కృతజ్ఞతలు
సినిమా వాళ్ళు చాల గొప్పవాళ్ళు. పేరు పరపతులు స్థితిగతుల విషయంలో(నే) కాదు. మిగిలిన కళారూపాలు అన్నిటికన్నా చలన చిత్రకళ చాలా క్లిష్టమైనది, కష్టమైనది. తతిమా కళల్లో ప్రతిభకీ ఫలితానికీ ఒక ప్రత్యక్ష సంబంధం ఉంటుంది ఎంతో కొంత. సినిమా అలా కాదు. ఇది సమష్టి కృషి, ఒక బహుభర్తృక. ప్రతిభ ఉంటే నష్టం లేదు కానీ, ఉండాల్సిన నియమం ఏమీ లేదు. సృజన పాలు తక్కువ, శ్రమ శాతం ఎక్కువగా ఉండే ఈ వెండితెర కళ తలకు మించిన పనే. దీనికి సంబంధించి చరిత్రకారుడు చెప్పిన అక్షర సత్యం ఒకటి ఉంది – ప్రతిభ ఉంటే పుస్తకం రాయి, ఓపిక ఉంటే సినిమా తీయి (Have the talent? Write a book. Have the patience? Make a movie.) ఆణి ముత్యాలని అగాధం నుంచి ఏరుకుని రావచ్చు. కాని అవన్నీ వేటితో ఎక్కడ ఎలా కలిపి ముత్యాల సరం తయారు చేయాలో తెలుసుకునే ఆసక్తి, కట్టే కుదురు, కూర్చే ఓపిక లేకపోతే, దిగ్గజాల్లాంటి వాళ్ళు తీసినా దివాలాకోరు బేరాలవుతాయి (విజయావారి ‘ఉమా చండీ గౌరీ…’, వేదాంతంగారి ‘రహస్యం’ సినిమాలు ఈ కోవలోవే.) ఇన్ని చేసినా, ఎలా తీసినా, అది ఎలా ఆడినా సినిమా తీసిన దర్శకుడు మాత్రం కృతార్థుడు, చరితార్థుడు. డబ్బులు వెదజల్లి నిర్మాత పక్కకుపోవచ్చు. కథా కథనాలు అందించి రచయిత తప్పుకోవచ్చు. మొక్కుబడిగా అన్నా నటీనటులు తమ పాత్రలను నిభాయించవచ్చు. సినిమా శాఖల్లో మిగతా వారికెవరికీ లేని, దర్శకుడికి మాత్రమే ఉన్న బాధ్యత అతని జవాబుదారీతనం. సాంకేతిక అంశాలను పక్కన పెడితే సినిమా సమాహారానికి ముఖ్యమైన, ముచ్చటైన ఈ మూడు ముత్యాలని ఏరి కోరి, ఏర్చి కూర్చి, దగ్గరికి తెచ్చి పూస గుచ్చే పనిని నెత్తికెత్తుకున్న దర్శకుడికి అగ్రతాంబూలం ఇవ్వాల్సిన ఏకైక కారణం కూడా అదే.
‘మంచి కథ ఇచ్చాను సార్, చెడ గొట్టేశాడూ’, ‘ఈ మధ్యకాలంలో ఏక్టింగ్‌కి ఇంత కష్టపడాలా, ఏం లాభం? సినిమా ఎలా వచ్చిందో చూడండి’, ‘కోట్లు తెచ్చి కుమ్మరించానండి, పైసా ఎక్కడా కనపడలా, చుట్టేశాడు.’ ఇదీ పద్ధతి. సినిమా హిట్టయితే క్షీరాభిషిక్తుడు. గల్లంతైతే పాపాల భైరవుడు. కోట్ల కొద్దీ డబ్బు, నెలల తరబడి శ్రమ, కొన్ని వందల జీవితాలు అన్నీ ఒక వ్యక్తి అభిప్రాయాలు, అతని ఇష్టాయిష్టాలు, అతను తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉండడం, అవి అన్నీ తెలిసి కూడా ఆ ముళ్ళ కిరీటం కోసం వెంపర్లాడి పోవడం, అవకాశం వచ్చినప్పుడు సంతోషంగా నెత్తిన దిగేసుకోవడం, అత్యంత అవివేకమైన/ సాహసోపేతమైన చర్య అనే చెప్పవచ్చు. ప్రీ-ప్రొడక్షన్లో అన్ని అంశాలను సరి చూసుకుని, తీయవలసిన దానిని చక్కగా అంకాలుగా విభజించుకుని, అంతా సంసిద్ధమై, ఇక కురుక్షేత్రంలోకి అడుగుపెట్టే నిమిషం – ఎదురుగా సైన్యం మొత్తం తనకేసి చూస్తూ, తన ఆజ్ఞ కోసం వేచి చూస్తూ, తన నోటి నుంచి వెలువడబోయే మొదటి మాట కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉండే ఘట్టం – తలుచుకోవడానికే భయంగా ఉంటుంది. ఆ మొదటి క్షణంలో, మొట్టమొదటి సారి దర్శకత్వపు బాధ్యతల్ని తలకెత్తుకున్న వాడి మనోస్థితి భయం, బాధ్యత, సంతోషం, సందేహం, అనుమానం, అపనమ్మకాలతో మిళితమైన ఒక చిత్రమైన స్థితి. ఈ క్రమంలో దూసుకువచ్చే అవాంతరాల సైన్యాలకు ఎదురొడ్డి, పద్మవ్యూహాల్లాంటి అడ్డంకులను పటాపంచలు చేసి, ఎట్టకేలకు ఒక హిట్టు బొమ్మ ఇవ్వగలిగిన వాడు నిజంగానే శ్లాఘనీయుడు. విజయపుటంచున కాకపోయినా సినిమాని కనీసం తెర మీద దాకా అయినా తెచ్చిన పట్టుదలకి దర్శకుడు నిజంగానే అభినందనీయుడు.
తాపీ ధర్మారావులు
సినిమాలో దర్శకుడికి తక్క మిగతా అన్ని శాఖలకి నిర్దిష్టమైన పాత్రలు, పనులు, పరిధులున్నాయి. దర్శకుడిది మాత్రం సర్వాంతర్యామి తత్వం. ప్రతిదానిలో తన ప్రమేయం ఉంటుంది కాని తరచి చూస్తే దేని సృష్టిలోనూ తన పాత్ర అగుపడదు. మరి సినిమా అసలు ఎందుకు తీయాలి? నిర్మాతగారికి సరే డబ్బు, కథకుడికి సరే పేరు, గుర్తింపు. మరి దర్శకుడికి ప్రేరణ ఏమిటి? కేవలం డబ్బు, పేరు, గుర్తింపేనా? చూస్తే దర్శకత్వం అన్నది అంత సృజనతో కూడుకున్న పని కూడా కాదు. ఆ పని రచయితది. కథని కనడం కథకుడి పనైతే, ఆ కథలోని అంశాలను ఆకట్టుకునే విధంగా అమర్చడమే దర్శకుడి పని. ఒక విధంగా ఇంటీరియర్ డిజైనర్ చేసే పనిలాంటిది. ఏ వస్తువు ఎక్కడుండాలో, ఎక్కడ ఏ రంగులు, ఏ హంగులు, గదికి మరింత అందాన్నిస్తాయో, అలా ఉన్నవాటితో, తెప్పించినవాటితో, కంటికి నదురుగా ఏర్పాటు చేయడమే డిజైనర్ పని. అలానే కథను అలా అలంకరించి తెరకెక్కించడమే డైరక్టర్ పని. ఇక్కడే ఈ ప్రశ్నకి (సినిమా అసలు ఎందుకు తీయాలి?) ప్రాముఖ్యత ఏర్పడుతుంది. డబ్బు, దస్కం పక్కన పెట్టేస్తే, దర్శకుడిని ముందడుగు వేయించే అవసరం ఏమిటి?
(ఆ మధ్య టైటిల్సు ఆఖర్లో కొత్త కార్డ్ ఒకటి ప్రత్యక్షం అవడం మొదలు పెట్టింది – దర్శకత్వపు పర్యవేక్షణ అని. ఒక లఘు డైరెక్టరుగారి చేతిలో ప్రతిష్టాత్మక చిత్రం పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఒక గురు డైరెక్టరుగారు అధ్యక్ష పీఠం అధిష్టించి ఈ సత్తరకాయగారిని సరిదిద్దుతూ ఉంటారు. దర్శకత్వం అంటేనే పర్యవేక్షించి తప్పొప్పులు ఎత్తి చూపే పని ఐతే, మళ్ళీ ఈ తోక ఎందుకో, ‘ఆడ లేడీస్’ అన్నట్టు.)
స్టూడియోల (హాలివుడ్‌లోనూ, ఇక్కడా) ప్రభ కొనసాగుతున్న రోజులలో దర్శకులు మిగతా ఉద్యోగుల మల్లే నెల జీతగాళ్ళు. కథ కుదిరి, నటీనటులు, సాంకేతిక నిపుణుల హాజరు పట్టిక తయారయిన తరువాత, దర్శకుడి బాధ్యత రాసిన కథను తెరకెక్కించడమే. పని పూర్తయిన తరువాత, రాబోయే కథ కోసం జీతం తీసుకుంటూ కులాసాగా నిరీక్షిస్తూ, ఆ సమయంలో తన ప్రజ్ఞకు మరింత పదును పెట్టే పనులు చూసుకుంటూ ఉండడమే వారి పని. జీవన పోరాటాలూ, సంధ్యా సమస్యలూ దరికే రాని విధంగా స్టూడియో అధినేతలు దర్శకులని పోషించేవారు కాబట్టే (వారు ఆ స్థాయికి రావడానికి చేసిన కఠోర శ్రమలూ, అకుంఠిత దీక్షలూ పక్కన పెడితే), సినిమా ఎలా అయినా తీసేసి ఇంత పేరు, డబ్బు, పరువు, దీపం ఉండగానే మూటగట్టుకుపోదాం అన్న తొందర పాత తరానికి ఉండేది కాదు. అలా అని ఆ తరం తీసినవన్నీ కళాఖండాలు కాదు. కాని అవి కళాఖండాలు కాకపోవడానికి కారణం డబ్బు, సమయం, అవసరం మాత్రం కావు. దర్శకుడికి ప్రాణవాయువులాంటి ఛాయిస్ చేసుకునే వీలు, వెసులుబాటు ఈ సెటప్‌లో ఉంది కనకనే నాణ్యత గల చిత్రాలు ఆ కాలంలో ఎక్కువ వచ్చే అవకాశం ఉండేది. ఇప్పటి మేనేజ్‌మెంట్ పుస్తకాల్లో చెప్పినట్టు డబ్బు, సమయం, నాణ్యత, ఈ మూడిట్లో ఏ రెంటి మీదో మాత్రమే ఎప్పుడూ నియంత్రణ ఉండగలదు. ఆ మూడోది అందుబాటుకు ఎప్పుడూ ఓ ఆమడ దూరంలో ఉంటుంది (డబ్బు, సమయం చిక్కితే నాణ్యత దక్కకపోవచ్చు; పోనీ సమయం ఇచ్చి నాణ్యత కోసం పోతే, డబ్బు పారవచ్చు). నేడు తెలుగు చిత్రానికే మకుటాయమానమైన అలనాటి మాయాబజార్ సినిమాని సగం తీసి చూసుకుని, సరిగా రాలేదు, ఇక రాబోదు అని అనుకుని రద్దు చేసుకునే వరకు వచ్చి కూడా, పోనీలే దర్శకుడు ఏదో అడుగుతున్నాడని మళ్ళీ రీవర్క్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు ఆ సెటప్‌లోనే సాధ్యం. ఇప్పటి వారితో పోల్చుకుంటే అప్పటి వారు ద్రష్టలూ, స్రష్టలూ కారు. వాళ్ళకు ప్రేరణ అవసరం కాదు. ఎలాగైనా సినిమా తీయాలన్న తపన కూడా కాదు. అది వారి ఉద్యోగం మాత్రమే.
పనికి ఆహార పథకం
స్టూడియోల ప్రభావం, ప్రాభవం అంతరించిపోయిన తరువాత (మళ్ళీ హాలివుడ్‌లోనూ, ఇక్కడా) ఎవరికి వారే యమునా తీరే అయినప్పటి నుండి పరిస్థితులు వేరు. సినిమా ఎందుకు తీయాలి అన్న అదే ప్రశ్నకు ఇప్పుడు జవాబు పూర్తిగా మారిపోయింది. ఇంట్లో కుంపటి, బడిలో ఫీజులు, జీవన శైలి, వెరసి బతకడానికి సినిమా తీయడం అయిపోయింది ఈ కాలం దర్శకులకి. ఎలాగన్నా హిట్టు పడితే ఇంకొక రెండు సినిమాలు వచ్చి, కొన్ని చిల్లర డబ్బులు వెనక వేసి బ్రతుకును సాఫీగా నడుపుకునే ఉపాధి పథకం అయిపోయింది సినిమా. సరిచూసుకోవటానికి కావలసిన వ్యవధి లేదు, సరిచేసుకోవటానికి కావలసినంత డబ్బు లేదు. ఉన్నదానిని ఎలాగో గడప దాటించి, తెరకెక్కించి ఇక ఆ పైవాడి మీద భారం వేయడమే ఇప్పటి పరమావధిలా కనపడుతోంది. తరాలు మారిన కొద్దీ పరిణామ సిద్ధాంతం ప్రకారం తెలివితేటలు పెరుగుతాయన్నాడు డార్విన్. కాని సినిమా రంగం ఒక్కటి ఈ సూత్రానికి మినహాయింపు. దానికి ఏకైక కారణం దర్శకులకు పోయిన సంరక్షణ. సినిమా ఎప్పుడైతే ఒక కెరీర్ అవుతుందో (రాజకీయాలకు మల్లే) దానిని అందిపుచ్చుకోవడానికీ, అందినది కాపాడుకోవడానికీ కూటి కోసం కోటి విద్యలు పథకం కింద ఏం చేసినా అది జీవనాధార తంత్రం (survival tactic) అయిపోతుంది. వచ్చిన అవకాశంతో ఉన్న అవసరాన్ని ఎలా గట్టెక్కించాలి అన్న నిరంతర మానసిక సంఘర్షణ సినిమా ఎందుకు తీయాలి అన్నదానికి సమాధానమైపోయింది. కథ, సంవిధానం, నటీనటులు ఒకప్పటి సినిమా ముడిసరుకులైతే, తరుముకొస్తున్న విడుదల తేదీ, ముంచేస్తున్న అప్పుల వడ్డీలు, మళ్ళీ దొరకని స్టార్‌ల డేట్లు, ఇవి ఈ తరం సినిమాకు (ఉత్)ప్రేరకాలు. ఇలాంటి వాటన్నిటినీ దాటుకుని, ఈ కాలంలో కూడా అక్కడక్కడా స్వాతి చినుకులు కురిపిస్తున్న దర్శకులకి జోహార్లు అర్పించాలి. (నాటి అన్నమయ్య సాహిత్యానికి, నేటి వేటూరి కలానికి ఇలాంటి నిబంధనలనే కొలమానంగా పెడితే, ఎటువంటి వత్తిడి లేని కాలంలో ఆణిముత్యాలని అందించిన అన్నమయ్య పదకవితల కన్నా, వేయి ఏనుగులు నెత్తి మీద నాట్యం చేసే పరిస్థితులలో వేటూరిగారు వెలువరించిన సినీసాహిత్యం ఏ మాత్రం తీసిపోయినది కాదనే తీర్మానించవచ్చు.)
విరుద్ధంగా పేర్చిపెట్టిన పరిస్థితులు, సృజనకు ఏమాత్రం సంబంధం లేని నిర్ణయాలు, డబ్బు కూడా ముట్టచెప్పే కళగా కాక డబ్బు కోసం మాత్రమే అన్నట్టున్న ప్రేరణలు, ఇవి నేటి తరం దర్శకులకున్న సవాళ్ళు. కాని వీటన్నిటినీ అధిగమించేందుకు వాళ్ళ అమ్ముల పొదిలో తక్కువైన అస్త్రాలు ఏమీ లేవు.
వచ్చే సంచికలో మొదటిది, బ్రహ్మాస్త్రం – టోన్ (tone) గురించి చూద్దాం.
(సశేషం)