ఆకాశం మబ్బులేసినప్పుడల్లా నా మనసు శేషు మావయ్య వాళ్ళింటి వైపుకి పరుగు తీస్తుంది.
ఎందుకంటే – మా వూరు సముద్రానికి దగ్గర. కానీ మావయ్య వాళ్ళిల్లు మత్రం సముద్రానికి సరిగ్గా ఎదురుగా. వాళ్ళ మేడ మీది – ఒంటి గదిలో, ఆ పెద్ద కిటికీలోకెక్కి కూర్చుంటే సముద్రం కనిపిస్తుంది ఏ అడ్డమూ లేకుండా. ఎంత పెద్ద సముద్రమనీ, అదేంటో… విండో ఫ్రేం నిండా నిండిపోయి కళ్ళముందుకు కదిలొస్తుంది. నన్ను కాసింతైనా తడపకుండా, తాను నాలో తడుస్తూ మనసంతా మహాసముద్రమై నిండిపోతుంది. ఎంత సంబరం. అందులోను — వర్షంలో తడుస్తున్న సముద్రాన్ని చూడడమంటే… అబ్బా, ఇక చెప్పలేను!!
ఇప్పుడే రేడియో చెప్పింది మరో గంటలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలౌతుందనీ, చెప్పినట్టుగానే ఆ క్షణానికాక్షణంగా నల్లమబ్బులు దొంతర్లు దొంతర్లుగా పరుపు చుట్టలు దొర్లుతున్నాయి ఆకాశంలో.
దొడ్లో దండెం మీద ఆరేసిన బట్టల్ని గబగబా లాగేసుకొస్తోంది అమ్మ. వసారాలోకి వర్షం దంచి కొడుతుందని దడిసి, రెండు ఇనప కుంపట్లూ, వంటింట్లోకి లాక్కొస్తోంది అమ్మమ్మ. నాన్నగారేమో, వాకిలి వరండా లోని పెద్ద చెక్క కుర్చీని వెనక్కి లాగి, ప్లాస్టిక్ కవర్ కప్పే ప్రయత్నంలో వున్నారు. ముందు గదిని స్కూటర్, సైకిల్ అప్పటికే ఆక్రమించాయి.
“కుంభవృష్టిట…” చెబుతోంది అమ్మ, నాన్నతో.
“అవునట. టీవీలో కూడా చూపించారుగా! అందుకే, నాలుగు రోజుల సరిపడ కూరలు, పాలూ, తీసుకొచ్చేశాను,” తన ముందు జాగ్రత్త ప్రణాళికని అందరూ గుర్తించాలని వుంది ఆయనకి.
అమ్మ మెచ్చుకుంది. “మంచి పని చేశారండి. నేనే చెబుదామనుకున్నా… మీరే తెచ్చేశారు,” అంటూ, ఫ్రిజ్‌లో వాట్ని సర్దుతోంది.అదిగో తమ్ముడూ వచ్చేశాడు ట్యూషన్ నించి. వర్షం వస్తుందని పెందరాలే ఇల్లు చేరాడు.
ఇక మనం బయల్దేరొచ్చు… అనుకున్నా, లోలోపల. మెల్లగా చెప్పుల్లో కాళ్ళు దూర్చేస్తూ “నేను మావయ్యా వాళ్ళింటికెళ్తున్నా. ఎవరైనా ఏమైనా ఇచ్చేవుంటే ఇచ్చేసుకోండీ. పట్టుకెళ్తా” అంటూ ఓ కేకపెట్టాను.
“ఆఁ? ఇప్పుడెందుకే, మావయ్యా వాళ్ళింటికీ? ఓ పక్కనేమో పెద్ద వర్షం మొదలౌతుంటేనూ,” చోద్యంగా అంది అమ్మ.
నాన్నగారు మాత్రం నా వైపోసారి చూసి తేలిగ్గా నవ్వేస్తూ, “పోన్లే వెళ్ళనీ. హిందీ నేర్చుకునొస్తుంది,” అన్నారు. ‘థాంక్స్ నాన్నా,’ అన్నట్టుగా ఓ ధన్యవాదపు చూపొకటి విసిరాను నాన్న మీదకి. ఆయన అన్నీ తెలిసినట్టుగా నవ్వారు.
ఆయన కూడా ఒప్పుకున్నాక అమ్మకిక అభ్యంతరమేముంటుంది? తమ్ముడికీ మరదలకి ఇన్ని ఉల్లిపాయ బజ్జీలూ, ఒక గాజు సీసాలోనేమో కొత్తగా తాలింపేసిన మాగాయ పచ్చడి అందించింది. నూనెలో తేలుతోంది ఎర్రటి మాగాయ, ఇంగువ ఘాటుతో ఘుమాయించేస్తో…
పేరుకోసం అన్నట్టు ఓ రెండు టెక్స్ట్ బుక్సూ, ఒక నోట్ బుక్, బాల్పాయింట్ పెన్నూ, చేతి బాగ్‌లో వేసుకుని, భుజానికి తగిలించుకున్నా. మరో చేతిలో బాబూరావ్ క్లాత్ స్టోర్ వారి నారు సంచీలోనేమో అమ్మ ఇచ్చిన గూడ్స్ తీసుకుని, వన్, టూ, త్రీ… అంటూ ఉరుకురుకుగా మెట్లు దిగుతుంటే, అమ్మమ్మ మాటలు నా వెనకనించి…
“ఫోన్ చేసి వెళ్తున్నావా? వాడు చిన్న బట్టతో వుంటాడో, గోచీ కట్టుకునుంటాడో, లంగోటీలు చుట్టుకుని ఇల్లంతా కలయబెడుతుంటాడో? చూసి దడుచుకోకు..” అంటూ అరుస్తూ.
నేను వెనక్కి తిరిగి చూడనైనా చూడలేదు ఆవిడ వైపు. ఆవిడ హెచ్చరికలు నాకు పాతవే కావడంతో కొత్తగా వినేందుకేమీ వుండదు. రెండు నిముషాల్లో కోనేరు సెంటర్ కొచ్చేశాను.
“మంగినపూడి! మంగినపూడి! త్వరగా రండి. ఇదే లాస్ట్ బస్.” అరుస్తున్నాడు కండక్టర్.
ఒక్క సారిగా ఉరిమింది ఆకాశం. గట్టిగా. నేను గభాల్న బస్సెక్కేశాను. కిటికీ పక్క సీట్ ఖాళీగా కనిపిస్తే వెంటనే అందులో చతికిలబడ్డాను. రివ్వురివ్వున వీస్తూ చల్లటి గాలి ముఖానకొచ్చి తాకుతోంది. ఐసు నీళ్ళతో తడిపిన చల్లటి గంధపు లేపనాన్ని కుంచెతో ముఖానికి అలుముతున్నట్టు. ఆగకుండా ఇలా ప్రయాణిస్తూనే వుంటే ఎంత బావుణ్ణు! అనిపించింది. కానీ మామయ్య ఇల్లు గుర్తొచ్చింది.
ప్రహరీకి గోడ వుండదు. ఇంటి చుట్టూరా చెట్లే దళ్ళు. పొట్టి పొట్టి గట్టి కాండాల గుబురు పొదల మొక్కలేమో ఇంటి ముందు వైపుకి, దక్షిణ ఉత్తరాల వైపేమో ఎత్తైన అశోక వృక్షాలు. వెనక వైపు పడమరన నాలుగైదు వరసల్లో దట్టంగా సరుగుడు చెట్లు.
అది పెరడు కాదు. చిన్న పాటి పొలంలా వుంటుంది. నారుమళ్ళు పోసి, గట్లు కట్టి, కట్టల మీదేమో చిన్న పంట, చేలోనేమో పెద్ద పంట అన్నట్టు రకరకాల కూరగాయలతో బాటు కాబేజీ, మొక్క జొన్న వంటివి పండించడం భలే ముచ్చటేస్తుంది ఆ తోటమాలి పనితనానికి. ఆయన కొన్నేళ్ళు మిలిట్రీలో పని చేశాడు. అందుకే ఇంట్లో ఆ క్రమశిక్షణలోని కళ ఉట్టిపడుతూ వుంటుంది.
“మంగినపూడి, మంగినపూడి! దిగాలమ్మా!” కండక్టర్ కేకకి ఉలిక్కిపడి, తొందర తొందరగా బస్సు దిగేశా.
ఈదురు గాలి మొదలవడంతో, పాదాల మీది పరికిణీ పక్కకి తిరిగి, జెండాలా ఎగురుతోంది. పైటని నడుం చుట్టూ ఓ చుట్టు చుట్టి, రెండు జెళ్ళని వెనక్కి విసిరి, మావయ్య ఇంటి వైపు నడిచాను. రోడ్డుకి కుడి పక్కన సముద్రం.
ఎడమ వైపున చాలా దూరంగా టీచర్స్ కాలనీ. మెయిన్ వీధి మీంచి ఎడమ పక్కగా కాలనీ లోకి తారు రోడ్డు వేసి వుంది.
ఒక సారి వెనక్కి తిరిగి సముద్రం వైపు చూశాను. బలిష్టమైన ఓ పెద్ద నల్ల ఏనుగు కదలక మెదలక వొత్తిగిల్లి పడుకున్నప్పుడు, దాని ఉబ్బిన పొట్ట ఎలా కనిపిస్తుంది? అలా వుంది సముద్రం నల్లగా అతి గంభీరంగా. నిశ్చలంగా అలలు – యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికుల్లా. గాలికి తలలు విరబొసుకుంటున్న చెట్లు, తలుపులు మూసిన ఇళ్ళు, కరి మబ్బుల దివులు వర్ణం, ప్రశాంతమైన వాతావరణం, నన్నక్కడే నిలిచిపొమ్మంది. ఫెళ ఫెళ మంటూ వురుములురిమి, విసురుగాలే కనక నన్ను తోసి వుండకపోతే అలానే శిలనయి పోయి అక్కణ్నే వుండిపోయేదాన్నేమో.
ఇక జాగు లేకుండా, గబగబా మావయ్యా వాళ్ళింటికి నడిచా. ఎంత బావుంది. ఒంటరి నడక. తోడుగా ఈదురు గాలి. నా వెనక అండగా సముద్రం. పట్టపగలు రాత్రి అయిన క్షణం. నల్లటి ఆకాశపు గొడుగు కింద ఇలా వూరేగడం ఎంత ప్రియమైన ఉత్సవమని, నాకు.
అటు, ఇటు – రెండు గుంజలకు బిగించిన వెదురు బద్దల గేట్ తీసుకుని లోపలకడుగుపెట్టా. పెద్ద స్థలంలో చిన్న డాబా ఇల్లు. మేడ మీదకెళ్ళేందుకు వీలుగా రెయిలింగ్ లేని మెట్లు. తెల్లసున్నం వేసిన సిమెంట్ గోడలు. మేడ మీద కొత్తగా వేసిన గది కేమో, ఇంకా ప్లాస్టరింగ్ చేయకపోడంతో – ఇటుక రాళ్ళు బయటకి కనిపిస్తున్నాయి. గేట్ దగ్గర్నించీ, దర్వాజా గడప వరకు పరచిన నాప రాళ్ళ కాలి బాట మీద ఇలా పాదం మోపానో లేదో, ఠప్, ఠప్, అంటూ పెద్ద ఉసిరికాయంత సైజులో చినుకు వెనక చినుకుచ్చి పడి, సరిగ్గా నేను గడప దాటి లోపలకొచ్చిన క్షణాల్లో ఊపందేసుకుని పెద్ద శబ్దాలు చేసుకుంటూ, ఉరుములూ, మెరుపులతో వర్షం జోరందుకుపోయింది.
భలే నవ్వొచ్చేసింది. నిశ్శబ్దంగా లోపలకడుగేసి చూశా. నేనెప్పుడూ అపురూపంగా చూసే దృశ్యమే అది.
శేషు మావయ్య ఇంటికి రావాలని నేను తరచూ కోరుకోడానికి గల ఇంకో కారణం – ఇదే.
హాల్లో అత్తయ్యా మావయ్యా నల్ల బల్ల ఉయ్యాల మీద కూర్చున్నారు. ఒకరెదురుగా ఒకరు. ఆవిడ సన్నజాజుల మాల కడుతోంది. మావయ్య పూల మొగ్గల్ని జోడించి అందిస్తున్నాడు. చాలా దీక్షగా. ఎంత శ్రద్ధ మావయ్యకి. రోజూ మేడెక్కి పూలు కోసుకొస్తాడు. ఎండా కాలాల్లో మల్లెపూలు, కనకాంబరాలు పది మరువం రెమ్మలూ. ఇదీ ఆ సముద్రంలా ఎప్పుడొచ్చినా మనసు నిండా నిండిపోయే చిత్రమే.
“అటు రెండూ, ఇటు రెండూ చాలన్నాను కదండీ. నాల్గు మొగ్గలు పెడితే, మరీ ముద్దగా అయిపోతుంది దండ. అందఁవుండదు.” అత్తయ్య మాటలకి మావయ్య నవ్వుతాడు. “ఎలా అల్లినా నీ జడలో దానికి గొప్ప అందమొస్తుంది!” అని అంటాడు మావయ్య అత్తయ్య వైపు ఆరాధనగా చూస్తూ! ఆ మాటలకు ఆవిడ మొహం బంగారు రంగులో వెలిగిపోతుంది.
“ఏమందే, మీ అత్తా? నన్నడిగిందా? మీ మావేం చేస్తున్నాడు? ఆఁ ఏం చేస్తుంటాడూ! ఆ వుయ్యాల కెదురుగా కుర్చీ వేసుకుని, వెర్రి నాగన్న అలా కూర్చునుంటాడు. చీకటి పడుతోందిగా, మేడెక్కి పూలు కోసుకొని వచ్చుంటాడు. ఈయన అందీడం ఆవిడ మాల అల్లడం. ఆ ఉయ్యాల బల్ల మీదే ఇకఇకలు పకపకలు.” అమ్మమ్మ మాటలకి జవాబుగా నవ్వి వూరుకోమని అమ్మ చెప్పింది.
నేనిక్కడికి నిజంగా హిందీ చెప్పించుకోడం కోసం మాత్రమే రాను. అదొక వంక మాత్రమే. నేను సముద్రాన్ని చూడటం కోసవేఁ వస్తాను. ఈ రెండు సముద్రాలనీ…
సంచిలోంచి మాగాయి సీసా తీస్తుంటే, ప్లాస్టిక్ కాగితం చప్పుడుకి అత్త తల తిప్పి గుమ్మం వైపు చూసింది. “రావే, అమ్ముడూ, రా. నీ గురించి ఇప్పుడే మావయ్యతో అంటున్నా. వారమైపోతోంది. ఎక్కడా పత్తా లేదే పిల్ల అని.” అంటూ ఇంత వెలుగైన మోముతో చూసింది.
పసుపు రాసుకున్న నుదుటి మీద ఇంత కుంకుమ బొట్టు, ముక్కుకి మూడు రాళ్ళ ముక్కు పుడక, మెడలో నిండైన బంగారం తళుక్కున మెరుస్తూ, అత్తయ్య కళకళలాడుతూ వుంటుంది, ఏ వేళప్పుడు చూసినా. ఏ వేళా, జుట్టు చెదరనీదు, కట్టుకున్న చీర జరీ అంచు ముడత పడనీదు. అప్పుడే తాజాగా తయారై, ఎక్కడికో వెళ్ళేందుకు సిధ్ధమై కూర్చున్నట్టు అనిపిస్తుంది. అంత ఫ్రెష్ గా ఎలావుంటుందో?
“ఏముందీ? దానికి పనా, పాడా? ఇంటెడు చాకిరీ మొగుడు మీద వదిలి, ఆసమ్మ ఓసమ్మ కబుర్లాడటమేగా ఏ పొద్దూ! దాన్ని మహల్లో రాణిలా కుర్చోపెడ్తాడు ఏవిటో, అర్ధం కాదు. ఇరవైనాలుగ్గంటలూ మొహంలో మొహం పెట్టి మాట్లాడుకునే మాటలేం చస్తాయో ఇద్దరికీ తెలీదు. ఏవిటో, మాయదారి గోల…” అమ్మమ్మ అమ్మతో అనడం.
“పోన్లే అమ్మా. పాపం, మరదలకి రెస్ట్ కావాలని అన్నారు కదా డాక్టర్లు. అందుకని, కూర్చోబెడుతున్నాడేమోలే.” ఆవిణ్ణి ఓదార్చే ప్రయత్నంగా అమ్మ.
అమ్మమ్మ వెంటనే కయ్యనేది. “ఏం బాగోకపోడమే, కమలా? నువ్వూ అలానే వెనకేసుకొస్తావ్ వాణ్ణి? ఎప్పుడో పదేళ్ళ కిందట గుండెకి చిల్లుందేమో అని అనుమానపడ్డారు డాక్టర్లు. ఆ తర్వాత పరీక్షలూ అవీ చేసి, బాగానే వుందనీ చెప్పలా? మరేం రోగం చెప్పు, ఇంటి పని చేసుకోడానికి? స్కూల్ నించి వస్తాడా? అంగవస్త్రం చుడ్తాడు. వెధవ. చీపురు పట్టుకుని వీధి గుమ్మం దగ్గర్నించీ, దొడ్డి గుమ్మం దాకా నున్నగా చిమ్మి, నీళ్ళు జల్లి, ఆ మీదట పిలుస్తాడు నన్ను. ‘అది ఒంగకూడదు కానీ, నువ్వొచ్చి కాస్త ముగ్గేసి పోమ్మా’ అంటూ. నాకు మహ వొళ్ళు మండిపోతుందె కమలా. నువ్వేమన్నా అను.”
“మాటల్లోనే వచ్చావే! నీకు నూరేళ్ళాయుష్షు.” అంటున్న మావయ్య వైపు చూశాను.
అమ్మమ్మ అన్నట్టే ఆయన వెలిసిపోయిన ఎర్ర టవలొకటి చుట్టుకుని కనిపించాడు. బలిష్టమైన శరీరం. ఎత్తుకు తగ్గ లావు. మిలిట్రీ క్రాఫ్, మెడలో జంధ్యాన్ని పొట్టిగా మడిచి, చెవులకి చుట్టుకుని, నుదుటి మీద చిన్న కుంకుమ బొట్టుతో, బనీనైనా లేని ఆ అవతారం. అందగాడే శేషు మామయ్య. మిలిట్రీ సర్వీసు తర్వాత బెజవాడ స్కూల్లో హిందీ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. రోజూ పొద్దునా సాయంత్రం గంట ప్రయాణం చేసి వస్తాడు. అప్పుడప్పుడు ఆలస్యమౌతుంది. అలాటప్పుడు అత్తయ్య నన్ను తోడుగా వుండమంటుంది.
“నే స్నానం చేసొస్తానే పిల్లా. అత్తయ్యకి పూలు అందిస్తుండు. ఏమే, వెళ్ళనా?” అంటూ అనుమతి కోసం పెళ్ళాం మొహం లోకి చూశాడు.
“వెళ్ళనా అని అడుగుతారేవిటీ, వెళ్ళండీ! ఇందాకనగా నీళ్ళు తోడి పోసుకున్నారు. చల్లారి పోయాయో ఏవిటో,” అంది అత్త.
నేను నవ్వాను. ఆయన స్నానానికి లేస్తూ, వివిధ భారతి ట్యూన్ చేసి చిన్న ట్రాన్సిస్టర్ ఆవిడ పక్కన పెట్టి ‘ఇప్పుడే వస్తా. ఇంతలో పాటలు వింటూ వుండు,” అని ఆవిడకి చెబుతూనే, ‘అత్తయ్యతో మాట్లాడ్తూ వుండమ్మా’ అని నాకు ఆవిణ్ని అప్పగించి వెళ్ళాడు.
అమ్మమ్మ మాటలు నిజమే. ఓ చంటి పాపని చూసుకున్నట్టే చూసుకుంటాడు పెళ్ళాన్ని.
బయట ఈదురు గాలులకు తలుపులు ఠప ఠపా మూసుకుని తెరచుకున్నాయి. కిటికీ రెక్కలు ఈడ్చి కొట్టుకుంటున్నాయి. నే వెళ్ళి తలుపులకు చెక్క గడియలు బిగించి, కిటికీ రెక్కలు మూసి బోల్ట్ వేసి వచ్చాను.
స్నానం పూర్తి చేసుకుని, తెల్లటి లాల్చీ పైజమాలో ప్రత్యక్షమయ్యాడు మావయ్య, మరింత హాండ్సమ్‌గా. భర్త వైపు మురిపెంగా చూస్తూ చెప్పింది అత్తయ్య. “చక్కగా కుట్టాడండి డ్రస్సు. ఈ టైలరుకే ఇవ్వండి మీ బట్టలన్నీ. మెడ చుట్టూ నీలం రంగు దారంతో ఎంబ్రైడరీ చేస్తే ఇంకా బావుంటుంది.”
ఇంతలో పెద్ద పిడుగు చప్పుడు, దానివెనుకే కరెంటు పోడమూ అయింది.
“అయ్యో, కరెంటు పోయిందండీ… ఏవిటో ఈ గాలివాన!”
“నువ్వు కదలకు. నేను దీపం వెలిగిస్తున్నా. కదలకు. ఉయ్యాల దిగకు. పడిపోతావ్.” ఆయన దీపం వెలిగించాడు. “వున్నావా? కంగారు పడొద్దని చెప్పానుగా.”
ఆయన చేతికందుబాటులో వున్న పెద్ద బాటిరీ లాంప్ బటన్ కూడా నొక్కాడు. వెలుగుతో నిండింది గదంతా. ఆవిడ మాల కట్టడం కాగానే, సగం దండ తుంచి ఇచ్చింది. అది తీసుకెళ్ళి, ఫ్రిజ్ మీది కృష్ణుని బొమ్మ మెడలో వేశాడు. మిగిలిన దండ లోంచి సగం నాకిచ్చింది. ఆ సగం ఆవిడ సిగ చుట్టూ చుట్టాడు. అత్తయ్య మొఖంలో సిగ్గు. నేను అరచేతుల్లో చెంపలు కప్పుకుని నవ్వుతూ వాళ్ళిద్దర్నీ చూశాను.
“ఇదిగో పిల్లా, నువ్వున్నావని మా అవిణ్ణి ముద్దు పెట్టుకోడం లేదు. లేకపోతేనా…” అన్నాడు మావయ్య.
“వూర్కోండి. చిన్న పిల్ల. దానికివన్నీ తెలీవు కానీ, ముగ్గురుకీ భోజనం మాట ఏవిటీ? వడియాలు అప్పడాలు వేయించేదా?”
“అవన్నీ నేనెప్పుడోనే చేసేశాలే. ఇక్కడే హాల్లోనే తినేద్దాం. ఏరా, తల్లులూ? అమ్మ కొత్త మాగాయి పంపింది కదా. పెరుగుంది. పొద్దున చేసిన పప్పుంది. అన్నం వేడిగా వున్నప్పుడే తినేద్దాం. ఇక బజ్జోచ్చు.”
“ఒసే కమలా, మొన్నేమైందనుకున్నావ్? సాయంత్రం వంటకని ‘రోటి పచ్చడేం చేయమంటావురా శేషూ?’ అని అడిగితే అంటాడు, ‘ఇవాళ నా స్వహస్తాలతో మా ఆవిడ కిష్టమైన వంటలు చేయాలే అమ్మ. నువ్వేం చేయకు. కావాలంటే నీక్కావల్సింది వండుకు తిని వెళ్ళమ్మా.” అన్నాడు. దాని వైపు ఏమిటో కన్ను కొట్టి మరీనూ. అదేమో మొగుడి మాటలకి ముసి ముసి నవ్వులొలకబోసింది. వొళ్ళు మండి పోయిందనుకో. నాకెందుకొచ్చిన పీడ అని, ఇంత పిండి చేసుకు తిని, బయటకొచ్చి కూర్చున్నా. అయినా అటే కన్నేసుంచా. ఏం చేస్తున్నాడా అని. ఏం చేశాడనుకున్నావ్? కుంపటి వెలిగించి, వంకాయ కాల్చి పచ్చడి చేశాడు. ఆ! బంగాళదుంప ముక్కల వేపుడు చేసి, వడియాలు వేయించి, మాగాయి పెరుగు పచ్చడి చేసుకుని తిన్నారు. బూజం బంతి క్కూరుచునట్టు ఎదురు బొదురుగా. అది వీడి వంట మెచ్చుకోవడం, వీడు మురిసిపోవడం. ఇంకాస్త వేసుకో, వేసుకో అంటూ. ఏమిటా బద్దలయ్యే ప్రేమా? కొత్త పిచ్చోడికి మల్లేనూ?
కమలా! అది – వాణ్ని ఆడంగి వెధవని చేసి ఆడిస్తోందే. నేను… చూళ్ళేకే… వ… చ్చే… శాను…” అమ్మమ్మ గొంతులోకి దుఃఖం పొంగుకొనొచ్చింది.
ఈర్ష్యా అసూయలెక్కువైనప్పుడు, పట్టలేని ఉడుకుమోత్తనానికి కూడా ఏడుపొస్తుంది. కానీ అమ్మకవేమీ తెలీవు. తల్లి కన్నీళ్ళు పెట్టేసరికి ఆవిడకి జాలేసి పోయింది. “పోన్లే అమ్మా. అలానేలే. కొన్నాళ్ళు నా దగ్గరుండి వెళ్దువు గాన్లే. మనసు బాధ పెట్టుకోకు.” అంటూ ఓదార్చింది.
కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటున్న అమ్మమ్మని చూస్తూ, ఆవిడ చేతిలో సంచీ నందుకుని లోపలకెళ్తున్న నాకు ఆవిడంతగా బాధపడిపోవాల్సిందేముందో ఇందులో అనిపించింది.
మామయ్య గిన్నెలు తెస్తుంటే కంచాలు మంచినీళ్ళూ పెట్టాను. నాకు ధ్యాస అన్నం మీద వుంటేగా. ఎలాగో అలా తిన్నాననిపించి పైకెళ్ళాను. పడుకుంటానని చెప్పి. ‘జాగ్రత్త. ఈ లాంతరు పట్టుకెళ్ళు. భయమేస్తే పిలు.’ చెప్పింది అత్త. సరేనంటూ మెట్లెక్కి గదిలోకెళ్ళి, తలుపులు మూసుకున్నా.
మెల్లగా కిటికీ రెక్క తీసి చూశాను. చీకటి పుట్ట. ఒక్క దీపం కూడా వెలగడం లేదు ఎక్కడా. దగ్గరి ఇళ్ళు కూడా కనిపించడం లేదు, ఆవానలో. ఉండుండి ఆకాశం నిండేలా ఒక మెరుపు, ఆ మెరుపులో మెరిసిపోతూ వాన చినుకులు, సముద్రానికి దారి అనిపిస్తూ నాపరాళ్ళ కాలిబాట. వెలుగుకి తలతిప్పి గదిలోకి చూస్తే గదంతా మెరుపు నేల మీద కిటికీ చువ్వల ముగ్గులేసి, అంతలోనే చెరిపేస్తూ. ఇంతలోనే ఇల్లు కదిలిపోయేలా ఆ మెరుపు వెనుకగా ఒక ఉరుము, అత్తయ్య వెనకాలే వచ్చే శేషు మామయ్యలా.
గాలి ఏం వూగినా వూగుతోంది. సుడులు చుట్టుకుంటూ రింగులు రింగులుగా అంతా వినిపిస్తూనే వుంది, కళ్ళకి కట్టినట్టు. సరుగుడు చెట్ల కొమ్మలు విరిగి పడుతున్న చప్పుళ్ళు. కొబ్బరిమట్ట – గాల్లో తీలుకుంటూ నేల మీద ధబ్బున పడ్డ చప్పుడు..నీళ్ళల్లో ప్లాస్టిక్ బకెట్ తేలుతూ గోడకి కొట్టుకుంటోంది.
ఇవన్నీ కాదు. నే వినాలనుకుంటున్న అసలైన సిమ్హారావం సముద్రానిది. కెరటాలు ఆకాశమంత ఎత్తు ఎగసి విరిగి పడుతున్న చప్పుడు. విలయ తాండవమాడుతున్న సముద్ర రౌద్ర సౌందర్యం. వాన అప్పుడప్పుడూ ఒక క్షణం తెరిపిస్తుంది, గాలి ఆగి ఊపిరి తీసుకుంటుంది. ఆ కాసేపు అదిగో వినిపిస్తుంది సముద్రఘోష, ఆ చీకటిలో.
అత్తయ్య చాలా మంచిది. నేనంటే ఎంతో ఇష్టం. అమ్మతో కూడా ‘వదిన గారూ’ అంటూ ప్రేమగా మాట్లాడుతుంది. అమ్మకూ అత్తయ్యంటే ఇష్టమే. కానీ, అమ్మమ్మ చెప్పే చాడిలకు అప్పుడప్పుడు ప్రభావితమౌతూ వుంటుంది. కానీ బయటపడదు. బాగోదంటుంది. ఇలాటివన్నీ విని ఊరుకోవాలి. మాట ఎప్పుడూ ఉప్పు లాటిది. తగినంత వాడాలి. లేకపోతే పదార్ధం చెడిపోతుంది. తమ్ముడితో తనకు గల రక్తసంబంధాన్ని, పుట్టింటి ప్రేమను పది కాలాలు కాపాడుకోవాలీ అంటే… మరదలి దగ్గర తన మర్యాద తాను నిలుపుకోక తప్పదని అమ్మ ఎన్నోసార్లు అమ్మమ్మతో చెప్పడం విన్నాను. ఆవిడ ముక్కు చీదేది.
“అసలు దీని గొప్పేమిటే? రాణి తనం ఒలకబోస్తుంది? ఒక పిల్లా, పాపా? కాపురానికొచ్చి ఇన్నేళ్ళైంది!- కనీసం సంతానం లేరన్న చింతైనా లేదు. వాడికి అస్సలు పట్టదు. నేనే ఎప్పుడైనా ఆ ప్రసక్తి ఎత్తితే, మొహం చిట్లించేస్తాడు. దాని ముందు ఇంకెప్పుడూ పిల్లల ఊసెత్తకు అంటూ ముఖమంతా కందగడ్డ చేసుకున్నాడో సారి. అప్పట్నించీ నేనూ నోరెత్తలేదమ్మా! వాళ్ళకే లేనప్పుడు నాకెందుకూ బాధ? కందకు లేని దురద కత్తి పీటకా అంట? చుట్టు పక్కల వాళ్ళూ చూస్తునే వుంటారు. వెనకెనక నవ్వుకుంటూనే వుంటారు. ఇది చెప్పాననే వాడికి కోపం. అదేమిటే అంటారూ, నాకు లెక్క లేదనీ… ఆఁ, అదే! డోంఠ్ ఖేర్! అనేశాడు. నాకు ఒళ్ళు మండిపోయిందిలే.”
“ఊఁ,” అమ్మ పనిచేసుకుంటూ ఊ కొడుతుంది. ఇంకేమీ అనదు. కానీ అమ్మమ్మ అలా చెబుతూనే వుంటుంది. అమ్మ పని చేసుకుంటుంటే వెనెకెనకే తిరుగుతూనో, వంటింట్లో ద్వారబంధానికి ఆనుకుని కూర్చునో. ఆ మాటలన్నీ నా చెవిన పడిపోయేవి. మరే! మా ఇల్లేమంత పెద్ద మహలనీ వినిపించకపోడానికీ? ఊహ వచ్చీ రాని వయసన్న మాటే కానీ నాకు అన్నీ అర్ధమౌతూనే వుండేవి. ఒకసారి ఇలానే శ్రద్ధగా వింటున్న నన్ను పిలిచి అమ్మ రహస్యంగా చెప్పింది. ఇలాటివి చిన్న పిల్లలు వినకూడదనీ, విన్నా, ఎక్కడా నోరు జారకూడదనీ గట్టిగానే హెచ్చరించింది. అమ్మమ్మకి కూడా జాగ్రత్తలు చెప్పింది. “అది అన్నీ వింటోంది. నువ్వు కాస్త చూసుకుని మాట్లాడ్తూ వుండవే అమ్మా!” అంటూ. “దాని మొహం. అదెవరితో చెబుతుందిలే..” అంటూ ఆవిడ నన్ను కొట్టిపారేసేది.
వాళ్ళ వాళ్ళ గొడవలెన్ని వుండనీ. నాకేం? నేను శేషు మావయ్య వాళ్ళింటికెళ్తూనే వున్నా. వస్తూనే వున్నా.
అలానే చీకట్లోకి చూస్తూ… సముద్రపు హోరు వింటూ… ఏ తెల్లారు ఝామునో నిద్ర పోయాను.
తెల్లారి లేచీ లేవంగానే సముద్రం వైపు చూస్తే ఏముంది? ప్రశాంతంగా నిద్రపోతూ వుంది. అలసిపోయింది పాపం, అనుకున్నా. మబ్బులింకా అలానే వున్నాయి. ఎంత బావుందీ వాతావరణం. అవునూ, ఇంత తుఫాను తర్వాత కూడా అంత ప్రశాంతంగా ఎలా అయిపోతుందీ సముద్రం. తెలీదు. అవేం తెలీదు. కానీ నాకు ఇలా చూడ్డం మాత్రం ఇష్టం. శేషు మావయ్య ఇల్లంటే అందుకే ఇంకా ఇంకా ఇష్టం. అత్తయ్యతో కబుర్లు చెబుతూ, ఇంటి పనుల్లో మావయ్యకి చేదోడుగా వుండి సాయం చేసొస్తూ, నాలుగు హిందీ పాఠాలు గబ గబా చెప్పించేసుకుని ఇంటికొచ్చేస్తూనే వున్నా. ఆ రెండు సముద్రాలనీ మనసులో నింపుకుంటునే ఉన్నాను. అలా కొద్దికాలం గడిచింది.
ఆ తర్వాత రానురానూ మామయ్య ఇంటికెళ్ళడం తగ్గిపోయింది.
చదువు ఒక ఛాలెంజ్ కావడంతో నా నివాసం పట్నం హాస్టల్‌కి మారింది. పరీక్షలయిపోవడం, శెలవులకి ఇంటికి పోడం అంటూ ఏమీ వుండేది కాదు. దరిదాపు ఏడెనిమిదేళ్ళు అలా దీక్షావ్రతం పూనాను. ఆ వెంటనే, కాంపస్ సెలక్షన్‌లో ఉద్యోగం వచ్చింది, మైసూర్లో. శేషు మావయ్య వాళ్ళింటికెళ్ళాను. ఇది చెబుదామని.
ఎప్పట్లానే, అత్తయ్య బల్ల వుయ్యాల మీద కూర్చునుంది. మావయ్య, గళ్ళ తువ్వాలు చుట్టుకుని, ఆవిడ ఎదురుగా కుర్చుని, మల్లె మొగ్గలు, కనకాంబరాలు అందిస్తున్నాడు. ఆవిడ మాల కడుతోంది. వుంగరాల వేళ్ళు అందంగా కదిలి, ముడి వేస్తూ… తలెత్తి చూసి ఆశ్చర్యపడి అంతలోనే ఆనందపడిపోయారిద్దరూ. దగ్గరికి తీసుకున్నారు లేచొచ్చి.
“పెద్ద దానవైపోయావే అమ్ముడూ,” అంది అత్త. నవ్వాను. మామయ్య ఉద్యోగం వివరాలడిగాడు. వివరంగా చెప్పాను. కబుర్లు చెప్తూ మావయ్య వైపు చూస్తున్నా. ఆయన చూపంతా పూల మాల కడుతున్న అత్తయ్య మీదే వుంది. నవ్వుకున్నా. అత్త ఎంత అదృష్ట వంతురాలు. అని.
మేడ మీద గదిలోకెళ్ళాను. నేను రావడం మానేశానని, ఆ గదిని స్టోర్ రూం చేశారు. అయినా, సామాన్ల పక్కనించి చోటు చేసుకొని కిటికీ తీసి, సరుగుడు చెట్ల వెనక సముద్రాన్ని చూశాను. మౌనంగా ఉంది. అయినా బావుంది.
తిరిగి రాబోతుండగా, అత్తయ్య లోపలికి వెళ్ళి, బీరువా లోంచి చీరా జాకెట్ తీసి, పళ్ళెంలో పెట్టి అందించింది.
“ఈ సారి నేను వచ్చే సరికి మావయ్యా! మేడ గది ఖాళీ చేయించు. వారం రోజులిక్కడే వుండి, అత్తయ్యతో గడపాలనుంది,” మనసులోని మాట అలా వచ్చేసింది అసంకల్పితంగా.
ఆవిడ మొహం వెలిగిపోయింది. “పోన్లే తల్లీ, నీకైనా ఈ అత్త మీద ఆపేక్ష వుంది. చాలు. తప్పకుండా రా అమ్ముడూ. నీకోసం గది రెడీ చేసిపెడతాడు మామయ్య.” అంటూ తన రెండు చేతులతో ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది. కళ్ళంట నీళ్ళు తిరిగాయి. ఆ వాత్సల్యానికి. కానీ అదే ఆఖరు సారి అవుతుంది అత్తయ్యని చూడటం అని నాకప్పుడు తెలీదు.
మైసూరుకి అమ్మా నాన్నలు తరచూ వచ్చి వెళ్తుండటంతో నాకు మా వూరెళ్ళే పని పడలేదు. పైగా, నా వుద్యోగ రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సి రావడంతో, ప్రయాణం అంటే బద్ధకంగా తయారైంది పరిస్థితి. కానీ అత్తయ్య కాలం చేసిందనే చెడ్డ వార్త వింటం వింటం తోనే నేను ఉరుకులు పరుగుల మీద మా వూరు చేరాను. ఎలా?
అత్తయ్యెలా పోయిందీ? అని కాదు ఇప్పుడు నా బాధ. మావయ్య ఎలా బ్రతుకుతాడు? నా దిగులైన ప్రశ్నకి అమ్మా, అమ్మమ్మా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
అర్ధం కానట్టు చూశాను.
“వాడికేం. రాయిలా బ్రతుకుతాడు.” అంది అమ్మమ్మ. అదేమిటీ ఎదురు గాలి. కొడుకు మీద రుసరుసలేమిటీ అర్ధం లేకుండా?
“ఏమైందమ్మా?” అమ్మని అడిగాను. అమ్మ తలొంచుకుంది.
“నువ్వే వెళ్ళి చూడు. తెలుస్తుంది. మా నోటితో మేం చెప్పడమెందుకు?” అన్నదమ్మమ్మ.
ఇక ఆగలేదు. ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా ఆటో చేసుకుని వెళ్ళాను. శేషు మావయ్యింటికి.
ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. హాల్లో వుయ్యాల బల్ల బోసిపోతూ కనిపించింది. కానీ, ఎదురుగా కుర్చీలో మావయ్య కూర్చుని కనిపించాడు. దిగులుగానూ కాదు, విచారం గానూ కాదు. అదో స్థితిలో వున్నాడు మనిషి.
నన్ను చూసి, “రామ్మా, రా” అన్నాడు. కంఠం జీరబోయింది. గమనించాను.
ఇంతలో లోపల్నించీ, “ఏమండీ, పిల్లలొచ్చే టైమైంది. బజ్జీలేయమంటారా…” అంటూ అక్కడకొచ్చి, నన్ను చూసి బెరుకుగా ఆగింది. పైట కొంగుని భుజం చుట్టూ కప్పుకుంటూ, నవ్వబోయింది.
ఎవరీమె? అర్ధం కాలేదు.
అప్పుడు చూశాను. గోడ మీద వేలాడుతూ పెద్ద ఫోటో. అత్తయ్య మామయ్యల ఫోటో ఉండాల్సిన చోట… దానికి బదులుగా.
ఈమె, మావయ్య ఇద్దరి మెడలో పూల దండలు. వీళ్ళిద్దరి చేతులూ కలుపుతూ అత్తయ్య మధ్యలో. అంటే ఆవిడ బ్రతికుండంగానే భర్తకి పెళ్ళి చేసిందా? కానీ అత్తయ్య మొహంలో నవ్వు, ఆ నవ్వు, ఆవిడది కాదు. నాకు బాగా తెలుసు. ఆ సహజత్వం ఏదీ? సముద్రం ఆ రాత్రి మౌనంగా ఉంటే ఎలా ఉండేదో అత్తయ్య నవ్వు అలా ఉంది.
నాకక్కడ ఒక్క క్షణమైనా నిలవాలనిపించలేదు. ఎందుకో, అత్తయ్యలేని ఇంట్లో వుండలేక, వచ్చేశాను. వెనక్కి కూడా చూడకుండా పరుగు లాటి నడకతో రోడ్డు మీద కొచ్చేశాను.
అసలీ కథంతా ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది?
“పెళ్ళైన కొత్తల్లో కూడా వీడికి ఇంత పెళ్ళాం పిచ్చి లేదే!…ఎందుకో ఈ మధ్యే ఇలా చస్తున్నాడు.” అమ్మమ్మ మాటలు చెవిలో మోగాయి.
అత్తయ్య మీద మావయ్య కురిపించిన ప్రేమ, ఏమిటది? అత్తయ్య పోతే, ఆవిడ ఫోటో కదా వుండాలి. మరి ఈ ఫోటోనెందుకు వేలాడకట్టినట్టు. ఇంటికొచ్చిన వాళ్ళకి తనేమీ చెప్పకుండా అర్ధమైపోడానికా? శేషు మావయ్య రెండో పెళ్ళికి అత్త అంగీకరించిందా, లేక అంగీకరించేలా చేయబడిందా? – ఏమో.
నేను ఊహించినట్టు వారి దాంపత్యమూ ఒక సముద్రమే కాదా? కాదు, మామూలు సముద్రం కాదు. ఒక అగాధమైన సాగరం. ఏమో… నాకేమీ అర్ధం కావడం లేదు.
ఎదురుగా సముద్రం. నాకు అందులొ అత్తయ్య… అత్తయ్య… కనిపిస్తోంది. నవ్వుతూ, కాదు అది నవ్వు కాదు. తన లోతు తెలియనీయకుండా అలలతో చెప్పిస్తున్న అబద్ధం అది. ఎంతో అందమైన సముద్రం నేననుకున్నంత అందమైనది కాదని మాత్రం తెలుస్తోంది.
ఏదో తెలియని చేదు బాధ మనసుని వికలం చేసేసింది. చెదరిన కలగా అయిపోయిందిప్పుడు శేషు మావయ్య ఇల్లూ, ఆ సముద్రమూ, ఆ జ్ఞాపకమూ. అంతా అత్తయ్య తోనే మాయమై పోయింది. ఇప్పుడక్కడ ఒక్క సముద్రమే ఉంది జీరబోయిన గొంతుతో మాట్లాడుతూ.
ఆ మరునాడే మైసూర్‌కి తిరిగి వచ్చేశాను.
ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా మావయ్య ఎలా వున్నాడు, మామయ్య ఎలా ఉన్నాడూ అని అడుగుతూ వచ్చాను. అడిగినప్పుడల్లా, బాగానే వున్నాడు, అంటూ ముక్తసరిగా జవాబు వినిపించేది. ఒకట్రెండు సార్లు అమ్మ అనుమానంగా అడగనే అడిగింది. ఎందుకే పద్దాకా ఆయన గురించి అడుగుతున్నావ్? అంటూ. ‘ఏం లేదు, వూరికే తెలుసుకుందామని. అంతే,’ అంటూ మాట దాటేశా. ఆ మీదట, ఎక్కువగా ఆయన గురించి అడగడం మానేశా. పూర్తిగా మానేశా.
ఓ ప్రాజెక్ట్ పని మీద అమెరికా కెళ్ళి రెండు నెలల తర్వాత వచ్చాను.
“నీకో విషయం చెబుతాను. కంగారు పడకు.” అమ్మ మాట్లాడుతూ అంది.
“ఏమిటది?” ఏం వినాల్సొస్తుందా అని ఆందోళనగా అడిగాను.
“మావయ్య పోయాడే… నువ్వు అమెరికాలో ఒక్కదానివే వున్నావని వెంటనే చెప్పలేదు. పోయి పదిహేను రోజులైంది…” అంది, బొంగురుపోయిన గొంతుతో.
నేనంతగా షాక్ అవలేదు. తెలుసు నాకు మావయ్య బ్రతకడని. కాదు, బ్రతకలేడని. అది నా మనసుకి బాగా తెలుస్తూనే వుంది. కారణం చెప్పడం అనవసరం.
“ఆయన ఆ ఉయ్యాల కెదురుగా వేసిన చెక్క కుర్చీలో కూర్చుని, దాని వైపు, అదే ఆ ఫోటొ వైపు చూస్తూ.. చూస్తూనే పోయుండాలి. కదూ?
“అచ్చు అలానే జరిగింది. చూసినట్టు ఎలా చెప్పావే!” ఆశ్చర్యబోతోంది అమ్మ.
నాకు తెలుసు. కొన్ని పశ్చాత్తాపాలు – తప్పు చేసిన మనిషిని బ్రతక నీవని. పైకన్లేదు నేనీ మాటల్ని.
మనసులో శేషు మావయ్య రూపం మెదిలింది. రెండు అరచేతులతో కళ్ళు మూసుకున్నాను. గట్టిగా. ఇక నా వల్ల కాలేదు. కణ్ణీళ్ళు ఆపుకోలేకపోయాను.