రచయిత వివరాలు

పూర్తిపేరు: కంచరాన భుజంగరావు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:

 

నేను పాడాలనుకున్నది
ఒక్కగానొక్క పాట!
నూతిలోకి జారి
కావులో కూరుకుపోయే నీటిపిల్లిలా*
గొంతు దాటనీయవు
ఒడ్డు చేరనీయవు

తెరిచీ మూసే గుప్పిళ్ళతో
ఆ గుప్పెడు పదాల విరాట్ రూపాన్నీ
మాటల మధ్య లుప్తమైన ఖాళీలనూ
ఖాళీల మధ్య గుప్తమైన భావాలనూ
గుండెతో చూసిన ఇంద్రియాలన్నీ
వెలుతురు కొమ్మలై మొలిచాయి

కాస్త మబ్బు పట్టినా చాలు
సిరా చుక్కలు చినుకులవుతాయి
నీరెండ మెరుపు తాకినా
వేళ్ళ కొసల్లో పూలు పూస్తాయి.
చీకటి ఊయలలో
రాతిరి బిడ్డ నిద్దరోతున్నపుడు కూడా

సముద్రం లాంటి ఆకాశంలో
అసహజమైన రూపాలెన్నో
సహజంగా మొలుస్తాయి
నింగినిండా అల్లుకుపోయే మబ్బులు
రంగు కాగితాల్లా ఎగిరే పక్షుల కోసం
వడ్లకుచ్చుల ముఖాలతో
పొదరింటికి తోరణాలు కడతాయి

మట్టిపొద్దులు మౌనంగా నిర్మించిన
సుగంధాల పడవలు
మట్టికొలనులో మునిగిపోవడానికి
పెద్ద పెద్ద అలలతో పనిలేదు
గాలి తరగల తాకిడి
సుతారంగా సోకితే చాలు!

కళ్ళనో గుండెనో మెత్తగా తాకే క్షణాలైనా
సరదా సరాగాల చెలిమి సమయాలైనా
బంధాలు బంధనాల వంతెనపై
బహిరాంతర్లోకాల నడుమ
నిరంతర వాత్సల్య చలనాలవుతాయి
గుట్టలుగా రాలిపోతున్న క్షణాల మధ్య
బుట్టలుగా పోగుపడే జ్ఞాపకాల రాశులవుతాయి.