ది వేస్ట్ లాండ్: 6. వాట్ ది థండర్ సెడ్

[ఎలియట్ పరిచయం కోసం ఉపయుక్త వ్యాసాలు: టి. ఎస్. ఎలియట్: కవితాశిల్పం; టి. ఎస్. ఎలియట్: జెరోన్షన్. ది వేస్ట్‌ లాండ్ పూర్తిపాఠం పిడిఎఫ్.]


వేస్ట్‌ లాండ్‌లో చివరి అంకం (What The Thunder Said) చేరుకుంటున్నాం. మనకు, అంటే భారతీయులకు, యీ కావ్యంలో ముందుగా గుర్తు వచ్చేది యీ చివరి భాగం. అందుకు కారణం దాని పేరులోనే ఉంది. అది ‘పర్జన్యప్రవచనం’ – బృహదారణ్యకోపనిషత్తు నుండి గ్రహించినది.

ఎలియట్ వేస్ట్‌ లాండ్‌ చివర యిచ్చిన నోట్స్‌లో యీ చివరి అంకంలో మూడు కావ్యవస్తువులు తను వాడుకున్నట్టు చెప్పుకున్నాడు. చిత్రంగా, ఆ మూటిలో యీ ఉపనిషత్తు లేదు. పేరులోనే ఉంది కదా, తిరిగి పేరుపెట్టి చెప్పడం ఎందుకు అనుకొని ఉంటాడు. అతడు చెప్పిన మూడు కావ్యవస్తువులు:

1. ఎమోస్ యాత్ర (The Journey to Emmaus)
2. కామినీ పిశాచం (The Approach to Chapel Perilous)
3. తూర్పు యూరప్ పతనం (The Decay of Eastern Europe)

వీటిలో మొదటిదానికి బైబిల్ మూలం. రెండవది క్రీస్తు వాడిన ఒక పాత్ర కోసం అన్వేషణ గురించి ప్రచారంలో ఉన్న అనేక క్రైస్తవగాథలలో ఒకటి. ఈ కథలలో ప్రధానమైనది, మాలొరీ రాసిన ‘ఆర్థర్ మృతి (Le Morte d’Arthur). మూడవ దానికి మూలగ్రంథం చెప్పలేదు. మనం ఊహించవలసిందే.

ఎమోస్ యాత్ర

ఇది బైబిల్‌లో కథ (లూక్: 24:13-35) . ఇది జీసస్ శిలువ వేయబడిన తరువాత, ఆయన పునరుత్థానానికి పూర్వము, జరిగింది. ఇద్దరు బాటసారులు జెరూసలెమ్ నుండి అక్కడికి ఏడు మైళ్ళ దూరంలో ఉన్న ఎమోస్ అనే గ్రామానికి వెళుతున్నారు. వాళ్ళు సహజంగానే తాజా సంచలన వార్త, జీసస్ శిలువవేత, గురించి మాట్లాడుకొంటున్నారు. కాని వారికి అది కేవలం వార్త కాదు, ఆర్తి కూడా. కాని వారికి జీసస్ పట్ల ఆర్తి ఉన్నంతగా ఆయన దివ్యశక్తిపై నమ్మకం లేదు. దారిలో వారిని ఒక వ్యక్తి కలిశాడు. ‘ఏమి మాట్లాడుకుంటున్నారు‘ అని అడిగాడు. వారు జీసస్‌ను శిలువ వేయడం గురించి చెప్పి, తమ బాధ, నిరాశలను వ్యక్తం చేశారు. మాటలలో ఎమోస్ వచ్చింది. ఆ మూడవ వ్యక్తి ముందుకు సాగిపోతున్నాడు. వారు, అతనిని తమ యింటికి వచ్చి రాత్రి భోజనం చేసి, రాత్రి వారితో గడిపి పొమ్మన్నారు. అతడు సరే అని ఉండిపోయాడు. ఆ రాత్రి భోజనసమయంలో, ఆ అపరిచితుడు, రొట్టెను కోసి ముక్కలు చేస్తూ, హఠాత్తుగా జీసస్‌గా వారికి దర్శనమిచ్చాడు. వారు ఆనందాశ్చర్యాలలో మునిగిపోయారు. అలా దర్శనమిచ్చి, జీసస్ అదృశ్యమైనాడు. ఈ అద్భుతాన్ని లోకానికి తెలపడం వారి బాధ్యతగా తెలుసుకొని, వారిద్దరు తిరిగి జెరూసలెమ్‌కు వెళ్ళారు. ఈ కథలో, జీసస్ మొదట తనను తాను ప్రకటించుకోడు. వారిలోని ఆర్తిని గమనించిన జీసస్, వారిని ఉద్ధరించదలచాడు. కాని, వారిని పరీక్షించవలె. వారి ఆహ్వానంలో ఆతిథ్యంలో వారు చూపిన ఆప్యాయతను ప్రేమను చూసి, వారికి కలిగినదానిని మరొకడితో పంచుకోవడం చూసి, ఆయన వారికి తన వాస్తవరూపాన్ని చూపాడు. ఎప్పుడైనా ఎవరికైనా భగవత్సాక్షాత్కారం కలిగేది యీ పొరుగువానిపట్ల ప్రేమ వల్లనే. అదే భగవంతుడు పెట్టే పరీక్ష. రొట్టెను కోసి ప్రసాదంగా తీసుకోవడం తరువాతి కాలంలో ఒక ప్రధాన క్రైస్తవధర్మక్రతువుగా నిలిచిపోయింది. భౌతికపోషణకు ఆధ్యాత్మిక తోషణకు ఆ రొట్టె సంకేతం.

ఈ కథ, భక్తిమార్గంలో బాధనుండి నిరాశనుండి భక్తుడు శ్రద్ధలోకి ఎదగడం, భగవత్కృప వల్ల ఆ శ్రద్ధను దృఢతరం చేసుకోవడం చెబుతుంది. శ్రద్ధ స్థిరపడినపుడు ఆనందంగా మారుతుంది. ఈ ఎమోస్ దారిన నడక, ఆధ్యాత్మికమార్గంలో సాధనకు సంకేతం. త్యాగము సహానుభూతి ప్రేమ, వీటి వలననే భగవత్కృప పొందగలము, అని చెప్పేది యీ కథ. ఆ బాటసారులు జీసస్‌ను తమ యింటిలోకి ఆహ్వానించారు. ఆయన వారిని తన హృదయంలోకే ఆహ్వానించాడు.

ఈ కథలో యిద్దరు బాటసారులు. దారిలో కలిసిన మూడవ వ్యక్తిని వారు గుర్తించలేరు. రెండవ వాని ప్రాముఖ్యం ఏమిటి? ఆధ్యాత్మికయాత్రలో లోకంలో మరొకడు నీకు తోడు కాలేడు. వాడూ నీలాంటి వాడే. వాడు ఎంతటి పండితుడైనా ప్రాభవం కలవాడైనా నీకు దారి చూపలేడు. ఈ దారి నీకు ఎంత తెలుసో, వాడికి అంతే తెలుసు. ‘కాననివాని నూతగొని కాననివాడు విశిష్టవస్తువుల్ కానని భంగి’ అని ప్రహ్లాదుడన్నట్టు. మరి? ‘కొందరటగందురకించన వైష్ణవాంఘ్రి సంస్థానరజోభిషిక్తులగు సంహృతకర్ములు’ కనుక, ‘మూడవ వ్యక్తి’ మాత్రమే దారి చూపించగలడు. ఆ మూడవవాడు మనతో నడుస్తూనే ఉన్నా, మనతో మాట్లాడుతూనే ఉన్నా, మనం అతనిని గుర్తించలేము. భగవంతునియందు తీవ్రమైన ప్రేమ కలిగినపుడు, కృపకలిగి అతడు స్వయంగా, ముసుగు తొలగించుకొని, తనను తాను ప్రకటించుకుంటాడు, యీ కథలో జీసస్ వలె. ఉపనిషత్తు కూడా అదే అంటుంది:

నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన|
యమేవైష వృణుతే తేన లభ్య స్తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వామ్||(కఠోపనిషత్తు. 1. 2. 23.)

వేదాలు వల్లించడం వలనగాని, వేదార్థధారణవలనగాని, శ్రుతపాండిత్యం వలనగాని యీ ఆత్మ లభించదు. తన ఆత్మను కేవలంగా వరించినపుడు, ఆ ఆత్మయే సాధకుడికి తన స్వరూపం విప్పి చూపుతుంది.

జీసస్ గాథను ఎలియట్ యీ చివరి అంకంలో ఒక కావ్యవస్తువుగా తీసుకొన్నాడు. జీసస్‌ను రాజభటులు అర్ధరాత్రి కాగడాలు వేసి వెదకడంతో మొదలవుతుంది.

After the torchlight red on sweaty faces.

వేస్ట్‌ లాండ్‌‌లో యింతవరకు మనం నడిచింది సాధారణమార్గం. ఇప్పుడు నడవబోయేది సాధనమార్గం. అదే అనావృష్టి, అవే ఎండిన బండలు, అదే కరువు, అదే బ్రతుకు బరువు. కాని, యిప్పుడు అవి జడజనుల కష్టాలు, వారి జీవనచిత్రాలు కావు. ఇప్పుడవి సాధకుని ఆర్తిలో భాగాలు, సాధనమార్గంలో అనుభవాలు. ఈ జడజీవనం కంటే ఉన్నతజీవనం సాధ్యమని, దానిని సాధించవలెనని తెలియడమే జడత్వం వదిలిపోవడం. ఇంతవరకు కావ్యం నరకం (Inferno) అయితే, యిక ప్రక్షాళనం (Purgatorio). పరమధామం (Paradiso) చేరకపోవచ్చు, కాని అది ఉన్నదన్న నమ్మకంతో ముగుస్తుంది కావ్యం.

కామినీపిశాచం

‘పవిత్రపాత్ర’ (Holy Grail) గాథ వస్తువుగా అనేక కథలు కావ్యాలు వచ్చాయి క్రైస్తవసమాజాలలో. ఈ గాథలు అనేకము విభిన్నము. జీసస్ చివరి భోజనంలో (Last Supper) వాడిన పాత్రను పవిత్రవస్తువుగా క్రైస్తవులు భావిస్తారు. జీసస్ శిలువ వేయబడినపుడు కారిన ఆయన రక్తం అదే పాత్రలో సంగ్రహించబడింది. ఆ పాత్రను భద్రపరచే బాధ్యత ఒక బెస్తరాజుపై ఉండేది. అతడు చేపలు పట్టేవారికి రాజు. కాని అతని రాజ్యంలో తాగడానికి కూడా నీరు లేదు. ఆ రాజు ఒక శాపకారణంగా గాయపడి అసమర్థుడైనాడు. అతని రాజ్యం మరుభూమిగా మారిపోయింది. ఆ రాజు తిరిగి స్వస్థుడు కావాలంటే, ఆ పవిత్రపాత్ర ఎక్కడ ఉందో వెదకి తేవలె. ఆ అన్వేషణలో సఫలమైన వ్యక్తి, ఆధ్యాత్మికసాఫల్యం కూడా పొందుతాడు. కనుక యీ యాత్ర ఒక ఆధ్యాత్మిక సాధనకు ప్రతీక. పవిత్రపాత్రను అన్వేషించే సాధనమార్గంలో సాధకుడు అనేక పరీక్షలు ఎదుర్కొంటాడు. ప్రధానమైన పరీక్ష కామజయం. ప్రమాదకర ఆలయం (Perilous Chapel) యిటువంటి పరీక్షాస్థలం. ఆర్థర్ అనే రాజుగారి యోధులలో ప్రముఖుడు సర్ లాన్స్‌లాట్. అతని ఆధ్యాత్మిక సాహసయాత్ర కథావస్తువుగా మేలొరీ రాసిన కావ్యం ఆర్థర్ చావు. ఈ కథానాయకుడు, సుదూరమరుభూమిలో ఒక కొండపై ఉన్న ఒక చాపెల్‌లో ప్రవేశిస్తాడు. దేవాలయంలా కనిపించే అది, ఒక కామినీపిశాచాలయం (Chapel Perilous).

the empty chapel, only the wind’s home.
It has no windows, and the door swings.

ఆ ఆలయం ‘గాలి’కి నిలయం. (పిశాచాన్ని ‘గాలి’ అంటాం కదా? దయ్యాలకొంపలో తలుపులు కిటికీలు గాలికి కొట్టుకుంటాయని మనకు సినిమాలు చెబుతున్నాయి కదా!) ఒక కామపిశాచం కథానాయకుణ్ణి ప్రలోభపెడుతుంది. అతడు ఆ పరీక్షలో నిగ్రహం వహించి నెగ్గుతాడు. అది అతడి ఆధ్యాత్మికసాధనలో విజయం. దేశానికి క్షేమం. రాజు స్వస్థత పొందుతాడు, రాజ్యం సుభిక్షం అవుతుంది.

ఇది యిద్దరి కథలు కలిసిన వృత్తాంతం. తన పాపఫలంగా నిర్వీర్యుడైన ఒక రాజు, యింద్రియనిగ్రహమే ఆయుధంగా, కామజయం సాధించిన ఆధ్యాత్మిక యోధుడు. మరుభూమి తిరిగి తరుభూమిగా మారడం చెప్పే పురాణగాథ.

తూర్పు యూరప్ పతనం

వేస్ట్‌ లాండ్‌ కావ్యవస్తువు యూరప్ నైతికపతనం అనుకొన్నాం. తూర్పు యూరప్ రాజకీయంగా నైతికంగా, యూరప్ నుండి వేరుగానే ఉండింది. దాని పతనం కూడా వేరు. దాని పతనస్వరూపం అర్థం చేసుకోవలెనంటే, దోస్తోవ్‌యస్కీ నవలలు, ముఖ్యంగా అతని కరమజోవ్ సోదరులు చదవవలె. ఇది వట్టి ఊహ కాదు. ఎలియట్ వేస్ట్‌ లాండ్‌‌కు తన నోట్స్‌లో, హెస్ (Hesse) రాసిన వ్యాసం (The Brothers Karamazov-The Downfall of Europe) జర్మన్ మూలం నుండి కొన్ని వాక్యాలు ఉదాహరించాడు. తనకు తెలిసిన భాషలన్నీ మనకూ తెలుసుననుకొంటాడు, ఎలియట్. ఎలియట్ ఉదాహరించినవే కాక, మరి కొన్ని హెస్ వాక్యాలు:

ప్రవక్త ఒక రోగి, దోస్తోవ్‌యస్కీ మూర్ఛరోగి అయినట్టు… ఇటువంటి వారు చాలా మంది ఉంటే ప్రపంచం కుప్పకూలుతుంది… ఇటువంటి రోగికి అసాధారణమైన అతీంద్రియ దివ్యశక్తులుంటాయి. ఆసియాదేశాలవారు యీ విధమైన ఉన్మత్తులను ఆరాధిస్తారు. అతడొక ద్రష్ట, ప్రవక్త… . ఇప్పటికే సగం యూరప్, అధమం సగం తూర్పు యూరప్, అస్తవ్యస్తంలోకి జారిపోతోంది… కొందరికి దోస్తోవ్‌యస్కీ నేరస్థుడైతే, మరి కొందరికి అతడొక మహర్షి. [James Langenbach తన పుస్తకంలో (Modernist poetics of History: Pound, Eliot, and the sense of the Past) ఉదాహరించిన హెస్ వాక్యాలకు నా తెలుగు.]

వేస్ట్‌ లాండ్‌ రాసిన ఎలియట్ కూడా ఒక రోగి. అతడొక ఉన్మత్తప్రవక్త. Heironymo’s mad againe, అంటాడు వేస్ట్‌ లాండ్‌ ముగింపులో. అవును యూరప్‌కు మరోసారి మతిచెడింది.

ద ద ద -పర్జన్య ప్రవచనం

ఇక యీ మూటి సమాహారమని చెప్పదగిన బృహదారణ్యకోపనిషత్తులోని ప్రజాపతి పాఠం. దేవతలు మానవులు అసురులు. వీరికి తండ్రి, గురువు ప్రజాపతి. గురూపదేశం పొందవలెనని వారు బ్రహ్మచర్యం పాటించిన తరువాత, ఉపదేశాన్ని అర్థించారు. ముందు దేవతలు అడిగారు. వారికి ‘ద’ ఉపదేశించి, అర్థమయిందా అని అడిగాడు ప్రజాపతి. వారు ‘అయింది, దామ్యత – యింద్రియనిగ్రహం కలిగి ఉండండి’ అని ఉపదేశం అన్నారు. తరువాత మానవులకు అదే ‘ద’ ఉపదేశించాడు. వారు దానిని ‘దత్త’గా అర్థం చేసుకొన్నారు. మానవులు లోభాన్ని జయించి దానగుణం పెంచుకోవలెనని ఉపదేశం. దానవులు అదే ‘ద’ను ‘దయధ్వమ్’గా తెలుసుకొన్నారు. దయను పెంచుకొమ్మని ఉపదేశం.

ఈ కథలో గమనించవలసిన విషయాలు రెండు మూడు. ఉపదేశం మానవులకే. దేవదానవ గుణాలు మానవులవే. ఈ విషయం శంకరుడు యీ మంత్రానికి తన భాష్యంలో స్పష్టం చేశాడు. (న దేవా అసురా వా అన్యే కేచన విద్యన్తే మనుష్యేభ్య: మనుష్యులకంటే వేరుగా దేవతలు రాక్షసులు ఎవరూ లేరు.)

ఉపదేశం ఊరకే చేయడు గురువు. శిష్యుని యోగ్యతను పరీక్ష చేసిన తరువాత కాని చేయడు. (ఈ అంశం బైబిల్ కథలో కూడా చూచాం.) శిష్యుడు బ్రహ్మచర్యం పాటించి (బ్రహ్మచర్యముషిత్వా), ఆత్మపరీక్ష చేసుకొని తనను తాను సిద్ధం చేసుకుంటాడు. ఆ ఆత్మపరీక్షలో తనకే ఉపదేశం అవసరమో అతనికే తెలుస్తుంది. లేకుంటే, ఒకే అక్షరం ‘ద’ ముగ్గురికి మూడు విధాలుగా అర్థం కాదు కదా!

ఎలియట్ ఎక్కడనుండి ఎవరినుండి దేనిని గ్రహించినా యథాతథంగా గ్రహించడు కదా. అంతేకాదు, తిరిగి యివ్వకుండా ఏదీ తీసుకోడు. ఈ ఉపనిషత్తులోని ‘దత్త దామ్యత దయధ్వమ్’ వరుస మార్చి, ‘దత్త దయధ్వమ్ దామ్యత’ చేశాడు. అంతే కాదు. ఆ ఉపదేశాలకు తన స్వీయభాష్యం కూడా చెప్పాడు, కవితారూపంలో.

గురువుగారి ఆశ్రమప్రాంగణంలో చెప్పిన పాఠం అక్కడికే పరిమితం కాకూడదు. కనుక, ఉపనిషత్తు ఆ ఉపదేశాన్ని ఆకాశవాణి ద్వారా ప్రసారం చేసింది, లోకానికంతా వినిపించే పర్జన్యగర్జనగా. (తదేతదేవైషా దైవీ వాగనువదతి స్తనయిత్నుర్ద ద ద ఇతి.) ఈ సన్నివేశాన్ని ఎలియట్ అద్భుతంగా వర్ణించాడు. ఇంతవరకు ఎలియట్ శిల్పాన్ని గమనించలేదు మనం. ఇప్పుడు చూద్దాం.

In a flash of lightning. Then a damp gust
Bringing rain
Ganga was sunken, and the limp leaves
Waited for rain, while the black clouds
Gathered far distant, over Himavant.
The jungle crouched, humped in silence.
Then spoke the thunder
DA

విశ్వమంతా వినిపించనున్న ఒక మహాద్భుతవాణి కొరకు సమస్త ప్రకృతి ఎట్లా ఎదురుచూస్తుందో, ఎలియట్ చెప్పిన తీరులో, అతనికి కావ్యరచన ఎంతగా వశమైందో తెలుస్తుంది. ఉత్కంఠ. ఉద్వేగము. ‘నిష్కంపవృక్షం నిభృతద్విరేఫం’ అన్నట్టున్నది అడవి. నిశ్శబ్దము నైశ్చల్యము. ఆకు కూడా కదలడం లేదు. ఉరుముకు ముందు మెరుపు: a flash of lightning. వర్షం ముందు వచ్చే ఝంఝామారుతం: a damp gust. గంగాప్రవాహం కూడా: Ganga was sunken, సమస్తప్రకృతితో పాటు, సంహృతమైంది. ‘u’ (vowel) ఈ సంహృతిని, యీ కుంచించుకోవడాన్నే సూచిస్తున్నది. ఈ పాదాలలో అచ్చులు హల్లులు ఎలియట్ కూర్చిన తీరు అద్భుతం. sunken, jungle, crouched, humped, thunder-అన్నిటా ‘u’. ఇంగ్లీషు ‘u’ కప్ ఆకారంలో ఉంటుంది, రానున్న వర్షపునీటిని పట్టి ఉంచడానికా అన్నట్టు! ‘u’ కప్పు ఆకారమైతే, హల్లులు m, n, బోర్లించిన కప్పుల ఆకారం. సమస్తప్రకృతి ఒక పవిత్రపాత్ర: Holy Grail. ఇవి పై కప్పులు, ప్రకృతికి ఆచ్ఛాదన, రక్షణ. హల్లులు సన్నివేశానికి బరువును కూడా యిస్తున్నాయి. ఈ విధంగా, రూపంలోనూ శబ్దంలోనూ అనురూపమైన అక్షరసంయోజనం చేయడం ఎలియట్ అద్భుతకవితాశక్తికి నిదర్శనం. ఇదొక విధమైన చిత్రకవిత కూడా. కాని కృతకమనిపించదు.

అప్పుడు ఉరుము ఉరిమింది: Then spoke the thunder/ DA. [ఈ ఉరుము వినదలచుకొంటే, Tom O’Bedlam చదివిన What the Thunder Said వినండి, యూట్యూబులో, ఉచ్చారణ ఉపేక్షించి. డటా (దత్త) అంటాడు, కాని బాగా చదివాడు.]

ఎలియట్-తిక్కన

సన్నివేశం వేరయినా, యీ వర్ణనలో గుర్తు వస్తుంది ఉద్యోగపర్వంలో శ్రీకృష్ణరాయబారఘట్టం. శ్రీకృష్ణుడు హస్తినకు వస్తున్న వార్తతో నగరమంతా సంరంభం. ఆయనను ఆహ్వానించడానికి సన్నద్ధమవుతోంది. (ఎందుకు కాదు? అమెరికా ఆడబడుచు వస్తేనే మనం ఎంత హడావుడి చేశాం!)

సరే, రాజసభలో ఆయన మాట్లాడబోతున్నాడు. సభ ఆతురతతో ఆ మహాత్ముని మాటకోసం ఎదురు చూస్తోంది. ఆదరం భయం భక్తి ముప్పిరిగొన్న సన్నివేశం. నిశ్శబ్దం.

ఆ కొలువువారు కరమచలాకృతి నొక పలుకు లేక యందఱు వింజం
బాఁకిడిన కరణి నవశ ముదాకారిత చిత్తవృత్తులై యుండంగన్.
జలదస్వనగంభీరతనెలుగొప్పగ దంతదీప్తులెసగ ముకుందుం
డలరుచెవులనఖిలజనంబులువినధృతరాష్ట్ర భూవిభున కిట్లనియెన్. 3. 255-256.

(వింజంబు = వింధ్యపర్వతము; ఆఁకిడు = అడ్డమగు. వింధ్యపర్వతం హఠాత్తుగ మన ముందు దభీమని వచ్చి వాలినట్టు.)

శ్రీకృష్ణుడు నేలమీద నిలబడే మాట్లాడుతున్నాడు. కాని, ఆకాశమంత ఎత్తులో, ‘జలద’మండలంలో మాట వినిపిస్తోంది. పర్జన్యగర్జనలాగే ఉంది ఆయన మాట. ఉరుముకు ముందు మెరుపూ ఉంది, దంతదీప్తులెసగ: a flash of lightning. సభలో ఉత్కంఠ, ఉత్సాహం, ‘అలరు చెవులు.’ మాటలోని మంత్రశక్తికి వశమయింది సమస్త సభ. ఆయన మాటే మంత్రం. మంత్రాంగం తాత్కాలికంగా విఫలం కావచ్చు. కాని ఆయన మాట వట్టిపోయిన వఠ్ఠి మబ్బు కాదు. అది జలదం. ఆయన ఆ సభలో మాట్లాడడం, కౌరవుల కొరకో పాండవుల కొరకో కాదు. ఆ మాట సమస్త భూతములకు ఆశ్వాసం. పదమూడేళ్ళ పాపపుపాలనలో ఎండిన నేల, నోరు తెరచి నీరడుగుతోంది. సర్వభూతప్రకృతి ఎదురు చూస్తోంది ఆ జలదస్వనం వినడానికి.

వేస్ట్‌ లాండ్‌ కూడా అటువంటిది సాధ్యమన్న ఆశాభావంతో ముగుస్తుంది. బెస్తరాజు అంటాడు: Shall I at least set my lands in order? ప్రపంచం మొత్తాన్ని బాగు చేయలేము. ఎవరి యిల్లు వారు చక్కబెట్టుకోవడమే చేయవలసినది.

ఎలియట్ తన కావ్యంలో ఉపనిషద్వాక్యాలు వాడుకొన్నాడన్నది ప్రసిద్ధమే కాని, వాటిని ఎలా వాడుకొన్నాడన్నదానిపై అంత దృష్టి పడినట్టు లేదు. ఆ ప్రయత్నం చేద్దాం.

(సశేషం)