన ఆసక్తిని ప్రదర్శించి, ఆ తర్వాత కూడా ‘అదెలా సాధ్యం అసలు?’ అని దాని గురించే ఆలోచిస్తాడు. రోడ్డు పక్కన బస్ కోసం వెయిట్ చేస్తున్న స్త్రీని తోటి విద్యార్థులు నీచంగా వ్యాఖ్యానిస్తున్నా ఖండించడు. అలాగని వాళ్ళు అలా కామెంట్ చేయడం రవికి నచ్చుతుందా అంటే లేదు! సెవెన్ యియర్స్ ఇచ్ సినిమాలో మార్లిన్ మన్రో స్కర్ట్ గాలికి లేచే ఫొటో ఎన్నో సార్లు తనివి తీరా చూస్తాడు. సినిమా హాలు ముందు హాలీవుడ్ నటీమణుల సెక్సీ పోజులు చూసి ఆనందిస్తాడు. పుస్తకాల షాపుల వద్ద న్యూడ్ ఫొటోలు చూసి చలిస్తాడు. పచ్చిగా ఊహించుకుంటాడు. ఆ వయసు యువతలో చెలరేగే లైంగిక అశాంతిని అనుక్షణం అనుభవిస్తుంటాడు. ఆ ఆలోచనలని ఆపలేడు. అతని వల్ల కాదు.

కానీ తనలా ఊహించుకుంటున్నాడని బయటకు తెలిస్తే? అన్న భయం! అందుకే అలా బొమ్మలు చూస్తూనే చుట్టు పక్కల వాళ్ళు గమనిస్తారేమో అని భయపడుతుంటాడు. అంతటితో ఆగవు రవి ఆలోచనలు. హోమోసెక్సువల్ లక్షణాలతో ప్రవర్తించే గుర్నాధం, “నా భార్య సిటీకి వచ్చింది. నాకు భయంగా ఉంది. నువ్వు రావా? కాసేపు ఆమెతో కబుర్లు చెప్పు ప్లీజ్!” అన్నపుడు ఆశ్చర్యపడి గుర్నాధాన్ని కసిరి పంపిస్తాడు. కానీ ఆ తర్వాత కోరికలతో రగిలి పోతాడు. చేతి వరకూ వచ్చిన ఛాన్స్‌ని పోగొట్టుకున్నానే అని ఎంతగానో పరితపిస్తాడు. గుర్నాధం భార్య అవయవ సంపద ఎలా ఉంటుందో, ఆమెతో గడిపితే ఎలా ఉంటుందో, ఆమె ఎలా స్పందిస్తుందో వివరంగా ఊహించుకోడానికి సైతం వెనుకాడడు!

ఈ లైంగిక అశాంతి అందరికీ సహజమే కావొచ్చు, ముఖ్యంగా ఆ వయసులో. కానీ అవి తనను సతమతం చేస్తున్నట్లు ఎవరికీ తెలీకూడదు. పూజలతో తన రూమ్‌నే గుడిలా మార్చిన ఆచారి సెక్స్ పుస్తకాలు చదువుతూ రవి కంటబడినపుడు పడే కలవరం కూడా దీన్నే చిత్రిస్తుంది. ఈ ధోరణిని రవిలోని ఒక కోణాన్ని ఆధారంగా తీసుకుని నవీన్ అద్భుతంగా ఆవిష్కరిస్తారు ఈ నవల్లో!