“ఏరా, ఏడీ వాడు?”
“తెలియదు బావా, కానీ అట్నించి అటే వచ్చేస్తానన్నాడు.”
“ఎట్నించి ఎటురా?”
“ఎట్నించి ఎటో తెలియదు కానీ అట్నించి అటు మాత్రం వస్తానన్నాడు బావా.”
ఇలాంటి మాటల గారడీలు, మాటల మతలబులు, మాటల కితకితలూ నిలబెట్టు-పడగొట్టు (setup-punchline) పద్ధతికి ఉదాహరణలు. వీటికి సన్నివేశం బరువు అనవసరం. ఇంకా చెప్పాలంటే పెద్దగా సెటప్ కూడ అవసరంలేదు వీటికి. 50, 60ల దశకంలో అమెరికాలో టీవీ అప్పుడప్పుడే వేళ్ళూనుకుంటున్న దశలో ఇలాంటి చెణుకులు విసరగలిగే రచయితలకు విపరీతమైన ఆదరణ, గిరాకీ ఉండేవి. స్టేండప్, టాక్-షో ఫార్మాట్లో తెర మీద కనిపించేది ఒకరైతే, వాళ్ళ నోటినించి వచ్చే
చలోక్తులకు నిరంతం శ్రమించి ఆ (బుల్లి)తెర వేల్పులకు పేరు, పైకం, పలుకుబడి వచ్చేటందుకు ఇతోధికంగా పనిచేసే జోకుల నిర్మాతలు తెర వెనుక వేరే వుండేవారు. ఉడీ ఆలెన్ (Woody Allen) ఆ కోవకు చెందినవాడే. వీరి పని ఏమిటయ్యా అంటే, మూడు వాక్యాలు మించని జోకులు తయారుచేయడం. ఇదంత తీ(రా)సిపారేసే విషయం కాదు కాని, హాస్య నిర్మాణ పాటవాల పోటీలో ఈ వన్-లైనర్లు కాస్త కింద వరుసలోనే నిలుస్తాయి. శిఖరాగ్రాన నిలిచేది మాత్రం ఒక్కటే – ఒక సన్నివేశం (సినిమాలో), ఒక ఏక్ట్ (స్టేండప్లో) సృష్టించగలగడం. ఇక్కడ ఉన్న సమయం అంతా సెటప్‌కే కేటాయించబడుతుంది. హాస్యం – సన్నివేశమైనా, స్లాప్స్టిక్ అయినా, ఛలోక్తయినా, చెంపపెట్టయినా – అది ఎటువంటిదైనా దాని క్రియావిధానం ఒకటే. అదే సెటప్పు-పంచ్ లైనూనూ. వన్లైనర్లో అన్నీ సంక్షిప్తంగా ఉంటాయి – నిలబెట్టే వాక్యం, దాన్ని పడగొట్టే విసురు.
— “ఏం నాన్నా ఇదేనా రావడం?”, “లేదురా, నిన్నే వచ్చి మెట్ల కింద దాక్కున్నా!”
అదే సన్నివేశం విషయానికి వస్తే, సెటప్ మీదే సమయం అంతా సరిపోతుంది. అదో విధంగా కట్టబోయే హాస్య సౌధానికి పునాదిలాంటిది. ఇది ఎంత బలంగా ఉంటే, ఈ ఇంత సౌధాన్ని పడకొట్టే విసురు అంత రంజకంగా ఉంటుంది – ఈ మధ్య కాలంలో టీవీలలో చూపిస్తున్న బహుళ అంతుస్తుల సముదాయాల నియంత్రణా పేల్చివేత (controlled demolition) వేడుకలల్లే. ఇక్కడ సెన్సిబిలిటీ రంగంలోకి దిగుతుంది. సెటప్ ఎంత ఉండాలో, దానికి పంచ్ లైన్ ఎక్కడ ఉండాలో తెలుసుకోవడమే సెన్సిబిలిటీ. ఈ రెండిటిలో ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా- తమలపాకులో సున్నంలాగా ఎక్కువైతే నోరు పొక్కుతుంది, తక్కువైతే రుచి తేలిపోతుంది. చిత్రమైన విషయం ఏమిటంటే ఈ సన్నివేశ హాస్యానికి చెణుకుల అవసరం ఉండకపోవడం! (ఉంటే నష్టం లేదు కానీ ఉండి తీరాలన్న నియమం ఏమీ లేదు.) దీని బలం అంతా సందర్భం. అంటే ఇంతకు ముందు సన్నివేశాలు సృష్టించిన పూర్వ రంగం కాదు; సందర్భం అంటే ఏ ఊతం మీద ఈ సన్నివేశం నిలబడబోతోందో ఆ పునాది.
ఉదాహరణ: ‘కంకిపాడు, ఎ స్మాల్ విలేజి, మారేజ్ లుకింగ్స్ అరేంజ్డు. ఐ వాంటెడ్ టు సీ ది గర్ల్, తల ఇలా దించుకు కూర్చుంది… సరే, ఫాదర్ మదర్ లైక్డు. మై అగ్రీడు, కార్డ్స్ ప్రింటెడు…’ లా సాగిపోతుంది మనీ అనే సినిమాలో కోట శ్రీనివాసరావు కనపడే ఒక ఐదు నిముషాల సన్నివేశం. సెన్సిబిలిటీ అన్న ఉదాహరణకు తెలుగు సినిమాలో ఇంతకు మించిన నిదర్శనం దొరకబోదు. భూతద్దం వేసుకుని వెదికినా పట్టుమని ఒక్క పంచ్ లైన్ లేని దృశ్యమిది. (హుక్ లైన్ మాత్రం ‘కార్డ్స్ ప్రింటెడు’.) సెటప్ మీదే సన్నివేశం అంతా సాగిపోతుంది. చిన్నప్పుడు, ‘బావిలో పడిపోయే సూది బయటికి ఎలా వస్తుంది?’, ‘ఎలా వస్తుందీ అంటే వస్తుందా?’, ‘ఉహూ అంటే వస్తుందా?’ అన్న సాగతీత అనే సెటప్ మీద నడిచే బాటలోనే ఇటువంటి సన్నివేశాలు తయారుచేయడానికి తగిన వస్తువు (పెళ్ళి), పండించగలిగే నటుడు (కోట), అంతకు మించి ఎక్కడా కట్ అనకుండా నడిపించగలిగే ధైర్యమున్న దర్శకుడు (శివనాగేశ్వరరావు), పంచ్ లైన్ లేకపోతే ప్రేక్షకులు చిరాకుపడిపోతారు అని భయపడని నిర్మాత (రామ్ గోపాల్ వర్మ) తప్పనిసరి.
ఇదే వర్మ హిందీలో తీసిన చిత్రం దౌడ్. తెలుగులో తీసిన క్షణక్షణం సినిమాకి కాస్త మార్పుల కూర్పులతో ఉన్న ఈ సినిమాలో ఓ పది నిముషాల నిడివి గల ఒక ‘హాస్య’ దృశ్యం, సెన్సిబిలిటీకున్న మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ముందు ఈ దృశ్యం చూడండి.
ఇది హాస్యమా! ఇదేమి హాస్యం అసలు? – అని అనిపించకమానని విధంగా సన్నివేశం ‘సాగిపోతూ’ ఉంటుంది. దర్శకుడు రచయిత నించీ ఈ సన్నివేశం లోనించీ ఏమి కోరుకుని ఉంటాడో అంతు చిక్కని సన్నివేశం ఇది. అడవి నించి తప్పి(పించుకు) వచ్చిన హీరో హీరోయిన్లు తెలియని ఒక ఊరిలో, ఒక ఆసామిని బురిడీ కొట్టించి సహాయం పొందాలన్నది ఈ సీను ముఖ్యోద్దేశం. గమనానికి తప్ప గమ్యానికి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వకుండా, ఉన్న సమయం అంతా సినీ కాలాన్ని హరించడానికి మాత్రమే అన్నట్టుండే ఈ దృశ్యం నిజానికి దర్శకత్వ ప్రతిభ కంటే అతని సాహసానికి, అతని జడ్జ్మెంట్కి నిదర్శనం. అశ్లీలం/పోర్న్ అంటే ఏమిటన్న విషయం మీద విచారణ కొస్తే అమెరికా సుప్రీమ్ కోర్ట్‌లో ఒక జడ్జ్ చెప్పినట్టు – ‘అంటే ఏమిటో నిర్ధారించలేము కాని, చూస్తే ఇది అన్న నిర్ధారణకు మాత్రం రావచ్చు.’ (I cannot define it, but I know when I see it.). హాస్యం విషయంలో కూడా అంతే.
ఈ సన్నివేశంలో హాస్యం ఏమిటో, అసలు ఎక్కడుందో చూపించు- అని నిలదీసి అడిగితే, అసలు దీనిలోనే కాదు, ఎందులోనూ ‘ఇది హాస్యం’ అని చూపించేట్టు ఉండని రసం అది. డ్రామా అంటే ఇది, థ్రిల్ అంటే అది, సస్పెన్స్ అంటే ఇదే, ఇదిగో హారర్ అని చెప్పచ్చు కానీ, ఇది హాస్యం అని మటుకు ఏ విషయంలోనూ ఒక నిర్ధారణకు రాలేము. “ఒక్క చర్చేమిటీ, మసీదు, దేవాలయం, మంత్రం, తంత్రం, భూతం, ప్రేతం, అన్నీట్లోనూ నమ్మకం ఉంది!”, “నాకు మాత్రం మా యేసు క్రీస్తు మీదే నమ్మకం ఉంది!”, “మరీ మంచిది.”– అన్న మిస్సమ్మ లోని ఈ సంభాషణ వింటే ఫక్కున కాకపోయినా కనీసం చిరునవ్వు అయినా రాకమానదు. మరి అందులో గిలిగింతలు పెట్టే మాటలు ఏమున్నాయో, అక్కడ నవ్వు పుట్టించేది మాటా, మనిషా, లేక వారి ప్రవర్తనా, ఇవేవీ కాక మనస్తత్వమా (ఎన్టీయార్ బ్రతకనేర్చినతనం, సావిత్రి మంకుపట్టు విడవనితనం) అన్నది ఆ చిన్న చిరునవ్వు విరిసే సమయంలో విశ్లేషణకి తావునివ్వదు. ప్రసిద్ధ స్టేజ్/సినిమా రచయిత-దర్శకుడు డేవిడ్ మేమెట్ (David Mamet) హైస్ట్ (Heist) అన్న చిత్రంలో రాసిన ఒక డైలాగు – Everybody needs money, that’s why they call it money – చాల హాస్యస్ఫోరకమైనదని ప్రఖ్యాత సినీ విశ్లేషకుడు రోజర్ ఈబెర్ట్ (Roger Ebert) ఒక సందర్భంలో అభిప్రాయపడతాడు. అందులో హాస్యం ఏమిటన్నది, తోడుకున్న వాడికి తోడుకున్నంత, అర్థమైన వాడికి అర్థమైనంత. చక్రపాణి మిస్సమ్మనే ఉదహరించాలంటే – ఇలాంటి సమయాల్లో మనసును నమ్మకూడదు, బుద్ధిని అనుసరించి పోవాలి – ఈ సందర్భానికి అతికినట్టు సరిపోతుంది. దౌడ్ లోని ఆ దృశ్యానికి మళ్ళీ వస్తే, అప్పటి వరకూ ‘ఇదే హాస్యం’ అని నిర్ణయింపబడిన రూళ్ళకర్రల కొలమానాలకి పూర్తి విరుద్ధంగా, ‘మీ ఇద్దరూ అడవి నించి పారిపోయి వచ్చారు’ అన్న ఒక్క చిన్న నిర్ధారణ కోసం ప్రయాణం చేసిన అతి పొడవాటి బాట ఇది. వెకిలి కాకుండా, వెటకారం లేకుండా, టోన్ చెడకుండా సాగిపోయే ఈ సన్నివేశం సెన్సిబిలిటీకి మరో మచ్చుతునక.
సినిమాకి కాకపోయినా సెన్సిబిలిటీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ సాటర్డే నైట్ లైవ్‌లో (Saturday Day Night Live) వచ్చిన ఈ స్కెచ్‌ని ఉదహరించక తప్పదు.
దీన్ని జీనియస్ అంటారో పిచ్చి అంటారో, అది అంతా చూసేవాడి కళ్ళల్లో ఉంది. రికార్డ్ ప్లేయర్ పక్కన పెట్టుకుని అందులోని పాటకి అస్తవ్యస్తంగా పెదవులు కదపడమే ఈ స్కెచ్. సెటప్ పంచ్లైన్లని ఒక మూలకి పడదోసి ఏండీ కాఫ్మన్ (Andy Kaufman) చేసే ఈ ప్రక్రియకి ఒక పేరు పెట్టడం కూడా కష్టమే. తర్కంలో నాన్ సెక్విటర్ (non sequitur) అని ఒక ప్రయోగం ఉంది. ప్రతిపాదనకీ నిర్ధారణకీ ఎటువంటి పొంతన లేకపోతే అది నాన్ సెక్విటర్ అవుతుంది. (వర్షాలు ఈ మాటు చక్కగా కురుస్తున్నాయి. ఈ మధ్య మిరపకాయ బజ్జీలలో కారమస్సలు ఉండటం లేదు.) ఇందులో ఏండీ కాఫ్మన్ చేసిన ప్రయోగం హాస్యాన్ని నాన్ సెక్విటర్తో రంగరించడం. పై పాట ఒక స్థాయికి రాగానే పెదవులు కదపడం మొదలు పెట్టి, చివరికి వచ్చేసరికి మళ్ళీ అదే స్థానంలో ఈ సారి తటపటాయించి(నట్టు నటించి) మూకాభినయం చేసే అవకాశం జారవిడుస్తాడు. అంతే ఆ స్కెచ్‌లో ఉన్న హాస్యం. రూడీ జూలియాని (Rudy Giuliani) న్యూయార్క్ మేయర్‌గా ఉన్న సమయంలో ప్రసిద్ధ న్యూయార్క్ మెట్రోపాలిటన్ ఆర్ట్ మ్యూజియమ్ ఒక వర్ణచిత్ర ప్రదర్శనకి అనుమతిచ్చింది. అది ఏనుగు పేడతో అలకబడిన వర్జిన్ మేరీ చిత్రం. అప్పట్లో ఈ చిత్రం మీద అసలు కళ అంటే ఏమిటి అనేవరకూ సిద్ధాంతపరంగా చర్చలు, ప్రభుత్వపరంగా ఇలాంటి రెచ్చగొట్టే చిత్రాలకు అనుమతులు, అండదండలు ఉపసంహరించే చర్యలు – రెండూ పోటాపోటీగా సాగినాయి. ఇదే ఏండీ కాఫ్మన్ కామిడీ సూత్రం – హాస్యాన్ని నిర్వచనాలూ నిబంధనలూ థియరీలకూ ఎంత దూరంగా జరపగలడో చూడడమే. ఈ వింత విపరీత చేష్టలు అన్నీ అతని సెన్సిబిలిటీని ప్రతిబింబిస్తాయి.
హాస్యమనేది ప్రధానంగా బాధని వ్యక్తీకరించే, వక్రీకరించే ఒక కటకం. దూరంగా ఎక్కడో దేని మీదో ప్రతిబింబించే హాస్యాన్ని వెనక్కి వెతుక్కుంటూ వెడితే దాని మూలం బాధ అని తేలుతుంది. ఈ బాధకి కారణలు కోకొల్లలు – శారీరిక/మానసిక లోపాలు, రుగ్మతలు, వైకల్యాలు, భయాలు, కోపాలు. ఇవన్నీ హాస్యానికి ముడిసరుకులే. అత్యంత తేలికైన ఎగతాళి నించి అత్యంత కష్టమైన వ్యంగ్యం వరకూ – చూసేవాడికీ తీసేవాడికీ – మిగతా ఏ రసం ఇవ్వలేనటువంటి కిక్ ఇచ్చే హాస్యానికి అందుకే అంతటి ఆదరణ. ఆ ఎవరెస్ట్ మీద కాలు మోపి జెండా జయప్రదంగా ఎగరవేయగలిగిన అతి కొద్దిమంది పైకి వెళ్ళడానికి తీసుకున్న దారులు వేరైనా (భాషని నమ్ముకుని కొందరు, నిశ్శబ్దాన్ని నమ్ముకు కొందరు, వైకల్యాలని అమ్ముకు కొందరు, వ్యంగ్యాన్ని వండి మరి కొందరు) వీటన్నిటి ధ్యేయం, లక్ష్యం ఒక్కటే – మనోరంజనం! రియాక్షన్ (అది ఎటువంటిదైనా- నవ్వు నించి కోపం వరకూ) రాని హాస్యం, సామెత చెప్పినట్టు, ‘అడవిలో మొదలు కూలిన చెట్టు ఉండినా ఊడినా పట్టించుకునే నాథుడు కరువు’. అందుకని పంచ్ లైన్లతో, ప్రాస మాటలతో, అసంబద్ధ దృశ్యాలతో, సాగతీత వ్యవహారాలతో నటులతోనూ మాటలతోనూ కుస్తీ పట్టి ఒక్క చిన్నపాటి చిరునవ్వునైనా వెలికి తీయడానికి తమ తెలివిని, అభిరుచిని పణంగా పెట్టి పనిచేసే హాస్య కళాసీలకు జేజేలు.
(వచ్చే సంచికలో: కోతల రాయుడు – ఎడిటర్)