చేతన చేసిన పని

“వెల్. ఇనఫ్ ఆఫ్ షోయింగ్ ది ఆర్గనైజేషన్ ఆన్ ది ఛార్ట్. లెట్ మి టేక్ యు అరౌండ్ అండ్ షో యు ది ఫెసిలిటీస్. దిసీజ్ ది గ్రౌండ్ ఫ్లోర్. దే మేక్ ది బేసిక్ మాడ్యూల్స్. సింపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ సెట్స్. మోటార్ స్కిల్స్ లాంటివి. ఇక్కడ పెద్దగా ఛాలెంజెస్ ఏవీ వుండవు. ఈ ఫ్లోర్‌లో పనిచెయ్యడం అన్నం వండడం లాంటిదన్నమాట. అంటే, వెరీ సింపుల్. బియ్యంలో నీళ్ళు పొయ్యడం, పొయ్యిమీద కాసేపుంచడం. అంతే.”

“అది కూడా అంత తేలిక కాదంటారు అన్నాన్ని మాడబెట్టిన వాళ్ళూ, మరీ నీళ్ళెక్కువ పోసి గుజ్జయ్యేదాకా వుడికించేవాళ్ళూ.”

“కరెక్ట్. పూర్తిగా ఉడకక పోవడం వల్ల పలుకుగా వుండే అవకాశం కూడా వుందందులో. సింప్లిసిటీలో కూడా కాంప్లెక్సిటీ ఈ లెవెల్లో స్పెషాల్టీ. లెట్స్ గో టూ ది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ తయారయ్యే మాడ్యూల్స్‌లో కాంప్లెక్సిటీ కొద్దిగా ఎక్కువ. దీజ్ అడ్రస్ మోర్ ఆఫ్ ఎబిలిటీ ఐటమ్స్. దటీజ్, ది ఎబిలిటీ టు డూ థింగ్స్. ది ఎబిలిటీ టు మేక్ ఎ టేబుల్, టు బ్లో గ్లాస్, టు మేక్ ఎ గోల్ఫ్ క్లబ్, టు ప్లే ఎ గేమ్, ఎట్సెటెరా. మాథమటిక్స్, సైన్స్, ఆర్ట్స్ కూడా ఇందులోకే వస్తాయి. ఇందాకటి ఉదాహరణతో పోలిస్తే, ఇది పప్పు వండడం లాంటిది. తయారయ్యేది ఉత్త పప్పయినా కావచ్చు, లేక మామిడికాయ పప్పయినా కావచ్చు. పప్పు సరిగ్గా వుడకడంతో పాటు అందులో పులుపు, ఉప్పు, కారం, అన్నీ సరిగ్గా కుదిరాయా, తిరగమోత సరిగ్గా అమిరిందా, చివరికది చిక్కటి ఘనపదార్థం లాగా వచ్చిందా లేక పల్చటి ద్రవపదార్థం లాగ తయారయిందా లాంటివి కాంప్లెక్సిటీ క్రియేట్ చేసే అంశాలు గదా!”

“మీ ఉదాహరణకి నా అనుభవాన్ని జోడించి కొద్దిగా లాగితే, ఇక్కడ పని చేసేవాళ్ళు తయారు చేసే ఏ పప్పూ ఒకే రకంగా వుండదు. పైగా, ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఆ పప్పు చెయ్యలేరు.”

“గుడ్ కంక్లూషన్!”

“వీళ్ళకి పేర్లూ అవీ…”

“పేర్లెందుకు? మహా అయితే నంబర్లు చాలవూ?”

“ఇందాకటి ఫ్లోర్‌లో చాలామంది కనిపించారు గదా, వాళ్ళ సంఖ్య ఎంతుండచ్చు?”

“నాకూ పెద్దగా అయిడియా లేదు గానీ, ఈ ఫ్లోర్‌లో వాళ్ళ సంఖ్య ఆ ఫ్లోర్‌లో వుండే వాళ్ళల్లో పది శాతం మించదనిపిస్తుంది.”

“ఏ ఫ్లోర్‌లో పనిచేసే వాళ్ళ సంఖ్య అయినా ఎప్పుడూ పెరుగుతూనే పోతుంటే ఇబ్బంది అనుకుంటా?”

“వాట్ ఆర్యూ థింకింగ్?”

“యూ ఆర్ ఆన్ ఫ్లోర్ వన్. నాకు మీరు టూర్ ఇస్తున్నారు గనుక నేను చేరబోయేది మీ ఫ్లోర్‌లో అయినా అయ్యుండాలి, లేకపోతే దాని క్రింది ఫ్లోర్ అయినా అయ్యుండాలి. అలాగే మీరు టూర్ ఇస్తున్న వాళ్ళల్లో నేను మొదటి వాడినయ్యే అవకాశం చాలా తక్కువ – ఇప్పటికే అసంఖ్యాకులకి మీరీ టూర్లని ఇచ్చి వుంటారనిపిస్తోంది. ఇలా అన్ని ఫ్లోర్‌ల లోనూ కొత్తవాళ్ళు చేరుతుంటే, పాతవాళ్ళతో కలిసి ప్రాడక్టులని తయారు చేస్తూ పోతుంటే సమస్యలు రావా అని?”

“వెల్, మై ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ టు గివ్ యు దిస్ టూర్. తరువాత నీకు అసైన్ చేసిన ఫ్లోర్‌లో నిన్ను వదిలిపెట్టడం. తరువాత నా పని నేను చేసుకోవడం.”

“ఇప్పుడు పై ఫ్లోర్‌కి వెడుతున్నట్టున్నామే?”

“ఓ! యా. యువర్ డెస్టినేషన్ ఈజ్ నాట్ దిస్ ఫ్లోర్.”


“ఈ ఫ్లోర్ సింపుల్ మీల్స్ సెక్షన్ లాంటిది. ఎందుకలా నవ్వుతున్నావ్?”

“మీ ఉపమానాలన్నీ ఆహారపదార్థాల చుట్టూ తిరుగుతున్నాయని!”

“ఆ సంగతి నీకు అర్థమవుతున్నది గనుకనే రెండు ఫ్లోర్లని దాటగలిగావు. ఇక్కడి మాడ్యూల్స్‌లో కాంప్లెక్సిటీ గూర్చి నువ్వే చెప్పు మరి.”

“ఓ కూరా, పప్పూ, అన్నమూ, పచ్చడీ, సాంబారూ, ఒక అప్పడమూ, మజ్జిగా లేక పెరుగూ — ఈ మెన్యూలో ఏ ఐటమూ బాగా కుదరకపోనూ వచ్చు, అన్నీ బ్రహ్మాండంగా కుదరనూ వచ్చు. అయితే, ఈ రెండూ కూడా ఎక్స్ట్రీమ్స్ అవడం వల్ల చాలా అరుదుగా జరిగే విషయాలు. సాధారణంగా అటు గొప్పగానూ ఇటు చెత్తగానూ లేకపోవడమే ఎక్కువగా జరుగుతూంటుంది. ఏదో ఒక ఆధరువు అద్భుతంగా వుండడమూ, ఒకటి అతి చెత్తగా వుండడమూ కూడా అంత అరుదైన విషయం కాదు.”

“నాట్ బాడ్. ఎనాలజీ ఎసైడ్ – హియర్, వన్ కెన్ ఆల్సో డిజైన్ ఎ గేమ్, ఇన్వెంట్ ఎ మెడిసిన్, క్రియేట్ ఎ ప్రొఫెషన్, ఆల్‌దో ఇటీజ్ మోర్ కామన్ ఆన్ ది నెక్స్ట్ ఫ్లోర్. దిసీజ్ ది ఫస్ట్ టైమ్ ఐ యామ్ డీలింగ్ విత్ ఏన్ ఐఐటీ గ్రాడ్యుయేట్. ఐ విల్ కాల్యూ ఐఐటి – ఇంకొకడు వచ్చేదాకా. అప్పుడు వాడికి ఐఐటి-1 అని పేరు పెడతా.”

“ఆర్యూ ఫ్రం ఎంఐటి? మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ? అక్కడ చూసినట్టనిపిస్తోంది.”

“నో. ఉస్మానియా.”

“ఈ ఫ్లోర్‌లో మళ్ళీ ఎక్కువమంది కనిపిస్తున్నారు.”

“యస్. దిసీజ్ ది సిస్టమ్స్ ఫ్లోర్. దిసీజ్ వేర్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాడక్ట్ గెట్స్ సింథసైజ్‌డ్.”

“నాకొక సందేహం. ఈ ఫ్లోర్‌లో వుండేవాళ్ళు క్రింద ఫ్లోర్‌ల వాళ్ళ ప్రాడక్టులని వాడుకోవచ్చా లేక అన్నీ స్వంతంగా తయారుచేసుకోవాలా?”

“దట్స్ అప్ టు ది డిజైనర్.”

“అయితే, క్రింది ఫ్లోర్‌లల్లో తయారయిన ప్రాడక్టుల్లో మంచి వాటిని ఎన్నుకోవడానికి వీలుంటుందా?”

“పాజిబుల్. అయితే, ఆ మంచి వాటిని వెదుకుతూ కూర్చుంటే కాలం మనకోసం ఆగదు.”

“మీరు డిజైన్ చేసినవాటిల్లో అలా వెదకడానికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేసిన సంఘటనలున్నాయా?”

“కొన్ని మాడ్యూల్స్‌కి మాత్రమే. సిస్టం మొత్తమూ అలాంటి బెస్ట్ కాంపొనెంట్లతో చేసింది లేదు. అలా ఎవరూ చెయ్యగా చూడలేదు గూడా.”

“హౌ అబౌట్ యు? మీరు ఎప్పుడయినా మీరు తయారు చేసిన కాంపొనెంట్లతోనే సిస్టమ్‌ని ఎప్పుడయినా డిజైన్ చేశారా?”

“అప్పుడప్పుడూ ఒకటో రెండో కాంపొనెంట్లని స్వంతంగా తయారుచేసుకున్నాను తప్పితే… నో. మొత్తాన్ని ఎప్పుడూ చేసింది లేదు.”

“ఎందుకని అలా?”

“ఏమో, ఒకటి రెండు బెస్ట్ కాంపొనెంట్లని వెదికి పట్టుకునేసరికో తయారు చేసుకునేసరికో కలిగిన అలసట వల్ల కావచ్చు.”

“క్రింద రెండు ఫ్లోర్‌ల లాజిక్‌నే ఇక్కడకూడా అప్లయ్ చేస్తే – మీరే తయారు చేసుకున్నా ఏ మాడ్యూలూ పర్ఫెక్టుగా వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. ఇది సిస్టమ్స్ సింథసిస్ జరిగే ఫ్లోర్ కాబట్టి ఒకళ్ళు డిజైన్ చేసే ప్రాడక్టు వేరేవాళ్ళు తయారు చేసే ప్రాడక్టు మీద ఆధారపడడం జరుగుతుందా?”

“లేకుండా వుండే అవకాశమే లేదు.”

“మీ ప్రాడక్టు పర్ఫార్మెన్స్‌ని మానిటర్ చేసే అవకాశ మేమయినా వున్నదా?”

“తప్పకుండా. ఉదాహరణకి, నిన్ను చూసి ఆనందించడమేగాక నిన్నిప్పుడు కలవడానికి కూడా మిస్టర్ నలందా వెయిట్ చేస్తున్నాడు.”

“ఓ ప్రాడక్టుని తయారుచెయ్యడానికి టైమ్ లిమిట్ వున్నదా?”

“దట్ విల్ బి పార్ట్ ఆఫ్ ది ఇన్‌స్ట్రక్షన్స్.”

“మీరింతకు ముందునించీ ఇక్కడ వున్నారు కాబట్టి – ఎన్ని ప్రాడక్టులని తయారు చేసుంటారు?”

“లెక్కపెట్టమని నా ఇన్‌స్ట్రక్షన్స్ ఎప్పుడూ చెప్పలేదు.”

“పోనీ మీ ఫ్లోర్‌లో వున్న మిగతా వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్‌లో?”

“నాకా ఆలోచనే రాలేదు. అయినా, అక్కడికే వెడుతున్నాం గనక అడుగుదాం.”

“ఓ. మీరూ, నేనూ ఒకే ఫ్లోర్‌లో నన్నమాట పనిచేసేది!”

“వై డజ్ దట్ మాటర్?”

“మీరు నన్ను ఏ ఫ్లోర్‌లో వదిలేసి వెళ్ళినా నాకు అక్కడ ఎవ్వరూ తెలియదు గదా, అందుకు.”

“స్టిల్. వై డజ్ దట్ మాటర్?”

“సలహాలడగడానికో, సందేహాలని తీర్చుకోవడానికో…”

“దే ఆల్ విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ ఇన్‌స్ట్రక్షన్స్.”

“ఆ ఫ్లోర్ ఎలాంటిదో గెస్ చెయ్యనా? అది డిసర్ట్‌తో కూడిన ఫుల్ మీల్ లాంటిది! మీరు పనిచేసే ఫ్లోర్ పైన ఇంకా ఫ్లోర్స్ వున్నాయా?”

“అయాం ష్యూర్ దేరీజ్ ఎట్ లీస్ట్ వన్ ఫ్లోర్. బట్, ఆ ఫ్లోర్ గురించి ఊహాగానాలే తప్ప దీన్ని దాటి ఎవరూ పైకెళ్ళగా ఎవరూ చూసింది లేదు.”


విడవబడ్డదే తడవుగా మిలియన్ల సంఖ్యలో వాళ్ళు తమ గమ్యస్థానం వైపు పరుగెత్తడం మొదలు పెడతారు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి వాళ్ళ వేగాన్ని నిరోధించదు. అదృశ్య శక్తేదో వాళ్ళని ఆ గమ్యం వైపు నడుపుతూంటుంది. గమ్యం దొరక్క శక్తి ఉడిగిన తరువాత రాలిపోవడం వాళ్ళల్లో కొంతమందికి జరిగేదే. గమ్యం దొరికిన వాళ్ళకి కూడా అదొక దుర్భేద్యమైన కోట. దాన్ని ముట్టడించిన వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రం ఆ కోట రక్షణ కవచాలని ఛేదించి లోపలికి ప్రవేశించ గలుగుతారు. అయితే, ప్రవేశించిన తరువాత తమ అస్థిత్వాన్ని కోల్పోతారు.


ఇన్‌స్ట్రక్షన్స్! ఇన్‌స్ట్రక్షన్స్! సో… మెనీ! కొన్నింటి మధ్యలో కొంతన్నా వ్యవధి వుంటుంది. కొన్నింటి కయితే ఊపిరి తీసుకునే అవకాశం కూడా వుండదు. అన్నింటికీ ఎటామిక్ క్లాక్ ప్రిసిషన్. అన్నింటికీ ఎలక్ట్రాన్ స్పిన్ స్పీడ్‌తో సంబంధం.

అసంఖ్యాకంగా స్టోరేజ్ బిన్లు చేతికందుతున్నయ్. వాటిల్లోంచి చాలా సార్లు చెయ్యి అసంకల్పితంగా ఓ మాడ్యూల్ దొరక పుచ్చుకుని ఎగరేసే నిచ్చెననో, ఎక్కుతూండగానే మారే మెట్ల వరసనో, లేక పడవేసే పామునో పేరుస్తోంది. టైమ్ లేదని అతనికి చెమట్లు పడుతున్నయ్ గానీ అతను చేస్తున్న ప్రోగ్రామ్‌కి మాత్రం బోల్డంత టైమ్. అతని ప్రాడక్ట్ తన పేరు ధేనువకొండ గంగాధరం అని గ్రహించింది. ఇక మిగిలినవి వివరాలు…

గంగాధరం తండ్రి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో, పాతిక కుటుంబాలుండే ఒక చిన్న పల్లెలో ఓ సన్నకారు రైతు. కొడుక్కి అయిదేళ్ళొచ్చేసరికి తండ్రి ప్రోగ్రామ్‌లో డిస్‌రప్షన్. అది గంగాధరానికీ, అతని తల్లికే కాక ఆమె తమ్ముడి కుటుంబానికీ కూడా పాకింది. అయితే, తండ్రి పోవడం చేత గంగాధరాన్నీ అతని తల్లినీ అతని మేనమామ తన దగ్గరకి తీసుకెళ్ళాడా లేక గంగాధరానికీ వాళ్ళ అమ్మకీ స్థానభ్రంశం చెందవలసి రావడం వల్ల అతని తండ్రి తప్పించబడ్డాడా అన్నది వాళ్ళ ప్రోగ్రాములకి తెలియని విషయం.

తండ్రి రెండెకరాల పొలమూ లేకపోతే అతను మేనమామ పంచను చేరగలిగేవాడా, అతని బతుకుని దుర్భరం చెయ్యాలని కొన్నేళ్ళు ఆయన భార్య ప్రయత్నిస్తూ అయినా తమ చెంత వుండనిచ్చేదా అన్నది వాళ్ళ ప్రోగ్రాములలోని ఏ మాడ్యూల్స్ లోనూ లేదు.

“వీణ్ణి హైస్కూల్లో వేద్దాం. చదువొచ్చిందా, అమ్మాయినిచ్చి పెళ్ళి చెయ్యొచ్చు, ఆ రెండెకరాలూ కలుపుకోనూ వచ్చు. చదువబ్బకపోతే కిరాణా కొట్లో బస్తాలెత్తే ఉద్యోగం వుండనే వున్నది,” అని గంగాధరం మేనమామ అతని భార్యతో తేలిగ్గానే అన్నట్టనిపిస్తుంది గానీ, గుంటూరులో 1945లో మాజేటి గురవయ్యగారు హైస్కూల్ స్థాపించడానికి ఎన్నేళ్ళ ముందునించీ ఆయన ప్రోగ్రామ్ దానికి ఆయన్ని ప్రిపేర్ చేసిందీ అన్నది సాధారణంగా ఎవరూ తలచని విషయం. గురవయ్యగారూ గంగాధరమూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు ప్రత్యక్షంగా చూసుకోక పోతేనేం, వాళ్ళ ప్రోగ్రాములు ముచ్చటించుకోలేదని అనలేంగా! మరి, ఆ హైస్కూల్లో పని చేసిన ఉపాధ్యాయుల మాటేమిటి? గంగాధరం ప్రోగ్రామ్ సరిగ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే వాళ్ళక్కడ వుండొద్దూ మరి? అంతే కాదు. తరువాత కొన్ని తరాల పాటు అక్కడ పని చేసిన ఉపాధ్యాయులు, కొన్ని వేల సంఖ్యలో విద్యార్థులు – వాళ్ళ ప్రోగ్రాముల మాటేమిటి? అదీ అంతే.

గంగాధరమే కాక అతని తండ్రి కూడా పుట్టకముందు నించే వున్నది గనుక ఆంధ్రా యూనివర్సిటీని గంగాధరం కోసమే నెలకొల్పారని ఎవరూ అనలేరు. ఈ మాడ్యూల్‌లో అతని ప్రోగ్రామ్ అతనిచేత ఇంజనీరింగ్‌లో బాచిలర్స్, ఆ తరువాత మాస్టర్స్ డిగ్రీలని చేయించి అక్కడే లెక్చరర్‌గా జాయిన్ చేసింది.

ఈ మధ్యలోనే కొన్ని ప్రోగ్రాములు ఒకే మెమరీ లొకేషన్‌ని ఆక్సెస్ చెయ్యడం వల్ల – గిట్టనివాళ్ళు గ్రహకూటముల వల్ల అనొచ్చు గానీ, ఒక శుభముహూర్తాన అని సాధారణంగా అందరూ అనే విషయం – గంగాధరానికి అతని మేనమామ కూతురితో పెళ్ళయింది.

గుంటూరులోని మాజేటి గురవయ్య హైస్కూల్ స్థాపించడానికీ, గంగాధరం అక్కడ చదవడానికీ సంబంధమేమిటన్న ప్రశ్న – వేరే విధంగా చెప్పాలంటే చెట్టు ముందా లేక విత్తు ముందా లాంటిది – ఇంకోచోట ఎదురైంది. అదే, ఐఐటి మద్రాస్ కాంపస్‌ని 1959లో స్థాపించడం వల్లనే ఆ ఏడాది అతను అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాడా లేక అతని ప్రోగ్రాం నిర్దేశించడం వల్ల ఆ కాంపస్ అక్కడ వెలసిందా అన్నది – 1959లోనూ, ఆ తరువాత కూడా ఆలోచించేవాళ్ళకి ఎదురవుతూంటుంది. ఆంధ్రా యూనివర్సిటీలో అతను పనిచేసిన డిపార్ట్‌మెంట్ హెడ్ చెప్పిందిదీ: “ఆ కాంపస్ తెరుస్తున్నారంటే అతని చేత నేనే ఆ పోస్టుకి అప్లయ్ చేయించాను – తొందరగా నీకు ప్రమోషన్లొచ్చే అవకాశాలుంటయ్యయ్యా అని. ఆ ఐఐటీ జర్మనీ కొలాబొరేషన్‌తో నెలకొల్పడం చేత ఆ దేశం ఈ కాంపస్ స్టాఫ్‌ని జర్మనీ పట్టుకెళ్ళి రెండేళ్ళపాటు టెక్నికల్ ట్రైనింగునిచ్చి వెనక్కి పంపింది. నా సలహాని పాటించడం వల్ల నేననుకున్న దానికి మించి అతనికి ఎక్కువగానే మేలు జరిగిందని చెబుతాను.”


“నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్?”

“వెల్, ఇట్స్ నెవర్ ఎ సింగిల్ ఇన్‌స్ట్రక్షన్. ఆల్వేస్ ఎ సెట్ – ఎ నెస్టెడ్ మాడ్యూల్ సెట్ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ క్వయిట్ ఎ లాట్ ఆఫ్ అదర్ మాడ్యూల్స్.”

“అంటే, నేను మీతో మాట్లాడేటప్పుడు మీ దగ్గరినుంచి వస్తున్న రెస్పాన్స్ పూర్తిగా ప్రి-పేకేజ్డ్ సెట్ ఎగ్జిక్యూషన్ వల్లనా లేక కొత్త ఎన్వయిరాన్మెంట్లో, మెమరీలో స్టోర్ అయివున్న సీక్వెన్స్‌ల సహాయంతో, అక్కడికక్కడ సింథసైజ్ చెయ్యబడడం వల్లనా?”

“ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో పెట్టినప్పుడు మొదటి బాచ్‌లో గంగాధరం ఉద్యోగిగా చేరడం ఎలా జరిగిందనడానికి అతని డిగ్రీలూ, పదేళ్ళ ఐఐటీ సర్వీసూ, రెండేళ్ళ జర్మనీ ప్రవాసమూ కారణాలని అతన్ని ఉద్యోగంలో నియమించినవాళ్ళంటారు. కాన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ఈవెంట్స్, అంతే, అని కొందరనవచ్చు. ఎవరి ఇన్‌స్ట్రక్షన్ సెట్ వాళ్ళకుంటుంది! అతని భార్య మాత్రం అతను ఇస్రోలో చేరడానికి కారణం అమెరికన్లు చంద్రమండలమ్మీద అడుగు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలచేత ప్రభావితమవడం వల్ల, అన్నది.

తరువాత గంగాధరానికి నిలకడ లేదన్నారు అలాంటి సెట్‌లని ఎగ్జిక్యూట్ చేస్తున్న కొందరు అతని అమెరికా పయనాన్ని కారణంగా చూపిస్తూ.

నాన్న ఇస్రోలో చేరినదీ, మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టిందీ ఒకే సంవత్సరంలో. ఇస్రోలో ఆశించినంత వేగం నాన్నకి కనిపించలేదు. అందుకని, అప్పటికే ఆయనకున్న అంతర్జాతీయ పరిచయాల వల్ల యూనివర్సిటీ ఆఫ్ అలబామా, హంట్స్‌విల్‌లో ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యారు. పక్కనే వున్న రెడ్ ఆర్సెనల్ లోనే రెండవ ప్రపంచ యుధ్ధం తరువాత జర్మనీ నించి పట్టుకొచ్చిన సైంటిస్టుల చేత అమెరికా అంతరిక్షానికెగిరే కార్యక్రమానికి శ్రీకారాన్ని చుట్టింది. — పెద్దయిన తరువాత ఆయన పిల్లల మాటల్లో ఇది.”

“ఇంకా నయం! రెండవ ప్రపంచ యుద్ధం జరగడమే గంగాధరాన్ని హంట్స్‌విల్‌కి రప్పించడం కోసం అని అనలేదు!”

“వై నాట్? అతనికి దాదాపు పదేళ్ళొచ్చినప్పుడు కదూ ఆ యుద్ధం మొదయ్యింది?”

“యూ నో, పీపుల్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ బిట్వీన్ కాజేషన్ అండ్ కొరిలేషన్! చెట్లు పత్రహరితాన్ని తయారు చేసుకోవడం సూర్యుడు రావడం వల్ల. అంతే తప్ప క్లోరోసింథసిస్ కోసం అవి సూర్యుణ్ణి రప్పించుకోవట్లేదు.”

“హౌ డు యు నో? హౌ మచ్ డు యు నో అబౌట్ ది ప్లాంట్స్? వాట్ డు యు నో అబౌట్ దెయిర్ ఇన్‌స్ట్రక్షన్స్ సెట్? ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఎలా పనిచేస్తుందో తెలుసా? రోటార్‌కి – అంటే తిరిగే షాఫ్ట్‌కి – పర్మనెంట్ మాగ్నెట్లు ఫిక్స్ చెయ్యబడి వుంటాయ్. ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఆల్టర్నేట్‌గా వుండేలా. స్టేటర్‌కి – అంటే నిశ్చలంగా వుండే భాగానికి – కూడా అట్లాంటి ధ్రువాలుంటాయి దానికి చుట్టి వున్న తీగెల్లో విద్యుత్తు ప్రవహించినప్పుడు. సజాతి ధ్రువాల వికర్షణ రోటార్‌కి వున్న ధ్రువాన్ని పక్కకి తోస్తుంది. అంటే, స్టేటర్‌కి ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ మీద ఆధారపడి దాన్ని ఎన్ని ధ్రువాలతో డిజైన్ చేశారో ఆ రోటార్ ఎంత వేగంగా తిరుగుతుందో తేలుస్తుంది. అలాగే, ఒక చెట్టుకి లక్షలాది ఆకులుంటాయ్. అవి తమ ఇన్‌స్ట్రక్షన్స్ సెట్స్ వల్ల సూర్యుణ్ణి రమ్మననడమూ, పొమ్మనడమూ ఎందుకు జరక్కూడదు?”

“గురుత్వాకర్షణ శక్తి వల్లనే గ్రహాల గతులు అన్న నిర్ధారించిన వాళ్ళు, వాటిని నమ్మిన వాళ్ళు ఇడియట్స్ అనా మీ వుద్దేశం?”

“నువ్వలా వితండవాదం మొదలుపెడితే ఇంక విజ్ఞానానికి సంబంధించిన ఎరుక ఎలా పెరుగుతుంది?”

“పోనీ, భూమి సూర్యుని చుట్టూ తిరగడం మీరు చెప్పినట్టుగానే చెట్ల ఆకులు సూర్యుణ్ణి రప్పించడమూ, వెళ్ళగొట్టడమూ వల్లనే అనుకుందాం. మరి మిగిలిన గ్రహాల సంగతేమిటి? అంగారకుడి మీద గానీ, బుధుడి మీద గానీ చెట్లేమీ లేవే!”

“మనమిన్నాళ్ళు నివసిస్తున్న భూమి లోపలే ఏమున్నయ్యి అన్న అంశం మీదే ఇంకా సంపూర్ణమైన అవగాహన లేదు. ఇంక వేరే గ్రహాల గూర్చి ఎలా చెబుతాం? గురుత్వాకర్షణ శక్తి భూమి సూర్యుని చుట్టూ ఒక కక్ష్యకి ఎందుకు పరిమితమయిందో తెలపడానికి తోడ్పడుతుంది గానీ, ఆ కక్ష్య లోకి ఎలా చేరిందీ అన్న విషయ నిర్ధారణకి మాత్రం సహకరించదు. అలాగే, భూమి తన చుట్టూ తాను ఎందుకు తిరుగుతున్నదో తెలియ జెప్పడానికి కూడా తోడ్పడదు. అంతే కాదు. సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలే కాదు తమ చుట్టూ తాము తిరుగుతోంది. సూర్యుడు కూడా తనచుట్టూ తాను తిరుగుతున్నాడు ఇరవై ఎనిమిది రోజులకొకసారి. అదెందుకో ఎవరికీ తెలియదు.

ఎనీ వే, బాక్ టు గంగాధరం.

అతను హంట్స్‌విల్ చేరేసరికి నాసా అపోలో ప్రోగ్రామ్‌కి స్వస్తివాక్యాలు పలుకుతోంది. అయితే, అతని నిరాశకి త్వరలోనే ముక్తిని కలిగించడాని కన్నట్టు స్పేస్ షటిల్ ప్రోగ్రాం మొదలైంది. అందులోనూ, అంతేకాక ఇరవయ్యవ శతాబ్దపు చివరి దశకంలో స్పేస్ స్టేషన్ తయారీ లోనూ కూడా గంగాధరానికి భాగమున్నది, అన్నాడు అతని కొలీగ్ ప్రొఫెసర్ ఏండర్సన్.”


ఎగ్జిక్యూట్ నెక్స్ట్ మేజర్ మాడ్యూల్ – 1998: లాంచ్ ఆఫ్ ది గంగాధరం’స్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఇన్‌స్ట్రక్షన్ సెట్ కంకరెంట్ విత్ దట్ ఆఫ్ ది ఫస్ట్ స్పేస్ స్టేషన్ మాడ్యూల్ లాంచ్ – బ్రెయిన్‌లో ఒక చిన్న బుడగ రూపంలో. ఈ బుడగ గూర్చి ఎవరికయినా తెలిసేది మాత్రం ఇంకొందరి ప్రోగ్రాములతో కలిసి ఒకేసారి ఆ మెమరీ లొకేషన్‌ని యాక్సెస్ చేసినప్పుడే. ఆ బ్రెయిన్ ఏన్యురిజమ్ మరీ చిన్నదిగా వున్నదనీ, అది ఒక పరిమాణానికి వచ్చేదాకా వేచి చూడడం తప్ప మరేం చెయ్యలేమనీ అన్నారు ఆ మెమరీని యాక్సెస్ చేసిన గ్రూప్‌లో వున్న డాక్టర్లు.


2005: “నాన్నకున్న పేరు ప్రఖ్యాతుల వల్ల ఆయన్ని సివిల్ స్పేస్ ప్రోగ్రాములకే గాక మిలిటరీ ప్రోగ్రాములకి కూడా రివ్యూయర్‌గా పిలిచేవాళ్ళు. మిలిటరీ ప్రోగ్రాముల గవర్నమెంట్ రివ్యూలు వాషింగ్టన్, డి.సి., చుట్టుపక్కల జరుగుతూండేవి. వాటికోసం వచ్చినప్పుడల్లా ఆయనకి రెస్టన్‌లో వున్న షెరటన్ హోటల్లో బస చెయ్యడం అలవాటయింది. ఆ హోటల్లో చెక్-ఇన్ కాకముందరే తన ముందు ఆయన కొలాప్స్ అయ్యారన్నాడు రిసెప్షనిస్ట్,” అన్నాడు గంగాధరంగారి కొడుకు హంట్స్‌విల్‌లో బంధుమిత్రుల మధ్య జరిపిన ఆయన మెమోరియల్ సర్వీస్‌లో మాట్లాడుతూ. “911కి ఫోన్ చెయ్యగానే రెండు నిముషాల్లోనే వచ్చిన ఆంబ్యులెన్స్ పక్కనే వున్న రెస్టన్ హాస్పిటల్‌కి ఐదునిముషాల్లో ఆయన్ని తీసికెళ్ళింది. నాలుగ్గంటలపాటు అక్కడి డాక్టర్లు హోరాహోరీగా యుద్ధం చేసినాగానీ ఆయన మళ్ళీ కళ్ళు తెరవలేదు. ఎవరం దగ్గర కూడా లేము. అమ్మ హంట్స్‌విల్‌లో, నేను షికాగోలో, అక్కయ్య హ్యూస్టన్‌లో. రెస్టన్‌లో చుట్టాలు కూడా ఎవరూ లేరు. బ్రెయిన్‌లో ఆ బబుల్ వున్నదని తెలిసిన తరువాత ఎక్కడికీ వెళ్ళొద్దు అని చెబుతే, అదేదో పరీక్షిత్తు చావుట – దాన్ని చెప్పేవారు. యు నో వై ఐ నో దట్ నేమ్? ఇట్స్ బికాజ్ హి సెడ్ ఇట్ సో మెనీ టైమ్స్!”

బుడగలందు రక్తబుడగలు వేరయా!


“గ్రేట్ ప్రాడక్ట్, నువ్వు మొదట్లో చేసిన ప్రాడక్ట్‌ల కంటే ఇది వేల రెట్లు నయం. దే వర్ టూ సింపుల్. ఐ ఆల్వేస్ థాట్ యు వుడ్ డూ బెటర్. ది క్లైమాక్స్ ఇన్ దిస్ వన్ హాజ్ ఎ నైస్ డ్రమటిక్ టచ్. ఇంట్లో ఉన్నప్పుడు ఏ నిద్రలోనో ఆ బుడగ పగిలుంటే ఈ ఎక్జయిట్‌మెంట్ వుండదు.” అన్నాడు ఉస్మానియా.

“దిస్ ఈజ్ ఇండీడ్ వెరీ గుడ్. రెస్టన్ అన్న ఊరే 1969 దాకా లేదు. అక్కడ షెరటన్ హోటల్‌ని 1971 లోనూ, రెస్టన్ హాస్పిటల్‌ని 1978 లోనూ తెరిచారు. రిసెప్షనిస్టు – ఆయన మనవడి వయసున్నవాడు, మెక్సికన్. ఆంబులెన్స్ డ్రైవర్ ఇథియోపియాలో పుట్టి రెస్టన్‌కి అప్పటికి ఓ ఏడాది క్రితమే వచ్చాడు. డాక్టర్స్‌లో ఒకళ్ళది ఐర్లాండ్. ఇంకొకళ్ళు ఇరాన్ నించీ, మరొకరు ఫిలిప్పీన్స్ నించీ. ఇద్దరు అమెరికా లోనే పుట్టి పెరిగినవాళ్ళు. ఇంక సపోర్ట్ స్టాఫ్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముందీ? ఎ బిగ్ ఇంటర్నేషల్ టీమ్. ది వే యు హావ్ యూజ్డ్ సో మెనీ మాడ్యూల్స్ — వెరీ ఇంప్రెసివ్!” అన్నాడు నలందా.

“ఇంత బిగువైన క్లయిమాక్స్‌తో బాటు, ‘ఎవరూ లేని చోట దిక్కులేని చావు చచ్చాడు’ అని చుట్టపక్కాల చేత అనిపించడం – దట్స్ ఎ నైస్ టచ్ ఆల్సో!” ఉస్మానియా.

“థాంక్‌యూ. జస్ట్ ట్వీక్‌డ్ అదర్స్ మాడ్యూల్స్ ఎ బిట్. నాకు అర్థం కానిదొకటుంది. హౌ డిడ్ ఆల్ దీజ్ మాడ్యూల్స్ గెట్ ఎగ్జిక్యూటెడ్? ఒక వీర్యకణం అండంతో కలిసిన తరువాత తనలాంటివే వేరే కణాలుగా విడిపోవడమే గాక శరీరం లోని రకరకాల అంగాలకి నాంది పలికే కణాలని సృష్టించడం, చివరికి ఒక బుడగని కూడా సృష్టించి, దాని పరిమాణాన్ని పగిలేదాకా పెరిగేలా ఇన్‌స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చెయ్యడం – హౌ ఈజ్ ఆల్ దిస్ పాజిబుల్?”

“ఎవరికయినా తెలిసుంటే అది నలందాకి మాత్రమే. హేయ్ నలందా, యూ హావ్ బీన్ హియర్ ఫర్… వాట్, అబవుట్ టు థౌజండ్ హ్యూమన్ యియర్స్?”

“వెయిట్. నలందా?! అంటే, నలందా విశ్వవిద్యాలయపు పట్టభద్రుడు! ఈయనేనా?”

“యస్. అండ్ హి కెన్ క్లెయిమ్ యు యాజ్ హిజ్ ప్రాడక్ట్ టూ. ఆర్, యాజ్ హిజ్ డిసెండెంట్.”

“అంటే దాదాపు రెండు వందల తరాల క్రితమే నేను డిజైన్ చెయ్యబడ్డానా!”

“దాని గూర్చి తరువాత తీరిగ్గా ఆశ్చర్యపోదువు గాని, నీకు అర్థం కానిదేదో అడుగు.”

“ఐఐటీ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఎక్కడినుంచీ వస్తయ్యని ఇన్‌డైరెక్ట్‌గా అడుగుతున్నాడు, యామ్ ఐ రైట్? యూ నో, యు హావ్ ఎగ్జిక్యూటెడ్ అనదర్ వన్ ఆఫ్ దోజ్ జస్ట్ నౌ? అది చేతన పని,” అన్నాడు నలందా.

“హూ ఈజ్ షి?”

“హి, షి, హూ నోస్?”

“ఐ వజ్ వండరింగ్ వైల్ ఐ వజ్ ఎగ్జిక్యూటింగ్ మై ప్రాడక్ట్. నేను ఐఐటీ గ్రాడ్యుయేట్‌ని. అంటే, గంగాధరంగారు ఇస్రో చేరేసరికి ఇంకా పుట్టనివాణ్ణి. హౌ వజ్ ఐ ఏబుల్ టు డిజైన్ హిమ్?”

“లెట్ మి టేక్ ఎ కట్ ఎట్ ఇట్. ‘కాలచక్రం గిర్రున తిరుగుతోంది’ అని అనడం వినే వుంటావు గదా. అయితే, అది స్టాండ్ వేసి వున్న సైకిల్ చక్రం లాగా ఉన్నచోటే తిరుగుతోందా, లేక గానుగ గాటలో తిరిగే చక్రం లాగా ఒకే కక్ష్యలో తిరుగుతూ అదే చోటికి వస్తూంటుందా, లేక రోడ్డు మీద వెడుతున్న బండి చక్రం లాగా తిరుగుతూ అదే పోత పోతోందా అనేది ఎవరు నిర్ధారించారు? ప్రతీ స్ట్రెయిట్ లైనూ అనంత వ్యాసమున్న వృత్తం లోని భాగమేనని వినే వుంటావు. అలాగే, మానవుడి జీవితకాలంతో పోలిస్తే అన్నీ ముందుకు సాగుతూన్నట్టే కనిపించవచ్చు. ఓ మూడు లేక నాలుగువేల సంవత్సరాల క్రితపు నాగరికత గూర్చే పెద్దగా తెలియనపుడు అంతకు ముందరి వేల ఏళ్ళల్లో ఏం జరిగివుంటుందో ఎలా ఊహించగల్గుతాం? ఉదాహరణకి, భూమి ఉత్తర దక్షిణ ధృవాలు కొన్ని లక్షల సంవత్సరాల కోసారి తారుమారవడం గూర్చి… మరీ అంత వెనక్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే, ఒక 26,000 ఏళ్ళ పీరియడ్ గూర్చి ఆలోచిద్దాం – భూమి ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే రేఖ అనంత దూరంలో వున్న తారలతో పోలిస్తే నిశ్చలంగా వుండక తిరుగుతూ దాదాపు 26,000 ఏళ్ళకి బయలుదేరిన చోటికి వచ్చినట్లు తెలుస్తుంది. 26,000 ఏళ్ళ క్రితం గూర్చే ఏమీ తెలియదు! ఇంతకన్నా వివరణ కావాలంటే యూ హావ్ టు ఆస్క్ చేతన. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, ఆల్ ఆఫ్ అవర్ మాడ్యూల్స్ హావ్ ది ఇన్‌స్ట్రక్షన్స్ టు పోజ్ దట్ క్వశ్చన్ టు దట్ అథారిటీ, బట్ నన్ హాజ్ ది ఇన్‌స్ట్రక్షన్ టు రిసీవ్ ది ఆన్సర్! ఆల్‌దో ఇటీజ్ ఇన్ట్రీగింగ్ టు థింక్ లైక్ దిస్, మే బి – జస్ట్ మే బి – యువర్ ఇన్‌స్ట్రక్షన్ సెట్ కంటెయిన్డ్ సమ్‌థింగ్ అబవుట్ బెండింగ్ ది లైన్ ఆఫ్ టైమ్? అదే నిజమయినా గానీ, అది కూడా చేతన చేసిన పనే అవుతుంది.”