డాక్టర్ అలెక్స్ రూబెన్ తన స్టూడియోలో డెస్క్ దగ్గర ఏదో రాసుకుంటూ, ఆమె పియానో వాదనం వింటున్నాడు.
“అయామ్ హియరింగ్ మోర్ దేన్ ది నోట్స్! నాకు వినపడవలసిన స్వరాలు మాత్రమే కాక, మరి ఇంకా ఏవో టకటకలు వినిపిస్తున్నాయి?!”
అతనికి తెలుసు నిసి షామల్ ఒక చేతి వేలికి ఒక నీలి వజ్రం ఉంగరం, ఇంకో చేతి వేలుకు ఒక పాటేక్ ఫిలిప్ కలట్రావా ఉంగరం పెట్టుకుని ఉందని. అంతకు ముందు ఒకసారి, తనతో సంగీత కళాశాలలో, ఆలస్యంగా పాఠం చెప్పించుకుని, వారిద్దరూ ఒక స్నేహితుని ఇంట్లో డిన్నర్ పార్టీకి వెళ్ళినప్పుడు, నిసికి అకస్మాత్తుగా గుర్తుకు వచ్చింది, స్కూల్లో రెస్ట్ రూమ్‌లో కౌంటర్ మీద వాటిని పెట్టి మరిచిపోయినట్టు.
ఆమె అతనిని పార్టీలో పక్కకు పిలిచి, రహస్యంగా అతనికి ఆ సంగతి చెప్పి, “ఉంగరాలు పోతాయేమో! జానిటర్ గాని వస్తాడా? సెక్యూరిటీకి ఫోన్ చెయ్యాలా, మనం” అని అడిగింది. అతడు పార్టీ తర్వాత ఇద్దరం కలిసి స్కూల్‌కి వెడదాం. అవి అక్కడ లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు. ఆమె ఇంకో ఆలోచన లేకుండా, అందరితో కలిసి డిన్నర్ తిని, తర్వాత కార్డ్ గేమ్స్ ఆడి, ఆ తర్వాతే కొన్ని గంటల తర్వాత తాపీగా స్కూలుకి వెళ్ళింది. వెళ్ళంగానే తుర్రుమని రెస్ట్ రూమ్ లోకి పరుగెట్టింది. అతను బైట నిలబడి, వేచి ఉంటే, కొంచెం సేపటికి మెల్లిగా బైటికి వచ్చి, అతని ముఖం ముందు తన ఉంగరాల చేతులు ఆడించింది.
“నాకు కొంచెం భయం వేసింది. రెండూ కలిపి ఓ ఇరవై వేలు ఖరీదు, యూ నో. ఇంకా నయం ఉంగరాలు పోలేదు,” అని, అతనిని చటుక్కున కౌగిలించుకుని ముద్దు పెట్టింది. అతనికి దేనికి ఎంత సంతోషించాలో, ఆ అర్ధరాత్రి వేళ కొంచెం తికమక ఐనా మొత్తానికి మహ హెచ్చుగా సంతోషించిన విషయం గుర్తుంది.
ఆ ఉంగరాలు తీసి పియానో వాయించమని ఆమెతో డైరెక్ట్‌గా చెప్పడు. స్వరాలు సరిగా లేవు అని మాత్రమే చెపుతాడు.
నిసి ఉంగరాలు తీసి బేగ్‌లో పడేసి పాఠం పలికించింది.
డా. రూబెన్ ఆమె పక్కకు వచ్చి నుంచుని, మధ్య మధ్యలో ఆమె చేతులు అటూ ఇటూ సర్దుతూ, “ఆ వేళ్ళతో గంతులు వెయ్యాల్సిన పని లేదు. అట్లా వేళ్ళు ఎత్తి ఎత్తి వెయ్యటం, అక్కడి నుంచీ ఇక్కడకు గంతులు వెయ్యటం బాలీవుడ్ సినిమాల్లో చూసి నేర్చుకున్నావు కాబోసు. ఎకనామికల్‌గా ఉండాలి. అనవసరంగా ఊరికే వేళ్ళు కదిలించి తప్పు కీస్ మీద లాండ్ అవుతావు. అసలు కదల్పాల్సినప్పుడు, వేళ్ళు అక్కడే తాపడం చేసినట్టు ఉండిపోతావు. ఇట్లా గంట కొక స్వరం పలికిస్తే, ఆ సంగీతం వింటానికి ఎవరూ రారు.” అన్నాడు.
“అసలు ఎలా వాయించాలో ఎందుకు నేర్పవు? ఈ పాఠంలో ఆ సూచనలు లేవు. నాకేం కలొస్తుందా, ఏ మీటల మీద ఏ వేళ్ళు ఉంచాలో? నువ్వు ఏదైనా కూర్చుని చెప్పి ఎన్నాళ్యయింది? ఈ కాన్సర్ట్‌కి రా, వాళ్ళింట్లో వాయిస్తున్నా వింటానికి రా అని పురమాయిస్తావు. ఆ స్టూడెంట్ బాగా వాయించింది. ఆ కుర్రాడు ఆ రోజు బాగా వాయించాడు అంటమే కాని, నేనూ నీ స్టూడెంట్ నని నీకు అసలు గుర్తుంటేగా.”
“అది మర్చిపోటానికే నా ప్రయత్నం. కాని జరగటల్లేదు. లెసన్స్ అప్పుడే కాక, నువ్వు తరచుగా నా ఆలోచనల్లో ఉంటున్నావు. ఈ మధ్య కలల్లోకి కూడా వస్తున్నావు. యూ నో?”
ఆమె పకపకా నవ్వింది. “యామ్ ఐ సెడ్యూసింగ్ యూ? వాట్ ఎ కలామిటీ!!” అని. అంతలోనే మళ్ళీ చాలా సీరియస్‌గా, “యు ఆర్ ఎ ఫ్రీ మేన్! నేను స్టూడెంట్‌గా ఉంటం ఇష్టం లేకపోతే, ఆ మాట చెపితే చాలు. మీకు నేను ఒక జోక్, నా సంగీతం ఒక జోక్ కదా, డాక్టర్ రూబెన్!” అంది.
అట్లా సంబోధించింది అనగానే, అతడికి తెలుసు, ఆలసిస్తే విషయం ముదురుతుందని. వెంటనే, పక్క పియానో దగ్గర కూర్చుని, పుస్తకం లోని స్వరాలు పైకి చదువుతూ, నోట్ బై నోట్ వాయించి చూపిస్తూ, సరిగ్గా తను పలికించినట్టే నిసి పలికించాక, “దట్స్ ఇట్! దట్స్ ఎగ్జాక్ట్‌లీ ఇట్! కీప్ ఆన్.” అని మౌనం వహించాడు.
“బొమ్మలు వెయ్యటం ఎందుకు మానావ్? కొన్ని బొమ్మలు బాగా వేశావు, నిసీ!” అన్నాడు అలెక్స్, ఓ రోజు ఆమె ఇంట్లో తిరుగుతూ.
“ఉన్నవి రెండే చేతులు ఎన్ని పనులు చెయ్యనూ?!”
“సంగీతం కూడా ఇంతేనా, కొన్నాళ్ళలో మానేస్తావు. వైద్యం చెయ్యటం మానేశావు. పెయింటింగ్ మానేశావు. ఇదీ అంతేగా?”
“ఐతే ఏం. ఏది చేస్తున్నప్పుడు అది ఆనందం కలిగిస్తే చాలు. కొన్నాళ్ళలో నేనూ ఉండను. కాని, నా అదృష్టవశాత్తు ఇంతటి సంగీత విద్వాంసులు మీరు కనిపించారు. పాఠం చెప్పటానికి ఒప్పుకున్నారు. నాకు ఇది మిథలాజికల్ స్టోరీ లాగా ఉంటుంది. మాయ లాగా ఉంటుంది. యూ నో అలెక్స్! యూ హేవ్ మేడ్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్.”
“ఆ ఏంజెలా కూడా అలాగే అంటుంది. నేను దేవుడు పంపించిన దూతనంటుంది. కొన్నిసార్లు నేనే దేవుడునంటుంది. యూ ఆల్ టాక్ లాట్ ఆఫ్ నాన్సెన్స్. మీరంతా ఏవో కొన్ని సంవత్సరాలు నాతో నాటకమాడి వెళ్ళిపోతారు. నేనొక్కడినే మిగిలిపోతా. మిమ్మల్ని గురించి ఆలోచించవద్దనుకుంటా. కాని ఆలోచించకుండా ఉండలేను.”
ఒక్కోసారి రూబెన్ రోల్ రివర్సల్ చేసి నిసి తన గురువు లాగా ప్రవర్తించే వాడు. ఆ రోజు ఆమె అలెక్స్ రూబెన్ ముఖం చూడగానే, “ఆల్రైట్, లెట్స్ హియర్ ఇట్.” అంది.
“నువ్వు భలే దానివి నిసీ! నువ్వూ ఎకడమిక్ ప్రపంచంలో కొన్నేళ్ళున్నావు. స్టూడెంట్స్‌తో డీల్ చేశావు కదా, అందుకని…”
“ఊహు!”
“నీ అభిప్రాయం వింటం నాకిష్టం.”
“ష్యూర్!”
“నాకో గే అమెరికన్ వైట్ స్టూడెంట్ ఉంది. ”
“అలెక్స్! యూ నో ఐ’మ్ రైటింగ్ షార్ట్ స్టోరీస్, రైట్? నేను కథలు రాస్తున్నానని నీకు తెలుసుగా?”
“ఇప్పుడా సంగతెందుకు? ”
“నా కథల్లో నిన్ను గురించి రాస్తున్నా, తెలుసుగా?”
“రాసుకో శుభ్రంగా. నే బతిమాలి అడిగా నాకో కథ చూపించమని. చూపించవయ్యె. ఐనా ఆ కథలు ఎవరైనా చదువుతారా?”
“నీకు తెలుగు రాకపోయినంత మాత్రాన అది ఎవరూ చదవని భాష కాదు. ఓకేనా, మిస్టర్ మోనోగ్లాట్?”
ఓకే ఓకే. ఇంతకీ నేను చెప్పదలుచుకుంది చెప్పనిస్తావా?”
“నీ కాలేజీ కబుర్లన్నీ నాకు చెపితే, నీ ఉద్యోగం కానీ పోతే, నాదేం బాధ్యత లేదు. నేను నిన్ను పోషించలేను. సంగీతకారులకీ, సాహిత్యవేత్తలకీ ఉన్న పెద్ద జబ్బు, వాళ్ళని ఎప్పుడూ ఎవరో ఒకరు పోషించాలి. ఆ పప్పులు నా దగ్గర ఉడకవు.”
“ఐ నో. అప్పుడప్పుడు రిట్జ్‌లో భోజనం పెట్టిస్తే చాలు. ఈ సంగతి వినవూ?”
“ఓ.కే. నీకు గే వైట్ అమెరికన్ ఆడ స్టూడెంట్ ఉంది.”
“ఆమె అంతకు ముందు ఆర్మీలో పని చేసింది. షి ఈజ్ ఎ నట్. ఇప్పుడు మ్యూజిక్ థెరపీ డివిజన్‌లో రీసెర్చ్ స్టూడెంట్‌గా ఉంది.”
“ఆర్మీలో పని చేశాక అంతో ఇంతో నట్ కాకుండా ఎలా ఉంటారు? పిటిఎస్‌డి – పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిౙార్డర్. రామాయణంలో రాముడికి అదే జరిగింది. లేకపోతే యుద్ధం ముందు భార్య నెత్తుకుపోయారని అంత ఏడ్చిన వాడు యుద్ధం గెలిచాక, ఆమెను నిప్పుల్లోకి ఎందుకు దూకమంటాడు? కాంబాట్ స్ట్రెస్. టెంపరరీ ఇన్సేనిటీ. ఐ హోప్, నీ విద్యార్థినికి సైకియాట్రిక్ హెల్ప్ ఉందని.”
“కామ్ డౌన్. ఆ రామ్ ఎవరో నాకు తెలియదు కాని, ఇప్పుడు నేను చెప్పే ఆమె కాంబాట్ ఏరియాలో ఎప్పుడూ లేదులే. డాక్టర్ పని చేసింది పీస్ టైమ్‌లో. డాక్టరంటే సైకాలజీలో పిఎచ్. డి. ఇంతకీ నే చెప్పేది వింటావా? ఈ ఇప్పటి 21 శతాబ్ది తెల్ల డాక్టర్, తర్వాత ఒక నల్ల స్త్రీని పెళ్ళాడింది. ఏంజెలీనా జోయీకి మల్లే రకరకాల జాతుల పిల్లల్ని దత్తత చేసుకుంది.” ఆమె పెళ్ళి, జీవితం అలెక్స్‌కి ఏ మాత్రం గిట్టలేదని అతని ముఖమే చెపుతున్నది.
“తర్వాత?”
క్లాడ్ డిబుస్సీ మిన్‌స్ట్రల్స్ మీద పేపర్ రాస్తూ ఉంది. దానికి మరి మార్కులెయ్యాల్సింది నేనే. ఈబిడ ఎలాగోలా పాసై వెళ్ళిపోతే నాకు సుఖం. ఏదో నేర్చుకున్నంత నేర్చుకుంది. మ్యూజిక్ థెరపీలో. ఈమె గోల నాకెందుకు. కాని నాకు సబ్‌మిట్ చేసిన పేపర్లో, మిన్‌స్ట్రల్స్ హిస్టారికల్ ఇంపోర్టెన్స్ చెప్పనంటుంది.
“మిన్‌స్ట్రల్స్?”
“ఇరవయ్యో శతాబ్ది మొదట్లో, తెల్లవాళ్ళు స్టేజ్ మీద ముఖానికి నల్ల రంగు వేసుకుని, నల్లవాళ్ళని – వాళ్ళ గంతుల్నీ, చేతులు, ఒళ్ళు తిప్పటాన్ని అనుకరించేవారు.”
“దట్స్ నాట్ నైస్. ‘ది ఇండియన్’ అని ఒక ఇంగ్లిష్ సినిమాలో పీటర్ సెల్లర్స్ ముఖానికి నల్ల రంగు పులుముకుని, ఏక్సెంట్‌తో మాట్లాడి, ఇండియన్ అంటే తెలివితక్కువ సన్నాసి అన్నట్టు చూపిస్తే నాకు అప్పట్లో చాలా కోపం వచ్చింది అలెక్స్.”
“వెల్! అందులో అప్పుడు నిజం ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఇండియన్స్‌ని, టెలివిజన్ షోలలో, టెక్నాలజీ విజర్డ్స్ లాగా చూపించటంలా. ఇప్పుడందరికీ, భారతీయులు చాలా తెలివైన వారని గట్టి నమ్మకం. కాదూ.”
“యా! ఐ గెస్ యూ ఆర్ రైట్.”
“డిబుస్సీకి నల్ల వాళ్ళ మీద ద్వేషం లేదు. నిసీ. అతను స్టేజ్ మీద చూసిన చేష్టలని, తన సంగీతం లోకి మార్చాడు. నువ్వు వివరంగా చదువు లైబ్రరీలో పుస్తకం తీసుకుని. తర్వాత , అంటే నువ్వు మ్యూజిక్‌లో ఇంకా కొన్నేళ్ళు గడిపాక, ఆ టెక్నిక్స్ గురించి, నీతో చెపుతాను. అప్పుడే నీకు అర్ధం కాకపోవచ్చు. మరి ఈ నా స్టూడెంట్, ఈ తెల్ల అమ్మాయి, ఇంకో నల్ల అమ్మాయిని మారేజ్ చేసుకుంది, నల్ల పిల్లలను కూడా దత్తు తీసుకున్నారు. నా నల్ల ఫేమిలీ మెంబర్స్ నా రీసెర్చ్ పేపర్ చదువుతారు. నా పర్ఫార్మెన్స్‌కి కూడా వస్తారు, వాళ్ళకి అవమానకరమైన విషయం తను రాయనంటుంది, నిసీ!”
“అది మంచిదేగా. ఆమె సైకాలజిస్ట్ కూడా. ఆమెకు వాళ్ళ ఫీలింగ్స్ తెలిసినప్పుడు, ఆ విషయం రాయకపోతే ఏం?”
“కాని మ్యూజిక్‌లో, ఆ పియానో మోతలలో, పియనిస్ట్ ఆ నల్లవారి చేష్టలను వినిపించ చెయ్యగలగటం అనేది ఒక గొప్ప విషయం. అలాంటివి, అప్పటి వరకూ ఎవరూ కంపోజ్ చెయ్యలేదు, వినిపించగలగలేదు. అంత ఆసక్తికరమైన విషయం, ఆ సంగీతానికి మూలం ఏమిటి అన్నది, ఒక మ్యూజిక్ స్టూడెంట్ చెప్పకుండా ఉంటే అసంపూర్తిగా ఉండదూ. నిసీ! నువ్వే నన్ను ఎన్నో సార్లు అడిగావు, కాన్సర్ట్స్‌కి మేము పంచే ప్రోగ్రాం పాంఫ్లెట్స్‌లో, మ్యూజికల్ పీస్, హిస్టారికల్ బేగ్రౌండ్ చెప్పమని. పాటల అర్ధాలు, కంపోజర్ గురించి చెప్పమనీ. ఎందుకు అడుగుతావు ఆ సమాచారం. ఊరికే సంగీతం విని ఊరుకోవే? ఎందుకు చదువుతావు?”
“యా. అన్నీ చదవాలి. ఐనా అన్నిటి వెనక చరిత్ర -ఎగతాళి, ఎద్దేవానే కాదుగా, డాక్టర్ రూబెన్! మీరు విద్యార్ధులకు చెప్పేప్పుడు మీ పాఠంలో వివరాలన్నీ చెప్పవచ్చుగా. క్లాస్‌లో ఆ విషయం మీరు చర్చించారుగా. ఈ విద్యార్ధిని ఒక్కతి, ఆ మ్యూజికల్ పీస్ గురించి ఆమె ఏమి చెప్పదలిస్తే అది చెపుతుంది. ఆమెకు వేరే రకంగా వినబడుతూ ఉండొచ్చు ఆ మ్యూజిక్. ఆమె దేనికి రెస్పాండ్ అవుతున్నదో దాని గురించి ఎక్కువ రాయగలదేమో. ఒక మ్యూజికల్ పీస్ మీద అందరూ ఒకే ఎనాలిసిస్ ఎందుకివ్వాలీ. డిబుస్సీ రాసిన పరిస్ధితులు ఏమైనా, ఆమెలో ఇప్పుడు కలిగించే ఆలోచనలు, ఉద్రిక్తతలు వేరు కాకూడదా.”
“హిస్టరీని రగ్గుల కిందకి ఊడ్చేద్దామా. అవమానం లేని చోట అవమానం తీసుకోటం ఎందుకూ? జ్యూయిష్ వాళ్ళ హోలోకాస్ట్ దాస్తారా?”
“దేర్ యు గో. మీ జ్యూయిష్ బాధ ప్రపంచానికి బాధ ఐపోయింది. మీరు కూడా తగ్గించాలి. ఉయ్ మస్ట్ రిమెంబర్, వి మస్ట్ నెవర్ ఫర్గెట్ – స్లోగన్లు. చూశారా? ఒకరి వేష భాషలు ఎగతాళి చెయ్యటం లోంచి, ఎలా ఒక్కసారిగా, ఒక మారణ హత్యాకాండలోకి వెళ్ళిపోయారు. ఇవి అన్నీ ఒకే లాటి విషయాలు కాదండి. మీ స్టూడెంట్ మంచి మనిషే. ఇతరులని బాధ పెట్టేవి వదిలెయ్యాలనుకుంటున్నది. సంగీతం హిస్టరీ కోసం, నిజం మనుషులను బాధించటం దేనికి? గడిచిపోయిన గార్బేజ్ ఎందుకు. ఆమె ఫేమిలీ తేలిక మనసులతో, వారి ఇప్పటి జీవితం గడుపుకోవాలి.”
“ఈమె విముఖతను కూడా క్లాస్‌లో చర్చించాం. నేను అది ఒక టీచబుల్ మూమెంట్ అనుకున్నా. ఎకడమిక్ ఇన్స్టిట్యూట్‌లో ఈ ఓపెన్ డిస్కషన్ అవసరం అనుకున్నా. స్టూడెంట్స్ ఎక్కువ మంది, ఆమెతోనే ఏకీభవించారు క్లాస్‌లో.”
“మీ ఉద్దేశం నా కర్ధం అయ్యింది. ఐ నో. మీ హృదయం నాకు తెలుసు. యూ ఆర్ మోర్ ఫర్ ది ఓపెన్ డిబేట్. ఏ విషయం గురించీ మాట్లాట్టానికి సిద్ధంగా ఉంటారు. అండ్ యూ ఆర్ రైట్. కాని, రకరకాల సెన్సిటివిటీ ఇష్యూస్, లెవెల్స్ ఉంటాయి. నో బడీ ఈజ్ ఓపెన్ ఆల్ ద టైమ్. డిబేట్ ఉంటుంది. కాని కన్సెన్సస్ ఉండదు. నేననుకోటం విద్యార్ధులు ఇక్కడ సంగీతంలో ఒక చిన్న గిమ్మిక్ కన్నా, ఇంకా పెద్ద ముఖ్యమైన విషయం గుర్తించారని. ఐ లైక్ ఇట్. దే వాంట్ టు మూవ్ ఆన్. గతం కన్నా ప్రస్తుతం వారికి ముఖ్యం. నాకు నచ్చింది.” – అంది నిసి.
“ఏంజెలాకి పిచ్చెక్కింది. ఈస్ట్‌మన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో లో ఇంటర్యూ వస్తే, బాయ్ ఫ్రెండ్‌కి ఇంకో ఊళ్ళో సీట్ వచ్చేట్టుందంట, అక్కడికి పోతానంటున్నది.” ఏంజెలా -ఒక ప్రైజ్ విన్నింగ్, పెరూవియన్ విద్యార్ధిని. బాయ్ ఫ్రెండ్ కూడా అలెక్స్ రూబెన్ దగ్గర పియానో విద్యార్థియే.
“అలెక్స్! పిచ్చి ఎవరికి? అందరూ నీకు లాగే సింగిల్‌గా ఉండిపోవాలా. వాళ్ళు కుర్రవాళ్ళు. సెక్స్ వాంఛ ఉండదూ? పెళ్ళి చేసుకుని ఒక కుటుంబం ఏర్పరుచుకుని పిల్లలని కనాలని ఉండదూ?”
“నేను సంగీతం నేర్పించిన ఆడవాళ్ళంతా ఇదే కథ! పెళ్ళి అయ్యాక సంగీతం అంతరించింది. అంత దానికి నేర్చుకోటం ఎందుకు? అందరి టైమ్ వేస్ట్.”
“మీ ఉద్దేశంలో, అందరూ కాన్సర్ట్ లిస్తేనే, సంగీతం సార్ధకం ఐనట్టా? ఎవరి పర్సనల్ రొమాన్స్ వారికుండదూ? మీరెక్కడి వాళ్ళండీ? మరెందుకు ఆ షోపేన్, షూమన్, షూబర్ట్‌ల లవ్ సాంగ్స్ వాయించటం. మీరు నమ్మని ప్రేమ పాటలు ఎందుకు వాయిస్తారండీ అసలు?”
“ప్రేమ, దోమ, అంతా ట్రాష్. ఈ అమ్మాయి అద్భుతంగా వాయిస్తుంది. అతను, ఈ పిల్ల బాయ్‌ఫ్రెండ్ – ఎప్పటికీ ఆమె స్థాయికి రాడు. అసలెందుకు అతడిని ప్రేమించటం. షి ఈజ్ ఏన్ ఇడియట్.”
అలెక్స్! ఈ మధ్యేగా ఏంజెలా పోలండ్‌లో ఒక పోటీలో గెలిచింది. ఆ అబ్బాయితో సెక్స్ ఆ అమ్మాయిని ఉత్తేజపరుస్తున్నట్టుంది. ముందటి కన్నా బాగా వాయిస్తున్నది. ప్రేమ అనుభవం లోకే రాని వాళ్ళు, ఆ సంబంధించిన ఇమోషన్స్ ఎలా పలికిస్తారు? ఆ చిన్న చిన్న పిల్లలు ఐదారు ఏళ్ళ వాళ్ళు వాయించినప్పుడు, నాకు పియానో అసలు వినబుద్ధి కాదు.”
“పియానో చదువు రెండేళ్ళ వయసు నుండీ మొదలెట్టొచ్చు. వాళ్ళ సంగీతం టెక్నికల్లీ కరెక్ట్‌గా ఉంటుంది. ప్యూరిటీ ఉంటుంది. ఏంజెలా ఎనిమిదేళ్ళ దాకా మొదలుపెట్టలేదు. ఐనా ఒక పదేళ్ళలో, చాలా నేర్చుకుంది. ఆమెతో సమానమైన వాళ్ళు, ఈ దేశంలోనే ఆ వయసులో మహా ఐతే ఇంకా ఇద్దరున్నారు. జీనియస్‌కి బాధ్యతలుంటయ్యి. వాళ్ళు సాధారణ మానవులలాగా ప్రవర్తించటం సరికాదు. షి హేజ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు మ్యూజిక్. నీకు తెలియదు నిసీ, సంగీతంలో సమ ఉజ్జీలు కాని వారి మేరేజ్, ఆ ఇద్దరి పతనానికి దారి తీస్తుంది.”
“సోది. ఏదో కొన్నాళ్ళైనా కిందా మీదా పడతారు. తర్వాత సరిపడకపోతే విడాకులిచ్చుకుని ఇంకోళ్ళను చేసుకుంటారు. ముందే డూమ్ ప్రఫెసీ ఎందుకండీ?”
“దట్స్ హౌ దోస్ స్టోరీస్ ఎండ్ నిసీ.”
“మే బి, మీకు తెలిసిన కొందరి కధలు అలా ముగిశాయేమో. మీ లాటి వాళ్ళ నుంచే వచ్చింది, ఆ సేయింగ్ – సెల్ఫ్ ఫుల్‌ఫిలింగ్ ప్రఫెసీ అని.”
“అన్ని తెలివితక్కువ కధలకీ ఒకటే ఎండింగ్. నీకే అంతా తెలుసనుకుంటావు పెద్ద. అంత తెలిస్తే నీ కథలు ఇంగ్లీష్‌లో ఎందుకు రాయవు? ద న్యూ యార్కర్‌లో ఎందుకు వేసుకోరు? అసలు ఎవరూ చదవని ఒక ఇండియన్ భాషలో ఎందుకు రాస్తావు?”
“నువ్వెందుకు ఈ పేరూ ఊరూ లేని యూనివర్సిటీకి పని చేస్తున్నావు? న్యూయార్క్‌లో ఎందుకు పని చెయ్యవూ. నువ్వో పెద్ద విద్వాంసుడివైతే, ఇక్కడెందుకు జేరావ్, అలెక్స్?”
“నీకు పాఠాలు చెప్పటానికి?”
“ఇంతవరకూ ఒక్క పాఠం చెప్పావా? నీకు డబ్బు కట్టి, నీతో ఏం లాభం లేక, ఇంటర్నెట్ మీద యూట్యూబ్‌లో, లండన్ నుండి స్టెయిన్‌వే ట్యుటోరియల్స్ తీసుకుంటున్నా. ఇంక ఈ దోపిడీ సాగనివ్వను.”
అతని ముఖం ఎర్రబడింది. “అన్యాయంగా మాట్లాడకు. మహా ఐతే కాన్సర్ట్స్ ఒత్తిడిలో ఒకటి, రెండు క్లాసులు అశ్రధ్ధ చేశానేమో.”
“కాచ్ అప్! ఆలెక్స్. నీ ఇతర విద్యార్ధుల సోది నాకు చెప్పొద్దు. వాళ్ళ గొప్పేంటీ, నా తక్కువేంటీ? అందరు స్టూడెంట్స్‌నూ ఒకే లాగా చూడ్డం నేర్చుకో. నువ్వు చూసొచ్చావా? ఏమో, నావల్ల నీకు ఎక్కువ పేరొస్తుందేమో.”
“నువ్వు నా బయోగ్రఫీ రాసి నాకు పేరు తెప్పిస్తానంటావ్. అక్కర్లేదులే. వారానికి ఒకసారి నీ ముద్దు ముఖం చూపిస్తే చాలు!” అని ఆమెతో ఎలివేటర్ దాకా కలిసి నడిచాడు.
అతని మీద ఒళ్ళు మండి, వారం అంతా పళ్ళు పటపటలాడించిన నిసి, మరుసటి వారం, వెళ్ళగానే ఏలెక్స్ రూబెన్ చేతిలో ఓ కాగితం పెట్టింది.
వెళ్ళి, పియానో ముందు కూర్చుని, రెడీ? అంది. అతను ఆ కాగితం కేసి చూసి నవ్వుకున్నాడు. ఆ కాగితంలో ఇలా ఉంది.
ప్రొగ్రామ్:
కంపోజర్: పీటర్ ఇల్యిచ్ చైకావ్‌స్కీ
మార్నింగ్ ప్రేయర్ ఇన్ జి మేజర్, ఓపస్ 39, నెం. 1
ఓల్డ్ ఫ్రెంచ్ సాంగ్ ఇన్ జి మైనర్, ఓపస్ 39, నెం. 16
ది సిక్ డాల్ ఇన్ జి మైనర్, ఓపస్ 39, నెం. 6
ది డాల్స్ బరియల్ ఇన్ సి మైనర్, ఓపస్ 39, నెం. 7
సింఫనీ నెం. 6, “పథెటీక్” ఇన్ బి మైనర్, ఓపస్ 74
స్వాన్ లేక్ ఇన్ ఇ మైనర్, ఓపస్ 20.
నిసి ఒకటి తర్వాత ఒకటి, ఆ చైకావ్‌స్కీ కాంపొజిషన్స్ పలికించింది. అలెక్స్ రూబెన్ గదిలో ఉన్నాడో లేడో కూడా పట్టించుకోలేదు.
అన్నీ వాయించాక ఆమె వెనక్కి తిరిగి చూసింది. అతని ముఖం మీద వింత భావం.
“నువ్వు వారం వారం, చెపుతావే – నీ స్నేహితులు, ఇంటర్నెట్లో గొప్ప కవిత్వం, వ్యాసాలు, కథలు రాస్తారని, అబ్బా, వాళ్ళంతా ఎంతో చదువుకున్నారనీ, చాలా బాగా రాస్తారనీ – మీరంతా రాసే ఆ అతి గొప్పభాష ఏమిటన్నావ్?”
“తెలుగు. Telugu.”
అతను, కంప్యూటర్ దగ్గరకు వెళ్ళి, కీస్ టకటకలాడించి ఒక కాగితం మీద పెద్ద అక్షరాలతో ప్రింట్ చేసి ఇచ్చాడు.
“మీరు నేడు మీ పాఠం చాలా అందమైన మ్యూజిక్ చేసింది. అభినందనలు! మంచి కృషి కొనసాగించండి.”
(నిసి షామల్ 2014 డైరీనుండి.)