అమ్మ చెప్పిన అబద్ధం

మా అమ్మ చెప్పినన్ని అబద్ధాలు నా జీవితంలో ఇంకెవరూ చెప్పుండరు నాకు. నిజం తెలిశాక, ఒళ్ళంతా భగభగ మండిపోతున్న బాధ.

పూజ గదిలో వెలుగుతున్న దీపం ముందు కూచుని అమ్మ రామాయణం చదువుతోంది. వాకిట్లో నేను కూచున్న చోటు నుంచి అమ్మ స్పష్టంగా కనపడుతోంది. నుదుటి మీద విభూతి రేఖలు, ముక్కు మీదకు జారిన కళ్ళజోడు, చెంపల మీద సన్నటి ముడతలు, నెమ్మదిగా కదులుతున్న పెదవులు.

వృద్ధాప్యం మీద పడ్డాక, జ్ఞాపకాల ముడతల్లో అమ్మే ఒక పెద్ద ముడతలా మారిపోయింది. గోరు విరిగిన చూపుడువేలు పుస్తకంలోని లైన్ల వెంట నెమ్మదిగా కదులుతోంది.

ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో బెదిరిస్తూ నిర్దాక్షిణ్యంగా నాకు నిబంధనలు విధించింది ఆ చూపుడు వేలే కదూ!

ఒకసారి బడి నుంచి ఇంటికి వస్తుంటే అహ్మద్ ఇక్కా నాకు నిమ్మతొన బిళ్ళలు ఇచ్చాడు. ఇంటికి రాగానే అవి చూసి అమ్మ ఉగ్రురాలైపోయి వాటిని లాక్కుని నేలకేసి కొట్టింది. “అహ్మద్ ఇక్కానా? ఆయనెవడు మనకి? ఎవరు పడితే వాళ్ళు ఏమిచ్చినా తీసేసుకుంటావా? నాన్న రానీ చెప్తాను.”

నేల మీద పడిన తియ్యని బిళ్ళలని చీమలు మూగి సొంతం చేసుకున్నాయి.

నిమ్మతొన బిళ్ళలలాటి తియ్యని ఆనందాలు ఎన్నో జీవితంలో అపరిచితుల వల్లే పరిచయం అవుతాయని, తర్వాతెప్పుడో అపరిచితుల వల్లే తెలీడం విషాదం నా వరకూ.

అయినా కూడా, అహ్మద్ ఇక్కా నాకు అపరిచితుడు. ఎన్నడూ ప్రేమగా ఒక మాట మాట్లాడి ఎరగని మనిషి, వారానికోసారి ఇంటి మొహం చూసి ఇంట్లో అందరినీ హడలెత్తించే మనిషి మాత్రం నా తండ్రి. అన్యాయం కదూ ఇది?

బడి నుంచి ఇంటికి వస్తున్నపుడు పడక్కుర్చీ వెనక వైపు నుంచి సగం కనపడే బట్టతలను రెండు మోటు చేతులు సవరించుకుంటూ కనపడేవి.

మా నాన్న!

రాత్రి భోజనాలు పూర్తయ్యాక, గొంతు సవరించుకుంటూ, ఖాండ్రించి ఉమ్మేస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేయడం, పనివాళ్ళ మీద కోపంతో ఎగిరిపడటం, వారం రోజులుగా నేనెన్ని తప్పులు చేశానో లెక్కపెట్టి, నా చేతుల మీద జుయ్యిమంటూ నాట్యమాడించే పేము బెత్తం చప్పుడు… ఇవే నాన్నంటే నాకు గుర్తొచ్చేది.

నాన్న కాస్త సౌమ్యంగా వ్యవహరించేది అమ్మ దూరపు బంధువు, చెల్లమ్మక్క తోనే. ఇద్దరికీ ఎంతో తేడా. అమ్మ విభూతి రేఖ అయితే, చెల్లమ్మక్క మల్లె దండ పరిమళం, నవ్వుల నావ.

ఆమె ఇంకా నవ్వడం మొదలు పెట్టకుండానే ఆమె చన్నులు ఊగేవి, బుగ్గ మీద సొట్ట లోతుగా సాగేది, ముక్కు పుడగ తళుక్కున మెరిసేది.

చెల్లమ్మక్క మా ఇంటికి ఎప్పుడూ వచ్చిన గుర్తు లేదు గానీ మా అమ్మ తిట్లలో, మా నాన్న పాటించే వ్యూహాత్మకమైన మౌనాల్లో, నాన్న జేబులో దొరికిన మల్లె మొగ్గల్లో… ఎప్పుడూ ఇక్కడే తిరుగాడుతున్నట్టుండేది. ఆమె అంటే నాకిష్టమే. కానీ ఒక్కోసారి అమ్మా నాన్నల మధ్య గొడవలు పెద్దవైపోయినపుడు, మంచం కిందో, బల్ల కిందో దాక్కుని చెల్లమ్మక్క చచ్చిపోవాలని కోరుకునేదాన్ని.

ఒకరోజు చెల్లమ్మక్క చచ్చిపోయింది. ఆత్మహత్య చేసుకుంది.

‘అమ్మ ఇక ఎన్నడూ ఏడవక్కర్లేదు’ అని సర్ది చెప్పుకుని నన్ను నేను ఓదార్చుకున్నాను.

అంత్యక్రియలకు వెళ్ళబోతూ నాకున్న గౌనుల్లో మంచిది వేసుకున్నాను. అమ్మ దాన్ని మార్చేసి, రోజూవారీ గౌనేదో ఇస్తూ “అందరూ ఏమనుకుంటారు?” అంది. నా మెదడులో రేగిన రకరకాల ఆలోచనలను అణిచిపెడుతూ అమ్మకేసి తేరిపార చూశాను. అమ్మ మొహం మాత్రం విభూతిలాగా అభావంగా ఉంది.

ఆకురాలే కాలమది. రాలిన ఆకుల్ని తన్నుకుంటూ అమ్మ వెంటే నడిచాను.

“అక్కడ నవ్వడం, ఆటలు ఇవేవీ చెయ్యకూడదు, సరేనా. అక్కడ వాళ్ళంతా బాధలో ఉంటారు” అమ్మ గుసగుసగా చెప్పింది.

“చెల్లమ్మక్క చచ్చిపోతే నీకు సంతోషంగా ఉంది కదూ?” అడిగా అమ్మని.

అమ్మ ఒక్కసారిగా డీలా పడిపోయింది. మా ఇద్దరి కంటే నాలుగడుగులు ముందు నడుస్తున్న నాన్న, వెనక్కి తిరిగి ఒకింత అసహనంగా చూశాడు. ఆ చూపులో బాధ కూడా ఉంది.

అమ్మ చీరకొంగుతో ముక్కు చీది దుఃఖాన్ని అభినయించి, రాని కన్నీళ్ళను తుడుచుకుంది. అమ్మ నటన చూసి, బుగ్గలో సొట్ట పడేట్టు ఎవరో నవ్వినట్టు అనిపించింది.

తిరిగి వచ్చేటపుడు, ముందు నడుస్తున్న అమ్మను పరుగున వెళ్ళి కలుసుకున్నాను.

“అమ్మా, నేను కూడా పెద్దయ్యాక నాకిష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పొచ్చా?”

అమ్మ నుదుటి మీది విభూతిరేఖలు కోపరేఖలుగా మారాయి. ఎటునుంచో వాడిన మల్లెల వాసన గుప్పున కొట్టినట్టయింది.

“పనికిమాలినదానా! వెధవ ప్రశ్నలన్నీ నోట్లోనే ఉంటాయి. నీలాటి బుద్ధిలేని దానికి ఇంకేం ప్రశ్నలు వస్తాయి? దేవుడు నీ రోగం కుదురుస్తాళ్ళే!” తిట్లు పడ్డాయి.

వాలుతున్న సూర్యుడి లేతకిరణం ఎవరి నవ్వునో గుర్తు చేసింది. అవమానపడి తల దించుకున్నాను. అప్పుడు నాకర్థమైంది. అమ్మ తన అపరాథ భావనని తప్పించుకునేందుకు నన్ను అవమానించింది. అమ్మ డేగకళ్ళ నుంచి దూరంగా ఉన్న రోజుల్లో చాలా రహస్యాలు తెలిశాయి నాకు. అప్పుడే నా సొంతగా ఒక రహస్య ప్రపంచాన్నే తయారుచేసుకున్నాను.

నిరాదరించే ప్రపంచంలో అమ్మ విభూతి రేఖలతో కాపలాగా నా పక్కన నిలబడింది. ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో నిషేధాజ్ఞలు, నిబంధనలు, విధేయతా పాఠాలు – వీటన్నిటి మధ్యా విసిగిపోతూ, స్నేహితుల ఇళ్ళలో, చెల్లమ్మక్క నవ్వులో, పొలాలు, కొబ్బరి తోటల్లో పనిచేసే పనివాళ్ళలో వేరే ప్రపంచాన్ని వెదుక్కున్నాను. ఎలాటి భేషజాలు లేని ప్రపంచం అది. చాలా చిన్నదే, కానీ ఎంత ఆనందం దాంట్లో!

చిన్నప్పుడు నిజానికీ అబద్ధానికీ తేడా తెలీని అయోమయంలో ఉండేదాన్ని. పాలిపోయిన నిజం కంటే, రంగేసిన అబద్ధమే బాగుంటుందని అర్థమైంది.

ఎప్పుడు సమయం చిక్కినా నా రహస్య ప్రపంచంలోకి పరిగెత్తేదాన్ని. అమ్మ పెట్టిన నియమాలను ఎగరగొట్టడంలో గొప్ప ఆనందం దొరికేది. పనివాళ్ళ కంచాల్లో తింటూ వాళ్ళతో గడపటం, చెల్లమ్మక్క వేలు పట్టుకుని పొలాల్లో నడుస్తున్న ఊహలు, గాల్లో దూరం నుంచి తేలి వచ్చే పనివాళ్ళ కేకలు. వొద్దన్న పనులు చేస్తుంటే కలిగే ఆనందం, నాలో బోల్డంత ధైర్యాన్ని నింపింది.

ఒక సాయంకాలపు బాల్య జ్ఞాపకం మాత్రం బాగా గుర్తుండిపోయింది. ఇపుడు మా అమ్మ కూచుని చదువుకునే అదే దీపం ముందు కూచుని దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ, ఎందుకో తెలీకుండానే ‘వేశ్య’ అని పదిసార్లు ఉచ్చరించాను, దేవుడికి కోపం వస్తుందనే భయమైనా లేకుండా.

చెత్త పనులు చేసే చెడ్డపిల్లగా, స్టోర్‍రూములో దేవుడు విధించిన శిక్ష అనుభవిస్తూ పడుకుని, గోళ్ళు కొరుక్కుంటూ గడిప్లిన నిద్రలేని రాత్రులు కూడా నాకు గుర్తున్నాయి. నిద్ర పోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నపుడు, వెదురు బొంగులు వేసే ఊళ లాంటి ఈల చప్పున నిద్ర లేపేసేది.

నా పీడకలల్లో కనపడే దేవుడి మొహం ఎవరిదో కాదు, మా నాన్నది.

ఆ తర్వాత ఒక రోజు మా నాన్నని పొలం నుంచి మోసుకొచ్చారు. మొహం తిరిగిపోయి ఉంది. పక్షవాతం వచ్చి ఒళ్ళు చచ్చుబడిపోయింది. నా కలలో శిక్షలు వేసే దేవుడి రూపం ఆ రోజే శాశ్వతంగా మాయమైంది. పక్షవాతం వచ్చి కుంచించుకుపోయిన ఒక అబద్ధంలా. చాలా ఏళ్ళ తర్వాత నా పెళ్ళికి కాస్త ముందు మా నాన్న చనిపోయాడు. ఏ విలువా లేని ఒక వాస్తవం ఆయన.

నా పెళ్ళికి అమ్మ మరో అబద్ధాన్ని మెరిసే వజ్రాభరణంలా బహూకరించింది. పెళ్ళికి ముందు, అందరు పెళ్ళికూతుళ్ళలాగే నేనూ మనసులో కొంచెం ఆందోళనపడుతూ, మరి కొన్ని తీయని ఆశలతో గదిలో నిలబడి ఉండగా, నా గదిలోకి వచ్చి నన్ను తేరిపార చూసింది.

నా భుజం మీద చెయ్యేసి ఏదో వెదుకుతున్నట్టు మొహంలోకి చూసింది. “ఇహ నువ్వు ఊహాలోకం లోంచి బయటికి రావాలి. పరాయింటికి వెళ్తున్నావు. ఇల్లు నడపటం ఇంట్లో వాళ్ళ అవసరాలు తీర్చడం ఆషామాషీ కాదు…” ఒక్క క్షణం ఆగి అంది.

“మొగుడిని కొంగున కట్టుకోడానికి ఒకటే మార్గం… మర్చిపోకు.”

నేను మర్చిపోలేదు. నా భర్త బాగా చదువుకున్నవాడు, ఆధునికుడు. కవి. తీరిక వేళల్లో రాజకీయాల్లో కూడా ఉంటుంటాడు. పొద్దున్నే ఐదారు వార్తా పత్రికలు ఆయన తిరగేస్తూ ఉండేటపుడు, వంటింటి పనుల్లో బిజీగా ఉండేదాన్ని. నా కలల ప్రపంచాన్ని వదిలించుకోడానికి అదే దారి నాకు.

వంటింటి నుంచి పిల్లల గదికి, అక్కడ నుంచి భర్త గదికీ మళ్ళీ వెనక్కీ ఏళ్ళ తరబడి నేను తీసిన పరుగులు ఆ ఇంట్లో నా ఉనికిని నిర్వచించాయి. నా భర్త మనసులో స్థానం వెదుక్కుంటూ నేను చేసిన ప్రయాణాలు ఆ పరుగులు.

ఒక రాత్రి వంటింటి పని ముగించుకుని అతని గదిలోకి అడుగు పెట్టేసరికి బిగువైన వక్షోజాలూ అవయవాల కోసం అతనెంత మొహం వాచి ఉన్నాడో అర్థమైంది.

మోసపోయాను. నా మనసులో కూడగట్టుకున్న కోటి ఆశలు గాలికెగిరిపోయాయి. భర్త మనసులో స్థానం పొందటానికి ఒకటే మార్గం, సత్యం బోధ పడింది. మా అమ్మ నాకు అర్థమయ్యేలా చెప్పలేకపోయిన సత్యం. అమ్మ చెప్పిన అబద్ధపు గాఢతలో దాగిన సత్యం.

ఆ రకంగా నేను అమ్మ భాష బాగా నేర్చుకున్నాను. మా అమ్మ, అమ్మమ్మ, ఇంకా అంతకు ముందున్న ఆడవాళ్ళ భాష అది.

నిశ్శబ్దం అనే భాష.

వయసు మీద పడుతున్న కొద్దీ, ఇరుగుపొరుగులూ బంధువులూ నేను అచ్చం అమ్మలాగా తయారవుతున్నాని అనడం మొదలుపెట్టారు. వాళ్ళ మాటల్లో సత్యం నన్ను కలవరపెట్టేది. అద్దం ముందు నిల్చున్నపుడు, చిన్న చిన్న అబద్ధాల ముక్కలన్నీ కలిసిన పెద్ద అబద్ధంలా కనపడేదాన్ని.

అమ్మ చదువుతున్న రామాయణం శ్లోకాలు నా చెవుల్లో పడుతున్నాయి. అమ్మ కళ్ళజోడు మూసి పుస్తకం పక్కన పెట్టింది.

గబుక్కున పడగ్గది తలుపు తెరుచుకుంది. నా ఎనిమిదేళ్ళ కూతురు అప్పుడే స్నానం చేసి వచ్చినట్టుంది, నా పట్టు చీర అస్తవ్యస్తంగా చుట్టుకుని నిల్చుని ఉంది. చేతిలోని బొమ్మను వెనకాల దాచుకుంటూ అంది. “అమ్మా, చూడు, నేను అచ్చం నీలా ఉన్నాను కదూ?”

గుండె దడదడలాడింది. అమ్మ గదిలోంచి వచ్చి తృప్తి నిండిన చిరునవ్వుతో నా ముందు కూచుంది. నా వైపు చూస్తూ, ఆత్రుత కనపడనివ్వకుండా మామూలుగా మాట్లాడ్డానికి ప్రయత్నిస్తూ అంది.

“అదీ… బాలూ (నా భర్త) రాలేదేంటి? కనీసం ఒక ఉత్తరం అయినా లేదు అతన్నుంచి? మీరిద్దరూ…?” అర్ధోక్తిలో ఆపింది.

ఒక్క క్షణం నిశ్శబ్దం.

“అదేం లేదమ్మా, మేము బాగానే ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నాం” చాలా తేలిగ్గా అన్నాను.

ఏమైనా నేనూ మా అమ్మకి ప్రపంచంలో ఎవరూ చెప్పనన్ని అబద్ధాలు చెప్పాను కదా. వాటిలో ఇదొకటి.

(ఆంగ్లానువాదం: Indira Chandrasekhar)


[ఆషిత (1956-2019): మలయాళ సాహిత్య ప్రపంచంలో కథలు, కవితలు, నవలలు, అనువాదాలు అని అన్నిట్లోనూ పేరు సాధించిన రచయిత. ఈమె కేరళ సాహిత్య అకాడమీ పురస్కారం, పద్మరాజన్, లలితాంబిక, అంతర్జనం మొదలైన పురస్కారాలను అందుకున్నారు. వర్షపు మేఘాలు, విస్మయ చిహ్నాలు, అపూర్ణ అభిరామంగళ్, నెమలి పించపు స్పర్శ వంటివి ఈమె రచనల్లో ప్రసిద్ధి చెందినవి.]