అనాదిగా

పూర్వీకుల పూర్వీకమే కదా
ప్రకృతి

మేఘాలను గద్దిస్తూ
ఉరుములూ మెరుపులూ
కనిపించకుండా ప్రవహిస్తూ
భూగర్భ జలం
ఆకులలో రక్తాన్ని
ప్రసరిస్తూ సూర్యరశ్మి

నీరు ఎంతగా మారిపోతున్నా
మారని నీటి ముఖం
ఉప్పుఉప్పగా ఇసుక రుచితో
సముద్రపు నాలుక

వార్తాహరుల్లా కాంతీ గాలీ
ధ్యాన నిద్రలో చీకటి
కొండల్లో కీచురాళ్ళు
సముద్రంలో తాబేళ్ళు

చంద్రుడూ రాత్రి
సూర్యుడూ పగలు
చెట్టూ భూమి
పూవూ తేనెటీగ
చేపా నీరు

అన్నింటికీ
ఎంత ప్రేమ ఉంటేనేం

విడదీయలేనంతగా హత్తుకుంటూ
జీవితాన్ని మరణం
మరణాన్ని జీవితం.