నుదుర్లు మైదానాలు
ముక్కులన్నీ జారుడుబల్లలు
ఇసుక ఎడార్లవంటి పెదవులూ
కలవరపు కళ్ళు
ఎక్కువగా ఇవే–
అన్నీ ముఖాలే గీసేవాడు
ఆ వంకరలేని గీతల్లో ఘర్షణ
అనేక రూపాలుగా ఒదిగిపోయేది
పుర్రెల్లోంచి గులాబీలు పూసి
శ్మశానపు కాన్వాసులన్నీ పూల తోటలయ్యేవి
గ్రెనేడు మూతపైకి వచ్చి పాలపిట్ట దర్జాగా కూర్చునేది
తిరగబడ్డ పాటలు, ఎర్ర చీరలు కట్టుకుని
అక్షరాలన్నీ గజ్జెల మోతెక్కిపోయేవి
పేపరు పోరాటస్థలంగా ఊగిపోయేది
తన డ్రాయింగ్ టేబుల్ మీద కూచోబెట్టుకుని
ఊరి చివరి కథల్ని చదివించేవాడు
నిబ్బు అంచుల్లోంచి నీళ్ళుబికి
కవితల కళ్ళన్నీ తడిసిపోయేవి
బొమ్మల పడవేసుకుని
కుంచెని తెడ్డేస్తూ వచ్చేవాడు
వెనగ్గా, సింగారించుకున్న డొప్ప తాబేళ్ళు
తిమింగలాలు, దుఃఖపు క్షణాలవంటి
ఉప్పునీటి అలల్ని కవ్వించే సముద్ర సావాసగాణ్ణి
గత్తర గత్తరగా వెంటాడేవి
డాబా మీద పడుకుని
నక్షత్రాల్ని లెక్కవేసేవాడు
అవి లేనప్పుడు, శుభ్రత లేని చేతి వేళ్ళతో
మానవ మాత్రుల్ని పక్షుల్ని చేసి
భూమ్మీద నుంచి పైకి ఎగరేసేవాడు
అప్పుడాకాశమంతా నల్లటి ఇంకు మబ్బులు కరిగి
గుండెల్లో రంగు రంగుల వాన కురిసేది
అతను బొమ్మల కొలువు
జ్యోతిలోని వెలుగు
మా గీతాచార్యుడు
(ఆంధ్రజ్యోతిలో ఆర్టిస్ట్ పి. ఎస్. చారిగారి బొమ్మల్లేకపోవడం బాధించి)