రచయిత వివరాలు

పూర్తిపేరు: శ్రీనివాస్ కంచిభొట్ల
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

ఎనభైలలో, ఫలానా సినీతారకి ‘ఆలిండియా అభిమాన సంఘ అద్యక్షుడు’గా ఉండడం అన్నది ఒక వృత్తిగా మారుతున్న రోజులలో, వసూళ్ళు మందికొడిగా మొదలైన సినిమాని ఒక తోపు తోయడానికి ఈ అభిమాన సంఘాల ద్వారా ఆ తారలే పెట్టుబళ్ళు పెట్టి ప్రధాన సెంటర్లలో ‘టికెట్లు కోయించడం’ (అంటే టికెట్లు మొత్తం వీరే కొని, హవుస్ ఫుల్ బోర్డు పడేట్టుగా చేయడం) మంచం దింపిన సినిమా నోట్లో తులసి తీర్థం పోయడం లాంటిది.

ఒక సినిమా బతికి బట్టకట్టి, ప్రేక్షకులని చేరి, వారి దూషణ-భూషణలు, సత్కార-చీత్కారాలు, ఆదరణ-తిరస్కరణలు మున్నగు ద్వంద్వ సమాసాలకు గురికావడానికి పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్క పనికి మాలిన, అసంబంధిత కారణమైనా చాలు. ఇదే సినీ వైకుంఠపాళి.

అరిచి గీపెట్టి, తనకు కావలసిన విధంగా కథ తయారు చేయించుకుని, పాటలు తన అభిరుచికి తగ్గట్టు సంగీత దర్శకుని నుంచి రప్పించుకుని, తన కష్టాన్నంతటినీ దర్శకుడి చేతిలో పెట్టి, మంచి సినిమా తయారు కావడానికి ఇతోధిక సాయం చేసి, ఆనక పక్కకు తప్పుకునేవాడు– ఒక విధంగా ఉత్తమ నిర్మాత.

‘సార్, మీరు కూడా ఏమన్న చెప్పదలిస్తే చెప్పండి సార్!’- సంగీత దర్శకుడు యస్. రాజేశ్వరరావు, మ్యూసిక్ సిట్టింగ్ గదిలోకి కాఫీలు అందించ పోయిన బోయ్‌తో- అప్పటికి గదిలో కూర్చున్న నిర్మాత తాలూకూ బంధు గణం తమ వాడు నిర్మించబోయే సినిమా సంగీతం ఎలా ఉండాలన్న విషయంలో ఆయనకు తమకు తోచిన సలహా ఇతోధికంగా అందచేస్తున్న నేపథ్యంలో.

ఎడిటింగ్ పని మొట్టమొదటిగా ‘శ్రీరస్తు’ రాసి కాగితం మీద కలం పెట్టినప్పుడే మొదలవుతుంది. (రాతకోతలని కావాలనే జంటకట్టారేమో ఆ పనులని!) కాగితం మీద జరిగే ప్రతీ ఒక కొట్టివేత, ఒక రచయిత కూర్పరి భూమికను భరించి చేస్తున్న పనే. క్లుప్తతకీ ప్రభావానికీ మధ్య సమన్వయం కలిపించడమే కూర్పరి పని.

హాస్యమనేది ప్రధానంగా బాధని వ్యక్తీకరించే వక్రీకరించే ఒక కటకం. దూరంగా ఎక్కడో దేని మీదో ప్రతిబింబించే హాస్యాన్ని వెనక్కి వెత్తుకుంటూ వెడితే దాని మూలం బాధ అని తేలుతుంది. ఈ బాధకి కారణలు కోకొల్లలు – శారీరిక/మానసిక లోపాలు, రుగ్మతలు, వైకల్యాలు, భయాలు, కోపాలు- ఇవన్నీ హాస్యానికి ముడిసరుకులే.

హాస్యం అశ్లీలం, సంసార పక్షం అని ఉండదు, పండితే పొట్ట చెక్కలు చేస్తుంది, చెడితే, అసందర్భంగా, అసంబద్ధంగానే ఉంటుంది. సభ్య సమాజం బాహాటంగా చర్చించుకునే విషయాలు కాని వాటికి కూడా తగిన సందర్భం సృష్టించి వాటి నుండి నవ్వులను వెలికి తీయగలిగితే, హాస్యానికి అశ్లీల దోషం ఎంత మాత్రమూ అంటదు.

మిగతా భాషలతో పోలిస్తే తెలుగు సినిమాలు హాస్యానికిచ్చిన ప్రాధాన్యత మరెక్కడా కనపడదు. ఆ మధ్య ఇండియా టుడే పత్రిక ప్రతి పరిశ్రమని సర్వే చేసి ఇప్పటి వరకూ మీ భాషలో వచ్చిన అతి గొప్ప చిత్రం ఏమిటని అడిగితే, తెలుగులో మాయాబజార్ సినిమాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి (మల్లీశ్వరి, శంకరాభరణం, మేఘ సందేశం, తదితరాలు ఉండగానే).

కల్తీ లేని మాస్ మసాలాతో తీసిన ఫక్తు కమర్షియల్ చిత్రానికి నిలువెత్తు అద్దం హలో బ్రదర్ అనే చిత్రం. చిన్నప్పుడే విడదీయబడిన కవలలు, ఏ కారణానైనా వాళ్ళు దగ్గరయినప్పుడు ఒకళ్ళకు కలిగే అనుభూతి మరొకళ్ళకి కూడా కలుగుతుంది. చెప్పుకోవడానికి ఇంతకు మించిన కథ ఏమీ లేదు. కాని ఈ చిన్న లైన్‌ని రెండున్నర గంటలపాటు నవ్వుకోగలిగే విధంగా మలిచిన రచయితకీ దర్శకుడికీ పాదాభివందనం చేయాల్సిందే.

ఒక్క పదేళ్ళ క్రితం వరకు సినిమా ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నకు దర్శక నిర్మతల నుండి ఒకే రకమైన జవాబు ఉండేది: కథ, సెంటిమెంట్, హాస్యం, ఏక్షన్‌తో పాటు యువతకు, మహిళలకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉండబోతున్నాయి మా చిత్రంలో, అని. ఈమధ్య కాలంలో ఆ మొత్తం చెబితే ఎగతాళి చేస్తారనో ఏమిటో, ఆ పైని పడికట్టు పదాలు అన్ని కలిపి ఎంటర్‌టైన్‌మెంట్ అన్న గంప గుత్త మాటతో సరిపుచ్చేస్తున్నారు.

ఆ మధ్య టైటిల్సు ఆఖర్లో కొత్త కార్డ్ ఒకటి ప్రత్యక్షం అవడం మొదలు పెట్టింది – దర్శకత్వపు పర్యవేక్షణ అని. ఒక లఘు డైరెక్టరుగారి చేతిలో ప్రతిష్టాత్మక చిత్రం పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఒక గురు డైరెక్టరుగారు అధ్యక్ష పీఠం అధిష్టించి ఈ సత్తరకాయ గారిని సరిదిద్దుతూ ఉంటారు. దర్శకత్వమే అంటేనే పర్యవేక్షించి తప్పొప్పులు ఎత్తి చూపే పని ఐతే, మళ్ళీ ఈ తోక ఎందుకో, ‘ఆడ లేడీస్’ అన్నట్టు.

స్క్రిప్టు ఇంకా పూర్తిగా రాయబడలేదు. క్లయిమాక్సుని ఎలా ముగించాలో తెలియక సినేరిస్టులు (అంటే స్క్రీన్‌రైటర్లే. సినేరియోలు రాస్తారని అలా అనేవారు లెండి ఒకప్పుడు) తలలు పట్టుకున్నారు. అప్పటికే ముగ్గురి తలలు ఎగిరి పడ్డాయి కూడా. ఈ లోపల హీరోగారికి అసహనం పెరిగిపోతోంది.