పగ పట్టిన పామును పక్కలో చూసినట్టు దిగ్గున లేచి కూర్చున్నాడు రవి!
గదంతా మసక చీకటి. కిటికీ తెర గాలికి వణుకుతోంది. ఫోనందుకున్నాడు. చార్జ్ అయిపోయింది. మంచం పక్కన అలారం క్లాక్ మూడు చూపిస్తోంది. అంతా నిశ్శబ్దం. చేయి చాచి కేబుల్ అందుకుని ఫోన్‌ను చార్జింగ్‌కి పెట్టాడు. నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి లైటు వేశాడు.
చిన్న గది. గోడకానుకుని ఒక వైపు మంచం, మరో వైపు బాత్రూం తలుపు. ఒక మూలన చిన్న సింకు, గట్టు మీద చిన్న స్టౌ, నాలుగైదు గిన్నెలు, వంట సామాగ్రి. మరో మూలన చిందర వందరగా పాత న్యూస్ పేపర్లు.
కిటికీ తెరను కాస్త ప్రక్కకు జరిపి బయటకు చూశాడు. తల స్నానం చేసి జుట్టు ఆరబెట్టుకున్నట్లుంది బయట చెట్టు. చెట్టుకు నాలుగడుగుల దూరంలో వీధి రోడ్డు. చెట్టు క్రింద సైకిల్ నిళ్ళలో తడిసి, సన్నటి వెలుతులో మెరుస్తోంది. పీడ కలలోంచి ఉలిక్కి పడి లేచాననుకుని, బాత్రూం వైపుకు నడిచాడు. అప్పుడు వినిపించింది.
“ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్ ట్రింగ్…”
అంత రాత్రి వేళ, చిక్కటి నిశ్శబ్దాన్ని, గులక రాళ్ళతో కొట్టినట్లు.
“ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్ ట్రింగ్… ట్రింగ్ ట్రింగ్…” సైకిల్ బెల్ మ్రోత.
నెమ్మదిగా వెనక్కు తిరిగి కిటికీ దగ్గర కొచ్చాడు. గంట మ్రోత ఆగింది. కిటికీ తెర ప్రక్కకి జరిపి బయటకు చూశాడు. సైకిల్ చెట్టు క్రింద తను సాయంత్రం పెట్టిన చోటే వుంది. రోడ్డు మీద ఎవరూ లేరు. ఒక నల్ల కుక్క, సైకిల్ వైపుకు తలెత్తి చూసుకుంటూ పోతోంది. ఈ వేళప్పుడు బెల్లు కొట్టుకుంటూ రోడ్డు మీద వెళ్ళే ఎదవ ఎవడా అనుకున్నాడు. లేకపోతే ఎవరైనా ఆకతాయి తనను ఆటపట్టించడానికి బెల్ మ్రోగించి చీకట్లో దాక్కున్నాడా అనుకున్నాడు. తను తన స్నేహితులు చిన్నప్పుడు ప్రక్కింటి వాళ్ళ డోర్‌బెల్ నొక్కి, వాళ్ళొచ్చే లోపున ప్రక్కనే దాక్కోవడం గుర్తొచ్చింది. నవ్వుకుంటూ, బాత్రూం వైపు నడిచాడు. నాలుగడుగులేశాడో లేదో, మళ్ళీ సైకిల్ బెల్ మ్రోత. ఈ సారి ఆగకుండా, అదే పనిగా!
కిటికీ వైపుకు దూకి, కర్టెన్ తెరిచి సైకిల్ వంక చూశాడు. ఎవరో స్టాండ్ వేసిన సైకిల్ మీద కూర్చుని అదే పనిగా గంట మ్రోగిస్తున్నారు. అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. మెరుపు కాంతిలో కనిపించిన దృశ్యానికి రవి నిలువెల్లా వణికి పోయాడు! ఉరుము శబ్దం సైకిల్ బెల్ మ్రోతను మింగేసింది.
గభాలున కిటికీ తెరను మూసేసి, లైటార్పి, గజగజలాడిపోతూ నిండా దుప్పటి కప్పుకున్నాడు రవి. కాసేపాగి వణుకు కొద్దిగా తగ్గింతర్వాత చిన్నగా దుప్పటి తెరిచి కిటికీ వైపు చూశాడు. అలా తెల్లారే వరకు భయంభయంగా కిటికీ వైపు, పడగ్గది తలుపు వైపూ వణకి పోతూ చూస్తూనే వున్నాడు.
రాత్రి వాన ఆగింది. ఇంకా చల్ల గాలులు వీస్తున్నట్లున్నాయి. రోడ్డు మీద అలికిడి మొదలైంది.
ప్రసాద్‌కు ఫోన్ చేశాడు. తియ్యలేదు. మోహన్‌కు చేశాడు. దొరకలేదు. సుబ్బుకు చేశాడు. లాభం లేదు. ఇంతలో ఫోన్ మోగింది. ప్రసాద్, “ఏంట్రా ఇంత పొద్దున్నే” అంటూ విసుగ్గా!
ఉన్న ఫలాన వెంటనే రమ్మని చెప్పాడు రవి. పావు గంటలో ప్రసాద్ వచ్చాడు.
ఆ వూళ్ళో రవికున్న అతికొద్ది మంది స్నేహితుల్లో ప్రసాద్ ఒకడు. ఇద్దరూ ఒకే వూరు నుంచి వచ్చారు. చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. రవికి చదువు మీద పెద్దగా ధ్యాస ఉండేది కాదు. రవి వాళ్ళ నాన్న ఊళ్ళో బాగా స్థితిమంతుడు. రాజకీయాల్లో తిరుగుతూ, పక్క పార్టిలో ఒకడిని పొడిచి చంపేశాడు, వాళ్ళు ప్రతీకరంగా ఇతన్ని చంపేశారు. కక్షలకి కోర్టు ఖర్చులకి సగం ఆస్తులు ఆవిరైతే, దగ్గరి వాళ్ళ మోసాలకు నెమ్మదిగా మిగిలింది కరిగి పోయాయి. చంపినోడు చచ్చినోడు కష్టాలు పడలేదు చిటికెలో, నొప్పి కూడా తెలియకుండా పోయారు. వాళ్ళ కారణంగా వాళ్ళ కుటుంబాలు చాలా బాధలు అనుభవించాయి, అనుభవిస్తున్నాయి! లేకుంటే రవి పొట్ట చేత్తో పట్టుకుని, సొంత వూరొదిలేసి ఇన్సూరెన్స్కంపెనీలో ప్యూన్‌గా చెయ్యడమేమిటి?!
సైకిల్ వైపు నడుస్తూ, “ఎవడోరా… ఇరవై కూడా ఉండవు… స్టాండేసిన సైకిల్ మీద కూర్చుని పెడల్స్ మీద కాళ్ళేసి తొక్కుతూ సైకిల్ బెల్ కొడుతున్నాడు. మొహమ్మీద, వంటి మీద నెత్తురోడుతూ గాయాలు. కుడి కన్ను వాచిపోయింది. ఎడం కన్నుతో నా వైపే చూస్తున్నాడు. నోట్లోంచి నెత్తురు తీగలా కారుతోంది…” ఆపి, ప్రసాద్ వైపు చూశాడు.
“రాత్రేమన్నా మందేశావా?” ప్రసాద్ ఆవులించాడు.
గాలికి చెట్టు ఆకుల మీది వాన చుక్కలు సైకిల్ మీద రాలి, బొట్లు బొట్లుగా నేల లోకి ఇంకి పోతున్నాయి.
“నీకన్నీ జోకులే. నేనెంత భయపడ్డానో తెలుసా? ఒట్టురా… చూడు సైకిల్ స్టాండ్ వేసింది వేసినట్లే ఉంది…” అంటూ సైకిల్ చుట్టూ ఒక సారి తిరిగి పరిశీలనగా చూశాడు.
సైకిల్‌కు వేసిన తాళం వేసినట్లే ఉంది. మరి పెడల్స్ ఎలా తిరిగాయి?!
“నెత్తురు మరకల కోసం చూస్తున్నావా? రాత్రి బాగా వానొచ్చిందిగా, నెత్తురు నేలలో కలిసిపోయుంటుంది. చూడు చైను స్లిప్పయింది.”
అపార్ట్మెంటు కాంప్లెక్సు లోకి వెళ్ళే వాళ్ళు, ఒకరిద్దరు ఏమైందని అడిగారు. రవి వాళ్ళకు సమాధానమిచ్చే లోపే, ప్రసాద్ ఏమి లేదని వాళ్ళను పంపించాడు.
“నవ్వులాటగా ఉంటే నువ్వెళ్ళరా. అయినా నేనెంత భయపడకపోతే నిన్నింత ప్రొద్దున్నే పిలుస్తాను?”
“అసలు సైకిల్ బయటెందుకు పెట్టావ్?!”
“సెల్లారంతా వాన నీళ్ళు”
“సరే… రాత్రి ఎవడో నీ సైకిల్ ఎక్కాడంటావ్. మరయితే ఇప్పుడేం చేద్దాం?”
ఏం చెయ్యడం. రాత్రి తాలుకు భయం కొద్దీ ఉదయాన్నే స్నేహితులకు ఫోన్ చేశాడు. వాళ్ళతో విషయం పంచుకుందామని పిలిచాడు. అంతకు మించి ఏమి ఆలోచించలేదు.
“అయినా అన్ని సార్లు సైకిల్ బెల్ మ్రోగితే ఎవరూ క్రిందికి రాలేదా?”
రవి మాట్లాడలేదు.
“నీకేదో పీడ కలొచ్చుంటుంది”
“కలా?!”
“కాకపోతే హెలూసినేషన్ అయినా అయుండాలి. ఏం సైకియాట్రిస్ట్ దగ్గరకెళదామా?”
“అంటే?”
“పిచ్చి కుదిర్చే డాక్టర్” అని, చిన్న బోయిన రవి మొహంలోకి చూశాడు. రవి పరధ్యానంగా సైకిల్ వైపు చూస్తున్నాడు.
“సరదాకన్నానురా. నువ్వు బేంకు పరీక్షలకు చదువుతున్నావుగా ఒక స్పెల్లింగ్ ప్రశ్న.”
“సైకియాట్రిస్ట్ స్పెల్లింగ్ చెప్పు?”
“ఎస్ వై…”
“కాదు. ఇంకో సారి ట్రై చెయ్.”
“సి వై…”
“ఉహూ! పి ఎస్ వై. పలికేటప్పుడు సై అని పలుకుతాం. సైకిల్లో సై లాగా. పి సైలెంట్. పద, అలా వెళ్ళి టీ తాగుదాం.”
అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న టీ దుకాణం వైపు నడిచారు.
రవికి ఆఫీసులో పని మీద మనసు నిలవలేదు. అయినా అతడు చేసే పని మనసు నిలిపి చేసేది కాదు. టైముకు కాఫీలు టీలు తెప్పించి అందరికీ అందించడం, ఫైళ్ళందించడం, కవర్లు అంటించి పోస్ట్ చెయ్యడం.
“నువ్విక్కడ పని చేస్తావా?” అడిగాడతను. ఎక్కడో చూసిన మొహం. ఎక్కడ అని అలోచిస్తుండగానే, “నేను మీ అపార్ట్మెంట్లోనే ఉంటాను. అదే వాసవి టవర్స్‌లో…” అతన్ని చాలా సార్లు రవి చూశాడు.
“కూర్చోండి.” రవి ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు.
“నా పేరు రఘు. నాదొక క్లెయిముంది. కనుక్కుందామని”
“ఏ క్లెయిమ్ సార్?”
“యాక్సిడెంటు. ఫోర్ వీలర్. హిట్ అండ్ రన్ కేస్,” అంటూ క్లెయిమ్ వివరాలున్న కాగితం ఇచ్చాడు.
“నాతో రండి.”
రవి యాక్సిడెంట్ల క్లెయిములు చూసే సుబ్బారావు దగ్గరకు రఘును తీసుకెళ్ళి పరిచయం చేసి మళ్ళీ వచ్చి తన కుర్చీలో కూర్చుని కణతలు నొక్కుకున్నాడు రవి. సాయంత్రమయ్యే కొద్దీ, రాత్రి దృశ్యం పదే పదే గుర్తుకొచ్చి వెంటాడుతోంది. పైగా అలసట, నిద్ర, కళ్ళు మంటలు!