ఆకాశం మబ్బులేసినప్పుడల్లా నా మనసు శేషు మావయ్య వాళ్ళింటి వైపుకి పరుగు తీస్తుంది.
ఎందుకంటే – మా వూరు సముద్రానికి దగ్గర. కానీ మావయ్య వాళ్ళిల్లు మత్రం సముద్రానికి సరిగ్గా ఎదురుగా. వాళ్ళ మేడ మీది – ఒంటి గదిలో, ఆ పెద్ద కిటికీలోకెక్కి కూర్చుంటే సముద్రం కనిపిస్తుంది ఏ అడ్డమూ లేకుండా. ఎంత పెద్ద సముద్రమనీ, అదేంటో… విండో ఫ్రేం నిండా నిండిపోయి కళ్ళముందుకు కదిలొస్తుంది. నన్ను కాసింతైనా తడపకుండా, తాను నాలో తడుస్తూ మనసంతా మహాసముద్రమై నిండిపోతుంది. ఎంత సంబరం. అందులోను — వర్షంలో తడుస్తున్న సముద్రాన్ని చూడడమంటే… అబ్బా, ఇక చెప్పలేను!!
ఇప్పుడే రేడియో చెప్పింది మరో గంటలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలౌతుందనీ, చెప్పినట్టుగానే ఆ క్షణానికాక్షణంగా నల్లమబ్బులు దొంతర్లు దొంతర్లుగా పరుపు చుట్టలు దొర్లుతున్నాయి ఆకాశంలో.
దొడ్లో దండెం మీద ఆరేసిన బట్టల్ని గబగబా లాగేసుకొస్తోంది అమ్మ. వసారాలోకి వర్షం దంచి కొడుతుందని దడిసి, రెండు ఇనప కుంపట్లూ, వంటింట్లోకి లాక్కొస్తోంది అమ్మమ్మ. నాన్నగారేమో, వాకిలి వరండా లోని పెద్ద చెక్క కుర్చీని వెనక్కి లాగి, ప్లాస్టిక్ కవర్ కప్పే ప్రయత్నంలో వున్నారు. ముందు గదిని స్కూటర్, సైకిల్ అప్పటికే ఆక్రమించాయి.
“కుంభవృష్టిట…” చెబుతోంది అమ్మ, నాన్నతో.
“అవునట. టీవీలో కూడా చూపించారుగా! అందుకే, నాలుగు రోజుల సరిపడ కూరలు, పాలూ, తీసుకొచ్చేశాను,” తన ముందు జాగ్రత్త ప్రణాళికని అందరూ గుర్తించాలని వుంది ఆయనకి.
అమ్మ మెచ్చుకుంది. “మంచి పని చేశారండి. నేనే చెబుదామనుకున్నా… మీరే తెచ్చేశారు,” అంటూ, ఫ్రిజ్‌లో వాట్ని సర్దుతోంది.అదిగో తమ్ముడూ వచ్చేశాడు ట్యూషన్ నించి. వర్షం వస్తుందని పెందరాలే ఇల్లు చేరాడు.
ఇక మనం బయల్దేరొచ్చు… అనుకున్నా, లోలోపల. మెల్లగా చెప్పుల్లో కాళ్ళు దూర్చేస్తూ “నేను మావయ్యా వాళ్ళింటికెళ్తున్నా. ఎవరైనా ఏమైనా ఇచ్చేవుంటే ఇచ్చేసుకోండీ. పట్టుకెళ్తా” అంటూ ఓ కేకపెట్టాను.
“ఆఁ? ఇప్పుడెందుకే, మావయ్యా వాళ్ళింటికీ? ఓ పక్కనేమో పెద్ద వర్షం మొదలౌతుంటేనూ,” చోద్యంగా అంది అమ్మ.
నాన్నగారు మాత్రం నా వైపోసారి చూసి తేలిగ్గా నవ్వేస్తూ, “పోన్లే వెళ్ళనీ. హిందీ నేర్చుకునొస్తుంది,” అన్నారు. ‘థాంక్స్ నాన్నా,’ అన్నట్టుగా ఓ ధన్యవాదపు చూపొకటి విసిరాను నాన్న మీదకి. ఆయన అన్నీ తెలిసినట్టుగా నవ్వారు.
ఆయన కూడా ఒప్పుకున్నాక అమ్మకిక అభ్యంతరమేముంటుంది? తమ్ముడికీ మరదలకి ఇన్ని ఉల్లిపాయ బజ్జీలూ, ఒక గాజు సీసాలోనేమో కొత్తగా తాలింపేసిన మాగాయ పచ్చడి అందించింది. నూనెలో తేలుతోంది ఎర్రటి మాగాయ, ఇంగువ ఘాటుతో ఘుమాయించేస్తో…
పేరుకోసం అన్నట్టు ఓ రెండు టెక్స్ట్ బుక్సూ, ఒక నోట్ బుక్, బాల్‌పాయింట్ పెన్నూ, చేతి బాగ్‌లో వేసుకుని, భుజానికి తగిలించుకున్నా. మరో చేతిలో బాబూరావ్ క్లాత్ స్టోర్ వారి నారు సంచీలోనేమో అమ్మ ఇచ్చిన గూడ్స్ తీసుకుని, వన్, టూ, త్రీ… అంటూ ఉరుకురుకుగా మెట్లు దిగుతుంటే, అమ్మమ్మ మాటలు నా వెనకనించి…
“ఫోన్ చేసి వెళ్తున్నావా? వాడు చిన్న బట్టతో వుంటాడో, గోచీ కట్టుకునుంటాడో, లంగోటీలు చుట్టుకుని ఇల్లంతా కలయబెడుతుంటాడో? చూసి దడుచుకోకు..” అంటూ అరుస్తూ.
నేను వెనక్కి తిరిగి చూడనైనా చూడలేదు ఆవిడ వైపు. ఆవిడ హెచ్చరికలు నాకు పాతవే కావడంతో కొత్తగా వినేందుకేమీ వుండదు. రెండు నిముషాల్లో కోనేరు సెంటర్ కొచ్చేశాను.
“మంగినపూడి! మంగినపూడి! త్వరగా రండి. ఇదే లాస్ట్ బస్.” అరుస్తున్నాడు కండక్టర్.
ఒక్క సారిగా ఉరిమింది ఆకాశం. గట్టిగా. నేను గభాల్న బస్సెక్కేశాను. కిటికీ పక్క సీట్ ఖాళీగా కనిపిస్తే వెంటనే అందులో చతికిలబడ్డాను. రివ్వురివ్వున వీస్తూ చల్లటి గాలి ముఖానకొచ్చి తాకుతోంది. ఐసు నీళ్ళతో తడిపిన చల్లటి గంధపు లేపనాన్ని కుంచెతో ముఖానికి అలుముతున్నట్టు. ఆగకుండా ఇలా ప్రయాణిస్తూనే వుంటే ఎంత బావుణ్ణు! అనిపించింది. కానీ మామయ్య ఇల్లు గుర్తొచ్చింది.
ప్రహరీకి గోడ వుండదు. ఇంటి చుట్టూరా చెట్లే దళ్ళు. పొట్టి పొట్టి గట్టి కాండాల గుబురు పొదల మొక్కలేమో ఇంటి ముందు వైపుకి, దక్షిణ ఉత్తరాల వైపేమో ఎత్తైన అశోక వృక్షాలు. వెనక వైపు పడమరన నాలుగైదు వరసల్లో దట్టంగా సరుగుడు చెట్లు.
అది పెరడు కాదు. చిన్న పాటి పొలంలా వుంటుంది. నారుమళ్ళు పోసి, గట్లు కట్టి, కట్టల మీదేమో చిన్న పంట, చేలోనేమో పెద్ద పంట అన్నట్టు రకరకాల కూరగాయలతో బాటు కాబేజీ, మొక్క జొన్న వంటివి పండించడం భలే ముచ్చటేస్తుంది ఆ తోటమాలి పనితనానికి. ఆయన కొన్నేళ్ళు మిలిట్రీలో పని చేశాడు. అందుకే ఇంట్లో ఆ క్రమశిక్షణలోని కళ ఉట్టిపడుతూ వుంటుంది.
“మంగినపూడి, మంగినపూడి! దిగాలమ్మా!” కండక్టర్ కేకకి ఉలిక్కిపడి, తొందర తొందరగా బస్సు దిగేశా.
ఈదురు గాలి మొదలవడంతో, పాదాల మీది పరికిణీ పక్కకి తిరిగి, జెండాలా ఎగురుతోంది. పైటని నడుం చుట్టూ ఓ చుట్టు చుట్టి, రెండు జెళ్ళని వెనక్కి విసిరి, మావయ్య ఇంటి వైపు నడిచాను. రోడ్డుకి కుడి పక్కన సముద్రం.
ఎడమ వైపున చాలా దూరంగా టీచర్స్ కాలనీ. మెయిన్ వీధి మీంచి ఎడమ పక్కగా కాలనీ లోకి తారు రోడ్డు వేసి వుంది.
ఒక సారి వెనక్కి తిరిగి సముద్రం వైపు చూశాను. బలిష్టమైన ఓ పెద్ద నల్ల ఏనుగు కదలక మెదలక వొత్తిగిల్లి పడుకున్నప్పుడు, దాని ఉబ్బిన పొట్ట ఎలా కనిపిస్తుంది? అలా వుంది సముద్రం నల్లగా అతి గంభీరంగా. నిశ్చలంగా అలలు – యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికుల్లా. గాలికి తలలు విరబొసుకుంటున్న చెట్లు, తలుపులు మూసిన ఇళ్ళు, కరి మబ్బుల దివులు వర్ణం, ప్రశాంతమైన వాతావరణం, నన్నక్కడే నిలిచిపొమ్మంది. ఫెళ ఫెళ మంటూ వురుములురిమి, విసురుగాలే కనక నన్ను తోసి వుండకపోతే అలానే శిలనయి పోయి అక్కణ్నే వుండిపోయేదాన్నేమో.
ఇక జాగు లేకుండా, గబగబా మావయ్యా వాళ్ళింటికి నడిచా. ఎంత బావుంది. ఒంటరి నడక. తోడుగా ఈదురు గాలి. నా వెనక అండగా సముద్రం. పట్టపగలు రాత్రి అయిన క్షణం. నల్లటి ఆకాశపు గొడుగు కింద ఇలా వూరేగడం ఎంత ప్రియమైన ఉత్సవమని, నాకు.
అటు, ఇటు – రెండు గుంజలకు బిగించిన వెదురు బద్దల గేట్ తీసుకుని లోపలకడుగుపెట్టా. పెద్ద స్థలంలో చిన్న డాబా ఇల్లు. మేడ మీదకెళ్ళేందుకు వీలుగా రెయిలింగ్ లేని మెట్లు. తెల్లసున్నం వేసిన సిమెంట్ గోడలు. మేడ మీద కొత్తగా వేసిన గది కేమో, ఇంకా ప్లాస్టరింగ్ చేయకపోడంతో – ఇటుక రాళ్ళు బయటకి కనిపిస్తున్నాయి. గేట్ దగ్గర్నించీ, దర్వాజా గడప వరకు పరచిన నాప రాళ్ళ కాలి బాట మీద ఇలా పాదం మోపానో లేదో, ఠప్, ఠప్, అంటూ పెద్ద ఉసిరికాయంత సైజులో చినుకు వెనక చినుకుచ్చి పడి, సరిగ్గా నేను గడప దాటి లోపలకొచ్చిన క్షణాల్లో ఊపందేసుకుని పెద్ద శబ్దాలు చేసుకుంటూ, ఉరుములూ, మెరుపులతో వర్షం జోరందుకుపోయింది.
భలే నవ్వొచ్చేసింది. నిశ్శబ్దంగా లోపలకడుగేసి చూశా. నేనెప్పుడూ అపురూపంగా చూసే దృశ్యమే అది.
శేషు మావయ్య ఇంటికి రావాలని నేను తరచూ కోరుకోడానికి గల ఇంకో కారణం – ఇదే.
హాల్లో అత్తయ్యా మావయ్యా నల్ల బల్ల ఉయ్యాల మీద కూర్చున్నారు. ఒకరెదురుగా ఒకరు. ఆవిడ సన్నజాజుల మాల కడుతోంది. మావయ్య పూల మొగ్గల్ని జోడించి అందిస్తున్నాడు. చాలా దీక్షగా. ఎంత శ్రద్ధ మావయ్యకి. రోజూ మేడెక్కి పూలు కోసుకొస్తాడు. ఎండా కాలాల్లో మల్లెపూలు, కనకాంబరాలు పది మరువం రెమ్మలూ. ఇదీ ఆ సముద్రంలా ఎప్పుడొచ్చినా మనసు నిండా నిండిపోయే చిత్రమే.
“అటు రెండూ, ఇటు రెండూ చాలన్నాను కదండీ. నాల్గు మొగ్గలు పెడితే, మరీ ముద్దగా అయిపోతుంది దండ. అందఁవుండదు.” అత్తయ్య మాటలకి మావయ్య నవ్వుతాడు. “ఎలా అల్లినా నీ జడలో దానికి గొప్ప అందమొస్తుంది!” అని అంటాడు మావయ్య అత్తయ్య వైపు ఆరాధనగా చూస్తూ! ఆ మాటలకు ఆవిడ మొహం బంగారు రంగులో వెలిగిపోతుంది.
“ఏమందే, మీ అత్తా? నన్నడిగిందా? మీ మావేం చేస్తున్నాడు? ఆఁ ఏం చేస్తుంటాడూ! ఆ వుయ్యాల కెదురుగా కుర్చీ వేసుకుని, వెర్రి నాగన్న అలా కూర్చునుంటాడు. చీకటి పడుతోందిగా, మేడెక్కి పూలు కోసుకొని వచ్చుంటాడు. ఈయన అందీడం ఆవిడ మాల అల్లడం. ఆ ఉయ్యాల బల్ల మీదే ఇకఇకలు పకపకలు.” అమ్మమ్మ మాటలకి జవాబుగా నవ్వి వూరుకోమని అమ్మ చెప్పింది.
నేనిక్కడికి నిజంగా హిందీ చెప్పించుకోడం కోసం మాత్రమే రాను. అదొక వంక మాత్రమే. నేను సముద్రాన్ని చూడటం కోసవేఁ వస్తాను. ఈ రెండు సముద్రాలనీ…
సంచిలోంచి మాగాయి సీసా తీస్తుంటే, ప్లాస్టిక్ కాగితం చప్పుడుకి అత్త తల తిప్పి గుమ్మం వైపు చూసింది. “రావే, అమ్ముడూ, రా. నీ గురించి ఇప్పుడే మావయ్యతో అంటున్నా. వారమైపోతోంది. ఎక్కడా పత్తా లేదే పిల్ల అని.” అంటూ ఇంత వెలుగైన మోముతో చూసింది.
పసుపు రాసుకున్న నుదుటి మీద ఇంత కుంకుమ బొట్టు, ముక్కుకి మూడు రాళ్ళ ముక్కు పుడక, మెడలో నిండైన బంగారం తళుక్కున మెరుస్తూ, అత్తయ్య కళకళలాడుతూ వుంటుంది, ఏ వేళప్పుడు చూసినా. ఏ వేళా, జుట్టు చెదరనీదు, కట్టుకున్న చీర జరీ అంచు ముడత పడనీదు. అప్పుడే తాజాగా తయారై, ఎక్కడికో వెళ్ళేందుకు సిధ్ధమై కూర్చున్నట్టు అనిపిస్తుంది. అంత ఫ్రెష్ గా ఎలావుంటుందో?
“ఏముందీ? దానికి పనా, పాడా? ఇంటెడు చాకిరీ మొగుడు మీద వదిలి, ఆసమ్మ ఓసమ్మ కబుర్లాడటమేగా ఏ పొద్దూ! దాన్ని మహల్లో రాణిలా కుర్చోపెడ్తాడు ఏవిటో, అర్ధం కాదు. ఇరవైనాలుగ్గంటలూ మొహంలో మొహం పెట్టి మాట్లాడుకునే మాటలేం చస్తాయో ఇద్దరికీ తెలీదు. ఏవిటో, మాయదారి గోల…” అమ్మమ్మ అమ్మతో అనడం.
“పోన్లే అమ్మా. పాపం, మరదలకి రెస్ట్ కావాలని అన్నారు కదా డాక్టర్లు. అందుకని, కూర్చోబెడుతున్నాడేమోలే.” ఆవిణ్ణి ఓదార్చే ప్రయత్నంగా అమ్మ.
అమ్మమ్మ వెంటనే కయ్యనేది. “ఏం బాగోకపోడమే, కమలా? నువ్వూ అలానే వెనకేసుకొస్తావ్ వాణ్ణి? ఎప్పుడో పదేళ్ళ కిందట గుండెకి చిల్లుందేమో అని అనుమానపడ్డారు డాక్టర్లు. ఆ తర్వాత పరీక్షలూ అవీ చేసి, బాగానే వుందనీ చెప్పలా? మరేం రోగం చెప్పు, ఇంటి పని చేసుకోడానికి? స్కూల్ నించి వస్తాడా? అంగవస్త్రం చుడ్తాడు. వెధవ. చీపురు పట్టుకుని వీధి గుమ్మం దగ్గర్నించీ, దొడ్డి గుమ్మం దాకా నున్నగా చిమ్మి, నీళ్ళు జల్లి, ఆ మీదట పిలుస్తాడు నన్ను. ‘అది ఒంగకూడదు కానీ, నువ్వొచ్చి కాస్త ముగ్గేసి పోమ్మా’ అంటూ. నాకు మహ వొళ్ళు మండిపోతుందె కమలా. నువ్వేమన్నా అను.”
“మాటల్లోనే వచ్చావే! నీకు నూరేళ్ళాయుష్షు.” అంటున్న మావయ్య వైపు చూశాను.
అమ్మమ్మ అన్నట్టే ఆయన వెలిసిపోయిన ఎర్ర టవలొకటి చుట్టుకుని కనిపించాడు. బలిష్టమైన శరీరం. ఎత్తుకు తగ్గ లావు. మిలిట్రీ క్రాఫ్, మెడలో జంధ్యాన్ని పొట్టిగా మడిచి, చెవులకి చుట్టుకుని, నుదుటి మీద చిన్న కుంకుమ బొట్టుతో, బనీనైనా లేని ఆ అవతారం. అందగాడే శేషు మామయ్య. మిలిట్రీ సర్వీసు తర్వాత బెజవాడ స్కూల్లో హిందీ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. రోజూ పొద్దునా సాయంత్రం గంట ప్రయాణం చేసి వస్తాడు. అప్పుడప్పుడు ఆలస్యమౌతుంది. అలాటప్పుడు అత్తయ్య నన్ను తోడుగా వుండమంటుంది.