విషం దేవుడు

“ఇక్కడి నుండీ అంతే అసహ్యంగా కనిపిస్తున్నారు మనుషులు!” నిట్టూర్చాను ఏదైనా మారుతుందేమో అన్న నా భ్రమని తిట్టుకుంటూ.

షాపింగ్ మాల్‌లో పైన ఆరో ఫ్లోర్‌లో ఉన్నాన్నేను. కింద రకరకాల ఫ్లోర్‌లలో‌ తిరుగుతున్న జనాలు. నల్లగా, తెల్లగా, పొట్టిగా, పొడుగ్గా, సన్నగా, లావుగా, సీరియస్‌గా, డ్రమెటిక్‌గా, అయోమయంగా, నవ్వుతూ, నటిస్తూ, పక్కవాడిని జడ్జ్ చేస్తూ, జడ్జింపబడుతూ… తిరుగుతున్న జనాలు. ఏదో పోగొట్టుకుంటున్నామన్న తపనతో, ఏదో ఒకటి హడావిడిగా పొందాలనే తహతహ వాళ్ళ నడకల్లో.

నేనో దేవుడిని. విషం దేవుడిని. విషం ఇచ్చే దేవుడిని కాదు, తీసుకునే దేవుడిని!

ఒంట్లో విషం శాతం: 25. అప్పుడప్పుడే మాల్‌లో పల్చగా పరుచుకుంటున్న జనాల్ని కళ్ళార్పకుండా గమనిస్తున్నాన్నేను. ఇంకా చాలా కెపాసిటీ మిగిలుంది నాలో. తొందరగా నింపెయ్యాలి.

నాలుగో ఫ్లోర్‌లో ఓ స్టూడెంట్ గ్రూప్. లేదంటే ఇప్పుడిప్పుడే జాబ్‌లో చేరిన బాపతు అయివుండచ్చు. ఒకమ్మాయి‌ భుజం‌ మీద పదే‌ పదే బలవంతంగా చెయ్యేస్తున్న ఓ సన్నటి, నల్లటి కుర్రాడు. ఆ అమ్మాయి మెల్లగా ముందుకు జరుగుతోంది నవ్వుతూ, చెయ్యి తప్పిస్తూ. వాడు వదలట్లేదు. చెయ్యి గట్టిగా మెడచుట్టూ‌ బిగించాడు ఇంకా దగ్గరికి లాక్కుంటూ. చుట్టూ వాళ్ళ బ్యాచ్‌లో ఎవరూ పట్టించుకోవట్లేదు వాడిని. వాళ్ళు పట్టించుకోరనే ధైర్యంతో వాడలా చేస్తున్నాడా? వాడెప్పుడూ అంతే అని వాళ్ళు పట్టించుకోవట్లేదా? సడెన్‌గా ఆ అమ్మాయికి ఎదురుగా నిలబడి చూస్తూ వెనక్కి నడుస్తున్నాడు. గ్రూపంతా తుళ్ళిపడింది అది చూసి. ముఖ్యంగా ఆ అమ్మాయి. అదొక మేటింగ్ కాల్! వాడికున్న సెక్సువల్ నీడ్‌ని ప్రేమ, ఆకర్షణా లాంటి ఊహాలోకపు పొరలతో మభ్యపెట్టే ప్రయత్నం. అదో కన్వీనియెంట్ కవర్ వాడికి.

ఆ గ్యాంగ్‌కి ఎదురుగా వస్తున్న ఓ కపుల్. థర్టీస్‌లో ఉండుంటారు. ఇద్దరూ చేతులు పట్టుకుని, వెనక బ్యాక్‌ప్యాక్స్ వేసుకొని… ఆఫీస్ బంక్ కొట్టి వచ్చుంటారు ఖచ్చితంగా. లవర్సా? లేక ఎఫైరేమన్నా నడుస్తోందా వాళ్ళ మధ్య? వీళ్ళు ఆఫీసుల్లో హార్డ్‌వర్క్ చేస్తూ ఉండి ఉంటారనే మాయలో బతుకుతున్నారా వీళ్ళ పార్ట్‌నర్స్? ఇద్దరి మొహాల్లో స్పష్టంగా కనబడుతున్న ఇల్లీగల్ ప్రేమ. అసలు ప్రేమే ఇల్లీగల్. చదవాల్సిన చదువు‌ చదవనీయకుండా, చెయ్యాల్సిన పని చెయ్యనీయకుండా… జీవితాల్లో ఓ అనవసరమైన డైవర్షన్!

వాళ్ళ కిందే, మూడో ఫ్లోర్‌లో దున్నపోతుల్లా, బానపొట్టలేసుకుని, పెద్ద పెద్ద షాపింగ్ బ్యాగ్‌లు మోసుకుంటూ నడుస్తున్న ఇద్దరు భర్తలు. వాళ్ళ భార్యలు ఇంకో షాప్ లోనో, ఏదో కొత్త సెలాన్‌ లోనో దూరుంటారు. వీళ్ళ చుట్టుపక్కలైతే లేరు. హిడెన్ ఎజెండాలు పెట్టుకుని భార్యలని సపోర్ట్ చేస్తున్నట్టు నటించే భర్తలు, సాఫ్ట్‌గా భర్తలని మ్యానిప్యులేట్ చేసి తమ పని చేయించుకునే భార్యలు. సచ్ ఎ పిటీ!

వాళ్ళకి అటువైపుగా, పెద్ద గడ్డంతో, సన్‌గ్లాసెస్ పెట్టుకుని‌ అటూ ఇటూ అనుమానంగా తిరుగుతున్న ఓ బట్టతల. ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ వచ్చేపోయే అమ్మాయిల మీదే చూపంతా ఫోకస్ చేస్తున్నాడు. ముఖ్యంగా మినీ డ్రెస్సులేసుకున్న గర్ల్స్ మీద! పర్వర్టా? సైకో‌నా? వాడి నెక్స్ట్ టార్గెట్ కోసం రెక్కీ చేస్తున్నాడా? ఇప్పటికి ఎంతమందిని చంపుంటాడో?!

ఒంట్లో విషం శాతం: 50. చుట్టూ జనాలు పెరుగుతున్నారు. వీలున్నంత మంది వైపు చూస్తున్నాను నేను. దొంగిలిస్తున్న ఆలోచనలన్నీ గుట్టగా పేరుకుపోతున్నాయి నాలో. వాటిని నాశనం చెయ్యలేను. స్వయంగా అనుభవించి తీరాల్సిందే.

కిందకి చూశాను. ఫస్ట్ ఫ్లోర్‌లో స్ట్రోలర్ పట్టుకుని పక్కపక్కనే‌ నడుస్తున్న ఓ కపుల్ సడెన్‌గా ఆగింది. మొగుడు తన చేతిని ఆమె‌ మొహం‌ వైపు పెట్టి ఏదో అంటున్నాడు. చుట్టు పక్కల కొంతమంది ఆగి మళ్ళీ ముందుకు కదులుతున్నారు. ఆమె తల దించుకున్నట్టు కనపడుతోంది. ఇంకో మెలోడ్రామా. ఏడుస్తోందా? వాడో అబ్యూసివ్ హస్బెండ్ అయివుంటాడు. ప్రతి దానికీ క్లాస్ పీకుతూ, తన డామినేషన్ చాటుకుంటూ… ఇడియట్! ఇంట్లో కూర్చుని తిట్టుకోవచ్చుగా, మాల్ ఎందుకో వీడి మొహానికి. ఇక్కడికి తీసుకొచ్చి ఆమెనేదో ఉద్ధరిస్తున్నట్టు.

మాల్‌లో ఎక్కడ చూసినా కపుల్స్. చూపులకి పదే పదే అడ్డు తగులుతున్న కపుల్స్. కిందా, పైనా, ఫుడ్ కోర్టుల్లో, గేమింగ్ జోన్‌లో, షాపుల్లో, కారిడార్‌లో… దయ్యాల్లా పరుచుకున్న కపుల్స్! రకరకాల డైమెన్షన్లతో ఆ మాల్‌‌ని గజిబిజిగా అలికేసిన కపుల్స్. జిడ్డు మొహాలతో, జిడ్డు కారుతున్న జడలేసుకున్న‌ భార్యలతో, అరిగిపోయిన‌ స్లిప్పర్లేస్కోని తిరుగుతున్న భర్తలు. అల్ట్రా పాష్ స్కర్టుల్లో ఛబ్బీగా ఉన్న బీవీలతో, ఫ్రెష్‌గా హైర్ డై‌ వేస్కోనొచ్చిన మిడిలేజ్‌డ్ మియాలు. ట్రూ డెమాక్రసీ, ఆ మాల్‌ లోనే, నా కళ్ళముందటే! ఎవరూ ఎవరికీ సరిపోయినట్టుండరు. అయినా ఏదో బతికేస్తూ… ఇద్దరూ కలిసి ఏదో అద్భుతం సృష్టిస్తున్నట్టు గర్వపడుతూ… జీవితాన్ని‌ పూర్తిగా ఆస్వాదించాలని ఆరాటపడుతూ…

ఛ!

రెండో ఫ్లోర్‌లో ఓ కార్పొరేట్ కపుల్, ఇద్దరూ మొబైల్స్‌లో మునిగిపోయి. వాళ్ళిద్దరూ కపుల్ అని ఖచ్చితంగా చెప్పడానికి ఆధారాలేమీ కనిపించవు, వాళ్ళు నించున్న దగ్గరతనం తప్ప. ఎవరూ అడగకపోతే జీవితాంతం వేరువేరుగా బతకడానికి వాళ్ళకేమీ ఇబ్బందున్నట్టు కనపడదు. ఎవడి బుర్ర వాడిది. ఎవడి జీతాలు, కెరీర్‌లు, కోరికలు, ఆనందాలు, రహస్యాలూ వాడివి. కపుల్ అనేది జస్ట్ ఒక ఇమాజినేటివ్ లేబుల్. గాల్లో పెట్టిన దీపం.

ఒంట్లో విషం‌ శాతం: 100. నోరు కటిక చేదుగా ఉందిప్పుడు. మొహం చెమటలు కక్కుతోంది. కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయుంటాయి. అయినా నా పని ఆపను. యాభై‌ ఏళ్ళుగా ఎప్పుడూ ఆపలేదు. ఇప్పుడూ ఆపలేను. చెప్పానుగా నేనో దేవుడినని.

హఠాత్తుగా గ్రౌండ్ ఫ్లోర్‌లో నలుపు రంగు ఎంటర్ అయ్యింది. నలుగురు ముస్లిమ్‌ లేడీస్, బురఖాలతో… లోపలికొచ్చిన వెంటనే మధ్యలో ఉన్న ఫౌంటెన్ దగ్గర నించొని ఫొటోలు తీసుకుంటున్నారు. ఒకామె అన్ని వైపులా చేతులు చూపిస్తుంటే మిగిలిన‌వాళ్ళు ఆశ్చర్యంగా పైకి చూస్తున్నారు. నవ్వులూ, మాటలూ అన్నీ వాళ్ళ మధ్యలోనే. ఈ అల్ట్రా మోడర్న్ మాల్‌లో వాళ్ళదొక ఐసొలేటెడ్ గ్రూప్. ఒక్క మాల్‌లోనేనా? ఆ‌ పక్కనే ముగ్గురు ముసలివాళ్ళు. ఇక్కడేం చేద్దామని? దారి తప్పారా? ఎక్కడో ఓల్డేజ్ హోమ్‌కి వెళ్ళకుండా!

ఆ‌ గ్రూపులేవీ ఫిట్ అవ్వట్లేదీ‌ మాల్ అట్మాస్ఫియర్‌కి. అసలెవరూ ఫిట్ అయినట్టు కనపడరు. తమను తాము బలవంతంగా ఫిట్ చేసుకోవాలనే ప్రయత్నమే అంతా. ఐదో ఫ్లోర్‌లో నిలబడ్డ ఆ బక్క, పొట్టి సేల్స్ గర్ల్ దానికో గ్రేట్ ఎక్జాంపుల్. దగ్గరగా ఉండటంతో‌, స్పష్టంగానే కనిపిస్తోంది. పల్లెటూరి ముఖం. ఫుడ్ సాంపుల్స్ ఉన్న ప్లేట్‌ ఒక చేతిలో, మొబైల్ ఇంకో చేతిలో, నల్లగా ఉన్న పెదాలపై ఎర్రటి లిప్‌స్టిక్, సన్నగా ఉన్న ఫ్రేమ్ మీద లూజ్‌గా వేలాడుతున్న మాల్ యూనిఫామ్, క్లియర్ ప్లాస్టిక్ స్మైల్! నో నో, హర్ హోల్ బాడీ ఈజ్ ప్లాస్టిక్.

ఇందాకటి నుండీ గమనిస్తున్నా. కాదు, గమనించేలా చేస్తోంది. నాలుగో ఫ్లోర్‌లో హైహీల్స్‌లో అటూ ఇటూ తిరుగుతున్న‌ ఓ టీనేజర్. నడుము పైనే ఆగిపోయిన స్లీవ్ లెస్ టాప్, మినీ స్కర్ట్, చేతిలో ఓ బ్రాండెడ్ పర్స్. బాయ్‌ఫ్రెండ్ ఎవడూ లేడో, లేదా వెతుక్కునే పనిలో ఉందో? నడుస్తున్న ప్రతి సెకనూ స్లీవ్స్ సర్దుకుంటోంది, టాప్ కిందకి లాగి నడుము కవర్ చేసుకుంటోంది, లేకపోతే స్కర్ట్ అడ్జస్ట్ చేస్తోంది. ఎందుకా కష్టం? పూర్తిగా లిబరేట్ అవ్వాలా, వద్దా అనే డైలమాలో ఉందా?

నేను తీక్షణంగా చూస్తున్న వాళ్ళల్లో కొంతమంది‌ చటుక్కున నా వైపు చూస్తారు ఒక్కోసారి. వెంటనే‌ నా తల‌ తిప్పుకోవడమో, ఫోన్‌లో మాట్లాడుతున్నట్తు యాక్ట్ చెయ్యడమో, మెల్లగా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమో‌ చేస్తుంటా. వాళ్ళను‌ చూడడం ఓ‌ కోయిన్సిడెన్స్, యథాలాపంగా జరిగిన చర్యే కానీ వాళ్ళ మీద నాకే మాత్రమూ ఇంట్రస్ట్ లేదని నమ్మించడానికి చేసే ప్రయత్నాలవి. కానీ నాకుంది, చచ్చేటంత ఇంట్రస్టుంది. నా పనే అది అసలు!

ఫూడ్ కోర్ట్ బయట ఒక్కతే నించొని‌ ఐస్ క్రీమ్ తింటున్న ఓ మిడిలేజ్‌డ్‌ సింగిల్‌ లేడీ, ఓపిక లేకపోయినా ఏదో చేసెయ్యాలని ఆయాసపడుతూ నడుస్తున్న ఇంకో ప్రెగ్నెంట్ ఉమన్, అయ్యప్ప‌స్వామి మాల వేసుకొని పెద్ద‌ బొట్లు పెట్టుకుని చెప్పుల్లేకుండా తిరుగుతున్న ఇద్దరు మగాళ్ళు, కాషాయ రంగు స్లీవ్‌లెస్ కుర్తాల్లో ముగ్గురు బౌద్ధబిక్షువులు… కొత్త కొత్త ఆకారాలు, గుంపులు, తలకట్లూ మాల్ లోకి మెల్లగా చొరబడుతూనే‌ ఉన్నాయి. ఒక్కొక్కరికీ ఎంత తేడా! ఎవడి ప్రపంచం వాడిది… అయినా అందరూ కలిసి సుఖంగా బతికేద్దామనే ఆరాటం. స్టుపిడిటీ!

వీళ్ళందరికీ ఆల్రెడీ తెలిసిపోయి ఉండాలి. చివరికి అందరూ నరకానికే వెళ్ళబోతున్నారని, స్వర్గం అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదని, ఉన్నా అది వర్కింగ్ కండిషన్‌లో ఉండకపోవచ్చని… అందుకే‌ ముందు జాగ్రత్తగా ఈ చిన్న‌ చిన్న స్వర్గాలని అనుభవించడం‌ బాగా నేర్చుకున్నారు. ఇంటెలిజెంట్ ఇడియెట్స్.

విషం శాతం: 125. ఒళ్ళంతా సన్నటి ఒణుకు మొదలైంది. తల తూలిపోతోంది. రైలింగ్‌ని గట్టిగా పట్టుకుందామని ప్రయత్నిస్తున్నా కానీ చెమట వల్ల చేతులు స్లిప్పవుతున్నాయి. నా ఒక్కడి వల్లా కావట్లేదింక. ఇంకొంత సేపు ఓపిక‌ పట్టగలనేమో చూడాలి.

కింద‌ ఫౌంటెన్ చుట్టూ ఉన్న కుర్చీల్లో కూలబడిన‌ రకరకాల ఆకారాలు. కష్టపడి షాపింగ్‌ చేసి సరుకుల్నీ పొట్టల్నీ బాగా నింపుకుని కదల్లేక ఆయాసపడుతున్న జనాలు. కొనిచ్చిన బొమ్మల్ని అక్కడికక్కడే తెరుస్తున్న పిల్లలు, అప్పటికే చాలా గ్యాపొచ్చిందని బాధపడుతూ మొబైల్స్‌ బైటికి తీసి తమ వర్చువల్ జీవితాల్లోకి అమాంతం దూకేస్తున్న పెద్దవాళ్ళు. రకరకాల పోసుల్లో సెల్ఫీలూ రీల్సూ తీసుకుంటూ, ఈ ఫిజికల్ ప్రపంచాన్ని కేవలం తమ వర్చువల్ వరల్డ్ కోసం ఓ ప్రాడక్ట్‌లా వాడుకుంటు‌న్న టీనేజర్స్… మనుషులెప్పుడూ నన్ను డిసప్పాయింట్ చెయ్యలేదు డిసప్పాయింట్ చెయ్యడంలో.

రెండో ఫ్లోర్‌లో లావుగా ఉన్న ఒక యంగ్ ఉమన్ ఫోన్లో మాట్లాడుతోంది. ఆమె కాళ్ళ దగ్గరొక‌ చిన్న పాప అటూ ఇటూ తిరుగుతోంది. “డివొర్స్ తీసు…” ఉన్నట్టుండి నా దృష్టి ఇంకో వైపుకి మళ్ళింది. ఆ ఆలోచన మాయమైంది.

ఆశ్చర్యపోయాను. ముందెప్పుడూ జరగలేదిలా.

ఒంటి మీద చెమటలు తగ్గుతున్నాయి. నోరు చేదుగా తగలట్లేదిప్పుడు. ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు.

వెనక్కి తిరగబోతూ, హఠాత్తుగా పైకి చూసి షాకయ్యాను. పొడుగ్గా, సన్నగా, ఎర్రటి బ్లేజర్ వేసుకున్న ఓ టీనేజర్ నా వైపే చూస్తోంది తల తిప్పుకోకుండా.

నల్లగా మారిపోతున్నాయి ఆమె కళ్ళు…


పాణిని జన్నాభట్ల

రచయిత పాణిని జన్నాభట్ల గురించి: 'తనలో నన్ను' , 'చెయ్యాల్సిన పని' కథా సంపుటులు, 'మనుషులు చేసిన దేవుళ్ళు' నవల. ...