1
అ.
రేర్ వ్యూ మిర్రర్లో చూస్తున్నాను. ఇందాకటి నించీ ఆ ట్రక్ డ్రైవర్ అంత దగ్గరగా రావడం భయపెట్టడానికే. పక్క లేన్‌లోకి మారడానికి వీల్లేకుండా దగ్గరగా కార్లు. కాలేజీ రోజుల్లో మహేష్ అలాగే చేశాడు. ‘ఒరేయ్, ప్రతి పది మైళ్ళ వేగానికీ ఒక కారు పొడవు దూరం ఇవ్వాలని డ్రైవింగ్ టెస్ట్‌లో టిక్కు పెట్టాం గుర్తుందా? అన్నాను ఒకసారి ఇంక తట్టుకోలేక. అరవై మైళ్ళ వేగంతో పోతూ కూడా ఒక కారు పొడవు గాప్ మాత్రమే వదిలేవాడు మరి. ముందువాడు హఠాత్తుగా బ్రేక్ వేస్తే, వీడు రియాక్ట్ కాలేకపోతే? వాడి కార్లో వెడుతున్నా గానీ నా సేఫ్టీ నాకే గదా ముఖ్యం? అంత గాప్ ఇస్తే పక్కవాడు దూరిపోడూ? జవాబిచ్చాడు. నార్త్ ఇండియన్ గనుక గిస్సింగ్ అన్నట్టున్నాడు. అది నిజంగానే ఆంగ్ల పదమా లేక హిందీ కలబోసినదా అన్న విషయాన్ని ఎప్పుడూ నిర్ధారించుకోలేదు.
ఈ పక్క లేన్లో వాళ్ళకి వాడే డ్రైవింగ్ పాఠాలు నేర్పినట్టున్నాడు. వాడిలాగే గాప్ వదలడం లేదు. ఆగి వున్న రెండు కార్ల మధ్య పారలల్ పార్కింగ్ చేయడమే కష్టం. అలాంటిది అరవై మైళ్ళ వేగంతో నడిచే రెండు కార్ల మధ్య దూరడం – నో వే! ఇంకెంత? పది మైళ్ళు, పది నిముషాలు. అంతేగా!
ఆ.
వీడెవడో డబ్బా కారు పెట్టుకుని లెఫ్ట్ లేన్‌లో! ఈ కార్లో కనక అది వుండుంటే ఈ పాటికి దాన్ని చీమని విదిలించినటట్లు పక్కకు తోసేవాణ్ణి. గింగిరాలు తిరుగుతూ ఆ కారు పక్కకు దొర్లి ఏ చెట్టుకు గుద్దుకునో ఆగేది. దాని సంగతి చెప్పక్కర్లా. విండ్‌షీల్డ్ లోంచి ముందుకు విసిరేయబడేది. అదృష్టం వుంటే తగలబడేది కూడా. ఆ కార్లో అది ఉన్నది అనుకున్నప్పుడల్లా పాదం ఆక్సిలరేటర్ని బలంగా నొక్కుతోంది. గుద్దుతుందేమో అనిపించినప్పుడు కాలు వెనక్కు లాగుతోంది – అది అందులో లేదని గుర్తించి.
జుట్టు పట్టుకుని ఈడ్చి నాలుగు చాచి పీకిన తరువాత రేచెల్ వదిలివెళ్ళడం వల్ల కదా మెయిల్ ఆర్డర్ బ్రైడ్‌ని తెప్పించుకొమ్మని డిక్ సలహా ఇవ్వడమూ, పడివుంటుందని దీన్ని రష్యా నించీ తెప్పించుకున్నదీను? దాని చెల్లెలు కూడా ఈ దేశం చేరినప్పటి నించీ మొదలయింది తలనెప్పి. దగ్గరికి లాక్కుంటే విసిరికొట్టింది సరే, కానీ కచ్చతో అక్క మెదడు తినెయ్యడమెందుకు? వాళ్ళని కలవనీయకుండా ఉంచడానికి జాగ్రత్త పడుతూనే ఉన్నాను అనుకుంటున్నాను గానీ ఈ ట్రక్కులో డెలివరీలకి తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతున్నదో నాకేం తెలుసు?
ఇ.
ఇందాకటి నించీ చూస్తున్నాను ఈ ట్రక్కుని లెఫ్ట్ లేన్‌లో, సరిగ్గా నాకు ముందరే. ఒకసారి కారుని షోల్డర్ మీదకి కొద్దిగా పోనిస్తూ ముందుకు చూశా. దాని ముందర ఒక కారుండబట్టి సరిపోయింది గానీ లేకపోతే పక్కకు లాగి లీడింగ్ ఇన్ ది లెఫ్ట్ లేన్ అని టిక్కెట్ ఇచ్చేవాణ్ణి. కుడిపక్కగానూ వరసగా కార్లున్నాయి. ఎవరికీ లేన్ మారడానికి వీల్లేకుండా. సినిమాల్లో చూపించినట్లు ఒక మనిషి ఒక కార్లోంచి పక్క దాంట్లోకి తేలిగ్గా మారచ్చు. బిల్ బాస్టర్డ్ గనక అలా నా కారులోకో నా కారులోంచో మారుతుంటే కారుని ఠక్కున పక్కకు దూరంగా జరుపుతాను. కిందపడి క్షణాల్లో ఫినిష్ అవుతాడు. నా కింది ఉద్యోగులతో వాడిలాగా పొరబాటున కూడా ప్రవర్తించను – వాళ్ళు తెల్లవాళ్ళయినా గానీ. నల్లవాణ్ణి అని చిన్నచూపుతో పాటు సహోద్యోగుల ముందు కుళ్ళు జోకులు. ఆఖరికి, బేడీలతో ఉన్న నల్లవాడు కూడా స్టేషన్లో ఆ దుర్భాషని సహించలేక నావైపు తిరిగి, నువ్వెలా భరిస్తున్నావో గానీ, నేనయితే వాడి తుపాకీతోనే వాణ్ణి కాల్చేవాణ్ణి అన్నాడు. బిల్ గాడు, వాడి అనుయాయులు వాణ్ణి కుళ్ళబొడిచారు – డొక్కల్లో తంతూ, కిందపడ్డ వాడిమీద నలుగురూ పడి, ఒకడు మోకాలిని వాడి మెడ మీద నొక్కిపెడుతూనూ. వాడు ఈరోజు గాలి పీల్చడం విచిత్రమే.
2
అ.
మీదమీదకు వస్తున్నావు, రారా! ఏం చేద్దామనుకుంటున్నావ్? వెనకనించి గుద్దావు అని చెప్పడానికి పక్కన వెడుతున్నవాళ్ళల్లో కనీసం ఒకడయినా సాక్ష్యం చెపుతాడన్న నమ్మకముంది, రజియా నూరిపోతల వల్ల. ఈ దేశం గూర్చి పల్లెత్తు మాట అనగానే చాలు, సర్లే, ఇక్కడే ఇంకా కొద్దిగా అయినా నీతీ నిజాయితీలు నిలబడున్నాయ్, తగ్గు తగ్గు, అంటుంది. అలా నిలబడడానికి కారణం ప్రతివాడికీ అందుబాటులో ఉండే తుపాకీ అని జవాబిస్తాను. బయలుదేరే ముందర దాన్ని గ్లవ్ కంపార్ట్‌మెంట్‌లో భద్రంగా పెట్టాను. అలా పెడుతున్నప్పుడల్లా తను గుర్రుగా చూస్తుంది. కార్లో తనో అదో ఒకరే ఉండాలనేది ఒప్పందం. వాక్సినేషన్‌కి ఒక్కళ్ళకే అపాయింట్‌మెంట్ దొరికింది – ప్రభుత్వోద్యోగిని, డయాబిటిక్ అని చెప్పడంవల్ల – అని, అందుకే ఒంటరిగా వెడుతున్నానని, గుర్తుచేశాను. ఇక్కణ్ణించి పడమరకో దక్షిణంగానో ఇరవై మైళ్ళు వెళ్ళండి, అసలు అమెరికా ఏదో తెలుస్తుంది అన్నాడు ఆ మధ్య ఒకడు. తెలుగువాడే. దానికి ఇంకొక ఇరవైమైళ్ళు కలిపిన చోట ఈ అపాయింట్‌మెంట్. అది దొరకడానికి కారణం ఇక్కడివాళ్ళు రోగమూ వాక్సినేషనూ రెండూ కాన్‌స్పిరసీలనే MAGA వోటర్లవడం, నో వాక్సినేషన్ అని పంతం పట్టడం. వాళ్ళెలా పోతే నాకెందుకు? నేను హాపీ. ఇదుగో, ఈ ట్రక్కువాడే దాన్ని నాశనం చేస్తున్నాడు.
ఆ.
వారం రోజులపాటు రెండువేల మైళ్ళు ఈ ట్రక్కులో తిరిగివస్తే, ఇంట్లో టేబుల్ మీద… అదెక్కడి కెళ్ళుంటుందీ?
వీడు కాలేజీ కెళ్ళడం మొదలయినప్పటినించీ మార్పులొచ్చాయ్ అని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. కాలేజ్ ఆఫ్ విలియమ్ అండ్ మేరీ లిబరల్ కాలేజ్ అని నాకేం తెలుసు? రాష్ట్రానికి నడిబొడ్డులో ఉన్నది, ఆ విలియమ్స్‌బర్గ్‌లో ఉన్నది మనవాళ్ళేనని డిక్ అంటేనేగా వాణ్ణి పంపింది? లేకపోతే, ఎన్ని నమ్మకమయిన చోట్లు లేవు చదువుకోవడానికి? టేక్సస్, లూయిసియానా, టెన్నిసీ?
సెలవులకి వచ్చినప్పుడు నెల రోజుల్లో ఎన్నిసార్లు కనబడి వుంటాడు? నేను ఊళ్ళో ఉంటేగా? ఇద్దరం ఒకే కప్పు కింద ఉన్న రెండు మూడు రోజులూ కూడా కనిపించేవాడు కాదు. స్నేహితులతో తిరుగుతున్నా డనేది. …ఆ సంఘటన తరువాత కనిపించాడా?
ఏం చేశాను? దాన్ని పక్కలోకి రమ్మన్నాను. రోగాలంటించావ్, డాక్టర్ నిన్ను దూరంగా ఉంచమన్నది అని దూరంగా నెట్టింది. చేయి పట్టుకుని లాగబోతే అరిచింది. వదులు! అన్నాడు వాడు తుపాకీతో ప్రత్యక్షమై.
ఇ.
ఈ ట్రక్కువాడు తమాషాగా డ్రైవ్ చేస్తున్నాడు. నేనేమో పక్క లేన్‌లోని కార్ల స్పీడుతో వెడుతున్నాను. వాడికీ నాకూ మధ్య దూరం పెరుగుతూంటుంది, తగ్గుతూంటుంది. యావరేజ్ స్పీడ్ మాత్రం ఒకటే. స్పీడ్ మెయిన్‌టెయిన్ చెయ్యలేక పోవడానికి కారణం – తాగున్నాడా?
బిల్ బాస్టర్డ్ గుర్తుకొచ్చాడు. ఎప్పుడూ తాగేవుంటాడు. బాస్టర్డ్ అనేది నేను ప్రేమతోనో కోపంతోనో పెట్టిన పేరు కాదు. వాడి పై అధికారి వాణ్ణి అలా పిలిపించేవాట్ట – కాల్ దట్ బాస్టర్డ్ అంటూ. అది లాస్ట్‌నేమ్‌గా మారిపోయి, వాడే ఇప్పుడు ఆ పై అధికారి అయినా అలా మిగిలిపోయింది. కొంతమంది బాస్టర్డ్స్ అవడానికి కారకుడు కూడా!
మా తాత, బాబు లాంటివాళ్ళు అనుగ్రహించడంవల్ల ఈనాడు ఎంతో మందికి అంత నలుపు రంగు తోలు బాధ తప్పింది, కొంతమంది వయ్యారులని నేను కూడా అనుగ్రహిస్తూనే వున్నాను అన్నాడు నేను వింటూండగానే. రక్తం ఉడికినా నేనేం చేయగలను? వర్క్ ప్లేస్‌లో హెరాస్‌మెంట్ అని కేస్ వేస్తే సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రారు. బ్లూ వాల్ అని కదూ? యూనిఫాంలో ఉన్నా లేకున్నా పోలీసులు కట్టుబడితో కట్టుబడిలో ఉంటారు. వాడు యూనిఫాంలో లేనప్పుడు ఎవరయినా వాణ్ణి కాల్చిపారేస్తే బావుణ్ణనిపిస్తుంది. ఈ ట్రక్కుని ఆపాననుకో, ఆ డ్రైవర్ బిల్ గాడేననుకో, ఆ పని నేనే చెయ్యచ్చుగానీ వాడు ట్రక్కెందుకు నడుపుతాడు, నా అత్యాశ కాకపోతే?
3
అ.
తుపాకీతో నా సాన్నిహిత్యం గూర్చి రజియా కెప్పుడూ అనుమానమే. అమెరికా వచ్చి ఎమ్.ఎస్. చేసే రోజుల్లో ఫ్రెండ్‌తో కలిసి రేంజ్‌కి వెళ్ళేవాణ్ణని చెబితే, గర్ల్‌ఫ్రెండ్ అయ్యుంటుందని అనేసింది. ఆడవాళ్ళకి ఈ సెన్స్ ఎలా అబ్బుతుందో? కలిసి ఏడాదయిందన్న గుర్తుగా మిరియం ఇచ్చింది. ఘాటుగా ఉన్నదా అని తెలుగు ఫ్రెండ్స్ పగలబడి నవ్వేవాళ్ళు ఆమె ప్రసక్తి వచ్చినప్పుడల్లా. చాలా త్వరగా నేర్చుకున్నావ్, యూ ఆర్ ఎ షార్ప్ షూటర్ అనేది నన్ను.
ట్రక్ డ్రైవర్ అనగానే, ఇంగ్లీషు సినిమాల్లో చూపించినట్లు ఆరడుగులకి పైగా ఎత్తు, బట్ట తల, బానెడు పొట్ట, పొడుగు గడ్డంతో కనీసం ఓ మూడొందల పౌండ్ల తెల్లవాడి శరీరం కళ్ళముందు కనిపించింది.
తుపాకీ నీ గడ్డం నించి నిన్ను కాపాడలేదు అంటుంది రజియా. 9/11 తరువాతే నువు గడ్డం పెంచడం మొదలుపెట్టింది అని అప్పుడప్పుడూ గుర్తుచేస్తుంది. కోరి తెచ్చుకుంటున్నావు అని మందలిస్తుంది. ఎవరి మీద ప్రతిఘటన అని ప్రశ్నించిందొకసారి. స్వేచ్ఛా ప్రకటన మాత్రమేనని జవాబిచ్చా. ఇప్పటిదాకా లేదు కాబోలు స్వేచ్ఛ! ఛాతీ మీదా వీపు మీదా ఎర్ర పెయింట్‌తో వృత్తాల టార్గెట్ వేసుకుని తిరుగు, బోల్డంత దొరుకుతుంది అని విసుక్కుంది.
ఇన్నాళ్ళకి నీ అవసరం వస్తున్నట్లున్నది అన్నాను పెద్దగా. గ్లవ్ కంపార్ట్‌మెంట్‌లో దానికి వినబడేటట్లుగా. తూటాలు నింపి ఉన్నందుకు అది తప్పక సంతోషిస్తుంది.
ఆ.
వాడి చేతిలోంచి తుపాకీ క్షణంలో లాక్కోవచ్చు గానీ నన్నాపిన విషయం, వాళ్ళిద్దరూ ఒకటయ్యారన్న సంగతి మైండ్‌లో రిజిస్టర్ కావడం. తప్పకుండా దాని చెల్లెలు ప్రభావమే! తెలిసిన తిట్లన్నీ వాడాను. దాని ఫోన్‌లో చెల్లెలి నంబర్ బ్లాక్ చేశాను గానీ ఇంకెవరి ఫోనో వాడుతూండాలి. లేకపోతే ఇంత తెగువ దానికెలా వస్తుంది?
ఎక్కడి కెళ్ళుంటుందన్న ప్రశ్నకి తేలిగ్గానే జవాబు దొరికింది. షరపోవా తప్ప దానికి ఈ దేశంలో ఎవరూ లేరు మరి! కాలేజీలో ఇంకో ముగ్గురితో షేర్ చేసుకుంటున్న అపార్ట్‌మెంట్‌లో వాడి దగ్గర ఉండే ప్రసక్తి లేదు. డిక్ కొడుకు తెలివయినవాడు – డైవోర్సులవల్ల దాని పేర్లు ఎన్నిసార్లు మారినా సోషల్ మీడియా గాలించి పట్టుకున్నాడు. డిక్ కనెక్షన్లు కూడా పనికొచ్చాయి. నువ్వెళ్ళేసరికి అక్కడ మన మనుషులు రెడీగా ఉంటారన్నాడు. షరీఫ్ కూడా మనవాడే, యూనిఫాంలో ఉన్నప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో MAGA హాట్ పెట్టుకునే ఉంటాడు, ఇంట్లో ఏ మూల దాచినా సరే, అవసరమయితే బేడీలు కూడా వేసి బయటకు లాక్కురాగలడు అన్నాడు. దానికలా కావల్సిందే. నాకు డైవోర్స్ నోటీస్ ఇస్తుందా? వెళ్ళాల్సింది ఇంకా ఐదు మైళ్ళే కానీ ఈ డబ్బా కారువాడు అడ్డం తగిలి స్లో చేస్తున్నాడు. చికాకు పుట్టింది.
నా చేయి హారన్‌ని బలంగా మోగించింది.
ఇ.
వీడెందుకు హారన్‌ని అంత బలంగా మోగిస్తున్నాడు? ముందువాడు లేన్ మారట్లేదనేనా? అసలే ట్రక్కు అని బలుపు. డ్రైవర్ వంటి రంగు బలుపు కూడా తోడయి వుంటుంది. పైన లైట్లని ఆన్ చేసి పక్కకి ఈడ్చి లైసెన్స్ చూపించమని అడగడానికి ఇది అంత పెద్ద తప్పేం కాదు. భారీకాయుడయితే, రంగు ధైర్యం తోడయితే వాడు చూపించే పొగరు వేరేగా ఉంటుంది. అది, నా ఆరడుగుల, రెండువందల పౌండ్ల శరీరాన్ని కూడా మనసు అదుపులో ఉంచుతుంది – నెమ్మది నెమ్మది అంటూ. ఐ లవ్యూ ఎ లాట్ గానీ, నువ్వు అణగారినతనం నుంచీ ఇంకా పూర్తిగా బయటకు రాలేదు అంటుంది సూసన్.
తరువాతి తరాలకి రంగుతోళ్ళని తెల్లబరచే వరాలు ప్రసాదించడం మన మగాళ్ళకే సాధ్యం, అంతా విత్తనం బలం, అన్నాడు బిల్ బాస్టర్డ్ చాలాసార్లు. పకపకా నవ్వారు బూట్లు నాకేవాళ్ళు అన్నిసార్లూను. నేను సూసన్‌ని పెళ్ళిచేసుకోవడం వాళ్ళ జాతికే కళంకం అన్నట్టు ఫీలవుతాడు. నేను పక్క గదిలో ఉన్నాననే వాళ్ళు పెద్దగా మాట్లాడుతుంటారు.
నిన్న రాత్రి పార్టీలో వాడు సూసన్ మీద చెయ్ వేయడం, తను విసిరికొట్టడం, ఆ సంగతి నాకు తెలిసికూడా నేను ఇవాళ పొద్దున్న వాణ్ణి నిలదీయలేకపోవడం… ఏదీ, ఇవాళ కనబడితేగా? నా మీద నాకే చెప్పలేనంత కోపంగా ఉన్నది. ఏం చేస్తానో అని భయపడుతూనే, వదిలెయ్ అన్నది తను. ఇవాళ సెలవు పెట్టమని కూడా అన్నది. వాడిని నిలదీయడానికే స్టేషన్‌కి వచ్చాను కానీ, వాడు లేడు. యూనిఫాం లేకుండా వాడు ఒంటరిగా దొరకాలీ, అప్పుడుంటుంది!
4
అమ్మయ్య! మొత్తానికి చేరుకున్నా. సిగ్నల్ దగ్గర ఈ లెఫ్ట్ టర్న్ తరువాత ఆ మూలదే ఫార్మసీ అని గూగులమ్మచెబుతోంది. రేర్ వ్యూ మిర్రర్ ఆ ట్రక్ నా వెనకే ఈ టర్న్ లేన్‌లో ఆగివున్నట్టు చూపిస్తోంది. సరేలే, ఈ రోడ్డు నాది కాదు గదా, వాడికీ ఇటుపక్కన ఏదో పనిబడి ఉంటుంది. కానీ, డ్రైవర్ సైడ్ తలుపుని వాచ్ చేస్తున్నాను.
తిన్నగా వెళ్ళుంటే రెండు మైళ్ళే గానీ… ఇందాకటి నించీ ఈ డొక్కు కారోడు అడ్డంగా ముందు నిల్చుని చికాకుపెట్టాడు. కోపం తన్నుకొచ్చింది. వీడి సంగతి తేల్చుకోవడం కోసం ఆ కారు వెనకే ఈ టర్న్ లేన్‌లో ఆగాను. హారన్ కొట్టినా గానీ లేన్ మారకుండా… కాలర్ పట్టుకుని నాలుగు వాయిస్తే సరి! అయితే అయింది అయిదు నిముషాల ఆలస్యం!
ట్రక్ లెఫ్ట్ టర్న్ లేన్‌లోకి మారుతూండగానే దాని ముందు కారు కూడా ఆ లేన్‌లోకి మారిందని గమనించి, వీడు ఇటే పోవలసిన వాడా లేకపోతే… అని అనుమానం వచ్చి నేను కూడా లేన్ మారి, ట్రక్ వెనకే కారుని ఆపాను. ఎడమపక్క కిటికీ వైపుకి బాగా వంగి ముందుకు చూశాను. వాడు ట్రక్కు తలుపు తీసి కిందకు దిగుతున్నాడు. ఎందుకు?
ట్రక్ డ్రైవర్ కిందికి దిగి నావైపు నడుస్తున్నాడు! హారన్ కొట్టినా లేన్ మారనందుకు రోడ్ రేజ్? బెదిరిస్తాడా? బెదిరించడంతో ఆగుతాడా? వాడి ఒక్కొక్క అడుగుకీ నా గుండె వేగం పెరుగుతోంది. కుడి చేయి గ్లవ్ బాక్స్ వైపు వెళ్ళాలా వద్దా అని సంశయిస్తోంది.
ట్రక్‌లోంచి దిగుతున్నప్పుడు బెల్టుకున్న హోల్‌స్టర్ గుర్తుచేసింది లోపల గన్ ఉన్నదని. ముందు, నేను తల్చుకునుంటే నువ్విప్పుడు ఊపిరి పీలుస్తూండేవాడివి కాదు తెలుసా అని కళ్ళెర్రజేస్తూ అడుగుతాను. నోరెత్తాడా, గన్ మొహం ముందు ఊపుతాను. జీవితాంతం గుర్తుంటుంది.
పోలీస్ గుర్తులు నా కారుకి లేకపోవడంవల్ల వాడు వెనక్కు తిరిగి చూసి వున్నా అంతగా పట్టించుకునేవాడు కాదేమో గానీ, అసలు చుట్టుపక్కల ఎవరున్నారన్న ధ్యాసే లేకుండా ముందు కారువైపుకు నడుస్తున్నాడు. డైరక్షన్లు అడగడానికని అనుకోను. రంగూ, ఒడ్డూ, పొడుగూ, MAGA హాట్‌తో కలిపి బాస్టర్డ్ లాగే ఉన్నాడు. వాడేనా? అది పోలీస్ గెయిట్ లాగే ఉన్నది. గుండె కొట్టుకోవడం ఒక్క క్షణం ఆగింది. సూజన్ మీద వేసిన చేతిని వదలకూడదు. గుండెలో రేగిన మంటని ఆర్పడానికి ఎడమచేత్తో ఛాతీని రుద్దుకున్నాను. ఏ కారణంవల్ల ఆ ట్రక్కులో ఉన్నాడో నాకెందుకు? బాస్టర్డ్ అని పిలుస్తాను. కళ్ళు కొద్దిగా మసకబారాయి. ఇటు తిరగ్గానే… తుపాకీని చేత్తో పట్టుకుంటూ కారు దిగాను.
గన్ ఎందుకు అన్న రజియా ప్రశ్నకి ఆత్మరక్షణకి అన్న నా జవాబు విని, స్టాండ్ యువర్ గ్రౌండ్ చట్టాలు తెల్లవాళ్ళని రక్షించడానికి గానీ నీకు కాదు, అని తను మొత్తుకోవడం నా మెదడులో ప్రతిధ్వనించింది కానీ గ్లవ్ బాక్స్ లోంచి తుపాకీని తియ్యడాన్ని ఆపలేకపోయింది. ముస్లిం టెర్రరిస్ట్ చేతిలో ట్రంప్ సపోర్టర్ మృతి అన్న వార్తని రజియా తట్టుకోలేదు అన్న సత్యం చేతికి చెమటలు పోయిస్తోంది. బట్, అయామ్ ప్రిపేర్డ్ టు డిఫెండ్ మైసెల్ఫ్! దీర్ఘ శ్వాస తీసుకుని కుడిచేతిని వెనగ్గా ఉంచి కారు తలుపు తీసి ఎడమ కాలు బయట పెట్టాను. పెద్ద పర్సనాలిటీ తనని కాపాడుతుందని అనుకుంటున్నాడేమో! తుపాకీని వాడే నా చెయ్యి స్పీడ్ గూర్చి వాడికి తెలియదు.
నేనింకా వాడు కారులోనే కూర్చుంటాడు, కిటికీ అద్దం తియ్యమని చేత్తో ఆర్డర్ వేస్తూ బెదిరిద్దామనుకుంటే వాడే ముందు బయటకొచ్చాడు! పొట్టిగా, బక్కగా ఉన్నాడని గుర్తించి ముందే యుద్ధానికి తయారయినట్లున్నాడు. ఆ గడ్డమూ, ఆ వంటి రంగూ – వీళ్ళ వాళ్ళే కదా 9/11కి కారణం? వెనగ్గా పెట్టిన చేతిలో ఏముందో? నేను తయారుగా ఉండడం కాదు నేనే ముందు… కుడిచేయి గన్‌ని చిక్కించుకుంది.
ట్రక్కువాడి చేయి నిశ్చయంగా గన్ వైపు వెడుతోందని కనిపించింది. ఈజ్ హి బిల్ బాస్టర్డ్ ఆర్ నాట్? ఆ మొహాన్ని ఇటు తిప్పరా, బాస్టర్డ్. తిప్పకపోతేనే మంచిదేమో, తెలియక కాల్చాను అని చెప్పచ్చు. ఆ ముందు కారువాడి వెనగ్గా సూర్యరశ్మిలో ఏదో మెరిసి ఆ మెరుపు కారు అద్దాలలో ప్రతిఫలించింది. అదీ తుపాకీయే అయ్యుండాలి.
ఆ ట్రక్కు వాడి వెనక పోలీసు చేతిలో కూడా తుపాకీ. అది కూడా నాకే గురిపెట్టబడి ఉన్నది! అంటే వీడు FBI? CIA? ఇద్దరూ కలిసి నన్ను ఛేజ్ చేశారా? వంటినిండా చెమటలు పోస్తున్నాయి. చేతులు పైకెత్తితే ఇద్దరూ నన్ను కాల్చేస్తారా? వాళ్ళకన్నా వేగంగా ఇద్దరినీ నేను కాల్చగలను. చంపగలిగేది చావడానికి ముందే!
వీడి చూపులు పూర్తిగా నామీద ఉన్నట్టు లేవే? నన్ను దాటి వెనక్కు వెడుతున్నాయి ఎందుకు? మెడ కొంచెం తిప్పి ఓరకంటితో వెనక్కి చూడబోతూ ముందువాడి కుడిచేయి కదలడం గమనించాను. కుడిచెయ్యి తుపాకీని హోల్‌స్టర్ నించి వేరుచేసింది.
మెడ తిప్పుతున్నాడు. పూర్తిగా తిరిగేదాకా ఆగితే ఛాన్స్ పోగొట్టుకుంటానేమో? అరె, తుపాకీ బయటికి తీశాడే! వాడు కూడా!
(ప్రథమ ప్రచురణ: తానా సువనీర్, 2023. కొన్ని సవరణలతో.)