“సభాసదులకు నమస్కారం. ఈ వేదిక నలంకరించినవారు, ఎంతోకాలం మనతో పనిచేసిన సహోద్యోగులూ, ఇప్పటికీ మనలో చాలా మందికి సన్నిహితులూ ఐన దంపతులు. వీరిరువురూ పదవీ విరమణ చేసి అనేక సంవత్సరాలు గడచినా, వీరితో మన అనుబంధం కొనసాగుతూనే ఉంది.
ఈవేళ వీరినిక్కడకు ముఖ్య అతిథులుగా పిలవడానికి కారణం, వీరి వివాహబంధానికి యాభై వసంతాలు నిండడం. కాశ్యపది కన్నడ దేశమైతే, మధుమతిగారు కేరళకు చెందినవారు. వీరిది మతాంతర, భాషాంతర వివాహం. ఈయన శ్రోత్రియుడూ, సనాతనాచార పరాయణుడూను. ఈమె యేసుప్రభువును నమ్మిన వనిత. భర్త కోసం పూర్తి శాకాహారిగా మారిన ఈమెను, ఆదివారం ఉదయం చర్చిలో తప్ప ఇంకెక్కడా చూడలేరు. భర్తతో తప్ప చూడలేరు. క్రిస్మస్ పండుగ వైభవం చూస్తే వీళ్ళింట్లోనే చూడాలి. సత్యనారాయణ వ్రతాన గానీ, వినాయక చవితిన గానీ, ఈమె పతికి సర్వదా సహచరి. పూజలలో కాశ్యపగారి గోత్రనామాల తరవాత, ‘ధర్మపత్నీ సమేతస్య’ అన్నప్పుడల్లా ఈయన ఛాతీ గర్వంతో పొంగేది. మధుమతిగారి శిరస్సు వినయంగా వంగేది. ఇప్పుడు కూడా. వీరి అన్యోన్యత అసామాన్యం. వీరి సహజీవనం అందరికీ ఆదర్శం. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ పోటీల్లో వీరిద్దరూ పాల్గొంటే, మరొక జంట బహుమతి గెలుచుకోవడం అసాధ్యం; ఇప్పటికీ కూడా.
కాశ్యప తోనూ మధుమతిగారితోనూ నా యాభై ఐదేళ్ళ మైత్రినిలా పంచుకోవడం ముదావహం. వీరికి గల ఆయురారోగ్య ఐశ్వర్యాలూ, ధనకనకవస్తువాహనాలూ వీరి భువనమోహనమైన దాంపత్యం లాగే చిరకాలం, కలకాలం నిలవాలని మనసారా కోరుకుంటూ, సెలవు.”
(చప్పట్లు)
“చిన్ననాటినుంచీ నేస్తమైన సుదర్శనం, మా పెళ్ళికిది స్వర్ణోత్సవం, మన స్నేహానికి షష్ఠిపూర్తి. వేదికనెక్కాక, ముఖ్య అతిధుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలి కాబట్టి నువ్వూ చెప్పావు. సంతోషం. అంతా బాగానే ఉంది. నా శ్రీమతి మధుమతీ నేనూ ఎక్కడ బహుమతులందుకున్నా, సన్మానాలందినా, అన్నిచోట్లా మా మతాలు వేరని మాకు మిగతావాళ్ళే ఎక్కువ గుర్తు చేస్తారు. ఇప్పుడు కూడా. ఎవరు చెప్పారు మా మతాలు వేరని? మాకు అనువంశికంగా సంక్రమించిన ఆచారాలు ఏవైనా, నా మతం మధుకు సదా సమ్మతం. తనకు నచ్చినదే నా అభిమతం.
(చప్పట్లు)
మేం మీరనుకున్నంత ఆదర్శప్రాయులమేం కాదు. మాకూ అభిప్రాయభేదాలూ, కోపతాపాలూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా. ఉదాహరణకి, ఈ వేడుక కోసం ఈవిడ వంగపండు రంగు పట్టుచీర తీసింది. నేనేమో నెమలికంఠం రంగు చీర కట్టుకోమన్నాను. చూశారుగా, చివరికి చెల్లింది చిలకాకుపచ్చ. దీని అంతరార్థం తెలిస్తే, మా జీవనవేదం మీరు గ్రహించినట్లే.
మా ఇద్దరి సంసారం జాయింట్ వెంచర్ ఐతే, తన వాటా 51శాతం. కాబట్టి మధుమతి నా అర్థాంగి కన్నా ఎక్కువే.
(నవ్వులు)
ఇద్దరూ సమానమనుకుని నేనెప్పుడైనా ఆ ఒక్కశాతం కోసం ప్రయత్నిస్తే అది జాయింట్ ఎడ్వెంచర్ ఔతుంది. ఇక్కడ జాయింట్ అన్న పదం కీళ్ళకు సంబంధించినది.
(మళ్ళీ నవ్వులు)
నేను, సంతోషంగా సంసారం సాగించడం ఎలా? అని పుస్తకం రాయను. దీన్ని గురించి సలహాలివ్వను. సందేశాలంతకన్నా ఇవ్వలేను. ఈ సన్మానం ఘనత నా శ్రీమతికే చెందుతుంది. తనేమైనా చెప్పదలుచుకుంటే వినండి. నమస్తే.”
(చప్పట్లు)
“అందరికీ వందనం. మీరు చేసే ఈ సందడి గమ్మత్తైనది. ఎందుకంటే, మాకు పెళ్ళై యాభై యేళ్ళైందేమోగానీ పెళ్ళి రోజు మాత్రం యాభై సంవత్సరాల తరవాత రావడం అసాధ్యం. రజతోత్సవాలూ స్వర్ణోత్సవాలూ వజ్రోత్సవాలూ కూడా అంతే. ఎందుకంటే మా పెళ్ళి జరిగింది ఫిబ్రవరి 29న. అంటే ఇప్పటిదాకా పన్నెండు వార్షికోత్సవాలు మాత్రమే ఐనట్లు.
(చప్పట్లు)
మా శ్రీవారు చెప్పినట్లు, మేమేం ఆదర్శ దంపతులం కాము. చిన్నచిన్న విషయాల మీద వాదించుకోవడం మాకు మామూలు. ఇప్పుడు కూడా. మేం కలిసీ, విడివిడిగానూ ఎన్నో ఒడిదుడుకులనెదుర్కొన్నాం. కష్టనష్టాలనుభవించాం. సుఖదుఃఖాలతో సహజీవనం సాగించాం. బోల్డన్నిసార్లు పోట్లాడుకున్నాం. పోట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా. బాధలలోనూ వాదనలలోనూ మా బంధం బలపడిందే గానీ మరొకమాట లేదు.
ఆ ప్రభువు నేనడగకుండానే అన్నీ ఇచ్చాడు. ఈయన అడిగి మరీ, అడిగించుకుని మరీ ఎన్నెన్నో అమర్చాడు. ఈ సాంగత్యం సంతృప్తితో కూడినది. బ్రతుకంతా నిండినది. ఐనా చాలనలేనిది. మరి ఈ జన్మ తరవాత? …”
మధుమతి గొంతు గద్గదమైంది. తను అనుకుంటున్నది నాకవగతమైంది. దబ్బపండు వంటి మనిషి చిగురుటాకులా వణికింది. నాకళ్ళు చెమర్చాయి. తను కళ్ళు వత్తుకుంది. నెమ్మదిగా కూర్చుంది. అంతా లేచి నిలుచున్నారు. నేనూ లేవబోయాను.
నాకు అలసట వచ్చిందో నిద్ర పట్టిందో తెలియని స్థితి. కళ్ళముందు పెద్ద వెలుగు. అంతలోనే చిమ్మ చీకటి. శరీరం తేలికైపోయినట్లూ గాలిలో తేలిపోతునట్లూ అనుభూతి. నేను ఎగురుతున్నానా, పడిపోతున్నానా? చుట్టూ చలి వెయ్యని చల్లదనం, చెప్పలేనంత నిశ్శబ్దం. ఇది కల కాదు కద? ఏమైంది? ఏమౌతోంది? ఎంతసేపు గడిచింది?
స్పృహ వచ్చింది. ఆకాశం ఏది? అంతటా నీలం, తెలుపుల కలయిక గల కాంతి. పందిరి లేకుండా పైకి పాకిన లతలు. అసలవి క్రింది నుంచి పైకి పాకుతున్నాయా లేక పైనుంచి వ్రేలాడుతున్నాయా? వాటినంటుకుని, రేకల అంచులకు వజ్రపుపొడి అద్దినట్లు మెరిసే పువ్వులు.
నేననేవాడిని ఉన్నట్లు తెలుస్తోంది గానీ ఎక్కడున్నాను? ఎలా ఉన్నాను? ఎదురుగా ఒక మహాద్వారం. అది తెరుచుకుని ఉన్నట్లే ఉంది గానీ అవతల ఏముందో తెలియడం లేదు. పక్కనే ఒక వ్యక్తి, బహుశా దేవలోకానికి చెందినవాడు కావచ్చు, నన్నుద్దేశించి మాట్లాడాడు.
“నీకు లోపలికి రమ్మని ఆహ్వానం. తీసుకు రమ్మని ఆజ్ఞ.”
“ఎవరు మీరు?”
“మరణించినవారిని మరోలోకంలో చేర్చే వాళ్ళల్లో ఒకడిని.”
“మీరు గంధర్వులా?”
“అనుకో.”
“మరోలోకం అన్నారు, ఏమిటది?”
“నీకు సంబంధించినంతవరకూ, స్వర్గం.”
“అంటే నేను ముందు స్వర్గానికీ అటుపైన నరకానికీ వెళ్తానా?”
“నువ్వు పుణ్యాత్ముడివి. నీకెప్పటికీ స్వర్గమే.”
“మరి నేనొక్కడినే ఎందుకున్నాను? భూమ్మీద నాతోపాటు అదే సమయానికి ఇంకెవరూ చనిపోలేదా?”
“చాలామంది చనిపోయారు.”
“మరి వాళ్ళంతా నరకానికి పోయి, నేనొక్కడినే స్వర్గానికి వెళ్తున్నానా?”
“అటువంటిదేం లేదు.”
“వాళ్ళేరీ మరి?”
“నీలాగే అందరూ ద్వారం దాటుకుని వెళ్తారు.”
“ఎవ్వరూ కనబడరేం?”
“వాళ్ళ వాళ్ళ ద్వారాల దగ్గరున్నారు.”
“ఆ ద్వారాలేవీ?”
“ఒక్కొక్కరికీ ఒక్కొక్క ద్వారం ఉంటుంది.”
“అవి ఎన్నున్నాయ్?”
“ఎన్నైనా సరే.”
“కోటిమందికైనా సరే?”
“కోటిమందికైనా సరే.”
“ఒకరికొకరు కనబడరేం?”
“అదంతే.”
“అంటే?”
“నేనిక్కడ ఉన్నది నిన్ను లోపలికి తీసుకుపోవడానికి గానీ, నీకు సమాధానాలివ్వడానికి కాదు. లోపలికి రా.”
“లోపల ఏముంది?”
“చెప్పానుగా, స్వర్గం.”
“అంటే లోపల కైలాసం, వైకుంఠం, ఇవన్నీ ఉన్నాయా, అవి వేరే లోకాలా?”
“లోపలికి వస్తే తెలుస్తుంది.”
“నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని కొలిచేవాడిని. ఇప్పుడూ అలాగే చేయ్యాలనుకుంటున్నాను. ఆ సమయంలో ఆయా దేవతలు నాకు ప్రత్యక్షంగా కనిపిస్తారా?”
“లోపలికి వస్తే తెలుస్తుంది.”
“కోట్లమంది మనుషులకి కోట్లాది ద్వారాలు పెట్టారు కదా, మరి క్రిమికీటకాలూ, పశుపక్ష్యాదుల సంగతేమిటి? వీటన్నిటికీ వేరువేరు స్వర్గాలూ, నరకాలూ, ద్వారాలూ ఉంటాయా?”
(గంధర్వుడు మాట్లాడలేదు.)
“మా సుదర్శనం నాస్తికుడు. అతనేలోకానికి వెళ్తాడు? నాస్తికులకంటూ ఇంకోలోకం ఉందా?”
“స్వర్గలోకం చేరబోతున్నా వేళాకోళాలు మానవా?”
“మానవుడిని గదా.”
“అది నీ గత జన్మలో.”
“నాకు పూర్వజన్మ వాసనలింకా పోలేదు స్వామీ!”
“ఎన్నో వ్రతాలు చేశావే, ఫలం దక్కే వేళ ఎందుకీ వాదన?”
“సుదర్శనం సంగతి చెప్పండి.”
“మనిషి దేవుడిని నమ్మకపోయినా, దేవుడు మనిషిని పట్టించుకుంటాడు. కాకపోతే, నాస్తికులకి స్వర్గం, నరకం, మరోలోకం, నాస్తి. చచ్చిన తరవాత, వాళ్ళసంగతే వాళ్ళకు తెలియదు.”
“మీకు తెలుస్తుందా?”
“లోపలికి వస్తే తెలుస్తుంది.”
“నా భార్య ఎక్కడ?”
“మీరిద్దరూ ఒకేసారి మరణించడం జరిగింది.”
“తనెక్కడ?”
“నీలాగే మరోద్వారం దగ్గర ఉంది.”
“తను హిందువు కాదు. ఎక్కడికి వెళ్తుంది?”
“ఎవరే దేవుడిని కొలిస్తే వాళ్ళా దేవుడి దగ్గరకి వెళ్తారు.”
“అంటే నాతో ఉండదా?”
“ఎవరి లోకం వారిది.”
“బతికున్నప్పుడే మా మతాలు మమ్మల్ని విడదీయలేక పోయాయి. ఇలా చంపి మమ్మల్ని వేరు చెయ్యడం అన్యాయం.”
“ఇక్కడ అన్యాయం అన్న మాటే లేదు.”
“తెలుస్తూనే ఉంది. నా భార్య లేని లోకం స్వర్గమైనా నాకక్కర లేదు.”
“కావాలంటే తనను నీతోపాటు లోపలికి పంపే ఏర్పాటు చేస్తాను.”
“కుదరదు.”
“ఏం?”
“బతికున్నంతకాలం నాతోపాటు పూజలు చేసినా, మనసా తను క్రీస్తు సన్నిధినే కోరుకుంది. దాని కోసమే కలలు కన్నది.”
“ఇప్పుడు కూడా అలాగే ఉండవచ్చు.”
“కుదరదు.”
“ఏం?”
“నాకు మీరిచ్చే స్వర్గంలో తనకు స్వేచ్ఛ తగ్గిపోతుంది. బతికినంతకాలం నా సహధర్మచారిణి. ఇక్కడకూడా నా యిష్టాలతో తనని రాజీ పడమని అడగలేను.”
“పోనీ నువ్వే అక్కడికి వెళతావా?”
“ఎక్కడికి?”
“చెప్పానుగా, ఎవరిలోకం వారిదని. తనలోకం తనకిష్టమైన లోకం.”
(నేను నవ్వాననుకున్నాను. కానీ తెలియలేదు.)
“మాట్లాడవేం?”
“అదీ కుదరకపోవచ్చు.”
“ఏం?”
“నా అర్థాంగి ఏం చెబుతుందో నాకు తెలుసు.”
“అర్థాంగి అంటే సగం శరీరం గలదని. ఇక్కడ మీకు శరీరాల్లేవ్.”
“ఐతే అర్థాత్మ అననా?”
“ఆత్మలకి అర్థలూ ముప్పావులూ ఉండవ్.”
“అవన్నీ నాకనవసరం. నా భార్యని నేను చూడాలి. తను లేని స్వర్గం నాకక్కర్లేదు.”
“అదిగో, అటు చూడు.”
కాస్తంత దూరంలో మరొక ద్వారం. అది కొంచెం వేరేగా ఉంది. బహుశా ఇక్కడి ద్వారం కన్నా పెద్దది. అక్కడ లీలగా రెండు ఆకారాలు కనబడ్డాయి. దగ్గరకు వెళ్ళాను. వెళ్ళడమంటే నడిచి వెళ్ళానా, ఎగిరి వెళ్ళానా, లేక ఇక్కడ మాయమై, అక్కడ ప్రత్యక్షమయ్యానా, తెలియదు. తక్షణం ఆ ఆకారాల ముందున్నాను. ఒకాయన, సుమారు పదిహేనడుగుల పొడవు ఉండవచ్చు, నిలువెల్లా దుస్తులు ధరించి ఉన్నాడు. ఎదురుగా మధుమతి.
ఇదివరకు (అంటే బతికున్నప్పుడు) ఒక్కరోజు చూడక తనని చూస్తే, చూసిన వెంటనే గుండె ఝల్లుమనేది. ప్రేమలోపడ్డ మొదటి చూపు మొదలుకుని పెళ్ళైన తరవాత చివరిదాకా అదే తీరు. ఇప్పుడు కూడా, హృదయం ఉందో లేదో కానీ, స్పందన అదే.
“మధుమతీ, ప్రభువు నీకు స్వాగతం పలుకుతున్నాడు. లోపలికిరా.”
“ఎవరు మీరు?”
“దేవదూతను.”
“ఏ ప్రభువు?”
“యేసు ప్రభువు.”
“ఎంతటి అదృష్టం! పదండి.”
(క్షణం ఆగి,) “మరి నా భర్త?”
“ఆయనా నీతోపాటే మరణించడం జరిగింది.”
”తనెక్కడ?”
“నీలాగే మరో స్వర్గద్వారం దగ్గర ఉన్నాడు.”
“అంటే మా స్వర్గాలు వేరువేరా?”
“ఎవరే దేవుడిని కొలిస్తే వాళ్ళా దేవుడి దగ్గరకి వెళ్తారు.”
“అంటే నాతోపాటు ఉండడా?”
“అతనూ నీలాగే పుణ్యం చేసుకున్నవాడు. నీతోపాటు ఇక్కడే ఉంటే మాకేం అభ్యంతరం లేదు.”
“అది కుదరదు.”
“ఏం?”
“నాతో వస్తే, తన పూజాపునస్కారాల సంగతేమిటి?”
“నువ్వు కోరుకున్న దేవుడి సన్నిధిలో నువ్వుంటావు. నీ భర్త నీతోనే ఉంటాడు.”
“లోపలికి రావడం నాకిష్టమే. కానీ, ఒంటరిగా కాదు. అలాగని, ఆయన ఆచారాలకు వీలులేని చోటికి రమ్మని పిలవలేను. కాబట్టి నేను రాలేను.”
“మరేం చేస్తావు?”
“తనెక్కడుంటే నేనూ అక్కడే.”
“ఐతే వాళ్ళ స్వర్గానికి నువ్వు వెళ్ళవచ్చు.”
“అదీ కుదరకపోవచ్చు.”
“ఏం?”
“తన మనసు నాకు తెలుసు. నేనక్కడకి వెళ్తే, బతికున్నప్పుడు నేనూహించుకున్న స్వర్గాన్ని తనకోసం జారవిడవడమౌతుందని, ఆయన ఒప్పుకోడు.”
అంతా వింటున్న గంధర్వుడన్నాడు:
“అదేమిటి, మీ ఆవిడ కూడా అచ్చం నీలాగే వాదిస్తోంది?”
“అది వాదన కాదు, వేదన.”
ఇలా గంధర్వుడితో అంటూండగానే, దేవదూతా మధూ మా దగ్గరకు వచ్చారు.
“సరే, మీరిద్దరూ బాగా ఆలోచించుకుని ఏకాభిప్రాయానికి రండి.”
“ఏడ్చినట్లుంది. మా ఇద్దరిదీ ఏకాభిప్రాయమనేకదా మీకీ బాధ? ఇక చర్చించుకుని కొత్తగా చెప్పేదేముంది?”
“ఇంతవరకూ మాకిలాంటి సమస్య ఎదురు కాలేదు. దేవదూతా నేనూ పెద్దలతో మాట్లాడి, మీకు న్యాయం చేస్తాం.”
“అంటే మాకన్యాయం జరుగుతోందని ఒప్పుకున్నట్లేగా!”
“చెప్పానుగా, ఇక్కడ అన్యాయమన్న ప్రసక్తే లేదు. మీ వ్యవహారం వెంటనే తేలిపోతుంది.”
“ఓహో, స్వర్గంలో తేలిపోవడమంటే ఇదన్నమాట.”
మధు నవ్వింది, మృదువుగా, మధురంగా, ముగ్ధమనోహరంగా. యాభైమూడేళ్ళ క్రితం పడిపోయానీ నవ్వుకి. ఆతరవాతా పడిపోతూనే ఉన్నాను, ఇప్పటికీ కూడా.
“హలో శ్రీవారూ!”
“హాయ్ ప్రియతమా!”
“మొట్టమొదటి సారి మీరు నాతో రావడం యిష్టం లేదని చెప్పాను.”
“నేనూను.”
“ఒకపని చేద్దాం. ఇక్కడే చెరో ద్వారం దగ్గరా కాపలాకి కుదిరిపోదామా?”
“ఇప్పుడు మనం స్వర్గస్థులవ్వాలి. అంటే స్వర్గం లోపల ఉండాలి. బయట నిలబడి ఉద్యోగాలు చెయ్యడానికి కాదు.”
“చూద్దాం, ఏం చెబుతారో.”
“చూద్దాం కాదు, విందాం.”
చూస్తే దేవదూతా గంధర్వుడూ లేరు.
కనిపించని ఆకాశంలోంచి పడిపోతున్న తారాజువ్వ లాగానూ, అటు తరవాత చీకట్లో దిగబోతున్న విమానం లాగానూ కనిపించిందొక కాంతిపుంజం. మా దగ్గరకు రాగానే రూపు దిద్దుకుంది. సుదర్శనం!
“హాయ్ కాశీ, హలో మధుమతీ!”
“స్వాగతం మిత్రమా!”
“ఏమిటి, మీరిక్కడ?”
“మేమిక్కడ కాదు, నువ్విక్కడ.”
“అంటే?”
“ఏం లేదు, మాతోపాటు నీక్కూడా కాలం చెల్లింది.”
“అంటే?”
“నువ్వూ మాలాగే స్వర్గద్వారాల దగ్గర ఉన్నావు.”
“ఏ ద్వారాలు?”
“ఇవిగో, పక్కపక్కనే రెండున్నాయి. కనబడటం లేదూ?”
“లేదు.”
“మేం కనిపిస్తున్నాం కదా?”
“ఔను.”
”పూలూ లతలూ కనిపిస్తున్నాయా?”
“మీరిద్దరూ తప్ప అంతా శూన్యంగా ఉంది”
“అదీ సంగతి. ఏవైనా నమ్మిన వాళ్ళకే కనిపిస్తాయి. నువ్వు నమ్మవు కాబట్టి, నీకవి లేవు.”
“ఏమిటవి?”
“స్వర్గాలూ, నరకాలూ, ద్వారాలూ”
“మీరు నమ్మారుగా, అక్కడ లేకుండా ఇక్కడెందుకున్నారు?”
“మా మా దేవతలకి మా సంగతి తేలక.”
“అంటే?”
“మా మతాలు వేరు కనక మా స్వర్గాలు వేరట. మేం చెరోచోటా ఉండం అంటే మమ్మల్ని ఏం చెయ్యాలో పెద్దవాళ్ళనడిగి తెలుసుకు వస్తామని వెళ్ళారు.”
“అర్థం కాలేదు.”
“పూజించిన దేవుడిని బట్టి, మరణించిన తరవాత ఎవరే లోకంలో ఉండాలో నిర్ణయించడం జరుగుతుంది. మా ఇద్దరి దేవుళ్ళూ వేరువేరు కాబట్టి, మమ్మల్ని చెరో చోటకీ రమ్మన్నారు. మేం కుదరదన్నాం. ఐతే నచ్చినచోటే యిద్దరినీ కలిసి ఉండమన్నారు. అదీ వీల్లేదని చెప్పాం. మమ్మల్ని ఏం చెయ్యాలో పెద్దవాళ్ళనడిగి తెలుసుకు వస్తామని వెళ్ళారు.”
“దేవుడిని నమ్మని నాలాంటి వాళ్ళ సంగతేమిటి?”
“నీకే దేవుడూ కనబడడు. నువ్వు మమ్మల్ని గుర్తించావు. అందుకనే మేం నీకు కనిపిస్తున్నాం.”
“ఇంతవరకూ ఇది కల అనుకున్నాను. నేనూ బాల్చీ తన్నేశానని మీరు చెబుతూంటే తెలుస్తోంది.”
“మరి వెంటనే కనబడలేదేం?”
“సభలో మీరిద్దరూ ఒకరి తరవాత ఒకరు ఒరిగిపోగానే, నాకళ్ళకూ చీకట్లు కమ్మాయి. తక్షణం లక్షలకొద్దీ నక్షత్రాలు ప్రత్యక్షమయ్యాయి. అన్నీ చుట్టి వస్తున్నాను.”
“తరవాత?”
“ఎంతసేపు తిరిగినా అవే అవే నక్షత్రాలు. లోకమంతా చుట్ట చుట్టుకుని ఉన్నట్లనిపిoచింది. విసుగెత్తి వెనక్కి వచ్చేశాను.”
“నక్షత్రాల దగ్గరికి వెళితే వేడిగా అనిపించలేదా?”
“లేదు మధుమతిగారూ.”
“ఏం?”
“ఆత్మ నిత్యము. అది నీట నానదు, అమ్ముతో తెగదు, అగ్ని నీరైపోదు అన్నారు కదా, అందుకే నాకేం కాలేదేమో.”
సుదర్శనం ఎలా వచ్చాడో అలాగే మాయమయ్యాడు.
ఒక మెరుపు మెరిసింది. రెండు రూపాలు మా ముందు నిలిచాయి. ఒకాయన, ఇంతకు ముందు కనిపించిన దేవదూత లాగే ఉన్నాడు కానీ ఆ తేజం అత్యద్భుతం. విగ్రహం దివ్యసుందరం. ఇంకొకరు, వీణ పట్టుకుంటే సరస్వతి కావచ్చు, శూలమైతే దుర్గాదేవి. నిలువెల్లా నగలున్నాయిగానీ, లక్ష్మీదేవి కాకపోవచ్చు.
ఇద్దరూ ఒకేసారి, మాతో విడివిడిగా మాట్లాడడం మొదలు పెట్టారు. కాలం రెండుగా విడిపోయిందా, లేక నేనే ఇద్దరుగా మారి రెండు సంభాషణలూ ఒకేసారి వింటున్నానా, చెప్పడం కష్టం. ఆ దేవత నాతోనూ, దివ్యపురుషుడు మధుతోనూ మాట్లాడతారనుకున్నాను. ఐతే, దేవత మధుమతితో అన్నది:
“ఎంత చక్కగా సంసారం సాగించావమ్మా!”
“ఏం లాభం? మీరు మమ్మల్ని విడదీస్తున్నారు.”
“మనుషుల అనుభవాలు ఆ లోకానికే పరిమితం. అటుపైదంతా అన్నిటికీ అతీతం.”
“అటువంటప్పుడు మాకు గతజన్మ జ్ఞాపకాలింకా ఎందుకు మిగల్చాలి?”
“దైవాన్ని నమ్మినవాళ్ళకి, భూలోకంలో చేసిన పనుల పర్యవసానం పైలోకంలో తెలియాలి. స్వర్గమైనా, నరకమైనా.”
“మరి నాస్తికులకి తెలియదన్నారుగా.”
“ప్రపంచంలో నాస్తికులు కొద్దిమందే. వాళ్ళు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ప్రమాదం లేదు. కానీ అందరూ నాస్తికులైతే, దైవభక్తీ పాపభీతీ లోపిస్తాయి. తద్వారా అరాచకం మరింత పెరుగుతుంది.”
“మరి కులమతాలూ ఆచారవ్యవహారాలలో తేడాలవల్ల, అభిప్రాయభేదాలూ, ఘర్షణలూ తలెత్తుతున్నాయికదా?”
“అవి తాత్కాలికం. కులమతాలూ, ఆచారాలూ, సాంప్రదాయాలూ మనుషుల్ని విడదీయడం కన్నా, కలిపే ఎక్కువ ఉంచుతున్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇవి మనుషుల్ని వర్గాలుగా విడదీసినా, వర్గంలో కలిపే ఉంచుతున్నాయి.”
సుదర్శనం చెవిలో చెప్పినట్లనిపించింది, “నిజమేరా కాశీ, అందరూ దేవుడున్నాడని నమ్మితే, నేను లేడని నమ్మాను. దేనికైనా నమ్మకం ముఖ్యం. ఈ నమ్మకం ఆధారంగానే కదా మా నాస్తికసంఘం వెలిసింది. ఈ విషయంలో మేం మీనుంచి వేరుపడినా, మాలోమేం కలిసే ఉన్నాం.”
దివ్యపురుషుడు నాతో అన్నాడు,
“నాయనా, నీకేమనిపిస్తోంది?”
ఆయన కంఠం, మేఘం స్వరం తగ్గించి మాట్లాడినట్లుంది.
“భూలోకంలో వేరు చెయ్యని వ్యవహారాలు మమ్మల్నిక్కడ విడదీస్తున్నాయి.”
“మీరిద్దరూ ఒకరి నమ్మకాలను మరొకరు గౌరవించుకోవడం ఔదార్యమనీ, ఔన్నత్యమనీ భావించారేగానీ, మీ మీ అహంభావాలను విడిచిపెట్టలేదు. అందుకనే, మీరు పరాయిలోకానికి వెళ్ళడం మీకిష్టం లేదని చెప్పకుండా, మీ జీవితభాగస్వామి పేరుచెప్పి దాటవేశారు. మీరిద్దరూకూడా ఒకరికొకరు సహకరించామని ఎంతగా అనుకున్నప్పటికీ, సాంప్రదాయం పేరిట ఛాందసంగానే వ్యవహరించారు.
మీకు మీరు నమ్మిన దైవాలమీద ఎంత భక్తి ఉందో, ఒకరిపైన మరొకరికి అంతే ప్రేమ ఉంది. అంతకన్నా ఎక్కువ మాత్రం లేదు. మీ ప్రేమ సరిహద్దులు భక్తి వలయం దగ్గర ఆగిపోయాయి. నీ భక్తి సామ్రాజ్యంలో నువ్వు నీ భార్యకు చోటివ్వలేదు.”
“తను అన్నిపూజలలోనూ నాకు సంపూర్ణంగా సహకరించింది. తన విషయంలో నేనూ అలాగే చేశాను.””
“మీ భక్తిప్రపత్తులు రైలు పట్టాల లాంటివి. ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి. దూరాన్నుంచిచూస్తే కలిసిపోయినట్లుగా కనబడతాయి. కానీ వాటి మధ్య దూరం ఎప్పటికీ తరగదు.”
“మా భక్తి ఎప్పుడూ మా ప్రేమకి అడ్డంకి కాలేదు.”
“పైకి అలా చెప్పినా, నీ భక్తికి నువ్వొక గిరి గీసుకున్నావు. ఆ గీతదాటి ఆలోచించలేకపోయావు. అందుకనే, నీ దేవత నీతోనూ, నేను తనతోనూ మాట్లాడతారని ఆశించావు.”
“భక్తి అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఐనా సరే, నా భక్తికోసం తనూ, తన నమ్మకాల్ని సమర్థించడంలో నేనూ, ఏనాడూ వెనుకాడలేదు, విసుగుచెందలేదు.”
“మనస్ఫూర్తిగా అంగీకరించలేదు కూడా. అంతేకాదు, మీ మతాలు వేరని మీ అంతరాంతరాలలో మీరిద్దరూ అనుకోని క్షణం లేదు, స్వర్గం చేరినా సరే.”
“ఇది నేనొప్పుకోను”
“నువ్వు మధుమతిని మనసారా ప్రేమించావు. ఆ ప్రేమలో భాగంగా ఆమె అభిప్రాయాల్ని గౌరవించావు. నీకు సంబంధించినంతవరకూ, ఆమె భక్తి ఒక అభిప్రాయం లాంటిది మాత్రమే. అభిప్రాయాలను గౌరవించడం వేరు, అర్థం చేసుకుని పాటించడం వేరు.”
“నాకు క్రైస్తవ ప్రార్థనలూ పద్ధతులూ క్షుణ్ణంగా తెలుసు. బైబిలు కూడా బోల్డన్నిసార్లు చదివాను.”
“సుదర్శనం నీకన్నా ఎక్కువ చదివాడు. నీ పూజలన్నీ జరిపించింది తనే. అంతమాత్రాన అతనికి భక్తి ఉన్నట్లా?”
“సుదర్శనం నాస్తికుడు. అతనికీ నాకూ పోలిక లేదు.”
“ఇతర మతాలపట్ల నువ్వూ నాస్తికుడివే.”
నాకు నోరు పెగల్లేదు. లోలోపల ఒక విస్ఫోటనం.
“అమ్మాయీ, ఏనాడైనా నువ్వొక రూపాయి బిళ్ళైనా గుళ్ళో హుండీలో వేశావా?”
“అవన్నీ ఆయన చూసుకునేవాడు”
“నువ్వు చర్చిలో విరాళాలిచ్చేదానివి”
“ఎవరికిష్టమైనది వాళ్ళు చెయ్యడంలో తప్పేముంది?”
“జీవితమంతా అన్యోన్యంగా బతికిన మీరు, భక్తి దగ్గర విడిపోయారెందుకని?”
“ఇది నేనొప్పుకోను. మా మతాలు మమ్మల్నెప్పుడూ విడదీయలేదు. ఇప్పుడు కూడా”
“మీ భక్తి మిమ్మల్ని విడదీయకపోతే ఇంకా ఇక్కడే ఉన్నారెందుకని?”
“మేమేం పూజలు చేసినా, కలిసే చేశాము”
“నీకు భర్త పట్ల గల ప్రేమతో తన భక్తిని ఆదరించావంతే. ఆ ఆదరణ అంతటితో ఆగిపోయింది.”
“నా ధర్మం నేనెప్పుడూ తప్పలేదు”
“నీలో ప్రేమా భక్తీ ధర్మం, అన్నీ ఉన్నాయి. కానీ విడివిడిగా.“
“అర్థం కాలేదు”
“తన భక్తిని గౌరవించడం నీ ధర్మంగా భావించావు. కానీ నీ భక్తిని నీ భర్త భక్తితో ఎప్పుడూ అనుసంధానించలేదు.”
మధుమతి మోకరిల్లింది. మెల్లగా అన్నది, “తెలుసుకోలేకపోయాను తల్లీ.”
తెలియని తెరలేవో నా కళ్ళముందు నుంచి తెగిపడినట్లనిపించింది. నా ఎదురుగా ఇప్పుడున్నదొకే ద్వారం. ఆ ద్వారానికవతల స్పష్టంగా కనిపిస్తోందొక అందమైన లోకం. లోపలినుంచి మలయమారుతం వీచినట్లు వినిపిస్తోంది వాయులీనం.
స్వర్గమే నాదగ్గరకొస్తోందా, నేనే లోపలికి వెళ్తున్నానా, తెలియలేదు. మధుమతీ సుదర్శనం, దేవతా దివ్యపురుషుడూ, దేవదూతా గంధర్వుడూ, అంతా కనిపించారు. కనిపించారా, మెరిసి మాయమయ్యారా? వాళ్ళు మాయమవ్వలేదు. వాళ్ళ రూపాలు మాత్రం మెల్లమెల్లగా, కరిగిపోయినట్లుగా, ఒకేలాగ అనిపిస్తున్నాయిప్పుడు. అంతా ఒక్కటే. అందరూ ఒక్కటే.
క్షణం తరవాత, అన్నీ అదృశ్యం. ద్వారాలూ దేవతలూ ఏమీ లేవు. నేనెలా ఉన్నాను? నేనూ లేను.