ఇందాకట్నుండీ అతను నాకేసే చూస్తున్నాడని గమనిస్తూనే ఉన్నాను. కౌంటరు దగ్గర కష్టమర్లు బారులు తీరి ఉన్నారు. నా పనిలో ఉన్నా అతను నాకేసే చూస్తున్నాడనిపించి నేనూ మధ్య మధ్యలో అతనికేసి చూసీ చూడనట్లు నటిస్తున్నాను. అతనికి సుమారు ముప్పై ఏళ్ళు దాటి ఉండచ్చు. వాలకం చూస్తే మాత్రం నలభయ్యేళ్ళు దాటినట్లుంది. మాసిన టీ షర్టూ, వెలిసిన జీన్స్ పాంటూ వేసుకుని, బవిరి గెడ్డంతో అతన్ని చూస్తే ఎందుకో అదోలా అనిపించింది.
నేను రెండ్రోజుల క్రితమే ఈ స్టార్‌బక్స్‌లో బరిస్టాగా చేరాను. అండర్ గ్రాడ్యుయేట్ అయ్యాక ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మాస్టర్స్ చదవాలని అనిపించినా నా ఆర్థిక పరిస్థితుల వల్ల జీతం తక్కువయినా ఒక చిన్న కంపెనీలో చేరాను. అమ్మకి వచ్చే జీతం వల్ల ఇల్లు నెట్టుకొస్తున్నాం. ఇంకా తమ్ముడి చదువు కూడా ఉంది. మా అమ్మా, నాన్నా విడాకులు తీసుకొని ఎనిమిదేళ్ళు దాటింది. నాన్న వల్ల అమ్మకి ఆర్థికంగా ఏమీ మిగల్లేదు. ఉన్న ఇల్లు కాస్తా ఇచ్చేసి ఇద్దరూ తెగ తెంపులు చేసేసుకున్నారు. ఆర్నెల్లు ఉద్యోగం సాఫీగానే సాగింది. హఠాత్తుగా కంపెనీ బాగా చెయ్యడం లేదంటూ సగానికి పైగా ఉద్యోగుల్ని పని లోంచి తీసేశారు. నాకయితే కేవలం ఒక నెల జీతం మాత్రమే ఇచ్చారు. మరో ఉద్యోగం వచ్చే లోపల ఖాళీగా ఉండడం ఎందుకని ఈ స్టార్‌బక్స్‌లో చేరాను. ఈ స్టర్‌బక్స్‌లో చేరడానికి నాకున్న ఒక మూఢ నమ్మకం కూడా ఒక కారణం. అండర్‌గ్రాడ్లో ఉండగా ప్రతీ పరీక్ష ముందూ స్టార్‌బక్స్‌లోకాఫీ తాగి వెళ్ళినప్పుడల్లా పరీక్ష అదరగొట్టేసేదాన్ని. డిగ్రీ అయ్యి మొదటి ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందూ ఇలాగే చేశాను. ఉద్యోగం వచ్చేసింది. అప్పట్నుండీ నాకిదొక మూఢ నమ్మకంగా బలపడిపోయింది.
ఉద్యోగం పోయిన వారం రోజులు ఇంట్లో ఉండాలంటే చచ్చేటంత చావులా అనిపించేది. దేని మీదా ధ్యాస కుదరక నిరాశగా అనిపించేది. అందుకే ఇక్కడ పని కుదిరాను. ఆ బవిరి గెడ్డం అతన్ని నిన్ననే గమనించాను. ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిపించుకొని చూడ్డానికి కాస్త వికారంగానే అనిపించాడు. చేతుల మీదా అక్కడక్కడ ట్యాటూలు వేయించుకున్న వాళ్ళని చూశాను తప్ప ఇలా ఒళ్ళంతా రంగురంగుల ట్యాటూలతో చూడ్డం ఇదే మొదటి సారి. ఒక్క మొహంలో కళ్ళూ, ముక్కున్న భాగం తప్ప వళ్ళంతా రంగులే! దానికి తోడు మిడి గుడ్లేసుకొని తదేకంగా చూస్తాడు.
నేను ఇవాళ వచ్చేసరికే ఒక మూల కూర్చుని కనిపించాడు. ఎదురుగా ల్యాప్‌టాప్ పెట్టుకొని ఒక చేత్తే కాఫీ తాగుతూ పని చేసుకున్నట్లు నటిస్తాడు. ఒకటి రెండు సార్లు నాకేసి చూసి నవ్వాడు. నేనూ నవ్వాను, కానీ పలకరించలేదు. మాట్లాడ్డానికి ఒకటి రెండు సార్లు ప్రయత్నించాడు కానీ కష్టమర్లు ఉండడంతో పనిలో పడ్డట్టు నటించాను. అతనెవరని నా తోటి బారిస్టాని అడిగాను. ఈ మధ్యనే తనూ చూస్తున్నాననీ, రోజంతా ల్యాప్‌టాప్ ముందేసుకొని కూర్చుంటాడని మాత్రం చెప్పాడు. గంటకోసారి కాఫీ రీఫిల్ అంటూ కౌంటరు దగ్గరకొచ్చి నా కేసి చూసి నవ్వుతాడు. మాట్లాడ్డానికి ప్రయత్నిస్తాడు. నా కెందుకో అతనంటే బెరుకు, భయం. నవ్వేసి పని ఉన్నట్లు అటూ ఇటూ తిరుగుతూ తప్పించుకునే దాన్ని.
ఓ రోజు నాకోసం ఎడ్వర్డ్ వచ్చాడు. అతను రాగానే నేను పనిలోంచి బయటకి వచ్చేసి అతనితో వెళ్ళడం ఆ బవిరిగెడ్డం అతను చూశాడు. నాకేసే చూస్తున్నాడని గాజు అద్దం లోంచి కనిపిస్తూనే ఉంది. ఎడ్వర్డు నాకు నా కొలీగ్ ద్వారా పరిచయం. అతను నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. రెండు మూడు సార్లు మా ఇంటికి వచ్చాడు కూడా. మాటల్లో అతనికి చాలా డబ్బుందని అర్థమయ్యింది. నాకు డబ్బులు కావాలంటే అతను సాయం చేస్తానన్నాడు. అలా మొదలయినా పరిచయం కాస్త ఆకర్షణగా మారింది. అమ్మకి అతను నచ్చలేదు. కారణం వయసులో అతను నాకంటే చాలా పెద్ద. నాకయితే అతనికి డబ్బు ఉంది కాబట్టి అతనితో ఉండడం వలన వచ్చిన నష్టం ఏమీ కనిపించలేదు. అతని దగ్గర రెండు బి.ఎం.డబ్ల్యూ కార్లున్నాయని వాడుకోమని నాకిచ్చాడు. స్టార్‌బక్స్ ఉద్యోగం మానేయమని చాలా సార్లు పోరాడు. ఎడ్వర్డ్ అంటే ఇష్టమున్నా ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండడం నాకయితే ఇష్టం లేదు. అదే చెప్పాను.
మర్నాడు ఉదయం స్టార్‌బక్స్‌కి వెళ్ళినప్పుడు నన్ను చూడగానే నిన్న వచ్చినతను ఎవరని అడిగాడు. నా బాయ్‌ఫ్రెండ్ అని చెప్పి, నీకెందుకు ఈ వివరాలన్నీ అని చీవాట్లేసి నీ పని చూసుకో అని గట్టిగా చెప్పాను. ఆ తరువాత అతను మాట్లాడ్డం మానేశాడు. కాఫీ కావల్సినా నా తోటి బారిస్టాలనే అడగడం గమనించాను.
ఓ రోజు ఎడ్వర్డ్ నాకోసం వచ్చాడు. నేను అతను రాగానే అతని కారు దగ్గరకి వెళ్ళాను. నా కోసం డైమండ్ రింగ్ కొన్నానని గిఫ్ట్ అంటూ చూపించాడు. ఒక్కసారి అతన్ని హత్తుకోగానే నన్ను ముద్దు పెట్టుకున్నాడు. ఇదంతా ఆ బవిరిగెడ్డం అతను చూడ్డం నాకు ఆ గాజు తలుపులోంచి కనిపిస్తూనే ఉంది. నేనూ కావాలనే ఎడ్వర్డ్‌ని గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. అతను అది చూసి చేతిలో ఉన్న పింగాణీ కప్పుని బలంగా విసిరేశాడు. తలుపుకి తగిలి పెద్ద చప్పుడయ్యింది. అక్కడున్న అందరూ కంగారు పడ్డారు. నేను లోపలకొచ్చి చూసే సరికి అందరికీ సారీ చెబుతూ ల్యాప్‌టాప్ తీసుకొని గబగబా నడుచుకుంటూ వెళిపోవడం చూశాను.
నా తోటి బారిస్టా ఏమయ్యిందోనని కంగారు పడ్డాడు. గత నాలుగు రోజులుగా నేనంటే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడనీ, బహుశా నేనంటే ఇష్టపడుతున్నాడేమోనని చెబుతూ, ఎడ్వర్డ్‌తో నేను వెళ్ళడం చూసి తట్టుకోలేక అలా కప్పు విసిరేసిండచ్చేమోనని చెప్పాను. నే చెప్పింది నమ్మలేనన్నట్లు తలూపుతూ నవ్వేశాడు నా కొలీగ్!
ఆ తరువాత ఆ బవిరి గెడ్డం అతన్ని నేను నే పనిచేసే స్టార్‌బక్స్‌లో చూళ్ళేదు. ఈలోగా నా ఉద్యోగ ప్రయత్నాలూ ముమ్మరం చేశాను. చూస్తూండగా నెల గడిచి పోయింది. రెండు మూడు కంపెనీల్లో ఇంటర్‌వ్యూలు కూడా వెళ్ళాను. అవేమీ రాలేదు. ఆ రెండు ఇంటర్‌వ్యూలకీ వెళ్ళేముందు నా మూఢనమ్మకం అతిక్రమించడం వలన రాలేదన్న అభిప్రాయం వచ్చింది. ఈ సారి ఇంటర్వ్యూకి వెళ్ళేముందు ఎప్పటిలాగే స్టార్‌బక్స్‌కి వెళ్ళి కాఫీ తాగి వెళదామని లారెన్స్ ఎక్స్‌ప్రెస్ వే దగ్గరున్న స్టర్‌బక్స్‌కి వెళ్ళాను. కారు పార్క్ చేసి లోపలకి వెళుతూండగా ఆ పచ్చ బొట్క బవిరి గెడ్డం అతన్ని చూసి గతుక్కుమన్నాను. అక్కడ ఎవరితో మాట్లాడుతూ కనిపించాడు. పొద్దున్నే వీడిక్కడా దాపురించాడేవిటి అనుకుంటూ వెనుదిరిగాను. ఇవాళ ఇంటర్‌వ్యూ అయినట్లే అనిపించింది. ఉద్యోగం రాదన్న ఆలోచన ఇంటర్‌వ్యూకి వెళ్ళకుండానే మొదలయ్యింది. వాడుంటే ఏవిటి? వెళ్ళి కాఫీ తెచ్చుకుంటే పోయేది కాదా? అని కూడా అనిపించింది. ఎందుకో అపశకునంలా తోచి వెనక్కి వచ్చేశాను. ఒక్కోసారి అంతే!
అయిష్టంగానే ఇంటర్‌వ్యూకి వెళ్ళాను. ఉదయం పదింటి నుండి మధ్యాన్నం వరకూ ఉంది. ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వరసగా వాయించి పడేస్తున్నారు. ప్రశ్నలే ప్రశ్నలు. ఉద్యోగం ఇచ్చేవాడికి అప్ప్లై చేసేవాడు లోకువ. చివర్న ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంటుని కలవాల్సుంటుందని ఓ అరగంట సేపు కూర్చోబెట్టారు. ఇంటర్వ్యూ ఓ మాదిరిగా చేశాను. కొన్ని కష్టమైనవి అడిగారు. ప్రోగ్రామింగ్ ప్రశ్నలు పరవాలేదు, బాగానే చెప్పాను. మిగతా లాజిక్ ప్రశ్నలంటూ చికాకు పెట్టారు. తెలుసున్నవేమో చెప్పాను.
మొత్తానికి ఆ వైస్ ప్రెసిడెంట్ కాస్తా వచ్చాడు. అతన్ని చూసి ఒక్కసారి గతుక్కుమన్నాను. అచ్చం అతను బవిరిగెడ్డం వాడిలాగే ఉన్నాడు. అచ్చం ఏమిటి, అతనే! కాకపోతే మంచి డ్రెస్ షర్టూ, సూటు వేసుకొని కాస్త హుందాగా కనిపించాడు. అతనూ నన్ను చూడగానే షాక్ తిన్నట్లున్నాడు. అప్రయత్నంగా ఇద్దరం షేక్ హాండ్ ఇచ్చుకున్నాం. నేనూ గుర్తుపెట్టాను కానీ వేంటనే చూసి భయపడ్డాను.
నా కేసి ఆశ్చర్యంగా చూస్తూ – “నువ్వు లాస్ ఆల్టోస్ స్టార్‌బక్స్‌లో పని చేస్తావు కదూ?” అని అడిగాడు. అవునని తలూపాను.
అసలే ఇంటర్‌వ్యూ చెత్తలా జరిగిందన్న బాధలో ఉన్నాను. చివర్లో వీడు దాపురించాడు. అన్నింటికీ పొడి పొడి జవాబులు ఇచ్చాను. మొదట్లో కంపెనీ గురించి చెప్పి, ఇంటర్‌వ్యూ ఎలా జరిగిందని అడిగాడు. బెరుగ్గా సమాధానం చెప్పానంతే! నా గురించి ఇంకేమీ అడక్కుండా సరాసరి ఉద్యోగం గురించి అడిగాడు. అన్నింటికీ భయపడుతూనే సమాధానాలు చెప్పాను. వచ్చేస్తూండగా, వెనక్కి పిలిచాడు.
“నిన్నొకటి అడగచ్చా…?” ఏవిటన్నట్లు తలూపాను.
“ఐ యాం సారీ! ఆ రోజు నిన్ను ఒకతనితో చూసి నేను ఆవేశంగా కోపం చూపించాను. నేనెందుకు అలా ప్రవర్తించానో నీకు చెబుదామనుకున్నాను కానీ నా ప్రవర్తన చూశాక సిగ్గుపడి మరలా అక్కడికి రాలేదు. ముందు నా గురించి నీకు చెప్పాలి. నేను ఇక్కడే పుట్టి పెరిగినా మాది కొలంబియా దేశం. మా అమ్మకి నేనొక్కణ్ణే కొడుకుని. మాకు ఒక చెల్లెలుండేది. తను యాక్సిడెంటులో పోయింది. నిన్ను చూడగానే మా చెల్లెలి పోలికలు కనిపించాయి. నీకు చెబుదామని చాలా సార్లు ప్రయత్నించాను. ఎందుకో నువ్వు నాతో మాట్లాడ్డం ఇష్టపడడం లేదన్నది గ్రహించి చెప్పలేదు. ఈ కంపెనీ ఫౌండర్లలో నేనూ ఒకణ్ణి. ప్రతీరోజూ ఆ స్టార్‌బక్సే నా అడ్డా. అక్కడే పని చేసుకునేవాణ్ణి. కొలంబియా నుండి వచ్చాం కదా, మా అమ్మ మంచి కాఫీ చేసేది. చదువుకున్నన్నాళ్ళూ ఇంటినిండా కమ్మటి కాఫీ వాసన ఘుమఘుమ లాడేది. ఈ మధ్య అమ్మకి సుస్తీ చేసింది. ఇక్కడయితే ఎవరి గోలా లేకుండా ప్రశాంతంగా పని చేసుకోవచ్చని స్టార్‌బక్స్‌కి వచ్చేవాణ్ణి…” అంటూ తలదించుకునే తన గురించి చెప్పాడు.
అతను చెప్పినదంతా విని నేను తప్పుగా అర్థం చేసుకున్నందకు బాధపడ్డాను. నా పొరపాటు గురించీ పైకి చెప్పాను. అతన్ని చూసిన ఆశ్చర్యంలో అతని పేరు అడగడం మర్చిపోయాను. అతను మొదట చెప్పినా బుర్రకెక్కలేదు. వచ్చేస్తూండగా అతని పేరు అడిగాను. ఫెర్నాండో ఎస్పెరాంజా అని చెప్పాడు.
వెళుతూండగా రేపు సాయంత్రం లాస్ ఆల్టోస్ స్టార్‌బక్స్‌లో రమ్మనమని అన్నాడు. అలాగేనని చెప్పి వచ్చేశాను. ఇంటికి రాగానే అమ్మకి జరిగింది చెప్పాను. ఉద్యోగం వస్తుందన్న నమ్మకం లేదన్నట్లుగా చెప్పాను. అయినా సరే మర్నాడు స్టర్‌బక్స్‌కి వెళ్ళి కలవమని అమ్మ అంది.
చెప్పినట్లుగానే మర్నాడు వెళ్ళాను. నేను పని చేసినప్పటి బారిస్టాలు ఎవరూ కనిపించలేదు. అనీ కొత్త ముఖాలే కనిపించాయి. నేను వెళ్ళిన పది నిమిషాలకి అతను వచ్చాడు.
నాకు ఉద్యోగం వచ్చిందంటూ ఆఫర్ లెటర్ ఇచ్చాడు. నా ఆనందానికి హద్దుల్లేవు. ఒక్కసారి అతన్ని కావలించుకున్నాను.
కాసేపు మాట్లాడాక అతను వెళ్ళాలి మరలా కలుద్దామంటూ లేచాడు. వెళుతూ, “ నిన్నొకటి అడుగుతాను, ఏమనుకోకు. నీ కోసం తరచూ వచ్చే అతను ఎవరు?” అని ప్రశ్నించాడు.
“అతనా! ఎడ్వర్డని నా కొలీగ్ ఫ్రెండ్. నేనంటే ఇష్టమంటూ వెంట పడ్డాడు. పెద్ద మిలియనీరు. డబ్బుంది కదా అని నేనూ కొంతకాలం కలిసి తిరిగాను. అతనికి పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదని అమ్మకి తెలిసి వద్దంది. నాకూ అతని ప్రవర్తన నచ్చక అతనకి బై చెప్పేశాను. నన్నొదిలి ఇప్పుడు మరొక అమ్మాయిని పట్టుకున్నాడు.”
“సారీ! అతను నీతో వెళ్ళడం చూసి తట్టుకోలేక ఆరోజు ఎదురుగా ఉన్న కప్పు విసిరేశాను. టేబిల్ మీదున్న లాప్‌టాప్ క్రింద పడి పాడయ్యింది. అది తలచుకుంటేనే సిగ్గుగా ఉంది. నువ్వు అతనితో లేవని తెలిసి ప్రస్తుతం సంతోషంగా ఉంది.”
“నువ్వు కోప్పడ్డం నాకూ ఆశ్చర్యం కలిగించింది. నేనూ నీ గురించి పొరబడ్డాను…”
“అది నీ తప్పు కాదు. అంతా నాదే!”
“అదేవిటి?”
“అతను నీతో చనువుగా ఉండడం తట్టుకోలేక పోయాను.”
“ఎందుకు?”
“ఎందుకంటే… అతను మా అమ్మని వదిలేసిన్ మాజీ భర్త. మమ్మల్ని గాలికొదిలేసిన వ్యక్తి.” అనేసి పళ్ళు కొరుక్కుంటూ గబగబా వెనక్కి కూడా చూడకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళిపోయాడు. మా నాన్నా మమ్మల్ని వదిలేయడం నాకింకా గుర్తుంది.
ఒక్కసారి తల దిమ్ముగా అయిపోయింది. కాఫీ తాగుదామని లోపలకి వెళ్ళాను.
ఉద్యోగం వచ్చిందని అమ్మకి వేంటనే ఫోన్ చేసి చెప్పాను. అమ్మ సంతోషించింది. జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పాను. ఫోన్ పెట్టేస్తూండగా అతని పేరేంటని అమ్మ అడిగింది.
“ఫెర్నాండో ఎస్పరాంజా,” అని చెప్పాను. ఎస్పరాంజా అంటే అర్థం తెలుసా అని అడిగింది. స్కూల్లో స్పాన్సిష్ చదివాను కానీ ఒక్కటంటే ఒక్కటి గుర్తులేదు. ఫోన్ పెట్టేశాక మొబైల్లో ఎస్పరాంజా అంటే అర్థం కోసం వెతికాను. చూసి నవ్వుకున్నాను. నా కాఫీ రెడీ అయ్యిందంటూ నా పేరు బారిస్టా అరవడం విన్నాను. కమ్మటి కాఫీ ఘుమఘుమలు నషాళానికి అంటాయి.
నిజానికి ఇన్నాళ్ళూ ఈ స్టర్‌బక్స్ నా హోప్.
ఇదొక సూపర్‌స్టిషన్! కాదు ఇది నా పాలిట ఎస్పరాంజా!