వాళ్ళక్కడికి చేరేసరికి అంతా హడావుడిగా ఉంది. కారు పార్క్ చేసుకుని స్టేడియం వైపు నడక సాగించారు. పార్కింగ్‌లాట్ నుంచి స్టేడియంకు చేరవేయడానికి ఏర్పాటు చేసిన చిన్న బస్సుల కోసం ఆగదల్చుకోలేదు. వాటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ రద్దీ ఒక కారణం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం మరో కారణం. గుంపులో కలవబోయే ముందు దొరికిన ఏకాంతక్షణాలను జారవిడుచుకోవడం ఇష్టం లేకపోవడం చివరిది.
వాళ్ళ నీడలు ఏటవాలుగా జారి చెట్ల నీడల్లో కలిసిపోతున్నాయి.
ఆమె చేతివేళ్ళలో తన చేతివేళ్ళు జొనిపి బిగిస్తూ అన్నాడతను. “అసలింతవరకూ ఈ షో నువ్వు చూడకపోవడం ఆశ్చర్యం!”
“దీని గురించి చాలా మంది చెప్పగా విన్నాను. ఒకసారి టికెట్స్ కొని కూడా చివరి నిముషంలో ఏదో పనితో కాన్సిల్ చేసుకోవలసి వచ్చింది.”
“పోనీలే, నీ మొదటి షో నాతో చూస్తున్నావు. నాకు సంతోషంగా ఉంది!” ఆగి ఆమె వంకే చూస్తూ అన్నాడు. “నీకు బాగా నచ్చుతుంది. యు విల్ ఎంజాయ్!”
“అయాం ఎగ్జయిటెడ్!” అతని చేతివేళ్ళను నొక్కి వదులుతూ చెప్పింది.
“తెలుస్తూనే ఉంది!” నవ్వుతూ అన్నాడు.
కుటుంబాలూ, స్నేహితులూ, ఆడా, మగా, చిన్నవీ, పెద్దవీ గుంపులుగా స్టేడియం గేట్ల వైపు కదులుతున్నారు. అతనూ, ఆమే టికెట్లపై గేట్ నంబర్లు చూసుకుని అదే గేట్ నుంచి లోపలికి చేరుకున్నారు. తమ నంబర్లున్న సీట్లు వెతుక్కుని కూచున్నారు. అతను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి పాప్ కార్న్, కోక్ పట్టుకొచ్చాడు.
“వేరే షోలూ నడుస్తున్నాయి కానీ ఇది చాలా పాపులర్! కొన్ని పాతవే ఊంటాయి కానీ కొత్త కొత్త యాక్ట్స్ ఎప్పుడూ యాడ్ చేస్తూ ఉంటారు.” పాప్ కార్న్ నములుతూ అన్నాడు.
పెద్ద స్టేడియం అది. కింద మైదానంలో ఒక వైపుగా వేదిక.
“ఇంకా స్టేజ్ అంతా ఖాళీగా ఉందేమిటి? తెరలూ, డెకరేషన్స్ ఏవీ లేవు!” కోక్ ఒక గుక్క తాగి అడిగింది.
“అదే మరి దీని స్పెషాలిటీ! ఇది పూర్తిగా నాచురల్‌గా ఉంటుంది. మేకప్ కూడా ఉండదు. స్క్రిప్టూ, ప్రాంప్టింగ్ లాంటివీ ఉండవు. లైటింగ్‌లో కూడా ఏ ట్రిక్కులూ ఉండవు. బీజీఎమ్ కూడా ఉండదు. నో గిమ్మిక్స్, నో మానిప్యులేషన్స్! అంతా ప్యూర్, సింపుల్ ఎండ్ నాచురల్!”
చీకటి పడుతూండగానే వెలిగిన పెద్ద పెద్ద దీపాలు స్టేడియం అంతటినీ కాంతివంతం చేస్తున్నాయి. చూస్తూండగానే స్టేడియం నిండిపోయింది. మాటలూ, పిలుపులూ కలగలిసి మిగతా శబ్దాలతో కూడి పైకెగుస్తున్నాయి. గాలి హాయిగా వీస్తూంది. చుట్టూరా అక్కడక్కడా సన్నటి పొడుగాటి గొట్టాలకి కట్టిన రంగురంగుల జండాలు రెపరెపలాడుతూ కొట్టుకుంటున్నాయి.
ఉన్నట్టుండి ఆ దీపాల వెలుతురు సన్నగిల్లింది. స్టేడియం పల్చటి చీకట్లోకి జారుకుంది. వేదికపైకి గురిపెట్టిన దీపాలు ఒక్కసారిగా వెలిగి అక్కడ పట్టపగలుగా భ్రమింపజేశాయి. పైన ఎత్తులో వేలాడుతూ అప్పటిదాకా ఏవో ప్రకటనలు చూపిస్తూన్న పెద్ద పెద్ద టీవీలన్నీ గప్పున తెల్లగా వెలిగాయి. ఎవరూ వేదికపైకి రాలేదు. మాటలు మాత్రం వినిపించాయి.
“ఇప్పుడు ఆట మొదలవుతుంది.”
స్టేడియం అంతా నిశ్శబ్దం.
దృశ్యం 1
ఒక ముసలమ్మ వణుకుతూ వేదిక ఎక్కింది. మురికి పట్టిన బట్టలూ, వంగిన నడుమూ, ముడతల మొహమూ, ఆరిపోయిన కళ్ళూ. గొంతు పెగుల్చుకుని చెప్పడం మొదలెట్టింది.
“అమ్మలారా! అయ్యలారా! నాగోడు ఏమని వెళ్ళబోసుకోను! ఇద్దరు కొడుకులు మాకు. పుట్టినప్పుడు ఎంత పొంగిపోయాం! ఎన్ని ఆశలు పెట్టుకున్నాం వాళ్ళ మీద! వాళ్ళు కంట నీరు పెడితే గిలగిలలాడిపోయాం. కంటి నిండా నిదర, కడుపు నిండా తిండీ తినక వాళ్ళను సాకాం, పెంచి పెద్దచేశాం. మా ధ్యాస అంతా ఎప్పుడూ వాళ్ళు మాకంటే బాగా బతకాలనే. ఏ పని చేసినా వాళ్ళ కోసమే ఆలోచించేవాళ్ళం. వాళ్ళు కడుపున పడ్డప్పటినుంచీ మాకోసం బతకడం మానేశాం, వాళ్ళ కోసమే బతికాం. మిగతా కోరికలన్నీ చంపుకున్నాం. కడుపుకు ఇంత అన్నం పెట్టే కాస్త పొలాన్నీ ఏడ్చుకుంటూనే అమ్ముకుని వాళ్ళు కావాలన్న చదువులు చదివించాం. మెడలో తాళిబొట్టు కూడా అమ్మి వాళ్ళ ఫీజులు కట్టాం. అయినా పిల్లలు చదువుకుంటున్నారని సంతోషంగానే ఉండేది. చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకున్నారు, అంతకంటే ఏం కావాలనుకున్నాం. మాట మాత్రం చెప్పకుండా వాళ్ళకు నచ్చిన వాళ్ళను చేసుకున్నారు, అయినా సంబరపడ్డాం.”
(“బోర్! బోర్!” ఎవరో ముందున్నవాళ్ళు అరిచారు. “షటప్!” ఇంకెవరో వాళ్ళని విసుక్కున్నారు.)
“పిల్లలు పుట్టిందాక మళ్ళీ తిరిగి మావంక చూళ్ళేదు. పోన్లే వాళ్ళ మానాన వాళ్ళు హాయిగా బతుకుతున్నారనుకున్నాము. ఆపనో ఈ పనో చేసుకు బతికాం గానీ చేయి సాచి వాళ్ళను ఏనాడూ పైసా అడిగింది లేదు. పిల్లలతో చేసుకోలేకపోతున్నామని వచ్చి తీసుకు వెళితే ఆ పనీ ఈ పనీ అని లేకుండా అన్నీ నెత్తిన వేసుకు చేశాను. ఆయన మంచాన పడితే వైద్యం చేయించటం సంగతి అటుంచి ఒక్కసారైనా వచ్చి చూసింది లేదు, పైసా పంపింది లేదు. కబురు చేసినా లేదు, ఫోన్లు చేసినా లేదు. మందులిప్పిస్తే ఏమో, బతికే వాడేమో, నా వల్ల ఏమవుతుంది? బతక లేక చావలేక చూస్తూ చూస్తూనే పోయాడు. అప్పుడయినా వచ్చారా? వాళ్ళనూ వీళ్ళనూ బతిమలాడుకుని దహనం చేయాల్సి వచ్చింది. పదోనాడు వచ్చారు. అందరూ నానా గడ్డీ పెడితే ఉన్న కాస్త పూరింటినీ అమ్మి నన్ను వంతులవారీగా ఉంచుకుంటామని చెప్పి పెద్దాడు తీసుకు వెళ్ళాడు. ఇక ఆ కష్టాలు ఏమని చెప్పుకోను? పనికి ఎప్పుడూ దడిచింది లేదు. గుప్పెడు కూటికి కూడా కొట్టుకులాడవలసి వచ్చింది. ఎట్లాగో గడిచిపోతుందనుకుంటే పెద్ద అభాండం నా నెత్తిన వేసింది కోడలు. ఇంట్లో ఏదో పోతే అది నేనే తీశానని యాగీ చేసింది. చిన్న కొడుకంటే నాకు ఇష్టమట, వాడేదో తక్కువలో ఉన్నాడనీ, వాడింటికి చేరవేయాలనీ నా పన్నాగమట. నా కొడుకు కూడా ఎగిరాడు నామీద. ఈ వయసులో సొంతకొడుకింట్లో దొంగతనం చేశానన్న నింద నేను మోయాలా? ఏం లేకపోయినా తలెత్తుకునే బతికాను కద! ఈనాటికి ఈమాట పడవలసి వచ్చింది. ఇంకా బతికి ఏం బావుకోవాలి? చిన్నాడిని తీసుకువెళ్ళమని ఫోన్ చేశారు. వాడు కుదరదు పొమ్మన్నాడు. ఇట్టాంటి కొడుకుల్నా నేను కన్నది? వీళ్ళసలు నాకొడుకులేనా? నేను సరిగ్గా పెంచలేదా? ఏం తక్కువ చేశాను వాళ్ళకి? నాకే ఎందుకీ ఖర్మ? తల్లినని కాకపోయినా ఒక ముసలిదన్న కనికరం కూడా లేకపాయె. పక్కింటివాళ్ళు వాళ్ళ పనమ్మాయిని ఇంకా గౌరవంగా చూస్తారే! అక్కడ ఉన్న కొద్దీ ఇంకా ఏం చూడాల్సి వస్తుందేమోనని భయం. వాడు ఇంకా దిగజారిపోవడం నేను చూడలేక ఇల్లు వదిలి వచ్చేశాను. వొంట్లో సత్తువ లేదు. అడుక్కు తింటున్నాను. ఉన్నప్పుడు నలుగురికీ పెట్టిన దాన్నే అయ్యలారా! ఇద్దరు కొడుకులు ఉండీ అడుక్కు తిని బతుకుతున్నాను. ఈ గతి ఎవరికీ పట్టగూడదు అమ్మలారా! ఈ చావు నాకు ఎందుకు రాదో తండ్రీ!”
నెత్తి కొట్టుకుంటూ శోకాలు తీసింది. కాసేపయ్యాక వోపిక లేనట్టు కూలబడింది. కూలబడి కుమిలి కుమిలి ఏడ్చింది.
(ఆమెకి తెలియకుండానే చెంపల మీద కన్నీరు ధార కట్టింది. తన జేబులోంచి కొత్త రుమాలు తీసి ఇచ్చాడు తుడుచుకోమన్నట్టు. “థేంక్స్!” అంటూ తీసుకుని తుడుచుకుంది. “యు ఆర్ గుడ్! ఐ నో యు ఆర్!” నవ్వుతూ భుజం మీద తట్టి చుట్టూ చెయ్యేస్తూ అన్నాడు.)
దృశ్యం 2
ఒక యువతి వేదిక మీదికి వచ్చింది. కళ్ళల్లో నీళ్ళు తొణికిసలాడుతున్నాయి. తలొంచుకుని ఒక క్షణం నిలబడింది. ఉన్నట్టుండి కదిలి మెల్లగా వొంటిమీది బట్టలు జారవిడిచింది.
“ఇవీ నా గాయాలు!” ఒక్కో గుర్తునూ చూపుడు వేలుతో చూపుతూ అంది. బుగ్గల మీద చేతి ముద్రలూ, చిట్లిన పెదవీ, రొమ్ములపై మానుపడుతున్న పంటిగాట్లూ, తొడల మీద కదుం గట్టిన దెబ్బలూ, వీపు మీద వాతలూ.
“నేను దాచుకోవలసింది ఏదీ లేదు. చూపించనిదే మీకు నా నొప్పి తెలియదు. అయినా నేను ఇదే కదా! ఒక శరీరాన్ని. ఒక గాయాన్ని. నాకిదే గుర్తుంటుంది. నమిలి మింగేసే చూపులూ, వీలు చూసుకునో, చేసుకునో తాకడాలూ, నొక్కడాలూ. నాకూ సిగ్గూ, మర్యాదా, మానాభిమానాలూ ఉండేవి. మీ లాగే, మీ పిల్లల్లాగే కలలూ కనేదాన్ని. ఎరలో చిక్కుకున్నాను. ఈ కథలన్నీ తెలుసు. తెలిసీ మోసపోయాను. నాకట్లా ఎందుకవుతుందిలే అనుకున్నాను. మీరయినా అనుకోరా ఎవరినయినా నమ్మినప్పుడు? నమ్మకద్రోహానికి ఏడవాలా? మురికి కూపంలో చిక్కుకున్నందుకు ఏడవాలా? ఒక్క తప్పుకే దగ్గరికి రానివ్వని తల్లిదండ్రుల కోసం ఏడవాలా? బయటపడేస్తుందనుకున్న ప్రతి చేయీ అందుకోవడం, తిరిగి ఇంకో కూపం లోకి జారిపడటం — ఇదే నా బతుకయింది. ఎవరయినా ఇట్లా ఎందుకు బతకాలి? ఎవరినయినా ఇట్లా ఎందుకు బతకనివ్వాలి? ఒక్కోసారి ఈ పీడకలనుంచి మేలుకోవాలనిపిస్తుంది. గట్టిగా కళ్ళు మూసుకుని చిన్నప్పుడు అమ్మ నేర్పిన ప్రార్థన చేస్తాను. ఒక్కసారి ఆ రాత్రి లోకి మేలుకుంటే తిరిగి ఈ కల చచ్చినా కననని చెప్పుకుంటాను. పొద్దున్నే ఆశగా కళ్ళు తెరుస్తాను. మళ్ళీ ఈ గాయాల్లోకే మేలుకుంటాను. ఇవి మానతాయి, కొత్తవి అవుతాయి. అసలు ఈ గాయాలు ఒక లెక్కలోకి రావు. ఇవి కాదు నన్ను బాధించేవి.”
(“ఏమంటుంది ఈమె?” వెనక ఎవరో గొణిగారు. “ష్!” ఎవరో కసిరారు.)
“నన్ను నేను అసహ్యించుకోవడం. నాతో సహా నన్ను ఒక మనిషిగా ఎవరూ చూడకపోవటం. ఒక్క వోదార్పు మాట వినకపోవటం. నా బతుకు ముందు ముందు ఇంకా దిగజారి ఈ రోత బతుకే మేలనిపిస్తుందేమోనని భయం. ఇదంతా అలవాటయిపోతుందేమోననీ, నా మీద నేను కూడా జాలి పడనేమోననీ, నాకోసం నేను కూడా ఏడవనేమోననీ భయం.”
ఆమె గొంతులో దుఃఖపు జీరలు. ఇక మాట్లాడలేక ఆపుకోలేని వివశత్వంతో మోకాళ్ళమీదికి జారి వొంగి తల నేలకానించి రోదించింది.
దృశ్యం 3
ఒక బక్కపల్చటి మనిషి ఈసురోమని ఊగుకుంటూ పైకి ఎక్కాడు. మాసిన పంచె, ఎముకల గూడు. అతను ఎక్కడున్నాడో కూడా అతనికి తెలుస్తున్నట్టు లేదు. నిలబడలేనట్టు కూర్చుండిపోయాడు. వేరే లోకంలోనుండి మాట్లాడుతున్నట్టు గొణుగుతూ మొదలుపెట్టాడు.
“నాకు తెలిసిందల్లా ఎవసాయమే. పుట్టిన కాడ్నించి అదే పని. మట్టినే నమ్ముకు బతికా. ఎకరా పొలముంటే ఇంకా కౌలుకి తీసుకుని చేశా. వానలు పడక పోయె. యిత్తనాలు మొలవక మళ్ళీ కొనాల్సొచ్చింది. పైనుంచి కాలవ నీళ్ళు రాలా. మొక్క ఎదగలా. ఎక్కడెక్కడినుంచీ అప్పు తెచ్చి ఎరువులెన్ని ఏసినా, మందెంత కొట్టినా దిగుబడి లే. చేతికొచ్చిన పంట అయినకాడికి అమ్ముకుని బాకీలు తీర్చాల్సి వచ్చె. ఒక ఏడా, రెండేళ్ళా? ఉండకొద్దికీ ఊబిలోకి దిగబడతమేనాయె. ఉన్న కాస్త పొలమూ అమ్మబోతే అప్పిచ్చినవాళ్ళు పడనివ్వక తక్కువకే రాయించుకుంటిరి. కౌలు కట్టలేదని పొలం కౌలుకి ఇవ్వకపోతిరి. అప్పులిచ్చిన వాళ్ళు ఇంటిమీదకొచ్చి నానా మాటలూ అంటంటిరి. తింటానికి గింజలేకపాయె. పిల్లలు ఆకలికి ఓర్చుకోలేక ఏడుపులు. గవర్నమెంటు ఏమన్నా చేసుద్దోమోనని వాళ్ళ కాళ్ళూ వీళ్ళ కాళ్ళూ పట్టుకున్నా మాటలే కానీ ఎవురూ సాయం జేయకపోతిరి. ఇంకేం చేయాల? ఈ జన్మకింతే అనుకుని పిల్లలకీ, మా ఆడదానికీ పురుగుల మందు తాగిచ్చి నేనూ తాగా. ఇది తాగితే ఆకలేయదురా అని చెపితే మాట్టాడకుండా తాగారు పిల్లలు. నా చేతుల్తో నేనే తాగిచ్చా పాపాత్ముడిని. నన్ను కట్టుకున్న పాపానికి దానికీ, మా కడుపున పుట్టిన కర్మకి పిల్లలకీ ఆ గతి పట్టింది. నా కర్మ కాలి మందు కక్కిచ్చి నన్ను బతికిచ్చారు. పేనాలు పోకపోయె. పరువు పోయె. అన్నీ పోయినయ్యి. అందరూ పోయారు. నేను మాత్రం ఇట్ట మిగిలా. మోసం. అంతా మోసం.” అని తలొంచుకున్నాడు. అతను ఏడవడం లేదు.
(“చనిపోయాడా అతను?” ఎవరో గుసగుసగా అడుగుతున్నారు. ఎవరూ బదులివ్వలేదు.)
దృశ్యం 4
ఎదిగీ ఎదగని ఒకమ్మాయి బిడియంగా వేదిక పైకి వచ్చింది. జనంలో ఎవరో దగ్గారు. అటువైపు తలెత్తి బెదురు కళ్ళతో చూసింది. మెల్లగా వేదిక దిగి ఒక వయొలిన్ తెచ్చుకుని మళ్ళీ వచ్చింది. ఎత్తి భుజం మీద ఆనించుకుని దాన్ని గడ్డంతో వొత్తి పెట్టి వాయించడం మొదలుపెట్టింది. ఆమె గొంతు లోని దుఃఖం అంతా వయొలిన్ లోకి పాకింది. ఆ తీగలనుంచి పాతాళగంగలా పైకి ఉబికింది. అంతుబట్టని దుఃఖం అదుపు లేకుండా స్టేడియం మొత్తాన్ని ముంచెత్తసాగింది. చితికిపోయిన బాల్యమా, చిట్లిపోయిన స్వప్నమా, తనకి ఎవరూ లేని ఏకాకితనమా, బతుకు భయమా, తెలియడం లేదు కానీ అది గుండెల్ని కరిగించేస్తోంది.
(“అది ఆమె ఏడుపు కాదు. నాది. నేను మరిచిపోయిన ఎప్పటెప్పటి దుఃఖాలెన్నో బయటికి లాక్కొచ్చింది ఆ పిల్ల. అట్లా నాకెప్పుడూ జరగలేదు.” అంది ఆమె ఆతర్వాతెప్పుడో అతనితో.)
ఆ చుట్టేసుకుంటున్న దుఃఖం ఇప్పుడప్పుడే వదిలిపెట్టదేమోనని భయం కలిగించేలా ఉంది. క్రమంగా ఆ అమ్మాయి వయొలిన్‌గా మారిందో, వయొలిన్ ఆ అమ్మాయిగా మారిందో తెలియలేదు కానీ అక్కడ ఒక్కటే ఆకారం కనిపించింది.
దృశ్యం 5
ఇద్దరెవరో ఒక స్త్రీ శరీరాన్ని మోసుకొచ్చి పడుకోబెట్టారు. కదలకపోవడం వల్లా, ఊపిరి కూడా తీసుకుంటున్నట్టు కనబడకపోవడం వల్లా అది శవమని తెలుస్తూ ఉంది. పైన చిరిగి పేలికలైన దుస్తులు. పడుతూ లేస్తూ తప్పటడుగులు వేస్తూన్న ఒక బాబును వేదికపై వదిలారు. బాబు నెమ్మదిగా శవం దగ్గరికి చేరాడు. ఆమెను లేపడానికి ప్రయత్నించాడు, “అమ్మా, అమ్మా!” అంటూ. లేవకపోయేసరికి ఏడవడం మొదలు పెట్టాడు. “అమ్మా, అమ్మా!” అని ఆమెని పట్టి లాగుతూ, ఎక్కిళ్ళు పెడుతూ అదే ఏడుపు. దిక్కుతోచని అనాది మానవుడి ఆక్రందన లాగా అక్కడంతా అది ప్రతిధ్వనిస్తూ ఉంది. ముందు జీవితంలో తను పడబోయే బాధలకన్నిటికీ కలిపి ఇప్పుడే ఏడుస్తున్నట్టు ఉంది అది. ఆ ఏడుపుకి శవం చటుక్కున లేచి కూచుని వొళ్ళోకి తీసుకుంటే బావుణ్ణని అనిపించేలా ఉంది.
అందరూ తేరుకుని లేచి రెణ్ణిముషాలు ఆగకుండా చప్పట్లు కొట్టారు. కొందరు నెమ్మదిగా, కొందరు వడివడిగా గేట్లవైపు నడిచారు. ఒక అమ్మాయెవరో స్నేహితురాలికి చూపిస్తూంది తన రుమాలెంత తడిసిందో చూడమని. “స్ప్రైట్ పోసుకున్నావు దాని మీద. నేను చూశాలే!” అని ఆట పట్టిస్తుందామె నవ్వుతూ.
“వాళ్ళకు డబ్బులిస్తారా?” నెమ్మదిగా అడిగిందామె అతన్ని.
“ఏమో మరి, నాకు తెలియదు.” అన్నాడు అతను.
పక్కనున్న పెద్దాయనెవరో చెప్పాడు. “లేదు, వాళ్ళకు పైసా కూడా ఇవ్వరు. ఇస్తే ఇక మిగతా షోలకూ దీనికీ తేడా ఏముంటుంది. అంతా కల్తీ అయిపోతుంది.”
బయటపడ్డ వాళ్ళు ఎవరి కార్లవైపు వాళ్ళు వెళుతున్నారు. “ఎంజాయ్ చేశావా?” అడిగాడు అతను ఆమె నడుం చుట్టూ చేయి వేస్తూ. “బ్రహ్మాండంగా!” మెడ వంచి తల అతని భుజం మీద ఆనించి చెప్పింది. “ఇదుగో” అంటూ తన రుమాలు అతని అటు వైపు చెంపకానించింది రుజువుగా.
పైన మిణుకుమంటూ కనిపించీ కనిపించని నక్షత్రాలు అప్పటికి కాస్త పక్కకి జరిగాయి. కింద కార్లు ఎక్కడివక్కడే ఉన్నాయి ఎదురు చూస్తూ.