రాముడు మనకి దేవుడు. రామ మందిరం లేని ఊరు ఉండదు. కష్టంలో బాధలో నోటంట వచ్చేది రామా అనే. రామరామ నాకు ఏం తెలీదండీ అంటూ ఒట్టు పెట్టి చెప్పేదీ రాముడి పేరుతోనే. తెల్లారి లేచీలేవక ముందునుంచీ రామ మందిరంలో భజన వినిపిస్తూనే ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న ఇళ్ళవాళ్ళందరికీ! ఆ భజనతోనే నిద్ర లేస్తారు వాళ్ళు. సీతారాముల కళ్యాణం శ్రీరామ నవమికి ప్రతి ఏటా చేస్తారు. అదో వైభోగం. సీతారాముల కళ్యాణము చూతము రారండీ అంటూ పాటలు హెూరెత్తుతాయి. రామనామ తారకం భక్తిముక్తి దాయకం అని భజన చేసుకుంటూ ఇంట్లో ముసలివాళ్ళు నోట్లో నోట్లో అనుకుంటూ రాముణ్ణి తలుచుకుంటారు. మరి ఏ దేవుణ్ణి ఇంతగా తలుచుకోరు.
నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ అని మొరపెట్టుకుంటారు. సీతమ్మని సిఫారసు చెయ్యమని వేడుకుంటారు. ఎంతటివాడైనా రాముడయ్యేది భీముడయ్యేది పెళ్ళాం చెప్పిన మాట ప్రకారం నడుస్తాడని గట్టి నమ్మకం! నిజమే మరి! పెళ్ళాం మాట విననివాడెవరు!
సీతారాములు మనకి గొప్ప ఆదర్శం. వారిలాంటి దంపతులు, మరోజంటా దేవుళ్ళలో కనబడదు. శివుడు అర్ధనారీశ్వరుడై పార్వతికి సహం దేహం ఇచ్చినా ఇంతగా శివపార్వతుల్ని చీటికీమాటికీ తలుచుకోరు. ఎవరి నోటా వారి మాట సీతారాముల లాగ నానదు. వాల్మీకి తన రామాయణ కథలో రాముణ్ణి మనిషిగా, నీలాంటి నాలాంటి మామ్ములు మనిషిలా ఏడుస్తూ ఉండేవాడని, సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తుకు వెళ్ళిపోతే రాముడు ఏడ్చిన ఏడుపు మన ఏడుపు లాగానే ఉంటుంది అనీ రాసేడు. తులసీదాసే రాముణ్ణి దేవుడిగా చేసి పారేసేడు. రామాయణ పారాయణాలు దేవుడు రాముడి కోసం చేసేవే. వాల్మీకి రాముడు నోట్లో కష్టానికీ సుఖానికీ నానుతూ ఉంటే, తులసీదాసు రాముడిని పారాయణ చేయవలసిందే. హనుమాన్ చాలీసా చదవవలసిందే. అదీ తేడా.
చెట్టు దీపం సెమ్మాలో ఒత్తులన్నీ వెలిగించి దాని చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తూ రాముణ్ణి భజిస్తారు పల్లెటూళ్ళలో! సీతారాముల కళ్యాణానికి పందిళ్ళు వేస్తారు. బెల్లం పానకాలు ఇస్తారు.
భద్రాద్రి రాముడితో దెబ్బలాడి తిట్టగలిగేవాడు రామదాసు. ఎవడబ్బ సొమ్మనుకున్నావురా! అని. ఇంకేదేవుణ్ణయినా ఇలా తిట్టగలరా? రాముణ్ణి తప్ప!
త్యాగరాజు కీర్తనలు రాముడి మీదే! నువ్వు నడిపిస్తే నడుస్తున్న నాతో ఎందుకిలా ఉంటావు నువ్వు రామా? నామీద ఎందుకు అలిగేవూ? అలక్కి కారణం ఏమిటి? పలకవు ఎందుకూ అని నిగ్గదీస్తూ దైవాన్ని అడిగేడూ అంటే రాముడు ఎంత చనువు ఇచ్చిన దేవుడో అర్థం అవుతుంది.
ఈ దేవుణ్ణి తిట్టగలరు, నిగ్గదీయాగలరు. బతిమాలుకొని రక్షించమని అడగక్కర లేదు! అడక్కండానే అన్నీ ఇచ్చేవాడు ఈ దేవుడే. అంత సులభసాధ్యుడు.
ఆఖరికి రాముడేమన్నాడే – ముండల్లారా మూటలు తెమ్మన్నాడే అనే పాట వరకూ రాముడు జనంలో పాకిపోయాడు.
రామాయణంలో పిడకల వేట అనే సామెత!
రామాయణం అంతా విని సీత రాముడికి ఏమవుతుంది అని అడిగేట్ట ఓ పెద్దమనిషి!
దీని గురించే ఆరుద్ర సీత రాముడికి ఏమవుతుంది? అంటూ దేశదేశాల రామాయణాల్ని తరిచి చెప్పుతూ మనదేశంలోని రామాయణం ఎన్ని రకాల కథలుగా మారిందో ఓ పుస్తకమే రాసేడు. స్త్రీల పాటలలోని కుచ్ఛల కథ లాంటివి చదివితే రామాయణ కథ మరోలా ముందుకు వస్తుంది. రావణాసురుడి దగ్గర్నుంచి రాముడు సీతను పుష్పకవిమానంలో తెచ్చిన తర్వాత సీత రావణుడి బొమ్మని గీసుకుని తలగడ కింద పెట్టుకుని పడుకుందిట! రావణాసురుడు మాటాడుతూ ఉండేవాడట! రాముడు సీతమ్మవారిని అనుమానిస్తాడు. నిండు కడుపుతో ఉన్న దానిని ఆడకూతురని తలచనైనా తలచకుండా అబద్ధం ఆడి తను తీసుకెళ్ళకుండా, తమ్ముడు లక్ష్మణుడికి ఆ పనిని అప్పగిస్తాడు. వనాలు చూపించే నెపంతో అడివిలో వదిలేసి వచ్చేస్తాడు ఆదర్శ సోదరుడు. రామాజ్ఞని జవదాటని తమ్ముడు అన్యాయాన్ని ఆచరించేవాడు.
రావణాసురుడి లంకలో సీత బతుకు ఎలా ఉందో – రావణుడి బొమ్మ ఒకటి గీసి చూపెట్టమని పార్వతీదేవి సీతని అడిగిందిట. సీత బొమ్మగీసి చూపెట్టి దానిని మంచం కింద పెట్టిందట. రాముడు ఆ మంచం మీద కూచున్నప్పుడు మంచం ఆడ్డం మొదలుపెట్టింది. రాముడు మంచం కింద చూస్తే రావణుడి చిత్రం కనిపించింది. రాముడు ఆగ్రహించి సీతను హిమాలయాలకి తీసుకెళ్ళి ‘ఆమంది’ అనే ఋషి దగ్గర విడిచిపెట్టి రమ్మంటే అక్కడ విడిచిపెట్టి ఏదో జంతువు నెత్తురుని రాముడికి చూపించారు. సీతకు ‘వలమిగ’ అనే బిడ్డ పుట్టేడు. ఋషికి తెలీక ఆ బిడ్డమీద కాలువేసి పొరపాటున తొక్కేడు. దాంతో ఓ పద్మాన్ని వేశాడు. మంచం కింద బిడ్డ గుక్కపెట్టి ఏడిస్తే సీత పాలు ఇవ్వడానికి వెళ్ళి మంచం కిందనున్న బిడ్డని చూపి ఋషి దగ్గరికి వెళ్ళి అడిగింది. ఋషి జరిగిందంతా చెప్పి తన మహత్తుతో మరో బిడ్డను పుట్టించానని చెప్పేడు. సీతకి నమ్మకం చాలక ఏదీ మరోసారి మీ మహత్తుని చూపెట్టండి అంది. ఋషి మళ్ళా మరోబిడ్డని సృష్టించాడు. మరోసారి మీ మహత్తుని చూపెట్టండి అని మళ్ళా అడిగింది. ఇంకో బిడ్డను సృష్టించాడు. ముగ్గురు బిడ్డల్ని, మొదటి బిడ్డతో కలిపి నలుగురు బిడ్డల్ని ‘శందవిందు’ ‘మల’ ‘కి’ ‘స్త్రీ’ లని పెంచింది.
శూర్పణఖ కూతురు ‘అద్దుల్’ అనే రాక్షస స్త్రీ కూడా రావణుడి బొమ్మను చూపెట్టింది!
లంకలో విభీషణాలయం ఉన్నాది. పుత్ర సంతానం కోసం విభీషణున్ని స్త్రీలు మొక్కుకుంటారు. బ్రహ్మాలయం కూడా ఉంది. ఇంకెక్కడా బ్రహ్మకి ఆలయం లేదు. ఈ జానపద కథ సి. ఇ. కుంబల్ గోడా 14-22-1946 పేజీల్లో ఏసియాటిక్ సొసైటీ పత్రికలో రాసేరు.
15వ శతాబ్దం నుండి లంక రామాయణంలోని సీత బిడ్డలు – శందవిందు, మల, కి, స్త్రీ – మలయా దేశానికి వెళ్ళినట్టు చరిత్ర చెపుతోంది. ఇదంతా ఆరుద్ర పరిశోధనతో చెప్పిందే.
లక్ష్మణుడు ఆదర్శ సోదరుడు! రామాయణం కథంతా ఇలాంటి పాత్రలే!
అసలు ఈర్షయే లేదని, కైకేయికి మంధర నూరిపోసిందని మరో పిట్ట కథ అల్లి రాముణ్ణి అడివికి పంపేరని! దశరథుడు ఎప్పుడో ముద్దుల పెళ్ళాం కైకేయికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోడానికి రాముడికి చెప్పలేక ఏడుస్తూ ఉంటే కైకేయే చెప్పిందని, రాముడు తండ్రి మాట జవదాటని పుత్రరత్నంగా అడివికి వెళ్ళాడని మరో ఆదర్శం! పెళ్ళాం ఊర్మిళని వదిలేసి రాముని వెంట వెళ్ళే ఆదర్శ సోదరుడు లక్ష్మణుడు, మొగుడి వెంట నార చీరకట్టుకుని వెళ్ళే సీత. మీరెక్కడుంటే అక్కడే నేను, మీరు తినేది ఏ ఆకూఅలమైనా నాకు పంచభక్ష్య పరమాన్నమే అనే ఆదర్శపెళ్ళాం సీత!
అవునూ, రాముడి వెంట నారచీర కట్టుకుని వెళ్ళిన మహాపతివ్రత సీతా అమ్మవారు నగలు అన్నీ ఎందుకు పెట్టుకుని వెళ్ళేరో! ఆవిడకి ముందే తెలుసా ఏమిటి, రావణాసురుడు తనని ఎత్తుకుని పోతాడూ, అప్పుడు జటాయువు అడ్డుకుంటాడూ అని, తర్వాత ఆంజనేయుడుకి తన ఆనవాలు ఇవ్వాలని కూడా! అందుకే పెట్టుకెళ్ళిందేమో మరి. చిత్రంగా లేదూ కథ! మన పురాణాల కథలన్నీ విచిత్రాతి విచిత్రకథలే!
లక్ష్మణుడితో అలాగ్గానే వెంటపడని పెళ్ళాం ఊర్మిళ. లక్ష్మణుడి నిద్రని తన నిద్రగా వేసుకొని అన్నేళ్ళూ నిద్రపోయిన ఊర్మిళ ఇంకో ఆదర్శం!
ఇలా అందరికి అందరూ ఆదర్శాలే!
ఒక్కరూ సామాన్యపు మగవాళ్ళలా సామాన్యపు ఆడవాళ్ళలా బతకరు!
చాకలివాడు – మళ్ళా పెళ్ళాంగా నెత్తిమీద పెట్టుకోడానికి రాముడిని కానని, పెళ్ళాన్ని ఏలుకోనని ఒగ్గేస్తానని – అన్న మామూలు మనిషి మాటకి రాముడు రాజ్య పరిపాలకుడుగా సీతమ్మవారిని నిండు చూలాలు అని చూడకండా అడివిలో వదిలేసి రమ్మన్నాడని ఆదర్శాన్ని వెలగబెట్టిన రాముడు!
అడివిలో సన్నాసి ఆశ్రమంలో పిల్లల్ని కని, వాళ్ళతో ‘నా మొగుడు ఇలాంటివాడు. వాడి మీద నా పగా కోపం తీర్చుకోలేక ఇన్నాళ్ళూ ఊరుకున్నాను. మీరు పెద్దవాళ్ళయ్యేరు. విలువిద్యలో నేర్పరులు అయ్యేరు. పాటలు పాడ్డంలో ఘనులయ్యేరు. రాముడెలాంటివాడో ఎంత నీచుడో, దుష్టుడో, మనసులేని కర్కోటకుడో చెపుతూ ప్రజల కళ్ళు తెరిపించేటట్టు మీ పాట పాడండి. పాటే జనంలోకి చొచ్చుకువెళ్తుంది. అలాగే పాట పాడుతూ అభినయించండి. పాటా, అభినయమూ జనానికి బాగా ఎక్కుతాయి. నాటకంలా ఆడి మీతోటి పిల్లలతో కూడి నాటకంగా కూడా ప్రదర్శించండి’ అని చెప్పి పంపించకుండా తన ఉనికినీ అస్తిత్వాన్నీ కాపాడుకోకుండా ఆ కుశలవులని ‘రాముణ్ణి కీర్తిస్తూ రాముడంత గొప్పవాడు లేడని పాడండి’ అని చెప్పి పంపించిదట! ఎంత తప్పుగా ఉంది! చెడ్డవాణ్ణి చెడ్డవాడని చెప్పొద్దా? వాణ్ణి మంచివాడుగా లేనిదాన్ని అబద్ధాన్ని చెప్పమండం ఏమిటి? ఏమిటా ఆదర్శం? ప్రజల్లోకి అబద్ధాలని వ్యాపించేటట్టు చెయ్యడం ఎంతో దోషం! తరతరాలు ఈ అబద్ధపు ఆదర్శాలు వినివిని అవే నిజాలని రూఢి అయి గట్టి నమ్మకాలై నిలిచిపోతాయే మరి. తప్పా తప్పున్నరా!
పదుగురాడుమాట నిజం అని చెల్లుతుంది. మేకని దొంగలించాలనుకున్న నలుగురు దొంగలు కాస్త దూరంలో ఒక్కొక్కరు నిల్చుని అది మేక కాదు కుక్క అని చెపితే ఆ మేకని పట్టుకెళ్తున్నవాడు అదే నిజం అనుకుని మేకని వదిలేసిన రకంగా ఆదర్శపు అబద్ధాన్ని నిజంగా రూఢి చెయ్యడం కన్నా లోకంలో పెద్ద దొంగబుద్ధి ఉంటుందా? అంత పెద్ద దోషం ఎక్కడన్నా ఉంటుందా? పాపభీతి ఉండాలి అని పదేపదే పిల్లలకి పాఠాలు చెపతారే, పాపభీతి దైవభక్తి లేనివాళ్ళు చెడిపోతారని బోధ చేస్తారే, ఇంత పెద్ద పాపం ఇంకా ఎక్కడైనా ఉందా? పాపభీతి వాళ్ళకి ఇసుమంతైనా లేదే! చెప్పడానికేనా ఆదర్శాలు! అవలంబించడానికి కాదా? చెప్పడం తేలిక అవలంబించడం, ఆ బాటలో పయనించడం కష్టాతి కష్టం. ఇదిగో ఇలాంటి మనుషులే లోకంలో ఎక్కువ. తమని తాము ఒక్కసారైనా తడుముకుని చూసుకోరు. తమని తాము తామేమిటి అని మనసులోనైనా అనుకోరు. వీళ్ళని చచ్చినా నమ్మకూడదు. వీళ్ళకి దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఆదర్శాలు ఎంత గొప్పవైనా వాటిలో గోతిలో పడ్డట్టు పడకండి. మామూలు మనుషుల్లా బతకండి. అది చాలు బతుక్కి!