తలుపు తోసుకొని గ్రెటా వస్తూంటే చిన్న ఈల వేశాను.
పట్టనట్లుగానే తల తిప్పుకొని ఎప్పుడూ తను కూర్చునే చోటుకే వెళ్ళింది. గ్రెటా రావడం దూరంగా గ్లాస్ డోరు నుండి గమనిస్తూనే ఉన్నాను. బయట స్టాండుకి తాళం వేసిన నా సైకిలు చూసింది. నేను లోపల ఉన్నాననడానికి అదే ఆమెకు గుర్తు. అందుకే చూసీ చూడనట్లుగా ప్రవర్తించింది.
గ్రెటా అంత పెద్ద అందగత్తేం కాదు. కానీ ఆమె మొహంలో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది. ముఖ్యంగా నవ్వుతుంటే! వయసు నలభై ఉండచ్చు. ఒకసారి నీ వయసు నలభై ఉండచ్చు కదూ అని అడిగితే కొట్టినంత పని చేసింది. మిసమిసలాడుతూ ఉన్న గ్రెటాకి నప్పనిది ఆమె జుట్టుకేసుకున్న రంగే! తెల్ల రంగు మొహమ్మీద నల్ల టోపీ పెట్టుకున్నట్లుంటుంది. అదే మరొకసారి అంటే ఒక్క తోపు తోసింది. నేను తనని వేళాకోళం చేస్తానన్న విషయం ఆమె గ్రహించి నాతో తక్కువగా మాట్లాడేది. రెండు వారాల క్రితం మనం డేటింగ్ చేద్దామా అని అడిగేసరికి తిట్టింది. ఆ తరువాత మాట్లాడ్డం మానేసింది.
నేను ఉన్నానని తెలిసినా పట్టించుకోకుండా తను ఎప్పుడూ కూర్చునే చోటుకే వెళ్ళి కూర్చునేది.
నిజానికి తనతో మాట్లాడ్డానికి సమయమూ ఉండేది కాదు. రోజూ మధ్యాన్నం రెండింటికల్లా వచ్చేది. ఆమె వచ్చిన కాసేపటికే నలుగురైదుగురు పిల్లలు బిలబిలా వచ్చేసేవారు. వాళ్ళకి ట్యూషన్ చెప్పేది. సాయంత్రం ఆరింటి వరకూ అక్కడే ఉండి హోం వర్కులూ అవీ దగ్గరుండి చేయించేది. పాఠం మధ్యలో కాఫీ ఆర్డరిచ్చేది.
అసలు నాకు పరిచయం అయ్యింది కూడా గ్రెటా ఇచ్చిన విచిత్రమైన కాఫీ ఆర్డరు విన్నాకే. మొదటి సారి కలిసినప్పుడు గ్రెటా ఆర్డరు విని కళ్ళు తేలేశాను.
“నాన్ ఫ్యాట్ ఫ్రాపచినో విత్ విప్డ్ క్రీమ్ అండ్ చాకొలేట్ సాస్”.
ముందు నాన్ ఫ్యాట్ మినహాయిస్తే మిగతాదంతా వంద శాతం కొవ్వే! ఇదొక్కటే కాదు, ఆమె ఏ ఆర్డరిచ్చినా ఇలా విచిత్రంగానే ఉండేది. ఆమెను ఆట పట్టించడం కోసం ఎవరైనా కొత్త కస్టమర్లు వస్తే – ఇది ట్రై చెయ్యమని చెప్పేవాణ్ణి. వాళ్ళూ గట్టిగా నవ్వేసేవారు. అది విని నాకేసి గుర్రుగా చూసేది.
నేను ఇంతకుముందు వారానికి రెండు మూడు రోజులు కుపర్టినో స్టార్‌బక్స్‌లో పని చేసేవాణ్ణి. కానీ ఈ స్టార్‌బక్స్‌కి రాకతప్పేది కాదు నా పాత గర్ల్ ఫ్రెండ్ జెన్నీ కోసం. జెన్నీ ఇక్కడే ఒక స్కూల్లో టీచరుగా పనిచేసేది. నేను అందరిలా ప్రతీ రోజూ ఉద్యోగం చేసేవాణ్ణి కాదు. ఎప్పుడైనా బుద్ధి పుడితే చిన్న చిన్న ఉద్యోగాలు అవీ, నాకు ఇబ్బందిలేదని అనిపించినప్పుడే. మిగతా రోజుల్లో బైక్ మారథాన్లు. నాకు సైకిల్ తొక్కడమంటే సరదా. సరదా కాదు – ఒక రకమైన పిచ్చి. నాలాగ బైక్ మారథాన్లు చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. మేము లాస్ ఏన్జిలిస్ వరకూ బైకు మీద వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ స్టార్‌బక్స్ దగ్గరే ఒక సైకిల్ షాపు కూడా వుంది. నేనక్కడ కూడా పని కుదుర్చుకున్నాను. వాడు నాకు వారంలో రెండు మూడు రోజులకే పనికి రమ్మనేవాడు. మిగతా రోజుల్లో జెన్నీ కోసం ఈ స్టార్‌బక్స్ వచ్చి సమయం వెళ్ళబుచ్చేవాణ్ణి. ఇక్కడే టెంపరరీగా పని చేయచ్చు కదా అని జెన్నీ అంటే చేరాను. అలా నాకు గ్రెటా పరిచయమయ్యింది.
ఇవాళ ఇంకా డెనిస్ రాలేదు. రావడానికి కాస్త సమయం పడుతుందని తెలుసు. డెనిస్‌తో కూడా నా పరిచయం ఇక్కడే జరిగింది. తను కూడా దగ్గర్లోనే పనిచేస్తుంది. పరిచయం పెరగడం, జెన్నీకీ నాకు తగాదాలు కావడం విడిపోవడం అన్ని అయ్యాయి. క్రితం సారి నేను జెన్నీతో రావడం గ్రెటా చూసింది. నేను తప్పు చేస్తున్నట్లుగా తలూపింది కానీ మాట్లాడలేదు. పిల్లలు రాగానే తన గోల తనదే!
లేచి తన టేబుల్ దగ్గరికి వెళ్ళాను. నేనూ, డెనిస్ పెళ్ళి చేసుకుంటున్నామనీ చెప్పాను. వింది కానీ ఏమీ జవాబివ్వలేదు. జెన్నీతో రిలేషన్ లాంటిది కాదనీ, డెనిస్ మంచిదని చెప్పాను. అంతకు ముందు విష్ చెయ్యలేదు కానీ ఇప్పుడు మాత్రం జవాబిచ్చింది.
“మంచితనం నురగలాంటిది. కష్టాలొచ్చినప్పుడే పైకి తేలుతుంది, అందులో ఉండే సారాన్ని బట్టి…” అనేసి పిల్లల హోంవర్కు చేయించడంలో మునిగిపోయింది. పెళ్ళికి పిలుస్తాననీ, రమ్మనమనీ చెప్పాను. అలాగే అన్నట్లు నవ్వింది. నాన్ ఫ్యాట్ ఫ్రాపచినో విత్ విప్డ్ క్రీమ్ అండ్ చాకొలేట్ సాస్ – ప్రత్యేకంగా తనకోసం స్టార్‌బక్స్ నుండి ఆర్డరిస్తాననీ చెప్పాను.
ఆ తరువాత నేను స్టార్‌బక్స్‌కి రాలేదు. పెళ్ళి ఏర్పాటు పనుల్లో పడిపోయాను. నిజానికి ఇటు వైపు కూడా రాలేదు. ఒక్కసారి లాస్ ఆల్టోస్ వరకూ వచ్చాను కానీ, ఇక్కడికి రాలేదు. అది కూడా మా సైక్లింగ్ గ్రూప్‌లో ఒకతన్ని ఫుట్‌హిల్ ఎక్స్‌ప్రెస్‌వే మీద కారొచ్చి గుద్దేసింది. అతను అక్కడికక్కడే చనిపోయాడు. మెమోరియల్ సర్వీస్ కోసం వచ్చాను. గ్రెటాని మరోసారి కలవచ్చులే అనుకొని వెళిపోయాను.
పెళ్ళి దగ్గర పడుతూండగా నేను పనిచేసిన సైకిల్ షాపు వాడినీ, గ్రెటాని పిలవడానికి నేనూ, డెనిస్ క్యుపర్టినో వచ్చాం. ఎప్పటిలాగే స్టార్‌బక్స్‌కి వెళితే అక్కడ గ్రెటా కనిపించలేదు. గత రెండు వారాలుగా రావడం లేదనీ చెప్పారు. నా దగ్గర గ్రెటా నంబరు లేకపోవడంతో అక్కడున్న బరిస్టాని అడిగాను. అందులో ఒకమ్మాయి నాకు తెలుసు. గ్రెటా నంబరు ఇచ్చింది. కాల్ చేశాను కానీ అది మెసేజ్‌కి వెళిపోయింది. నాలుగైదు సార్లు చేసి విసుగొచ్చి మానేశాను.
పెళ్ళికి గ్రెటా రాలేదు. పెళ్ళయాక నేనూ, డెనిస్ అలాస్కా వెళ్ళాం. అక్కడనుండి యూరోప్ అంతా తిరిగి వచ్చేసరికి అయిదు వారాలు పట్టింది. అమెరికా వచ్చీ రాగానే డెనిస్‌కి అబార్షన్ అయ్యింది. హాస్పటల్లో రెండ్రోజులు ఉండాల్సి వచ్చింది. డెనిస్ తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళిపోయింది. డాక్టర్ స్పెషలిస్టుని కలవమని చెప్పాడు. స్పెషలిస్టుని కలవడానికి స్టాన్ఫర్డ్ హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ని కలిసి వచ్చేస్తూండగా గ్రెటాను వీల్ చైర్లో చూసి ఆశ్చర్యపోయాను.
వన్ మినిట్ అంటూ డెనిస్‌కి చెప్పి ఒక్క ఉదుటన అటువైపుగా వెళ్ళాను. వీల్ ఛైర్ నడుపుతున్న అతన్ని పలకరించాను. గ్రెటా నాకు తెలుసుననీ, ఏమయ్యిందనీ అడిగాను. అతను గ్రెటా తమ్ముడని చెప్పి పరిచయం చేసుకున్నాడు. గ్రెటాకి సైకాటిక్ డిప్రెషన్ వచ్చిందనీ, గత అయిదు వారాలుగా ట్రీట్మెంట్ ఇస్తున్నారనీ చెప్పాడు. అయిదు వారాల క్రితం కుపర్టినోలో మాంటా విస్టా స్కూలు దగ్గర ఒకబ్బాయి యాక్సిడెంటులో పోయాడట. ఉదయం బైక్ మీద స్కూలు కెళుతూండగా ఒక కారు వచ్చి గుద్దేయడంతో పిల్లాడు అక్కడికక్కడే చనిపోయాడనీ, ఆ వార్త తెలిసినప్పటి నుండీ గ్రెటా పిచ్చిదానిలా తయారయ్యిందనీ చెప్పాడు. ఇంతకీ ఆ పిల్లాడు గ్రెటా దగ్గర పాఠాలు చెప్పించుకోడానికి వచ్చే వాళ్ళల్లో ఒకతను. ఈ పోయిన పిల్లాడు ఒక ఇన్నర్ సిటీ అబ్బాయి. వాళ్ళమ్మా, నాన్నా ఏవో చిన్నా చితకా పనులు చేస్తూ బ్రతుకుతున్నారట. తను స్కూలయ్యాక ఫ్రీగా ట్యూషన్ చెప్పే పిల్లలందరూ ఇలాంటివాళ్ళేనట.
చాలా తెలివైన వాడనీ, ఎంతో చురుగ్గా ఉండేవాడనీ చెబుతూ – “ఆ పిల్లాడి చావు గ్రెటా తట్టుకోలేక పోయింది. వార్త తెలిసినప్పుడు బాధ పడింది కానీ తట్టుకుంది. ఆ పిల్లాడు పోయిన చోట హైస్కూలు పిల్లలందరూ పూల బొకేలూ అవీ పెట్టి అక్కడ కొవ్వొత్తులు అవీ పెట్టడం చూశాక, ఒక రకమైన డిప్రెషన్ వచ్చింది. నాలుగయ్యేసరికి అక్కడికి వెళ్ళాలనే గొడవ చేస్తుంది. వెళ్ళి అక్కడ కేండిల్సూ, బొకే పెట్టాలని ఏడుస్తుంది. రోజూ అక్కడకి వెళ్ళి నేను బొకే పెట్టొస్తున్నాననీ అబద్ధం చెబుతూ వైద్యం చేయిస్తున్నాను…” అంటూ పక్కనే ఉన్న ఒక పూల బొకే, కేండిల్ చూపించాడు.
ఇది విని ఒక్కసారి తల దిమ్ముగా అయ్యింది. ఇవాళ కుపర్టినో వైపు తను వెళ్ళడం కుదర్దనీ, వీలయితే నన్ను అటుగా వెళితే ఈ బొకే అక్కడ పెట్టమనీ అర్థించాడు. సరేనని తీసుకున్నాను. గ్రెటా అంటే స్నేహం మాత్రమే ఉండేది కానీ ఎందుకో ఇప్పుడు గౌరవం కూడా పెరిగింది నాకు. ఈ లోగా అక్కడికి డెనిస్ వచ్చింది. ఇదంతా చెప్పలేదు. అసలే తనూ వేరొక డిప్రషన్లో ఉంది. తనని ఇంటి దగ్గర దింపాక కుపర్టినో వెళ్ళాలని మాత్రం చెప్పాను. సరేనంది.
గ్రెటా తమ్ముడు చెప్పిన గుర్తులు ప్రకారం వెళ్ళాను. రైల్వే ట్రాక్ పక్కనే ఆ పిల్లాడు చనిపోయిన చోట అనేక పూల గుత్తులూ, కొవ్వుత్తులూ చూశాను. వాటికి దగ్గర్లో చెట్టునానించి ఒక సైకిల్ ఉంది. ఇదే ఆ చోటని గ్రహించి, నేను తెచ్చిన బొకే అక్కడ పెట్టాను. కొవ్వొతులు వెలిగిస్తూంటే కళ్ళ నీళ్ళు రాలాయి. ఒక్కసారి దుఃఖం ఆపుకోలేకపోయాను. మూడు నెలల క్రితం మా బైక్ గ్రూపులో ఒకతను ఇలానే మరణించాడు. అతని కుటుంబం ముక్కలైపోయింది. చిన్న పిల్లలతో అతని భార్యని చూస్తే గుండె పగిలిపోయింది. అలాంటిది ప్రతీరోజూ పాఠం చెబుతూన్న పిల్లాడు, ట్యూషన్కి బదులు తిరిగిరాని చోటుకి వెళ్ళాడని తెలిసి గ్రెటా ఎలా తట్టుకోగలదు?
ఆ తరువాత గ్రెటాని మాత్రం కలవడానికి ధైర్యం చాల లేకపోయింది. మరలా ఆమె తమ్ముడికి ఫోన్ చెయ్యలేదు.
ఈలోగా డెనిస్ కోలుకుంది. మామూలు మనిషి అయ్యాక ఒక సారి కుపర్టినో స్టార్‌బక్స్‌కి వచ్చాం. అక్కడికి రాగానే గ్రెటా గుర్తుకొచ్చి బాధ కలిగింది. అప్రయత్నంగా గ్రెటా ఎప్పుడూ ఆర్డరిచ్చే నాన్ ఫ్యాట్ ఫ్రాపచినో విత్ విప్డ్ క్రీమ్ అండ్ చాకొలేట్ సాస్ చెప్పగానే విస్తుబోతూ డెనిస్ నాకేసి అదోలా చూసింది. అప్పుడు గ్రెటా గురించి జరిగింది చెప్పాను. ఇంతవరకూ వచ్చాం కనుక ఆ పిల్లాడు పోయిన చోటు చూపిస్తానని అటుగా తీసుకెళ్ళాను.
అక్కడ సైకిల్ చుట్టూ అనేక పూల గుత్తులూ, వెలుగుతూ కొవ్వుత్తులూ కనిపించాయి. అప్పుడే స్కూలు పిల్లాడొకడు వచ్చి ఒక పూల బొకే ఉంచాడు. నేను దగ్గర్లో ఉన్న హోమ్ డీపోకి వెళ్ళి ఒక తెల్లరంగు పెయింటూ బ్రష్ ఒకటీ కొన్నాను.
నేనూ డెనిస్ వెనక్కి తిరిగి వెళ్ళాం. అక్కడున్న బైక్‌కి తెల్ల రంగు వేశాను. డెనిస్ ఆశ్చర్యంగా చూసింది.
“ఎవరైనా ఇలా సైకిల్ తొక్కుతూ ప్రమాదంలో మరణిస్తే మా బైక్ గ్రూపు వాళ్ళు గుర్తుగా అక్కడొక సైకిల్ ఉంచి తెల్ల రంగు వేస్తాం! పోయిన వాళ్ళ ఆత్మ అక్కడే తిరుగుతుందని ఒక మిత్!” అని చెప్పాను.
తెల్లరంగే ఎందుకని డెనిస్ అడిగింది.
“అది ఘోస్ట్ సైకిల్! అందుకే తెల్ల రంగు! మరలా ఇలాంటిది జరక్కుండా అక్కడున్న ఘోస్ట్ కాపలా కాస్తుందని ఇంకో నమ్మకం!”
“నువ్వూ ఇవి నమ్ముతావా?”
“ఇంతకు ముందు కాదు. ఇప్పుడు నమ్ముతాను. అదీ గ్రెటాని చూశాక…”
కారెక్కగానే గ్రెటాకి ఫోన్ చేశాను. ఫోన్ రింగవుతూనే ఉంది.