నా మామూలు కలల్లోకి
నేను మాములుగా
నాలాగానే వెళ్ళిపోతాను
కానీ – నా జానపద కలల్లోకి
నాకు మారువేషంలో వెళ్ళాలని ఉంటుంది.
వెళ్తాను మారువేషంలో
నవనీత కోమల వయో రుచిరాంగినై*
పెళ్ళీడు కొచ్చిన రాజకుమారినై
కలలో
నా జానపద కలలో
ముందుగా కనపడేది ముళ్ళు లేని
గులాబీ తోట
ఎంత వింతల జానపద కలైనా
ముళ్ళు లేని గులాబీ తోటలో పూలు కోసుకొవటం
నాకు నచ్చదు
గులాబీ పువ్వును కోసుకుంటుంటే
ముల్లు గుచ్చుకోవాలి
వేలుకు చిన్న గాయమై రక్తం కారాలి
నేను అబ్బా అని విహ్వలనై పోతుంటే
అందగాడొకడు ఎక్కణ్ణించో వచ్చి
ఆ వేలును తన నోట్లో పెట్టేసుకుని
నా వంక చూసి నవ్వాలి
అప్పుడు నేను ఏమీ తెలీని దానిగా అతన్ని
ఈ రాజ్యాన్ని పాలించే రాజెవరు అని అడుగుతాను
అప్పుడా చందమామ
ఏ బింబిసారుడనో చెంగిజ్ ఖాన్ అనో అనకుండా
ఏ విమలాదిత్యుడనో విశాల విక్రముడనో అంటాడు
అలా అన్నాడా
నా ఆనందానికి పట్ట పగ్గాలుండవ్
వెంటనే నేను
ఈ విశ్వాంతరాళంలో ఉన్న
సమస్తాలైన మధురాతి మధుర
సంగీత సౌందర్య స్వర విన్యాసాలన్నిటినీ
నా గొంతులో నింపుకుని…
“మీ రాజుగారికి భార్యలెంత మంది?” అని అడుగుతాను
ఒక ఆత్రం
అతని సమాధానం వినాలన్న ఒక ఆతురత
నన్ను కమ్ముకుంటుంది
అంతలోనే అతను మాయం
ఎదురుగా ఏ భల్లూకమో కిరాతుడో
నన్ను కబళించటానికి తయారుగా
భయం
ఒళ్ళంతా చెమటలు
ఊపిరి ఆగిపోతుండగా కళ్ళు తెరిచేస్తాను
పక్కనే నా మొగుడు
తనూ తన జానపద కలలోకి
మారువేషంలో వెళ్ళిపోయాడేమో
కాళ్ళూ చేతులూ విచ్చలవిడిగా
పక్కంతా పరిచేసి
నిద్రలో నవ్వుతూ
(*అబ్బూరి రామకృష్ణారావుగారి ‘అప్రాప్త మనోహరి’ – ముద్దుకృష్ణ వైతాళికులు నుంచి.)