అక్షరాలా పరవశం

భావమో అభావమో అక్షరాలా
నా తలపుల్లోకి తలుపు తెరుచుకొచ్చింది
ప్రియమారా పెంచుకున్న చిలుకలా
ఒక పదమొచ్చి భుజాన వాలింది
దాని వెంట మరొకటి
చిగురు నాలుకను చివ్వున తడిమింది

పదాలు గొలుసు కట్టి
తియ్యని వాక్యాలై స్థిరపడ్డాయి
నాలోని కార్మికుడు రేయంతా
కుదురుగా వాటిని చెక్కితే
పలుకుల బొమ్మొకటి పుట్టింది

ఆమెకు చూపించాను
అక్షరాలా కవిత్వమంది!

తెరిచీ మూసే గుప్పిళ్ళతో
ఆ గుప్పెడు పదాల విరాట్ రూపాన్నీ
మాటల మధ్య లుప్తమైన ఖాళీలనూ
ఖాళీల మధ్య గుప్తమైన భావాలనూ
గుండెతో చూసిన ఇంద్రియాలన్నీ
వెలుతురు కొమ్మలై మొలిచాయి

నేనో విలగ్నమూర్తినై నిలబడ్డాను
కలం చేతిలో వివశంగా
అక్షరాలా పరవశంగా…