అడ్మిన్స్ ఓన్లీ

నది కాగితం మీదే బాగుంటుంది
లోయలూ పర్వతాలూ
అరణ్యాలూ అన్నీ
చిన్న చిన్న గాజు తెరల మీదో
గోడల మీద చిత్రాలుగానో బాగుంటాయి.

గొప్ప గొప్ప అందాలని
అట్టే కాలం నిలబెట్టుకోలేక
ధ్వంసం చేసి ప్రశాంతమవుతాం.

వాల్ పేపర్‌గానే తప్ప
వారం దాటితే అమ్మని కూడా
ఇంట్లో ఉంచుకోవడానికి అవస్థ పడిపోతాం.

రంగు మారినట్టు
ఏ కొంచెం అనుమానం వచ్చినా
పార్కులో మొక్కల్ని ట్రిమ్ చేసినట్టు
బంధాల మీదా కత్తెర్లు వేస్తాం.

బుద్ధుడైనా
మన టైమ్ లైన్‌ను దాటి
ఆలోచనల్లోకి రాకూడదు
వెలుగుకి భయపడి
మళ్ళీ తెరుచుకునే వీల్లేకుండా
కనుపాపలకు మేకులు కొడతాం.

పాటలతో పిట్టల్ని ఆహ్వానించేవరకూ
బాగానే సాగుతుంది మనచుట్టూ
అవి రంగు రంగుల పాటలుగా ఎగురుతుంటే
ఎమోజీలుగా మారి మనమూ కురుస్తాం.

పిట్టలేమన్నా మనల్ని దాటి
ఎగరాలని చూస్తే మాత్రం
గబగబా సెట్టింగ్స్ లోకి వెళ్ళి
‘అడ్మిన్స్ ఓన్లీ’ అని తలుపులు మూసేస్తాం.


సాంబమూర్తి లండ

రచయిత సాంబమూర్తి లండ గురించి: ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు. ...