త్రికాల సంపుటి త్రిపుర

త్రిపురని రాయటం రాదు నాకు. త్రిపురను తెలుసుకోవటం తెలియదు నాకు. జర్కన్‌ చదివినా, అభినిష్క్రమణంలోకి గెంతినా కనిపించని రహస్య ద్వారాలు తెరిచినా, చీకటిగదుల్లో వెతికినా కేసరి వలె కీడును పరికించినా, రాబందుల రెక్కల చప్పుడు ఆలకించినా, హోటల్లో నిలబడి నిరీక్షించినా, ప్రయాణీకులను సాగనంపినా, సుబ్బారాయుడు రహస్య జీవితంలోకి తొంగి చూసినా, పాముతో సంభాషించినా, వంతెనలు దాటినా, సఫర్‌లో ఒక సఫొకేషన్‌ అనుభవించినా, సైకిల్‌ బాగు చేయించుకుంటూ విడుదల భావానికి గురైనా, పిక్చర్‌ క్లియర్‌గా ఉందంట అంటూ సన్నాఫ్‌ భగవంతం లాంటోడు వలసపక్షుల గానంలో కరచాలించినా అదేమిటో త్రిపురను రాయటమెలాగో నేర్చుకోలేకపోయాను.

ఎంతో క్రిస్టలైజ్‌ అయితే తప్ప తన అనుభవాలను కథలుగా రాయలేనన్నాడు త్రిపుర. పాఠకుడికి ఆ క్రిస్టలైజ్డ్‌ అనుభవశకలాలు, ఆ శకలపు ఛాయలు తిరిగి ఏదో ఒక పారుదలగా మారితే తప్ప త్రిపురను రాయటం రాదనుకుంటాను. త్రిపురని రాయటం మాటలని కాదు గానీ, మాటలు కాదని కాదు గానీ ఎందుకో పెన్ను పెగలదు, పోనీ పగలదు. ‘ఉత్త డుస్కీ మాటలు’ ఎన్నైనా చెప్పవచ్చు. త్రిపురను చదవకూడదు. ఆయనను అధ్యయనం చేయాలనిపించటమే రాయలేకపోవటానికి, రాయరాకపోడానిక్కూడా కారణమనుకుంటాను. కేవలం రామయ్యగారి కోసం, భమిడిపాటి జగన్నాథరావుగారి కోసమైనా సరే ఎంత చదివినా చౌక్‌లోంచి విశ్వనాథ్‌ గల్లీలోకి కట్‌ చేసి శేషులాగా తప్పించుకునే మార్గాలనే వెతుక్కుంటోంది పాఠకానుభవం.

త్రిపుర కథల సారాంశాన్ని, ఒక్క నిఖిలేశ్వర్‌ పట్టుకున్నారని భావిస్తాను. ఆయన త్రిపురను ‘ఎర్రభిక్కు’ అనేసి మిన్నకున్నారు. ఎందరు ఏం రాసినా అవి త్రిపుర కథల నీడలను పట్టుకోవటమే. కనీసం వారికి నీడన్నా దొరికినట్లుంది. నాకు అది కూడా దొరికేట్లు లేదు. అయితే ఏవో కొన్ని పేర్లు అనగలను. కాఫ్కా, కేచా, సార్త్ర, మేరీ వార్నాక్‌, మార్టిన్‌ ఎస్లిన్‌, ఆరుగురు అస్తిత్వవాదులు, బెకెట్‌ అని బెకబెకలాడగలను. ఇదంతా శుద్ధ నేవ్‌ు డ్రాపింగ్‌, జ్ఞానంలా భాసించే అజ్ఞానపు అంచుల ప్రదర్శన. త్రిపురను రాసే ముందు సైజు తెలుసుకోవాలి.

భగవంతం అనే వాడొకడు కొత్తగూడెం నుంచి కాకుండా పోనీ ముత్తగూడెం నుంచి కూడా కాకుండా ఎవడైనా వస్తే త్రిపుర గురించి కాకపోయినా, ఆయన కథల గురించి కొంత తెలుస్తుంది. ఏదో కథలో ఒక స్థిరస్థితిని ఎక్స్‌ప్లోర్‌ చేసి, మరో కథలో అందరూ అందరితో, కొందరు అందరితో, ఒకడు ఇంకొకడితో బాహ్యంలోకి మాటలు విడిస్తే అదంతా క్రాస్‌టాక్‌గా మారిపోయి కొంత రాబందుల రెక్కల చప్పుడైపోతుంది. ఇంకొంత హోటల్లో కూర్చుని భాస్కరం వింటాడు. సరోజనమ్మగారికి దోసె పొట్లాం కట్టించుకుని ఏ ఆడమనిషీ ఏదో ఓవైపుకు కదిలిపోతుంది. సింవాచలమో, మరొక చంటోడో సెరిబ్రల్‌ మలేరియాతోనో లేక డెంగ్యూతోనో కార్పొరేట్‌ ఆసుపత్రిలో మరణించలేక గుడిసెలో కన్నుమూస్తాడు. మరైతే నువ్వేమీ రాయవా? నీకేదీ రాయరాదా అంటే నాకు రాయరాదు అని గొప్పగా అంగీకరించవచ్చు. రాసి అపరాధభావంతో క్రుంగిపోవటం కంటే ఇదే నయం. నామోషీ కదా రాయటం రాదని ఒప్పుకోవడం. మార్పేమీ రాని జీవితం జీవించటం ఎంత దుస్సహమో, మార్పులు తప్ప ఏమీ రాని జీవితాలను జీవించటమూ అంతే దుస్సహం, దుర్భరం.

అందుకే భగవంతం గురించి తెలుసుకునేందుకు బెకెట్‌ని ఆశ్రయిస్తాం. గాడో అంటాం. గోడో అంటాం. తాడోపేడో త్రిపుర కథ అంటూ దిగుతాం. రాయలేక, రాయరాక, ఏ రాయీ లేక ఒక మైవ్‌ు షోకి దిగిపోతాం. కనీసం గోడోలోనైతే ఈస్ట్రగాన్‌ అనేవాడు క్షణికుడు. తత్కాలుడు. వ్లాదిమిర్‌ శాశ్వతుడు. ఒకడు స్వాప్నికుడు. ఇంకొకడు కలలు కొరికే చెవులను మాత్రమే వింటూ నిలవలేనివాడు. గతాన్ని, గత సంఘటనలను ఒకడు అదేపనిగా పదేపనిగా గుర్తు చేసుకుంటాడు. ఇంకొకడు జరిగిన సంఘటనలను వెనువెంటనే మర్చిపోతుంటాడు. ఈస్ట్రగాన్‌కి తమాషా కథలను చెప్పటంలో ఆసక్తి వ్లాదిమిర్‌కి అవి వినటం పటు నిరాశ. అయితే వ్లాదిమిర్‌ అచంచల విశ్వాసం. అతడి స్వరం నమ్మకాన్ని ధ్వనిస్తుంది. గోడోగాడు వస్తాడని, అతని తొలి రాకడతోనే తమ స్థితి గతులు, మతిస్థితులు అపూర్వంగా మారిపోతాయని. ఈ రెండు విరుద్ధ వ్యక్తిత్వాలు ఒక కథలోకి వచ్చి చేరితే? ఒకటి వ్యక్తిగా, ఒకటి వ్యవస్థగా, ఒకటి దేహంగా, రెండోది చైతన్యంగా అన్వయించుకుంటే దీనినిలా అపపఠిస్తే ఏమవుతుంది. ఎవరికి మాత్రం ఏ కీడు మూడుతుంది.

అయినా అన్నీ తేటతెల్లమైపోయాయని, త్రిపుర కథల గురించి తెలియాల్సిందింకేమీ లేదని ఆయననొక విలక్షణ, విశిష్ట, విభిన్న, విపరీత, విధ్వంస రచయితగా మనకి మనం తెలిపేసుకున్నాక ఇంకేముంటాయి ఆ కథల్లో?

గోడో నాటకం 1957లో పదునాలుగు వందలమంది ఖైదీల మధ్య ప్రదర్శించబడిందని, దానిని తిలకించిన ప్రేక్షక ఖైదీ ఒకడు గోడో ఎవరంటే? గోడో ఈజ్‌ సొసైటీ! అనేశాడని మార్టిన్‌ ఎస్లిన్‌ తన థియేటర్‌ ఆఫ్‌ ది అబ్సర్డ్‌లో వివరాలతో చెప్పేశాడు. ‘వెయిటింగ్‌ ఫర్‌ గోడో’ ఒక ఖైదీకి బాగా అర్థమైంది. భగవంతం కోసం కథ అనేక విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాల ఆచార్యులకు ఇంకా అంతుపట్టలేదు. ఒక యు.జి.సి. సి బ్యాండ్‌ఫోర్‌లోనో, ఫైవ్‌లోనో ఉన్న ప్రాచార్యుడికి సైతం అవగతం కాలేదంటే తెలుగుకథ ఏమైనట్లు? ఎటు పోయినట్లు? త్రిపుర కథలు అంటే ఏమనుకుంటున్నారు మీరు. త్రిపుర అనే రాష్ట్రం నుండి అనువాదరూపంలో వచ్చిన కథలు. అర్థమైపోయిందా ఇప్పటికైనా? త్రిపుర కథల గురించి రాయటం మానుకుంటే మంచిది. దేర్‌ఫోర్‌ తెలుగు కథకు సర్రియలిజాన్ని అద్దాడు. తెలుగు కథల్ని అసంబద్ధతలోకి మోశాడు లాంటి మాటల్ని రాస్తే కళ్ళకు అద్దుకుని చదూకుంటాను.

అయినా నిరీక్షించడమంటే ఏమిటో మనకు తెలియనిది కాదు. దేనికోసం ఎవరెవరం ఎదురుచూస్తున్నామో అదే వచ్చేస్తే మనమంతా తప్పకుండా భంగపడేవాళ్ళం. అది ఆదర్శరాజ్య మైనా, కమ్యూనిస్టు సమాజమైనా, సాంస్కృతిక విప్లవమైనా సరే. అయినప్పటికీ, ‘నిరీక్షించువారు ధన్యులు. వారికన్నియును నొసగబడును,’ అని చెపుతూనే ఉంది. కొత్తదో, పాతదో ఓ నిబంధన గ్రంథం.

ఇంత తిమిరరశ్మి నాలో లేనప్పుడు, మోహన్‌ స్వీట్స్‌హోవ్‌ులో దోసెలు తినడం తప్ప ఏమీ తెలియనప్పుడు, తినాల్సిన దోసెలను, తాగాల్సిన కాఫీలను వదిలిపెట్టి మిత్రుడు ప్రసేన్‌, ఇంకొందరు మిత్రులు త్రిపుర కథల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆకలికే ఆకలేసిన ఆ భీకర ఆహార సేకరణ దశలో జాంతవ ప్రవర్తన ఉత్కృష్ట స్థితిలో ఉన్నప్పుడు నేను త్రిపుర పేరు విన్నాను. మిత్రులు బల్లలుగా, కుర్చీలుగా కొన్నిసార్లు బల్లులుగా ఫ్రీజైపోతున్న దశలో వాళ్ళంతా సిటీబస్సులు తిరగని పట్టణంలో 13నెంబర్‌ బస్సులోంచి దిగాల్సిన భగవంతం కోసం ఎదురుచూస్తుండేవాళ్ళు.

నేను వాళ్ళలాగా ఎదురు చూడకుండానే భగవంతం వచ్చాడు. అసలు భగవంతం ఎటు నుంచీ రాలేదు. నా బతుకులో అలా ఉన్నాడు. ఈ మిత్రులు ఇలా వస్తాడొస్తాడని అనుకుంటున్న కాలంలోనే వాళ్ళ ఎదురుగ్గానే, అదే హోటల్‌కు భగవంతం పలుమార్లు వచ్చేసి రకరకాల ఐటమ్స్ పార్సిల్‌ కట్టించుకుపోయిన సంగతి ప్రసేన్తో సహా ఎవరికీ తెలీదు. అదీ తొలి పరిచయం త్రిపుర కథల్తో. భగవంతంతో, శేషుతో కూడా. బతుకుతో, బాధతో, అనుభవంతో పరిచయం ఎవరికైనా ఉంటుంది.

ఇక రెండోసారి నాకు త్రిపురతో పరిచయం కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగింది. అప్పుడు నా చుట్టూ బన్న అయిలయ్య, పంతంగి వెంకటేశ్వర్లు, కంభాలపల్లి శేఖర్‌లు ఉన్నారు. విశ్వవిద్యాలయం లైబ్రరీలో త్రిపుర కథలు పుస్తకంతో పాటు శామ్యూల్‌ బెకెట్‌, కాఫ్కా, కామూ, సార్త్ర రచనలు కనిపించాయి. ఇప్పటి ఆంధ్రజ్యోతి కార్టూనిస్టు శేఖర్‌, తన కార్డు మీద మెటఫర్‌ అనే పుస్తకాన్ని తెచ్చిచ్చాడు. ఉమాడే కోసం లెగూయీ పుస్తకాన్ని దొంగిలించే శేషు కోసం నిరీక్షించే వాడిని అప్పట్లో. నాతో త్రిపుర కథలను పంచుకుంది శేఖర్‌ ఒక్కడే. వరంగల్లులో విశ్వనాథ్‌ గల్లీ, గోడోలిమా, దశాశ్వమేధ్‌ ఘాట్‌ ఉంటుందేమోనని వెతుక్కున్నాను. పవిత్రనగరంలో పాపిలాంటి, పుణ్యాత్ముడిలాంటి, పాములాంటి శేషిమో, శేషాచలపతి, అలఖ్‌నిరంజన్‌లు ఊరికనే అవగతమయ్యారు పోతన హాస్టల్‌ రూవ్‌ు నెం. 10లో. శివుని అర్ధాంగలక్షి కాని ఇన్వీటి మీద నాగ్రహము తగునె అంటూ వ్యాసుని మందలించిన పార్వతి ఎలియాస్‌ ఉమాడే కూడా నాకు బోధపడింది. అసంబద్ధంగా, తెలియటమంటే అసలు ఏమీ తెలీకపోవడమే. కాదు తెలిసిందనుకున్నాను. శ్రీనాథుడు కూడా నను మందలించాడు. దుర్భర దారిద్య్రంలో.

రోహితుడా! రోదితుడా!! మనం విన్న మేరకు- సంచరించనివాడు, తిరగనివాడు సంతోషం పొందలేడు తిరగరా తిరుగు. సంచరించరా సంచరించు. మనుషులు బ్రతికే సమాజంలో ఉత్తముడు సిన్నరవుతాడు కాబట్టి యానించమని, ప్రయాణించమని ఐతరేయ బ్రాహ్మణంలో ఇంద్రదేవుడు యాత్రికుల రక్షకుడు యువరోహితుడికి బోధించినట్లు పాము కథ ఏదో బోధించింది. దుఃఖోపదేశం చేసింది. తిరిగేవాడి కాలు పుష్పం లాంటిది. వాడి ఆత్మ ఎగురుతూ ఉంటుంది. వికసిస్తూ ఉంటుంది. ఫలాన్ని తెంపుకుంటూ ఉంటుంది. ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటుందన్న సత్యం, సంగం బార్‌లో తేలిపోయింది. సకల నేరాలూ పరిహరించబడతాయి ప్రయాణపు అలసటలో. కాబట్టి తిరగరా తిరుగు అనేదే బోధ.

త్రిపుర పాత్రలు తిరుగుడు పాత్రలు. అవి ఒక చోట నుంచి మరొక స్థలంలోకి, తలంలోకి తిరుగుతూ ఉంటాయి. ఒక భావం నుంచి మరో భావానికి, ఒక అనుభవం నుంచి మరో అనుభవంలోకి నిష్క్రమిస్తాయి. ఈ తిరుగుదలకు తరుగుదలేమీ ఉండదు. కూర్చున్నవాడి అదృష్టం కూర్చునే ఉంటుంది. నిలబడ్డప్పుడు నిలబడుతుంది. వాడు నిదురించినప్పుడు అదీ నిద్రిస్తుంది. వాడు కదిలితే అది కదలుతుంది. పాము శేషులం పాపం శేషులం కాం. పాపం చేసే మనుషులం అని త్రిపుర వ్యాఖ్యానించేడు. పాపపుణ్యాలకు కూడా ఓ బాల్యం ఉంటుంది. మార్టిన్‌ హాగ్‌ రుగ్వేదపు ఐతరేయ బ్రాహ్మణ అనువాదపు తునకల్లోంచి శేషు అకారణంగా అర్థమవుతాడు. అంతటి మోక్షకేంద్రంలోనూ, జన్మరాహిత్యపు ఆకాంక్షను నెరవేర్చే కాశీనగరం నడిబొడ్డున ‘హిందూ ముస్లిం రయట్‌’ అంటూ క్వీనీదో, రాణీదో ఓ చెయ్యట్టుకుని పరిగెడుతున్న శేషాచలపతి తన గతంలోంచి విముక్తం కాలేకపోవటం అప్పుడు బాధించింది. ఇప్పుడైతే ప్రతి ప్రక్కవాడి పెదవుల మీదా మధురమైన విషపునవ్వు చూసి, వినీ వాహ్‌ త్రిపుర అనుకోవటం బాల్య బాధిత సత్యం. వానాకాలం కప్పలాగున్న వాలిట్‌ల కోసం ఏకశిలా నగరంలో దొరక్క, కొట్టేయలేక కట్టుబడిపోయాను నైతిక గుంజకు. యదార్థం లాంటి పదార్థమేదో, పరమార్థమేదో శేషాచలపతిని వెంటాడటం ఎప్పటికీ నచ్చే విషయమే. అసలు తెలుగు కథల్లోని పాత్రలు అలా బారుల్లోకి బలాదూరుగా దూరిపోవటం చదివి అదో పారవశ్యం లాంటిది కలిగింది మనసుకి. మనసుకి తగిలేవి మనసునే తాకుతాయి. మేథకి చిక్కేవి మథనానికి చిక్కుతాయి. ఇప్పుడైతే బార్లు బయటకొచ్చాయి. అంతా బాహాటపు అంతర్నాటకమే. ఈ మూడు నాలుగు పదుల కాలంలో అంతా శేషులాగా శేషమయ్యారు మనుషులు. కానీ “జీవితానికి అర్థం లేదు, అంతా శూన్యం అని తెలుస్తున్నకొలదీ, నా పూర్ణశక్తితో వెనక్కి… వెనక్కి పరుగెడుదామను కుంటాను… తిరిగీ, నా బాల్యంలోకి… క్షణానికీ, క్షణానికీ క్రియకీ, క్రియకీ సంబంధం లేకుండా బ్రతకడం…” అని శేషు తెలుసుకున్నాడు. ఈనాటి శేషజీవులకు ఈ అస్తిత్వపు బాధలేదు. బోధలేదు. అదే ఈనాటి బాధ. ప్రమాదసహిత భరితంగా జీవించటం. క్రియక్రియకూ ప్రమాదాలు, పెను ముప్పులు సృష్టించుకొని తప్పించుకోవటం అప్పుడప్పుడే మొదలుపెట్టిన యువతకు ఒక ప్రతినిధిగా శేషు కనిపించడంలో వింతేమీ లేదు. అయినా అవేవీ ప్రాతినిధ్య పాత్రలు కావు ఇప్పటి అర్థంలో. ఎవరి జీవితానికి వాడే ఒక ప్రతినిధి. వాడే బ్రాండ్‌ అంబాసిడర్‌.

త్రిపురను మరో కోణంలో రమణమూర్తి పరిచయం చేశాడు. అవి కాల్పనిక కథలు కావని, పోనీ సామాజిక కథలూ కావనీ వర్గస్పృహ, వర్గచైతన్యం బోధించే కథలు కూడా కావని, అవి విపుల జీవన వెతలని, వాటికి అనేక మితులున్నాయని, అవి మిత్‌ ఆఫ్‌ సిసిఫస్‌ల మూలాలను వెలికితీసి చూపుతుంటాయని అన్నాడు. రావ్‌ునగర్లో పరిశోధకులుగా ఆధునిక జీవన సంక్లిష్టత అంటూ ఆ కథలను డీకోడ్‌ చేశాడు ఎన్‌. గోపిగారి పర్యవేక్షణలో. కేవలం జీవన సంక్లిష్టత అన్నా సరిపోయేది.

1990ల మాట ఇది. కాసేపు సర్రియలిజం చదువుతూ, మరోవైపు స్ట్రీవ్‌ు ఆఫ్‌ కాన్షస్‌నెస్‌ను గురించి రాస్తూ ఏదో చెప్పేవాడు. అవేవీ నాకు అంతుపట్టలేదు. బ్యాడ్‌ ఫెయిత్‌కు వుదాహరణ ఉన్నిథన్‌ అని, బీయింగ్‌ అండ్‌ నథింగ్‌నెస్‌ ఆధారంగా ప్రతిపాదించేశాడు. ఆ సిద్ధాంత వ్యాసరాజంలో ఎగ్జిస్టెన్సియల్‌ డ్రెడ్‌ కూడా ఉందని అన్నట్టున్నాడు. టొమాటో కోఫ్తా అంటే ఏమిటో తెలుసుకోకుండానే ఎం.ఫిల్‌. ముగిసింది. జెన్‌ బుద్ధిజం ముక్తాదేవి చదివింది కాని, రమణ తరువాత చదువుదాం అన్నట్టున్నాడు. ఏమైనా పరిశోధనను అలా చుట్ట చుట్టి, వుండగా చేసి సమర్పించేశాడు. అయినా సరే చిన్నారిని ప్రేమించాడు. మోహన్‌రెడ్డిని మెచ్చుకున్నాడు. బార్వే శిథిల జీవితాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ఇవతలి పార్శ్వంలో శిథిల శిథిలమైనది భాస్కరమని తరువాత గుర్తించినట్లున్నాడు.

ఇప్పటి పఠనం కూడా ఏమీ తేల్చి చెప్పలేదు నాకు. ఎప్పుడు చదివినా కథలు అప్పటి తాజాదనాన్నే ప్రదర్శిస్తున్నాయి. త్రిపుర కథలకు ఒకానొక మెటాఫిజికల్‌ నేచర్‌ ఉంటుందని తెలుస్తోంది. వాస్తవికతను చిత్రించి ఊరుకునే కథకులు వేరు. త్రిపురకు వాస్తవికతకు ఉండే అంతిమ స్వభావం ఏమై ఉంటుందనేది తేల్చాల్సిన విషయంగా కనబడుతుందేమో! గడియారాలతో కాలాన్ని కొలిచే పద్ధతికి స్వస్తి చెప్పి, కాలాన్ని తలిచే స్వభావాన్ని ఆయన ఇష్టపడ్డట్టుంది. కాలగణనం కాక మననం మీద దృష్టి ఉంటుంది. ఇందులో అనుభవం, జ్ఞాపకం, చైతన్యం, పశ్చాత్తాపం, క్షమ, ధైర్యం, సాహసం ఉంటాయి. అనుభవాన్ని, అనుభవక్రమాన్ని గుణాత్మకంగా వివిధ చైతన్యదశలకు అన్వయించే పనికి పూనుకుంటారు త్రిపుర.

పాత్రలను ఒక దశగా భావించటమూ ఉంటుంది. పోనీ స్థితీ కాదు. అదొక గతి. ఒక నిరంతర పారుదలను ఆవహించుకుని ఉంటాయి. ఆ పారుదల మాధ్యమం కాలమే. కాలమంటే చైతన్యమే. కాలం మరీ పూర్తి చైతన్యం కూడా కాదు. అదొక ప్రొలాంగ్‌డ్‌ ప్రెజెంట్‌. దీర్ఘ వర్తమానానికి కొన్నిసార్లు గతం వస్తుంటుంది ఆగంతకుడిలా. ఆ గతం అనుభవాన్ని తోడు తెచ్చుకుంటుంది. జరిగిపోయిన వాటిని తీరిగ్గా విశ్లేషించుకుంటూ ఉంటుంది. అందులో విలువల ప్రమేయం లేకుండానే ఉంటుంది. భాస్కరంలా భాసిస్తూ ఉంటుంది. లేదా నేనుగా మారుతుంది. తానైనదేదీ తానుగానే కాకుండా ఇతరులను గ్రహిస్తుంది, సంగ్రహిస్తుంది. తన నిర్ణయరాహిత్య స్థితికి, ఇతరుల నిర్ణయ సంకల్పస్థితికి వ్యాఖ్యగా మారుతుంది. జ్ఞాపకం గురించి త్రిపుర కథల్లో ఏదో ఒక సందర్భంలోనైనా ఒక్కసారైనా కనిపిస్తుంది.

“జ్ఞాపకాల భారాన్ని ఏడాదికేడాదికీ పెరిగే నా సామాన్లను కూడా నాతోనే తీసుకు వస్తున్నాను. నా సామాన్లని నేను మొయ్యను. జ్ఞాపకాల్ని కూడా ఆబ్జెక్టివ్‌గా చూడడం నా స్వంత శిక్షణలో భాగం. నాకు సంబంధించిన సంఘటనలు ఎవరికో అయినట్లు అనుకోవడం నా మెంటల్‌ మేకప్‌లో ఇమిడిపోయింది…” (ప్రయాణీకులు, పుట-73).

“జ్ఞాపకాల ముక్కల అస్తవ్యస్తపు సముదాయమే జీవితం కాబోలు. మనం ఉందనుకున్న పేటర్న్‌ అసలు వున్నది కాదు. మానవ జీవితం మీద మనం మన అవసరాల కోసం ఇంపోజ్‌ చేసినది. ఆ పేటర్న్‌ లేకపోతే జీవితం సాగదు, సాగాలని మనం భౌతికంగా, మానసికంగా అనుకుంటున్నా. కాబట్టి దాన్ని తీసేస్తే, అది లేదూ అనే నిర్ధారణకి వస్తే అది నిజంగానే లేదు కాబట్టి, మనకి స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛలో, ఆ స్వేచ్ఛతో మన వునికిని మనమేమేనా చేసుకోవచ్చు.”
(త్రిపుర కథలు, వలసపక్షుల గానం, పుట-179).