సై కిల్

పగ పట్టిన పామును పక్కలో చూసినట్టు దిగ్గున లేచి కూర్చున్నాడు రవి!

గదంతా మసక చీకటి. కిటికీ తెర గాలికి వణుకుతోంది. ఫోనందుకున్నాడు. చార్జ్ అయిపోయింది. మంచం పక్కన అలారం క్లాక్ మూడు చూపిస్తోంది. అంతా నిశ్శబ్దం. చేయి చాచి కేబుల్ అందుకుని ఫోన్‌ను చార్జింగ్‌కి పెట్టాడు. నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి లైటు వేశాడు.

చిన్న గది. గోడకానుకుని ఒక వైపు మంచం, మరో వైపు బాత్రూం తలుపు. ఒక మూలన చిన్న సింకు, గట్టు మీద చిన్న స్టౌ, నాలుగైదు గిన్నెలు, వంట సామాగ్రి. మరో మూలన చిందర వందరగా పాత న్యూస్ పేపర్లు.

కిటికీ తెరను కాస్త ప్రక్కకు జరిపి బయటకు చూశాడు. తల స్నానం చేసి జుట్టు ఆరబెట్టుకున్నట్లుంది బయట చెట్టు. చెట్టుకు నాలుగడుగుల దూరంలో వీధి రోడ్డు. చెట్టు క్రింద సైకిల్ నిళ్ళలో తడిసి, సన్నటి వెలుతులో మెరుస్తోంది. పీడ కలలోంచి ఉలిక్కి పడి లేచాననుకుని, బాత్రూం వైపుకు నడిచాడు. అప్పుడు వినిపించింది.

“ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్ ట్రింగ్…”

అంత రాత్రి వేళ, చిక్కటి నిశ్శబ్దాన్ని, గులక రాళ్ళతో కొట్టినట్లు.

“ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్ ట్రింగ్…” సైకిల్ బెల్ మ్రోత.

నెమ్మదిగా వెనక్కు తిరిగి కిటికీ దగ్గర కొచ్చాడు. గంట మ్రోత ఆగింది. కిటికీ తెర ప్రక్కకి జరిపి బయటకు చూశాడు. సైకిల్ చెట్టు క్రింద తను సాయంత్రం పెట్టిన చోటే వుంది. రోడ్డు మీద ఎవరూ లేరు. ఒక నల్ల కుక్క, సైకిల్ వైపుకు తలెత్తి చూసుకుంటూ పోతోంది. ఈ వేళప్పుడు బెల్లు కొట్టుకుంటూ రోడ్డు మీద వెళ్ళే ఎదవ ఎవడా అనుకున్నాడు. లేకపోతే ఎవరైనా ఆకతాయి తనను ఆటపట్టించడానికి బెల్ మ్రోగించి చీకట్లో దాక్కున్నాడా అనుకున్నాడు. తను తన స్నేహితులు చిన్నప్పుడు ప్రక్కింటి వాళ్ళ డోర్‌బెల్ నొక్కి, వాళ్ళొచ్చే లోపున ప్రక్కనే దాక్కోవడం గుర్తొచ్చింది. నవ్వుకుంటూ, బాత్రూం వైపు నడిచాడు. నాలుగడుగులేశాడో లేదో, మళ్ళీ సైకిల్ బెల్ మ్రోత. ఈ సారి ఆగకుండా, అదే పనిగా!

కిటికీ వైపుకు దూకి, కర్టెన్ తెరిచి సైకిల్ వంక చూశాడు. ఎవరో స్టాండ్ వేసిన సైకిల్ మీద కూర్చుని అదే పనిగా గంట మ్రోగిస్తున్నారు. అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. మెరుపు కాంతిలో కనిపించిన దృశ్యానికి రవి నిలువెల్లా వణికి పోయాడు! ఉరుము శబ్దం సైకిల్ బెల్ మ్రోతను మింగేసింది.

గభాలున కిటికీ తెరను మూసేసి, లైటార్పి, గజగజలాడిపోతూ నిండా దుప్పటి కప్పుకున్నాడు రవి. కాసేపాగి వణుకు కొద్దిగా తగ్గింతర్వాత చిన్నగా దుప్పటి తెరిచి కిటికీ వైపు చూశాడు. అలా తెల్లారే వరకు భయంభయంగా కిటికీ వైపు, పడగ్గది తలుపు వైపూ వణకి పోతూ చూస్తూనే వున్నాడు.


రాత్రి వాన ఆగింది. ఇంకా చల్ల గాలులు వీస్తున్నట్లున్నాయి. రోడ్డు మీద అలికిడి మొదలైంది.

ప్రసాద్‌కు ఫోన్ చేశాడు. తియ్యలేదు. మోహన్‌కు చేశాడు. దొరకలేదు. సుబ్బుకు చేశాడు. లాభం లేదు. ఇంతలో ఫోన్ మోగింది. ప్రసాద్, “ఏంట్రా ఇంత పొద్దున్నే” అంటూ విసుగ్గా!

ఉన్న ఫలాన వెంటనే రమ్మని చెప్పాడు రవి. పావు గంటలో ప్రసాద్ వచ్చాడు.

ఆ వూళ్ళో రవికున్న అతికొద్ది మంది స్నేహితుల్లో ప్రసాద్ ఒకడు. ఇద్దరూ ఒకే వూరు నుంచి వచ్చారు. చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. రవికి చదువు మీద పెద్దగా ధ్యాస ఉండేది కాదు. రవి వాళ్ళ నాన్న ఊళ్ళో బాగా స్థితిమంతుడు. రాజకీయాల్లో తిరుగుతూ, పక్క పార్టిలో ఒకడిని పొడిచి చంపేశాడు, వాళ్ళు ప్రతీకరంగా ఇతన్ని చంపేశారు. కక్షలకి కోర్టు ఖర్చులకి సగం ఆస్తులు ఆవిరైతే, దగ్గరి వాళ్ళ మోసాలకు నెమ్మదిగా మిగిలింది కరిగి పోయాయి. చంపినోడు చచ్చినోడు కష్టాలు పడలేదు చిటికెలో, నొప్పి కూడా తెలియకుండా పోయారు. వాళ్ళ కారణంగా వాళ్ళ కుటుంబాలు చాలా బాధలు అనుభవించాయి, అనుభవిస్తున్నాయి! లేకుంటే రవి పొట్ట చేత్తో పట్టుకుని, సొంత వూరొదిలేసి ఇన్సూరెన్స్‌కంపెనీలో ప్యూన్‌గా చెయ్యడమేమిటి?!

సైకిల్ వైపు నడుస్తూ, “ఎవడోరా… ఇరవై కూడా ఉండవు… స్టాండేసిన సైకిల్ మీద కూర్చుని పెడల్స్ మీద కాళ్ళేసి తొక్కుతూ సైకిల్ బెల్ కొడుతున్నాడు. మొహమ్మీద, వంటి మీద నెత్తురోడుతూ గాయాలు. కుడి కన్ను వాచిపోయింది. ఎడం కన్నుతో నా వైపే చూస్తున్నాడు. నోట్లోంచి నెత్తురు తీగలా కారుతోంది…” ఆపి, ప్రసాద్ వైపు చూశాడు.

“రాత్రేమన్నా మందేశావా?” ప్రసాద్ ఆవులించాడు.

గాలికి చెట్టు ఆకుల మీది వాన చుక్కలు సైకిల్ మీద రాలి, బొట్లు బొట్లుగా నేల లోకి ఇంకి పోతున్నాయి.

“నీకన్నీ జోకులే. నేనెంత భయపడ్డానో తెలుసా? ఒట్టురా… చూడు సైకిల్ స్టాండ్ వేసింది వేసినట్లే ఉంది…” అంటూ సైకిల్ చుట్టూ ఒక సారి తిరిగి పరిశీలనగా చూశాడు.

సైకిల్‌కు వేసిన తాళం వేసినట్లే ఉంది. మరి పెడల్స్ ఎలా తిరిగాయి?!

“నెత్తురు మరకల కోసం చూస్తున్నావా? రాత్రి బాగా వానొచ్చిందిగా, నెత్తురు నేలలో కలిసిపోయుంటుంది. చూడు చైను స్లిప్పయింది.”

అపార్ట్‌మెంటు కాంప్లెక్సు లోకి వెళ్ళే వాళ్ళు, ఒకరిద్దరు ఏమైందని అడిగారు. రవి వాళ్ళకు సమాధానమిచ్చే లోపే, ప్రసాద్ ఏమి లేదని వాళ్ళను పంపించాడు.

“నవ్వులాటగా ఉంటే నువ్వెళ్ళరా. అయినా నేనెంత భయపడకపోతే నిన్నింత ప్రొద్దున్నే పిలుస్తాను?”

“అసలు సైకిల్ బయటెందుకు పెట్టావ్?!”

“సెల్లారంతా వాన నీళ్ళు”

“సరే… రాత్రి ఎవడో నీ సైకిల్ ఎక్కాడంటావ్. మరయితే ఇప్పుడేం చేద్దాం?”

ఏం చెయ్యడం. రాత్రి తాలుకు భయం కొద్దీ ఉదయాన్నే స్నేహితులకు ఫోన్ చేశాడు. వాళ్ళతో విషయం పంచుకుందామని పిలిచాడు. అంతకు మించి ఏమి ఆలోచించలేదు.

“అయినా అన్ని సార్లు సైకిల్ బెల్ మ్రోగితే ఎవరూ క్రిందికి రాలేదా?”

రవి మాట్లాడలేదు.

“నీకేదో పీడ కలొచ్చుంటుంది”

“కలా?!”

“కాకపోతే హెలూసినేషన్ అయినా అయుండాలి. ఏం సైకియాట్రిస్ట్ దగ్గరకెళదామా?”

“అంటే?”

“పిచ్చి కుదిర్చే డాక్టర్” అని, చిన్న బోయిన రవి మొహంలోకి చూశాడు. రవి పరధ్యానంగా సైకిల్ వైపు చూస్తున్నాడు.

“సరదాకన్నానురా. నువ్వు బేంకు పరీక్షలకు చదువుతున్నావుగా ఒక స్పెల్లింగ్ ప్రశ్న.”

“సైకియాట్రిస్ట్ స్పెల్లింగ్ చెప్పు?”

“ఎస్ వై…”

“కాదు. ఇంకో సారి ట్రై చెయ్.”

“సి వై…”

“ఉహూ! పి ఎస్ వై. పలికేటప్పుడు సై అని పలుకుతాం. సైకిల్‌లో సై లాగా. పి సైలెంట్. పద, అలా వెళ్ళి టీ తాగుదాం.”

అపార్ట్‌మెంట్స్ ఎదురుగా ఉన్న టీ దుకాణం వైపు నడిచారు.

రవికి ఆఫీసులో పని మీద మనసు నిలవలేదు. అయినా అతడు చేసే పని మనసు నిలిపి చేసేది కాదు. టైముకు కాఫీలు టీలు తెప్పించి అందరికీ అందించడం, ఫైళ్ళందించడం, కవర్లు అంటించి పోస్ట్ చెయ్యడం.

“నువ్విక్కడ పని చేస్తావా?” అడిగాడతను. ఎక్కడో చూసిన మొహం. ఎక్కడ అని అలోచిస్తుండగానే, “నేను మీ అపార్ట్‌మెంట్లోనే ఉంటాను. అదే వాసవి టవర్స్‌లో…” అతన్ని చాలా సార్లు రవి చూశాడు.

“కూర్చోండి.” రవి ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు.

“నా పేరు రఘు. నాదొక క్లెయిముంది. కనుక్కుందామని”

“ఏ క్లెయిమ్ సార్?”

“యాక్సిడెంటు. ఫోర్ వీలర్. హిట్ అండ్ రన్ కేస్,” అంటూ క్లెయిమ్ వివరాలున్న కాగితం ఇచ్చాడు.

“నాతో రండి.”

రవి యాక్సిడెంట్ల క్లెయిములు చూసే సుబ్బారావు దగ్గరకు రఘును తీసుకెళ్ళి పరిచయం చేసి మళ్ళీ వచ్చి తన కుర్చీలో కూర్చుని కణతలు నొక్కుకున్నాడు రవి. సాయంత్రమయ్యే కొద్దీ, రాత్రి దృశ్యం పదే పదే గుర్తుకొచ్చి వెంటాడుతోంది. పైగా అలసట, నిద్ర, కళ్ళు మంటలు!

వాతావరణం మబ్బుగా ఉంది. ఇంకా వాన మొదలైనట్లు లేదు. అఫీసులు మూసే వేళకు ఆకాశం లాకులు తెరుస్తుంది. రెండు గంటలు మెరుపులు, ఉరుములతో నీళ్ళ డిస్కో చూపించి గాలి సంగీతం వినిపిస్తుంది. ఎక్కడ గోతులుంటాయో, ఎక్కడ కరెంటు తీగలు తెగి పడ్డాయో, ఎక్కడ అడుగేస్తే జారి ఎక్కడ తేలతారో ఎవరికీ తెలియదు.

రవికి వానకంటే రాత్రిని తల్చుకుంటేనే ఎక్కువ భయమేస్తోంది. ఎంత భయమేసినా, ఆఫీసులో ఉండడం కుదరదు కదా?! పని ముగించుకుని లిఫ్టులో దిగుతుంటే, సుబ్బారావు కనిపించాడు. ఇందాక నేను తీసుకొచ్చినాయన పనయిందా అని అడిగేడు రవి.

“ఏందయ్యేది? ఈయన ఎవరో నా కారును హిట్టండ్రన్ అంటాడు. ఇనస్పెక్షన్ వాల్లేమో ఈయన కారే ఎవరినో గుద్దినట్లుందంటారు. వచ్చే వారం రమ్మన్నా!” చెప్పాడు సుబ్బారావు.

రోడ్డెక్కేసరికి ఇంకా వాన మొదలవలేదు. గాలులు బలంగా వీస్తున్నాయి. ఇక్కణ్ణుంచి రవి ఉండే అపార్ట్‌మెంట్స్ పెద్ద దూరం కాదు. పది నిమిషాల్లో వెళ్ళొచ్చు.


సైకిల్‌ను చెట్టు క్రింద కాకుండా, ఈసారి మరికాస్త దగ్గరగా కనిపించేలా పెట్టుకున్నాడు రవి. కిటికీ తలుపులకు బోల్టులు పెట్టాడు. తెర కిటికీని పూర్తిగా కవర్ చేసేలా సర్దాడు. గది తలుపులకు గడియ వేశాడో లేదో ఒకటికి మూడు సార్లు చూసుకున్నాడు. సెల్ ఫోనును చార్జికి పెట్టాడు. ఎందుకైనా మంచిదని బాత్రూంలో లైటును కూడా వేసే వుంచాడు.

హనుమాన్ చాలీసాకు దణ్ణం పెట్టుకుని, చెంపలేసుకున్నాడు. పుస్తకాన్ని భక్తితో దిండు క్రింద పెట్టుకున్నాడు. చిన్నప్పుడు జొరమొచ్చినప్పుడు, జడుసుకున్నప్పుడు రవి వాళ్ళమ్మ హనుమాన్ చాలీసా చదివి, పుస్తకాన్ని రవి తల క్రింద ఉంచేది. నిండా దుప్పటి కప్పుకుని నిద్రకుపక్రమించాడు. చాలా సేపు నిద్ర పట్టలేదు.

కిటికీ అద్దంపై మెరుల కాంతి జిగేల్ జిగేల్ మని పడి మాయమౌతోంది. ఉరుముల హూంకరింపులకు కిటికీ అద్దాలు వణుకుతున్నాయి. కళ్ళు గట్టిగా మూసుకునే వున్నా, కిటికీకి తెరలున్నా మెరుపులు కంటిమీద చెర్నాకోల దెబ్బల్లా పడుతున్నాయి. ఎంత వద్దనుకున్నా, నిన్న సైకిల్ తొక్కుతున్నతని రూపం మసకమసగ్గా రవికి గుర్తొస్తోంది.

“ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్ ట్రింగ్…”

మెలుకువొచ్చింది. అయినా కళ్ళు తెరవలేదు. దుప్పటి ముసుగు తియ్యలేదు. మరి కాస్త దగ్గరగా, కవ్వింపుగా మళ్ళీ,

“ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్ ట్రింగ్…”

మొహమ్మీది దుప్పటిని కాస్త పక్కకు తప్పించాడు. మెల్లగా తల తిప్పి సెల్ ఫోన్ వైపు చూశాడు. మూడైంది. కిటికీ మీద వెల్తురు. టార్చ్‌లైట్ వేసినట్లు. దాంతో బాటు సైకిల్ బెల్ “ట్రింగ్ ట్రింగ్…ట్రింగ్ ట్రింగ్…ట్రింగ్ ట్రింగ్…” ఆగకుండా. చెవులు మూసుకున్నా శబ్దం వినిపిస్తోంది. మరికాస్త పెద్దగా, మేఘం ఘర్జిస్తున్నట్లు.

పక్క మీదనుంచి లేచాడు. పిల్లిలా మెల్లగా కిటికీ దగ్గరకు వెళ్ళాడు. తెరను వేలుతో కాస్తంటే కాస్త తెరిచి బయటకు చూసి, ఒక్క అంగలో వెనక్కొచ్చి మంచం మీద పడ్డాడు రవి. సైకిల్ రెండు చక్రాలు, నేలకు రెండడుగుల ఎత్తులో వేగంగా తిరుగుతున్నాయి. లైట్ పూర్తి కాంతితో ప్రజ్వలంగా వెలుగుతోంది. గంట ఎవరో మర చేతులతో నొక్కుతున్నట్లు మ్రోగుతోంది.

పెద్దగా అరిచాడు రవి. ఇంకాస్త పెద్దగా అరిచాడు. భయంతో అరిచాడు. వినేవాళ్ళు భయపడేలా అరిచాడు.

కిటికీ మీద వెలుతురు తగ్గుతోంది. గంట శబ్దం నెమ్మదిగా తగ్గుతోంది. పూర్తిగా తగ్గింతర్వాత లేచి గదిలో లైట్ వేశాడు. వెలగలేదు. కరెంట్ పోయింది. అడుగులో అడుగేసుకుంటూ కిటికీ దగ్గరకు వెళ్ళాడు. సైకిల్ నేల మీద ఉంది. లైటు కాంతి మందగిస్తోంది. గంట ఆగింది. చక్రాలు నెమ్మదిగా తిరుగుతున్నాయి.

ఒక నీడ కిటికీ ప్రక్క నుంచి కదిలి పోయింది. చిన్న ఇనప రాడ్ తీసుకుని నెమ్మదిగా గది తలుపులు తీసుకుని బయటకొచ్చాడు రవి. భయభయంగా అడుగులో అడుగేసుకుంటూ నీడ వెళ్ళిన వైపుకు కదిలాడు.

భుజమ్మీద ఎవరిదో చెయ్యి పడింది… బలంగా బరువుగా.

రవి పై ప్రాణాలు పైనే పోయినట్లనిపించింది. చేతిలోంచి రాడ్ క్రింద పడింది పెద్ద చప్పుడు చేస్తూ. తల కాస్త ప్రక్కకు తిప్పాడు. గుప్పున మందు వాసన!

“ఎవడ్రా ఈ వేళప్పుడు?”

వెనక్కి తిరిగి చూశాడు రవి. అపార్ట్‌మెంట్స్‌లో నూట మూడులో ఉండే అతను. పొద్దున ఇన్సూరెన్స్ క్లెయిం గురించి కలిసినతను.

“సార్, నేనండి. ఇక్కడ ఎవరో తిరుగుతున్నట్లు కనిపిస్తే చూద్దామని బయటకొచ్చా.”

“దెయ్యాలు…” ఒక బూతు మాటతో,”…వేళలో ఎవడొస్తాడ్రా. యెల్లు… లోపలకెళ్ళు,”

నాలుగడుగులు లిఫ్ట్ వైపేసి, ఏదో గుర్తుకొచ్చినట్లు వెనక్కొచ్చి కారు దగ్గరకెళ్ళి, తాళం వేశాడో లేదో చెక్ చేసుకుని “ఎదవ న్యూసెన్సాపి ఎళ్ళి పడుకోరా” అని తూలుతూ లిఫ్ట్ వైపుకు వెళ్ళాడు.


రోజూ అర్థ రాత్రి దాటేక, మూడు తర్వాత సైకిల్ బెల్ మ్రోగడం, లైటు వెలగడం, చక్రాలు వాటంతటవే తిరగడం. రవికి నిద్ర ఉండడం లేదు. భయంతో వణకి పోతున్నాడు. ఈ సంఘటనలు మొదలైనప్పుడు స్నేహితులకి చెప్పినా వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. ఇదంతా రవి కట్టిన కథో లేక అతని భ్రమో అనుకున్నారు. రవి మాత్రం తన సైకిల్‌కు దయ్యం పట్టిందనుకున్నాడు. వాళ్ళ వూళ్ళో దయ్యాలను పారదీలడానికి ఉపయోగించే తంత్రాలన్ని సైకిల్ మీద ప్రయోగించడం మొదలెట్టాడు. ఒకరోజు దగ్గర్లో ఆంజనేయస్వామి గుడికి సైకిల్‌ని తీసుకెళ్ళి పూజ చేయించి నిమ్మకాయలు తొక్కించాడు. ఇంకో రోజు ఒక దర్గాకు తీసుకెళ్ళి తాయిత్తు కట్టించాడు. చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేశాడు.

మరో రెండు రోజులు సైకిల్‌తో బాధలు పడి, ప్రసాద్ రూముకు తాత్కాలికంగా మకాం మార్చాడు. సైకిల్‌ను మాత్రం తన గది దగ్గరే ఉంచి, రాత్రికి ప్రసాద్ వాళ్ళ గదిలో పడుకోవడం, ఉదయం తన గదికి రావడం. ఇదీ ఏర్పాటు. కానీ ఎన్నాళ్ళలా?! నాలుగు రోజుల తర్వాత, రవి చెప్పే దయ్యం కబుర్లు వినీ వినీ విసుగెత్తింది.

“పదరా, ఇవ్వాల రాత్రికి నీ గదిలో నేను పడుకుంటాను. దయ్యం అంతు తేలుస్తాను,” శపధం చేశాడు ప్రసాద్.

“ప్రసాదూ, నా మాట విను. నువ్వే ఈ సైకిల్ బేరమాడి కొనిపించావ్. కొత్త సైకిల్ కంటే, ఆ పోలీసాయన దగ్గర చౌకగా మంచి సైకిల్ దొరుకుతుందని నువ్వే తీసుకెళ్ళావ్. ఇదెవరి సైకిలో?! ఎవరి మీద పగ బట్టిందో?!”

ప్రసాద్ నవ్వాడు.

“చెప్పు, ఎవరు దయ్యమై ఈ సైకిల్ మీద సవారి చేస్తున్నారో? మనమే జన్మలో చేసిన నేరానికో ఈ జన్మలో ఈ సైకిల్ మనల్ని పీడిస్తోంది. పీక పిసికి చంపేస్తుంది,” అంటూ పక పక నవ్వి, “ఈ జన్మలో ఎన్ని తప్పులు చేసినా, పాపాలు చేసినా, అన్యాయాలు చేసినా నేరానికి తగ్గ శిక్షలుంటే ఏ జన్మలో జమా ఖర్చులు ఆ జన్మలో ఉండాలి గాని, పోయిన జన్మలో పాపాలకు ఈ జన్మలో శిక్షలు ఈ జన్మ పుణ్యాలకు వచ్చే జన్మలో సన్మానాలు అంటే ఎలా గిట్టుబాటౌతాయి సోదరా! ఒక వేళ నేరం చేసినోడు, అన్యాయం చేసినోడు — వాడేదో ఒకటి అడ్డుపెట్టుకుని తప్పించుకున్నా, ఈ జన్మలోనే ఇక్కడే ఈ భూమ్మీదే వాడు తప్పించుకున్నా వాళ్ళ వాళ్ళకు ఆ పాపం కొట్టక పోదు, ఏదో ఒక రూపంలో పరిహారం చెల్లించకపోదు. ఈ దెయ్యాలు, భూతాలు, దేవుళ్ళూ అన్నీ మిధ్య! ఎలా చెప్పాన్రా?”

ప్రసాద్ తను చెప్పిన మాటల్ని తనే నమ్మలేక పోయాడు. తన భుజాన్ని తనే తట్టుకుని ‘భేష్’ అనుకున్నాడు. రవి ఆలోచనలో పడ్డాడు.

రవి చిన్నప్పుడు, ఎనిమిదేళ్ళ వయప్పుడు రవి తండ్రిని పల్లె రాజకీయాల పగ ప్రతీకారాల్లో ఖూnI చేశారు. రాజకీయ కుటుంబంలో పుట్టినా, రాజకీయాల్లో తిరిగినా, ఏనాడూ గొడవల్లో తల దూర్చలేదు. అయినా రవి వాళ్ళ తాత చేయించిన హత్యకు సమాధానంగా, అవతలి వాళ్ళు సమయం చూసి రవి తండ్రిని చంపేశారు. తాతకు పుట్టెడు పుత్ర శోకం. తండ్రి మరణం తర్వాత చాలావాటితో బాటు ఆస్తి కూడా చేజారింది. రవిని వాళ్ళమ్మే పెంచింది. వూళ్ళో అల్లరి చిల్లరి తగవుల్లో తల దూర్చుతూ జులాయిలా పెరిగాడు. చనిపోయిన తండ్రి ఠప్పున పోయాడు గాని, ఆయనకు పుట్టినందుకు రవి, అతన్ని కట్టుకున్నందుకు రవి తల్లి చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించారు, అనుభవిస్తున్నారు! ఇదెక్కడి న్యాయం?! తగవుల్లో తల దూర్చినోడు, ముందెనక లాలోచించకుండా తప్పులు చేసినోడు బాగానే ఉండి, ఏ పాపం తెలియని తను, తన అమ్మ…!

ఎందుకో ఏడుపు తన్నుకొచ్చింది. ప్రసాద్ వైపు చూశాడు. తన తండ్రే బతికుంటే!

రవి మొహంలో ప్రసాద్ ఏం చదివాడో తెలియదు కానీ, “సరేరా. నువ్వీ రాత్రికి ఇక్కడే నా రూంలో పడుకో. నేను పోయి నీ రూంలో పడుకుంటా,” అన్నాడు. తలూపాడు రవి.

సైకిల్‌కు వేసిన తాళాన్ని మరో సారి సరి చూసి, కాసేపు పాటలు విని నిద్రపోయాడు ప్రసాద్.

చెవులు చిల్లులు పడేలా వినిపిస్తున్న సైకిల్ బెల్ మ్రోతకు ఉలిక్కిపడి లేచాడు. చేతికున్న వాచీ చూసుకున్నాడు. మూడుంబావు. కిటికీలోంచి బయటకు చూశాడు.

నోట మాట రాలేదు. అలాగే గుడ్లప్పగించి చూస్తూ గజ గజ వణకి పోయాడు. ఒక్కుదుటున దూకి సెల్‌ఫోనందుకున్నాడు. ఎంత గట్టిగా నొక్కినా బటన్లు వొత్తుకోవడం లేదు. బయటకు వెళదామంటే గది తలుపులు తెరుచుకోలేదు. కిటికీకి కట్టిన తెరలు గాలికి చుట్టలు చుట్టుకున్నాయ్.

సైకిల్ మీద ఒక యువకుడు, రక్తం వోడుతూ. మొహమంతా గాయాలు. చెంపల మీదకు వేల్లాడుతూ కుడి కన్ను. నోట్లోంచి పెదాల చివరల నుంచి నేల మీదకు కారుతున్న నెత్తురు. చింపిరి చింపిరి జుట్టు. రోడ్డు మీద ఈడ్చుకుపోయినట్లు చొక్కాకు పేంటుకు మాసికలు! వొంటి కన్నుతో సాయం కోసం అర్థిస్తున్నట్లు చూస్తున్నాడు. సైకిల్ తొక్కలేక తొక్కుతున్నాడు. సూటిగా ప్రసాద్ వైపే చూస్తున్నాడు!

అంతే గుర్తుంది ప్రసాద్‌కు!

మర్నాడు రవి వాళ్ళు తలుపును పగలగొట్టి, మొహాన నీళ్ళు చల్లి లేపే వరకు ప్రసాద్ అలా పడిపోయే వున్నాడు.


సైకిల్ అమ్ముతున్నానని తెలిసిన వాళ్ళకు చెప్పాడు. అపార్ట్‌మెంట్స్ నోటీస్ బోర్డ్‌లో సైకిల్ అమ్మకానికుందని పెట్టాడు. అదే అపార్ట్‌మెంట్స్‌లో నూట మూడులో ఉండే అతను కొన్నాడు, వాళ్ళబ్బాయి కోసం. రెండ్రోజుల తర్వాత ఆ సైకిల్‌కు యాక్సిడెంటయింది. అతి దారుణమైన యాక్సిడెంట్. సైకిల్ వాలాను కారు పాతిక మీటర్లు ఈడ్చుకుని వెళ్ళింది. సైకిల్ తొక్కుతున్నతను అక్కడికక్కడే పోయాడు.

ఎవరు గుద్దారో తెలియదు. హిట్ అండ్ రన్ కేసు!