“నేను గ్రోసరీ స్టోరుకు వెళ్ళి పాలు, కూరగాయలు తేవాలి. కొద్ది సేపు శారదను జాగ్రత్తగా చూస్కోండి” అంటూ మల్లి శారదను నాకు అప్పగించి తాను కారు తాళాలు తీస్కొని బయటకు వెళ్ళింది. ఆ రోజు శనివారం. ఉదయం పది గంటలు. శారద మెల్లగా నా పక్కకు చేరింది
“నాన్నా, నాన్నా” అంటూ.
“ఏమమ్మా, అమ్మ వచ్చేవరకు ఏం చేద్దాం మనం?” అని అడిగాను.
“నాన్నా, నాకు నీ హెల్ప్ కావాలి. అమ్మకు నేను స్పెషల్‌గా ఏమైనా మదర్స్‌డేకు ఇవ్వాలనుకొంటున్నా.”
“ఏమివ్వాలనుకొంటున్నావ్, శారదా?”
“అమ్మకు పూలంటే ఇష్టం కదా, నేను ఒక ఫ్లవర్ పాట్ ఇవ్వాలనుకొంటున్నా.”
“మరి స్టోర్‌కు వెళ్ళి కొనాలిగా? అయినా మదర్స్‌డేకు ఇంకా ఒక నెల ఉందే? ఇప్పుడే ఎందుకు ఇంత తొందర శారదా?”
“ఉహూ, అలా కాదు. నేనే ఒక చిన్న కుండీలో మొక్క నాటి దానిని ఇవ్వాలనుకొంటున్నా, అది పెరగడానికి ఒక నెల కావాలి గదా? ఇది అమ్మకు తెలియకుండా రహస్యంగా చేయాలి.”
“అమ్మకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదీ సాధ్యం కాదే. అమ్మకు రెండు కళ్ళు కాదు,
ముందు, వెనుక, పక్కలో, పైనా, కింద – అన్ని చోట్లలో కళ్ళు ఉన్నాయి శారదా!”
“అందుకే నే నిన్నడుగుతున్నా నాన్నా. ఒక పాట్ కొని అందులో పూల మొక్క నాటి నీ ఆఫీసులో ఉంచుతా. నువ్వు దానికి ప్రతి రోజు మరవకుండా నీళ్ళు పోయాలి. ప్రతి శనివారం నేను వచ్చి ఎలా పెరిగిందో చూస్తాను. రెండు మూడు వారాలలో పెరిగే మొక్కను కొనాలి.” అని చెప్పింది శారద. కొద్ది సేపు ఈ పనిని ఎలా కొనసాగించాలో అని ఆలోచించి సాయంకాలమో లేక రేపో గార్డన్ షాప్‌కు ఇద్దరం వెళ్ళడానికి తీర్మానించుకొన్నాము. గంట పదకొండు కావస్తుంది. నే వెళ్ళి కప్పులో కాఫీ నింపుకొని వచ్చి కూర్చొన్నా. శారద శనివారం కార్టూన్‌లు చూస్తూ నవ్వడంలో మునిగి పోయింది. మల్లి ఇంకా ఇంటికి రాలేదు.
మెదడులో మెల్లగా ఆలోచనా తరంగాల సుడులు లేచాయి. శారద ఇక్కడ అమెరికాలో పెరిగింది, ఆరేళ్ళు దానికి. ఇక్కడ బడిలో మదర్స్‌డే ఆచరించడం మామూలే. నేను పెరిగేటప్పుడు అక్కడ ఇండియాలో ఇలాటి రోజులు లేవు. ఉండి ఉంటే బాగుండేది. కానీ నేను మరొక విధంగా అదృష్టవంతుణ్ణి. నాకు ఒక అమ్మ కాదు, ఇద్దరు అమ్మలు. నేను ఆ ఇద్దరిని ఈ నా జీవితంలో అమ్మ అనే తలుస్తాను. ఇద్దరి పేరులను ఎప్పుడూ ఉపయోగిస్తూ ఉంటాను. ఒకరు ఇప్పుడు లేరు. మరొకరు ఇక్కడ లేరు. ఈ కథను రాయాలంటే అది ఒక పెద్ద నవల అవుతుంది. స్థలాభావం వల్ల ఒక రెండు మూడు సంఘటనలను గురించి మాత్రం ఇక్కడ తెలుపుతాను.
ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తు. అప్పుడు నాకు పదేళ్ళు. నీకు ఒక తమ్ముడినో చెల్లెలినో తెస్తానంటూ అమ్మ ఆస్పత్రికి వెళ్ళింది ముందు రోజు. స్కూలులో మూడో పీరియడ్ జరుగుతున్నప్పుడు బంట్రోతు వచ్చి హెడ్‌మాస్టర్ గదికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్తే అక్కడ నాన్నగారు కూడా ఉన్నారు. నాన్నగారికి కూడా అదే బడిలో పని. ఆ బడిలో మొదటి తరగతినుండి స్కూల్ ఫైనల్‌వరకు ఉండేది. వారు సంస్కృత పండితులు. “వెళ్ళొస్తామండీ” అంటూ నాన్నగారు అక్కడినుండి నాతో ఇంటికి బయలుదేరారు. దారిలో ఏమీ మాట్లాడలేదు. అయితే మృదువుగా నాపైన చేతులుంచి నిమురుతూ నడిచారు. ఇంటికి వచ్చే వేళకు ఇంటి ముందు ఒక పెద్ద గుంపే ఉండింది. మమ్మల్ని చూచి అందరూ తప్పుకొన్నారు. నేను లోపలికి వెళ్ళిన తరువాత మొట్టమొదట చూచింది అమ్మను అక్కడ నేలమీద ఒక చాపపైన పడుకోబెట్టి ఉండడం. నాకేం అర్థం కాలేదు. తరువాత తెలిసింది అమ్మ ఇక లేదని. నాకు ఏడుపు కట్టలు తెంచుకొని వచ్చింది. ఒక రెండు రోజులు గడిచాయి. అమ్మ లేక ఇల్లు బోసిపోయింది. నాన్నకు చాలా నిష్ఠాచారాలు ఎక్కువ. అమ్మ పోయిన దుఃఖంతోబాటు చేయవలసిన కార్యాలలో మునిగిపోయారు. నేను ఎప్పుడూ ఒక మూలలో కూర్చొని ఏడుస్తుండే వాణ్ణి. ఒక రోజు అలా ఏడుస్తుంటే ఎవరో పక్కకు వచ్చి నా వీపుపైన చేయి పెట్టినట్లుండింది. నేను వెనక్కి తిరిగి చూచా.
“ఏడవరాదు చంద్రం, ఇలా ఏడుస్తుంటే నీకు జరం, గిరం వస్తే కష్టం. నీ ఆరోగ్యం చెడి పోతుంది.”
“అది సరే, నువ్వెవరు?”
“నేనా, నా పేరు లలిత, కావాలంటే అక్కా అని పిలు.”
“ఉహూ, నేను లలితా అనే పిలుస్తా.”
“నీకో మంచి విషయం చెప్పనా?”
“అమ్మ లేదు. అమ్మ రాదు. మరింకేం మంచి విషయం ఉంది?”
“నీ చెల్లెలు ఆస్పత్రినుండి రేపు వస్తుంది ఇంటికి. ఇంత పెద్ద అన్నయ్య నువ్వు, బుల్లి చెల్లెలు ముందు ఏడవడమా? ఛీఛీ.”
“అలాగా? నాకీ విషయం ఎవ్వరూ చెప్పలేదు. నేను అడిగా కూడా. త్వరలోనే వస్తుంది అన్నారు గానీ ఎవ్వరూ చెప్పలేదు.”
“అయితే లేచి ముఖం కడుక్కో” అంటూ లేపి బాత్‌రూముకు నన్ను తీసికొని వెళ్ళింది లలిత.
అలా మొదటి పరిచయమయింది లలితతో నాకు. లలిత కప్పుడు వయసు సుమారు పద్దెనిమిది లేక పందొమ్మిది ఏళ్ళు ఉంటుంది. అమ్మకు చనిపోయేటప్పుడు ముప్పై అనుకొంటా, నాన్న అమ్మకంటె రెండేళ్ళు పెద్ద. ఇంట్లోనే ఒక దూరపు బంధువు ముసలావిడ ఒకామె ఉండేది. ఆమె చెల్లిని చూస్కొనేది. చెల్లెలయితే ఉష, తమ్ముడయితే సూర్యం అని పేరు పెట్టాలని అమ్మ అనుకొందట. కాబట్టి ఉష అనే మేమంతా పిలిచే వాళ్ళం. ఇలా ఒక ఏడు గడిచింది. అమ్మకు ఆబ్దికాలు కూడా ముగిసింది. ఒక నాడు నాన్నగారన్నారు
“ఒరే చంద్రం, వచ్చే నెల మనం ఊరికి వెళ్తున్నాంరా.”
“ఏ ఊరు నాన్నా? “
“అన్నవరం.”
“అన్నవరంలో ఎవరున్నారు నాన్నా?”
“సత్యనారాయణస్వామి గుడి ఉందిరా.”
“సరే నాన్నా.”
ఊరికి పోయే రెండు రోజులకు ముందు అత్తయ్య వాళ్ళు, ఇంకా ఇద్దరు ముగ్గురు బంధువులు వచ్చారు. నాకు కొత్త బట్టలు కూడా కుట్టించారు నాన్నగారు. నాకిదంతా ఏమీ అర్థం కాలేదు. అయినా కొత్త బట్తలు, మంచి తిండి ఆ వయసులో ఎవరు వద్దనగలరు? తీరా అన్నవరానికి వెళ్ళిన తరువాత తెలిసింది. నాన్న మళ్ళీ పెళ్ళి చేస్కోబోతున్నారని. పెళ్ళంటే ఏమిటో సరిగా అర్థం చేస్కోలేని పరిస్థితి నాది. కానీ అక్కడున్న వాళ్ళందరూ,
“ఒరే చంద్రం, నీకో కొత్త పిన్ని వస్తుందిరా” అని చెప్పడానికి ప్రారంభించారు. చెప్పొద్దూ, నాకు బాగా కోపం వచ్చింది.
“పిన్ని వద్దు, పిన్ను వద్దు, నాకు అమ్మ కావాలి” అనేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
నేను బుంగ మూతితో ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నా. అప్పుడు
“చంద్రం, చెల్లెలికి ఒక ఏడాది అయింది. ఇంకా అన్న అయిన నువ్వు ఇలా ఏడుస్తూ ఉన్నావా?” అంటూ ఒక పరిచితమైన ధ్వని వినబడింది. తిరిగి చూస్తే లలిత. పట్టు చీరతో, పుట్టెడు పూలతో నవ్వుతూ నా ఎదురుగా నిలిచి ఉంది.
“నువ్వెప్పుడు వచ్చావ్ లలితా?”
“నేనేరా నీకు కాబోయే ఆ పిన్నిని.”
ఆప్యాయంగా నవ్వుతూ నా ఎదుట నిలిచి ఉండే లలిత నాకు పిన్ని అవబోతుందా? పిన్ని అంటే చాల చెడ్డదని అన్నాడే బాలుగాడు. బాలుగాడు నా క్లాస్‌మేట్. వాడు అప్పుడప్పుడు చెప్పేవాడు తన పిన్ని తన్ను ఎప్పుడూ తిడుతుందనీ, అప్పుడప్పుడూ కొడుతుందని. లలితను చూస్తే కొట్టేటట్లు లేదే?
“లలితా, నన్ను నువ్వు తిట్టి కొడ్తావా?” అని ధైర్యంగా అడిగాను.
“ఆకాశంలో చంద్రుణ్ణి ఎవరైనా కొడతారా? నువ్వే చెప్పు చంద్రం.”
ఆమె జవాబు నన్ను కొద్దిగా శాంతం చేసిందనే చెప్పాలి.
నాన్నగారి రెండో పెళ్ళి అయింది. అందరం ఇంటికి వచ్చాము. నాకు పెళ్ళిలాటి విషయాలు సరిగా అర్థం చేసికొనే వయసు కాదది. అయినా కూడా నాన్నగారిపైన ఒక విధమైన కోపం వచ్చింది. అమ్మను మరచి పోయారనో ఏమో? నాకిప్పుడు అనిపిస్తుంది నేను నాన్నగారిపై అనవసరంగా కోప్పడ్డానని. నాన్నకు అప్పుడు వయసు ముప్పైమూడు, అంతే. కానీ ఆ కోపం లలితే నా తల్లి స్థానంలో వస్తుందని తెలిసిన తరువాత కొద్దిగా తగ్గింది. ఇంట్లో అందరూ నన్ను లలితను పిన్నీ అని పిలవమని బలవంతం చేశారు. నాన్నగారు ఒక మారు తిట్టారు కూడా
“బొడ్డు కోసి పేరు పెట్టావా, లలితా అని పిలుస్తున్నావ్? సిగ్గు లేదూ, అమ్మతో సమానం నీకు అది. అమ్మ ఉన్నప్పుడు అమ్మను శారదా అని పిలిచే వాడివా ఏం?”
కాని లలితే అన్నది
“మీరు ఊరికే ఉండండి, ఎలా పిలిస్తే ఏం? లలితా అన్నంత మాత్రాన బాంధవ్యాలు మారిపోతాయా?”
అప్పటినుండి నేను ఆమెను లలితా అనే పిలిచే వాణ్ణి. నిరుడు ఇంటికి వెళ్ళినప్పుడు అసలు సంగతి – అంటే బాలుగాడి పిన్ని సమాచారం, పిన్ని అంటే తిట్టి కొట్టుతందనే అప్పట్లో నా తప్పు ఊహను గురించి – లలితతో చెప్పాను.
“అప్పుడే నేననుకొన్నా అలాటిది ఏదో ఉండి ఉంటుందని.”
బాలుగాడి పిన్నిలా కాదు, మరి ఏ పిన్నిలా కాక, నాకు, ఉషకు ఏ లోటు రానీయకుండా పెంచి పెద్ద చేసింది లలిత. ఉష మాత్రం లలితను అమ్మా అనే పిలుస్తుంది. ఈ మధ్యే నాన్నగారు చెప్పగా విన్నా “ఒరే చంద్రం, మీరు పెద్ద వాళ్ళయ్యేవరకు తనకు బిడ్డ పాపలు వద్దందిరా లలిత. తనకూ ఒక బిడ్డ పుడితే తాను కూడా అందరిలా ఒక సవతి తల్లి పిన్ని అయిపోతుందని లలితకు పెద్ద భయం. అందుకే నీ పెళ్ళి తరువాత మీ తమ్ముడు సూర్యం పుట్టాడు.”
నే ముందే చెప్పాను, లలితనుగురించి ఒక నవలే రాయవచ్చని. కాని నేను ఇంకో రెండు మూడు విషయాలు చెప్పి దీన్ని ముగిస్తా. నా కప్పుడు పన్నెండేళ్ళు అనుకొంటాను. సంక్రాంతి సమయం. ఆ వేళకు సరిగ్గా అత్తయ్య రెండో కాంపుకు మా యింటికి వచ్చింది. జనవరి మూడో తేది ఆమెకు కళ్యాణి పుట్టింది. సంక్రాంతి సమయానికి బారసాలకై మామయ్య కూడా వచ్చాడు. ఇల్లంతా కళకళలాడుతూ ఉండింది. బారసాలకు సన్నాహాలు చేస్తున్నారు. నేను పడుకొనే గదిని వచ్చిన చుట్టాలకు ఇచ్చారు. నన్ను పెరటి గడప పక్కన హాలులో పడుకోమాన్నారు కొన్ని దినాలకు. ఉదయం అందరూ స్నానాలకు, తలంట్లకు లేచారు. స్నానాల గదిలో హండాలో నీళ్ళు కాగడానికి పెట్టారు. బహుశా చలిలో ఆ చోటు వెచ్చగా ఉండిందేమో అక్కడ ఒక పాము పడుకొన్నట్లుంది. ఈ హడావిడికి అది మెల్లగా బయటికి వచ్చింది. ఇంట్లోకి వచ్చి నాపైన ఎక్కింది. నేను నిద్రలో ఉన్నా, నా కిదేమీ తెలీదు. అప్పుడు ఆ వైపు పోతున్న లలిత “అయ్యో, పాము, పాము” అని అరిచిందట. ఆ పాము వెళ్ళి ఆమెను కాటేసింది. అయ్యో అని ఆమె పడిపోయింది కింద నా పక్కన. నేను లేచాను. అందరూ చుట్టూ మూగారు. విషం ఎక్కి పోతుందేమో అని భయం. నన్ను మంత్రగాడిని పిల్చుకు రమ్మని పంపారు. మరొకరు ఒక బట్ట తెచ్చి కాటు వేసిన చోట కట్టారు. మంత్రగాడు మా పక్క వీధి వాడు. వాడిని లేపి పిల్చుకు వచ్చా. వాడేమో మంత్రం వేశాడు. ఇంకొకరు కరచిన చోట కొరికి దాన్ని ఉమ్మి వేస్తే మంచిదన్నారు. నాన్నగారు అలా చేయడానికి మొదలు పెట్టారు. ఇంతలో ఎవరో డాక్టర్‌ను పిలుచుకు వచ్చారు. అతడు పాము ఎలాటిదో తెలియాలన్నాడు. మాకందరికీ భయం వేసింది. లలితేమో “మంచి కాలం, నన్ను కరిచింది, చంద్రంను కరిచి ఉంటే” అంటూ ఏడవడానికి మొదలు పెట్టింది. నేను ఆమె దగ్గరికి వెళ్ళి “అమ్మా, అమ్మా” అని ఏడవడానికి మొదలు పెట్టాను. “ఉష్, అమ్మ కాదు, లలిత! నాకేం కాలేదు, అంతా ఆ దేవుడి దయ!” ఇంతలో మరొకరు శివునిపై మంత్రాలను, హనుమంతునిపై మంత్రాలను, గరుడ మంత్రాన్ని జపించడానికి ప్రారంభించారు. అలా ఒక గంట రెండు గంటలయింది. చివరకు లలిత లేచి కూర్చుంది. డాక్టర్ కూడా “ఇక తగ్గినట్లే, ఎందుకైనా మంచిది, ఆస్పత్రికి తీస్కొని వెళ్ళండి” అన్నారు. ఆస్పత్రిలో ఇంజెక్షన్ ఇచ్చారట. తరువాత బారసాల ఇత్యాదులు సక్రమంగా జరిగింది. నా చెవుల్లో ఇప్పుడు కూడా లలిత చెప్పిన మాటలు “నన్ను కరిచింది, చంద్రంను కరిచి ఉంటే” అనే మాటలు ఇంకా గింగురుమంటున్నాయి.
తరువాత బడి చదువు, జూనియర్ కాలేజి చదువు ముగిసింది. నాకేమో ఇంజనీరింగ్‌లోనో లేకపోతే సైన్సులోనో చేరాలని ఆశ. కాని నాన్నగారు బి. ఏ. చదివి తరువాత బి. ఎడ్. చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. నాకేం చేయాలో తోచలేదు. ఒక రోజు రాత్రి నిద్ర రాక అటు ఇటూ చాపపై దొర్లుతూ ఉంటే పక్క గదినుండి లలిత నాన్నగారితో నన్ను ఇంజనీరింగో లేక కనిసం సైన్సులోనైనా (ఖర్చు తక్కువ కాబట్టి) చేర్పించమని బలవంతం చేస్తూ మాట్లాడడం విన్నాను.
“చూడండి, నాకు నగలు చేయమని చెప్పలేదు, కావాలసి ఉంటే నాకున్న ఒకటి రెండు నగలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మన చంద్రం బుద్ధిమంతుడు. చదివితే బాగా ముందుకొస్తాడు. మీరు బడిలో పని చేస్తున్నారు. మీకు ఆ పని తప్ప మరే భవిష్యత్తు ఉంది? వాడి నాల్కపైన అమ్మ శారద నాట్యమాడుతూ ఉంది. ఆ నృత్యాన్ని మనం ఎందుకు ఆపాలి?” చివరకు నాన్నగారు ఒప్పుకొన్నారు.
అలా నేను ఇంజనీరింగ్‌లో చేరి, అక్కడినుండి కంప్యూటర్ సైన్సులో ట్రెయినింగ్ పొంది చివరకు అమెరికాకు వచ్చి రిసెర్చి చేసి యూనివర్సిటీలో పని చేస్తున్నా. పర్డ్యూలో రిసెర్చి చేసేటప్పుడు మల్లిని చూశా. ఒకే చూపులో మన్మథుడు పుష్పబాణాలను ఇద్దరిపైన విసిరాడు. పెళ్ళి చేస్కోవాలని తీర్మానించుకొన్నాము. వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఒప్పుకొన్నారు. ఇక ఈ విషయం ఎలా అక్కడ ఇంట్లో చెప్పడం? నేను నిరుడు ఇండియాకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఫోన్ పెట్టించా. కాబట్టి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఒక రోజు నాన్నగారు బడికి వెళ్ళినప్పుడు లలితతో ఒక గంటసేపు మాట్లాడా. నే చెప్పిందంతా వినింది.
“నాకేమో భయంగా ఉందిరా చంద్రం, మీ నాన్నేమంటారో? అయినా చెప్పి చూస్తాను. రేపు మళ్ళీ నాతో మాట్లాడుతావా?”
“అలాగే.” ఉషను గురించి కొద్ది సేపు మాట్లాడి ఫోన్ పెట్టా.
మర్రోజు మళ్ళీ పిలిచా.
“మీ నాన్న ఒప్పుకోలేదురా, ఎంతో ప్రయత్నించా.”
“మరి ఇప్పుడు నన్నేం చేయమంటావ్?”
“బాగా ఆలోచించు. నాకు ఇంగ్లీషు వచ్చి ఉంటే మల్లితో మాట్లాడి ఉండేదాన్ని.”
“మల్లికి కొద్దిగా తెలుగు ఒకటీ రెండు ముక్కలు మాట్లాడడానికి వచ్చు. తాను నేర్చుకొంది నా దగ్గర.”
“అయితే మల్లిని పిలుస్తావా?”
“ఇప్పుడు ఇక్కడ లేదు, రేపు పిలవమంటా.”
“సరే.”
మర్రోజు శనివారం. ఆ రోజు బడికి సెలవట. మల్లి పిలిచే వేళకు నాన్నగారు ఇంట్లో ఉన్నారు. నాన్నే ఫోన్ తీసికొన్నారు. ఏదో ఒకటి రెండు మూడు ముక్కలు ఇద్దరు మాట్లాడుకొన్నారు. తరువాత మల్లి లలితతో మాట్లాడింది. చివరకు ఒక రెండు మూడు నిమిషాలు నేను కూడా మాట్లాడా లలితతో.
“చంద్రం, నాకేమో అనిపిస్తుంది మల్లి నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తుందని. మీ దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని నా ఊహ. నా కేమో సమ్మతమే. మళ్ళీ మీ నాన్నగారితో మాట్లాడుతా” అంటూ ఫోన్ పెట్టింది. చివరకు అర్ధాంగీకారం ఇచ్చారు నాన్నగారు. మల్లికా చంద్రశేఖరుల వివాహం జరిగింది. పెళ్ళయిన ఎనిమిది నెలలకు మేము ఇండియా వెళ్ళాము. మేము ఆశ, ఆనందం, భయం ఈ మూడు భావాలతో ఇంటికి వెళ్ళాము. లలితకు మమ్ములను చూసిన తరువాత ఎంతో సంతోషమయింది. మల్లి వట్టి మనిషి కూడా కాదు అప్పుడు. అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది. పెళ్ళయిన పద్నాలుగేళ్ళ తరువాత లలిత కూడా అదే స్థితిలో ఉండింది. ఇద్దరు ఒకరి ముఖాలను ఒకరు, ఒకరి కడుపును మరొకరు చూసికొని నవ్వుకొన్నారు. లలిత చెప్పింది మల్లితో
“నువ్వు నాకు ఇంగ్లీషు నేర్పాలి. నీకు నేను తెలుగు చక్కగా నేర్పుతాను.”
ఉన్న మూడు నెలలలో ఇద్దరు ఒకరి భాషను మరొకరు నేర్చుకొన్నారు. ఇప్పుడు లలిత ఫస్ట్ క్లాస్‌గా ఇంగ్లీషు మాట్లాడగలదు! డెలివరీకి ఇక్కడికి రావాలని మేము అనుకొన్నా, ఏడో నెలలోనే శారద పుట్టింది. నా తమ్ముడు సూర్యం మరో పదిహేను రోజుల్లో పుట్టాడు.
ఈ జ్ఞాపకాలన్నీ అలలు అలలుగా నాకు వస్తున్నాయి. ఇంతలో మల్లి సామానులను తీసికొని లోపలికి వచ్చింది. శారద “అమ్మా, నాకేం తెచ్చావ్?” అంటూ వెళ్ళింది.
“ఎలాగున్నారు తండ్రీ కూతుళ్ళు?”
“బాగున్నాము మై డీయర్ జాస్మిన్!” మల్లి క్షణం నిర్ఘాంతపోయి అన్నది
“ఇదేం ఎక్కడలేని ప్రేమ ఈ రోజు నాపైన! జాస్మిన్ అని పిలుస్తున్నారు.”
“మొట్టమొదట జాస్మిన్, తరువాత మల్లిక, ఎప్పుడూ మల్లి! అంతేగా.”
అది మా ఇద్దరి మధ్య ఒక ఆట. నా హృదయం కొద్దిగా ఆర్ద్రమయినప్పుడు మల్లిని అసలు పేరుతో జాస్మిన్ అని పిలుస్తుంటాను.
“నాకు తెలుసు. మీరు మీ అమ్మగారు లలితమ్మనుగురించి ఈ రోజు తలచుకొంటున్నారు. నేను ఇప్పుడే పిలుస్తాను. తల్లీ కొడుకు మాట్లాడుకోండి” అంటూ డయల్ చేసి ఫోను ఇచ్చింది.
నేనెంత అదృష్టవంతుడినో? ఇద్దరు తల్లులు నాకు. ఒకరు జన్మ నిచ్చి ప్రేమను ఇచ్చి నేను పూర్తిగా ఎదగక మునుపే చనిపోయారు. మరొకరు అమ్మగా, స్నేహితురాలిగా, ఒక హితైషిగా తన జీవాన్ని కూడా ఇవ్వడానికి వెనుదీయలేదు. మూడో ఆమె – అదే మల్లి – వేరోక దేశంలో, వేరొక జాతిలో, వేరొక మతంలో పుట్టి తన సర్వస్వాన్ని నాకిచ్చి, నన్ను మనసారా ప్రేమించి నా శారదకు తల్లిగా, నాకు భార్యగా, ప్రియురాలిగా నా జీవితాన్ని పంచుకొంటూ ఉంది.
“హలో లలితా, నేనే చంద్రం, నువ్వెలా ఉన్నావ్? నాన్నగారు, ఉష, సూర్యం కులాసాగా ఉన్నారా?” అంటూ మాట్లాడడానికి ప్రారంభించాను. మా మాటలు ముగిసిన తరువాత మల్లి, శారద మాట్లాడారు. చివరకు
“నాన్నా, నే చెప్పింది మరచిపోయావా?” అని శారద అడిగింది.
“లేదమ్మా, రేపు వెడదాం.”
“ఎక్కడికి?” అని మల్లి అడిగితే
“నాన్నా చెప్పబోకు మన రహస్యం” అంటూ నోటిపైన వేలు పెట్టింది శారద.
మల్లి తనకు అర్థం అయిందన్నట్లు నవ్వింది. వేయి మల్లెలు లలితసౌందర్యంతో పక్కుమని విరిసినట్లుండింది అప్పుడు.