అమ్మ

మధ్యాహ్నం అన్నాలు తిన్నాక పెరట్లో అంట్లు తోముతున్నాను. అమ్మేమో బయట మామిడిచెట్టు కింద కూచుని వెదురు బుట్ట అల్లుతోంది. చేతిలో ఉన్న ఆర్డర్లను త్వరత్వరగా పూర్తి చేసేందుకు, ఆమె సన్నని వేళ్ళు వెదురు బద్దల్ని వడివడిగా బుట్టకి వేసిన ఫ్రేమ్ చుట్టూ అల్లుతున్నాయి. నా ఇద్దరు చిన్న తమ్ముళ్ళేమో బయట ఆడుకుంటున్నారు. నా తర్వాతి వాడు ఒళ్ళు వెచ్చబడి ఇంట్లో నిద్ర పోతున్నాడు.

అకస్మాత్తుగా బయట నుంచి అమ్మ ఏడవటం వినిపించింది. ఇంత ఎర్రటి ఎండలో పడి ఎవరొచ్చారా అని కూచున్న చోటు నుంచే మెడ సాచి చూడ్డానికి ప్రయత్నించాను. బాబాయి తాత్యా, మరో ఇద్దరిని వెంటేసుకొచ్చి కనిపించాడు.

గబుక్కున లేచి అప్పుడే కడిగిన జగ్గులో, పీపాలోంచి చల్లని నీళ్ళు నింపి తీసుకువెళ్ళాక గమనించాను, బాబాయి పక్కన ఎవరో కొత్తాయన, చూడ్డానికే తేడాగా ఉన్నాడు మంత్రగాడేమో అనిపించేట్టు. గొంగళి పురుగులు కమ్ముకున్నట్టు ఆయన రింగుల జుట్టు. మొహంలో ఏదో దాపరికం కనిపిస్తోంది. నేను తెచ్చిన నీళ్ళ జగ్గు బాబాయి ఆయనకిచ్చి “ఇదిగో వాహినీ, ఇక ఆపుతావా ఏడుపు? చూడు హెడ్మాస్టరమ్మా (మా నాన్న హెడ్మాస్టర్ గాబట్టి అమ్మను అలా పిలుస్తారంతా) సమయం ముంచుకొస్తే ఎవరైనా పోవాల్సిందే. ఏడిస్తే పోయిన వాడు తిరిగొస్తాడా చెప్పు?”

అవునంటూ తలూపారు వెంటొచ్చిన ఊరివాళ్ళు.

“ఆయన బంగారపు బూడిదై గాలిలో కలిసిపోయాడు. ఆయన వదిలి వెళ్ళిన పిల్లల సంగతేంటి? వాళ్ళ జీవితం ముందుకు సాగాలిగా?”

నెల రోజుల క్రితం ముప్ఫై అయిదేళ్ళ మా నాన్న ఒంటికి నీరు పట్టి చనిపోయాడు. అప్పటి నుంచి ఇంటికి ఎవరు పరామర్శకు వచ్చినా ఇవే మాటలు. అమ్మేమో ఏడుపు. ఎంత ఏడుస్తున్నా బుట్టలు మాత్రం అల్లుతూనే ఉండేది. నాలుగు పొట్టలు నింపాల్సిన బాధ్యత ఆమెది. కొంగున ఒక్క కానీ కూడా ఉండేది కాదు.

ఇవాళ బాబాయిని చూడటంతోనే లోపలికి వచ్చి ఏడిచింది. ఇవాళెందుకో ఆ ఏడుపు కొత్తగా ఉంది, దేన్నో వద్దనుకుంటూ భయపడుతున్నట్టు. ఏడుస్తూనే నాక్కొన్ని పన్లు పురమాయించింది.

“శాంతా, వెళ్ళి పొయ్యి వెలిగించి రొట్టెలు చేసి బాబాయికి భోజనం వడ్డించు.”

అమ్మ ఏడుపు చూస్తుంటే గొంతులో బాధ ఉండ కట్టి అడ్డం పడింది నాకు. కన్నీళ్ళు జలజలా రాలాయి. ఏడుస్తూనే ఉన్న పిండి మొత్తం కలిపి రొట్టెలు చేశాను. బుట్టలో ఉన్న ఎండు రొయ్యలు తీసి నిప్పుల మీద కాల్చాను. ఉప్పు రొయ్యలు కాలుతున్న వాసన ఉన్నదంతా ఒకే గది కావటాన ఇల్లంతా వ్యాపించింది. వంట పూర్తయ్యాక బాబాయిని లోపలికి పిలిచాను. ఆయనతో పాటు ఆ మంత్రగాడు కూడా వచ్చాడు.

అందరూ భోజనానికి కూచున్నారు. నా ఇద్దరు తమ్ముళ్ళూ తినడం ముగించి అక్కడే నిల్చున్నారు చూస్తూ.

“కృష్ణ ఎందుకు రోజంతా నిద్రపోతూనే ఉన్నాడు? ఏమైంది?” అడిగాడు బాబాయి.

“జ్వరం.”

బాబాయి మంత్రగాడి వైపు చూశాడు. ఇద్దరూ కళ్ళతోనే ఏదో మాట్లాడుకున్నారు. భోజనాలయ్యాక గ్రామస్థులు తాంబూలం వేసుకోడానికి వరండాలోకి నడిచారు.

బాబాయ్ కృష్ణ మంచం పక్కనే కూచుని అమ్మతో ఎంతో ఆదుర్దా చూపిస్తూ అన్నాడు “వాహినీ, వీడి గతి చూడు ఏమైందో? పిల్లాడిని కాపాడుకోవాలని లేదా నీకు?”

“మరిదిగారూ, ఏం మాట్లాడుతున్నారు మీరు?” నా పధ్నాలుగేళ్ళ జీవితంలో ఇంత కోపంగా అమ్మ మాట్లాడ్డం ఎన్నడూ చూళ్ళేదు.

బాబాయ్ పట్టించుకోలేదు. “అసలేంటి నీ ఉద్దేశం? అర్జున్ (మా నాన్న) చనిపోయినపుడే, ఈ ఇల్లు వదిలేసి వూరికి వచ్చేయమని చెప్పాను. అక్కడ ఇల్లుంది, పొలం ఉంది. మామిడి చెట్లు, పనస చెట్లు ఉన్నాయి మనకి.”

“మరి పిల్లలకు చదువెలా ఒంటబడుతుందంటారు అక్కడ?”

“ఎందుకు ఒంటబట్టదు? ఊళ్ళో బడి లేదా? అంటే వూళ్ళో పిల్లలెవరూ బడికి పోరని అనుకుంటున్నావా ఏంటి నువ్వు?”

“బడికి పోకేం? పోతారు. చదువే రాదు గానీ. ఇక్కడైతే నా పిల్లలు బ్రాహ్మలు, కోమట్ల పిల్లల్తో కలిసి స్కూలుకు వెళ్తారు. వాళ్ళలాగే చక్కగా మాట్లాడ్డం, ప్రవర్తించడం నేర్చుకుంటారు.”

“మన ఊళ్ళో కోమట్లు లేరనుకుంటున్నావా? వాళ్ళ పిల్లలు బడికి పోరా? ఇదిగో వాహినీ, ఒక మాట. ఇక్కడ ఉంటే నీ పిల్లలు పెద్దకులాల మధ్య అవమానాలు పడతారు, ఆలోచించుకో.”

“కులాల తేడాలు పల్లెటూర్లలో ఉండవా? ఇంకా చెప్పాలంటే అక్కడ అవి మరీ ఘోరంగా ఉంటాయి.”

“కావచ్చు. కానీ అక్కడ అలాటివి జరిగితే మన వాళ్ళంతా నీకు అండగా నిలబడతారు. ఇక్కడెవరున్నారు నీకు పట్నంలో?”

“అర్జున్ చెప్పేవారు. పల్లెలు విడిచి పట్నాలకు మనం వలస వెళ్ళాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవారట.”

“ఆఁ, నాకు చెప్పు ఆ ప్రవచనాలన్నీ. పట్నానికి వచ్చి ఏం తింటారు? మట్టా? పిల్లలకేం పెడతావు?”

“నా చేతుల్లో బలం ఉంది. బుట్టలు అల్లుతాను.”

“ఆ పనేదో మనూర్లో కూడా చేసుకోవచ్చుగా?”

“చేయచ్చు. కానీ డబ్బులిచ్చి ఊళ్ళో బుట్టలెవరు కొంటారు. అర్జున్ రక్తాన్ని చెమటగా మార్చి ఈ గుడిసె కట్టాడు. దీన్ని వదిలి నేను రావడం కల్ల.”

“మరే, అందుకే వాడి రక్తం నీళ్ళుగా మారి ఒంటికి నీరొచ్చి పోయాడు. సరే, ఇక చెప్పడానికేం లేదు. నీ నిర్ణయం బాలేదు. అసలీ నేలలోనే ఏదో గాలో దెయ్యమో ఉంది. పాడు నేల ఇది.”

అమ్మ, బాబాయి చాలాసేపు వాదించుకున్నారు. ఈ ఇల్లు వదిలి పల్లెకు వచ్చేయమని బాబాయి, ససేమిరా కుదరదని అమ్మ! బాబాయికి చాలా కోపం వచ్చింది కాని, దాన్ని అణుచుకుని ప్రశాంతంగా మాట్లాడ్డానికి ప్రయత్నించాడు.

“వాహినీ, నేను చెప్తే నమ్మవు. అందుకే సోమశేఖర్ బువాని (ఆ మంత్రగాడు) నాతో తీసుకొచ్చాను. ఆయనకి గతం, భవిష్యత్తు అన్నీ తెలుస్తాయి. ఈ నేల ఎంత కీడుమారిదో ఆయన చెప్తాడు నీకు. తర్వాత పిల్లల్ని తీసుకుని నాతో వూరికి వచ్చెయ్.” చెప్పేసి వరండాలోకి వెళ్ళిపోయాడు బాబాయి. అమ్మ ఇదేం పట్టించుకోకుండా తన పనిలో పడిపోయింది.

అమ్మకి ఇంత తలపొగరెందుకో అర్థం కాదు. కోపంగా ఉంది. బాబాయి మేము చెడిపోయే సలహాలేం ఇవ్వడుగా? అదీగాక అసలు ఊళ్ళో ఎంత బాగుంటుంది. మామిడిపళ్ళు, పనసపళ్ళు, కొండ మీద రకరకాల అడవిపళ్ళు, ఇంటి చుట్టూ దడుల మీద కాసే దోసకాయలు, పుచ్చకాయలూ… ఎన్నెన్ని దొరుకుతాయని? నదిలో స్నానం చేసి ఆడుకోవడం ఎంత హాయి! ఇవన్నీ వదిలేసి ఇక్కడ కూచుని బుట్టలు అల్లుతానంటుంది. కానీ ఇదంతా అమ్మతో అనే ధైర్యం లేకపోయింది.

సాయంత్రానికి అమ్మ బుట్ట అల్లడం పూర్తి చేసి చీర మీద పడిన పొట్టంతా దులుపుకుని లేచి దీపం వెలిగించింది. కృష్ణ నుదుటి మీద చెయ్యేసి చూసి “శాంతా, వీడికి జ్వరం బాగా ఎక్కువైంది. ఆ గూట్లో వస కొమ్ముంటుంది. అరగదీసి పట్టుకురా” అంది.

బాబాయి అమ్మ మాటలు విని “వదినా, వస కొమ్ముతో తగ్గడానికి వాడి జ్వరం మామూలుది కాదు. ఇంట్లో కోడేదైనా ఉందా?” అన్నాడు.

అంటుండగానే బయట బుట్ట కింద పట్టేసిన కోడి కీచుమని అరిచింది. అమ్మ నా వైపు చూసి నోరు మూసుకుని ఉండమని కళ్ళతో హెచ్చరించింది.

బాబాయి, సోమశేఖర్ బువాని ఇంట్లోకి రమ్మన్నాడు. ఇద్దరూ కృష్ణని కూచోబెట్టి, వాడికి జ్వరం తగ్గించే ఏర్పాట్లు మొదలెట్టారు. బువా మామిడి కొమ్మలను ఎడమ నుంచి కుడికి నేల మీద కొడుతూ “పడి పోవాలి జ్వరం” అంటూ గొణిగాడు.

కుంకుమ లేని అమ్మ బోసిమొహం దీపం వెలుగులో మరింత దిగులుగా కనిపించింది. ఇద్దరు తమ్ముళ్ళూ అమ్మకు భయంతో అంటుకుపోయారు.

బాబాయి బుట్ట కిందనుంచి కోడిని లోపలికి తెచ్చాడు. కృష్ణ మొహాన విభూది, కుంకం బొట్లు పెట్టి, కోడిని కృష్ణ ఒంటి మీదుగా ఆనించి తిప్పారు. చుట్టూ కుంకం చల్లాడు బువా. బాబాయి కోడిని చూపిస్తూ “ఈ చోటు యజమానికి విన్నవించుకుంటున్నాను. ఈ చోటు వదిలి పెట్టి పోతాం మేము. ఈ పిల్లవాడిని వదిలిపెట్టి పో మహరాజా” అని ప్రార్థించాడు.

బాబాయి, బువా ఇద్దరూ చీకట్లో పెరట్లోకి అదృశ్యమయ్యారు. ఈ లోపు ఊళ్ళోవాళ్ళు కూడా తిరిగొచ్చారు. బాబాయి కోడిని కోసి తెచ్చిచ్చి, “శాంతా, కూర వండు” అని ఊళ్ళోకి నడిచాడు.

చీకటి పడుతోంది. బాగా తాగేసి వచ్చాడు బాబాయి. “వా… వాహినీ, ఖర్చు గురించి భయపడకు. కానీ ఈ నేల ఎంత కీడుదో నీకు చూపిస్తా నేను” మాటలు తడబడిపోతున్నాయి.

ఆ రాత్రి అందరం, కోడి కూరతో అన్నం తిన్నాం. గ్రామస్తులు తర్వాతి పన్లో పడ్డారు. నిమ్మకాయలకు సూదులు గుచ్చి, కుంకం, విభూది, కొబ్బరికాయ, అగరొత్తులు, కర్పూరం వంటివి సిద్ధం చేశారు.

“వాహినీ, నేను కృష్ణ దగ్గర కాసేపు కూచోవాలి. అందర్నీ బయటికి తీసుకుపో.”

బువా వెనక అందరం బయటికి నడిచాం. కొద్ది దూరం నడిచి ఆగిపోయి బరువుగా వింతగొంతుతో “ఇక్కడే ఏదో ఉంది” అన్నాడు నేలను చూపిస్తూ. ఆ మసక వెలుగులో రింగులు తిరిగిన బువా జుట్టు, అక్కడేదో ఉందన్నట్టు కీచుగా వినిపించిన ఆయన గొంతు విని, అందరికీ హడలు పుట్టి గుండెలు గొంతుల్లోకి వచ్చాయి.

బువా నేలను జాగ్రత్తగా వెతుకుతున్నట్టుగా చూశాడు. ఒకచోట ఏడు చదరపుటంగుళాల స్థలాన్ని శుభ్రం చేసి పేడతో అలికాడు. కుంకం చల్లి, కర్పూరం వెలిగించాడు. గునపం తీసుకుని అడుగు లోతు తవ్వి ఆ గోతిలో చెయ్యి పెట్టి “ఇదుగో చూడండి, ఇదిగో దొరికింది” అంటూ చెయ్యి పైకి తీశాడు.

చేతి నిండా రక్తం కారుతోంది.

“చూడు పంతులమ్మా, ఇది బలి రక్తం. ఈ స్థలం సరిహద్దు గొడవల్లో ఉంది. కీడు నేల. ఇంకా ఇంకా రక్తాన్ని కోరుతుంది” అని మళ్ళీ గోతివైపు చూసి ప్రార్థించాడు. “స్థల యజమానికి విన్నపం. మహారాజా, నీ శక్తి ఏంటో చూపించావు నువ్వు. ఈ స్థలాన్ని వదిలి వెళ్ళిపోతాం. ఈ పసిపిల్లల మీద దయ ఉంచు. ఏదో మాకు తోచినంత మేము సమర్పించుకుంటున్నాం” అని కొబ్బరికాయ కొట్టాడు.

లోపలి నుంచి చీకటిని చీలుస్తూ బాబాయ్ గొంతు “వాహినీ, వాహినీ, ఇలా రా, కృష్ణ… కృష్ణకి చూడు ఏమైందో!”

అందరం లోపలికి పరిగెత్తాం. కృష్ణ నురగలు కక్కుతున్నాడు. కళ్ళు తేలేశాడు. అమ్మ గుండె పగిలిపోయింది. “అయ్యో దేవుడా నా బిడ్డ, చూడండయ్యా నా బిడ్డకేమైందో” గోలుగోలున ఏడుస్తోంది.

“చూడు! మనం ముందే జాగర్త పడివుంటే ఇలా జరిగుండేదే కాదు. పోన్లే ఇప్పటికైనా కళ్ళు తెరిచావు” వేడి మీద ఉన్నపుడే ఇనుము మీద దెబ్బ పడాలన్నట్టు అమ్మని మరింత బెదరగొట్టాడు బాబాయి.

“అమ్మా, మేము బాబాయితో రేపు ఊరెళ్ళి పోతున్నాం. నీకు కావలిస్తే నువ్విక్కడే ఉండు!” నా కోపం కట్టలు తెంచుకుంది. బాబాయికి కావల్సింది కూడా అదే.

“శాంతా, వెళ్ళి నీ బట్టలు సర్దుకో. ఊరెళ్ళిపోదాం. నిన్ను నేను చదివిస్తాను. ఆ మాత్రం స్థోమత లేకపోలేదు నాకు!”

ఆ రాత్రి భయంతో మేమిద్దరమూ నిద్ర పోలేదు. తమ్ముళ్ళిద్దరూ అమ్మ కొంగుని గుప్పెట్లో బిగించి పట్టుకుని పడుకున్నారు. గ్రామస్తులంతా వరండాలో గుర్రుపెడుతూ నిద్రపోయారు. అమ్మ మాత్రం కృష్ణ నుదుటి మీద తడిగుడ్డ వేస్తూ మేలుకునే ఉంది.

తెల్లవారుజామున నిద్రమత్తులో ఉండగా, కృష్ణ గొంతు వినపడింది. “అమ్మా, రాత్రి మీరంతా బయటికి వెళ్ళినపుడు బాబాయి నాకేదో మందు ఇచ్చాడు. అది తాగాక ఏమైందో నాకు తెలీదు.”

నేను నిద్ర లేచేసరికి బయట బాబాయ్ అరుపులు వినపడుతున్నాయి. గ్రామస్తులంతా ఇళ్ళకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అమ్మ మౌనంగా బుట్ట అల్లుకుంటోంది. మొహంలో భయం లేదు. కోపంతో జేవురించి ఉంది.

“శాంతా, వెళ్ళి నీ బట్టలు సర్దుకో, పిల్లల్ని లేపి తీసుకురా. ఈవిడ మీ తల్లి కాదు. గత జన్మ శత్రువు. మిమ్మల్ని చంపేదాకా నిద్ర పోదు!” కోపంతో చిందులు తొక్కుతూ లోపలికి నడిచాడు బాబాయి.

బయట అమ్మ గొంతు విప్పింది. శ్రద్ధగా ఏదో పద్యమో, కీర్తనో పాడుతున్నట్టుగా ఉంది. పెద్దగా మాట్లాడుతోంది.

“నా పెనిమిటీ, మహరాజా, నా యజమానీ, నా ప్రాణం నువ్వు. నన్నూ పిల్లల్నీ ఒంటరివాళ్ళను చేసి పోయావు. నీ తమ్ముడు తాత్యాని నమ్మొద్దని చెప్తూనే ఉన్నావు. సరిగ్గానే చెప్పావయ్యా నువ్వు. వాడు రాత్రి నీ కొడుక్కి విషం తాగించాడయ్యా. వాడికి స్పృహ పోగొట్టాడు. ఎర కోసం ఎదురు చూస్తున్న కాకుల్లా తయారయ్యారయ్యా వీళ్ళంతా. ఈ నేల అమ్మాలని చూస్తున్నారయ్యా. నేనేం చేయాలిప్పుడు?”

అమ్మ ఇంత సూటిగా, ధైర్యంగా తన కుతంత్రం గ్రహించి, దాన్ని బయటపెట్టి దెబ్బ కొడుతుందని బాబాయి ఊహకి కూడా రాని విషయం. దిమ్మ తిరిగి పోయింది. అకస్మాత్తుగా ఆయన ధైర్యం అంతా నీళ్ళుకారిపోయి, పిల్లిలా జారుకుంది. వరండాలోకి వచ్చి, అమ్మ మొహం వైపైనా చూసే ధైర్యం చేయక వడివడిగా నడుస్తూ వీధి మలుపులో మాయమైపోయాడు.

(ఆంగ్లానువాదం: Veena Deo)