తలుపు తెరుచుకున్న చప్పుడు. లైట్ వెలిగింది.
కళ్ళు చికిలించుకుని టైమ్ చూశాను. పదకొండున్నర దాటుతోంది.
లాకర్లోంచి బాటిల్ తీసి, స్టీల్ గ్లాసులోకి వంచుతున్నాడు నా రూమ్మేట్, లాన్స్ నాయక్ భూషణ్. తూలడాన్ని అదుపు చేసుకుంటున్నాడు.
“భూషణ్ సర్, అభీ తక్ ఖానా నహీ ఖాయా క్యా?” మెస్ తొమ్మిదింటికే మూసేస్తారే.
“మీరు తిన్నారా సాబ్?” ‘మీరు’ అనడంలో గౌరవంకన్నా వెటకారమే ఎక్కువగా మోగింది భూషణ్ గొంతులో.
సర్వీస్‌లో భూషణ్ కన్నా కనీసం పదేళ్ళు జూనియర్‌ని. మా ఇద్దరి ‘ట్రేడ్’ కూడా ఒకటే. కానీ, రెండేళ్ళు కష్టపడి ముగించిన డిప్లొమా కోర్స్ పుణ్యమా అని మరికొన్ని వారాల్లోనే ప్రమోషన్ రాబోతోంది నాకు. ఆ అసూయని బయటపెట్టుకోవడానికి, సూటిపోటిమాటలు విసరడానికీ కారణాలు ఇతనికీ పెద్దగా అక్కర్లేదు – చాలామందికిలానే.
“నా పెళ్ళాం కూడా ఇలాగే అడుగుతుంది. అదీ… దాని…” మాట ముద్దగా వస్తున్నా, ఏదో పంజాబీ బూతు దొర్లిందని తెలుస్తోంది.
ఏమిటో ఈ భూషణ్. పగలంతా చేసే డ్యూటీలో తేడా రానివ్వడు గానీ సూర్యుడు అలా కిందకి దిగడం ఆలస్యం, బాటిల్ ఇలా పైకి లేపుతాడు. ఎప్పుడు దించుతాడో అతనికే తెలీదు. అయినా అంత ఎందుకు తాగాలో! కళ్ళు మూసుకుని పడుకున్నాను. అప్రయత్నంగానైనా సరే, ఇప్పుడు ఎవరితోనూ ఏ విధమైన తంటానూ తెచ్చుకోలేని స్థితి నాది. ఎందుకంటే, నా మీద ఏ చిన్న కంప్లయింట్ అయినా వెళ్ళిందంటే మాత్రం, ప్రమోషన్‌తో భుజం మీదికి వాలబోతున్న ‘స్టార్’ గాల్లోకి ఎగిరిపోగలదు – దాన్ని ధరించేందుకు తగిన ‘డిసిప్లిన్’ నాలో లేదని.
భూషణ్ ముద్దగా గొణుక్కోవడం వినిపిస్తోంది చాలాసేపటివరకూ.
ఒక రాత్రివేళ మళ్ళీ మెలకువ వచ్చింది. నిద్దట్లోనే బిగ్గరగా తిడుతూ, పదేపదే తొడగొడుతూ సవాల్ చేస్తున్నాడు భూషణ్.
మంచం కింద, లాకర్ వెనుక, మూలలూ అన్నీ చీపురుతో కలుపుతూ ఊడుస్తున్నాను. భూషణ్ పోస్టింగ్ మీద ‘వెళ్ళగొట్టబడి’ రెండు రోజులైంది. అతనున్నప్పుడు కూడా, గదంతా నేనే ఊడవాల్సి వచ్చేది. కనీసం తను పడుకునే మంచం కిందయినా శుభ్రంగా ఉంచుకోవాలన్న స్ప్రహే ఉండేది కాదు అతనికి. రోజూ పొద్దున్నే, ఇంకో పావుగంటలో పెరేడ్‌కోసం సిహెచ్ఎమ్ వేసే విజిల్ మోగుతుందనగా మంచం దిగడం, బాత్రూమ్ నుంచి పది నిముషాల్లోపే తిరిగొచ్చి, ఆదరాబాదరాగా లాకర్లోంచి నిన్న కూడా తొడుక్కున్న ‘డాంగ్రీ’నే తొడుక్కుని ప్లేట్ తీసుకుని మెస్‌కి పరిగెత్తి బ్రేక్‌ఫాస్ట్ మింగేసి, ఫాలిన్‌లో చేరిపోవడం…
గదిలో గచ్చంతా పొడిగానే ఉన్నా, అతని మంచం కింద మాత్రం అక్షరాలా బంకలు సాగుతోంది. ఊడుస్తుంటే చీపురు అంటుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఫ్లోర్ క్లీనర్‌ని వాడి కడిగితేగానీ ఆ మురికి వదలదు.
పరిశుభ్రతని అంతగా నిర్లక్ష్యం చేసే సోల్జర్లు అరుదు!
ఇదంతా రోజువారీ రొటీన్…
సాయంత్రం పెరేడ్ నుంచి తిరిగి వచ్చాక స్నానమూ అదీ కానివ్వడం ఆలస్యం… ఎవరో పిలిచినట్లే వచ్చి కూర్చొనేవాడు నాయక్ పర్తాప్ సింగ్. అతనిది కూడా భూషణ్ వాళ్ళ ఊరేనట. ఒక్కోసారి ఇద్దరూ కలిసే వచ్చేవాళ్ళు. ఏదో తప్పనిసరి ఆర్డర్‌ని పాటిస్తున్నవాడల్లే లాకర్లోంచి సీసా బయటికి తీసేవాడు భూషణ్. ఇద్దరి కబుర్లూ కొన్ని పెగ్గులూ ఆవిరయేవి. వాళ్ళు ఎప్పుడో ఒకసారి నాకేసి చూసి, పలకరింపుగా కళ్ళెగరేయడమే, రూమ్‌లో నేను కూడా ఒకణ్ణి ఉన్నట్లు గమనించారనడానికి చిహ్నం.
పంజాబీలో వాళ్ళు మాట్లాడుకుంటున్నది కొద్దికొద్దిగా అర్థమౌతోంది.
“సెలవుకి అప్లయ్ చేశావా?”
“లేదు.”
“వెళ్ళి వచ్చి నాలుగు నెలలు కాలేదూ?”
“అయితే? కొంపేమన్నా మునిగిందా?” వంకరగా నవ్వుతూ అడిగాడు భూషణ్.
“నేనైతే మూడు నెలలు దాటనివ్వను.” ప్రకటించాడు పర్తాప్.
“సరైన పెళ్ళాం దొరికితే నేనూ దాటనిచ్చేవాణ్ణి కాదు.” నవ్వుని పెంచుతూ అన్నాడు భూషణ్.
ఆ నవ్వులో తనూ కలిశాడు పర్తాప్. “వెళ్దామా?” అన్నాడు గ్లాసు ఖాళీ చేస్తూ. “మొన్నటి పొట్టిది… ఇప్పుడూ ఉంటుందా?” భూషణ్ ప్రశ్న.
“అదిగాకపోతే ఇంకోతి. చల్ చల్!”
అతని లాకర్‌కి ఉన్న గొళ్ళెం ఊడిపోయింది. ఒక తలుపుకి లోపలి వైపు, ఏదో చవకబారు బూతు పత్రికలోంచి చింపి అతికించిన బొమ్మ… ఒక మూల జిగురు ఆరిపోయి వేలాడుతోంది.
లాకర్ లోంచి ఇంకా రమ్ వాసన వస్తోంది. బాటిల్ పగిలిందేమో. తెరిచి చూశాను. ఒక రకమైన ముక్కవాసన గుప్పుమంది. బాటిలేదీ లేదు. అరల మీద పరచిన న్యూస్ పేపర్లు, ముద్దగా పడున్న డాంగ్రీ, ఖాళీ షూ పాలిష్ డబ్బా, పోర్న్ పత్రికలోని బొమ్మల పేజీలు మరికొన్ని.
ఒక మూల ఏవో కాగితాలు… తీసి చూశాను. రెండు మూడు ఉత్తరాలు, ఒక ఫోటో.
భూషణ్ భార్య అయుండాలి.
లేత పసుపు రంగు కమీజ్ మీద, పారదర్శకమైన నల్ల చున్నీ. పెద్ద కళ్ళు, తీరైన ముక్కు, ఎర్రటి, నిండు పెదవులు. ఫోటోలో ఒక అందమైన పంజాబీ యువతి నవ్వుతోంది, తన చుట్టూ మోకాలెత్తున ఎదిగి, లేత పసుపురంగుని విరజిమ్ముతున్న ఆవపూలతోబాటు…
“భూషణ్, ఇదే ఆఖరి వార్నింగ్. ఇంకోసారి నీ మీద కంప్లయింట్ వస్తే మాత్రం, ఓసీ సాబ్‌కి రిపోర్ట్ చేస్తాను. ఆ తర్వాత నిన్నెవడూ కాపాడలేడు.” కళ్ళద్దాలని తీసి పట్టుకుంటూ అన్నాడు సుబేదార్ మేజర్‌సాబ్.
తలూపాడు భూషణ్.
“ధోబీ ఘాట్ నుంచే కాదు, షంషాన్ ఘాట్ నుంచి కంప్లయింట్ వచ్చినా సరే, తేరీ ఖైర్ నహీఁ!”
తలొంచుకు నిలబడ్డ భూషణ్ కదల్లేదు, మెదల్లేదు.
“పెళ్ళయిందిరా నీకు?”
“అయింది సర్.”
“మరి ఫామిలీ క్వార్టర్స్‌కి ఎందుకు అప్లయ్ చెయ్యవు? తప్పతాగి తిరగడం, కనిపించిన ఆడపిల్లని అల్లరి పెట్టడమేనా నీ పని? ఒక సోల్జర్ చెయ్యాల్సిన పనేనా ఇది? ఇదేనా నీ ట్రైనింగ్? ఇదేనా నీ డిసిప్లిన్?” సుబేదార్ మేజర్ కోపం అంతకంతకూ పెరుగుతోంది.
“…”
“అప్లయ్ చెయ్యి. నీకు క్వార్టర్ నేను శాంక్షన్ చేయిస్తాను. సరేనా?”
“సరే సర్.”
“ఇంకా ఇంతవరకూ వస్తోంది వాసన. ఎంత తాగుతావురా హరాంఖోర్… సీహెచ్చెమ్, ఆజ్ సే ఇస్ కో దారూ ఇష్యూ నహీ హోగా.”
“యస్ సర్!”
వార్నింగ్ ఇచ్చిన మూడు వారాల్లోపే మరోసారి కంప్లయింట్ వచ్చింది భూషణ్ మీద. ఈసారి ధోబీఘాట్ నించి కాదు. ఒక స్వీపర్ నుంచి. ఆమె రోజూ ఊడ్చే రోడ్డు పక్కని పొదల మాటున కాపు కాసి, దగ్గరకి రాగానే చెయ్యి పట్టుకున్నాట్ట. ఆమె విదిలించుకుని, పరుగున వెళ్ళి పక్క రోడ్డుమీద పనిచేస్తున్న భర్తకి చెప్పింది. భర్త సిహెచ్ఎమ్‌కి మొరపెట్టుకున్నాడు. సిహెచ్ఎమ్‌కి ఆ వార్తని సుబేదార్ మేజర్‌కి చెప్పక తప్పలేదు. ఈసారి ‘ఓసీ’కీ కబురు వెళ్ళింది. అక్కణ్ణుంచి ‘సీవో’కి.
వారం తిరక్కుండా భూషణ్‌కి పోస్టింగ్ తెప్పించబడింది. పేరు వినగానే జంకు పుట్టించే లద్దాఖ్ లోని ఒక యూనిట్‌కి.
ఒద్దు ఒద్దనుకుంటూనే ఒక ఉత్తరాన్ని తెరిచాను. కుదురుగా ఉన్నాయి అందులోని పంజాబీ అక్షరాలు. రెండు మూడు పేరాలు. మరో ఉత్తరం తెరిచాను. అదే చేతి రాత. అదే పొందిక. ఇంకోటి… అదే అందం. ఆ గుర్‌ముఖి అక్షరాలు చదవడం రాదు కాబట్టి, ఆమె రాసింది నాకు తెలిసే ప్రమాదం లేదు. కానీ అవి ప్రేమలేఖలని గుర్తుపట్టడానికి, చదవాల్సిన పని లేకపోయింది!
ప్రతి ఉత్తరానికీ కుడి చివరన స్పష్టంగా, సంతకానికి బదులు లిప్‌స్టిక్ రాసుకున్న పెదాలు ఒత్తిన ముద్రలు…
“ఓయ్ రావ్, కైసే హో? క్యా హాల్ హై?”
గుర్తుపట్టాను. నాయక్ మాధో. ఆప్యాయంగా కౌగలించుకున్నాను – పన్నెండేళ్ళ క్రితం బేసిక్ మిలిటరీ ట్రైనింగ్‌లో కలిసి చెమటోడ్చిన తోటి రిక్రూట్‌ని.
“బావున్నాను. నువ్వెలా ఉన్నావ్?”
“బావున్నాను, రా, రా!” అంటూ చెయ్యి పట్టుకుని బారక్ లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. “ఇప్పుడే వస్తా” అంటూ వెళ్ళి పక్క బారక్ లోని ఫ్రెండ్‌ని అడిగి డ్రింక్స్ తెచ్చాను.
కబుర్లు మొదలయ్యాయి. ట్రైనింగ్ తర్వాత ఎక్కడెక్కడ పని చేసిందీ చెప్పుకొచ్చాడు. పెళ్ళయిందట. ఇద్దరు పిల్లలట. ఇవాళ ఇక్కడికేదో టెంపరరీ డ్యూటీ మీద వచ్చాడట. ఈ సంవత్సరం ఆన్యువల్ లీవ్‌ని ఇంకా వాడుకోలేదట.
మాటల మధ్యలో అన్నాడు.
“హవల్దార్ ఓంబీర్ సింగ్ గుర్తున్నాడా రావ్?”
“కర్కోటకుడు. ఎలా మర్చిపోగలం.”
“కాన్ ఖోల్ కర్ సున్లో రే సాలోఁ!” ఉరిమింది హవల్దార్ ఓంబీర్ సింగ్ రాఠీ గొంతు, వెనకనుంచి.
“ఇది ఫైరింగ్ రేంజ్. మీ వూళ్ళో నూకాలమ్మ జాతర కాదు. ఇక్కడ నేను చెప్పకుండా ఊపిరి కూడా తియ్యకూడదు. సంఝే?”
ఈయన గురించి విన్నవన్నీ భయపెట్టే కథలే. చూడ్డం ఇదే మొదటిసారి. ఆరడుగుల పొడవున, నల్లటి పెద్ద ముఖంలో కరుగ్గా తీక్షణంగా చూసే కళ్ళు, చెవుల వరకూ సాగిన ఒత్తయిన మీసాలతో, వెన్నులో వణుకు పుట్టించే రూపం. అవసరమైనదానికన్నా కఠినంగా మాట.
“ఓయ్ గధే కీ ఔలాద్! అటు చూస్తావేంటి? ధ్యాస ఇక్కడుండాలి. తోలు వొలుస్తా జాగ్రత్త!” గద్దించాడు- ముక్కు మీద ఏదో వాలబోతే తల విదిలించిన రిక్రూట్ మాధోసింగ్‌ని. బక్కపల్చటి మాధో, చిగురుటాకల్లే వణికాడు లోపల్లోపల.
ముదిరిన ఎండ. వేడిగాలి ఆ చెవిలోంచి ఈ చెవిలోకి జువ్వున వీస్తోంది.
“మేరా నామ్… హవల్దార్ ఓంబీర్ సింగ్! గుర్తుంచుకోండి.”
క్షణం ఆగాడు. “షోలే కా సింగ్ ‘గబ్బర్’ హై, ఇస్ రేంజ్ కా సింగ్ ఓంబీర్ హై!” గర్జించినట్లే అన్నాడు.
దళసరి కోంబాట్ యూనిఫార్మ్ మీద మరకలని సృష్టిస్తోంది చెమట. “ఫైరింగ్ రేంజ్ కో మజాక్ మత్ సమఝ్‌నా. లేకపోతే రోజంతా ఎండలో ఫ్రంట్ రోల్ చేయిస్తా. మీ బాబాయ్, మావ ఎవడికి చెప్పుకుంటారో చెప్పుకోండి.”
మా గొంతులు ఎండిపోతున్నాయి. “ఫిర్ జిందగీ భర్ నహీఁ భూలోగే హవల్దార్ ఓంబీర్ కో.”
మాటలు ఆపి, లేచి నిలబడ్డాడు. మొహాన్ని మరింత ఎర్రగా మార్చుకుని. “లేయిట్ కే పొజిషన్!” ఖంగున పలికాడు కమేండ్‌ని. రేంజ్ గోడలకి తగిలి మళ్ళీ వినిపించిందా ఆర్డర్.
చటుక్కున నేలమీద పరిచిన టార్పాలిన్ మీదికి బోర్లా పడుకుని పొజిషన్ తీసుకున్నాం. యూనిఫార్మ్ లోంచి ఒంటికి నేల వేడి తగిలింది. “సామ్ నే టార్గెట్!”
రైఫిల్‌కి అమర్చిన వ్యూ ఫైండర్లోంచి చూస్తే, రెండు వందల గజాల దూరాన, మనిషి ఆకారంలో తెలుపు-నలుపుల ‘టార్గెట్’ – దాని మధ్యలో ఓ తెల్లటి చదరం. అది లక్ష్యం.
ముందున్న శాండ్‌బాగ్ మీద రైఫిల్ని మోపు చేసి, దాని మడమని కాలర్ బోన్ కింది కండ మీద బిగించాను. టోపీలోంచి చెమటచుక్క కనుబొమ మీదకు అక్కణ్ణించి బుగ్గ మీదికి జారుతోంది. టార్గెట్లో చదరం నిలకడగా ఉండడం లేదు.
“హెల్పర్స్, పొజిషన్!” ఖాళీ బుల్లెట్ కేసులని సేకరించేందుకు ఒక్కొక్క ఫైరర్ పక్కనా ఒక్కొక్క హెల్పర్ నిలబడ్డాడు.
“డైలీ బ్రెడ్! ఫా-యర్!” అరిచాడు ఓంబీర్.
ఊపిరి బిగబట్టాను. ఎడమకన్ను మూసి, తెల్లటి చదరాన్ని స్థిరం చేసి ట్రిగ్గర్ నొక్కాను.
“ఢాంయ్!” బుల్లెట్ దూసుకుపోయింది. చెవుల్లో గుయ్యిమందో హైపిచ్ కూత. చుట్టుపక్కల చెట్ల మీద వాలిన పక్షులు రివ్వున ఎగిరాయి – నిశ్శబ్దంగా. గన్ పౌడర్ కాలిన వాసన గుప్పుమంది. ఖాళీ అయిన బుల్లెట్ కేస్ – ఛాంబర్లోనుంచి బయటకి గెంతింది. టార్గెట్ వెనక గుట్టలోంచి చిన్న పొగలా లేచింది మట్టి. ‘ఢాంయ్!’మంది మరో రైఫిల్ పక్కనుంచి – చెవుల్ని పూర్తిగా మూస్తూ.
మళ్ళీ నొక్కాను ట్రిగ్గర్. ఇంకోసారి. ఇంకో పదిసార్లు. కుడిభుజం క్రింద రైఫిల్ బట్ వెనక్కి తన్నినప్పుడు కలుగుతున్న నొప్పి ఇప్పుడు బాగా తెలుస్తోంది.
రైఫిళ్ళు ఊపిరి తీసుకుంటున్నాయి. “రిపోర్ట్!”
“ఏక్ ఠీక్.”
“దో ఠీక్.”
…
“నెంబర్ ఆఠ్ రైఫల్ ఠీక్” చివరి ఫైరర్ చెప్పేడు బిగ్గరగా.
“ఖాలీ ఖోఖా రిపోర్ట్!”
“ఏక్ ఠీక్.”
“దో ఠీక్.”
…
“నెంబర్ ఛే ఖాలీ ఖోఖా ఏక్ కమ్ హై సర్” ఆరో ఫైరర్‌కి హెల్పర్‌గా చేసిన మాధో గొంతు భయంగా కీచుగా వుంది.
“ఖడా హో!”
అందరం నిలబడ్డాం. గన్ పౌడర్ వాసన గాలికి కొట్టుకుపోయింది.
“ఓయ్, ఖడే హోజావ్ హరామ్ ఖోరోఁ!” ఓంబీర్ గొంతులోంచి తిట్ల వర్షం మొదలైంది. “ఢూండోఁ సాలోఁ. జబ్ తక్ వో ఖాలీ ఖోఖా నహీఁ మిల్తా తబ్ తక్ కోయీ రేంజ్ సే బాహర్ నహీఁ నిక్‌లేగా ఆజ్…”
ఒక్క ఉదుటున ఆ టార్పాలిన్ మీదా, దాని చుట్టుపక్కలా ఆ ఖాళీ కేస్ కోసం వెదుకులాట మొదలైంది.
“హెల్పర్ కోన్ హై? ఇలా రారా మాదర్చోద్!” మొరిగాడు ఓంబీర్.
పరుగుతో అతని ముందు నిలబడ్డాడు హెల్పర్‌గా చేసిన మాధో – అటెన్షన్‌లో.
“ఫ్రంట్ రోల్ షురూ కర్!”
“సర్…”
“షురూ కర్ బెహన్చోద్!” వాతలా వదిలాడు బూతుని.
ఎర్రటి ఎండలో మాధో ఫ్రంట్ రోల్స్ (కాళ్ళు మడిచి వీపుతో గుండ్రంగా దొర్లడం) మొదలుపెట్టాడు. ఆ బాధ మా అందరికీ తెలుస్తోంది.
పీటీ డ్రస్‌లో కాకుండా, పూర్తి కాంబాట్ యూనిఫార్మ్‌లో ఉన్నప్పుడు ఫ్రంట్ రోల్ చెయ్యడమంటే, నరకమే. రైఫిల్ నేలకి జారిపోకుండా అడ్డంగా పొట్టా తొడలతో అదిమిపట్టి ముందుకి గుండ్రంగా మొగ్గవేసినప్పుడు, వీపుకి కట్టుకున్న ‘ఛోటా పిఠ్ఠూ’లోని చెక్క ఫ్రేమ్ నిర్దాక్షిణ్యంగా వీపుకి గుచ్చుకుంటుంది. అక్కడి చర్మం చీరుకుపోతుంది – సైలెంట్‌గా. మొదటిసారికన్నా, తర్వాత్తర్వాత చేసే రోల్స్ మరీ బాధ.
ఒకటి. రెండు. ఎనిమిది… ఫ్రంట్ రోల్స్ చేస్తూనే ఉన్నాడు మాధో.
ఉన్నట్టుండి ఒక రిక్రూట్ అరిచాడు. “సర్, మిల్ గయా!” ఖాళీ కేస్ దొరికింది. చెమటలు కక్కుతూ లేచి నిలబడ్డాడు మాధో. కళ్ళు తిరుగుతున్నట్టుంది – తూలుతున్నాడు.
పులిలా రెండంగల్లో వచ్చి వాలాడు ఓంబీర్. “ఎవడ్రా ఆగమన్నది? సాలే రిక్రూట్? బామ్మ గుర్తొచ్చిందా ఏం?”
“…”
“చల్! ఇక్కణ్ణించి – ఆ గేట్ దాకా – ఫ్రంట్ రోల్ షురూ కర్!” దూరంగా ఉన్న రేంజ్ ఎంట్రెన్స్ గేట్‌ని చూపిస్తూ బిగ్గరగా అదిలించాడు.
“వదిలేయ్ ఓంబీర్, చచ్చేలా ఉన్నాడు!” కొద్ది దూరంలోని టెంట్ లోంచి ఇంకో సీనియర్ కేకేశాడు.
పట్టించుకోలేదు ఓంబీర్. మళ్ళీ బూతుతో వాత పెట్టాడు. విధిగా మళ్ళీ ఫ్రంట్ రోల్స్ మొదలెట్టాడు మాధో. పది నిముషాల తర్వాత స్పృహ తప్పాడు.
“ఆ రోజు రేంజ్‌లో వీపుకి తగిలిన గాయాలు తగ్గడానికి పదిరోజులు పట్టింది.”
“అబ్బా.”
“రెండేళ్ళ క్రితం ఏదో కోర్స్ చేస్తున్నప్పుడు కనబడ్డాడు. తనూ అక్కడే ఇంకేదో కోర్స్ చెయ్యడానికి వచ్చాట్ట.”
“పలకరించాడా నిన్ను? మనిషేమైనా మారాడా?”
“నన్నసలు గుర్తే పట్టలేదు. అదే పొగరు, అదే నోటి దురుసుతనం. కోర్స్ చేస్తున్నప్పుడు ఎవరో ఇన్‌స్ట్రక్టర్‌తో గొడవైంది. అక్కడి సీవో మంచివాడు కాబట్టి బతికిపోయాడు. లేకపోతేనా…”
అవును. నోరు అదుపు తప్పితే ఆర్మీ క్షమించదు.
“ఇప్పుడెక్కడున్నాడో?”
“ఏమో. హవల్దార్ గానే రిటైరై పోయుంటాడు.”
“అదేంటి? జేసీవో కాలేదా?”
“కష్టం. ఐడెంటిటీ కార్డూ, పే బుక్కూ పోగొట్టుకోవడం నాకు తెలుసు. టికెట్ అడిగిన టీటీఈతో కూడా గొడవ పెట్టుకుని కొట్టబోతే, మూడురోజులు రైల్వే జైల్లో పెట్టారని విన్నాను.”
“అదేం కథ?”
“కోర్స్ పూర్తయిపోయిన మర్నాడు మా బ్యాచ్ వాళ్ళం కొందరం లీవ్ మీద ఇళ్ళకి వెళ్తున్నాం. ఆ ట్రైన్లోనే ఓంబీర్ కూడా కనబడ్డాడు, కొత్త యూనిట్‌కి పోస్టింగ్ వెళ్తూ.”
“ఓహో!”
“అతన్తో బాతాఖానీ వేసుకున్నా ఆ బూతులూ అవీ భరిస్తూ. ఒళ్ళెరగకుండా నిద్రపోయాడు మందుకొట్టి. నేనే అతని సామాను దించేశా.”
“ఎంతైనా గురువే కాబట్టి, కృతజ్ఞత చూపించావా?”
“అలాంటిదే అనుకో.”
“అంటే?”
“మధ్యలో ఒక స్టేషన్లో అతని ట్రంక్ పెట్టె దించేశాను. ఒకచోట బాగ్, ఇంకోచోట షూస్… రైల్లోంచే విసిరేశాను బయటికి.”
“అరె!” ఆశ్చర్యంతో కలిసింది నవ్వు. “మరి నువ్వు…”
“మా స్టేషన్‌లో, అతనికంటే రెండు గంటలముందే దిగిపోయాను.”