శరీరం

పురాతనమైన తిరుచూరు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ పొడవాటి గోడలు, సిమెంట్ పైపూత లేకపోవడంతో, దీర్ఘ చతురస్రాకారపు ఇటుకలు పైకి కనబడుతూ జేగురు రంగులో బారులు తీరి ఉన్నాయి. గోడల పైన ఎర్ర పెంకులతో వాలుగా ఆరు వరసలు పేర్చి ఉన్నాయి. అది కేరళ ఫ్రెంచ్ బాణీలో కట్టిన కట్టడం. ఎంతకాదనుకున్నా కనీసం వందేళ్ళ పైబడి ఉంటుంది.

దాన్ని చూసినప్పుడల్లా భారీ ఆకారమూ ఆకర్షణా కలగలిసిన ఏనుగు లాంటి శరీరం ఒక్కసారైనా గుర్తుకురాక మానదు. పొడవాటి వరండాలు. పదిహేను అడుగులకు ఒకసారి ఏనుగు కాళ్ళవంటి గుండ్రని స్తంభాలు. విశాలమైన తరగతి గదులు. లోపల ఒక్కొక్క క్లాస్‌రూమ్ లోనూ యాభైకి తక్కువ కాకుండా విద్యార్థులు ఉంటారు. అయితే మిగతా కాలేజీల్లాగా కాకుండా ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో అత్యంత నిశ్శబ్దమైన వాతావరణం ఉంటుంది.

శంకరన్ ఒక వరండాలో నడుస్తున్నాడు. తరగతి గదులకు పొడవాటి చెక్క కిటికీలు ఉన్నాయి. వాటి రెక్కలు తెరిచి ఉన్నాయి. వాటికి అడ్డ ఊచలు లేవు. అన్ని తరగతి గదుల్లోనూ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు దేనినో గీస్తూ ఉన్నారు, లేదా గీయవలసిన వస్తువులను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకుంటున్నారు. కావాలనో లేక అలవాటుగానో శంకరన్ ఈరోజు కాలేజీకి రావడం ఆలస్యమైంది.

అతడు క్లాస్‌రూమ్ లోకి వెళ్ళేటప్పటికి పవిత్రన్ మాస్టరు పొడవైన పెన్సిల్‌ను తన నుదుటికెదురుగా తీసుకువచ్చి ఎదురుగా కూర్చోబోతున్న మోడల్‌ను ఎలా కొలవాలో – శరీరపు కొలతలు నడుము నుండి పాదం వరకు ఎలా, నడుము నుండి మెడకు ఎలా, మెడ పైనుండి నడి నెత్తి వరకు ఎలా – క్లాసు తీస్తూ ఉన్నాడు. ఆ పాఠం ఆయన గతంలో ఎన్నోసార్లు చెప్పివున్నాడు. కాని ఈరోజు మొట్టమొదటసారిగా ఒక స్త్రీని నగ్నంగా కూర్చోబెట్టి గీయవలసి రావడం వలన మరొకసారి చెబుతున్నాడు. శంకరన్‌కి ఈరోజు కాలేజికి రాకుండా సెలవు తీసుకుందామనే అనిపించింది పొద్దున నుంచీ.

స్త్రీ నగ్నత్వాన్ని చూసేందుకు అతను తప్ప మిగతా వాళ్ళంతా ఎంతో ఆసక్తితోను, ఆత్రుతతోనూ కూర్చొని ఉన్నారు. క్లాస్‌రూమ్‌లో మూడింట ఒక వంతు ఆడపిల్లలు ఉన్నారు. క్లాస్‌రూమ్ సిద్ధంగా ఉంది. అందరూ బొమ్మ గీసేందుకు చుట్టూ కావలసినంత జాగా ఇచ్చి కూర్చుని ఉన్నారు. మధ్యలో రెండు మూడడుగుల ఎత్తులో చిన్నపాటి స్టేజ్ లాగా ఉంది. దాని మీద నల్లని గుడ్డ పరచబడి ఉంది. మోడల్‌గా రాబోయే స్త్రీ అక్కడే కూర్చోవలసి ఉంటుంది. చుట్టూ కలయచూసి అమరందాను వెతికి పట్టి చూశాడు. ఆమె వెనుక వరుస నుండి అతడినే చూస్తూ కూర్చుని ఉంది. ఒకరినొకరు తీక్షణంగా చూసుకున్నారు. శంకరన్ తను కూర్చునేందుకు చోటు కోసం వెదికాడు.

న్యూడ్ మోడల్‌గా వచ్చే మహిళ కూర్చోబోయే చోటుకి ఎట్టెదురుగా ఒకటే కుర్చీ ఖాళీగా ఉంది. అందరికీ అంతకుముందే తెలియడం వలన ఆ కుర్చీని ఖాళీగా వదిలేశారు. అతడు మళ్ళీ అమరందాను చూశాడు. ఆమె అతడిని రెప్పార్పకుండా తీక్షణంగా చూస్తూ ఉంది. కాస్త అలజడి మొదలైంది.

ప్యూన్ గణేశన్ ఒక మహిళను తీసుకురావడాన్ని స్టూడెంట్స్ అందరూ దూరం నుండి చూస్తూ ఉన్నారు. పవిత్రన్ మాస్టర్ అతనిని త్వరగా వచ్చి కూర్చోమన్నారు. వేరే దారి లేక శంకరన్ ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఆ మహిళ లోపలికి ప్రవేశించింది. అంతముందే అనేకసార్లు చూసిన వ్యక్తిలా అనిపించింది.

వెనకనుంచి కృష్ణ “రేయ్ ఇది మరియమేరా… ఎన్నోసార్లు బస్టాండ్‌లో ఒలింపిక్ లాటరీ టిక్కెట్టు కొట్టు గుమ్మం దగ్గర ఆమెను చూశాను” అని చెప్పాడు. ఆ పక్కనే కూర్చున్నవాడు ఆమె ఊరేగింపుకు వచ్చిన ఏనుగులా ఉందన్నాడు. నిజానికి ఆ మహిళ అలానే ఉంది. గంభీరంగా, నిర్లక్ష్యంగా… వయసు నలభై దాటి ఉంటుంది. శరీరం వయసును మింగేసినట్టుంది.

కొందరు విద్యార్థులు అటూ ఇటూ ఉన్న విద్యార్థులను చూసి నోరు మెదపకుండా నవ్వుకున్నారు. కొందరు కళ్ళు పెద్దవి చేసుకుని అలా చూస్తుండిపోయారు. ఆ మహిళ క్లాస్‌రూమ్ మూలన చెక్కతో చేసిన పార్టిషన్ లాంటి దాని వెనుకకు వెళ్ళింది. ప్యూన్ గణేశన్ ఆ పార్టిషన్ లోకి ఒక నీళ్ళ బాటిల్‌ను పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చాడు. అతడికి బాగా పరిచయమైన వ్యక్తేమోనని అందరికీ తోచింది.

ఆమె చెక్క పార్టిషన్ వెనకాల నుండి బట్టలను విప్పడం అందరికీ తెలుస్తోంది. పార్టిషన్ కింద ఖాళీలోంచి ఆమె కాళ్ళు, పిక్కల దాకా కనిపిస్తున్నాయి. ఆమె విడుస్తున్న ఒక్కొక్క దుస్తు వరసగా కిందకు జారి కాళ్ళ చుట్టూ పడుతోంది. ముందు, నేల మీద తోడు పెట్టిన పాల లాంటి నునులేత పసుపు రంగు మీద ఉల్లికాడ రంగు పువ్వులు నేసిన చీర కుప్పగా పడింది. ఆపైన లోదుస్తులు ఒకటొకటిగా కింద పడ్డాయి.

పవిత్రన్ మాస్టర్ ఆ మహిళను బయటకు పిలిచారు. “మరియమే…”

తన లోపలి లంగాను గుండెల పైవరకు పట్టుకుని మరియమ్మ ఆ చెక్క పార్టిషన్ వెనక నుండి ముందుకు వచ్చింది. బట్టలు విప్పేసినాక ఆమె ఇంకా ముదురు రంగులో కనిపించింది. అందరూ నిశ్చేష్టులై చూస్తుండిపోయారు.

మరియమ్మ వచ్చి స్టేజ్ మీద నిలబడింది. శంకరన్ కుర్చీకి ఎదురుగా. అతడికి పుట్ట నుంచి జెర్రి వేగంగా బయటకొచ్చి శరీరమంతా సరసరమని పాకుతున్న అనుభూతి. పవిత్రన్ మాస్టర్ సైగ చేయగానే ఆమె ఆ లంగాను కుప్పగా జారవిడిచింది.

గదంతా చిక్కటి నిశ్శబ్దం అలుముకుంది. ఆ లంగా ఆమె కాళ్ళ కింద వంకరగా గీసిన సున్నాలా వచ్చిపడ్డది. సున్నాను దాటి బయటకు వచ్చి కాలితో రంగు వెలిసిన ఆ లంగాను కాస్త దూరంగా నెట్టింది. స్టేజ్ మీద పరచబడ్డ నల్లని గుడ్డ పైన కూర్చుంది. అందరూ ఆమె పైనుంచి ఇంకా చూపు తిప్పుకోలేదు. తాకేంత దూరంలో ఎదురుగా ఉన్న ఆ శరీరాన్ని శంకరన్ నేరుగా చూడలేకున్నాడు.

మాస్టర్ ఆమెకు ఎలా కూర్చోవాలో చెపుతున్నాడు. ఇతడికి చెవులు దిబ్బెళ్ళు పడిపోయినట్టయింది. బయట జరిగేదేదీ అతని చెవిన పడటం లేదు. అతడి శరీరంలో ప్రతీ అలికిడి, ప్రతీ కదలికా అతనికి స్పష్టంగా తెలిసివచ్చింది.

విద్యార్థులు ఎవరూ ఇంకా సహజ స్థితిలోకి రాలేదు. ఆ స్త్రీ శరీరాన్ని నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. మరియమ్మ బిగువు సడలిన చన్నుల పైనే అందరి దృష్టీ నిలిచింది. ఆడపిల్లలు తప్ప ఇంకెవరూ బొమ్మ గీయడం మొదలు పెట్టలేదు.

ఇంకొంతమంది మరియమ్మ నడుము కిందకు చూపును పోనిచ్చారు. మరియమ్మ మాస్టర్ చెప్పినట్లు ఒక కాలు పైన ఇంకొక కాలు అటుగా వేసి అరిపాదాలు వెనుకకు చూసేలా తొడలు మూసుకొని కూర్చుంది. పైనున్న కాలుకు కింద ఉన్న కాలుకు మధ్య ఇంచుమించు ముక్కోణంలో నల్లని వెంట్రుకలు కనపడ్డాయి.

కాళ్ళసందులో ముక్కోణంలో ఆనుకొని ఉన్న మధ్యభాగంలో దట్టమైన నల్లని చీలిక కనిపించింది – కండరాన్ని బ్లేడుతో చెక్కినట్లు. అతడికి ఎందుకో అలాగే స్ఫురణకు వచ్చింది. ఆడపిల్లలకు ఆ శరీరం మీద పెద్ద ఆసక్తి ఉన్నట్లు కనబడలేదు. వాళ్ళ కళ్ళలో ఎటువంటి ప్రయాస, ఆకర్షణ మిరుమిట్లు కొలపటం లేదు. బదులుగా కొంతమంది కళ్ళలో మాత్రం మన శరీరం కూడా ఇదే రకంగా చితికిపోయి, రూపం కోల్పోయి, అడ్డదిడ్డంగా, ఎత్తుపల్లాలతో, బైటకు తన్నుకుని వచ్చి, చన్నులు వేలాడుతూ, చర్మం ముడతలు పడి, కండలు ఇలానే వేలాడుతూ ఉంటాయేమోనన్న భయం మొదలయ్యింది.

శంకరన్ అమరందాను చూద్దామా అనుకుని సంకోచంగా వెనక్కి తిరిగి చూశాడు. ఆమె ఇంకా అతడినే తదేకంగా చూస్తున్నట్లు ఉంది. ఇతడు తిరగగానే ఆమె దృష్టి డ్రాయింగ్ బోర్డ్ వైపు పోనిచ్చింది. ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా ఒక ఆకర్షణ నెలకొంది. ఒకటి రెండు సార్లు ఇండియన్ కాఫీ హౌస్‌లో కలిసి కాఫీ తాగారు. కాస్త స్తబ్దుగా ఉండే అమ్మాయి. తను కూడా శంకరన్ లాగా చాలా మితంగా మాట్లాడుతుంటుంది. అరుదుగా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఒకటి రెండు మాటలు మాట్లాడింది. అవి కూడా ఆమె కుటుంబానికి సంబంధించిన మాటలే. ఆమె తన ఫామిలీ ఫోటోని ఎప్పుడూ తన హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుని ఉంటుందట, చూపించింది. ఆ ఫోటోలో ఒక డజనుకు పైగా మనుషులు ఉన్నారు. ఆమె తండ్రి పశువుల వైద్యుడు. అమ్మ బొమ్మలు వేసేది. చిత్రలేఖనం అంటూ ప్రత్యేకించి నేర్చుకోనప్పటికీ అది చేతి కదలికలో సహజంగానే ఆమెకు వంటబట్టింది. అమరందాకు కూడా చిన్నప్పటి నుండి అమ్మ దగ్గర నుంచే బొమ్మలు గీయడం మీద ఆసక్తి చిగురించింది. నాలుగేళ్ళ క్రితం అమ్మ చనిపోయింది. ఆ మాట చెబుతూ అమరందా గాజులపురుగులా శరీరాన్ని, మాటలను తనలో తాను ముడుచుకుంది. కొంచెం సేపు ఉండి బయలుదేరుతానని చెప్పి, వెనుకకు తిరిగి చూడకుండా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.

అందరూ బొమ్మ గీయడం మొదలుపెట్టారు. కొంతమంది పెన్సిల్‌ను నుదుటికెదురుగా పట్టుకుని సగం కంటిని మూసుకొని శరీర పరిమాణాన్ని కొలుచుకుని బొమ్మ గీసే స్థితికి దానిని నోట్ చేసుకున్నారు. కొంతమంది తప్పుతప్పుగా మొదలుపెట్టారు.

చాలామంది ఎరేజర్‌లతో కాగితంలో గీసిన శరీరాన్ని చెరుపుతూ ఉన్నారు. మాస్టరు ఎక్కడెక్కడ ఎరేజర్లు కనిపించాయో వాటన్నిటిని తీసుకెళ్ళి నేలపై విసిరికొట్టారు. “చేతిలో ఎరేజరు ఉంది కదా అని మీ మెదడులో అనిపించిందంటే గీత నమ్మకంతో బలంగా రాదు. తప్పయిందంటే చెరిపేయచ్చు కదా అని అనిపిస్తుంది. ఎరేజరు లేకపోతే మొదటి నుంచే సరిగ్గా గీయాలన్న పూర్తి ఏకాగ్రత అక్కడ ఉంటుంది.”

శంకరన్ తన దగ్గర ఉన్న ఎరేజర్‌ను తీసుకుని అరచేతిలో దాచుకున్నాడు. కొందరు విద్యార్థులు తప్పుగా గీసిన కాగితాన్ని నలిపి పక్కకి విసిరివేశారు. చుట్టూ ఎన్నో కాగితాలు నలిగిపోతున్న అలికిడి. మరొక కాగితాన్ని తీసుకెళ్ళి డ్రాయింగ్ బోర్డు పైన పెట్టి మళ్ళీ మొదలుపెట్టారు. శంకరన్ ఇంకా కాగితం పైన చుక్క కూడా మొదలెట్టలేదు. తలెత్తి పక్కన ఉన్న ఆ శరీరాన్ని చూసేందుకు ప్రయత్నించాడు. అతడికది సాధ్యపడక వెంటనే తలదించుకున్నాడు.

మెల్లగా ఆ మహిళ శరీరం పైన దృష్టిని కేంద్రీకరించి గీసేందుకు నిర్ణయించుకున్నాడు. అతడి మనసులో మరొక లావైన స్త్రీ రూపం మెదిలింది.

కళ్ళు పెద్దవి చేసుకొని పూర్తి శరీరాన్ని స్టడీ చేసేందుకు నిర్ణయించుకున్నాడు. శరీరం అన్నది కేవలం మాంసపు ముద్ద అని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. మరియమ్మ కదలకుండా నిశ్చేష్టురాలైనట్టు మొఖంలో ఏ భావమూ లేకుండా ఎటో చూస్తుండిపోయింది. వక్షాల నుండి చూపు జార్చి కాళ్ళ సందుల్లోకి చూశాడు. అతిదగ్గరగా ఉండడం వలన స్పష్టంగా కనబడింది. బ్లేడుతో చీరినట్లు ఉన్న చీలిక మధ్య ఎర్రని రక్తపు మరకలు. ఆమె ముఖాన్ని చూశాడు. ఆమె కళ్ళు మూసుకుని నొప్పిని భరిస్తున్నదానిలా కనిపిస్తోంది.

చుట్టూ ఉన్న మిగతావారిని చూశాడు. వాళ్ళు నగ్నత్వపు అలజడి నుండి బైటపడి గీతలలోకి ప్రవేశించారు. తమ మధ్యలో కూర్చుని ఉన్న నగ్నమైన ఆ స్త్రీ చుట్టూ కూర్చుని తమకు కనిపిస్తున్న శరీరపు భాగాలను వాళ్ళు గీతలుగా మలుస్తున్నారు. ఆమె వెనుక భాగం వైపు కూర్చున్నవాడు అక్కడికి రానా అని శంకరన్‌కు ఆత్రంగా సైగ చేశాడు.

బ్రతికి బయటపడ్డానురా దేవుడా అన్నట్లు వెంటనే సరే అని తిరిగి సైగ చేశాడు. లేచి ఒకరిచోటు మరొకరు మార్చుకున్నారు. ముందుకొచ్చి కూర్చున్నవాడి కళ్ళు పువ్వుల్లా విచ్చుకున్నాయి.

శంకరన్ ఇప్పుడు ఆమె వెనుక కూర్చున్నాడు. కండ పట్టిన బలమైన పిరుదులు. విశాలమైన వీపు. ఇప్పుడు అతనికి ఎటువంటి ఇబ్బందీ పెద్దగా కలగలేదు. అమరందాను చూశాడు. ఆమె కూడా ఇతడిని తిరిగి చూసింది. ఆమె ముఖంలో ఇప్పుడు కాస్త కారుణ్యం తొంగి చూస్తున్నట్టు అనిపించింది. పెన్సిల్ తీసుకుని డ్రాయింగ్ బోర్డు మీద నిలిపాడు.

కొత్త కాగితాన్ని డ్రాయింగ్ బోర్డుపై తగిలించి గీసేందుకు సిద్ధమయ్యాడు. మొదటి గీత గీశాడు. దాని తరువాత తలెత్తి ఆ శరీరాన్ని ఇక చూడనేలేదు. అతడికి తోచినట్లు గీస్తూపోయాడు. ఈసారి ఎరేజరు అవసరం పడలేదు. వేగంగా గీశాడు. ఒక్కసారి మాత్రం తలెత్తి తను కూర్చున్న చోటు నుండి ఇష్టపూర్వకంగా చోటు మార్చుకున్నవాడిని మరియమ్మ నడుము ముడుత, నేలకానించి పెట్టిన చేయి మధ్య ఉన్న సందు గుండా చూశాడు.

ఆ చోటు మార్చుకున్న విద్యార్థి బిగుసుకుపోయి, అలజడి నిండిన ముఖంతో పెన్సిల్ ఎడమ చేతిలోకి మార్చుకొని బ్రష్ కోసం వెతికి తీశాడు. అతడి కళ్ళు ఆమె తొడల మధ్య సందును చూసినట్లు ఉంది. బంగారు వెంట్రుకల బ్రష్ మొనకు ఎరుపు రంగు అద్దుతున్నాడు. శంకరన్‌కి అందుకు కారణం తెలుసు.

శంకరన్ ఎందుకో డ్రాయింగ్ బోర్డుపై కాగితాన్ని గుచ్చి పెట్టిన నల్లటి పిన్నును నిశ్చేష్టుడై చూశాడు. ముందువైపు కూర్చున్నప్పుడు అతడు చూసిన శరీరం గుర్తుకు వచ్చింది.

రాధక్క శరీరం కూడా అచ్చం అలానే ఉండేది. ఖచ్చితంగా అదే ఒంటి రంగు. రాధక్క ఆమె కంటే పరిమాణంలో కాస్త తక్కువ. అతడి శరీరం టక్కున బరువెక్కినట్లు అనిపించింది. ఊపిరి సలపనట్లు తోచింది. రాధక్క శరీరాన్ని తలుచుకున్నప్పుడల్లా ఇలా జరగడం కొత్త కాదు.

రాధక్క శరీరమే అతడు మొట్టమొదటిగా నగ్నంగా చూసిన స్త్రీ శరీరం. పదహారేళ్ళ వయసులో అతడి శరీరంలో మెల్లగా, కామం ఎదగడం మొదలైన తరుణంలో, ఎదురుపడ్డ ఏ స్త్రీ ముఖంలోకయినా చూసేందుకు కుంచించుకుపోయేవాడు. మెడ కింద ఉండే చిన్నా పెద్దా వక్షాల మీద అతడికి ఎంతగానో ఆకర్షణ ఉండేది.

అప్పుడే అక్కడొకటి ఇక్కడొకటి అని ఊరు చివర కొత్తగా ఇళ్ళు పుట్టుకురావడం మొదలైంది. స్కూలు సెలవు రోజులు. ఆరోజు ఇంట్లో ఎవరూ లేరు. జ్వరంతో సలపరిస్తున్న శంకరన్ తన ఇంటి మేడ మీద నిలబడి ఉన్నాడు. అటూ ఇటూ చూస్తూ వెనక ఇంటి దొడ్లోకి అనుకోకుండా తొంగి చూశాడు. మూసేందుకు వీలుకాని తలుపు ఉన్న స్నానాలగదిలో తడిసిన ఒక నగ్న శరీరం కనిపించింది. ఇతడి శరీరంలో జెర్రి పాకడం మొదలైంది. నాలిక పొడిబారడం, ఊపిరి అందకపోవడం లాంటి అనుభూతి. ఆ శరీరాన్ని చూశాడు. మంచి మేని చాయ. బలమైన పిరుదులు. విశాలమైన వీపు. వెనుక భాగం మాత్రమే కనబడింది. వీపును ఆమె తన పొడవైన ఉంగరాల జుట్టుతో చాలా వరకు మూసేసింది. ఆమె తన ఒంటి మీద నీళ్ళు ముంచుకుని పోసుకుంటూ ఉంది. ఆ నీరు ఆమె వెంట్రుకల అంచుల నుంచి పిరుదుల సందుల్లోకి జారుతోంది.

శంకరన్ ఆ తరువాత ప్రతిరోజూ ఆ శరీరం కోసం వెతికాడు. అతనికి తరచూ చూసేందుకు ఆమె కనిపించేది. ఎప్పుడు చూసినా వెనుక భాగం మాత్రమే కనబడేది. కొన్నిసార్లు ఆమె వంగి నీళ్ళు ముంచుకునేటప్పుడు మాత్రం ముందు భాగంలో వేలాడుతున్న వక్షాలూ కాస్తగా కనబడేవి. స్నానం పూర్తవగానే ముందు భాగాన్ని గోడకి చూపిస్తున్నట్లు నిలబడి ఒంటి మీది తడిని తుడుచుకొన్న గుడ్డతోటే తనను చంకల కిందుగా కప్పుకొని ఇంట్లోకి వెళ్ళేది. దాదాపు ఆరేడు నెలలుగా ఇదే జరిగింది.

ముందువైపు శరీరం అతడు ఏనాడూ చూసి ఎరుగడు. ఒకరోజు వేకువజామునే రైలు పట్టాల మీద కాలకృత్యాలు తీర్చుకొని వచ్చిన అతడి తండ్రి అతడి తల్లి దగ్గర రాధ పట్టాల మీద శవంగా పడుందని, ఎవరో చంపి అక్కడ పడేసేందుకు అవకాశం ఉందనీ చెబుతున్నాడు. ఆ శరీరం మీద ఒక్క నూలు పోగు కూడా లేదు అన్నదానిని మాత్రం సన్నని గొంతుకతో చెప్పాడు. శంకరన్ తన గది నుండి మెల్లగా జారుకుని పట్టాల వైపు పరుగులు తీశాడు. రాధక్కను దూరం నుండే చూశాడు.

ఒక రైల్వే కళాసి అందరినీ తరుముతున్నాడు. నలుగురైదుగురు మగాళ్ళు ఆ చనిపడిన శరీరాన్ని చూసి అక్కడ నుండి జారుకున్నారు. ఇతడు కూడా నడక వేగం పెంచి అక్కడికి వెళ్ళి చూశాడు. విరబోసుకున్నట్టు తల వెంట్రుకలు అన్ని దిక్కులకు వ్యాపించి, ఆమె నగ్నంగా వెల్లకిలా పడి ఉంది. ప్రాణం లేని ఆమె చూపు ఆకాశంలోకి చూస్తూ ఉంది. ఎన్నో రోజులుగా తను ఎంతో ప్రయాసతో వెతికిన రాధక్క ముందు వైపు శరీరం. బిగువు సడలి వేలాడుతున్న వక్షాలు. నీళ్ళు నింపిన బుడగలా ఉబ్బి మట్టి రంగులో ఉన్న ఉదర భాగం. విశాలమైన తొడ భాగం, చిన్న చిన్న మెలి తిరిగిన ఉంగరాల జుట్టు. తొడ సందులో అప్పుడు టక్కున అతడి కంటబడింది నల్లని వర్ణంలో మొద్దుబారిన బ్లేడుతో గీసినట్లు ఉన్న మందమైన నల్లటి గీత. చూపు తిప్పుకోకుండా తీక్షణంగా చూశాడు. వెంట్రుకల మధ్య నల్లని గీత అంచుల నుండి రక్తపు మరకలు.

కళాసి అడుగుల చప్పుడు దూరం నుండి దగ్గరయింది. ఏదో కట్టె విరిచిన చప్పుడు. శంకరన్ తిరిగి చూశాడు. కళాసి ఒక కట్టెతో, కాలిపోయిన చెట్టులా ముదురు రంగులో ఉన్న ఒక గోనెసంచీని ఎత్తి పట్టుకుని వచ్చాడు. శంకరన్‌కు తెలుసు, ఆ దిక్కుమాలిన గోనెసంచీ ఆమె నగ్న శరీరాన్ని మూసేందుకని. అందరిని వెళ్ళగొట్టేందుకు కళాసి మళ్ళీ గొంతు పెంచాడు. గోనెసంచీని కప్పేముందు శంకరన్ కదలకుండా రాధక్క శరీరాన్ని కన్నార్పకుండా పూర్తిగా చూసి కావలసినంతగా జ్ఞాపకాలలో నింపుకున్నాడు. టక్కున ఆ శరీరం మీద గోనెసంచీ వచ్చిపడింది.

మురుగు నీటిలో నాని ఆ వాసనతో పాడైపోయిన గోనెసంచీ అది. దానిలోనుండి ఒక చిన్న జెర్రి బయటకు వచ్చి ఆ శరీరం పైన కదలాడింది. అది ఆ నగ్నశరీరం నుండి కిందకు ఎలా దిగాలో తెలియక తడబడుతున్నట్టు ఉంది. ఆమె చుబుకం మీదకి ఎక్కి పెదవుల్లోకి దూరి, బైటకు వచ్చి ముక్కులోకి వెళ్ళి కనుమరుగైంది. శంకరన్ వెనక్కి తిరిగి పట్టాల కంకరరాళ్ళపైన తొట్రుపాటుతో తడబడుతూ పరుగులు తీశాడు. బరువు నిండిన తన శరీరాన్ని పరుగులు తీస్తూ మోసుకువెళ్ళేందుకు అతను చాలా శ్రమపడ్డాడు.

పవిత్రన్ మాస్టర్ అడుగుల అలికిడి వినబడి శంకరన్ తల తిప్పి చూశాడు. ఇంకో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కూడా అతడి డ్రాయింగ్ బోర్డు చుట్టూ నిలబడి చూస్తూ ఉన్నారు. పవిత్రన్ మాస్టరు ‘అద్భుతం’ అని అన్నాడు. ఆ నగ్న స్త్రీ తన శరీరాన్ని వెనక వైపుకు తిప్పి చూసింది. ముందు వైపు ఉన్న అందరూ లేచి వచ్చి ఇతడి డ్రాయింగ్ బోర్డు వైపు చూశారు. రాధక్క కూడా ముందుకు వచ్చింది. నగ్న స్త్రీ లేచి బట్టలు కట్టుకునేందుకు వెళ్ళింది. కాస్త దూరంగా ఉన్న ఆడ అటెండర్ దగ్గరకు వెళ్ళి ‘నాప్‌కిన్ ఉందా’ అని అడగడం శంకరన్ చెవిన పడింది.

అందరూ శంకరన్ డ్రాయింగ్ బోర్డులో గీసిన శరీరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మరియమ్మ తన శరీరం మీద చీరను చుట్టుకొని చీర కొంగును భుజం మీద వేసుకుంటూ వచ్చి, అతడు గీసిన తన శరీరాన్ని చూసింది. కొంచెంసేపు తర్వాత “నాకు ఉంగరాలు జుట్టు భలే ఉంది కదూ” అన్నది.

అమరందా అతడు గీసిన శరీరాన్ని చూసింది. అతడు గీసేటప్పుడు ఆమె అతడిని చూస్తూనే ఉంది. అతడు తలపైకెత్తనే లేదు. ఆమెకు ఈ శరీరం ఇప్పుడు వచ్చిన ఈ స్త్రీది కాదు అన్నది వెంటనే తెలిసిపోయింది. అతడు తల పైకెత్తి అమరందా ముఖాన్ని చూశాడు. అది రాయిలా కఠినంగాను, చీకటితోను నిండి ఉంది. ఆమె కూడా అతడిని క్షణంపాటు చూసింది. అంతకు మించి చూడలేకపోయింది. అతడికి వెంటనే ఆ చోటినుండి తను వెళ్ళిపోవాలి అనిపించింది. ఉన్నపళంగా అన్నీ అక్కడ పారేసి వరండాలోకి పరుగులు తీశాడు. కాళ్ళలో కంకరరాళ్ళు గుచ్చుకుంటున్నట్టు అనిపించింది.

ఊపిరాడనంత వేగంగా పరుగెత్తి తన గదికి వచ్చి తలుపు వేసుకున్నాడు. పొత్తికడుపులో కదిలింది. టాయిలెట్ తలుపు తెరిచాడు. తడి నిండిన నేల మీద ఒక చిన్న జెర్రి పరుగులు తీసింది. అంతే.

ముక్కులోకి జెర్రి దూరుతున్న దృశ్యం పదే పదే కళ్ళముందు కదలాడింది. బయటకు వచ్చి టాయిలెట్ తలుపును విసురుగా మూశాడు. అన్ని తలుపులు మూసుకుపోయినట్లు అనిపించింది. చెక్క మేజాకున్న రెండు డ్రాయర్‌లను లాగి వందల్లో ఉన్న కాగితాల కట్టలను బయటకు తీశాడు. అన్నింటిలోనూ రాధక్క నగ్నశరీరం గీయబడి ఉంది, వెనుకవైపు నుంచి, వేర్వేరు కోణాలలో. అది వేర్వేరు రోజులలో చూసిన రాధక్క వెనుక భాగమై ఉంటుంది. చెక్క అలమరా, పుస్తకాల సందులలో నుండి కూడా కట్టలు కట్టలుగా శరీరాలు గీయబడ్డ కాగితాలు. అన్నింటిని బొత్తిగా పేర్చి గది పై కప్పు మీదకి విసిరాడు.

గదంతా నగ్నశరీరాలు ఎగిరాయి. శంకరన్ నేల మీద వెల్లకిలా పడుకున్నాడు. వందలకొద్దీ శరీరాలు తేలుతూ ఊగుతూ వచ్చి అతడి శరీరంపై పరుచుకున్నాయి.