సహచరి

నేనతడి సహచారిణిని – ఆమె నా సహచరి
అతడున్న సమయాలలో సరే సరి!
లేని సమయాలలో మరింత దగ్గరవుతుంది
తన కనుసన్నలలో నన్నాడిస్తుంది
అతడికి తెలియని రహస్య సహజీవనమేదో
మా మధ్య నడుస్తుంటుంది

కలో మెలుకువో తెలియని క్షణాలలో
పలుమార్లు కనికరిస్తుంది
ఆశించిన క్షణాల్లో ఆవిరై పరీక్షిస్తుంది

మొండికేస్తుంది – గారాలు పోతుంది
అలుగుతుంది – అంతలో ఆశీర్వదిస్తుంది
ఎప్పుడొచ్చి చేరిందో – ఎలా వొచ్చి కలిసిందో
వ్రాసే సమయాల్లో ఎలాగూ తోడుంది
వ్రాయని సమయాల్లో
నా ధ్యానానికీ పరధ్యానానికీ
తనే కారణమవుతుంది

కుదరని కాలంలోనో – అలసిన వేళలలోనో
నిర్లక్ష్యం చేస్తున్నానని అలుగుతుందే కానీ
వేళ్ళ మధ్య కలమో – చేతి క్రింద కాగితమో లేనంత మాత్రాన
నిత్యాక్షర దీపాలు వెలిగించనంత మాత్రాన నేనామెని మరిచానా?
ఆమె సహచరిగా ఉన్నంత వరకూ
వ్రాయకుండా ఉండగలనా?!