ప్రతీక

దుర్గేష్ మోదీ, కళ్ళు తిప్పుతూ, డిపార్ట్‌మెంట్‌లో ‘ఇండియాత్వం’ గురించి మినీ లెక్చర్ మొదలెట్టినప్పుడల్లా, కుర్చీలోకి కుదించుకు పోయేది నిసి. ఆ రోజు భారతీయత గురించి ఏమి ఆణిముత్యాలు ఆమె నోటినుండి రాలతాయో అని. అసలు ఆమె ముఖమే నిసికి నచ్చదు. కాని, హిందీ తారలా నల్లని గుడిసె లాటి బాబ్డ్ హెయిర్ తలకాయిని అటూ ఇటూ తిప్పుతూ, అప్పుడపుడూ జారే సిల్క్ చీర మళ్ళీ భుజం మీదుకు చేరుస్తూ దుర్గేష్ మాట్లాడుతుంటే, లంచ్ టైంలో ట్యూమర్ కాన్ఫరెన్స్ ముందు కొందరికి అది కొంత వినోదం.

ఆ రోజు ఆమె ఇలా సెలవిచ్చింది:

నవీన్ (దుర్గేష్ ఐదేళ్ళ కొడుకు) – “మమ్మీ, మా క్లాస్‌లో అంతా తెల్లగా ఉంటే, నే నల్లగా ఉన్నానేం?” – అన్నాడు. నేను “నిన్న కుక్కీలు బేక్ చేసినప్పుడు, కొన్ని తెల్లగా, కొన్ని బ్రౌన్‌గా, కొన్ని నల్లగా మాడిపోయి రాలా? వాటిలో నీకేం కుక్కీలు బాగున్నయ్? పండూ!” – అని అడిగా. వాడు “బ్రౌన్‌వి మమ్మీ” అన్నాడు.

“చూశావా ! దేవుడు మన మనుషుల బొమ్మల్ని అవెన్లో బేక్ చేసినప్పుడు, సరిగ్గా బేక్ ఐనవి, ఇండియన్లు రా. మన రంగు పర్ఫెక్ట్. కరెక్ట్. పిండి తక్కువ కాలితే, వాళ్ళు తెల్లవాళ్ళయ్యారు. మాడితే నల్లవాళ్ళయ్యారురా పండూ.” అని చెప్పా.

ఇలా, దుర్గేష్ మోదీ ఆ నానా జాతి సైంటిస్టులు, డాక్టర్ల సమితికి వివేకానందినియై, సామరస్యం కలిగిస్తున్నా ననుకుంటూ, రేషియల్ ఇవల్యూషన్ గురించి చిన్ని బోధలు చేసేది.

ఏ కాన్సర్ గురించి గానీ ఆమె చేసిన డిస్కషన్స్ ఒకరికైనా గుర్తున్నాయో లేదో గాని, ఇండియన్ పెళ్ళి పేరంటాల గురించి; చీరల నాణ్యతలు, ధరించే విధానాల గురించి; బొట్టు కాటుకలు, గాజులు, వాటి అర్ధం; కట్నం కానుకలు, వాటి విశిష్టత; భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గురించి ఆమె స్లయిడ్లు లేకుండానే న్యూయార్క్ నగరంలో, ఓ జ్యూయిష్ దాత స్థాపించిన ఒక పెద్ద హాస్పిటల్లో, ఆ అమెరికన్లకు అడపా దడపా చిన్ని కోర్సులు, రిఫ్రెషర్ కోర్సులుగా పరిచయం చేసేసింది.

అమెరికన్లు అంటున్నా అప్పుడు ఆ టేబిల్ దగ్గర సమావేశం అయినది చాలా మంది ఇంకా స్టూడెంట్ వీసాల మీద, జె-1 వీసాల మీద ఉన్న వారే. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. కొందరు ఇంగ్లీషు టోఫెల్ పరీక్షలతో, కొందరు ఫ్లెక్స్, మరి కొందరు బోర్డ్ ఎగ్జామినేషన్, ఇలా ఎవరి దీక్షలో వారుండే వారు. అవటానికి, కాన్సర్ పై పరిశోధనలు, ఆ పేషెంట్ల రోగ నివారణ కారణంగానే వారంతా ఒక చోటకే చేరినా, అంతర్లీనంగా చాలామంది సమస్య వారి వీసా, వారి జీవనోపాధి సరిగా ఏర్పరచుకోవటమే. అమెరికా దేశంలో పౌరులుగా స్థిరపడి పోవటమే.

అందరికీ పెద్ద, ఛార్లీ బెన్సన్ – డిపార్ట్‌మెంట్ చైర్మన్, రష్యన్ పోలిష్ యూదుడు. వైస్ ఛైర్మన్, యూదురాలు – లారా స్పెన్సర్. ఇంకా ఇద్దరు చైనీయులు, ఇద్దరు కొరియన్ అటెండింగ్‌లు, కొందరు రష్యా నుండి దిగిన సుందరీ మణులు, ఒక మిలియనీరు అని చెప్పబడే కిమ్, ఒక బెంగాలీ బాబు రాయ్, మరో పంజాబీ సింగ్, ఇలా, ఇలా ఓ ఇరవై, ఇరవై ఐదు మంది డాక్టర్లు. వారి అనుబంధపు స్టాఫ్‌లో పోలిష్, జ్యూయిష్ వారి సంఖ్య ప్రబలంగా ఉండేది.

ఛార్లీ బెన్సన్ అత్యంత బుధ్దిశాలి. భార్య వేరే హాస్పిటల్లో డాక్టర్. భార్యా భర్తలు ఇద్దరూ ఒక అరవై ఏళ్ళ వయసు వారే. ఛార్లీ బెన్సన్‌కు పెథాలజీ, రేడియాలజీలలో బలమైన బాక్‌గ్రౌండ్ ఉంది. డయాగ్నాస్టిక్ రేడియాలజీ దాటి వచ్చి, థెరపీ లోకి వచ్చేసి, ముఖ్యంగా, గైనికలాజికల్ కాన్సర్ గురించి ఎక్కువ కృషి చేస్తూ, రోగి, వైద్యుల సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాడు. రేడియోఆక్టివిటీ కనుక్కున్న అప్పటి సైంటిస్టులు, మరియా క్యూరీ, బెకరెల్, తదితరులు, రేడియంను జేబుల్లో వేసుకు తిరగటం, చేతులతో పట్టుకోటం వంటి పనులు భయం లేకుండా చేశారు. క్రమేణా వారికి, ఇతర సైంటిస్ట్ లకు రేడియోఆక్టివ్ మెటీరియల్స్ ఉపయోగాలే కాక, అనర్థాలు కూడా తెలియ వచ్చాయి. అనర్థాలతో, తీవ్రమైన బాధలతో యూదులకు అంతా ఇంత పరిచయం కాదు కదా. ఆ పరిచయం, యూదుల లోని తరతరాల వేదన – తోటి మానవుని బాధలు తగ్గించటానికి, జీవించటానికి సరైన వసతులు, ఆరోగ్యం కలిగించటం లోకి మళ్ళింది. ఆసుపత్రులు, విద్యాలయాలు నెలకొల్పటంలో వారు అగ్రగాములు. అందువల్ల, ఆ యూదుడు, ఛార్లీ బెన్సన్ రేడియేషన్ ధెరపీలో, ఆఫ్టర్ లోడింగ్ టెక్నిక్స్ గురించి ఆలోచించి, ఫిజిసిస్ట్ లతో కలిసి కొత్త అప్లికేటర్స్ తయారు చేస్తున్నాడు.

డాక్టర్ నిసి ఆ హాస్పిటల్‌కు ఎలా వచ్చిందంటే: నిసి, రెసిడెన్సీ అప్పుడు ఛార్లీ బెన్సన్, బ్రాంక్స్ వెటరన్స్ హాస్పిటల్‌కు వారం వారం, విజిటింగ్ ప్రొఫెసర్‌గా వచ్చి వారి ప్రోబ్లమ్ కేస్ లకు సొల్యూషన్స్ చెప్పేవాడు. వారికి ఆయనతో ముచ్చటించటం బహు లాభదాయకం. ఎంత చరిత్ర తెలిసినా, విద్యార్ధులతో ముందుగా కొత్త విషయాలేంటి? అని ప్రశ్నించేవాడు. మెడిసిన్‌లో, పాత పురాణాల పని ఏమిటి? కొత్తగా ఆలోచించటం, ప్రవర్తించటం, నేర్చుకోవాలనేవాడు. నిసి, ఆయనతో అప్పుడప్పుడు తనకు డయాగ్నాస్టిక్ రేడియాలజీ చెయ్యాలని ఉందంటే, నువ్వు షాడోలు చూసేందుకూ కాదు. టిష్యూలు మైక్రోస్కోప్‌లో చూసేందుకూ కాదు. వాళ్ళు దొంగ వైద్యులు. వైద్యులు రోగులతో కలిసి ఉండాలి. నువ్వు నిజం మనుషులుతో ఉండాలి. నీ అవసరం వారికి ఉంది. నువ్వు పరిశోధనలు చెయ్యి. కాని, ఎక్కువ భాగం పని క్లినికల్ మెడిసిన్‌లో, రోగుల రోగ నివారణలో పని చెయ్యాల్సిందే. నీ బలం, తెలివి అక్కడ చూపించు, అని ఖండితంగా చెప్పాడు.

నిసి తన రెసిడెన్సీలో ఉండగానే, ఆమె మెమోరియల్ స్లోయన్ కెట్టరింగ్‌లో ఫెలోషిప్ చెయ్యటానికి వెడుతున్నట్టు తెలుసుకున్న ఛార్లీ తన యూరోపియన్ పద్ధతిలో, ఆమె రెండు చెంపల మీదా చేతులుంచి, అటూ ఇటూ రెండు బుగ్గల మీదా ముద్దులు పెట్టి, అప్పటి కప్పుడే, ఆమె ఫెలోషిప్ కాగానే, తన డిపార్ట్‌మెంట్‌లో స్టాఫ్ మెంబర్‌గా చేరాలని, ఆమె ఇంకెక్కడకూ ఉద్యోగం కోసం వెదుక్కుంటూ వెళ్ళాల్సిన పని లేదని చెప్పేశాడు. అది ఒక చక్కని ఆహ్వానం, ఉత్తరువు కూడా.

ఆమె ఆశ్చర్యపోయింది, తనకు ఇలా అప్లికేషన్లు పెట్టకుండానే ఉద్యోగాలు దొరుకుతున్నందుకు. ఛార్లీ దగ్గర పని చెయ్యాలని ఎవరికి ఉండదు. అతని మాటలు వినటం అంటే, అప్పటి వరకూ జరిగిన ప్రపంచ చరిత్ర తెలుసుకోటమే. ఇలియాడ్, ఆడిసీ, తోరా, తాల్మూద్, చదవటమే. అప్పటి వరకూ జరిగిన మెడిసిన్ చరిత్ర విని, రాబోయే కొత్త వైద్యాలకు బాటలు వెయ్యటమే. ఆమె సంతోషించింది. అన్నట్టుగానే, నిసి తన ఫెలోషిప్ అవుతూండగా, ట్రెయినింగ్ వివరాలు, యోగ్యతా పత్రాలతో ఆయనకు సమాచారం అందించింది. ఆయన నిసిని ఫోన్‌లో పిలిచి, జులై నుండి నీ ఉద్యోగం మొదలు, అని చెప్పాడు. నిసి, అలా ఆ జ్యూయిష్ హాస్పిటల్లో, రేడియేషన్ ధెరపీ విభాగంలో, జూనియర్ ఎటెండింగ్ ఫిజీషియన్‌గా పని మొదలెట్టింది. ఆమెకు హాస్పిటల్ జీవితం ఉద్రిక్తంగా, ఆలోచనా ప్రేరకంగా, ఇంట్లో జీవితం రొమాంటిక్‌గా గడిచి పోతున్నది.

అలా సాగిపోతున్న సమయంలో, నిసిని బ్రాంక్స్ లోనే, మరో జ్యూయిష్ యూనివర్సటీ హాస్పిటల్లో పని చెయ్యటానికి వెళ్ళమన్నాడు ఛార్లీ బెన్సన్. ఆమె ఖంగు తిన్నది. అదీ ఒక నోబెల్ ప్రైజ్ పొందిన యూదుని పేరు కలిగిన హాస్పిటల్. కాని, అక్కడి డిపార్ట్‌మెంమెంటుతో వీరికి సత్సంబంధాలు లేవు. అక్కడి ఛీఫ్, డాక్టర్. హుస్సేన్ – ఆడవాళ్ళను, మగవాళ్ళను విరుచుకు తింటాడని, అక్కడ పనిచేసే వాళ్ళు తరచూ, వేరే హాస్పిటల్స్ వెతుక్కుంటూ వెళ్ళి పోతారని వింది. ఎందుకు తనను అక్కడకు పంపటం. ఆమె కొంచెం ఉడుక్కుంది.

అసలు తను చూస్తూ ఉంది, కష్టమైన పనులన్నీ సి. బి. తనకు అప్ప చెపుతాడు. మిగతా ఆడవాళ్ళందరినీ అస్తారుబాతంగా చూసుకుంటాడు. ఒకసారి హుస్సేన్ డిపార్ట్‌మెంట్‌లో ఆడ డాక్టర్లు ఏం బాగుండరు. ఇక్కడ చూడు, ఎంతమంది అందమైన వాళ్ళున్నారో అన్నాడు కూడా. నన్ను పంపటంలో అర్ధమేంటి? అనుకుంది.

మామూలు ప్రకారమే, తన సీనియర్ డాక్టర్, సునీల్ లీ వచ్చి, నిసికి పెద్దాయన ఆంతర్యం విప్పి చెప్పాడు.

“ఇక్కడ ఎవరూ నువ్వు చదివినంతగా జర్నల్స్ చదవరు. వీళ్ళలో ఎవరిని పంపినా అక్కడి ఛీఫ్, ఇక్కడి జూనియర్ స్టాఫ్ సరిగా చదవటల్లేదని బైట డాక్టర్ల దగ్గర యాగీ చేస్తాడు. నువ్వు హుస్సేన్‌తో నెగ్గగలవు. అతని దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలున్నయ్యి. ఈ రెండు హాస్పిటల్స్ ఎలా కలపాలనే విషయాల్లో, రెసిడెన్సీ ట్రెయినింగ్ స్టాండర్డ్స్ విషయాల్లో, మాటలు ఇప్పుడే మొదలయినయ్యి. కాని రెండూ బలమైన సంస్థలనీ, రెండు చోట్ల మేధావంతులున్నారంటంలో సందేహం లేదుగా.

ఇద్దరు ఛీఫ్ లకూ, ఛీఫ్ టెక్నాలజిస్టులతో -యూ నో వాట్ సంబంధాలున్నయ్యి. ఇక్కడ విషయం మొదట్లో నీకు చెప్పినట్లే, అక్కడి సంగతి కూడా చెపుతున్నా. మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఈ స్త్రీలు చాలా జెలసీతో బాధ పడుతుంటారు. ముఖ్యంగా ఇతర ఆడవాళ్ళు, డాక్టర్‌లు, పని లోకి వచ్చినపుడు. పోటీ వస్తుందేమో, డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళ పెత్తనం తగ్గుతుందేమో అని. వాళ్ళను మోరల్ తక్కెట్లో తూచి, వాళ్ళను ఇతరులు చిన్న చూపు చూస్తారేమో అని, ఇలా. వాళ్ళతో తగవు పడితే, ఛీఫ్ లకు గాభరా కలుగుతుంది. జాగ్రత్తగా ఉండూ.”

“వీళ్ళంతా ఎదిగిన స్వతంత్ర వ్యక్తులు. వాళ్ళ స్లీపింగ్ హేబిట్స్‌తో ఎవరికి పని!” అంది నిసి.

డాక్టర్ లీ ముఖం లొద్దిగా ంలానమయింది. “నీ అంత లిబరల్ కాదు, లిబరేటెడ్ కాదు ఈ విషయాల్లో నేను, ఇంకా కొందరు. నువ్వు సమ్ హౌ వాటిని కాండిసెండింగ్గా చూడవు.” అన్నాడు.

“వెల్! ఇండియాలో, మా వైపు పల్లెటూళ్ళలో ఇది చాలా కామన్.” అంది నిసి.

“మరి దుర్గేష్ చెప్పే కబుర్లన్నీ?”

“అదంతా హోక్స్. అవన్నీ ఆమె తనను తాను నమ్మించుకునే కట్టు కథలు. షి ఈజ్ ఏన్ ఏక్ట్.” అంది నిసి.

“ఎనీ వే. గుడ్ లక్ ఇన్ ది అదర్ డిపార్ట్‌మెంట్. ఇక్కడకు వస్తూనే ఉంటావు కదా. దట్స్ నైస్.” అన్నాడు డాక్టర్ లీ.


నిసి, శ్యామ్, ఆ మధ్యే అక్కడ ఇర్వింగ్టన్‌లో చిట్టి ముత్యం లాటి ఇల్లు కొనుక్కున్నారు. చరిత్రాత్మకమైన ఊరు. రిప్ వాన్ వింకిల్, లెజెండ్ ఆఫ్ స్లీపీ హాలో, రాసిన వాషింగ్టన్ ఇర్వింగ్ నుండి, ఆ ఊరికి ఆ పేరు ఉంచారు. హడ్సన్ నది పక్కన ఉండే చిన్ని ఊళ్ళలో అది ఒకటి. కళకళ లాడే ప్రకృతి శోభ కలిగిన ఊరు. న్యూయార్క్ సిటీకి, ఆ వెస్ట్‌చెస్టర్ కౌంటీ నుండి హడ్సన్ లైన్ తీసుకుని రోజూ ఉద్యోగాలకు వెళ్ళి వస్తుంటారు.

నిసి, ఆ రోజు, ఆమె ఇంట్లో పనులు చేసుకుంటూ ఆలోచించుకుంటున్నది.

ఆమె ఇటు కూరగాయలు తరుగుతుంది. పొయ్యి మీది కూరలు ఉడుకుతుండగానే, వేరే గదిలో తన పుస్తకాలు కాగితాలు సవరిస్తుంది. హాస్పిటల్లో అప్పుడప్పుడూ పుస్తకాల ఆక్షన్లూ అమ్మకాలూ జరిగినపుడు, పాత పుస్తకాలు ఎన్నో డాలర్ కొకటి కొంటూ ఉండేది. అలా ఎప్పటికప్పుడు ఇంట్లో ఆమెకు సొంత రిఫరెన్స్ లైబ్రరీలు ఏర్పడ్డాయి. బైటి ఋతువులను చూస్తూ అప్పుడప్పుడూ గీసే స్కెచ్‌లనూ, వాటర్ కలర్స్‌నూ చిన్న ఫ్రేమ్స్‌లో పెట్టి, తను తిరిగే చోట్ల కంటికి ఆహ్లాదం కలిగేలా ఉంచుతుంది. చలనం ఆమె స్వభావం. ప్రవహించి పోయే నది ఆమె. మధ్యలో బైటికి వెళ్ళి రెండు కొమ్మలో పూలో తెచ్చి వేజుల్లో అమర్చుకుంటుంది. తోటలో గులాబీలు పూస్తున్నయ్యి. ఒక రోజు ఆ గులాబి మొక్క దగ్గర నుంచుని గులాబీలు దట్టంగా చీరలో ఉన్న ఫొటో, ఒకటి ఇండియాలో ఉన్న తండ్రికి పంపింది. ఇండియా ట్రిప్ వెళ్ళి వచ్చిన బంధువులు, నీ ఫొటో ఆయన గదిలో ఉంది. మాకు చూపించారు అని చెపుతారు. ఆమె సంతోషిస్తుంది.

నిసి పనులు చేసుకుంటూనే ఆలోచిస్తున్నది. ఏదో, ఒక ఆడవాళ్ళ మేగజీన్‌లో పాత చెత్త చదివి, ఆమెకు కోపం కలిగినందున చెలరేగిన ఆలోచనలు.

తనెవరు? ఒక సైంటిస్టేనా? అవును. కాక ఏమిటి! కందిపప్పా. తను డాక్టర్. సైంటిస్ట్. రేడియమ్ కనిపెట్టిన మేడమ్ క్యూరీ సైంటిస్టా కాదా అని సందేహించే వారు ఈ రోజుల్లో ఎవరన్నా ఉంటారా? ఆమెకు ఫిజిక్స్‌లో ఒకసారి, కెమిస్ట్రీలో ఒకసారి నోబెల్ ఇచ్చారు. రెండు సార్లు నోబెల్ ప్రైజ్, ఒక స్త్రీకి వచ్చింది.

1977లో బ్రాంక్స్ వెటరన్స్ హాస్పిటలో పనిచేస్తున్నప్పుడు, పక్క డివిజన్ లోనే పనిచేసే ఫిజిసిస్ట్, రోసలిన్ యాలోకి (Rosalyn Yalow) ‘రేడియో ఇమ్యునోఎస్సే’ టెక్నిక్‌కి నోబెల్ ప్రైజ్ వస్తే, తామంతా లైన్లలో నుంచుని ఆమె ఆటోగ్రాఫ్ తీసుకోలేదూ. హాస్పిటల్ పని కట్టుకుని, అక్కడ పనిచేస్తున్న రెసిడెంట్ డాక్టర్ లందరికీ ఆ అవకాశం ఇచ్చింది. అంతకు ముందు ఆమెకు సభ్యత్వం ఇవ్వటం నిరాకరించిన మెడికల్ సొసైటీలు, హాస్పిటల్స్, ఆమెకు ఆహ్వానాలు పంపించాయి. అది సరైన పద్ధతే. సైంటిఫిక్ విషయాల్లో పరిశోధన సరైనదని, ఫలితాలను సరిగా గమనించి, బిరుదులు, బహుమతు లివ్వటమే మర్యాద.

అదే సమయంలో కొన్ని మెడికల్ కాలేజ్‌ల నుండి, ప్రైవేట్ సంస్థల నుండీ ‘సైన్స్ అండ్ వుమెన్’ గురించి మాట్లాడమని కూడా యాలోకి ఆహ్వానాలు వచ్చాయి. కాని ఆమె నేను చేసిన పరిశోధన, స్త్రీ పురుషులిద్దరికీ సమానంగా వర్తించేదే. సమానంగా పనికొచ్చేదే. అందువల్ల స్త్రీలతోనే, స్త్రీల గురించే ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పనిలేదు. సైన్స్ విషయాల్లో నాతో పని చేస్తున్న వారెవరూ నన్ను స్త్రీ అని నేను చేసే పరిశోధనలని ఎక్కువగా చూడలేదు, అణగ తొక్కనూ లేదు. లాబ్‌లో నాతో పని చేసే వారి మనసుల్లో ఆ వివక్షతలు లేవు, అంది.

ఆమె స్త్రీ పక్షంగా మాట్లాడ్డం నిరాకరించటంతో, కొంతమంది పురుషులకే మంటెక్కింది. ఆ మగవారు తమను ఫెమినిస్టులుగా భావించుకునే పురుషులు. స్త్రీ అణగదొక్క బడలేదూ? రోసలిన్ – ఈమె ఏ లోకంలో ఉంది. భూలోకం లోనేనా? ఆడవాళ్ళు ఎన్ని చిత్రహింసలకు బలి ఔతున్నారు! ఆడదై ఉండి ఆడవాళ్ళ కష్టాలు గుర్తించక పోటం సిగ్గుచేటు. తను పైకి వచ్చేసరికి కొమ్ములొచ్చి, ఇతర ఆడవాళ్ళు ఈమెకు కనిపించటం లేదని అని ఈసడించుకున్నారు మెడికల్ రౌండ్స్ చేసేటప్పుడు, వాళ్ళ రెసిడెంట్లతో.

కొందరైతే, రోసలిన్ యాలో అందచందాల్ని వెక్కిరించారు. యాలో చాలా ఎత్తైన లావైన మనిషి. మగాడి కన్నా మగాడిగా, మగాడి తాత లాగా ఉన్నామె, ఆడదానిలా ఎలా ఆలోచిస్తుందని కొందరు. ఇలాటి స్త్రీ లాబ్ వర్క్ చెయ్యాల్సిందే. అసలు ఎక్కడా ఈమెకు ప్రమాదం లేదు. ఎవడిక్కావాలీ ఇలాటి ఆడది అనుకున్నారు, కొంతమంది నాజూకు మగ డాక్టర్/ సైంటిస్ట్ రకాలు. ఈ రకం మగవారికి స్త్రీ మెదడుతో అసలు పనే లేదు. వంపులు సొంపులతో వుండి, ఎంత నంగిగా, చవటలా మాట్లాడితే అంత గొప్ప వనిత అనుకునే వాళ్ళు వేలకు వేలు.

ఆ ఆలోచనల లోనూ నిసికి నవ్వొచ్చింది. ఛార్లీ బెన్సన్ ఆడవాళ్ళ మేధస్సును గౌరవిస్తాడు. సందేహం లేదు. ఐనా అతనికి, ఆడవాళ్ళ యౌవనం మీద, వయ్యారం మీద మోహం ఎక్కువ. ఛార్లీ ఎప్పుడు ప్రేమించినా, ఇరవై, ముప్పై ఏళ్ళ ఆడవాళ్ళనే ప్రేమిస్తాడు. ఎవరి ఇష్టం వారిది. వీటికి రూల్సెందుకు. రెగ్యులేషన్స్ ఎందుకు. ఏకాభిప్రాయం అనవసరం!


నిసి ఇప్పుడు రెండు డిపార్ట్‌మెంట్ల లోనూ, కొంత కొంత కాలం పని చేస్తున్నది. రెండు చోట్లా ఆమెకు విభిన్నమైన అనుభవాలు లభిస్తున్నాయి. వివిధ శాఖల్లోనూ, మార్గదర్శకులైన మనుషుల సహచర్యంలో ఎక్సైటింగ్గా గడిచి పోతున్నది. నిసి, రెండు హాస్పిటల్స్ లోనూ, ఏ డిపార్ట్‌మెంట్ లోనూ, సైన్స్, వైద్యానికి చెందని విషయాలను ఆమె మాట్లాడేది కాదు. ప్రతి ఒక్కరి తోనూ వారి పనిని గురించే మాట్లాడేది. సోషల్ సోప్‌లో ఆమెకు ఆసక్తి లేదు. సాటివారి బాహ్య/గుప్త సంబంధాలు, వాటి ప్రస్తావన, ఆమె వారితో గాని ఇతరులతో గాని తేదు. ఆ విషయాలు ఆమె మనసుకు అసలు ఎక్కవు.

రెండు డిపార్ట్‌మెంట్లలో ఇద్దరు ముగ్గురు ఇండియన్ వనితలు చీరలు, సల్వార్ కమీజ్, ధరించేవారు. కొందరికి గాజుల మలారం, నుదుటి మీద బొట్లూ ఉండేవి. ఇండియాలో చీరలు ధరించిన నిసి, అమెరికాలో అమెరికన్ వేషధారణ ఎంచుకుంది. ఆ బట్టలు సీజనల్ గానూ, కొంచెం ఇతర డాక్టర్లను గమనించి, ఫేషన్, ప్రొఫెషన్‌కి అనుగుణంగా మారేవి. సబ్‌వేలో ప్రయాణాలకూ, కారు నడుపుకోటానికీ కూడా ఆమెకు అవే కన్వీనియంట్. అమెరికా వచ్చి అమెరికాలో లాగా ఉండటం ఇష్టం లేకపోతే రావటం ఎందుకు? మార్పు ఆమె స్వభావ లక్షణం. పరిసరాల కనుగుణంగా డ్రెస్ అవ్వద్దూ. ఎస్కలేటర్లో చీరలు చుట్టుకు పోతే, ఏమన్నా సుఖమా!

దుర్గేష్ డాక్టర్ కన్నా ఒక భారతీయ వస్త్ర ప్రదర్శనశాల లాగా అనిపించేది. దుర్గేష్ ఒకో రోజు షిఫాన్ చీర, ఒకో రోజు నైలెక్స్ చీర, పమిట జార విడిచేసి, ఆ కొంగులు హాస్పిటల్ కారిడార్లని చీపుళ్ళలా ఊడుస్తుంటే, ఆ కుచ్చిళ్ళు, హైహీల్స్ కింద పడి ఆమె తప్పటడుగులు వేస్తే, పక్కనున్న వాళ్ళు పట్టుకుని సరిగా నుంచోపెట్టటం ఇవన్నీ నిసి విసుగుతో చూసేది. ఏమి వైద్యురాలు. అంటురోగాలన్నీ అక్కడివి ఇక్కడా, ఇక్కడివి అక్కడా ఈమే అంటిస్తుంది. ట్యూమర్ పెథాలజీ క్లాసులు తీసేప్పుడు, పెథాలజీ లాబ్‌కి వెళ్ళినప్పుడు, ఆ బల్లల మీద వారు లివర్, యుటిరస్, స్టమక్ – ఇలా ‘ప్రీ ఆపరేటివ్ రేడియేషన్’ ఇచ్చిన ఆర్గన్‌లో రేడియేషన్ ఇచ్చిన చోట్ల కనిపించే మార్పులు, రేడియేషన్ ఇవ్వకుండా తీసివేయబడిన ఆర్గన్‌లో ట్యూమర్ ఎలా ఉంటుందో, రేడియేషన్ ఇస్తే ఎలా ఉంటుందో ఆ ఆర్గన్ కోసి చూపుతున్నప్పుడు, పక్క బల్ల్లల మీద మైక్రోస్కోపులలో హిస్టోపెథాలజీ చూపుతున్నప్పుడు కూడా, ఆ బల్లల మీద చీదరగా ఆమె చీర చెంగులు పడుతుంటే వారు అప్పటికి మర్యాదగా ఒకసారికి ఊరుకుని, తర్వాత ఆ క్లాసుల్లో పాటించాల్సిన డ్రెస్ కోడ్ గురించి నిబంధనలు రాసి పంపితే – ఆమె గ్రహించుకుని తన పద్ధతి మార్చుకోకుండా, వెళ్ళి వైస్ ఛైర్ లారా దగ్గిరా, ఛైర్మన్ ఛార్లీ దగ్గరా పితూరీలు చెప్పి, గారాంగా గునిసేది.

“రాజ్‌కి నేను ఈ చీరలు, ఈ బొట్టు, గాజులు ఎప్పుడూ ధరించకపోతే ఇష్టముండదు. నే మర్చిపోతే, తనే వెదికి నా నల్లపూసలు మెళ్ళో వేలాడేసి, అప్పుడే కారెక్కనిస్తాడు.” అనేది.

కమాన్! రాజ్ సర్జన్. అతనికి అంత టైమ్ ఎక్కడుంది. అంతా ఈ సోదిబుచ్చి కల్పన! అనుకునేది నిసి.

అసలు దుర్గేశ్, ఇతర ఇండియన్ రెసిడెంట్లు కొందరు, ఛార్లీని ‘నువ్వు మా నాన్న లాంటి వాడు’ అనటం, లారాని ‘నువ్వు మా అమ్మ లాటి దాని’వనటం నిసికి నచ్చేది కాదు. ఆ ‘లాంటి’ ఏంటి? ఎవరి అమ్మా బాబులు వారికి లేరూ. ఒక్క మనిషికి – ఒక అమ్మా, ఒక నాన్న. వేరే వాళ్ళ అమ్మా నానా – మన అమ్మా నాన్న ఎలా అవుతారు! ఛార్లీ, ఛార్లీనే. ఛీ! ఛార్లీ మా నాన్నేమిటి? లారా, మా అమ్మేమిటి! ఏమిటీ అద్ది మద్దెం ఆలోచనలు! ఐతే, ఛార్లీ, లారా మొగుడూ, పెళ్ళాలా? మేమంతా వారి సంతు. శివ శివా? ఎక్కడ దాకా సాగుతుంది ఆ ఆలోచన. అసలు మనమే పోతుల్లాగా పెరిగాక ఇంకా అమ్మా నాన్న స్మరణ ఎందుకు? ఒక వయసు వచ్చాక, పని చేసే చోట బైటి ప్రపంచంలో ఎవరి పేరుతో వారిని పిలిస్తే అది మర్యాద. లేని సంబంధాలు పులుముకోటం దేనికి? ఇలా ఉంటయ్ నిసి లోపల్లోపలి ఆలోచనలు.


ఒకరోజు, నిసి రెండో హాస్పిటల్‌లో ఉండగా లారా స్పెన్సర్ నుండి ఫోన్ వచ్చింది.

“చాలా దుర్వార్త. నువ్వు కూర్చొనే ఉన్నావా?”

“ఏమిటి, లారా?” నిసి ఛార్లీకి కీడు శంకించింది. ఆమెకు కాళ్ళు వణికాయి.

“రాజ్! హీ డైడ్ ఆఫ్ సడెన్ హార్ట్ ఎటాక్. రివైవ్ చెయ్యలేక పోయారు. ఛార్లీ నేనూ, వెడుతున్నాం.”

“దట్స్ అన్‌బిలీవబుల్!” అంది నిసి.

“ఐ నో! ఐ నో! నువ్వు రెండు వారాలు వెకేషన్‌లో వెడుతున్నావని నాకు తెలుసు. వి విల్ మానేజ్. దుర్గేష్ ఒక నెల సెలవు తీసుకుంది.”

వాళ్ళు కొంచెం సేపు ఆ హార్ట్ ఎటాక్‌కి కారణం ఏమయి ఉంటుందా? ఆటాప్సీ చేస్తారా? లాటి విషయాలు మాట్లాడుకున్నారు.


నిసి, శ్యామ్ వారి వెకేషన్ మీద అరూబా వెళ్ళారు.

అరూబా, ఆ కరీబియన్ ద్వీపం ఎంత అందమైంది. వారి హోటెల్ రూమ్ లోనుండి అనంతంగా కనిపిస్తున్న నియాన్ ఆకుపచ్చ, ప్రష్యన్ నీలం కలబోతల సముద్రం నిసికి మానసిక ప్రశాంతతనూ, విశాలతనూ, లోతునూ కలిగిస్తే, శ్యాంలో అవి ఉద్రిక్తతనూ, పొంగే పురుషత్వాన్ని సంతరించాయి. కామకేళిలో ఆమె శరీరపు స్పర్శలు, తనను హత్తుకునే తీరు, ఆమె పెదవులను రొమ్ములను తాకినప్పుడు ముద్దాడినప్పుడు తిరుగు కౌగిలింతలు అతనికి ఎంతో ఇష్టం. వారికి ఇతరుల గురించిన ఆలోచనలూ, వ్యగ్రతలూ నశించాయి. ఒకరి శరీర స్పృహ, స్పర్శల మాధుర్యం, వారు ప్రేమికులై అనుభవించారు. ఒకరి పేరు మరొకరు పిలుచుకోటం, ఎల్లవేళలా ఒకరినొకరు పెనవేసుకుని ఉండటం, నోటికి ఫలాలూ, పలహారాలూ అందించుకోటం, చదువుతున్న పత్రికలు మధ్యలో జారవిడిచి, ఒకరు జాచిన చేతుల్లోకి ఇంకొకరు చేరుకోటం. వారి రతి క్రీడలకు వేళాలు లేవు. కోరిక కలగగానే పొందటం, అలా అనుభవించిన కొద్దీ పెరిగిన రుచులు మరింతగా ఆస్వాదించటం.

జీప్ తీసుకుని ఐలండ్‌లో తిరిగే వారు. సీమ తుమ్మకాయలు కంచెల నుంచి సేకరించేవారు. రేగిపళ్ళ కోసం ఉసిరికాయల కోసం వెతకటం, బాదం చెట్లు కనిపిస్తే సైకిళ్ళు ఆపి, బాదంకాయలు చితక్కొట్టి లోని పప్పు తిని, అబ్బ! ఎంత రుచి! అనుకునేవారు. సముద్రం మీదికి నావలలో వెళ్ళేవారు. ఆ గాలులనూ, మారే ఆకాశం, సముద్రం రంగులను, మౌనంగా నడుం చుట్టూ చేతులు చుట్టుకుని చూసేవారు. ప్రకృతి సంపర్కంతో, వారి బ్రాంక్స్ వాసనలు వెనక్కు వెళ్ళిపోయాయి. ఒకరి మీద ఒకరికి ఉండే మానవసహజమైన కామ వాంఛలు, ఉద్రేకాలు వెల్లడయ్యాయి. బీచ్ లోనూ, నీటిలో, కొండ కోనలలో, గడ్డి దుబ్బుల్లో, వారు కోరి ఆంక్షలు మీరి ఒకరినొకరు అనుభవించారు.

నిజానికి, వెకేషన్ అప్పుడే కాదు. స్పెషల్ అకేషన్స్ లోనే కాదు. నిత్య జీవితంలో కూడా వారిద్దరూ కాముకులు. ప్రేమికులు. ఒకరి మీద ఒకరికి ఆకర్షణ, వాంఛ ప్రబలం. రతికేళిలో వారు సమానులు. ఇద్దరూ ఒకరినొకరు కోరుతారు. ఒకరి నగ్నశరీరాన్ని ఇంకొకరు ఆరాధిస్తారు. అందమైన రూపాలు వారివి. భార్యా భర్తలు అనే సామాజిక భావన వారికి ప్రధానం కాదు. ఒకరికి ఒకరు చాకిరీ చేసో, ఆర్ధికంగా రుణపడో, ఒకరి మీద ఒకరు సవారీ చేసే సంబంధం కాదు. అది సమాజానికి వారి పట్ల గల ఆలోచన. సమాజ జీవుల కళ్ళజోళ్ళ లోంచి చూసే వారు గుర్తు పట్టగలిగే దంపతుల బొమ్మ. వారి నిజం వారిదీ, వీరి నిజం వీరిదీ.

అరూబా నుంచి తిరిగి వచ్చి వారింటి చుట్టూ ఇనుమడించిన ఫాల్ కలర్స్ చూసి మళ్ళీ మైమరచారు. వెస్ట్‌చెస్టర్ కౌంటీ, హడ్సన్ వేలీ సౌందర్యం, స్వయంగా దర్శించి తరించి తీరవలసినది. టేరీటౌన్, డాబ్స్ ఫెర్రీ, ఆర్డ్స్ లీ, బెడ్‌ఫర్డ్, ఇలా మణిపూసల్లాటి ఊళ్ళు. కారు, రైలు ప్రయాణం చేస్తూ ఆనందించ దగ్గవి. అక్కడ సంవత్సరం పొడుగూ నివసించ గలగటం గొప్ప భాగ్యం. కొత్త ఉత్సాహంతో ఎవరి పనుల్లో వారు పడిపోయారు.


ఆ నెల ఛార్లీ బెన్సన్ ఉన్న డిపార్ట్‌మెంట్‌లో గ్రాండ్ రౌండ్స్ ఇవ్వటానికి వెళ్ళిన నిసి, సమావేశంలో కూర్చుని ఉన్న దుర్గేష్‌ను చూసింది. ఆమె అవతారంలోని మార్పును గమనించి, నిసి దిగ్భ్రమ చెందింది. ఆ రోజు నిసి, డాక్టర్ హుస్సేన్ పారిస్ వైద్యుల నుంచి నేర్చుకుని తన డిపార్ట్‌మెంట్‌లో ప్రవేశపెట్టిన బ్రెస్ట్ కాన్సర్ వైద్య విధానంలో, మార్పులు, ఫలితాలు గురించి మాట్లాడింది.

నిసితో పాటు సభకు డాక్టర్ హుస్సేన్ కూడా వచ్చాడు. ఆయన కొన్ని ఏళ్ళుగా అక్కడ అడుగు పెట్టలేదు. అతనికి హృదయంలో అక్కడి వారికి తన మీద కారణరహితమైన పగ, జుగుప్స, తెలుస్తుంది. అతడు ఎన్నో సార్లు అక్కడి వారి కేసి స్నేహంతో చెయ్యి చాపుతాడు. వాళ్ళతో తనివి తీరా సైన్స్ విషయాలు ముచ్చటించాలనుకుంటాడు. ఎన్నో విషయాలలో ఉదారుడైన ఛార్లీ అతని విషయంలో మారడు. ఛార్లీ వైఖరి తెలిసి, అక్కడి స్టాఫ్ హుస్సేన్ గురించి చెడ్డగా మాత్రమే మాట్లాడుతారు.

నిసి ఈ సారి డాక్టర్ హుస్సేన్‌తో, “రెసిడెంట్ ఫిజిషియన్లు, ఇతర సర్జన్స్ నేర్చుకోవాల్సిన కొత్త విషయాలివి. నేను అన్ని ప్రశ్నలూ ఆన్సర్ చెయ్యలేను కదా. యు మస్ట్ కమ్,” అంది.

హుస్సేన్ నవ్వి, “దే హేట్ మి ఓవర్ దేర్,” అన్నాడు.

నిసి – “ఈవెన్ దెన్ యు మస్ట్ కమ్.” అంది.

అతడు నవ్వి, ఇద్దరం ఒక కారులోనే కలిసి వెడదాం అన్నాడు. అలాగే వెళ్ళారు. ఆ సంఘటనకు రెండు డిపార్ట్‌మెంట్స్ లోని వారు, ఆశ్చర్యపోయారు. మనుషులను చీల్చి చెండాడే పులి అనుకునే హుస్సేన్, నిసితో కలిసి గ్రాండ్ రౌండ్స్ ఆడిటోరియమ్ లోకి అడుగు పెట్టినప్పుడు, ముందు కొంచెం కంగారు పడినా త్వరగా సర్దుబాటు చేసుకుని, ఆయనకు ఛార్లీ పక్కన చోటిచ్చారు. స్లైడ్ ప్రజెంటేషన్ తర్వాత, ఇది తెలుసుకోవలసిన వైద్య విధానం అని గమనించి, ప్రశ్నోత్తరాల సెషన్‌లో అందరూ చురుకుగా పాల్గొన్నారు.


ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చాక, నిసి కొంచెం పరధ్యానంగా, అటూ ఇటూ తిరుగుతుంటం చూశాడు శ్యామ్.

“ఏమిటి నిసీ!” అన్నాడు.

“దుర్గేష్! అంది నిసి పరధ్యాసగా, శూన్యం లోకి చూస్తూ.

“సో అప్‌సెట్టింగ్. రాజ్! అతని మరణం. ఎంత విషాద విషయం!”

చెయ్యి గాల్లోకి విసిరి, “నా. హిజ్ డెత్! దట్స్ నథింగ్. ఐ డోంట్ ఈవెన్ నో ద గై” అంది నిర్లక్ష్యంగా నిసి.

“ఆర్ యు అప్‌సెట్ ఎబౌట్ దుర్గేష్. హర్ లాస్, దెన్?”

“వాట్ లాస్! దట్స్ నాట్ మై కన్సర్న్. ఐ డోంట్ కేర్.” అంది నిస్పృహతో నిసి.

శ్యామ్ మౌనంగా ఉన్నాడు. ఆమె ఆలోచించుకుంటున్నది తన మనసును కలవరపరిచిన విషయం ఏమిటని.

కొంచెం సేపటికి నిసి, “యూ నో శ్యామ్! ఎందుకు దుర్గేష్ చదువు! ఆ పోలిష్ మేరీ క్యూరీతో, ఆ జర్మన్ రోజలిన్ యాలోతో, సమంగా తనూ ఒక సైంటిస్ట్‌గా ఉండలేక, డాక్టర్‌గా ఉండలేక, దుర్గేష్ భారతీయ సంస్కృతి, పరిరక్షణ అంటూ వెనక్కి వెనక్కి పయనించి, గతం లోనే ఉండిపోయి, అక్కర్లేని ఒక దురాచారాన్ని స్వీకరించి, అమెరికాలో ఒక అంతర్జాతీయ వైద్యశాలలో ఒక భారతీయ వనితను ముండ మోయించింది.” అని శ్యామ్‌ని కౌగిలించుకుని భోరుమని ఏడ్చింది.

(నిసి షామల్ 1981 డైరీ నుంచి.)