“పాపమా? ఎవడండీ చెప్పేడు? మనిషి జీవితాన్ని సుఖమయం చేసుకోమనే బుర్ర నిచ్చేడు మనకి సృష్టికర్త. ఆ బుర్ర ఉపయోగించి గింజలు ఉడకబెట్టుకు తినొచ్చు, పిండిచేసుకుని రొట్టె చేసుకోవచ్చు, లేకపోతే పానీయాలు చేసుకోవచ్చు. పక్కింటాయనకి ఓ బస్తా ఇవ్వగా లేంది మీ ఆనందం కోసం ఓ బస్తా గింజలు విదల్చలేరూ? అదీ మీరు తాగబోయే పానకం కోసమే కదా?” పగలబడి నవ్వేడు నికోలాస్.

గ్రెటా అంత పెద్ద అందగత్తేం కాదు. కానీ ఆమె మొహంలో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. ముఖ్యంగా నవ్వుతుంటే! వయసు నలభై ఉండచ్చు. ఒకసారి నీ వయసు నలభై ఉండచ్చు కదూ అని అడిగితే కొట్టినంత పని చేసింది. మిసమిసలాడుతూ ఉన్న గ్రెటాకి నప్పనిది ఆమె జుట్టుకేసుకున్న రంగే! తెల్ల రంగు మొహమ్మీద నల్ల టోపీ పెట్టుకున్నట్లుంటుంది. అదే అంటే ఒక్క తోపు తోసింది. నేను తనని వేళాకోళం చేస్తానన్న విషయం ఆమె గ్రహించి నాతో తక్కువగా మాట్లాడేది.

“నేనొచ్చిన సంగతి తెలిసి అమ్మ ఒక్క గెంతుతో కిందకి దిగింది. అందరూ నన్ను ముట్టుకోడానికి పోటీలు పడ్డారు. దెయ్యాన్ని కాదని నిశ్చయించుకోడానికి కాబోలు! నా మీద పడి అంతా ముద్దులు కురిపించేసరికి ఊపిరాడలేదంటే నమ్ము! అది సరే కానీ, ఈ కుక్క పిల్లకెంత దాహమో చూడు! అసలు దీంతో పాటు ఒక నీళ్ళ టాంకరు తెచ్చుకోవాల్సింది మనం. ఈ ఎండలకిది ఇద్దరు మనుషుల నీళ్ళు తాగుతుంది.”

విడవబడ్డదే తడవుగా మిలియన్ల సంఖ్యలో వాళ్ళు తమ గమ్యస్థానం వైపు పరుగెత్తడం మొదలు పెడతారు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి వాళ్ళ వేగాన్ని నిరోధించదు. అదృశ్య శక్తేదో వాళ్ళని ఆ గమ్యం వైపు నడుపుతూంటుంది. గమ్యం దొరక్క శక్తి ఉడిగిన తరువాత రాలిపోవడం వాళ్ళల్లో కొంతమందికి జరిగేదే. గమ్యం దొరికిన వాళ్ళకి కూడా అదొక దుర్భేద్యమైన కోట. దాన్ని ముట్టడించిన వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రం ఆ కోట రక్షణ కవచాలని ఛేదించి లోపలికి ప్రవేశించ గలుగుతారు. అయితే, ప్రవేశించిన తరువాత తమ అస్థిత్వాన్ని కోల్పోతారు.

ఆ రోజు సుజాత ఇద్దరు పిల్లల్ని సూరిగాడికి కాపలాగా పెట్టింది. వాళ్ళు చాలా ఉత్సాహంతో పెద్ద టీచర్ మాటలు పాటించారు. ఒంటేలుకు కూడా ఒంటరిగా వదలకుండా వాడి వెంటే వున్నారు. రెండోరోజుకల్లా సూరిగాడికి చాలా కడుపునొప్పి వచ్చింది. ఇంట్లోనే ఉండిపోయాడు. మూడో రోజు ఉదయం కూడా అలానే ఉందన్నాడు. వాణ్ణి బతిమాలి పడుకోబెట్టి, వాళ్ళ అమ్మ గబాగబా పని ముగించుకునొచ్చేసరికల్లా పత్తా లేడు. నాలుగో రోజు మళ్ళీ రాఘవులు తెచ్చి వదిలాడు. “అమ్మ! జర బద్రం. పోరగాడు మల్ల ఉరికిబోతడు,” అంటూ.

మధ్యాహ్నం భోజనం అయ్యేక అంగట్లో ఖాళీ ఉన్నప్పుడు వచ్చారు తండ్రీ త్రివక్రా – సుదాముణ్ణి చూడ్డానికి. వచ్చిన వాళ్ళని కూర్చోపెట్టి అడిగేడు. “ఎందుకు మీరీ పిల్లని అలా హింసిస్తున్నారు రోజూ? ఈ శరీరం, ఈ అవకరాలు అన్నీ భగవంతుడిచ్చినవి. మనం ఏదో జన్మలో చేసుకున్న కర్మ వల్ల ఇలాంటి మానవ జీవితం వచ్చింది. ఇప్పుడు సంతోషంగా ఆ మిగిలిపోయిన కర్మ మౌనంగా అనుభవించేస్తే మేలు. ఎవరూ కూడా అవకరాలు కావాలని కొని తెచ్చుకోరు కద?”

హాల్లో అత్తయ్యా మావయ్యా నల్ల బల్ల ఉయ్యాల మీద కూర్చున్నారు. ఒకరెదురుగా ఒకరు. ఆవిడ సన్నజాజుల మాల కడుతోంది. మావయ్య పూల మొగ్గల్ని జోడించి అందిస్తున్నాడు. చాలా దీక్షగా. ఎంత శ్రద్ధ మావయ్యకి. రోజూ మేడెక్కి పూలు కోసుకొస్తాడు. ఎండా కాలాల్లో మల్లెపూలు, కనకాంబరాలు పది మరువం రెమ్మలూ. ఇదీ ఆ సముద్రంలా ఎప్పుడొచ్చినా మనసు నిండా నిండిపోయే చిత్రమే.

అరూబా, ఆ కరీబియన్ ద్వీపం ఎంత అందమైంది. వారి హోటెల్ రూమ్ లోనుండి అనంతంగా కనిపిస్తున్న నియాన్ ఆకుపచ్చ, ప్రష్యన్ నీలం కలబోతల సముద్రం నిసికి మానసిక ప్రశాంతతనూ, విశాలతనూ, లోతునూ కలిగిస్తే, శ్యాంలో అవి ఉద్రిక్తతనూ, పొంగే పురుషత్వాన్ని సంతరించాయి. కామకేళిలో ఆమె శరీరపు స్పర్శలు, తనను హత్తుకునే తీరు, ఆమెను ముద్దాడినప్పుడు తిరుగు కౌగిలింతలు, అతనికి ఎంతో ఇష్టం. వారికి ఇతరుల గురించిన ఆలోచనలూ, వ్యగ్రతలూ నశించాయి.

రాయుడు ఉత్త వాగుడుకాయ. బుర్రలో పుట్టే ఆలోచనల ప్రవాహం కంటె ఎక్కువ జోరుగా మాట్లాడడంలో అతనికి అతనే సాటి. అప్పుడప్పుడొక మోతాదు అశ్లీలాలు దొర్లిస్తూ మాట్లాడే తత్త్వమేమో, ‘కంట్రీ క్లబ్బు’లో అతను ఎక్కడ ఉంటే అక్కడ పదిమంది తేనె చుట్టూ చేరే ఈగల్లా చేరి కేరింతాలు కొడుతూ ఉంటారు. నాయుడికి రాయుడంటే చిరాకు. ముభావంగా ముడుచుకు కూర్చునే నాయుడు చుట్టూ వందిమాగధులు ఎవ్వరూ చేరరు. అందుకని రాయుడంటే అసూయ పడుతున్నాడో ఏమో! మనకి తెలియదు.

నాలుగడుగులేశాడో లేదో, మళ్ళీ సైకిల్ బెల్ మ్రోత. ఈ సారి ఆగకుండా, అదే పనిగా! కిటికీ వైపుకు దూకి, కర్టెన్ తెరిచి సైకిల్ వంక చూశాడు. ఎవరో స్టాండ్ వేసిన సైకిల్ మీద కూర్చుని అదే పనిగా గంట మ్రోగిస్తున్నారు. అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. మెరుపు కాంతిలో కనిపించిన దృశ్యానికి రవి నిలువెల్లా వణికి పోయాడు! ఉరుము శబ్దం సైకిల్ బెల్ మ్రోతను మింగేసింది. గభాలున కిటికీ తెరను మూసేసి, లైటార్పి, గజగజలాడిపోతూ నిండా దుప్పటి కప్పుకున్నాడు.

మేం మీరనుకున్నంత ఆదర్శప్రాయులమేం కాదు. మాకూ అభిప్రాయభేదాలూ, కోపతాపాలూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా. ఉదాహరణకి, ఈ వేడుక కోసం ఈవిడ వంగపండు రంగు పట్టుచీర తీసింది. నేనేమో నెమలికంఠం రంగు చీర కట్టుకోమన్నాను. చూశారుగా, చివరికి చెల్లింది చిలకాకుపచ్చ. దీని అంతరార్థం తెలిస్తే, మా జీవనవేదం మీరు గ్రహించినట్లే. మా ఇద్దరి సంసారం జాయింట్ వెంచర్ ఐతే, తన వాటా 51శాతం. కాబట్టి మధుమతి నా అర్థాంగి కన్నా ఎక్కువే.

కుశలాలు అల్లాగట్టిపెడితే, మీ వచనం చదివినాక మీకెందుకోగాని పాఠకులలో చాల విశ్వాసమున్నదనిపించింది. మీకు వారి చప్పట్లలో విశ్వాసమున్నదనిపించింది. యుగాలవరకు కాదు కాని – అప్పుడే మరచిపోయినారు నన్ను. నా పద్యకవిత్వం అచ్చు కావడమూ లేదు. మెచ్చుకోవడమూ లేదు. అదొక దిగులని కాదు. కాని నన్ను నేను మరచిపోవాలంటే సాధ్యం కాకుండా వున్నది. జ్ఞాపకాలు తవ్వుకోవటం ఆంధ్రులకు వెన్నతో పెట్టిన విద్య. తవ్వుకోటమంటే ద్వేషం రేకెత్తించటమే.

మరణ శిక్ష అంటే ఎవరో ఒకరు కత్తితో నేరస్తుణ్ణి నరకాలి. లేకపోతే ఉరి తీయాలి. అయితే ఎప్పట్నుంచో మొనాకోలో అసలు హత్యలూ నేరాలు లేవు కనక ఉరితీసే తలారీ ఎక్కడా లేడు దేశంలో. జూద గృహాల్ని మాత్రమే చూడ్డం అలవాటైపోయిన సైన్యంలో ఏ ఒక్కడూ దీన్ని తలకెత్తుకోవడానికి ముందుకి రాలేదు. నేరస్తుణ్ణి వదిలేస్తే దీన్ని చూసుకుని మరో హత్యా కలహాలు మొదలౌతాయ్. సరే తలారిని వెదికే లోపుల వీణ్ణి జైల్లో ఉంచుదాం అని తీర్మానం అయింది. మరి జైలే లేదు మొనాకోలో.

అయిష్టంగానే ఇంటర్‌వ్యూకి వెళ్ళాను. ఉదయం పదింటి నుండి మధ్యాన్నం వరకూ ఉంది. ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వరసగా వాయించి పడేస్తున్నారు. ప్రశ్నలే ప్రశ్నలు. ఉద్యోగం ఇచ్చేవాడికి అప్ప్లై చేసేవాడు లోకువ. చివర్న ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంటుని కలవాల్సుంటుందని ఓ అరగంట సేపు కూర్చోబెట్టారు. ఇంటర్వ్యూ ఓ మాదిరిగా చేశాను. కొన్ని కష్టమైనవి అడిగారు. ప్రోగ్రామింగ్ ప్రశ్నలు పరవాలేదు, బాగానే చెప్పాను.

అబ్బాయిని కోడలు వినకుండా మందలించింది పార్వతమ్మ. ఓ వెఱ్ఱినవ్వు నవ్వి ఊరుకున్నాడు అమ్మూ. కోడలికి చెప్పాలంటే సంకోచపడింది ఆవిడ. గౌరీశంకరం గారు కూడా నోరు మెదపలేదు. అమ్మాయికి చెప్పే స్వతంత్రత లేదని అన్నారు. అమ్మాయి తల్లి తండ్రులు చెపితే బాగుంటుందేమో ప్రస్థుత పరిస్థితులలోయని పార్వతి దగ్గర అభిప్రాయపడ్డారు.

ఈ వూరికి ఆ వూరు ఎంత దూరమో ఆ వూరికి ఈ వూరూ అంతే దూరం అన్నట్టు… మన తెలుగు దేశం నడిబొడ్డులో పుట్టి పెరిగిన ఈ అమ్మాయిలు ఇంత వెస్ట్రనైజ్‌డ్‌గా వున్నారేమిటీ అని నేను ఆశ్చర్య పోయానా, మరీ వాళ్ళేమో నా గద్వాల్ చీర, నా జుట్టుముడి చూసి ఈ దేశంలో నలబై ఏళ్ళుగా వుంటున్నానని, నేను డాక్టర్ నని విని నోళ్ళు తెరిచారు!

ముని గుడిసె లోంచి బయటకొచ్చి మిఖాయిల్‌ని తీసుకెళ్ళి ఓ చెట్టును పడగొట్టించేక దాన్ని మూడు ముక్కలుగా కాల్పించేడు నిప్పుల మీద. అవి బొగ్గుముక్కల్లాగా అయ్యేక చెప్పేడు ముని, “ఇవి సగం లోతుగా ఇక్కడ పాతిపెట్టు. రోజూ నోటితో వీటిని తడుపుతూ ఉండు. నీకిదే పని. ఎప్పుడైతే ఈ మూడూ పూర్తిగా ఆకులు వేసి మళ్ళీ మొలవడం మొదలు పెడతాయో అప్పుడు నీకు పాప ప్రక్షాళన అయినట్టు.”

నాకు డెబ్బీతో పరిచయం విచిత్రంగా జరిగింది. నేను బారిస్టాగా పనిలో చేరిన కొత్తలో కస్టమర్ల ఆర్డర్లు తీసుకోవడం కాస్త కష్టంగా ఉండేది. అలవాటు లేని పని. పైగా వచ్చే ప్రతీ వాడూ ఒక్కో కాంబినేషన్లో కాఫీ ఆర్డర్ చేస్తాడు. సాధారణంగా కాఫీ గ్లాసు మీద ఆర్డరు రాస్తారు. దాన్ని బట్టే కాఫీ చేస్తారు.

నెలరోజులిట్టే గడిచిపోయి, బంగార్రాజు కుటుంబసమేతంగా అమెరికా వెళ్ళే ఘడియ రానే వచ్చింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమ్మిగ్రేషన్ అయిపోయి, విమానం ఎక్కడానికి వెయిట్ చేస్తున్నప్పుడు ఏదో కలకలం వినిపించి అటువైపు చూశాడు. ఎవరో ఒక ప్రయాణీకుణ్ణి ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకుని గదమాయిస్తున్నారు, ఇక్కడ ముద్దు పెట్టడానికి వీల్లేదంటూ. బంగార్రాజు అతణ్ణి వెంటనే గుర్తు పట్టాడు.

మనం అక్కడ వున్నన్నాళ్ళు ఇల్లు పెళ్ళివారి ఇల్లులా సందడి సందడిగ, హడావిడిగా వుండేది! మనల్ని చూడ్డానికి మీవైపు వాళ్ళు నావైపు వాళ్ళు ఎవరో ఒకరు వస్తూనే వుండేవారు. వస్తూ వస్తూ ఎంబ్రాయిడరీ చేసిన జేబురుమాళ్ళు, గాజులు, పూసల గొలుసులు, పార్కర్ పెన్నులు, కఫ్ లింక్స్, బందరు లడ్డూలు, కాకినాడ కాజాలు, ఇలా ఏవో ఒకటి మనకోసం ప్రేమగా తెచ్చేవారు.