సి. పి. బ్రౌన్ (1798 – 1884)
ఆరుద్ర ఆయన్ని ‘బ్రౌన్, సాహిత్య క్రౌన్’ అన్నారు. జి. ఎన్. రెడ్డి, ‘బహుభాషా దక్షిణ నాయకుడైనా తెలుగు భాషను పట్టమహిషిగా వరించిన ధీరోదాత్తుడు,’ అని ఆలంకారికంగా ప్రశంసించారు. ఇంకా అది చాలక, ‘ఆంధ్రుల అదృష్టం కొద్దీ అవతరించిన మహనీయుడు, ఆంధ్రులకు సర్వదా ఆరాధ్యుడు,’ అని కూడా అన్నారు. ఇలా బ్రౌన్‌ని పొగిడిన వాళ్ళ పేర్లు జాబితా వేయడానికి ఈ వ్యాసం చాలదు. బ్రౌన్ జీవిత కాలంలో ఆయన దగ్గర పనిచేసిన పండితులు ఆయన్ని ఇంతకన్నా పెద్ద మాటల్లో పొగిడారు. ఈవాళ మనకు తెలుగుదేశంలో బ్రౌన్ పేరుతో అకాడెమీలు, పురస్కారాలు తరుచుగా కనపడుతున్నాయి. ఆయనకి వర్తమాన కాలంలో ఆరాధకులు కొల్లలుగా వున్నారు. ఈ మధ్యే బ్రౌణ్య విజయం అనే పేరుతో ఒక నాటకం ప్రదర్శింపబడింది. అందులో బ్రౌన్‌ని ఒక మహారాజులాగా కీర్తిస్తారు. ఒక ఊదారంగు సూటు వేసుకుని పునర్జన్మ ఎత్తిన బ్రౌన్ ఈ నాటకంలో తెలుగువాళ్ళతో స్వచ్ఛమైన తెలుగులో అనర్గళంగా మాట్లాడతాడు.
ఇప్పుడు ఈ వ్యాసం ఉద్దేశం ఈ ఆరాధకుల జాబితాకి మా పేర్లు కలుపుకోవడం కాదు. బ్రౌన్ ఎవరు? ఏ పరిస్థితుల్లో తెలుగు దేశానికి వచ్చాడు? ఆయన చేసిన పని ఏమిటి? ఆయన దగ్గర పండితులు, అంత పండితులు కానివాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎలాంటి పని చేశారు? బ్రౌన్ చేసిన పని తెలుగుకి ఎంత వరకు ఉపయోగపడింది? దానివల్ల అన్నీ లాభాలేనా, నష్టాలేమయినా జరిగాయా? ఈ విషయాల్ని సవిమర్శకంగా పరిశీలించి సాధ్యమయినంత బాధ్యతాయుతంగా కొన్ని ఆలోచనలు ప్రతిపాదించడం ఈ వ్యాసంలో మేము తలపెట్టిన పని.
19వ శతాబ్ది: తెలుగు కవిపండితుల స్థితిగతులు
అచ్చాఫీసులటంచు హూణుల కుపాధ్యాయత్వమంచున్ మఱిన్
వెచ్చంబిచ్చెడి బచ్చుటిండులకడన్ వేదాంతమంచున్ మహో
ద్యచ్చారిత్రులు పండితుల్ మెలఁగఁగా నయ్యెంగదా! పొట్టకై
చచ్చున్ గాలమువచ్చె గౌరవము నాశంబయ్యెఁ గామేశ్వరీ – (కా. శ. 10-22)
చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు ఇరవయ్యవశతాబ్ది మొదటిరోజుల్లో (కామేశ్వరీ శతకము, 1934: 3వ ముద్రణ) తెలుగు పండితుల స్థితిని వర్ణిస్తూ చెప్పిన పద్యమిది. అప్పటికొక 50ఏళ్ళ ముందునుంచే కవులకీ పండితులకీ ఆదరణ తగ్గిపోయింది. పెద్ద రాజ్యాలు గతించిన తరువాత వాటికి అవశేషాలుగా ఈ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వ ప్రభావం ప్రత్యక్షంగా లేని ప్రాంతాలు తెలుగుదేశంలో కొన్ని ఉండేవి. బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్మనెంట్ సెటిల్మెంట్ ఫలితంగా డబ్బుపెట్టి పరగణాలు కొనుక్కుని వాటిమీద ప్రభుత్వానికి గుత్తగా కొంత పన్ను చెల్లించే ఏర్పాటు చేసుకున్న కొత్త జమీందార్లు స్వయంగా సైన్యశక్తి, నిజమైన రాజ్యాధికారం లేకపోయినా, పూర్వపు రాజుల మల్లే పెద్ద పెద్ద బిరుదులు తగిలించుకుని రాజులుగా చలామణి అయ్యేవారు. వీళ్ళకి ఈ రకమైన రాజగౌరవం కల్పించిన వాళ్ళల్లో పండితులు, కవులు ముఖ్యులు. సంస్కృతంలో భోజుడు, తెలుగులో కృష్ణదేవరాయలు – వీళ్ళని గురించి తాము కల్పించుకున్న ఊహలను చాలామంది పండితులు, కవులు జమీందారులకి కట్టబెట్టారు. ఉత్తరాన బొబ్బిలి నుంచి విజయనగరం మీదుగా పిఠాపురం, నూజివీడు, వనపర్తి, గద్వాల, ఉర్లాం మొదలైన ప్రాంతాల వెలమ జమీందార్లు; ముక్త్యాల, మొదలైన ప్రాంతాల కమ్మ జమీందార్లు; రాజమండ్రి, సామర్లకోట మొదలైన ప్రాంతాల బ్రాహ్మణ జమీందార్లు; ఏలూరులో మోతే వారి వంటి వైశ్య జమీందార్లు (ఎస్. వీరబ్రహ్మ కవి, 1930; తూమాటి దోణప్ప, 1969). ఇలా కొంత హెచ్చుతగ్గులుగా జమీందారీతనం చలాయిస్తున్న వాళ్ళని ఆశ్రయించుకొని, వాళ్ళని పొగిడీ వాళ్ళ పోషణ పొందీ తమ పాండిత్యాన్ని, కవిత్వాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు చాలా మంది దాదాపు 20వ శతాబ్దపు మధ్యకాలం వరకు ఉండేవారు. అయితే ఈ జమిందార్ల ప్రాభవాన్ని దాటి మిగతా ఆంధ్రప్రాంతంలో, అంటే బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పరిపాలించే ప్రాంతంలో, పండితులకి కవులకి ఆదరణ దాదాపుగా ఉండేది కాదు.
ఎవరో ఒకరు పోషిస్తే తప్ప పండితులు తమ పని సక్రమంగా చేసుకోలేని స్థితి ఒక్క భారతదేశంలోనే కాదు, నాగరికమైన ప్రతిదేశంలోను ఉన్నట్టు కనిపిస్తుంది. రాజులో, రాజుల్లాంటి జమీందార్లో, దేవాలయాల వంటి సంస్థలో లేదా ఇతర వృత్తుల్లో డబ్బులు సంపాదించుకున్నవాళ్ళో పండితుల్ని కవుల్ని ఆదరించాలి. రాజుల అవసరం కవులకి పండితులకి, కవుల పండితుల అవసరం రాజులకి, చాలా కాలం పాటు భారతదేశంలో ఉన్నా ఈ రెండు వర్గాలలోను ఎవరి అవసరం ఎవరికెక్కువ ఉంది అన్న విషయం సూక్ష్మంగా చూస్తే కాని తెలియదు. మనకి తేలికగా తెలిసిన సమాచారమంతా కవులు తమ పుస్తకాలలో తమ కృతిని పుచ్చుకున్న పోషకుడి గురించి రాసిన వర్ణన పద్యాల్లోనే దొరుకుతుంది. తమ కృతికర్తను గురించి, ఆ కృతికర్త తమని ఫలానా కావ్యం కృతిగా ఇవ్వమన్న సందర్భాన్ని గురించి వివరంగా అందంగా కవులు చెప్పిన పద్యాలివి. కానీ ఇవన్నీ కవులు చెప్పుకున్న పద్యాలే అని మనం గుర్తుంచుకోవాలి. కృతికర్త కవితో అన్న మాటలు కూడా కవి రాస్తున్న భాషలోనే వుంటాయి. ఇందుకు మనకు తెలిసిన మొట్టమొదటి ఉదాహరణ నన్నయ. నన్నయ భాషలో రాజరాజనరేంద్రుడు మామూలు మాటల్లో పట్టనంత గొప్పవాడు.
రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే
జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా
రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్ – (ఆదిపర్వము, 1.3)
కానీ చరిత్రలో చూస్తే రాజరాజనరేంద్రుడు ఎన్నో యుద్ధాలు జయించినవాడిలా, ఎంతో గొప్ప సామ్రాజ్యాన్ని పాలించినవాడిలా కనిపించడు. రాజరాజనరేంద్రుడు చాలాసార్లు యుద్ధాల్లో ఓడిపోయి తన మామగారి ఆశ్రయాన్ని పొందిన బలహీనమైన రాజు. కానీ నన్నయ కవిత్వానికొచ్చిన గౌరవం వల్ల, ఆయన మాటల బలం వల్ల, ఆయన వర్ణించిన రాజే మనసుల్లో చెరగకుండా ఉన్నాడు.
ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే కవులు తమ కావ్యాలకు రాసిన అవతారిక పద్యాలలో మరి కొన్ని విశేషాలు దొరుకుతాయి. తరచుగా కనిపించేవి కవినే రాజు పిలిపించి, తనకు ఫలానా పుస్తకం కావాలని అడిగి తాంబూలమిచ్చిన సందర్భాలు. ఇది కాక కవి ఒక పుస్తకం రాయడం మొదలుపెడితే ఆ పుస్తకాన్ని తనకి అంకితం ఇమ్మని రాజు అడిగిన సందర్భాలు కొన్ని. కవి తన పుస్తకాన్ని మొదలుపెడితే కాబోయే కృతికర్తకి స్నేహితుడో, చుట్టమో అయిన ఆయన ఆ ఫలానా పుస్తకాన్ని తన వాళ్ళకి అంకితం ఇమ్మని అడిగిన సందర్భాలు మరికొన్ని. వీటి ఆధారంగా రాజుకి కవి అవసరం కొన్నిసార్లు, కవికి రాజు అవసరం ఎక్కువసార్లు ఉండేదని అనిపిస్తుంది. ఈ పద్యాలన్నింటిలోను అనివార్యంగా వుండే కృతిభర్త వర్ణనలు ఒక అలవాటుతో కూడిన పడికట్టు పదాలతో అందమైన అతిశయోక్తులతో నిండివుంటాయి. వీటిని యదార్థాలుగా గ్రహించడం ఆధునిక తెలుగు విమర్శకులు తప్ప ఎవరూ చెయ్యరు.
ఈ పరిస్థితులు మారి ఎలా వర్ణించినా ఎవరూ అంకితం పుచ్చుకోని రోజులు, కవులు పండితులు ఏదో ఒక ఆదరణ కోసం వెతుకులాడే రోజులు, దాదాపుగా పందొమ్మిదో శతాబ్దం ఆదికాలం నాటికల్లా వచ్చాయి. కొన్ని వందల సంవత్సరాల చరిత్రని క్లుప్తంగా ముగించి పందొమ్మిదో శతాబ్దపు చివరి రోజులకి వచ్చేసరికి తెలుగుదేశంలో తూర్పు ఇండియా కుంఫిణీ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళకు భాష రాదు, రాచ మర్యాదలు తెలియవు. కవుల పుస్తకాలు అంకితం పుచ్చుకోవడంతో వచ్చే కీర్తివల్ల రాచరికాన్ని నిలబెట్టుకునే అవసరం వాళ్ళకి లేదు. అయినా అప్పటి పరిస్థితులని గమనించి వాళ్ళు కూడా రాచరికపు మెప్పులు పొందడానికి ప్రయత్నం చేసిన దాఖలాలు లేకపోలేదు. వ్యాపారపు కుంఫిణీ అల్లా కుంఫిణీ బహద్దరవడం, కుంఫిణీవారు దేవాలయాల పూజలకి లాంఛనాలు పంపడం, కుంఫిణీ పేరుతో దేవాలయాల్లో పూజలు చేయడం ఈ అలవాటు వల్లే జరిగింది. కాని దీనిలో కుంఫిణీ అవసరాలకన్నా వాళ్ళని ఆశ్రయించుకున్న పండితుల అవసరాలు, పూజారుల అవసరాలే ఎక్కువ బలమయినవి. ఈ పరిస్థితుల వ్యత్యాసం వల్ల, ఆదరణ లేని పండితుల్లో వచ్చిన దైన్యం బలంగా కనపడడం మొదలైంది ఈ కాలంలోనే. చదువుకు రాణింపు లేకపోవడంతో చదువుకోవడం, పుస్తకాలు రాయడం తప్ప వేరొక పని చెయ్యలేక ఈ వర్గం క్రమక్రమంగా కుంగిపోయింది. వాళ్ళ ఆత్మ విశ్వాసం దెబ్బతినిపోయింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు చెప్పిన పై పద్యం ఈ పరిస్థితికి యదార్థ వర్ణన.
[20వ శతాబ్దపు మధ్యభాగంలో కూడా ఈ ఆత్మన్యూనతా భావం కొనసాగింది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కూల్డ్రేకి (Oswald Couldrey) నిజానికి ఏ సాహిత్యంలోను చెప్పుకోదగ్గ ప్రవేశం లేదు. రాజమండ్రి కాలేజి ప్రిన్సిపాలుగా వచ్చి అప్పటి తెలుగు కవుల్ని చేరదీయటం మొదలుపెట్టాడు. అతను మెచ్చుకోగానే తెలుగు కవులు ఉబ్బిపోయేవారు.
గురుడు కూల్డ్రే ఎండేమియాన్ అన్నాడే / నిన్నే నిన్నేనే — అని బాపిరాజు తన గురించి పాట రాసుకున్నాడు. అప్పుడే ఆంధ్రా అర్నాల్డులు, ఆంధ్రా కీట్సులు బయలుదేరారు. ఇది చూసే దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు, “అడవిబాపడి పేరు పడలే దదింకాను పడుతుంది దొరలలోఁ బడినయపుడు” అని ఆంధ్రకళలు అన్న చాటువులో వేళాకోళంగా రాశారు.
దామెర్ల రాముణ్ణి సీమలో మెచ్చారు యెంకిపాటలు నింగి కెక్కుచుండె
వంగవాసి ఛటర్జి నింగిలీషు కజిన్సు మెచ్చి గ్రంథాల్వ్రాసి యచ్చువేసె
కవుతరయ్యకుమాళ్ళు ఖండాంతరంబులఁ గొప్ప గొప్పోళ్ళంచుఁ గోలపుట్టె
అడవిబాపడిపేరు పడలే దదింకాను పడుతుంది దొరలలోఁ బడినయపుడుకళలు పుట్టెను తెలుగులగడ్డలోన
ననుచు “క్రిటికులు” ఘోషింతు రౌను గాని
మనకు మాత్రము గంపింపమానెనేమొ
రామనగరీనరేంద్ర! శ్రీరామచంద్ర! – (ఆంధ్రరత్న గోపాలకృష్ణుని చాటువులు, 1933, పు. 24)]
దీనితో పాటే అల్పమైన స్ఫర్ధలు, అర్థం లేని అహంభావాలు, నువ్వు శుంఠవంటే నువ్వు శుంఠవని తిట్టుకోవడాలు, పండితులలో బయట పడడం మొదలయ్యింది. సంస్కృతానికి పాండిత్య గౌరవం ఎక్కువగా వుందనే భ్రమతో సంస్కృత పండితులు విర్రవీగుతుండగా, తెలుగు పండితులు సంస్కృతమంత జటిలంగా తెలుగు రాయడం గొప్ప అనుకోవడం మొదలు పెట్టారు. ఈ తెలుగు సంస్కృతాల వైరుధ్యంలో తెలుగు ఇంకా క్షీణించి పోయింది. గీర్వాణం బలుస్తోంది అని సంస్కృతాన్ని వేళాకోళం చేయడానికి తెలుగు పండితులు వాడే మాటలో గీర్వాణం (సంస్కృతం) అనే మాటకి గర్వం అనే అర్థం రావడానికి ఇదే కారణం. పాండిత్యం అంటే సంస్కృత వ్యాకరణంలో పాండిత్యమే. తెలుగు వ్యాకరణం వచ్చిన వారు పండితులు అనే గౌరవానికి తగరు. తెలుగులో కవులున్నారు కానీ పండితులు లేరు. జమిందారులు చేరదీసిన పండితులందరూ సంస్కృత పండితులే. జమిందారులకు పుస్తకాలు అంకితమిచ్చిన తెలుగు కవులలో చాలామంది సంస్కృతంలో పండితులే.
అప్పట్లో చదువు ఎలా వుండేది? చిన్నపిల్లలు చదువుకోడానికి వీధిబడులు ఉండేవి. వీటిలో చదువుకోడానికి కూడా ఎక్కువగా రాతకోతల అవసరమున్న కులాలవాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు. తెలుగుదేశంలో చదువుకోనివాళ్ళే ఎక్కువమంది. అంటే అక్షరాలు రానివాళ్ళు. అయితే అక్షరాలు రానివాళ్ళందరూ అజ్ఞానులు కారు. మనిషి నేర్చుకోవలసిన జ్ఞానమంతా పుస్తకాల ద్వారా వచ్చే పద్ధతి ఆ కాలంలో లేదు. అంచేత అక్షరజ్ఞానం లేకపోయినా వాళ్ళకి తెలిసిన సంగతులు, వచ్చిన పాటలు, చెప్పగల కథలు; శాస్త్ర, భౌగోళిక విషయాలు, మనం ఊహించగల దానికన్నా ఎక్కువగా వివిధ వృత్తుల వారికి తెలిసుండేవి. కంసాలికి బంగారమూ వెండీ ఎలా కరగపోయాలి, ఎలా సాపు చేయాలి, ఎలా తిప్పి వాటిని నగలుగా చేయాలి అన్న విషయంలో శాస్త్రజ్ఞానం ఉండేది. అలాగే వ్యవసాయం చేసుకునే రైతుకి భూమిని గురించి, భూసారాన్ని గురించి, పంటల గురించి చక్కటి పరిజ్ఞానం వుండేది. ఈ రకమైన విద్య మౌఖికంగా నేర్చుకునేది, ఆపైన అనుభవంలో వృద్ధి పొందేది. జనాభాలో కొద్ది మందికి మాత్రమే రాయడం, చదవడంతో అవసరం వుండేది. చదువే జీవనాధారంగా వుండే కుటుంబాల వాళ్ళు వీధిబళ్ళలో, ఇసకలో వేళ్ళతో అక్షరాలు దిద్ది నేర్చుకుని ఒక క్రమంలో భాషలో సామర్ధ్యం సంపాదించేవారని పెద్ద వయసువాళ్ళు రాసుకున్న ఆత్మకథల (ఉదా: విస్సా అప్పారావు, అయ్యదేవర కాళేశ్వరరావు) ద్వారా తెలుస్తుంది.
[పంతొమ్మిదవ శతాబ్దపు తొలినాళ్ళలో చదువుల గురించి మంచి సమాచారం వెన్నెలకంటి సుబ్బారావు మద్రాసు స్కూలు కమిటీ వారికి ఇచ్చిన రిపోర్టులో చూడవచ్చు. Appendix to The First Report of the Madras School Book Society for the Year 1823 (1823: 43-C), Reprinted in: Row, 1873; చూ. ఈ రిపోర్టుకి తెలుగు అనువాదం, ఆరుద్ర (1990, పే. 91)]
మొదట్లో అక్షరాలు, తరువాత శబ్దాలు, ఆ తరువాత బాలరామాయణం, క్రమంగా ప్రబంధాలు – ఆ తరువాత సంస్కృత కావ్యాలు, ఆపైన వాళ్ళ అభిరుచినిబట్టి శాస్త్ర గ్రంథాలు ఒక క్రమంలో నేర్పేవాళ్ళు. ఆ తరువాత ఏ శాస్త్రమైనా సరే బాగా పాఠం చెప్పగలరని పేరున్న గురువుల్ని వెతుక్కుంటూ శిష్యులు వెళ్ళేవారు (చూ: చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, 1934, 1958). అలాంటి గురువులని వెతుక్కుంటూ వెళ్ళిన శిష్యులు వారాలు చేసుకుని, పొట్ట గడుపుకుంటూ గురువుగారి వద్ద శాస్త్రాలు నేర్చుకునేవారు. ఈ వ్యవస్థ కూడా క్రమక్రమంగా నీరసించిపోయే పరిస్థితి అప్పటికి దాపురించింది.
తెలుగు సాహిత్యంలో పందొమ్మిదవ శతాబ్దం అంధయుగం అనడం పరిపాటి. ఆ శతాబ్దపు సాహిత్యం మీద ప్రత్యేకమైన కృషి చేసినవారు యండమూరి సత్యనారాయణరావుగారు. ఆయన రాసిన ఉషఃకిరణాలు (1960) చెప్పుకోదగ్గ ప్రచారానికి రాలేదు కానీ ఆయన కృషిని మెచ్చుకోవడానికి ఆ పుస్తకం చదవడం అవసరం. ఆయన మాటల్లో: “19వ శతాబ్ది తెలుగు వాఙ్మయమును వర్ణించువారిలో హెచ్చుమంది ఇది యొక క్షీణయుగము లేక అంధయుగమనియే నుడివియున్నారు. అంతవరకు తెలుగుసాహిత్యములో తీరుతెన్నులు దిద్దుకున్న ప్రబంధ కావ్యములు, పురాణములు, శతకములు, యక్షగానములు మొదలైనవి ఈ కాలములో పరస్పర ప్రతిబింబములుగాను ఉపజ్ఞావిహీనములుగాను భావశూన్యములు గాను ఉన్నవని వీరి అభిప్రాయము.”
బ్రౌన్ తెలుగుదేశం లోకి ప్రవేశించేటప్పటికి పరిస్థితి ఇది.
బ్రౌన్ తెలుగు చదువు
ఇండియాలోనే 1798లో పుట్టిన బ్రౌన్ ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి ఈస్ట్ ఇండియా కంపెనీ కొలువులో చేరి 1817లో ఇండియాకు చేరుకున్నాడు. [బ్రౌన్ జీవితం గురించి చాలామంది వివరంగా రాశారు. చూ: బంగోరె (1978), వీరభద్రరావు (1988), ఆరుద్ర, (1990)]. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం ఆ రోజుల్లో ఇంగ్లీషు యువకులకి చాలా పెద్ద అవకాశం (ఆరుద్ర, 1990, పే. 37.) ఒకసారి ఆ కొలువులో చేరి ఇండియా వెళితే తిరిగి ధనవంతుడై స్వదేశానికి చేరుకోవచ్చు; బ్రిటిష్ అరిస్టోక్రసీలో, అంటే సంపన్న ‘కులా’లలో చేరిపోవచ్చు. బ్రిటనులో సంపన్న వర్గాలకి బడుగు వర్గాలకి మధ్య అంతరం కేవలం ఆర్ధికమైనదే కాదు. అది ఆభిజాత్యానికి, జీవనస్థాయికి, భాషకి, నడవడికి కూడా సంబంధించినది. ఆ ఉత్తమమైన కులంలో చేరడానికి చాలామంది ఉవ్విళ్ళూరేవారు. ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగంలో చేరి ఇండియా వెళ్ళడం ధనసంపాదనకి ఒక సుగమమైన మార్గం. కంపెనీ ఉద్యోగంలో చేరి ఇండియా వెళ్ళాలంటే ఇండియాలో వుండే పరిపాలక భాషలు నేర్చుకోవాలి. కంపెనీ పరిపాలనంతా అంతకుముందు మొగలాయి రాజ్యంలో మల్లేనే పర్షియన్‌లో జరిగేది. అంటే పర్షియన్ రాజభాష. ఈ భాష నేర్చుకుంటే కంపెనీలో ఉద్యోగం రావడం తేలిక. ఈ భాషతో పాటు మరాఠీ, తెలుగు మొదలైన స్థానిక భాషలు కూడా నేర్చుకోవాలి.
ఇంగ్లండులో ఆ రోజుల్లో ఇండియా వెళ్ళబోయేవారికి ముఖ్యమైన భారతీయ భాషలు నేర్పించడానికి రెండు కాలేజిలు ఉండేవి. ఒకటి హేలేబరి (Haileybury college), ఇంకొకటి ఆడిస్‌కాంబి (Addiscombe military seminary.)
[హేలేబరీ కాలేజి, విద్యార్ధుల ఎంపిక, అక్కడి చదువుల గురించి, అలాగే ఈ కాలేజీలో బ్రౌన్ సోదరుల ప్రవేశం గురించి తెలుగులో కొంత సమాచారం కొరకు చూ: ఆరుద్ర (1990), పి. ఎస్. గోపాలకృష్ణ (2012), Schmitthenner (2001). బ్రౌన్ చదివిన కాలంలో అక్కడ తెలుగు బోధన లేదు కానీ 1825-34 సంవత్సరాలలో Francis Johnson అనే వ్యక్తి అక్కడ తెలుగు నేర్పాడు. ఈ రెండు కాలేజీల గురించి ఇంగ్లీషులో చాలా పుస్తకాలు, పరిశోధనా వ్యాసాలు వచ్చాయి. [చూ: Danvers (1894), Fisher (2001), Lowell (1900), Milford (1909), Vibart (1894).]
బ్రౌన్ హేలేబరి కాలేజిలో చేరిన రోజుల్లో అక్కడ సంస్కృతం, పర్షియన్, హిందుస్తానీ, బెంగాలీ నేర్పించేవారు. అక్కడ ఈ భాషలు చెప్పడానికి రెండు రకాల ఉద్యోగులు ఉండేవారు. ఒకరు ఇండియానుండి రప్పించబడ్డ వాళ్ళు. వీళ్ళకి భాషల్లో బలమైన ప్రావీణ్యం ఉండేది. వాటిని స్పష్టంగా ఉచ్చరించగలగడం, పాఠం బాగా చెప్పగలగడం వాళ్ళ సుగుణాలు. కానీ ఎటొచ్చీ వాళ్ళు బట్టలు వేసుకునే తీరు, ఇంగ్లీషు మాట్లాడే పద్ధతి, ఇతర ఆచార వ్యవహారాలు ఆ కాలేజీలలో వుండే ఇంగ్లీషు ఉపాధ్యాయ వర్గానికీ, విద్యార్థులకీ ఎబ్బెట్టుగా కనిపించేవి. అదే కాలేజిలో వీళ్ళకన్నా పై స్థాయిలో ప్రొఫెసర్లుగా స్థిరమైన ఉద్యోగాలలో బ్రిటిష్ వాళ్ళు ఉండేవారు. వాళ్ళకి భారతీయ భాషలు సరిగా రావు, ఉచ్చారణ దాదాపుగా రాదు. అయినా వాళ్ళకి ఇండియా నుంచి వచ్చి పాఠం చెప్పేవాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించే హక్కుండేది. ఇండియా నుండి వచ్చి పాఠం చెప్పే కొంతమంది ఆ సమాజంలో ఇమిడి, గౌరవం సంపాదించుకోడం కోసం మతాన్ని, వేషాన్ని మార్చుకుని, బ్రిటిష్ స్త్రీలని పెళ్ళి చేసుకుని, పెద్దస్థాయిలో బతకడం కోసం తాము సంపాదించేదానికన్నా ఎక్కువ స్థాయిలో ఖర్చు పెట్టి అప్పులపాలయి రకరకాల ఇబ్బందులు పడేవారు. [చూ: ఆరుద్ర (1990, పే. 42), Fisher (2001)].
అటువంటి వాతావరణంలో బ్రౌన్ పర్షియన్ నేర్చుకోవడానికి హేలేబరి కాలేజికి వెళ్ళాడు. అక్కడ అతను ఎంత పర్షియన్ నేర్చుకున్నాడో మనకు తెలియదు కానీ (అప్పట్లో పరీక్షలు కూడా వుండేవి కావు) మూడేళ్ళ తరువాత మద్రాసులో అడుగు పెట్టాడు.
[ఇండియా నుంచి వచ్చి పాఠం చెప్పేవాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి మధ్య జీతభత్యాలలో కూడా బాగా వ్యత్యాసాలుండేవి (Fisher, 2001.) ఇదే పరిస్థితి కలకత్తాలోని ఫోర్ట్ విలియమ్స్ కాలేజి లోను, మద్రాసు ఫోర్ట్ సెయింట్ జార్జ్ కాలేజిలోను కూడా నడిచింది. కలకత్తాలో పని చేసిన భారతీయ మున్షీలకు సంవత్సరానికి 36 నుండి 240 పౌండ్ల వేతనం లభిస్తే హిందుస్తానీ, పర్షియన్, అరబిక్ చెప్పిన బ్రిటిష్ ప్రొఫెసర్లకి 1800 నుండి 3200 పౌండ్ల వరకు జీతం ఇచ్చేవారు. మద్రాసులో 1800 ప్రాంతంలో జీతాల సమాచారానికి చూ: Sudhir (1993, పే. 337): “The European Professors were paid Rs. 1000 a month, with many other perquisites, while additional ‘native’ teachers (two for each language) were to be recruited on a salary of about Rs 200 per month.”
భారతీయుల్లో కూడా సంస్కృతం, అరబిక్, పర్షియన్ చెప్పే వారికి, ప్రాంతీయ భాషలు చెప్పే వారికి మధ్య కూడా జీతాల విషయంలో గణనీయమైన హెచ్చుతగ్గులుండేవి. ఉదాహరణకి 1832లో మద్రాసు ప్రభుత్వ ప్రాంతాల్లో ఒక ఇంగ్లీషు హెడ్మాష్టరుకి నెలకు 300 రూపాయలు, సంస్కృత పండితునికి రూ 70, అరబ్బీ/పారశీక మున్షీకి రూ 70 జీతం వస్తే తెలుగు, తమిళం, కన్నడం చెప్పేవారికి కేవలం రూ 20 ఇచ్చేవారు. చూ. ఆరుద్ర, (1990, పే. 100)]
యువకుడైన ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్, 1817లో తెలుగు, మరాఠీ నేర్చుకోవడం కోసం మద్రాసు ఫోర్ట్ సెయింట్ జార్జ్ కాలేజిలో (Fort St. George) చేరాడు. అప్పటికి మద్రాసులో కాలు నిలదొక్కుకున్న కుంఫిణీ ప్రభుత్వానికి తెలుగు చాలా అవసరమైన భాష. నాయకరాజుల కాలం నుంచీ బ్రౌన్ మద్రాసులో చేరిన కాలం వరకూ, ఆ మాటకొస్తే ఆ తరవాత కూడా దక్షిణాదిన ప్రధానమైన భాష తెలుగు. రాజకీయ రంగం లోనే కాకుండా సాంస్కృతిక రంగంలో, కవిత్వం నుంచి చిత్రలేఖనం దాకా దక్షిణ భారతమంతా తెలుగు వ్యాపించింది. అది తెలుగు ప్రాంతానికే పరిమితయిన భాష కాదు. జెంటూ (Gentoo) పేరుతో ఈ భాషని లౌకిక వ్యవహారాలతో పనివున్న కుంఫిణీ తెల్లవాళ్ళు ప్రముఖంగా నేర్చుకోవలసి వచ్చేది అందుకే. ఆ రోజుల్లో కుంఫిణీ ఉద్యోగులు — ఎలిస్ (F. W. Ellis) మొదలైన వాళ్ళు — తెలుగు నేర్చుకోవడానికి శంకరయ్య (బొమ్మకంటి శంకరశాస్త్రి), ఉదయగిరి నారాయణయ్య, రామరాజు, వేదం పట్టాభిరామశాస్త్రి వారి లాంటి చేతికింది ఉద్యోగులు సహాయపడేవాళ్ళు (శంకరయ్య, పట్టాభిరామశాస్త్రి తరువాత కొంత పెద్ద ఉద్యోగాలను పొందగలిగారు.) తమకి స్వయంగా భాష రానప్పటికీ, ఆ భాషలను గురించి కొన్ని ప్రశ్నలు మాత్రం అడిగి, ఆ ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు ఆధారంగా ఆ భాషలను భాషాకుటుంబాలుగా విడదీయడం, పాశ్చాత్య దేశాలనుంచి వచ్చినవాళ్ళు అమలులోకి తెచ్చిన కొత్త రకమైన విద్య. ఇందువల్ల తెలిసేదేమిటంటే ఫోర్ట్ సెయింట్ జార్జి కాలేజిలో తెలుగు చెప్పే చిన్న ఉద్యోగులు తెలుగు నేర్చుకునే తెల్లవాళ్ళకు కావలసిన మాటలు, కొన్నిరకాల వాక్యాలు అలవాటు చేసేంత వరకే ఉపయోగపడేవారు. అప్పట్లో తెల్లవాళ్ళు తెలుగు నేర్చుకోవడమంటే ఇదే.
ఇటువంటి పరిస్థితులలో బ్రౌన్ తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టాడు.
[లింగ్విస్టిక్స్ అన్న పేరుతో ఇప్పుడు బాగా పరిచయమయిన భాషాశాస్త్రంలో సమర్ధులు ఈ పనులు భారతదేశంలో చాలా చేశారు. ఈ భాషాశాస్త్రజ్ఞులకి అనేక భాషలు రానక్కరలేదు. లింగ్విస్ట్‌కీ పాలీగ్లాట్‌కీ తేడా చూపిస్తూ లింగ్విస్ట్‌కి చాలా భాషలు రానక్కరలేదని, ఆ భాషలలో మాట్లాడేవాళ్ళ దగ్గర్నించి సమాచారం సేకరించి వాటి స్వరూప స్వభావాల గురించి సిద్ధాంతాలు చేసేవాడే భాషా శాస్త్రజ్ఞుడని ఒక విలక్షణమైన అభిప్రాయం తరవాత రోజుల్లో ప్రముఖంగా యేర్పడింది. దక్షిణదేశ భాషల్లో ఒకదానికొకటి పోలికలున్నాయని, ఆ పోలికలు సంస్కృతజన్యమైన భాషల్లో లేవని, అంచేత దక్షిణదేశభాషలు ‘ద్రవిడియన్’ కుటుంబానికి చెందినవని ఒక సిద్ధాంతాన్ని మొదటిగా ప్రతిపాదించినవాడు ఎలిస్. ఇది తరవాత చిలవలుపలవలుగా ప్రవర్ధమానమై ప్రపంచభాషల్ని కుటుంబాలుగా విడదీసే ఒక పెద్ద వైజ్ఞానిక రంగంలో భాగంగా ఏర్పడింది (చూ: Trautmann, 2006)]
అప్పటికి (ఇప్పటికి కూడా) తెలుగు మాతృభాష కానివాళ్ళకి తెలుగు నేర్పించవలసిన అవసరం తెలుగు పండితులకి కలగలేదు. నాకు తెలుగు నేర్పండి అని వచ్చే తెల్లవాడికి తెలుగు పండితులు చేసే పనల్లా సంధులు, తత్సమాలు, తద్భవాలు, విభక్తులు, సమాసాలు, పద్యాలు నేర్పడం. నన్నయభట్టు రాసిన ఆంధ్రశబ్దచింతామణి కంఠతా పట్టించడం. ఇందువల్ల వ్యవహారంలో ఉండే తెలుగు రాదని గమనించిన తెల్లవాళ్ళే తమకోసం తెలుగు వ్యాకరణాలు రాసుకోవడం మొదలు పెట్టారు. ఇవి భాషాస్వరూపాన్ని చెప్పే సిద్ధాంత వ్యాకరణాలు (Theoretical Grammars) కావు, భాష నేర్చుకోవడానికి ఉపయోగపడే బోధక వ్యాకరణాలు (Pedagogical Grammars.) ఈ వ్యాకరణాలలో ఏకవాక్యత ఉండక్కరలేదు, సూత్ర పద్ధతి ఉండక్కరలేదు. భారతదేశంలో అప్పటికి చాలాముందే బలంగా తయారయి వున్న భాషాస్వరూపజ్ఞానం అక్కరలేదు. ఇవి తెలుగులో వ్యవహరించడానికి పనికొచ్చే వ్యాకరణాలు. ఇలాంటి వ్యాకరణాల్లో మొదటిది విలియమ్ కేరీ (William Carey) రాసిన A Grammar of the Telinga Language, Serampore, 1814.
బ్రౌన్ తెలుగు నేర్చుకోవడం మొదలు పెట్టేసరికి తెలుగు సొంతభాష కానివాళ్ళకి పనికి వచ్చే తెలుగు పుస్తకాలు ఏవీ లేవని, అది చెప్పేవాళ్ళు కూడా ఆ భాష చెప్పే విధానంలో ఆలోచన చేసిన వాళ్ళు కానీ, ఆ పనిలో అనుభవం వున్నవాళ్ళు కానీ కాదని అతనికి బోధపడిపోయింది. ఇదే సమయంలో ఈ భాషలు తమ ఉద్యోగులకి నేర్పవలసిన అవసరాన్ని గుర్తించిన కుంఫిణీవాళ్ళు ఇలాంటి భాషా బోధక వ్యాకరణాలని, ద్విభాషా నిఘంటువులని బోలెడు డబ్బిచ్చి కొనుక్కుని, వాటిని ప్రచురించేవారు. కేరీ రాసిన వ్యాకరణాన్ని అనుసరించి ఆ తరువాత కేంప్‌బెల్ (Campbell), విలియమ్ బ్రౌన్ (William Brown) రాసిన వ్యాకరణాలు ఇలానే వచ్చాయి. బ్రౌన్ మద్రాసులో అడుగు పెట్టటానికి ముందు వచ్చిన వ్యాకరణాలు, నిఘంటువులు, పాఠ్య పుస్తకాల వివరాల కోసం, ఆరుద్ర (1990, పే. 46-47), బంగోరె (1977), Trautmann (2006) చూడండి.
బ్రౌన్ ఈ పనిలో ప్రవేశించడానికి కంపెనీ వాళ్ళు ఇవ్వజూపే డబ్బు ఒక కారణం. దానితో పాటు కేరీ, విలియమ్ బ్రౌన్, కేంప్‌బెల్ రాసిన వ్యాకరణాల కన్నా, నిఘంటువుల కన్నా మంచివి తను రాయగలననే నమ్మకం మరొక కారణం. అప్పట్లో తెలుగు నేర్చుకున్న తెల్లవాళ్ళలో ఒకరితో ఒకరికి స్పర్ధలుండేవి. తను రాసిన వ్యాకరణం, పాఠాల పుస్తకం కుంఫిణీ వాళ్ళు కొనుక్కుంటామని మొదట్లో పెద్ద డబ్బు ఆశ చూపినా, తనకన్నా తక్కువ తెలుగు వచ్చిన వాళ్ళు, తనకన్నా ఎక్కువ అధికారంలో వున్నవాళ్ళు అతనికి చివరికి డబ్బేమీ చేతికివ్వలేదని బ్రౌనే స్వయంగా తన ఆత్మకథలో రాసుకున్నాడు.
బ్రౌన్ ఆశయాలు
ఈ కాలంనాటి బ్రౌన్ జీవితాన్ని రెండు భాగాలుగా చూడవచ్చు. మొదటి దశ: భారతదేశంలో కుంఫిణీ ఉద్యోగులకి తెలుగు నేర్పాలనే ఉద్దేశ్యంతో అందుకు పనికొచ్చే పుస్తకాలు — వ్యాకరణం, నిఘంటువులు, సంభాషణలు – రాయాలని అనుకున్న దశ. రెండవ దశ: తానే స్వయంగా తెలుగు పండితుడై (scholar) సాటి పాశ్చాత్యుల మధ్య తెలుగు ప్రొఫెసరుగా చలామణీ కావాలనే కోరిక బలపడిన దశ. ఈ రెండు దశల్లో మొదటిది ఎప్పుడు అంతమయింది, రెండవది ఎప్పుడు మొదలయింది అని నిక్కచ్చిగా చెప్పడానికి బ్రౌన్ జీవితాన్ని గురించి రాయబడిన అన్ని పుస్తకాలు చదివిన తరువాత కూడా మాకు సరయిన సమాచారం దొరకలేదు. అయినా అతని జీవితాన్ని గురించి దొరికిన వివరాల ఆధారంగా స్థూలంగా కొన్ని నిర్ణయాలు చేయవచ్చు. 1834లో ఉద్యోగం కోల్పోయి ఇంగ్లాండులో మూడేళ్ళు గడిపిన కాలంలో అక్కడి భారతీయ భాషల స్కాలర్స్‌తో జరిపిన సంభాషణలు అతనిలో తను కూడా స్కాలర్ అవ్వాలనే కోరిక బలపరచి వుండాలి. బ్రౌన్ గురించి రాయబడిన పుస్తకాలని కించపరిచే దృష్టి మాకు లేకపోయినా, ఆ రచయితలందరూ బ్రౌన్‌ని పొగడాలనే ఉత్సాహమే ఎక్కువ చూపించారు కాని స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించలేదని మాత్రం చెప్పక తప్పదు.
1837 నాటికి కుంఫిణీ ఉద్యోగులకి తెలుగు నేర్చుకోవలసిన అవసరం లేకుండా పోయింది. పరిపాలనంతా ఇంగ్లీషులోనే జరగాలని, భారతీయుల భాష తెల్లవాళ్ళు నేర్చుకోనక్కరలేదు సరికదా భారతీయులకే తెల్లవాళ్ళు ఇంగ్లీషు నేర్పాలని, మెకాలే (Thomas B. Macaulay) చేసిన చరిత్రాత్మకమైన ప్రతిపాదనని (Macaulay minute) కుంఫిణీ ఆమోదించడంతో బ్రౌన్‌కి తెల్లవాళ్ళకోసం తెలుగు వ్యాకరణాలు, నిఘంటువులు రాసే అవసరం తీరిపోయింది. బహుశా ఆ నాటికే బ్రౌన్‌లో ఇంకొక వ్యక్తి బలపడడం మొదలుపెట్టాడు. అప్పటికే లండనులో భారతీయ భాషల పట్ల, భారతీయ శాస్త్రాల పట్ల, ముఖ్యంగా సంస్కృతం పట్ల ఆసక్తి పెరుగుతోంది. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం బలపడడం వల్ల కలిగిన ఆనుషంగిక ఫలితం యిది. పాశ్చాత్య దేశాల్లో Comparative Linguistics, Comparative Mythology మొదలయిన కొత్త చదువులకి భారతీయ భాషలు, ముఖ్యంగా సంస్కృతం అవసరం కావడం మొదలయ్యింది. భారతదేశంలో సంస్కృతం ప్రాచీన నాగరికత దృష్ట్యా ప్రధానమైన భాష కాబట్టి ఆ భాష ద్వారా భారతీయుల్ని క్రైస్తవ మతంలోకి మార్చవచ్చనే ఒక దూరపు ఆలోచన కూడా ఏర్పడింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృతానికి బోడెన్ ఛైర్ (Boden Chair) అనే పేరుతో ప్రతిష్టాత్మకమైన ఒక ఆచార్య పదవి ఏర్పడడానికి ఈ ఆలోచన ఒక ప్రధాన కారణం.
[బోడెన్ వీలునామా ప్రకారం: “a more general and critical knowledge of [Sanscrit] will be a means of enabling my Countrymen to proceed in the Conversion of the Natives of India to the Christian Religion, by disseminating a knowledge of the Sacred Scriptures amongst them more effectually than all other means whatsoever.” బోడెన్ ఛైర్ గురించిన మరికొన్ని వివరాల కోసం చూ: Minkowski (2006)]
కానీ బ్రౌన్‌కి వచ్చిన తెలుగు, లండనులో కానీ కలకత్తా ఫోర్ట్ విలియమ్ కాలేజిలో కానీ సంస్కృతం నేర్చుకుంటున్న వారికి ముఖ్యమైనదిగా కనిపించలేదు. అక్కడివాళ్ళు ఇండియాలో ఉద్యోగం చేసేవాళ్ళకి తెలుగు నేర్పే చిన్న వ్యక్తిగానే బ్రౌన్‌ని చూశారు కానీ భారతీయ భాషల్లో ఒక స్కాలర్‌గా గుర్తించలేదు. అప్పుడే ఆ గుర్తింపు సంపాదించాలనే తపన బ్రౌన్‌లో మొదలయ్యింది. అది 1837 నుండి 1855 వరకు బ్రౌన్ గడిపిన జీవితంలో ప్రధానమైన ఆశయం. ఆ కాలంలో, తెలుగు భాష మీద సాధ్యమైనంత పట్టు సంపాదించి లండనులో సంస్కృత భాషలో స్కాలర్స్‌గా ఉన్నవారితో సమానమైన స్కాలర్‌గా గుర్తింపబడాలని అతని కోరిక. అది ఇండియానుండి రిటైర్ అయి తిరిగి వెళ్ళిన పదేళ్ళకి 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ ఉద్యోగాన్ని పొందడంతో దాదాపుగా నెరవేరింది.
[బ్రౌన్‌కి ముందే 1855-59 మధ్య కాలంలో జె. డౌసన్ (J. Dowson) తెలుగు పాఠాలు చెప్పినట్లుగా తెలుస్తుంది. లండన్ యూనివర్సిటీలో భారతీయ భాషల బోధన గురించిన పూర్తి వివరాల కోసం చూ: H. H. Bellot (1929)]
లండన్ యూనివర్సిటీలో మొదటి ప్రొఫెసర్‌షిప్‌లు సంస్కృతం, లాటిన్ వంటి క్లాసికల్ లాంగ్వేజస్ కోసం, లేదా పరిపాలనకు ముఖ్యమయిన పర్షియన్/హిందుస్తానీ భాషల కోసం ఏర్పడినవి. ఈ స్థాయి ప్రొఫెసర్లకి ఎక్కువ గుర్తింపు ఉండేది. రెండవ స్థాయి, ముఖ్యమైన భారతీయ భాషల్లో బ్రిటిష్ పరిపాలనకి అవసరమైన ఉద్యోగుల్ని ఆయా భాషల్లో పరీక్షించే ప్రొఫెసర్లది. ఇటువంటి ప్రొఫెసర్లు మొదట్లో తమిళానికి (ఫాన్ స్ట్రాంగ్ {von Strong} 1855), గుజరాతీకి (దాదాభాయి నౌరోజి 1856), బెంగాలీకి (జ్ఞానేంద్ర టాగోర్ 1860), ఆ తరువాత తెలుగుకి (సి. పి. బ్రౌన్, 1866) ఏర్పడ్డారు. ఇందులో మొదటి స్థాయి ప్రొఫెసర్‌షిప్పులు తెల్లవాళ్ళకే ఇవ్వబడేవి. హేలేబరి, ఆడిస్‌కాంబీ కాలేజిలలో ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వాళ్ళకి ఆయా భాషల్లో ఎంత సామర్థ్యం ఉన్నది అన్న దానితో నిమిత్తం లేకుండా వాళ్ళు తెల్లవాళ్ళు కాబట్టే ఈ ఉద్యోగాలు వాళ్ళకి వచ్చేవి.
బ్రౌన్ ప్రవృత్తిలో ఇంకొక ప్రధాన లక్షణం మతానికి సంబంధించినది. ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ మతంలోనే జీవిత పరమార్థం వుందని, ప్రొటెస్టెంట్ క్రిస్టియన్లు కాని వాళ్ళు నాగరికులు కారని అతని గాఢమైన విశ్వాసం. మిషనరీ కుటుంబంలో పుట్టి ఆ విశ్వాసాలలో పెరిగినవాడుగా అతనికి ఈ రకమైన నమ్మకాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఆ కారణం చేత అతనికి హిందూ మతమన్నా, హిందూ మతానికి ప్రతినిధులుగా కనిపించే బ్రాహ్మణులన్నా విపరీతమైన వైమనస్యం ఉండేది. తను తెలుగుదేశంలో వున్న కాలంలో తన అవసరం కోసం తన చేతి కింద పనిచేసే ఉద్యోగులైన హిందువులతో తప్ప ఏ ఇతర హిందువులతోటీ అతనికి ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు ఉండేవి కావు. వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళడం కానీ వాళ్ళని తన ఇంటికి పిలవడం కానీ వాళ్ళతో ఏ రకమైన చనువుని పెంపొందించుకోవడం కానీ అతను ఎప్పుడూ చేయలేదు. బ్రౌన్ హిందూ దేవాలయాలలోకి ఎప్పుడూ అడుగు పెట్టలేదు. ఈ మాటనే సగర్వంగా అతను తన ఆత్మకథలో చెప్పుకున్నాడు. కేవలం హిందూ మతం పట్లే కాదు, క్రిస్టియన్లలో కేథలిక్కుల మీద కూడా అతనికి అదే రకమైన వైమనస్యం ఉండేది [చూ: బంగోరె లేఖలు (1977, 78), ఆరుద్ర (1990, పే. 216)]. దీన్ని ద్వేషం అని చెప్పడం కొంచెం బరువైన మాటవుతుందేమో కానీ అతని భావాలు దానికి అందుకు దాదాపుగా సమానమైనవి.
[“For the last thirty years I never mixed with Hindu society, feasts or celebrations, and except those who worked with me I had few Hindu acquaintances. Indeed I rarely was visited by natives; and I was considered a deliberate enemy of the Hindu idolatry. [This was changed in the revised ed. as “… a deliberate enemy to the popular creed.”] My publishing Vemana’s diatribes against Brahmans, and my cherishing Jangam literature, which they shun, proved my antipathy to the Hindu idolatry.” – (Brown Autobiography, p. 58-59)]
తాను తెలుగు దేశానికి అధికారిగా, దొరగా వచ్చాడు. తనతో పనిచేసిన తెలుగు వాళ్ళందరూ తన చేత జీతం పుచ్చుకుంటూ తన దగ్గర భృత్యులుగా, సేవకులుగా ఉంటున్నవాళ్ళు. వీళ్ళల్లో చాలామంది తెలుగు సాహిత్యంతో మంచి పరిచయం ఉన్నవాళ్ళు. నలుగురైదుగురు చాలా పెద్ద పండితులు కూడా. కానీ వాళ్ళని అతను సేవకులుగానే చూశాడు. వాళ్ళందరూ బ్రౌన్‌ని ఒక మహారాజులాగే చూశారు. బ్రౌన్ గొప్ప పరిపాలనా దక్షుడు. అధికార దర్పం వెలిగిస్తూ తన చేతికింది వాళ్ళని ఎవరిని ఎక్కడ పెట్టాలో చూసుకుని, వాళ్ళకు వీలున్నంత చవకగా జీతం ఇస్తూ వీలయినంత ఎక్కువ పనిని రాబట్టుకోవటం బ్రౌన్‌కి బాగా తెలుసు.
[“I discovered some excellent scholars, [+ poets, grammarians and critics +] living in poverty, mere mendicants: and they were glad to be thus employed on wages as moderate as those we give to menial servants.” – Brown Autobiography, బంగోరె (1978, పే. 37)
“స్వదేశీయులు లేఖకులకు బట్టలను పెట్టి సత్కరింతురనియు, వారి ఇండ్ల యందు భోజనాది వసతులను కూడ కల్పింతురనియు, అందువలన తానిచ్చు కూలికన్న అది ఒక విధముగ రెండింతలధికమేనని పేర్కొనెను. గంటములతో తాళపత్రములపై వ్రాయుటకన్న కాగితములపై కలముతో వ్రాయుట యెంతయో సులభము కాన తానిచ్చు కూలి గిట్టుబాటగునని సమర్ధించుకొనెను.” C.P. Brown, Plans for the revival and promotion of Telugu literature, p. 48, as cited in: పద్మావతి (1986, పే. 40). బ్రౌన్ తన దగ్గర పనిచేసిన వారికిచ్చిన జీతాల వివరాలకోసం:పద్మావతి (1986, పే. 39-40).]
బ్రౌన్ తెలుగు సంస్కరణలు
బ్రౌన్ స్వయంగా చాలా బుద్ధికుశలత కలవాడు. కష్టపడి క్రమశిక్షణతో పని చేసేవాడు కూడా. బ్రౌన్ తెలుగుదేశానికి రాకముందే లాటిన్, గ్రీక్ నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో ఇంగ్లండులోని విశ్వవిద్యాలయాలలో ఇంగ్లీషు నేర్చుకోవడం గొప్ప విద్యగా పరిగణింపబడేది కాదు. ఇంగ్లీషు బజారు భాష, అది విశ్వవిద్యాలయాలలో చెప్పడమేమిటి అన్న చిన్నచూపు ఉండేది (Viswanathan, 1989; Harrison, 1996.) అంచేత అప్పట్లో ఇంగ్లండులో చదువుకున్న వాళ్ళంతా లాటిన్ భాషనే చదువుకున్నారు. లాటిన్, గ్రీకు భాషల ప్రభావం వల్ల పశ్చిమ దేశాల విద్యావంతులకి గ్రంథ పరిష్కరణ, గ్రంథ ముద్రణ మొదలైనవాటి గురించి కొన్ని విశిష్టమైన అభిప్రాయాలేర్పడ్డాయి. పశ్చిమ దేశాలలో మాత్రమే పరిష్కృత గ్రంథం (revised text) పట్ల అపారమైన గౌరవం ఉండేది. ప్రతి పుస్తకానికి మొట్టమొదట కవి/రచయిత చేత రాయబడిన మూల గ్రంథమొకటి (Ur-text) ఉంటుందని, అది కాలక్రమేణా లేఖక ప్రమాదాల వల్ల, ప్రక్షిప్తాల వల్ల భ్రష్టు పట్టి పోతుందని, ఆ గ్రంథానికున్న అనేక రాతప్రతులను సంపాదించి వాటిని జాగ్రత్తగా పరిశీలించి కొన్ని పద్ధతుల ద్వారా అమూలకమైన పొరపాట్లను, ప్రక్షిప్తాలను తొలగించి మూల గ్రంథాలను పునర్నిర్మించాలని లాటిన్, గ్రీక్ విద్యావంతులు భావించేవారు. ఈ విద్య చాలా నిక్కచ్చిగా నిశితమైన నియమాలతో నేర్చుకున్నవాళ్ళు గ్రంథపరిష్కర్తలు. ఆ విధానాలు జర్మనీలో, ఇంగ్లండులో బలంగా ఏర్పడ్డాయి. వాటిమీద విశ్వాసము, ప్రతి పాత గ్రంథమూ అలా పరిష్కరించబడాలనే పట్టుదల గలవాడు బ్రౌన్.
తెలుగుదేశంలో గ్రంథ సంప్రదాయం పశ్చిమ దేశాల గ్రంథ సంప్రదాయం వంటిది కాదు. ఇక్కడ దొరికిన తాళపత్ర గ్రంథాల ప్రతులన్నీ పోగుచేసి అందులో స్ఖాలిత్యాలు తొలగించి శుద్ధమైన ప్రతిని (critical edition) తయారు చేయడం ఈ గ్రంథాలకి అనువైన పరిష్కరణ మార్గం కాదు. అలా చేస్తే గ్రంథ స్వరూపం దెబ్బతినే ప్రమాదం వుంది. తెలుగులో అనేక సాహిత్య గ్రంథాలు రకరకాల అసంపూర్తులతో అనేకమంది వ్యక్తుల చేతిలో వుండటం బ్రౌన్ గమనించాడు. గ్రంథాలలో కొన్ని భాగాలు మాత్రమే తాళపత్రాల మీద రాసుకుని ఇళ్ళలో వ్యక్తులు భద్రంగా దాచుకునేవారు. అలా రాసుకున్న గ్రంథాలని ఆ రాసుకున్న వాళ్ళు ఎలా వాడతారో తెలుసుకునే అవకాశం బ్రౌన్‌కి లేదు, అసలు తెలుగులో పుస్తక స్వరూపం ఎలా ఉంటుందో కూడా అతనికి తెలియదు. తెలుగు పుస్తక సంప్రదాయాలు, పుస్తక పఠన విధానాలు, పుస్తక ప్రవచన రీతులు పశ్చిమ దేశాలకన్నా భిన్నంగా ఉంటాయని బ్రౌన్ గమనించలేదు. కానీ తాను నాగరిక దేశం నుంచి వచ్చానని ఇక్కడి వాళ్ళంతా అనాగరికులని బ్రౌన్‌కి గాఢమైన విశ్వాసముంది. ఇది ఒక రకంగా ఆనాటి తెల్లవాళ్ళు అందరికీ ఉన్న విశ్వాసం.
ఆ రోజుల్లో (సుమారు 1830 వరకు) భారతదేశాన్ని పరిపాలించడానికి వచ్చిన తెల్లవాళ్ళలో స్థూలంగా రెండు వర్గాలుండేవి. ఒకరు ఆంగ్లేయ పద్ధతుల్లోనే, ఆంగ్లేయ సంప్రదాయాల ప్రకారమే, క్రిస్టియన్ విధానంలో భారతీయుల్ని పరిపాలించాలని, భారతీయుల్ని ఉద్ధరించాలని విశ్వసించేవాళ్ళు. వీళ్ళకి ఆంగ్లిసిస్టులని పేరు. ఇంకొక వర్గం వాళ్ళు భారత దేశం ఒకప్పుడు నాగరిక దేశమనీ, వీళ్ళ పూర్వ గ్రంథాలు చాలా గొప్పవనీ, వాటి ప్రకారం భారత దేశాన్ని పరిపాలించాలనీ, ఇప్పుడు చితికిపోయి ఉన్నా ఒకప్పుడు భారత నాగరికత గొప్పదనీ అనుకునేవాళ్ళు. వీళ్ళని ఓరియంటలిస్టులంటారు (లిబరల్స్ అని కూడా అంటారు.) బ్రౌన్ స్వయంగా ఈ రెండు వర్గాల్లో ఏ ఒకదానికి చెందినవాడు కాదు. అతనికి మత విషయంలో ఆంగ్లిసిస్టులకి ఉన్న పట్టుదలలు, సాహిత్య విషయంలో ఓరియంటలిస్టులకున్న భావాలు రెండూ కలిసి ఉండేవి.
బ్రౌన్‌కి తన తోటి పాశ్చాత్య విద్యావంతులకి వచ్చినంత సంస్కృతం రాదు. అంటే, సర్ విలియమ్ జోన్స్ (William Jones), కోల్‌బ్రూక్ (H. T. Colebrooke) వంటి వారితోటి తను పోటీ పడలేడు. సంస్కృత విద్యావంతులతో సమానం కాలేకపోవడం వల్ల బ్రౌన్ తెలుగు సాహిత్యం మీదనే దృష్టి పెట్టాడు. దానిలోనే అతను పాశ్చాత్య ప్రమాణాలలో సమర్ధుడు అని అనిపించుకోవాలని అతని పట్టుదల. అందుచేత తెలుగు సాహిత్య గ్రంథాలని అతను పాశ్చాత్య మార్గాలలోనే పరిష్కరించడానికి పూనుకున్నాడు. తన ఎదురు గుండా ఉన్న పుస్తకాలని చూసి అస్తవ్యస్తంగా, ముక్కలుముక్కలుగా వున్న రాత ప్రతులను చూసి అవి కూడా ఒక పట్టాన సంపాదించలేకపోగా, తనకున్న విపరీతమైన ఆత్మవిశ్వాసంతో ఈ సాహిత్యం క్షీణదశలో ఉన్నదని నమ్మాడు. ఈ క్షీణదశలో వున్న సాహిత్యాన్ని ఉద్ధరించడానికి ఉద్యమమొకటి మొదలు పెట్టాడు. ఈ పనిలో బ్రౌన్‌కి ఒక విషయం తోడ్పడింది. బాగా చదువుకున్న పండితులు కేవలం కూలి వాడికిచ్చేపాటి డబ్బులతోటే పని చేయడానికి గుమ్మం దగ్గర కాచుకుని, ఆ చిన్న పాటి పనయినా ఇమ్మని దీనంగా బ్రతిమిలాడుతున్నారు.
[ఎందరో పండితులు దయనీయంగా ప్రాధేయపడుతూ వారి కృపాదృష్టినర్ధిస్తూ ‘బ్రౌన్ దొర’ గారికి కొన్ని వందల ఉత్తరాలు రాశారు. ఇవన్నీ బంగోరె శ్రద్ధగా చదివి అందులో తనకు ముఖ్యమైనవని తోచినవాటిని సంకలనాలుగా చేసి ప్రచురించారు. ఆరుద్ర కూడా ఇలాంటి ఉత్తరాలని తమ సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఉదాహరించారు. తరవాత బ్రౌన్‌ని గురించి రాసిన ఆర్. పద్మావతి, జానుమద్ది హనుమచ్ఛాస్త్రి తమ రచనల్లో ఈ ఉత్తరాలని వాడుకున్నారు. కానీ ఈ ఉత్తరాలు రాసిన వారి దైన్యం — వాళ్ళ పేదరికం, వాళ్ళ దిక్కుమాలినతనం, ఎవరూ గుర్తించలేదు. తిండిలేక బాధ పడుతున్న వాడికెవరికైనా రూపాయి ఇచ్చిన వాడు మహారాజులానే కనిపిస్తాడు. దయనీయమయిన ఆనాటి సామాజిక పరిస్థితి కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది ఈ ఉత్తరాల్లో.
అంతగా పండితులు కానివాళ్ళు మామూలు వచనంలో ఉత్తరాలు రాస్తే పండితులైనవాళ్ళు, పద్యాలు రాయగలవాళ్ళు పెద్ద పెద్ద సమాసాలతో పూర్వపు చక్రవర్తుల్ని, రాజుల్ని వారి ఆస్థాన కవులు ప్రశంసించే ధోరణిలో అవే మాటలు వాడుతూ బ్రౌన్‌ని ఇంద్రుడవని, చంద్రుడవని, భోజుడవని, మహా పండితుడవని, సకలశాస్త్రనిష్ణాతుడవని అంతులేని ప్రశంసలతో ఉత్తరాలు రాశారు. మరికొందరు ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి బ్రౌన్ మన్మధుడివలె అందమైన వాడని కూడా ప్రశంసించారు. కావ్యాలు అంకితమివ్వడంలో ఇది నియతమైన సంప్రదాయం. కృతిభర్త ఏ వయసు వాడైనా ఏ రూపం వాడైనా ఆయన్ని మన్మధుడనే చెప్పాలి. నన్నయ రాజరాజుని చళుక్య మన్మధుడు అని అన్నాడు. ఆ తరువాతి కావ్యాలలో ఆశ్వాసాది, ఆశ్వాసాంత పద్యాలు పరిశీలిస్తే ఈ రకమైన ఉదాహరణలు కొల్లలుగా దొరుకుతాయి. ఆ సంప్రదాయాన్ని అనుసరించి బుచ్చయ్యశాస్త్రి లాంటి వాళ్ళు బ్రౌన్‌ని కూడా ఆ రకమైన మాటల్లోనే పొగిడారు. ఉదా:
నూట యాభైమంది నెరి బిచ్చగాండ్లుండ
నందులో నొకనిగా నెంచరాదొ
నూటిలో సగము నుద్యోగస్థులుండఁగా
నందులో నొకనిగా నెంచరాదొ
పాటికెక్కిన మంచి పనివాండ్లు పదిమంది
నందులో నొకనిగా నెంచరాదొ
ఘోటకంబులపైని మేటి సవార్లుండ
నందులో నొకనిగా నెంచరాదొయిందురున్నారు యిందులో నొకనిగాను
బత్యఖర్చుకు దయసేయఁబాడిగాదె
భూతను విలాసకోటి మన్మథవిలాస
శాంతగుణుపేంద్ర బ్రవును భూపాలచంద్ర — (మోటుపల్లి వెంకటరామానుజం; 30.జూన్ 1851.)కరుణఁబ్రోవుము నన్ను సాగర గభీర!
మేరుధీర మనోభవాకార హీర!
శారదా! శారదాభ్ర మందారకుంద!
చందనాంచిత కీర్తి! బ్రౌన్ చక్రవర్తి! — (భట్రాజు రామన్న)బ్రౌన్‌ని అప్పటి వాళ్ళు – యాచకులు, ఆశ్రితులు, దిక్కులేని వాళ్ళు, దీనులు కాబట్టి, ఇల్లాంటి మాటల్లో పొగడడం, వేడుకోవడం మనకు అర్థమవుతుంది. నువ్వు రాజువి, మమ్మల్ని పోషించేవాడివి అని పొగుడుతూ ఉంటే బ్రౌన్ భాషోద్ధారకుడిగా సాహిత్య సంజీవకుడుగా తనను తాను తలచుకుని తృప్తి పడటం ఎందుకు సాధ్యమయిందో కూడా మనకు బోధ పడుతుంది.]
తెలుగులో ప్రబంధాలు, కావ్యాలు పెద్ద పెద్ద సమాసాలతో బ్రౌన్‌కి దురవగాహంగా ఉండటం ఆశ్చర్యమేమీ కాదు. నాలుగేళ్ళో, అయిదేళ్ళో తెలుగు చదువుకుని అల-వల-తల-పలకలు నేర్చుకున్న వాళ్ళకి మనుచరిత్ర అర్థం అయిపోవలసిన అవసరం లేదు. కానీ, ఆ అర్థం అవకపోవడం తనలో లోపమనుకోవడం మామూలు వాళ్ళు చేసే పని. అది ఆ పుస్తకంలో లోపం అనుకోవడం జాత్యహంకారంతో ఉన్న వాళ్ళు చేసే ఆలోచన. ఫుస్తకాలు ఎలా పరిష్కరించాలో, దొరికిన తాళపత్ర ప్రతులన్నీ దగ్గర పెట్టుకుని ఏ రకంగా పాఠ నిర్ణయం చెయ్యాలో విశదంగా నిర్దేశించాడు బ్రౌన్. ఈ పద్ధతిలో అతను ఇంగ్లండు, ఇటలీ, జర్మనీలలో గ్రంథాల పరిష్కరణలో అనుసరించే విధానాన్నే తెలుగు పుస్తకాలకి వర్తింపచేశాడు. ఈ విధానంలో అతను కొన్ని సొంత అభిప్రాయాలు తెలుగు భాషలో ప్రవేశ పెట్టాడు.
తెలుగుని ఉద్ధరించే పనిలో ఉన్నాడు కాబట్టి ఉచ్చారణలో ఆచూకీ లేని బండి-రలు, అరసున్నకు పూర్వ రూపమైన పూర్ణబిందువులు తీసేయించాడు. ఆయన పాఠ పరిష్కరణ అంతా ఈ మార్గంలో సాగింది. తన చుట్టూ పండితుల్నీ, రాయసకాళ్ళనీ కూర్చోపెట్టుకుని, తలొకరు తలొక పద్యం చదివి పాఠభేదాలు, అర్థనిర్ణయాలు చేస్తూ వుంటే, అవి ఏ రకంగా నిర్ణయించబడాలో బ్రౌన్ తనకున్న అధికారంతో ఒక జడ్జి లాగా (చూ: 1854 బ్రౌన్ నిఘంటువు ముందుమాట) నిర్దేశించేవాడు.వాటికి వ్యాఖ్యానాలు కూడా ఇప్పుడు మనం వ్యావహారికం అనడానికి దగ్గరగా వున్న బ్రాహ్మణ పండిత వాడుక భాషలో రాయించాడు. వ్యాకరణ విశేషాలు, అలంకారాలు, ఛందో విశేషాలు రాయనివ్వలేదు. ఈ పద్ధతి అచ్చులో వున్న జూలూరి అప్పయ్యగారి మనుచరిత్ర (1851) చూస్తే తెలుస్తుంది.
[“I first had a copy made from any manuscript of tolerable accuracy, the alternate pages being left blank, and the verses duly numbered ; then the volumes was bound. I collected twelve or fifteen other manuscripts (few of them complete) lent me by various natives. A clerk sat with the newly written copy ready ; and before him were two, each having charge of five or six manuscripts, the oldest I could discover. These professors sat by, masters of grammar and prosody, both Sanscrit and Telugu ; but the others knew only their mother tongue. Each assistant in turn read a stanza, which thus was recited ten or twelve times ; the scribe recorded every deviation ; the pandits formed their judgements on each line and then one of them taking the blotted copy, selected the pure text, and dictated it to a reader.” – (మనుచరిత్ర పాఠపరిష్కరణ గురించి చెప్తూ.)
The manuscripts I had swarmed with errors. (…) I followed (the) example of (European restorers of learning) so as to elicit an authentic text. The publication of Telugu and Tamil poems had been undertaken by the Madras College Board, twenty years before, but failed because every manuscript as faulty, and the members were not aware of the methods whereby the learned in Italy and Germany had elicited a pure Greek text out of defective manuscripts; just as a judge frames a decree out of conflicting evidence.” – (Brown Autobiography, p. 38-39, emphasis added.)]
కానీ ములుపాక బుచ్చయ్య వసుచరిత్రకి వ్యాఖ్యానం రాసినప్పుడు బ్రౌన్ నిర్దేశించిన పద్ధతుల్ని అనుసరించలేదు. ఆయన వ్యాఖ్యానం గ్రాంథికంలో ఉంది కాబట్టి ముద్రించలేదని బంగోరె మొదలుకొని ఆరుద్ర వరకు చాలా మంది అన్నప్పటికీ, ఆ వ్యాఖ్యానం కళ్ళారా చూస్తే కానీ బుచ్చయ్యగారు అనుసరించిన పద్ధతులేమిటో మనకు స్పష్టంగా తెలియవు. అంతే కాదు, ఆయన అచ్చు వేసిన వసుచరిత్ర, మనుచరిత్ర మొదలైన పుస్తకాలని ఎవ్వరూ తిరిగి అచ్చు వేయలేదు.
ఇది ఇలా వుండగా బ్రౌన్ తరవాత పుస్తకాలు అచ్చు వేసిన వాళ్ళందరూ — వావిళ్ళ వారు కావచ్చు, వేదం వారు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు — బ్రౌన్ పరిష్కరించిన ప్రతిని వాడుకోలేదని మనకి స్పష్టంగా తెలుసు. అయితే బ్రౌన్ అనుసరించిన గ్రంథ పరిష్కరణ పద్ధతుల్ని వీళ్ళు దాదాపుగా అనుసరించారా? అయినా ఆయన పేరెందుకు చెప్పలేదు? బ్రౌన్ పండితుల్ని తక్కువ డబ్బులిచ్చి వాడుకున్నట్లే వావిళ్ళ వారు కూడా పండితుల్ని వాడుకున్నారా? జూలూరి అప్పయ్య లాంటి వారిని ఒకరిద్దరిని మినహాయించి, బ్రౌన్ తనకి పండితులుగా, రాయసకాళ్ళుగా, సమాచారదాతలుగా వ్యవహరించిన ఎందరివో పేర్లు పెద్దగా గుర్తించలేదు. సరిగ్గా ఇలాంటి పనే వావిళ్ళ వాళ్ళు కూడా చేశారా! ఈ విషయాల్లో అనుమానాలకి చాలా ఆస్కారాలున్నప్పటికీ నిజానికి ఈ విషయం మనం మరింత జాగ్రత్తగా పరిశీలించాలి. బ్రౌన్ పేరు చెప్పకుండా అతని మార్గాలని అనుసరించడం ఎంత తప్పో, ఆ మార్గాలు మనకు నప్పవని గ్రహింపకపోవడం అంత కన్నా పెద్ద తప్పు. అన్నిటి కంటే ముఖ్యంగా పుస్తక పరిష్కరణ విధానంలో బ్రౌన్ అమలు పెట్టిన పాశ్చాత్య పద్ధతులు తెలుగు పుస్తకాల పరిష్కరణకి పనికిరావన్న ఊహ ఇప్పటికీ మన పండితులకి అవగాహనకి రాలేదు. దీనికి నిజమైన కారణం మనమింకా వలస పాలన భావాల నుంచి పూర్తిగా తప్పించుకోలేక పోవడం.
బెర్నార్డ్ కోన్ (Bernard Cohn) మాటల్లో చెప్పాలంటే దేశీయ, బ్రిటిష్ పండితుల మధ్య సాంఘిక రాజకీయ అంతరమే కాకుండా వాళ్ళ జ్ఙాన ప్రపంచాల మధ్య ఒక పెద్ద అగాధముంది. ఎటొచ్చీ దేశీయ పండితుల జ్ఞానప్రపంచానికి విదేశీయ పాలకుల దృష్టిలో ఒక గుర్తింపు లేదు. అది అజ్ఞానం గాను, ఛాందసం గాను కొట్టి పారేసి, వాళ్ళని కేవలం ఇన్ఫార్మంట్సు గానే భావించాడు బ్రౌన్. బ్రౌన్ ఎప్పుడూ ఇంగ్లండులోను, ఫోర్ట్ విలియమ్ కాలేజి లోను ఉన్న ఇతర తెల్లవాళ్ళతో పాండిత్య విషయంలో పోటీ పడి వాళ్ళ చేత అవుననిపించుకోవాలని ప్రయత్నం చేశాడే కానీ తన చేతి కింద పని చేసేవాళ్ళు తనని పండితుడు అంటున్నారా లేదా అన్నది పట్టించుకోలేదు. అయితే ఒక పదానికి తను చేసిన పరిష్కరణ, తను చెప్పిన అర్థం పండితులు ఒప్పుకుంటే అది మాత్రం గొప్పగా చెప్పుకున్నాడు.
అయితే నిరంతర పరిశీలన చేత పట్టుదల చేత అతనికి ఈ కాలానికి తెలుగు బాగానే వచ్చునని అనుకోవచ్చు. అది కాక భాషలు నేర్చుకోవడంలో ఒక ప్రత్యేకమైన ప్రావీణ్యం, ఆభిముఖ్యం బ్రౌన్‌లో గాఢంగా ఉన్నాయి. అయినా నన్నయభట్టు ఆంధ్రశబ్దచింతామణితో మొదలు పెట్టి చిన్నయసూరి బాలవ్యాకరణం వరకు ఉన్న శాస్త్రీయ వ్యాకరణాల సంప్రదాయాన్నీ, వాటి వ్యవస్థనీ బోధపరుచుకోవడానికి బ్రౌన్ ప్రయత్నించలేదు. అతనికి కావలసినదల్లా ఆ పుస్తకాలలో ఇచ్చిన ఉదాహరణలు మాత్రమే. తనకు తేలికగా అర్థం అవుతుంది కాబట్టి సుమతీ శతకాన్ని, మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వ్యతిరేకత వుంది కాబట్టి — వేమన పద్యాలని పైకి తీసుకొచ్చాడు బ్రౌన్.
బ్రౌన్ వేమన పద్యాలు, సుమతీ శతకం చదివే స్థాయి నుంచి కావ్యాలని అర్థం చేసుకునే స్థాయికి ఎంత వరకు ఎదిగాడు అన్నది ఖచ్చితంగా నిర్ణయించడం చాలా కష్టం. కావ్యాలలో వుండే జటిలమైన భాష అంటే అసహ్యం అని అతనే చెప్పుకున్నాడు. దాంట్లో వుండే శృంగారం పట్ల కూడా అతనికి ఏహ్యభావమే వుంది. క్రిస్టియన్ నైతికత, కామం పట్ల విక్టోరియన్ కాలపు కాపట్యం అతనిలోనూ వున్నాయని అనడానికి ఆచూకీలు కనిపిస్తాయి. అయినా అహల్యా సంక్రందనం, రాధికా సాంత్వనం లాంటి పుస్తకాలకి బ్రౌన్ అర్థాలు చెప్పించుకుని ఇంగ్లీషులో అనువాదాలు కూడా చేశాడు. మరీ ముఖ్యంగా అహల్య కథ తెలుగు సాహిత్యంలో ఎన్ని చోట్ల ఉందో వెతికి చూపించుకుని శ్రద్ధగా చదివినట్లు కనిపిస్తుంది. కామం పట్ల, నైతికత పట్ల పరమ ఛాందసమైన క్రిస్టియన్ భావాలున్న బ్రౌన్, తెలుగు సాహిత్యంలో శృంగార వర్ణనలని ఇంత పట్టుదలగా చదవడానికి కారణం ఆలోచించదగినది.
[“rhetorical flourishes are far more prominent in those poems which are written in stanzas; doubtless each of these admired works contains a kernal of really pleasing poetry, but this is preceded by many a page of ill judged rhetoric, wherein the poet is evidently a mere grammarian. … He rejoices in synonymes, and the dictionary is never out of his thoughts. In many stanzas (particularly in the meter called sisa) the same thought is thrice reiterated with a mere change of phrase. Thus “the fair maid decked out with these jewels entered the presence of the king. The bright damsel arrayed with these gems passed into the court of the prince. Such were the adornments of the beauteous nymph when approaching the royal threshold.” Such passages possess an undeniable value as regards the foreigner, who will find these stanzas a most convenient substitute for the Amara Cosha and similar vocabularies of synonymes. But the taste they display is paltry enough. (Then goes on to say that) The dwipada poems are the compositions of Sudras; whereas the padya poems are in general the work of the sacred tribe.” – (Essay on the Language and Literature, 1840, pp. 17–18.)]
బ్రౌన్ నిఘంటువు
బ్రౌను చేసిన పెద్దపని అతని నిఘంటువు. ఇప్పుడు దాని గురించి చూద్దాం. బ్రౌన్ వచ్చే నాటికి తెలుగులో అకారాది నిఘంటువులు లేవు. అప్పటికి ఉన్న ఆంధ్రనామసంగ్రహము, ఆంధ్రనామశేషము, సాంబ నిఘంటువు — ఇవి సంస్కృతంలో ఉన్న అమరకోశం పద్ధతిలో నిర్మించబడ్డాయి. ఏదైనా తెలియని మాట వస్తే వెంటనే ఆ పుస్తకాలు చూసి ఆ మాటకి అర్థం తెలుసుకోవడానికి ఈ నిఘంటువులు ఉపయోగపడవు. వీటిని నిర్మించటంలో ఉద్దేశించిన ప్రయోజనం అది కాదు. వీటిలో మాటలు ఇప్పుడు ఇంగ్లీషులో ఉన్న థెసారస్ (Thesaurus) లాగా వర్గాలుగా విభజించబడ్డాయి. అమరకోశం లాగే ఈ నిఘంటువుల్ని కంఠస్థం చెయ్యాలి. నిఘంటు నిర్మాణంలో పాశ్చాత్య పద్ధతిని తెలుగులోకి పట్టుకురావడం తెలుగు నేర్చుకుంటున్న ఇంగ్లీషు ఉద్యోగస్థులకి అవసరం. వాళ్ళ అవసరం కోసం బ్రౌన్ మొదలు పెట్టిన నిఘంటువు కేవలం అతని పట్టుదల వల్ల, క్రమశిక్షణ వల్ల, అంతకన్నా ముఖ్యంగా అనేక మంది పండితుల సహాయం వల్ల, చెప్పుకోదగ్గ పెద్ద నిఘంటువుగా తయారయ్యింది. అందులో పరిపాలనకు అవసరమైన మాటలు చేర్చడం లోనూ, పరిపాలన భాషలో చేరిన పర్షియన్, ఇంగ్లీషు, ఉర్దూ మొదలైన పదాలని మిశ్రభాషా నిఘంటువులో చేర్చడం లోనూ బ్రౌన్ చాలా శ్రద్ధ వహించాడు.
(1852 బ్రౌన్ నిఘంటువుని
సాహిత్య అకాడెమీ
యథాతథంగా పునర్ముద్రించింది.)
ఈ పనిలో అతనికి ఎంత మంది పండితులు, ఎంతమంది వ్యవహర్తలు తోడ్పడ్డారో మనం స్థూలంగా గ్రహించవలసిందే కానీ నిక్కచ్చిగా మనకి తెలియదు. వాళ్ళ పేర్లని నిఘంటువులో రాసి వాళ్ళకు పేరుపేరునా కృతజ్ఞత చెప్పే అవసరం బ్రౌన్‌కి కలగలేదు. ఆయా మాటలకి అర్థ నిర్ణయ విషయంలో సహాయకుల బుద్ధి ఎంత పని చేసిందో, బ్రౌన్ అవగాహన ఎంత తోడ్పడిందో మనం స్పష్టంగా చెప్పడానికి అవకాశాలు లేవు. మాటకి ఇంగ్లీషులో అనువాదం మాత్రం బ్రౌన్‌దే. అతను తెలుగుమాటకి చేసిన అనువాదం మూలభాషలోని అర్థసూక్ష్మతని నిశితంగా పట్టుకుందా అన్న సంగతి ఇప్పటికీ ఎవ్వరూ విచారించలేదు. బ్రౌన్ నిఘంటువుని కూడా పొగిడే దృష్టితో చూశాం కానీ పరిశీలనగా మనం ఎవ్వరం చూడలేదు. బ్రౌన్ పేరుతో ఉన్న ఈ నిఘంటువులో బ్రౌన్ చేసిన పని ఎంత, పండితులు, ఇతర వ్యవహర్తలు – వాళ్ళ పాలు ఎంత అనేది ఇంత కాలం గడిచాక ఇప్పుడు మనం ఊహించగలమే కానీ కచ్చితంగా చెప్పలేం. ఈ నిఘంటువుని గురించి గిడుగు రామమూర్తి పంతులుగారి దగ్గరనుంచి దీపాల పిచ్చయ్య శాస్త్రిగారి వరకు తెలుగువాళ్ళు రకరకాల అభిప్రాయాలు చెప్పారు. ఉదాహరణకి గిడుగు రామమూర్తిగారు సూర్యరాయాంధ్ర నిఘంటువుని, శబ్దరత్నాకరాన్ని విమర్శిస్తూ బ్రౌన్ నిఘంటువునే పొగిడారు. కానీ ఆయన అభిప్రాయంలో “బ్రౌణ్య నిఘంటువు రచించిన పండితులు ప్రఖ్యాతులైన జూలూరు అప్పయ్య పండితులు మొదలయిన వారు…” (బంగోరె, 1977, పే. 96) అంటే అప్పటి పండిత లోకంలో బ్రౌన్ నిఘంటువులో పండితుల ప్రమేయం చాలా ఎక్కువగా ఉందని మనకి బోధపడుతుంది. బ్రౌన్ పట్ల వున్న ఆరాధనా భావాన్ని పక్కన పెట్టి, ఈ నిఘంటువు ఒక పెద్ద సమిష్టి కార్యమని, దీనికి బ్రౌన్ పేరు పెట్టటం కేవలం వ్యవహార సౌలభ్యం కోసమని మనం గమనించాలి. కానీ, ఈ నిఘంటు నిర్మాణంలో ప్రధాన దృక్పథం భాషా వ్యవహార సౌలభ్యమే అని గుర్తించి దానిని అమలు పెట్టిన గౌరవం మాత్రం ఒక్క బ్రౌన్‌కే ఇవ్వాలి.
అప్పటి పండితుల దృష్టిలో కావ్యాల్లో వ్యవహరించబడటం మూలంగా ప్రామాణికతని సంపాదించుకున్న పదమే నిఘంటువులో చేరాలి. కావ్యప్రయోగం లేకుండా కేవలం వ్యవహారంలో ఉన్న మాటలని నిఘంటువులో చేర్చడానికి పండితులు ఒప్పుకోలేదు. నిఘంటువు మాటలకి ఆకరమే కాకుండా ప్రామాణికం కూడా. ఈ ప్రామాణికతా దృక్పథం ఇప్పటికీ ఇంగ్లీషు నిఘంటువుల నిర్మాణంలో మనకి కనిపిస్తుంది. ఆక్స్‌ఫర్డ్, వెబ్‌స్టర్ లాంటి డిక్షనరీలలో చేరితేనే ఆ మాటకి ప్రామాణికత ఉన్నట్టు. అందులో చేరని మాట ఇంగ్లీషులో కూడా అప్రామాణికమే. ఈ దృక్పథాన్ని బ్రౌన్ పూర్తిగా సవరించి, తెలుగు నేర్చుకోదలచుకున్న ఇంగ్లీషు వాళ్ళకి పనికొచ్చేదిగా వుండాలనే ఉద్దేశంతో తన నిఘంటువులో వ్యవహారోపయోగిగా వుండే చాలా మాటలని చేర్చాడు. అందులో చాలా మాటలు ఇప్పుడు వాడకం నుంచి పోయాయి. అయినా కూడా, ఈ పని చాలా విలువైన పని.
ఇక పోతే, బ్రౌన్ వ్యక్తిగత బలహీనతలు కొన్ని ఈ నిఘంటువులో చోటు చేసుకున్నాయి. మొదటిది అతనికి తెలుగులో దీర్ఘాక్షరాలు, హ్రస్వాక్షరాలు, మహా ప్రాణాలు, అల్ప ప్రాణాలు, పరుషాలు, సరళాలు వీటి మధ్య తేడా విని పట్టుకోగల శక్తి ఏర్పడలేదు. కచటతపలు గజడదబలు అవటం తెలుగు కావ్యాల్లోనూ, వ్యవహారంలోనూ నిత్యం జరిగే పని. ఏది పరుషాది అయిన మాటో, ఏది సరళాది అయిన మాటో తెలిస్తే తప్ప నిఘంటువు చూసుకోవటానికి కావలసిన కనీస సామర్ధ్యం, పరాయి భాషగా తెలుగు నేర్చుకునే వాళ్ళకు ఒక పట్లాన అలవడదు. తనకున్న ఈ బలహీనతని మొత్తం భాషకు ఆపాదించి, తన నిఘంటువు అకారాది క్రమంలో క-ఖ-గ-ఘలు ఒక చోట, చ-ఛ-జ-ఝలన్నీ మరొక చోట — ఈ ప్రకారం నిర్మాణం చేయించాడు బ్రౌన్. ఈ పద్ధతి తెలుగు నేర్చుకునే ఇంగ్లీషువాళ్ళకి ఉపయోగపడుతుందని అతను అనుకున్నాడు. కానీ ఆధునిక తెలుగు నిఘంటు నిర్మాణకర్తలెవ్వరూ దీన్ని అనుసరించలేదని మనకు తెలుసు.
ఈ బలహీనతతో పాటు బ్రౌన్ చేసిన చమత్కారాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆయన నిఘంటువులో మాటలకి అనువాదంలో ఇచ్చిన అర్థాలు పరిశీలనగా చూస్తే ఈ సంగతి బోధపడుతుంది. ఉదాహరణకి, కళాశాస్త్రము అనే మాట కింద బ్రౌన్ ఈ మాటలు రాశాడు: “The Hindu Art of love: a dry pedantic treatise, partly an anatomy and temperaments. partly on medecine [sic], seduction, and magic, with much obscenity and no beauty. It is here noticed only because it is extremely popular among the more ignorant Hindus. Its mischievous tendency is wholly granted by puzzle headed dullness.” ఇలాంటి అర్థాలు, వ్యాఖ్యానాలు బ్రౌన్‌కి ఉన్న సొంత అభిప్రాయాలే కానీ నిఘంటువులో చేరదగ్గ విషయాలు కావు.
తన నిఘంటువు అచ్చయిన తరువాత కూడా బ్రౌన్ అందులో కొత్త మాటల్ని చేర్చుకుంటూ వచ్చాడు. అచ్చయిన తన నిఘంటువు పేజీల మధ్య తెల్ల కాగితాలు పెట్టి కుట్టించుకుని ఆ తెల్ల కాగితపు పేజీలలో కొత్త మాటలు చేర్చుకుంటూ వచ్చాడు. వస్తువులని, పళ్ళని, పువ్వులని చెప్పే మాటల దగ్గర వాటికి తగిన బొమ్మలు రంగులతో సహా వేయించి పెట్టాడు. ఈ పని బ్రౌన్ ఇంగ్లాండు వెళ్ళిన తరువాతే ఎక్కువగా చేసినట్లు కనిపిస్తుంది. ఆయన మాటల్లోనే నిఘంటువు రెండింతలయ్యింది (బ్రౌన్ ఆటోబయోగ్రఫీ, పే. 64, 65.) ఈ పనిలో తనకు ఇంగ్లండులో సహాయం చేసిన తెలుగు పండితులు ఎవరూ ఉన్నట్లు లేదు. పి. వి. ఆర్. రాజు అనే ఒక తెలుగు పేరు లండన్ యూనివర్సిటీలో ఉద్యోగంలో ఉన్నవాళ్ళలో కనపడుతుంది కానీ ఆయన ఎవరో ఆయన పాండిత్యమెంతో మనకు ఏమీ తెలియదు.
బ్రౌన్ చేర్చిన కొత్త మాటలతో ఉన్న ఈ నిఘంటువు ప్రతి ఒకటి లండన్ లోని బ్రిటిష్ లైబ్రరీ లోను, మరొకటి తిరుపతిలోని ఎస్. వి. యూనివర్శిటీ లోను ఉంది. అయినా ఈ ప్రతిని ఎవ్వరూ పరిశీలనగా చూడలేదు. ఎంతో శ్రద్ధగా పని చేసే బంగోరె కూడా ఆ కాలంలో ఆయనను ఉద్యోగం నుంచి తీసేయటం వల్ల చూడలేక పోయారు. ఇన్ని సంవత్సరాలు శ్రద్ధగా తెలుగు పండితుల మధ్య మెలుగుతూ తెలుగు భాషలో ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించిన బ్రౌన్‌కి తెలుగులో స్వతంత్రంగా పనిచేయడానికి కావలసిన సామర్ధ్యం ఉండిందా? ఈ విషయాన్ని గురించి స్పష్టమైన నిర్ణయం చేయడానికి ఇప్పట్లో అవకాశం లేదు.
బ్రౌన్ సంస్కరణ తెలుగు భాషకు ఉపయోగపడిందా?
బ్రౌన్ రాయించిన కాగితపు ప్రతులు మద్రాసు ఓరియంటల్ లైబ్రరీలో (Govt. Oriental Manuscripts Library – GOML) ఉన్నాయి. వాటితో పాటు ఆ ప్రతులు ఆధారంగా పరిష్కరించి రాయించిన కాగితపు శుద్ధప్రతులు కూడా ఆ లైబ్రరీలో ఉన్నాయి. ఇవి ఆలనాపాలనా లేక అరలలో పడి మగ్గుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోయిన తరువాత కూడా ఈ పుస్తకాలు తెలుగుని పట్టించుకోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వపు ఆధీనంలోనే ఉన్నాయి కానీ ఆంధ్రదేశపు గ్రంథాలయాలలోకి మనం తెప్పించుకోలేదు. బ్రౌన్ మొత్తం ఎన్ని పుస్తకాలు పరిష్కరించి పెట్టాడో పరుచూరి శ్రీనివాస్ డిసెంబర్ 2013లో ఈ లైబ్రరీకి స్వయంగా వెళ్ళి చూశాడు. ఒక ప్రధానమైన విషయమేమిటంటే ఈ రాతప్రతుల్లో ఒక్క వ్యాకరణ గ్రంథాలలో తప్ప మిగిలిన వాటిలో అరసున్నలు, బండి-రలు లేవు. తను పరిష్కరించిన ప్రతులలోనే కాకుండా పండితుల చేత కాపీ రాయించిన ప్రతులలో కూడా ఇవి లేవు.
ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం: బ్రౌన్ చేసిన గ్రంథ పరిష్కరణ తెలుగు సాహిత్యానికి ఏమయినా ఉపయోగపడిందా?
పాత కాలపు పుస్తకాలని పరిష్కరించే వారెవరూ అందులో లేఖక ప్రమాదాల్ని, అక్షర దోషాల్ని దిద్దుతారేమో కానీ అందులో ఉండే భాషని మార్చరు. ఆధునిక భాషలో అరసున్నలు, బండి-రలు రాయకపోవడంలో తప్పు లేదు కానీ పాత భాషలో రాసిన పుస్తకాలనుంచి వాటిని తీసేయడం వల్ల భాషా స్వరూపం దెబ్బ తింటుంది, పాఠ పరిష్కరణం అసాధ్యమవుతుంది. పాత పుస్తకాలలో భాషని తన అభిప్రాయాల ప్రకారం మార్చడం పాశ్చాత్య దేశాలలో పరిష్కర్తలు కూడా చేయలేదు. ఉదాహరణకి చాసర్ (Geoffry Chaucer) భాషని ఆధునిక ఇంగ్లీషు వర్ణక్రమంలో అచ్చువేయాలని ఎవ్వరూ ప్రయత్నించలేదు. కానీ బ్రౌన్ మాత్రం తెలుగు భాషని తన అభిప్రాయాల ప్రకారంగా ‘సంస్కరించి’ పెట్టాడు.
ఇందువల్ల, బ్రౌన్ పరిష్కరించి రాయించిన పాత తెలుగు సాహిత్య గ్రంథాలు ఎవరికీ పనికి రాలేదు. తెలుగు సాహిత్యాన్ని ఆయన ఉద్ధరించాడని, ఆయన తాళపత్ర ప్రతులకి కాగితపు ప్రతులు రాయించి వుండకపోతే తెలుగు సాహిత్యం చచ్చిపోయి ఉండేదని ఇప్పటికీ ఆయన్ను పొగిడే వాళ్ళు అంటూనే వున్నారు. కానీ యదార్థమేమిటంటే అప్పటి తాళపత్ర ప్రతులు ఇప్పటికీ పండితులకి, పరిశోధకులకీ దొరుకుతూ ఉన్నాయి. వారు పరిష్కరించి ప్రకటించిన గ్రంథాలలో, ఆ పరిష్కరణకు వాళ్ళు ఉపయోగించిన తాళపత్ర ప్రతుల వివరాలు కూడా కనిపిస్తాయి. ఈ పరిష్కర్తలెవరూ బ్రౌన్ రాయించిన శుద్ధప్రతులు వాడుకున్నట్టు దాఖలాలు లేవు. బ్రౌన్ పరిష్కరించిన పుస్తకాలు, తరువాత పండితులు పరిష్కరించిన పుస్తకాలు, దగ్గర పెట్టుకుని చూస్తే బ్రౌన్ చేసిన పని తెలుగు సాహిత్యానికి ఎందుకూ పనికి రాకుండా పోయిందని తెలిసివస్తుంది.
[ఒక్క వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు మాత్రం మనుచరిత్ర వ్యాఖ్యానంలో బ్రౌన్ చేయించిన పరిష్కృత ప్రతిని వాడినట్లు సూచనలున్నాయి. కానీ ఆయన బ్రౌన్ ప్రతిలోనుంచి అని చెప్పి యిచ్చిన ఉదాహరణల్లో బండి-రలు, అరసున్నలు కనిపిస్తాయి. మరి ఈయన పెట్టినవో లేక ఆయనకు ఇంకొక ప్రతి ఎక్కడన్నా దొరికిందో ఆయన మనకు చెప్పలేదు. (వెంపరాల, 1968, పే. xxxxi-Lix)]
ఈ సంగతి గమనిస్తే తెలుగు సాహిత్యానికి బ్రౌన్ ఇంత కష్టపడి చేయించిన పని మనకి ఎందుకూ పనికి రాలేదని, ఆ పుస్తకాలన్నీ మద్రాసు లైబ్రరీలో పడి వున్నా వాటిని ఏ పండితుడూ పరిశీలించవలసిన అవసరం కూడా కలగలేదని, బ్రౌన్ కాలంనాటి రాతప్రతులు పండితులకి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని, బ్రౌన్ చేసిన పనితో నిమిత్తం లేకుండా అతను ప్రోగు చేసిన రాత ప్రతుల ఆధారంగానే ఇప్పటి పండితులు, పరిశోధకులు గ్రంథ పరిశోధన చేసుకుంటున్నారని స్పష్టంగా బోధపడుతుంది. బ్రౌన్ ఉన్నా లేకపోయినా తెలుగు సాహిత్యం బతికే వుంది. అతన్ని హడావిడిగా పొగడటం మానేసి అతని వల్ల మనం పొందిన ప్రయోజనమేమిటో గమనిస్తే ఆయన గురించి మన అభిప్రాయాలు సవిమర్శకంగా మార్చుకోవలసిన అవసరం కనిపిస్తుంది.
ఆ తరువాత తెలుగు సాహిత్యంలో ప్రధానమైన ప్రచురణకర్తలుగా పేరు పొందిన వావిళ్ళవారు, ప్రముఖ పరిశోధకుడిగా పేరు పొందిన వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, ఇంకా అనేకులు బ్రౌన్ చేయించిన పనిని ఆయన పేరు చెప్పకుండా వాడుకున్నారు అని ఒక ఆరోపణ వుంది. ఈ మాట చాలా గట్టిగా చెప్పినవారు బంగోరె. బ్రౌన్ సంకలనం చేసిన చాటు పద్యాల సంపుటాలనుంచి ప్రభాకరశాస్త్రిగారు బ్రౌన్ పేరు చెప్పకుండా పద్యాలు తమ చాటుపద్యమణిమంజరిలో వాడుకోవటం బంగోరెకి గ్రంథచౌర్యంగా కనిపించింది. ఇది ఇలా ఉండగా, అంతకన్నా ముఖ్యమైన విషయమేమిటంటే బ్రౌన్ తన పండితులచేత అనుసరింప జేసిన పరిష్కరణ విధానం — అరసున్నలు, బండి-రల విషయంలోనూ, అఖండయతి విషయంలోనూ, ఇతర వ్యాకరణ విషయాల లోనూ తప్ప — వావిళ్ళవారు, ప్రభాకరశాస్త్రిగారు, ఇంకా ఇతర పండితులు, పరిశోధకులు దాదాపు పూర్తిగా అనుసరించారు.
[తాళపత్ర ప్రతుల పరిష్కరణలో బాలవ్యాకరణాన్ని, అప్పకవీయాన్ని అనుసరించిన పండితులు చాలా మార్పులు చేశారని ఒక పెద్ద ఆరోపణ ఉంది. ఈ విషయాన్ని ఇప్పటి అచ్చు పుస్తకాలు, అప్పటి తాళపత్ర ప్రతులు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది. తాళపత్ర ప్రతుల పరిష్కరించడంలో బ్రౌన్ ఎంత భాషాసంస్కారం చేశాడో అంత పని మన పండితులు కూడా చేశారు.]
ఈ రకంగా, బ్రౌన్ మార్గం తెలుగు గ్రంథ సంప్రదాయానికి పట్టదు అని గమనించి, తాళపత్ర ప్రతులు దగ్గర పెట్టుకుని ఆ ప్రతులు ఏ చోటి నుంచి వచ్చాయో, వాటిని ఎవరు వాడారో ఆ ప్రతి ఆ స్థితిలో ఉండడానికి దోహదం చేసిన పరిస్థితులేమిటో, అవి పరిగణన లోనికి తీసుకుని తెలుగు గ్రంథ పరిష్కారానికి ఒక కొత్త మార్గాన్ని ఏర్పరచగల అవకాశాన్ని మన పండితులు చేతులారా జారవిడచుకున్నారు. బ్రౌన్ భక్తితో, వలసవాద విజ్ఙానం మీది గుడ్డి నమ్మకంతో, అపారమైన ఆత్మన్యూనతా భావంతో, పాత ఆచూకీలన్నీ పోయేదాకా పట్టించుకోకుండా ఇప్పటికి కూడా బ్రౌన్ ఏర్పరిచిన గ్రంథ పరిష్కరణ పద్ధతిలోనే పుస్తకాలు తిరిగి అచ్చు వేయించుకోవలసిన పరిస్థితిని కలిగించారు. ఇప్పటికీ ఆంధ్ర సాహిత్య అకాడమీ లాంటి వాళ్ళు పరిష్కరింపించి ప్రకటించే కావ్యాలన్నీ బ్రౌన్ మార్గాన్ని అనుసరించినవే. ఇది అతని భాషా సేవ అని మూకుమ్మడిగా మనం అందరం అనడం కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకొనవలసిన అవసరం వుంది.
బ్రౌన్ పరిష్కరణ విధానాల వల్ల గ్రంథాలకి జరిగిన అపకారాన్ని చూపించడానికి రెండు ఉదాహరణలు చెప్పగలం. ఒకటి సుమతీ శతకానికి, రెండవది చాటు పద్యాలకి సంబంధించినది. సుమతీ శతకం పద్యాలు దొరికినవి దొరికినట్టుగా కాపీలు రాయించుకుని వాటినన్నిటినీ ఒక చోట గుది గుచ్చి వాటిలో కొన్నిటికి తనకి తోచిన ఇంగ్లీషు అనువాదాలు రాసి 1839లో బ్రౌన్ ప్రచురించాడు. బ్రౌన్ ప్రచురించిన ప్రతి దొరకలేదు కానీ మద్రాసు ఓరియంటల్ లైబ్రరీలో దొరికిన రాతప్రతి ఆధారంగా చల్లా రాధాకృష్ణశర్మగారి సంపాదకత్వాన ఆంధ్ర సాహిత్య అకాడమీ వాళ్ళు 1973లో ప్రచురించిన ప్రతి వుంది. ఈ రకంగా సుమతి అనే మకుటంతో దొరికిన పద్యాలన్నీ ఒక చోట గుది గుచ్చకపోతే మనకి సుమతీ శతకాన్ని గురించి చాలా కొత్త విషయాలు తెలిసేవి. సుమతీ శతకపు పద్యాల పాఠ పరిష్కరణలు బ్రౌన్ మార్గంలో వుండకపోతే సుమతీ శతకం రాసింది బద్దెన్నా, భీమన్నా అనే కర్తృత్వ విచారాలు మనకి వుండేవి కావు. సుమతీ శతకం ఒక పుస్తకమని, దానికి ఒక కర్త వున్నాడని, ఆయన్ని పట్టుకుని సుమతీ శతకం అని మనకి దొరికిన వాటిలో ప్రక్షిప్తాలేవో కవి రాసిన పద్యాలేవో వెతికి, ఒక పరిష్కృత ప్రతిని తయారు చెయ్యాలని ఆరుద్ర రాసిన అభిప్రాయం మనకి కలిగేది కాదు. ఇవన్నీ మనం పాఠ పరిష్కరణలో పాశ్చాత్య విధానాల్ని, బ్రౌన్ విధానాలనీ అనుసరించడంలో పట్టిన తప్పుదారులు.
ఈ విషయాన్ని చర్చిస్తూ నారాయణరావు సుమతీ శతకాన్ని గురించి ఈమాటలో కూడా ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసాన్ని సంగ్రహించి చెప్పాలంటే: సుమతి అనే మకుటంతో ఉన్న పద్యాలు అన్నీ ఒక కర్త రాసినవి కావు, ఒకే మార్గంలో ప్రచారమయినవి కావు. ఇవి రెండు మార్గాలలో ప్రచారంలోకి వచ్చాయి. అందులో ఒక మార్గం మౌఖిక మార్గం. రెండవది లిఖిత మార్గం. లిఖిత మార్గంలో ఉన్న పద్యం మౌఖిక మార్గంలో ప్రచారంలోకి వచ్చే క్రమంలో కొన్ని మార్పులు పొందుతుంది. ఈ విషయాన్ని సవివరంగా చూపిస్తూ మనకు రెండు సుమతీ శతకాలున్నాయని నారాయణరావు చెప్పాడు. ఇదే వ్యాసంలో నారాయణరావు సుమతీ శతకానికి ఇద్దరు కర్తలు ఎందుకుంటారో కూడా చూపించాడు. కవికి కర్తృత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని లౌకికమైన యదార్థ సందర్భంగా చూడడం మనకి 19వ శతాబ్దంలో బ్రౌన్ ప్రభావం వల్ల, ఆ తర్వాత కాలంలో ఇంగ్లీషునుంచి కలిగిన సాహిత్య విమర్శల ప్రభావం వల్ల మన మనసుల్లో గట్టిగా పాతుకుపోయి, మన పుస్తకాల స్వభావం మన సాహిత్య లోకంలో ఉన్న కర్తృత్వ భావన, మనలోంచి మరుగుపడి పోయాయి. ఈ విషయాన్ని గురించి ఇప్పటికే నారాయణరావు చాలా చోట్ల ప్రస్తావించాడు.
సుమతీ శతకం లాంటి పద్యాలని దొరికినవన్నీ గుది గుచ్చి ఒక చోట పెట్టటం బ్రౌన్ తెలియక చేస్తే చేసి ఉండచ్చు గానీ అప్పటి తెలుగు పండితులు చేయవలసిన అవసరం లేదు. కానీ అప్పటికే తమలో పాతుకుపోయిన ఆత్మన్యూనతా భావం వల్ల ఎవరూ నిలబడి బ్రౌన్ చేసిన పని మనకి నప్పదని చెప్పలేకపోయారు. ఆ తరువాత బ్రౌన్‌ని పొగడటమే పనిగా పెట్టుకున్న మనం కూడా చెప్పలేకపోయాం. ఇలాంటి సందర్భమే చాటుపద్యాల విషయంలో కూడా కనిపిస్తుంది. బ్రౌన్‌కి అలవాటయిన పని దొరికినవన్నీ ఒక చోట పెట్టి కాగితపు ప్రతులకెక్కించమని పండితులని పురమాయించడం. చాటుపద్యాలు బ్రౌన్ మూడు నాలుగు సంపుటాల్లోకి ఎక్కించమని అన్న విషయం ఇంతకు ముందు మనం చూశాం.
ఈ పద్ధతిలోనే మనకి కొన్ని చాటుపద్య సంపుటులు, ఆ చాటుపద్యాల గురించి పరిశీలనా గ్రంథాలు, సిద్ధాంత గ్రంథాలు మనకు వచ్చి పడ్డాయి. ఇప్పటికి ఆనాటి పాశ్చాత్య గ్రంథ పరిష్కరణ విధానాలనే గుడ్డిగా అనుసరించడం ఇందుకు కారణం. వీటి వల్ల చాటుపద్య స్వభావం, చాటుపద్య సంప్రదాయం, చాటుపద్యాలు ఏర్పడిన ఒక ప్రత్యేకమైన సామాజిక పరిస్థితులు ఉన్నాయన్న వివేచనం, ఇవన్నీ మరుగుపడిపోయాయి. ఈ విషయాన్ని గురించి ఇక్కడ వివరించడానికి అవకాశం చాలదు కానీ, వివరంగా చూడదలుచుకున్నవాళ్ళు A Poem at the right moment-Remembered verses from pre-modern South India (1998) అన్న పుస్తకంలో నారాయణరావు, షూల్మన్‌లు చేసిన చర్చ చూడండి. తెలుగు సాహిత్య చరిత్రలో చాటుపద్య ప్రపంచం ఏర్పడిన తీరు, దాని ప్రభావం, మన కళ్ళకి కనిపించకుండా పోవడానికి అనాలోచితంగా బ్రౌన్ పట్టిన మార్గాన్నే మనమూ అనుసరించడం కారణం. చాటు ప్రపంచంలో చాలా పద్యాలకి ఒక కథ ఉంటుందని ఆ కథకి ఒక ప్రయోజనముంటుందని, ఇలాంటి కథలు ప్రచారంలోకి రావడం — తెలుగు సాహిత్య చరిత్ర, పాశ్చాత్య చరిత్రకారులు అనుకునే విధంగా సరళరేఖాత్మకంగా నడవడం లేదనీ చెప్పడానికి, ఉదాహరణలని మనం ఆలోచించలేదు.
మనలో పాతుకు పోయిన వలస వాదపు సాహిత్య భావాలకి ఆద్యుడు బ్రౌన్. ఆ భావాలని అంత అనాలోచితంగా మనం అంది పుచ్చుకోవడానికి ఆ కాలంలో మనలో ఏర్పడిన సాంస్కృతిక దైన్యం కారణం. ఈ దైన్యాన్ని యథాశక్తి పెంచి పోషించి అదే విజ్ఞ్ఞానంగా చలామణీ చేసిన మహానుభావులు కట్టమంచి రామలింగారెడ్డిగారు, కందుకూరి వీరేశలింగంగారు. ఈనాడు వీళ్ళ పాండిత్యపు పునాదుల్ని మనం సగౌరవంగా ఒప్పేసుకోవడానికి, బ్రౌన్‌ని మనం ఈవేళ పొగడడానికి ప్రత్యక్ష సంబంధం వుంది.
ఇక మిగిలింది ఒక వ్యక్తి రాశాడు అన్నది మనకి తెలిసి, ఆ వ్యక్తి రాసిన కావ్యంగా మనకి ప్రచారమవుతూ వచ్చిన ప్రబంధాలు, కావ్యాల ప్రతులు — వీటిని ఎలా పరిష్కరించాలి అన్న ప్రశ్న. ఇవి కూడా తాళప్రతులు అన్నీ దగ్గర పెట్టుకుని ఆ ప్రతుల్ని ఏ ప్రాంతంలో వాళ్ళు, ఎవరు రాసుకున్నారు, ఎవరి పోషణలో వాళ్ళు వున్నారు; ఆ గ్రంథం సంపూర్ణంగా అన్ని చోట్లా లభ్యమవుతుందా లేక కొన్ని భాగాలుగా దొరుకుతోందా, అయితే ఆ భాగాలు ఏ ప్రాంతానివి, వాటి లేఖకులు ఎవరు; అన్న సమాచారాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పటిదాకా అడగని చాలా రకాల కొత్త ప్రశ్నలు అడిగి, వాటి ఆధారంగా మనం ఇప్పుడు ఆ గ్రంథాలని పరిష్కరించాలి. ఆ రకమైన పరిష్కరణకి ఇంకా అవకాశం వుంది. తాళపత్ర ప్రతులు దొరికే జాగాలు, వాటిని ఉపయోగించిన వ్యక్తుల యొక్క సమాచారం మనం చాలా చోట్ల పోగొట్టుకున్నా ఇంకా చాలా సమాచారం మిగిలే వుంది. మొత్తం మీద తెలుగు సాహిత్యం అనే ప్రపంచంలో గ్రంథ పరిష్కరణకి మనకి నప్పిన విధానాలు రూపొందించుకోవాలి. ఆ రకంగా మన సాహిత్యాన్ని మనం పరిష్కరించుకునే వరకూ, బ్రౌన్ మార్గాన్ని అనుసరించడం వల్ల తెలుగు సాహిత్యానికి జరిగిన అపకారాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం.
వలసరాజ్యాల మీద వలసదేశాలు ఆధిపత్యం చలాయించడానికి కారణం కేవలం సైనికమైనది కాదనీ అది నిజానికి సాంస్కృతికమైనదనీ గమనించి మంచి ఆలోచనలు ప్రతిపాదించిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు. తరువాత కాలంలో ఇంగ్లండులో ఉన్నారు. భారతదేశంలో కూడా ఉన్నారు. కాకపోతే ఆ పరిశోధనలన్నీ ఇంగ్లీషులో జరగబట్టి కాబోలు మన తెలుగు పండితుల చెవులకెక్కలేదు. వలస రాజ్యపు అధికారం భావజాలాల మార్పు వల్లే నిలబడుతుందనే ప్రాధానిక సూత్రాన్ని సూక్ష్మంగా ప్రతిభావంతంగా ప్రతిపాదించినవాడు బెర్నార్డ్ కోన్ (Bernard Cohn). ఎప్పుడో ఒకప్పుడు వలస రాజ్యపు ప్రభావం భారత దేశం మీద, భారత దేశ విజ్ఞానం మీద చాప కింద నీరులా ఎలా చొచ్చుకుపోయిందో ముఖ్యంగా మన తెలుగు విజ్ఞానులు ఎంత దారుణంగా ఆ ప్రభావంలోనే ఇంకా కొట్టుకుంటున్నారో వివరంగా చెప్పే పుస్తకాలు వస్తాయని ఆశిద్దాం.
పైకి ఉపకారంలా కనిపించే ఆంగ్ల పరిపాలకులు చేసిన పనుల స్వభావం మనకి బోధపడటానికి ఇంకా చాలా పరిశోధనలు జరగాలి.
ఇక వ్యక్తిగత విషయాల్లోకి వస్తే బ్రౌన్ తెలుగు పండితుల ముందు తెల్లవాడి దర్పంతో అధికారాన్ని చలాయించినా ఇతని కింద పని చేసిన కొందరు తెలుగు పండితుల గురించి మంచి మాటలు కొన్ని చోట్ల చెప్పాడు. తాను ఎంతయినా తెలుగుకి పరాయి వాడినేనని, తెలుగు పండితుల కొచ్చినంత తెలుగు తనకెప్పటికీ రాదని చెప్పాడు. పైన చెప్పినట్లుగా, ఒక మాటకు తాను చెప్పిన అర్థం తెలుగు పండితులు అంగీకరిస్తే ఎంతో మురిసిపోతూ ఆ విషయం రాసుకున్నాడు కూడాను. తెలుగు భాషని మార్చడానికి దిద్దడానికి తనకి అధికారం లేదని బ్రౌన్ స్వయంగా ఒప్పుకున్నాడు. తన తెలుగు నిఘంటువుకి రాసిన పీఠికలో తానై తెలుగులో లేని కొత్త మాటలు సృష్టించి చేర్చలేదని, పరదేశీయుడెవరికీ అలాంటి అధికారం లేదనీ భారతదేశంలో వాడే భాషల్ని మార్చాలని, బాగు చేయాలని ఊహించే వాళ్ళలో తను ఒకడు కాననీ చెప్పాడు. తన పరాయితనాన్ని తన భాష కాని సాహిత్యంలో ఎంత పని చేసినా ఆ భాషా వ్యవహర్తలకి తనకి మధ్య భాషాజ్ఞానంలో ఎప్పుడు అంతరం ఉంటుందని గుర్తించగలిగిన సౌమనస్యాన్ని ప్రదర్శించాడు.
ఈ వినయాన్ని మనం సందర్భసహితంగా పరిశీలించాలి. బ్రౌన్ పోటీ పడేది ఆ రోజుల్లో తెలుగు పండితులతో కాదు. వాళ్ళెలాగు తన చేతి కింద వాళ్ళే. తానిచ్చిన చిన్న జీతంతో తన అడుగులకు మడుగులొత్తుతూ పని చేస్తున్నవాళ్ళే. తాను తెలుగులో గొప్ప పని చేశానని గుర్తించ వలసిన వాళ్ళు ఇటు కలకత్తాలోను, అటు ఇంగ్లాండులో ఉన్న తన దేశీయులు. అందులో ముఖ్యంగా సంస్కృతంలోను పర్షియనులోను పని చేసిన పెద్ద విద్యావంతులు. వాళ్ళ దగ్గర తను ఎంత వినయం ప్రదర్శిస్తే తనకి అంత గౌరవం. ఈ మాటల్ని ఈ సందర్భంలో అర్థం చేసుకుంటే బ్రౌన్ చూపించిన వినయానికి ఒక అంతర్గత కారణం ఉందని బోధపడుతుంది. బ్రౌన్ తను పరిష్కరింప చేసిన ప్రతి పుస్తకంలోను, Under my guidance అని స్పష్టంగా రాయించేవాడు. ఈ సంగతి మనం గుర్తు పెట్టుకోవాలి.
ఇప్పటికైనా మనం చేయవలసిన పని బ్రౌన్‌ని తలెత్తుకుని అతిశయోక్తులతో ఆయన తెలుగులో మహా పండితుడని, తెలుగుని ఉద్ధరించిన వాడని, ఆయన లేకపోతే తెలుగు సాహిత్యం పాడై పోయేదని చెప్పుకోవడం కాదు. జాగ్రత్తగా పరిశీలించి మనలో పాతుకు పోయిన వలసవాదపు భావాలు తుడిచిపెట్టివేసి, మన సాహిత్యాన్ని పునఃపరిశీలన చేయడం, ఆ సాహిత్యానికి ప్రపంచంలో సముచితమైన స్థానాన్ని కల్పించడం.
[03 మే 2014 – ఈ వ్యాసానికి మరికొన్ని పాదసూచికలు, సాహిత్య ఆధారాలు జతచేశాము. 27 మే 2014 – కొన్ని వాక్యాలు స్పష్టత కోసం మార్చబడ్డాయి. – సం.]
గ్రంథసూచి
- ఆరుద్ర; సమగ్ర ఆంధ్ర సాహిత్యం: కుంఫిణీ యుగం-1; తొమ్మిదవ సంపుటం; విజయవాడ; ప్రజాశక్తి బుక్ హౌస్, 1990.
- ఆర్. పద్మావతి; బ్రౌను – తెలుగు కావ్య సముద్ధరణము; తిరుపతి; నవ్యపరిశోధక ప్రచురణ; 1986.
- ఎస్. వీరబ్రహ్మ కవి; నానారాజన్య.- విఖ్యాతజనచరిత్ర; రెండవ ముద్రణ; మచిలీపట్టణము; 1930.
- గోపాలకృష్ణయ్య, దుగ్గిరాల; ఆంధ్రరత్న గోపాలకృష్ణుని చాటువులు; బెజవాడ; శ్రీమదాంధ్ర విద్యాపీఠ గోష్ఠి; 1934.
- దోణప్ప, తూమాటి; ఆంధ్ర సంస్థానములు సాహిత్యపోషణము; విశాఖపట్నం; ఆంధ్ర యూనివర్సిటీ; 1969.
- నరసింహశర్మ, సన్నిధానం; బ్రౌను ఉదాహరణం; రాజమండ్రి, 1997.
- పి.ఎస్. గోపాలకృష్ణ; తెలుగుదారిలో వెలుగుదీపిక సి.పి. బ్రౌన్ (1798-1884); హైదరాబాద్, సి.పి. బ్రౌన్ అకాడమీ; 2012.
- బంగోరె (సం); బ్రౌన్ జాబులు: తెలుగు జర్నలిజం చరిత్ర – 1832 నుంచి 1857 దాక; నెల్లూరు; Nellore Historics Publication No. 3; 1973.
- బంగోరె (సం); సి.పి.బ్రౌన్ – తాతాచార్ల కథలు; Compilation and Commentary by Bangorey; యం. మచిలీపట్నం, మద్రాసు, సికింద్రాబాదు; శేషాచలం అండ్ కో, 1974.
- Bangorey (Ed.); ఆంధ్ర గీర్వాణ ఛందము – The prosody of the Telugu and Sanscrit languages explained by C.P. Brown (reprint of 1827 edition with introduction & notes); Tirupati; Sri Venkateswara University; 1977.
- బంగోరె (సం); బ్రౌన్ లేఖలు – ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర శకలాలు (గఛ్ఛద్వ్యాఖ్యతో); తిరుపతి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం; 1977.
- బంగోరె (సం); బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు – కడప జాబుల సంకలనం; తిరుపతి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం; 1977.
- Bangorey (Ed.); Literary autobiography of C.P. Brown; Tirupati; Sri Venkateswara University; 1978.
- బంగోరె (సం); వేమన పద్యాలు [సి.పి.బ్రౌన్ 1839 నాటి సంకలనం]; హైదరాబాదు; యోగి వేమన తెలుగు విజ్ఞాన కేంద్రం, 1980.
- బంగోరె; వేమన – సి.ఆర్. రెడ్డి; విశాఖపట్నం; ఆంధ్ర విశ్వకళాపరిషత్తు; 1981.
- వీరభద్రరావు, కొత్తపల్లి; సి.పి. బ్రౌన్ (1798-1884); 2nd edition; సికిందరాబాదు; 1988.
- వెంకటశాస్త్రి, చెళ్ళపిళ్ళ; కథలు – గాథలు, “నా గురుపరంపర” అన్న వ్యాసం (పేజి. 400-14); ప్రథమ భాగము; రెండవ కూర్పు; కడియము; చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి సన్సు; 1958.
- వెంకటశాస్త్రి, చెళ్ళపిళ్ళ; జాతకచర్య; బందరు; మినర్వా ప్రెస్; 1934.
- సత్యనారాయణరావు యండమూరి; ఉషఃకిరణాలు – 19వ శతాబ్ది తెనుగు సాహిత్యచరిత్ర; విజయవాడ; ఉత్తమసాహితి; 1960.
- Subrahanyasarma, V.V; Charles Philip Brown: 10.11.1798-12.12.1884; Hyderabad, Telugu Goshti, 2003.
- సూర్యనారాయణశాస్త్రి, వెంపరాల (వ్యాఖ్యాత); అల్లసాని పెద్దనార్య ప్రణీత మనుచరిత్రము (స్వారోచిష మనుసంభవము) సవ్యాఖ్యానము; విజయవాడ; వేంకట్రామా అండ్ కో; 1968.
- హనుమఛ్ఛాస్త్రి, జానుమద్ది; సి.పి.బ్రౌన్ చరిత్ర; హైదరాబాదు, తెలుగు అకాడమి; 1992.
- హనుమఛ్ఛాస్త్రి, జానుమద్ది (సం); సి.పి.బ్రౌన్ ద్విశతజయంతి మహోత్సవాలు – ప్రత్యేక సంచిక; కడప; సి.పి. బ్రౌన్‌మెమోరియల్ ట్రస్టు; 1998.
- Bellot, H.H.; University College London: 1826-1926; University of London Press; London; 1929.
- Brown, C.P; Essay on the language and literature of the Telugus – originally included in the Madras Journal of Literature and Science [1839]; Madras; J.B. Pharoah; 1840.
- Brown, William; A grammar of the Gentoo language as it is understood and spoken by the Gentoo people, residing north and north- westward of Madras by a civil servant; Madras, Sampie, 1817.
- Buchanan, Rev. Clauidius, Kerr, Richard H.; The Works of the Rev. Claudius Buchanan, L.L.D.; New York; Whiting & Watson; 1812.
- Campbell, A.D; A grammar of the Teloogoo language, commonly termed the Gentoo, peculiar to the Hindoos inhabiting the north eastern provinces of the Indian peninsula; Madras; College of the Fort St George; 1816.
- Carey, William; A Grammar of the Telinga Language, Serampore, printed at the Mission-Press; 1814.
- Cohn, Bernard; “The Command of Language and the Language of Command” in Subaltern Studies IV; Ranajit Guha (Ed); New Delhi; Oxford University Press, 1985; p. 328.
- Cohn, Bernard; Colonialism and Its Forms of Knowledge: The British in India; Princeton; Princeton University Press; 1996.
- Danvers,F.C., Monier-Williams,Sir M., et al; Memorials of old Haileybury College; Westminster; Archibald Constable and company; 1894.
- Dirks, Nicholas B.; “Colonial histories and native informants” In: Orientalism and the Postcolonial predicament; Breckenridge, C.A. and van der Veer, P. (eds); Philadelphia, University of Pennsylvania Press, 1993.
- Dirks, Nicholas B.; also see Dirks’s foreword to The Madras School of Orientalism Producing Knowledge in Colonial South India; 2009.
- Fisher, Michael; The Travels of Dean Mahomet: An Eighteenth Century Journey through India; Berkeley; University of California Press; 1997.
- Fisher, Michael; Persian Professor in Britain: Mirza Muhammed Ibrahim at the East India Company’s College,1826-44, Comparative Studies in South Asia, Africa, and the Middle East; Vol. 21, nos. 1&2; 2001; pp. 24-32.
- Fisher, Michael; Counter-flows to Colonialism: Indian Travellers and Settlers in Britain, 1600-1857; Delhi; Permanent Black; 2004.
- Frykenberg, R.E.; Modern Education in South India, 1784-1854: Its Roots and Its Role as a Vehicle of Integration under Company Raj; The American Historical Review; Vol. 91, No. 1; 1986, pp. 37-65.
- Harrison, J.B; “English as a University Subject in India and England: Calcutta, Allahabad, Benaras, London, Cambridge and Oxford”; In: Crook, Nigel (Ed); The transmission of knowledge in South Asia : essays on education, religion, history, and politics; Delhi, New York; Oxford University Press, 1996.
- Hatcher, Brian; Indigent Brahmans, Industrious Pandits: Bourgeois Ideology and Sanskrit Pandits in Colonial Calcutta; Comparative Studies of South Asia, Africa and the Middle East; Vol. 16, No. 1; 1996; pp. 15–26.
- Hatcher, Brian; Sanskrit Pandits Recall their Youth: Two Autobiographies from Nineteenth-Century Bengal; Journal of the American Oriental Society; Vol. 121, No. 4; 2001; pp. 580–92.
- Hatcher, Brian; What’s Become of the Pandit? Rethinking the History of Sanskrit Scholars in Colonial Bengal; Modern Asian Studies; Vol. 39, No.3; 2005; pp. 683-723.
- Lowell, A. Lawrence; Stephens, H. Morse; Colonial civil service – The selection and training of colonial officials in England, Holland, and France with an account of the East India College at Haileybury (1806-1857); London; The Macmillan Company; 1900.
- Mangamma, J; The Rate Schools of Godavari; Regular monograph series of state archives No.3; Hyderabad, The government of Andhra Pradesh; 1973.
- Mantena, Rama.; The Origins of Modern Historiography in India: Antiquarianism and Philology, 1780-1880; New York; Palgrave Macmillan; 2012.
- Milford, L.S; Haileybury College Past and Present; London, Leipsic; T. Fisher Unwin; 1909.
- Mitchell, Lisa; Language, Emotion, and Politics in South India: The Making of a Mother Tongue; Bloomington; Indiana University Press; 2009.
- Minkowski, Christopher; “King David in Oudh: a Bible story in Sanskrit and the Just King at an Afghan court”; Inaugural Lecture for the Boden Professorship, Oxford; University of Oxford; 07.March 2006.
- Morris, Henry; The life of Charles Grant: Sometime member of parliament for invernessshire and director of the East India Company; London; John Murray; 1904.
- Narayana Rao, Velcheru, Shulman, David (eds); A Poem at the Right Moment: Remembered Verses from Premodern South India; Berkeley; University of California Press; 1998.
- Narayana Rao, Velcheru; “Many Lives of a Text: Sumati Śatakamu in Colonial Andhra” In: Ritual, Caste, and Religion in Colonila South India, edited by Michael Bergunder, Heiko Frese, and Ulrike Schroeder; Halle; Franckesche Stifungen zu Halle; 2010; pp. 330-374, Delhi; Primus Books; 2011.
- Rocher, Rosane; “The Career of Radhakanta Tarkavagısa, an Eighteenth-Century Pandit in British Employ” Journal of the American Oriental Society; Vol.109, No. 4; 1989; pp. 627–33.
- Rocher, Rosane; “Weaving Knowledge: Sir William Jones and Indian Pandits” In: Objects of Inquiry: The Life, Contributions, and Influences of Sir William Jones 1746–1794; New York; New York University Press; 1995; pp. 51–79.
- Rocher, L; Rocher R.; The Making of Western Indology: Henry Thomas Colebrooke and the East India Company; London, New York; Routledge, 2012.
- Row, Vennelacunty Venkata Gopala; The life of Vennelacunty Soob Row, (native of Ongole): Translator and interpreter of the late Sudr court, Madras, from 1815 to 1829 – As written by himself; Madras; C. Foster and Co.; 1873.
- Schmitthenner, Peter; Telugu Resurgence: C.P. Brown and Cultural Consolidation in Nineteenth- Century South India; Delhi; Manohar; 2001.
- Sudhir, P.; “Colonialism and the Vocabularies of Dominance” in: Tejaswini Niranjana, et al (eds) Interrogating Modernity: Culture and Colonialism in India; Calcutta, Seagull Books, 1993, p.334-47.
- Trautmann, Thomas; Languages and Nations: The Dravidian Proof in Colonial Madras; Berkeley; University of California Press; 2006.
- Trautmann, Thomas; The Madras School of Orientalism Producing Knowledge in Colonial South India; Delhi, New York; Oxford university press; 2009.
- Tubb, Gary; The Sanskrit Thesaurus and What It Can Tell Us – Talk presented at South Asia Seminar, Emory University; 24.Jan 2013.
- Vibart, Colonel H. M; Addiscombe, its heroes and men of note – With an introduction by Lord Roberts of Kandahar; Westminster; Archibald Constable and company; 1894.
- Viswanathan, Gauri; Masks of conquest: literary study and British rule in India; New York; Columbia Univ. Press, 1989.
- Zastoupil, L., Moir M. (eds); The great Indian education debate: documents relating to the Orientalist-Anglicist controversy of 1780-1840; Richmond : Curzon, 1999.