ఈ కథ నా జీవితంలో జరిగిన ఒక అసాధారణమైన, ఉహూఁ, కాదు… ఒక అద్భుతమైన సంఘటన గురించి.
ఏం చెప్పగలను నేను? అలా జరిగిపోయిందంతే.
ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరం, నెల, తేదీ ఈ వివరాలన్నీ అనవసరం.
ఆ రోజుల్లో నేను అద్దె ఇంటికోసం వెదుకులాటలో ఉన్నాను. నిజానికి ఎప్పుడూ ఇంటికోసం వెదుకుతూనే ఉండేవాడిని. నాకు నచ్చే ఇల్లు ఒక పట్టాన దొరకలేదు. నేను బస చేస్తున్న హోటల్ అనబడే వసతి గృహంలో వంద లొసుగులున్నాయి. ఎవరికి ఫిర్యాదు చేసినా లాభం లేదు. పోనీ ఖాళీ చేసి పోదామంటేనా? ఎక్కడికి పోవాలి? ఇల్లేదీ?
నాకు నచ్చని ఇళ్ళను లెక్క పెట్టడం కూడా మానేశాను. వాటిని ఎవరో ఒకరు నచ్చి చేరిపోయేవాళ్ళు. కొన్నాళ్ళకి అద్దె ఇళ్ళకు కరువొచ్చి పడింది. ఒకప్పుడు పది రూపాయలకు దొరికిన ఇళ్ళు ఇప్పుడు అరవై పెట్టినా దొరికేట్టు లేవు.
రోజూ నా ఇళ్ళ వేట కొనసాగుతూనే ఉంది. ఒక రోజు మధ్యాహ్నం… నా కంటబడింది, ఆ అందమైన రెండంతస్తుల ఇల్లు ‘భార్గవీ నిలయం.’
పట్నం గజిబిజికి దూరంగా ఉన్నా, మునిసిపాలిటీ పరిధిలోనే ఉంది. గేటుకు వెలిసిపోయి వేలాడుతోంది ఒక చిన్న బోర్డు. “ఇల్లు అద్దెకు ఇవ్వబడును.” ఎంత ముద్దొచ్చిందో ఆ బోర్డు.
పాత ఇల్లు అది. మొదటి చూపులోనే ఏదో తేడాగా అనిపించింది ఒక్క క్షణం. పర్లేదులే, నాకు కావలసింది ఇలాటి ఇల్లే. కింద నాలుగు గదులు, పైన రెండు గదులు, ఒక వరండా. వంటిల్లు, స్నానాల గదీ, నీళ్ళ పంపూ సరే సరి. లేనిదల్లా కరెంటు మాత్రమే. వంటగది ముందే ఒక పాడుబడిన బావి ఉంది. రాతి గోడ దాని చుట్టూ. ప్రహరీ గోడకు మూలగా మరుగుదొడ్డి. ఇంటి ముందే మెయిన్ రోడ్డు. ఇంకేం కావాలి?
ఆశ్చర్యమూ ఆనందమూ కలిగాయి. ఎవరి కన్నూ ఈ అందాల ఇంటి మీద పడలేదెందుకో? ఎంత అందమైనదీమె? నిజంగానే ఎవరూ ఈ యువతి సౌందర్యాన్ని చూడరాదు. పరదా మాటున దాచవలసిన సౌందర్యం ఈమెది… ఇలాటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశాను కాసేపు ఆ ఇంటి గురించి.
గబగబా కావలసిన ఏర్పాట్లు చేసుకున్నాను. స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని రెండు నెలల అడ్వాన్స్ ఇచ్చేశాను. సమయం వృధా చేయకుండా ఇంటి పైఅంతస్తులో చేరిపోయాను. హరికెన్ లాంతరు కొన్నాను. ఇల్లంతా నేనే శుభ్రంగా ఊడ్చి అన్ని గదులూ కడిగాను. చాలా చెత్త, దుమ్ము పేరుకుపోయాయి ఇంట్లో. ఇల్లు కడిగాక ఇల్లంతా శుద్ధి జలం చల్లాను. కింద ఒక గదికి తాళం వేసి ఉండటం చూశాను గానీ పట్టించుకోలేదు.
పరిశుభ్రతా కార్యక్రమం అయ్యాక స్నానం చేశాను. హాయిగా, మనశ్శాంతిగా అనిపించింది. బావి గోడ మీద కూచున్నాను. ఇక్కడ కూచుని హాయిగా పగటి కలలు కనొచ్చు. లేదా ప్రహరీ గోడ చుట్టూ నడుస్తూ ఉన్నా సమయం ఇట్టే గడిచి పోతుంది.
ఇంటి ముందు ఖాళీ స్థలంలో తోట పెంచాలి. గులాబీలూ, మల్లెలూ అయితే బాగుంటుంది.
వంట మనిషిని పెట్టుకుంటేనో? వొద్దులే అదొక తలనొప్పి మళ్ళీ.
ఉదయం స్నానమయ్యాక అల్పాహారానికి హోటల్‌కి వెళ్ళినపుడు ఫ్లాస్క్ నిండా టీ నింపుకుని తెచ్చుకున్నాను. మధ్యాహ్న భోజనం పాత హోటల్ వాళ్ళు పంపుతారు. బహుశా రాత్రి భోజనం కూడా.
అడ్రస్ మారిన సంగతి పోస్ట్‌మాన్‌కి కూడా చెప్పాలి. కొత్త అడ్రెస్ సంగతి ఎవరికీ చెప్పొద్దని కూడా చెప్పాలి.
అందమైన హాయైన ఏకాంతం… పగలూ రాత్రీ. హాయిగా రాసుకోవచ్చు.
బావిలోకి తొంగి చూశాను. గోడల్లో మొలిచిన తీగలన్నీ దట్టంగా విస్తరించి అల్లుకు పోయి ఉండటం చేత లోపల నీళ్ళున్నాయో లేదో తెలీడం లేదు.
చిన్న రాయి తీసి విసిరాను. బుడుంగుమని శబ్దం వచ్చింది. నీళ్ళున్నాయన్నమాట.
ఉదయం పదకొండయింది. ముందు రోజు రాత్రంతా రెప్ప వేస్తే ఒట్టు. హోటల్లో ఖాతా సెటిల్ చేశాను. ఇంటి ఓనర్ని కలిశాను. మడత మంచం, నా గ్రామోఫోను రికార్డులు అన్నీ నీటుగా పాక్ చేశాను. పేపర్లు, అట్టపెట్టెలు, అలమరా, పడక్కుర్చీ అన్నీ సర్దుకుని రెండు తోపుడు బళ్ళ మీద వేసి కొత్త ఇంటికి చేర్చాను.
వాళ్ళేదో భయపడుతున్నట్టుగా సామాను వాకిట్లోనే దింపేసి వెళ్ళారు.
నా సామాను మొత్తం ఇల్లు చేరాక మరింత హాయిగా అనిపించింది. ఇల్లు తాళం వేసి ఈల వేసుకుంటూ గేటు లోంచి బయటికి వెళ్ళి, గాల్లో తేలుతున్నట్టు సంతోషంగా నడవసాగాను.
ఈ కొత్త ఇంట్లో ఏ గ్రామోఫోన్ రికార్డు మొదటగా వింటే బాగుంటుందని ఆలోచించాను. నా దగ్గర వందకు పైగానే రికార్డులున్నాయి. ఇంగ్లీష్, అరబిక్, హిందీ, తమిళం, బెంగాలీ రికార్డులున్నాయి. మలయాళం రికార్డు ఒక్కటీ లేదు. మంచి మంచి గాయకులు పాడుతున్నారు మలయాళంలో. ఆ రికార్డులు కూడా కొనాలి.
ఇవాళ ఎవరి రికార్డ్ వినాలి? పంకజ్ మల్లిక్, దిలీప్ కుమార్ రాయ్, సైగల్, బింగ్ క్రాస్బీ, పాల్ రాబ్సన్, అబ్దుల్ కరీమ్ ఖాన్, కానన్ దేవి, కుమారి మంజు దాస్ గుప్తా, ఖుర్షీద్, జుతికా రాయ్, ఎమ్మెస్ సుబ్బు లక్ష్మి… ఒక ఇరవై పేర్లు మనసులోకొచ్చాయి. ఒక పాట దగ్గర ఆగాను.
“దూర్ దేశ్ మే రహనే వాలా ఆయా” ఎవరి గొంతు అది? ఆడా? మగా? గుర్తు రావట్లేదు. ఇంటికి వెళ్ళగానే చూస్తాను.
పోస్ట్మాన్ని కలిశాను. నేనుంటున్న ఇంటి చిరునామా చెప్పగానే స్తంభించిపోయాడు. “అయ్యో, సార్ ఆ ఇంట్లో ఎవరో ఇంతకుముందు ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే ఆ ఇల్లు ఖాళీగా పడుంది.”
“ఆత్మహత్యా?” కొంచెం కంగారుపడ్డాను.
“పెరట్లో ఆ బావి చూశారా? అందులోనే ఎవరో దూకి చచ్చిపోయారు. అప్పటి నుంచి ఆ ఇంట్లో శాంతి లేకుండాపోయింది. తలుపులు దబదబా అవే కొట్టుకుంటాయి. పంపు తిప్పకుండానే నీళ్ళు వస్తుంటాయి. చాలామంది అద్దెకున్నవాళ్ళు ఇదంతా పడలేక ఖాళీ చేసి వెళ్ళిపోయారు.
తలుపులు దబదబా కొట్టుకోవడం, కొళాయి తిప్పకుండానే నీళ్ళు పోవడం… భయమేసే విషయమే. ఈ దారెంట పోయే ప్రయాణీకులు బయట పంపుల దగ్గర స్నానంచేసి వాటిని తిప్పి వెళ్ళిపోతున్నారు. అందుకే వాటికి తాళాలేశాను” అని ఇంటి ఓనరు చెప్పాడు ఇందుకే కాబోలు. బయట కొళాయి సరే, స్నానాల గదిలో కొళాయికి తాళం ఎందుకు వేసినట్టు మరి?”
పోస్ట్‌మాన్ అన్నాడు “నిద్రపోతున్నవాళ్ళని ఎవరో అదృశ్య వ్యక్తి గొంతు నులుముతుందట. మీకెవరూ చెప్పలేదా?”
రెండు నెలల అడ్వాన్స్ ఇచ్చానే! “ఏం పర్లేదు. ఒక్క మంత్రంతో అదంతా నేను సర్దుబాటు చేస్తాలెండి. నాకు వచ్చిన ఉత్తరాలు మాత్రం ఇక్కడే ఇవ్వండి.” బింకంగా అన్నాను.
ఏదో మాట్లాడాను గానీ కొంత ఆందోళనగానే ఉంది. ఇలాటి అనుభవాల గురించి నేనంతగా పట్టించుకోను. కానీ ఇవన్నీ నిజంగా జరుగుతాయా? ఒకవేళ జరిగితే నేనేం చేయాలి?
హోటల్‌కి వెళ్ళి టీ తాగాను. ఆకలి వేయలేదు. కడుపులో మంటగా అనిపించింది. రోజూ భోజనం పంపమని హోటల్లో ఉన్న వ్యక్తితో చెప్పాను. నా చిరునామా విని “పగలైతే పర్లేదు గానీ రాత్రిపూట హోటల్ కుర్రాళ్ళు అటు రావడానికి భయపడతారండీ. ఒకమ్మాయి ఆ ఇంటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది తెల్సా? ఆమె అక్కడే తిరుగుతుంది అంటారు మరి. మీకు దెయ్యాలంటే భయం లేదా సార్?” అన్నాడు.
అమ్మాయా? చచ్చిపోయింది అమ్మాయి అని తెలియగానే నా భయం సగం ఎగిరిపోయింది.
“అవునా? అదంతా పర్లేదు. దానికో మంత్రం ఉంది.” బొంకాను.
ఆ మంత్రమేమిటో నాకూ తెలీదు. నడుచుకుంటూ దగ్గర్లోని బాంక్‌కి వెళ్ళాను. కొందరు స్నేహితులున్నారు అక్కడ. అందరూ నా మీద కోపగించారు. ‘అదొక దెయ్యాల కొంప. మగవాళ్ళనే ఆ దెయ్యం వేధిస్తుందట తెల్సా?’
ఆ అమ్మాయికి మగవాళ్ళంటే ద్వేషం. బాగుంది వినడానికి.
కొంతమంది స్నేహితులు “భార్గవి నిలయంలో చేరుతున్నానని ముందు ఒక మాట చెప్పలేక పోయావా?” అన్నారు.
“ఇలా జరుగుతుందని నేనేమైనా కలగన్నానా? ముందిది చెప్పండి. ఆ పిల్ల బావిలో ఎందుకు దూకిందట?”
“ప్రేమ” ఇంకో మిత్రుడన్నాడు.
“ఆ అమ్మాయి పేరు భార్గవి. ఎవరినో ప్రేమించింది. 21 ఏళ్ళ వయసు. బి.ఎ. పాసయింది. చాలా గాఢంగా ప్రేమించింది అతన్ని పాపం. వాడు ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. భార్గవి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.”
నా భయం చాలావరకూ తగ్గింది. ఓహో ఇందుకన్నమాట భార్గవికి మగవాళ్ళంటే ద్వేషం!
“భార్గవి నన్నేమీ చేయదు.”
“ఎందుకట పాపం?”
“మంత్రం, మంత్రం.”
“అదీ చూద్దాంగా. ఈ రాత్రికి నువ్వు కేకలు పెట్టకపోతే చూడు!”
ఇంకేమీ మాట్లాడలేదు నేను. ఇంటికి వచ్చేశాను. తలుపులు కిటికీలు అన్నీ తెరిచి ఉంచాను. బావి దగ్గరికి వెళ్ళి నిల్చుని “భార్గవి కుట్టీ?” అని పిలిచాను.
“నీకు నేనెవరో తెలీదు. నాకూ నువ్వు తెలీదు. ఈ ఇంట్లో ఉండటానికి వచ్చాను నేను. నేను మంచివాడిననే అనుకుంటున్నాను మరి. బ్రహ్మచారిని. ఈ ఇంట్లో నువ్వు ఎవరినీ ఉండనివ్వట్లేదని అందరూ చెప్పే పుకార్లు విన్నాను. తలుపులు బాదుతావని, కుళాయి తిప్పి వదిలేస్తావనీ, రాత్రి వేళ అదృశ్యహస్తాలతో మగవాళ్ళ పీకలు నొక్కుతావనీ! ఏం చేయాలి నేను?
“రెండు నెలల అద్దె అడ్వాన్స్‌గా ఇచ్చేశాను. నా దగ్గర డబ్బెక్కువ లేదు. పైగా ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది. ఈ ఇల్లు నీది భార్గవి కుట్టీ. ఈ ఇంటికి నీ పేరు పెట్టడం నాకు నచ్చింది. భార్గవీ నిలయం. ఎంత బాగుంది!
“నా పని చేసుకోడానికి ఈ ఇంట్లో ఉండటం అవసరం. కొన్ని కథలు రాసుకోవాలి నేను. భార్గవీ నీకు కథలంటే ఇష్టమేనా? ఇష్టమైతే చెప్పు, నీకు నేను రాసే కథలన్నీ చదివి వినిపిస్తాను. నీతో నాకే గొడవా లేదు. గొడవకి కారణం కూడా లేదుగా? ఇందాక బావిలోకి చిన్న గులకరాయి విసిరాను. ఇకముందు అలా ఎన్నడూ చేయను. ఒట్టు!
“చూడు భార్గవీ కుట్టీ, నా దగ్గర బ్రహ్మాండమైన గ్రామోఫోన్ ఉంది. వందకు పైగా రికార్డులు కూడా ఉన్నాయి. పాటలంటే ఇష్టమేనా నీకు?”
ఇదంతా మాట్లాడాక నిశ్శబ్దంగా కూచున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాను నేను? నోరు తెరిచి ఎవరినైనా సరే మింగడానికి సిద్ధంగా ఉన్న బావితోనా? గాలితోనా? చెట్లతోనా? ఇంటితోనా?
నేను మాట్లాడుతున్నది నిరూపమైన ఒక భావనతో. భార్గవితో. ఆమెను నేను చూడలేదు. ఇరవయ్యేళ్ళ పడుచుపిల్ల, ప్రేమించినవాడితో భావి జీవితం గురించి ఎన్ని కలలు కన్నదో. కానీ ఆ కలలు? అవును అవి కలలుగానే ఆవిరైపోయాయి. నిరాశ, అవమానం, వంచన. ఆ కలల్ని కూల్చేశాయి కాబోలు.
“భార్గవి కుట్టీ!” పిలిచాను
“నువ్వు అలా చేసుండాల్సింది కాదమ్మా. నిన్ను నిందిస్తున్నానని అనుకోకు. నిన్ను అతడు అంతగా ప్రేమించలేదు. వేరే అమ్మాయిని ఎక్కువగా ఇష్టపడ్డాడు. జీవితం చేదైపోయింది నీకు. అది మాత్రం నిజం. జీవితం మొత్తం చేదుగా ఉండదు తల్లీ. సరే వదిలెయ్, నీ కోసం చరిత్ర ఇప్పుడు పునరావృతం కాదులే.
“భార్గవి కుట్టీ, తప్పుగా అనుకోకు గానీ, నిజంగా ప్రేమ కోసమే చనిపోయావా నువ్వు? ప్రేమ ఒక్కటే శాశ్వతమైన స్వర్ణోదయంలాటిది జీవితంలో. పిచ్చి పిల్ల. నీ పురుష ద్వేషమే నీ అమాయకత్వం కాదూ? సరే, ఎవడో నిన్ను మోసం చేశాడనుకుందాం. వాడు చేసిన పని వల్ల మగవాళ్ళందరినీ అసహ్యించుకుంటావా చెప్పు? లోకాన్ని రంగుటద్దాలతో చూస్తున్నావు నువ్వు. నువ్వసలు బతికుండి ఉంటే, నీ అభిప్రాయం తప్పని తెలుసుకుని ఉండేదానివి. నిన్ను గాఢంగా ప్రేమించే వ్యక్తి నీకు తారసపడేవాడే. ‘నా దేవతవి నువ్వు’ అనే వాడే. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా. ఇంతకే నీ కథ అంతా ఎలా తెలుసుకోవడం నేను?
“సరే, ఇంతకే నేను చెప్పేదేంటంటే, నన్నేమీ చెయ్యకు. నన్ను గొంతు నులిమి చంపేసినా అడిగే దిక్కు లేదు. చెప్పాగా నాకెవరూ లేరని? ఇప్పుడు నువ్వూ నేనూ ఈ ఇంట్లో కలిసి ఉంటున్నాం. ఈ ఇంటికి రెండు నెలల అద్దె ముందుగానే కట్టేశాను. ఈ ఇంట్లో ఉండే హక్కు నాదే. ఒక పని చేద్దాం. కింద ఉన్న నాలుగు గదులూ, బావీ నువ్వు వాడుకో. ఒంటిగాడిని, పైన ఉన్న రెండు గదులూ నేను వాడుకుంటా. ఏవంటావు?”
చీకటి పడింది. హోటలుకి పోయి భోజనం చేసి, ఫ్లాస్క్ నిండా టీ పోయించుకుని ఇంటికి వచ్చాను. టార్చి వెలుగులో, హరికెన్ లాంతరు వెలిగించాను. పసుప్పచ్చ వెలుగు గది నిండా పరుచుకుంది.
టార్చి తీసుకుని కిందకు వెళ్ళాను. కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లో రెణ్ణిమిషాలు నిలబడ్డాను. కిటికీలన్నీ తెరిచి, వంటింట్లోకి వెళ్ళాను. కొళాయి గట్టిగా బిగిద్దామని వచ్చాను గానీ, ఎందుకో వద్దనుకున్నాను మళ్ళీ.
తలుపులన్నీ వేసి పైకి వచ్చి టీ తాగి పడక్కుర్చీలో కూచుని బీడీ వెలిగించాను. రాసుకుందామని అనుకుంటున్నాను. భార్గవి నా కుర్చీ వెనకాలే ఉందనిపించింది.
“నేను రాసుకుంటున్నపుడు ఎవరైనా గమనిస్తూ ఉండటం నాకిష్టం ఉండదు” అన్నాను. తల తిప్పి చూశాను. ఎవరూ లేరు. ఇక రాయాలనిపించలేదు
నా ముందు ఇంకో కుర్చీ వేసి “కూచో భార్గవీ కుట్టీ” అన్నాను. కుర్చీ ఖాళీగా ఉంది.
లేచి పచార్లు ప్రారంభించాను. ఉక్కగా ఉంది. ఆకైనా కదలడంలేదు. కిటికీ లోంచి కిందకు చూశాను. ఒక కాంతి కిరణం, సర్రున దూసుకుపోయింది. ఎరుపా పసుపా నీలమా… ఏ రంగో గమనించలేదు.
వేగంగా ఒక కాంతి కిరణం పరిగెత్తింది.
“నా భ్రమ!” సర్దిచెప్పుకున్నాను.
గదులన్నీ తిరిగాను. కిటికీల దగ్గర నిల్చున్నాను కాసేపు. ఏదైనా చదవాలనుకున్నాను. ఇలా కొన్ని గంటలు గడిచాక ఇక పడుకుందామని పక్క సర్దుకున్నాను.
నిద్ర పట్టక మళ్ళీ లాంతరు వెలిగించాను. గ్రామోఫోన్ రికార్డులు తీశాను. ఏ పాట వినాలి? ఆలోచిస్తుండగానే అకస్మాత్తుగా చల్లని గాలి కెరటం ఒకటి తుఫానులాటి హోరుతో చెవుల్లోంచి పరిగెత్తింది.
మరుక్షణంలో భయంకరమైన నిశ్శబ్దం. భయంతో స్తంభించిపోయాను ఒక్క క్షణం. ఆ నిశ్శబ్దం నన్ను వెయ్యి ముక్కలుగా చేసేస్తుందేమో అనిపించింది.
తెప్పరిల్లి, పాల్ రాబ్సన్ రికార్డ్ తీసి పెట్టాను. తర్వాత పంకజ్ మల్లిక్ వచ్చాడు. “తూ డర్ నా జరా భీ…” నాకు తగ్గ పాటే! ఎమ్మెస్ సుబ్బులక్ష్మితో కచేరీ ముగిసింది. పాటలన్నీ విన్నాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ ప్రశాంతతలో సైగల్ని ఆహ్వానించాలనిపించింది.
‘సోజా రాజకుమారీ సోజా…’
“ఇవాళ్టికి చాల్లే” పైకే అనుకుంటూ గ్రామోఫోన్ మూశాను. లాంతరు ఆర్పేసి టార్చ్ పక్కన పెట్టుకుని నిద్రకు ఉపక్రమించాను. నిద్రపట్టలేదు.
గడియారం టిక్ టిక్ చప్పుడు తప్ప ఇంకేమీ లేదు. మెదడు మెలకువతోనే ఉంది. ఆలోచనలు ముసురుతున్నాయి. ఇన్నేళ్ళ నా ఒంటరి జీవితంలో ఎన్నో వూర్లు తిరిగాను గానీ ఇలాటి వింత అనుభవం ఎక్కడా ఎదురుపడలేదు. ఎవరైనా తలుపు కొడతారా? కొళాయి తిప్పిన శబ్దం వస్తుందా? నా గొంతు ఎవరైనా నొక్కుతారా?
తెలీకుండానే గాఢంగా నిద్రపట్టేసింది. గంటలు గడిచాయి. కనీస కల కూడా రానంత హాయైన నిద్ర.
ఏమీ జరగలేదు.
“శుభోదయం భార్గవి కుట్టీ. థాంక్యూ సో మచ్. ఒక విషయం అర్థమైంది నాకు. నీ గురించి జనం లేనిపోని పుకార్లు రేపుతున్నారని. రేపితే రేపనీ, ఎవరికేంటి?”
నా రోజులన్నీ ఇలాగే గడిచిపోతున్నాయి. అప్పుడప్పుడు భార్గవి తల్లిదండ్రుల గురించి తోబుట్టువుల గురించి కథలు ఊహిస్తూ ఉండేవాడిని. సాధారణంగా రాత్రిపూట రాసుకుంటాను నేను. అదయ్యాక రికార్డులు ప్లే చేసి వినడం అలవాటు. రికార్డ్ ప్లే చేసేముందు రేడియో అనౌన్సర్ లాగా అనౌన్స్ చేసేవాడిని.
“ఇప్పుడు, పంకజ్ మల్లిక్ పాడిన పాట వింటారు. ఆయన గొప్ప బెంగాలీ గాయకుడు. ఈ పాట చాలా విషాదభరితమైంది. ఎదలోని జ్ఞాపకాలను తట్టిలేపే ఈ పాట వినండి” ఇలా.
“గుజర్ గయా వో జమానా కైసా కైసా…”
ఆ ఇంట్లో చేరి రెండున్నర నెలలు గడిచిపోయాయి. చుట్టూ మొక్కలు నాటాను. అవి పూలు పూసినపుడల్లా “ఇవన్నీ భార్గవి కుట్టికే” అనేవాడిని.
ఈ మధ్యలో నేనొక చిన్న నవల రాశాను. తరచూ ఇంటికి స్నేహితులు వస్తుండేవారు. కొంతమంది రాత్రిపూట ఉండిపోయేవారు. అలాటపుడు నేను వాళ్ళు చూడకుండా కిందకు వెళ్ళి చీకట్లోకి చూస్తూ “భార్గవి కుట్టీ, నా స్నేహితులొచ్చారు. వాళ్ళ పీకలు మాత్రం నొక్కకు. వాళ్ళకేదైనా అయితే పోలీసులు నన్ను పట్టుకుంటారు” అని చెప్పేవాడిని.
ఇంటి నుంచి బయటికి వెళ్ళేటపుడు అనేవాడిని, “భార్గవి కుట్టీ, ఇల్లు జాగర్త. దొంగలు గానీ వస్తే, చంపి పారెయ్. కానీ శవాలు మాత్రం ఇక్కడ ఉంచకు. తీసుకుపోయి దూరంగా పడెయ్.”
ఇంటికి వస్తూనే “నేనేలే” అని చెప్పేవాడిని.
మొదట మొదట్లో ఇదంతా రోజూ జరిగేది. కాలం గడుస్తున్న కొద్దీ, భార్గవితో నా సంభాషణలు, వాటి నిడివీ రెండూ తగ్గాయి. కొన్నాళ్ళకి నేను నెమ్మదిగా భార్గవిని మర్చిపోయాను. ఎపుడైనా గుర్తు చేసుకునేవాడిని అంతే.
మానవ చరిత్ర మొదలైనప్పటి నుంచీ కోట్లమంది మరణించి ఉంటారు. వాళ్ళంతా మట్టిలో కల్సి పోయుంటారు. కొన్నాళ్ళకు వారి జ్ఞాపకాలు కూడా మాసిపోతాయి. భార్గవి తలపు కూడా అంతే. భార్గవి లేనే లేదు ఇపుడు ఈ ఇంట్లో. రోజులు మామూలుగా గడుస్తున్నాయి.
ఆ రోజు…
రాత్రి పదవుతోంది. తొమ్మిదింటి నుంచి ఒక కథ రాస్తున్నాను. మంచి ఉత్సాహంగా రాస్తుండగా, లాంతరు కొడిగట్టడం గమనించాను. లాంతరు పట్టుకుని వూపి చూశాను. కిరోసిన్ అయిపోయింది అందులో. అయినా సరే, దీపం పూర్తిగా కొండెక్కే లోపు మరో పేజీ రాయచ్చు అనుకున్నాను. కథలో అంతగా లీనమైపోయాను. దీపకాంతి మరింత తగ్గింది. దీపం వత్తిని కొంత పెంచి తిరిగి రాయడం మొదలుపెట్టాను. మరి కొద్ది నిమిషాలకు మళ్ళీ దీపం కొడిగట్టసాగింది.
రాయడం ఆపాను. వత్తి ఎంత పెంచినా లాభంలేకపోతోంది. నిట్టూర్చి, వత్తి పూర్తిగా తగ్గించి దీపం ఆర్పేశాను.
“వెలుగు కావాలి నాకు. ఎలా వస్తుంది?” నాలో నేను అనుకున్నాను.
కొద్ది దూరంలోని బాంక్ ఉద్యోగి ఇంటికి వెళ్ళి కొంత కిరోసిన్ తెస్తే సరి. ఒక చిన్న సీసా, టార్చ్ లైటూ తీసుకుని మెట్లు దిగి కిందకు వెళ్ళాను. ఇల్లు తాళం వేసి వీధినపడ్డాను. బాంక్ ఉద్యోగి ఇంటి ముందు నిలబడి అతని పేరు పిలిచాను. ఒకడు వచ్చి పక్క గేటు తీశాడు. మెట్లెక్కి పైకి వెళ్ళాను. ముగ్గురు ఉద్యోగులు కూచుని పేకాడుతున్నారు.
“నీ గర్ల్‌ఫ్రెండ్‌ని తెమ్మనకపోయావా కిరోసిన్? ఇంతకీ ఆమె కథ రాయడం పూర్తయిందా?” ఒకడు వేళాకోళమాడాడు.
కథ పూర్తిచేయాలనే తొందరలో ఉండటం వల్ల నేనేమీ జవాబు చెప్పలేదు. బయట వర్షం పడేలా ఉంది. వాళ్ళు కిరోసిన్ సీసాలో పోస్తుంటే “ఒక గొడుగు కూడా ఇవ్వండి. వర్షం పడేలా ఉంది” అన్నాను.
“వెళ్దువు గానిలే, కాసేపు నువ్వూ ఆటలో కూచో” బలవంతం చేశారు. ఆటలో కూచున్నాను గానీ ధ్యాసంతా కథ మీద ఉండటంతో ఎక్కువసేపు ఆడలేకపోయాను.
కిరోసిన్ సీసా తీసుకుని రోడ్డు మీదికి వచ్చాను. వీధిలో ఒక్క దీపమూ లేదు. ఇంటికి వెళ్ళే మలుపు తిరిగాను. వర్షానంతరపు గుడ్డి వెన్నెలలో ప్రపంచమంతా జోగుతోంది. టార్చి వెలుగులో ఆ ఖాళీ రోడ్డు మీద నడుస్తున్నాను. ఒక్క జీవి కూడా లేదు రోడ్డు మీద. ఇల్లు చేరి గేటు తీశాను. ముందు గుమ్మం తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళి గడియ వేశాను. ఊహించనిదేదీ జరుతుందని నేను అనుకోలేదు గానీ…
జరిగింది.
ఎందుకో తెలీదు, అకస్మాత్తుగా, అకారణంగా ఒక దిగులుమేఘం నా మనసంతా కమ్మేసి పెద్దపెట్టున ఏడుపు ముంచుకొచ్చింది. నిజానికి నేను హాయిగా నవ్వగలను గానీ ఎప్పుడూ ఒక్క చుక్కైనా కన్నీరు కార్చి ఎరగను. ఎపుడైనా దిగులో బాధో వేస్తే, ఒక గొప్ప దైవికమైన లోతైన భావన నన్ను కమ్మేసేది. సరిగా ఇపుడు జరిగినట్టే. అలాటి భారమైన మనసుతోనే మెట్లెక్కి పైకి వెళ్ళాను.
అక్కడ కనపడిన దృశ్యం మాత్రం వింతల్లోకెల్లా వింత!
నేను బయటికి వెళ్ళేటపుడు ఆ గదిలో దీపం లేదు. మీకు గుర్తుందిగా? కిరోసిన్ లేకనే దీపం పూర్తిగా మలిగిపోయింది. లాంతర్ ఆర్పేశాకే, ఆ చీకటి గదిలో నుంచే నేను బయటికి వెళ్ళాను. ఇప్పుడు… తలుపు కింద సందులోంచి గదిలో ధారాళమైన వెలుగు కనిపిస్తోంది. కళ్ళ ముందు ఆ వెలుగు కనిపిస్తున్నా, మెదడు దాన్ని అంగీకరించడానికి మొరాయిస్తోంది.
అలవాటుగా టార్చ్ లైట్ వేసి, తాళం చెవితో తాళం తీయబోయాను. తాళం కప్ప వెండి లాగ ధగధగా మెరిసిపోతోంది. అది కిలకిలా నవ్వుతున్నట్లు తోచింది.
అడుగు లోపలికి పెట్టగానే కనపడిన దృశ్యం గొప్ప శక్తితో నన్ను పట్టి బంధించేసింది. ఒక జలదరింత నరనరానా పాకింది. అది భయం కాదు.
కాళ్ళు నేలలో దిగిపోయినట్టు నిలబడిపోయాను. మెదడు నిండా ఆలోచనల తరంగాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.
నీలి రంగు వెలుగు! తెల్లని గోడలు ఆ నీలి రంగు వెలుగులో స్నానం చేస్తున్నాయి. ఆ వెలుగు, వత్తి పూర్తిగా ఆరిపోయిన లాంతరు నుంచి వస్తోంది. గదంతా వెలుగు, కాంతి!
భార్గవి నిలయంలో ఈ నీలి దీపాన్ని ఎవరు వెలిగించారు??
(నీలవెలిచం (The Blue Light). మలయాళం నుంచి ఇంగ్లీష్ అనువాదం: ఒ. వి. ఉష.)