కోనసీమ కథలు: సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్

మీ దేశం నుండి మీకో శుభలేఖ వచ్చిందంటూ ఆష్నా టేబిల్ మీద గిరవాటేసింది. మా ఆవిడ ఆష్నాకి తెలుగు రాదు, తను పంజాబీ. నేనూ, నా వూరూ ఆవిడకో దేశం క్రిందే లెక్క. కవరు చించి చూశాను. నా కజిన్ రాజి కూతురి పెళ్ళి. పాతికేళ్ళుగా ఢిల్లీలో ఉండి పోవడం వల్ల నేను మా బంధువులెవర్నీ కలవలేదు. దానికి తోడు ఇరవయ్యేళ్ళ క్రితం నేనొక పంజాబీ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న దరిమిలా మావాళ్ళతో రాకపోకలు బాగా తగ్గాయనే చెప్పచ్చు. దానికితోడు అమ్మా, నాన్నా పోయాక నేను కొమరగిరి పట్నం వెళ్ళ లేదు. ఎప్పుడైనా ఇలా బంధువుల పెళ్ళి కబర్లు తెలుస్తాయి, అంతే! వాళ్ళూ ఓ శుభలేఖ పడేసి ఊరుకుంటారు, నేనెలాగూ స్పందించనని తెలిసి.

పెళ్ళి ఎప్పుడాని తేదీ కోసం వెతికాను. ఆగస్టు రెండో వారంలో పెళ్ళి. అదీ కొమరగిరిపట్నంలోనే. పెళ్ళికొడుకెవరాని చూసి పేరు దగ్గర ఆగిపోయాను. ఇస్మాయిల్ వెడ్స్ నేహ అనుంది. పైగా పెళ్ళికూతురే తన పెళ్ళికి పిలుస్తున్నట్లు వెరైటీగా ఉంది. పెళ్ళికొడుకు పేరు ఇస్మాయిల్ అనుండేసరికి మతాంతర వివాహం అని అర్థమయ్యింది. కొమరగిరి పట్నం అనేసరికి వెళ్ళాలనిపించింది. ఆష్నా రాదని తెలుసు. వెళితే నేనొక్కణ్ణే వెళ్ళాలి. చూద్దాంలే అనుకుంటూ ఊరుకున్నాను.

నేను గౌహాటీ ఆఫీసు పనిమీద వెళ్ళి నప్పుడు మా కజిన్ రాజి ఢిల్లీ వచ్చిందనీ, పెళ్ళికి రమ్మనమని చెప్పిందనీ ఆష్నా చెప్పింది. ఆ విధంగా రాజి ఫోన్ నంబరు తెలిసి కాల్ చేశాను. నా గొంతు విని చాలా సంతోషించింది. నా ఈడే, ఇద్దరం కలిసి అమలాపురంలోనే పెరిగాం. ఆ కబురూ ఈ కబురూ మాట్లాడుకుంటూండగా పెళ్ళికొడుకు ప్రస్తావన వచ్చింది. ముస్లిమా అని నేను అడిగేసరికి విరగబడి నవ్వింది.

“ఇస్మాయిల్ ఎవరనుకున్నావు? మన సంస్కృతం మాస్టారు గుర్తున్నారా? వాళ్ళ మనవడు,” అంది. సంస్కృతం మాస్టారనగానే చటుక్కున గుర్తొచ్చింది. మాస్టారమ్మాయి నిర్మల కొడుకే ఇస్మాయిల్ అని చెప్పింది.

నాకు వేరే ఇస్మాయిల్ గుర్తొచ్చాడు.


అవి నేను జిల్లా పరిషత్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదివే రోజులు. మామిడికుదురు నుండి ట్రాన్స్ఫరు మీద మా క్లాసులోకి ఒక కొత్తబ్బాయి వచ్చాడు. చూడ్డానికి తాడిలా వున్నాడు. దానికితోడు పొట్టి లాగు వేసుకొచ్చేసరికి అందరం చచ్చేలా నవ్వుకున్నాం. వాడి పేరు ఇస్మాయిల్. ముస్లిం అని పేరుని బట్టే అందరికీ తెల్సింది. ఆఖరి బెంచీలో కూర్చునే వాడు. ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. క్లాసు లీడరవ్వడం వల్ల నాతో అప్పుడప్పుడు మాట్లాడేవాడు. మాటల్లో వాళ్ళ నాన్న తహసీల్దారాఫీసులో గుమాస్తా అని తెలిసింది. గడియార స్థంభం దగ్గర్లో మసీదొకటుంది. దాన్నానుకొని ప్రత్యేకంగా ముస్లిం వీధి కూడా నాకు తెలుసు. రోజూ ఉదయమే సంస్కృత పాఠశాలకి వెళ్ళడానికని తెల్లవారుఝామునే నిద్ర లేచేవాణ్ణి. మా పెరట్లోకి ఆ మసీదు మైకులోంచి ప్రార్థనలు వినిపించేవి. ఇస్మాయిల్ ఆ ముస్లిం వీధిలోనే ఉంటాట్ట.

మొదట్లో నాకు అంత స్నేహం లేదు. ఎప్పుడయినా నేనే పలకరించేవాణ్ణి. నేను తొమ్మిదో తరగతిలో సెకండ్ లాంగ్వేజీ సబ్జెక్ట్టుగా సంస్కృతం తీసుకున్నాను. ఇస్మాయిల్ ఉర్దూ అని తెలిసింది. వాడు స్కూల్లో ఏ ముహూర్తాన చేరాడో మా ఉర్దూ మాస్టారు వేరే చోటకి బదిలీ అయి వెళిపోయారు. దాంతో వాడు కొత్త మాస్టారి రాక కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. స్కూలు తెరిచి ఆర్నెల్లు అయినా ఎవరూ రాలేదు. వాడొక్కడే మొత్తం స్కూల్లో ఉర్దూ క్లాసు తీసుకున్నది. తెలుగు క్లాసులోనే కూర్చోమని ఆఫీసు వాళ్ళు చెప్పారు. ఇస్మాయిల్‌కి తెలుగంటే చచ్చేటంత భయం. దాన్ని తప్పించుకోడం కోసమే ఉర్దూ తీసుకున్నాడు. తెలుగులో బొటాబొటీగా వస్తే ఉర్దూతో కలిపి గట్టెక్కేయచ్చని వాడి ప్లాను. చూస్తూండగా తొమ్మిదో తరగతి గడిచిపోయింది. పీవీ నరసింహారావు పాసు ధర్మమాని అందరూ పదో క్లాసులోకి వచ్చేశాం. పదో క్లాసు తెలుగు మాస్టారు చండశాసనుడు. ఆయన్ని చూసి హడలిపోయాడు ఇస్మాయిల్. వేరే స్కూలుకి మారడం కుదర్దు. అప్పుడు నేను వాడికో చిట్కా చెప్పాను.

హిందీ చదవడం అంత కష్టం కాదు కాబట్టి సంస్కృతం తీసుకోమని. ఎలాగూ మేమందరమూ తెలుగులోనే రాస్తాం. పైగా ఉన్నవి మూడు పాఠాలు. బట్టీ కొట్టేస్తే ఎంత లేదన్నా ముప్పైకి పాతిక తక్కువ కాకుండా వచ్చేస్తాయి. దాంతో పదో తరగతి తెలుగు పరీక్ష గట్టెక్కేయచ్చు. ఇది ఇస్మాయిల్‌కి నచ్చింది. వాళ్ళ అబ్బాని అడిగొస్తానన్నాడు. ఆయన సరేననడంతో నేను వీణ్ణి తీసుకొని సంస్కృతం మాస్టారి దగ్గరకి తీసుకెళ్ళాను. ఆయనో వఠ్ఠి ఛాందసుడు. వీడి వాలకం చూడగానే గయ్యిమన్నాడు.

“తెలుగే రానివాడికి సంస్కృతం ఏం వచ్చి చస్తుందట? అయినా నేను చూస్తూ చూస్తూ తురక వాళ్ళకి సంస్కృతం చెప్పడం ఏవిటని,” తీస్కొచ్చినందుకు నాకు నాలుగు చివాట్లు పెట్టాడు. నాకెందుకో ఆయన పద్ధతి నచ్చలేదు. మా నాన్నకి చెప్పాను. హైస్కూలు హెడ్మాస్టరు మా నాన్నకి బాగానే తెలుసు. ఆయన ద్వారా హెడ్మాస్టరుకి చెప్పించాను. ఆయనెళ్ళి సంస్కృతం మేస్టారు మీద గయ్యిమన్నాడట. అంతే! ఇస్మాయిల్ మా సంస్కృతం క్లాసులో జాయిన్ అయ్యాడు. వీణ్ణి చూస్తేనే మాస్టారికి పీకల వరకూ కోపం ఉండేది. ఎప్పుడూ పేరు పెట్టి పిలిచిన పాపాన పోలేదు. ఏదైనా డౌట్స్ వస్తే నన్నే అడిగేవాడు. అలా మా ఇద్దరికీ స్నేహం పెరిగింది.

ఓ నెల్లాళ్ళ తరువాత మాస్టారు స్కూలుకి రాలేదు కొన్ని రోజులు. విషయం ఏవిటయ్యా అంటే మాస్టారి ఒక్కగానొక్క కూతురుకి కామెర్లు వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురయ్యిందని ఈయన బెంగతో కుమిలి పోతున్నాడని తెలిసింది. ఎన్ని మందులు వాడినా లాభం లేదని డాక్టర్లు చెప్పారని విన్నాను. ఇదే విషయం ఇస్మాయిల్‌కి చెప్పాను. వాళ్ళ అబ్బాకి యునానీ వైద్యం తెలుసునని చెబుతూ ఒక సీసాలో మందు పట్టుకొచ్చాడు మర్నాడు. చూడ్డానికి ఆయుర్వేద రసంలా పచ్చగా ఉంది. అదీ ఒక తాయిత్తూ ఇచ్చి మాస్టారికిచ్చి చూడమన్నాడు. అసలే ఆయనకి వీడంటే కోపం. అందువల్ల నేనే పట్టుకెళ్ళి ఇచ్చొచ్చాను. ఇస్మాయిల్ ఇచ్చాడని చెప్పలేదు. మా ఇంట్లో తెలుసు కానీ బయట ఇంకెవరికీ తెలీదు. మాస్టారి భార్య ఆ తాయత్తు కట్టి, ఆ మందు ఇచ్చేసరికి వార రోజుల కల్లా పూర్తిగా తగ్గి మామూలు మనిషియ్యిందని విన్నాం. భార్య ద్వారా విషయం తెలుసుకున్న మాస్టారు మా ఇంటికొచ్చారు – మా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడానికి. అప్పుడు మా అమ్మ విషయం చెప్పేసింది. దాంతో ఆయన నన్ను పట్టుకున్నాడు. జరిగింది చెప్పాను.

అంతే! ఆ క్షణం నుండి మాస్టారికి ఇస్మాయిల్ దేవుడు. వాడికి వెనుక బెంచీ నుండి ముందు బెంచీకి ప్రమోషన్ వచ్చింది. ఇస్మాయిల్‌కి తెలుగు కష్టంగా ఉందనీ ఆయనే ట్యూషన్ ఫ్రీగా చెప్పేవాడు. అంతేకాదు వాడికి శబ్దమంజరీ, రఘువంశం అన్నీ కంఠతా వచ్చేలా నేర్పేశాడు. చూస్తూండగా నాలుగు నెలల్లో ఇస్మాయిల్‌కి తెలుగంటే భయం పోయింది. వాడు మాస్టారికి అనుంగు శిష్యుడయిపోయాడు. వాళ్ళింట్లో ఓ మనిషిలా ఆయనకి అన్ని పన్లూ దగ్గరుండి చేసి పెట్టేవాడు.

పదో తరగతి పరీక్షలయ్యి రిజల్ట్స్ వచ్చాయి. అత్తెసరు మార్కులొస్తాయనుకున్న ఇస్మాయిల్ ఫస్టు క్లాసులో పాసయ్యాడు. రిజల్ట్స్ వచ్చిన రోజున వాడి ఆనందానికి అవధుల్లేవు. మొట్ట మొదట సారి వాళ్ళింటికి తీసుకెళ్ళి డబల్ కా మీఠా తినిపించాడు.

నేను ఇంటర్మీడియట్లో ఎం.పీ.సీ తీసుకున్నాను. ఇస్మాయిల్ మాత్రం ఎకౌంట్స్ గ్రూపు తీసుకున్నాడు. దాంతో అప్పుడప్పుడు కాలేజీలో కనిపించినా మా మధ్య స్నేహం సన్నగిల్లింది. ఎప్పుడైనా కాలేజీ ఎదురుగా టీ స్టాల్లో కనిపించే వాడు. ఇంటరయ్యాక నేను ఇంజనీరింగుకి వెళిపోయాను. దాంతో నాకు ఇస్మాయిల్‌తో పూర్తిగా తెగిపోయింది. వాడు ఇంటరయ్యాక బి.ఏ.లో చేరాడని తెల్సింది. ఇంకోళ్ళెవరో మోడేకుర్రు సంస్కృత పాఠశాలలో చేరాడని చెప్పారు. కాలేజీకొచ్చేసరికి నాన్న కొమరగిరిపట్నం మకాం మార్చేశారు. దాంతో నాకు చిన్నప్పటి స్నేహితుల గురించి ఇక తెలియకుండా పోయింది.


అలా ఆ శుభలేఖ చిన్ననాటి నేస్తం ఇస్మాయిల్ని గుర్తుకు తెచ్చింది. ఇవన్నీ తలచుకుంటే ఒక్కసారి కొమరగిరి పట్నం వెళ్ళాలనిపించింది. ఎంతైనా పుట్టి పెరిగిన వూరు. ప్రస్తుతం నాకు తెలుసున్నవాళ్ళూ, నేను తెలుసున్న వాళ్ళూ ఎవరూ ఉండకపోవచ్చు. అయినా – ఆ నేలా, నీరూ, గాలీ చాలు. పెళ్ళి కెళ్ళాలన్న కోరిక బలంగా పెరిగింది. వయసు మీద పడ్డ జీవితాలకి గతమే పెద్ద నేస్తం. అందులోనే వాళ్ళని వాళ్ళు తడిమి చూసుకుంటారు. ప్రస్తుతం నా పరిస్థితి ఇదే. ఆష్నా, పిల్లలూ పెళ్ళికి రావని చెప్పారు. నేనొక్కణ్ణే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను, కాస్త ఓపికున్నప్పుడే వెళ్ళి రావాలని. ఓపిక తగ్గాక అవసరమూ ఉండదు; ఆసరానూ దొరకదు.

పెళ్ళికి కొమరగిరి పట్నం వెళ్ళాను. మా చుట్టాలు చాలామందే వచ్చారు. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అందర్నీ పాతికేళ్ళ తరువాత కలవడం ఒక కొత్త అనుభూతి నాకు. పెళ్ళికొడుకు సంస్కృతం మాస్టారి మనవడని తెలిసింది. మాస్టారమ్మాయి నిర్మల నన్ను గుర్తు పట్టింది. సంస్కృతం మాస్టారూ, భార్యా చనిపోయి చాలా కాలం అయ్యిందనీ విన్నాను. ఇస్మాయిల్ గురించి అడిగాను. నిర్మల ఎందుకో ముభావంగా తెలీదని చెప్పింది. మరీ గుచ్చి గుచ్చి అడిగితే కాట్రేనికోన హైస్కూల్లో పని చేస్తున్నాడని చెప్పింది.

మాస్టారుకి ఇస్మాయిల్ అంటే అభిమానం వల్లా, కూతురికి అనారోగ్యం బారి నుండి రక్షించాడన్న మమకారంతో కూతురు కొడుక్కి వాడి పేరు పెట్టారని తెలిసింది. చాలా సంతోషించాను. మరి అంత దగ్గరగా ఉన్న ఇస్మాయిల్ ఈ పెళ్ళికెందుకు రాలేదో? అర్థం కాలేదు. ఒకళ్ళిద్దర్ని అడిగినా తెలీదన్నారు. కాట్రేనికోనకి కొమరగిరిపట్నం అంత దూరం కాదు. ఇస్మాయిల్ వస్తే కలుద్దామన్న ఆశ అక్కడే అడుగట్టి పోయింది.

ఓ రెండ్రోజులు అక్కడుండి తిరుగు ప్రయాణం అయ్యాను. అమలపురం రూపు రేఖలే మారిపోయాయి. చిన్నప్పుడు నే చదివిన స్కూలూ, కాలేజీ వెళ్ళి చూసొచ్చాను. మేం ఉండే ఇల్లు కూలకొట్టేసి అక్కడ అపార్టుమెంట్లు కట్టారు. అక్కణ్ణుంచి విజయవాడ వెళ్ళి అక్కడనుండి తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కి టిక్కట్లు బుక్ చేసుకున్నాను. దగ్గర బంధువుల్ని చూడ్డానికని రాజమండ్రి వెళ్ళి అక్కడనుండి రత్నాచల్‌లో విజయవాడ బయల్దేరాను. రైలు అంత రద్దీగా లేదు. ఖాళీగా ఉన్న లోయర్ బెర్తు మీద ఓ కునుకేశాను.

ఇంతలో ఎవరో వచ్చి నన్ను లేపారు. బయటకు చూస్తే నిడదవోలు స్టేషన్ వచ్చుంది. ఇరవై నిమిషాల్లో మాంచి కునుకు పట్టేసినట్టుంది. నిద్రమత్తు వదిలి చూసేసరికి ఒక కుటుంబం సామాన్లు సద్దుతూ కనిపించారు. రైలు కదుల్తూండగా ఒకతను వచ్చాడు. అతని పోలికలు చూస్తే ఎక్కడో చూసినట్లుంది. గుర్తుపట్టాను. ఇస్మాయిల్! అప్పటికీ ఇప్పటికీ తేడా ఒకటే, గెడ్డం! నాకయితే బట్టతల వచ్చేసింది. వాడికి మాత్రం ఒక్క వెంట్రుకా రాలినట్లు లేదు. ఇస్మాయిల్ ఇలా కలుస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇద్దరం పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాం. ఇస్మాయిల్ నిడదవోలు కాలేజీలో పనిచేస్తున్నాడనీ, కూతుర్ని అత్తవారింట్లో దిగబెట్టడానికి ఖమ్మం వెళుతున్నాడనీ తెలిసింది.

“ఇస్మాయిల్ సంస్కృతం లెక్చరర్ అయ్యాడు. భలే బావుంది!” అన్నాను. గట్టిగా నవ్వుతూ తప్పేమిట్రాని అన్నాడు. నేను నా వివరాలన్నీ చెప్పాను. నాకిద్దరు కూతుళ్ళూ, ఒక కొడుకూ. వాడికీ ఇద్దరు కూతుళ్ళట, ఈ అమ్మాయి పెద్దమ్మాయట. ఆ అమ్మాయికిద్దరు పిల్లలు. ఆమె పక్కనే ఆరేళ్ళ అబ్బాయి కనిపించాడు. ఒళ్ళో ఆర్నెల్ల పసిపాప కనిపించింది. చాలా కాలం తరువాత కలిసామేమో నాన్స్టాపుగా అలా మాట్లాడుకుంటూనే ఉన్నాం.

“హైస్కూల్లో ఉండగా నువ్వు కవిత్వం అదీ రాసేవాడివి. ఏంటి? ఇంకా కొనసాగిస్తున్నావా?” హైస్కూల్లో చదివే రోజుల్లో నేను తెలుగు మాస్టారి అభిమాన శిష్యుణ్ణి. వ్యాస రచనా వక్తృత్వ పోటీలకీ, ఒకటేవిటి అన్నిట్లోనూ నాదే మొదటి బహుమతి. ఇస్మాయిల్‌కి ఇంకా గుర్తున్నాయి.

“కవిత్వమా? బొందా? నా తెలుగు ఎప్పుడో అటకెక్కేసింది. మా ఆవిడ పంజాబీ! అందువల్ల పిల్లలెవరికీ ఒక్క తెలుగు మాట రాదు. అంతా హిందీలోనే తిట్టుకుంటూ ఉంటాం. మా ఆవిణ్ణి తిట్టాల్సి వస్తే చక్కగా తెలుగులో తిట్టేస్తా! తిట్టి నాకూ, అర్థంకాక ఆవిడికీ మనశ్శాంతి. నాకూ తెలుగు పూర్తిగా టచ్ పోయింది,” పెద్దగా నవ్వుతూ చెప్పాను.

నేనూ ఇటువైపు వచ్చి ఇరవయ్యేళ్ళు దాటిందని చెబుతూ, ఇప్పుడు మాత్రం సంస్కృతం మాస్టారి మనవడి పెళ్ళికొచ్చాననీ, కుర్రాడి పేరు ఇస్మాయిల్ అని చూసి ఆశ్చర్యపోయాననీ చెప్పాను.

“మాస్టారికి నేనంటే ఉన్న వల్లమాలిన అభిమానం అది,” అంటూ ఆయన్ని తలచుకున్నాడు. వాడి కళ్ళల్లో ఆయనంటే గౌరవం స్పష్టంగా తెలుస్తోంది.

“నువ్వు పెళ్ళికొస్తావనుకున్నాను,” నా మనసులో మాట అడిగాను. అసలు వాడికీ పెళ్ళి గురించే తెలియదన్నాడు. మాస్టారింట్లో మనిషిలా మెసిలిన ఇస్మాయిల్‌కి పెళ్ళి పిలుపు రాలేదంటే ఆశ్చర్యం వేసింది నాకు. నమ్మలేక పోయాను.

“నిజం! నాకు మాస్టారితో రాకపోకలు పోయి పదేళ్ళు దాటుతుంది. అంతెందుకు? ఆయన పోయిన ఆర్నెల్ల వరకూ నాకు తెలీనే తెలియదు”. ఈ సారి వాడి మాటల్ని నమ్మాను. గుచ్చి గుచ్చి అడిగితే జరిగింది చెప్పుకొచ్చాడు.

“మాస్టారి మనవడు కాలేజీలో ఉండగా మా అమ్మాయి సల్మాని ప్రేమించాడు. మా అమ్మాయీ ఆ అబ్బాయంటే ఇష్టపడింది. కొంతకాలం మాకెవ్వరికీ తెలీదీ విషయం. అతని చదువయ్యాక ఈ విషయం బయట పెట్టాడు. మాస్టారికి అది నచ్చలేదు. ఆయనకంటే ఆయన కూతురికి అస్సలు మింగుడు పడలేదు. నా కూతురే వాళ్ళబ్బాయిని వల్లో వేసుకుందనీ నానా యాగీ చేశారు. మాస్టారు కూతుర్నే నమ్మాడు. ఎంతయినా బిడ్డ మీద నింద వేస్తే ఏ తండ్రి భరించగలడు చెప్పు? అందుకే నేను వాళ్ళకి దూరంగా ఉండి పోయాను. మాస్టార్ని చివరిసారిగా అదే కలవడం. ఆ తరువాత ఆరేళ్ళకి ఆయన పోయారనీ విన్నాను. మధ్య మధ్యలో చాలా సార్లు కలవాలనిపించినా వెళ్ళలేదు. ఆయనంటే అభిమానం లేక కాదు; మనసొప్పక. నా చదువూ, ఈ జీవితం ఆయన పెట్టిన భిక్షే! నేను సంస్కృతంలో ఎమ్మే భాషా ప్రవీణ చేశానంటే అది ఆయన ఆశీర్వాదమే!” కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు.

“నువ్వంటే అంత అభిమానం, ప్రేమా ఉన్నా మనిషి ఎందుకలా ప్రవర్తించారో నమ్మ బుద్ధి కావడం లేదు. ఏం? నువ్వు పరాయివాడివా? ఆయన కొడుకులాగే ఉన్నావు కదా? నీ పేరు మనవడికి పెట్టుకోడానికి లేని అభ్యంతరం పెళ్ళి కెందుకొచ్చిందట? పెళ్ళి చేస్తే ఆయన పెద్దరికం నిలబడుండేది!” మాస్టారి మీద కోపంతో కటువుగా అన్నాను.

“కొడుకు లాంటి వాణ్ణే కానీ కొడుకుని కాదు! మనవడికి నా పేరు పెట్టుకోవడం ఆయన మంచి మనసూ, గొప్పతనం. దానివల్ల ఎవరికీ నష్టం లేదు. కానీ తరువాతదీ? అది అభిమానం, ప్రేమా అన్నింటికంటా బలమైనది…” అంటూ ఆగిపోయాడు. ఏవిటన్నట్లు తలెగరేశాను.

“మతం! ఇంకేం వుంటుంది? మాస్టారు పిరికి మనిషి. సమాజాన్ని ఎదురించే సత్తువ ఆయనకి లేదు. ఆయన కూతురుకి మనసు లేదు. చదువు వేరు; జీవితం వేరు. పైకి ఎన్ని సుద్దులు చెప్పినా లోపల మనం ఇంకా బూజు పట్టిన మనుషులమే!”

ఏం మాట్లాడాలో తెలియలేదు. వాడి మాటల్లో బాధ ప్రత్యక్షంగా నాకూ అనుభవమే. చూస్తూండగా రైలు విజయవాడ చేరుకుంది. వాడి వివరాలన్నీ తీసుకొని శలవు తీసుకున్నాను. నన్ను గట్టిగా కౌగలించుకున్నాడు. పాతికేళ్ళ నాటి స్నేహపరిమళం అది. నాకూ కళ్ళ నీళ్ళొచ్చాయి. ఇంతలో ఇస్మాయిల్ మనవడు అక్కడున్న బొమ్మల దుకాణం వైపుగా పరిగెత్తాడు.

“ఒరేయ్! విశ్వం, ఆగరా!” అంటూ ఇస్మాయిల్ ఆ పిల్లాణ్ణి అనుసరించాడు.

విశ్వం. మా సంస్కృతం మాస్టారి పేరు.