వారం రోజులుగా గమనిస్తున్నానతన్ని. మా అపార్ట్‌మెంట్ బిల్డింగ్ ఎదురుగా ఆ సిమెంట్ దిమ్మ మీద కూచుని ఉంటున్నాడు. ఇంతకుముందెన్నడూ చూళ్ళేదతన్ని. ఏ పరిస్థితులు అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాయో పాపం. కానీ బీరూట్‌లో ఇవాళ్రేపు అతనెవరో ఏమిటో అడిగే సాహసం ఎవరు చేస్తారు? ఈ వీధి చివర్లోనో, బాంబ్ షెల్టర్ దగ్గరో, బంకర్స్ దగ్గరో కనపడ్డవాళ్ళు ఆడో మగో ఎవరైతే ఏం? ‘నువ్వెవరు? ఎక్కడినుంచొచ్చావ్?’ లాంటి ప్రశ్నలడగటం, అగ్గిపుల్ల గీసి బాంబు వత్తి అంటించడంలాంటిది.
వస్తూనో వెళ్తూనో రోజూ గమనిస్తున్నాను, అక్కడే పాతుకుపోయి ఉంటున్నాడు. తినడానికీ తాగడానికీ వెళ్ళడు. కనీసం నేను చూస్తున్నపుడు బాత్‌రూమ్ అవసరాలకు కూడా లేవడు. అతని వైపు చూడకుండా ఉండటం అసాధ్యంగా మారింది. ఎక్కడో దూరంగానో, ఏ చెట్టుచాటునో, ఏమూలనో నక్కికూర్చున్నాడా చూడకుండా ఉండడానికి! బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగ్గా, సిమెంట్ దిమ్మ మీద కూర్చుని ఉంటాడు, ఇంట్లోంచి అడుగు బైటపెట్టగానే ఎదురుగ్గా కనిపిస్తూ.
అతను కూచున్న ఆ సిమెంట్ దిమ్మ–ఒక ఖాళీ ఇనప డ్రమ్ములో సిమెంట్ అచ్చుపోసి తయారుచేసింది. యుద్ధ సమయంలో ఎవరో దాన్ని రక్షణ కోసం వాడుంటారు. (ఆ డ్రమ్ము ఎక్కడిది, అందులో సిమెంట్ ఎవరు పోశారు, ఎందుకు పోశారు? లాంటి ప్రశ్నలడక్కండి, అదొక తొమ్మిదేళ్ళ పెద్ద యుద్ధపు కథ)– ఆ దిమ్మే తన నివాసం అయినట్టు దాని మీద పాతుకుపోయి, నిస్తేజమైన చూపుల్ని నలుదిక్కులా ప్రసరిస్తూ…
ఆ వ్యక్తిని తప్పించుకోవడం కష్టసాధ్యమైపోతోంది. తలుపు తీస్తే చాలు, ఎదురుగా నన్నే చూస్తున్నట్టు. బిల్డింగ్ నుంచి బయటికి వెళ్తుంటే నన్ను గమనిస్తున్నట్టు. కానీ అతని దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకుని, మాట్లాడే ధైర్యం నాకు లేకపోయిందనుకుంటాను. ‘అసలు పరిచయం చేసుకోవటం ఎందుకు?’ కారు డోర్ దఢాలున వేసుకొని, రయ్యని కారు పోనిస్తూ, గుచ్చుకుంటున్న అతని చూపుల్ని తప్పించుకుని దూరంగాపోయే ప్రయత్నంచేశాను.
నిరంతరం దేన్నో వెదుకుతున్నట్లు ఆత్రంగా అన్ని దిక్కులవైపూ పరిగెత్తే అతని కళ్ళు… ఇవే నన్ను కలవరపెట్టేవి. పైపైకి ఎగరాలని ప్రయత్నించి, చేతగాక కిందకు జారిపోయే రెండు పిట్టల్లా ఉండేవి అవి.
ఎవరి కోసమో దిగులుగా ఎదురుచూస్తాయి ఆ కళ్ళు. అతను ఇక్కడెందుకు వచ్చి కూచుంటున్నాడు? దేనికోసం వెదుకుతున్నాడు? ఇక్కడ కూచునే బదులు సిటీ అంతా తిరిగి వెదుక్కోవచ్చుగా? కదలడెందుకు ఒక పట్టాన? ఎందుకు? ఎందుకో?
ఈ ‘ఎందుకు’ అనే ప్రశ్న నన్ను ఆవహించింది. నా చుట్టూ పొగలా కమ్ముకుంది.
చుట్టుపక్కల జనం ఏం చేస్తున్నారా అని కుతూహలపడే ఏ ఇరుగుపొరుగువాళ్ళనో ఇతని గురించి అడిగితే పోలా? లేకపోతే.. అసలు మా బిల్డింగ్ వాచ్‌మన్‌ని అడిగితే? అతను రోజూ చూస్తుంటాడు గదా ఇతన్ని? యెస్. గొప్ప ఐడియా. నాకిది ముందే ఎందుకు తోచలేదో.
నా ‘ఎందుకు?’ను అతను ‘అంతా కంట్రోల్ లోనే ఉంది మేడమ్. నేనున్నానుగా’ అన్నట్టు ఒక నవ్వుతో జవాబిచ్చాడు.
“ఎవరతను?”
“శరణార్థి. వెళ్ళగొడితే వచ్చాడు.” నా తర్వాతి ప్రశ్న కోసం చూశాడు.
“ఎక్కడినుంచి వచ్చాడు? లెబనాన్‌లో ఏ ప్రాంతం?”
మా వాచ్‌మన్ తన యుద్ధజ్ఞాపకాల పుస్తకం తెరిచాడు. దాంట్లో అతను అప్పట్లో పేపర్లో, రేడియోలో వచ్చే ముఖ్యవార్తలు, పుకార్లు వంటివి రాసిపెట్టుకున్నాడు. కాసేపు తిరగేసి, పుస్తకం మూస్తూ “ఎక్కణ్ణుంచి అయితే ఏం లేండి. రెఫ్యూజీ. మన ఏరియాకు కొత్త” అన్నాడు.
“నువ్వు మాట్లాడావా అతనితో?”
“మొదటి రోజే మాట్లాడాగా! ఆ ఎదురుగా ఉండే బిల్డింగ్‌లో మొత్తం 20 శరణార్థి కుటుంబాలు వచ్చి చేరాయి. ఖాళీగా ఉన్న అపార్టుమెంట్లన్నీ ఆక్రమించారు. ఓనర్లేమో యూరప్ పోయి ఉంటున్నారాయె” కొద్దిపాటి వ్యంగ్యం చిలకరించాడు.
ఆ జవాబుతో సంతృప్తిపడ్డానా లేదా అని ఒక్క నిమిషం నన్ను తేరిపారచూశాడు. గర్భవతిని కూడానాయె. తనచుట్టూ జరుగుతున్నవన్నీ తెలిసినవాడిలా “ఏం భయంలేదు. నేనున్నాగా. అంతా కంట్రోల్ లోనే ఉంది” అని నేను భయపడుతున్నానేమో అనుకుని ధైర్యం చెప్తున్నట్టు చిరునవ్వు నవ్వాడు. ‘జీవితాన్ని ఇంత సాదాగా తీసుకొనేవాళ్ళు ఇంకా ఉన్నారా, ఇలాంటి సమయాల్లో కూడా?’ అనుకున్నాను నాకు నేనే.
“పాపం అతని కథ, అసలది కథ కాదు, పెద్ద విషాదం…” ఇక నేనేమీ ప్రశ్నలు అడగబోవట్లేదని తెల్సినా, అతనికి ఆ కథ ఇక చెప్పకతప్పేలా లేదు. బహుశా, అది అతని మనసులోనూ ఎక్కడో గుచ్చుకుంటూనే ఉండాలి. కానీ, ఆ విషాదమైన కథను వినడానికి నేను సిద్ధంగాలేను.
“అతనికి బంధువులు, కుటుంబం, ఎవరో ఒకరు ఉండుంటారుగా…” అడ్డుపడ్డాను.
“ఆఁ ఉన్నారు. ఆ రెండో ఫ్లోర్‌లో ఉంటారు. కానీ ఈయన అక్కడికి పోడు. ఇంట్లో ఎవరెవరుంటారంటే…”
“పాపం. ఊరు కొత్తది కదా! అందుకే ఆ దిగుల్లో ఉన్నాడేమోలే. కాస్త అలవాటు పడితే సర్దుకుంటాడు” మళ్ళీ అడ్డుపడ్డాను.
అక్కడి నుంచి పారిపోవాలనుంది నాకు. అతని కుటుంబంలో ఎవరెవరుంటారు, వాళ్ళకి ఏం జరిగిందో, ఏ విషాద ఘటన వాళ్ళని కుంగదీసిందో తెలుసుకోవాలని లేదు. దేశమంతటినీ కుంగదీసిన విషాదం ఇది, ఈ యుద్ధం. ఇంకా దాని గురించి ఏం తెలుసుకోవాలి నేను? వద్దు, అతని కథ నేను వినదల్చుకోలేదు. ఆ వివరాలన్నీ తెలుసుకొని నేనేం చేయాలి? సగం తెరిచి ఉన్న గుమ్మం లోంచి బయటికి వెళ్ళబోయాను.
వాచ్‌మన్ నా ప్రశ్నల కోసం చూడటం లేదు. కొన్ని వివరాలు ముఖ్యం, జీవితమంతా వాటిల్లోనే ఉంది. అవి వినకతప్పదు అన్న ధోరణిలో, తలుపు ముందే నిల్చుని ఎదురుగా కూచుని ఉన్న అతని వైపు చూపిస్తూ జాలి నిండిన గొంతుతో అన్నాడు:
“అతనికి మతి స్థిమితం లేదు మేడమ్. పాపం తప్పతనిది కాదు. మనమేమైనా రాళ్ళమా. కొన్నిసార్లు తలకు మించిన కష్టాలొస్తే ఎవరైనా ఎలా తట్టుకోవడం?”
అక్కడి నుంచి బయటపడాలని ప్రయత్నించాను గానీ, తలుపుకి అడ్డంగా నిల్చున్న వాచ్‌మన్ పక్కకు జరగలేదు.
“వాడు వచ్చేస్తాడు, వాడు వచ్చేస్తాడు, అని ఎప్పుడూ తనలో తనే మాట్లాడుకుంటుంటాడు, అక్కడే కూర్చొని. ఆకుపచ్చ పిట్ట కథ తెలుసుగా అమ్మా మీకు? మన పల్లెటూళ్ళలో చెప్పుకునే జానపద కథ?
ఆకుపచ్చని పిట్టను నేనే, దర్పంతో నడిచేది నేనే అని మొదలవుతుంది, గుర్తుందా మీకు?
నా అనురాగాల అమ్మ
ఏరి కూర్చింది నా అస్థికలు
చలువరాతి జాడీలో
సవతి తల్లి కుట్ర చేసి ఆ బాబుని చంపేసి, వండి తన స్నేహితులకు తినిపిస్తుంది. కానీ చనిపోయిన అతని తల్లి ఆత్మ, వాడికి ప్రాణం పోస్తుంది. వాడి ఎముకలను ఒక చలువరాతి జాడీలో పెట్టి, వాటి మీద నీళ్ళుచల్లి పెంచుతుంది. అయితే పిల్లవాడు మనిషిగా కాక, ఒక ఆకుపచ్చ పిట్టగా ప్రాణంపోసుకుని బయటికి వస్తాడు. ఆ ఆకుపచ్చని పిట్ట సవతి తల్లిని రాత్రింబగళ్ళు వెంటాడి, పొడిచి, వేధించి ఆమె నేరాన్ని ఆమెకు గుర్తుచేస్తూ, ఏదో ఒక రోజు శిక్ష పడక తప్పదని హెచ్చరిస్తుంటుంది. ఇదిగో, ఈ మనిషి కూడా, ఆకుపచ్చని పిట్ట తిరిగొస్తుందని ఎదురు చూస్తున్నాడు. ఒక్క క్షణం కళ్ళు మూసినా పిట్ట వచ్చి తను చూడకుండానే ఎగిరి పోతుందేమో అనే భయంతో కన్నే మూయడు.”
“ఏ పిట్ట గురించి ఇతను మాట్లాడేది?” వాచ్‌మన్‌ని అడగలేకుండా ఉండలేకపోయాను, గోడకి జారగిలబడి ఆనుకుంటూ. ఈ పిట్ట కథ నన్ను కట్టి పడేసింది. అందులోంచి తప్పించుకోలేక పోతున్నాను. “ఇతనికీ ఆ పిట్టకీ సంబంధం ఏంటి? ఎవరా పిట్ట?”
వాచ్‌మన్ సన్నగా నవ్వాడు. అతనికి నవ్వెలా వస్తోంది? అతనే కదా అతని కథ పెద్ద విషాదం అని మొదలెట్టేడూ! ఏమో, ఎవరో చెప్పినట్టు కొన్నిసార్లు విషాదం మరీ ఎక్కువయితే వచ్చేది నవ్వేనేమో.
“అతని కొడుకమ్మా! అయిదుగురు ఆడపిల్లల మధ్య పుట్టిన కొడుకు. తెలివైన పిల్లాడు. తెలివి కేవలం ఉన్నవాళ్ళ సొత్తే కాదుకదమ్మా. ఇతను పేదవాడైనా ఉన్నదంతా అమ్మి, కొడుకుని డాక్టరీ చదివించాడు. ఈ ఏడాది చివరికి చదువు పూర్తయి ఉండేది. తండ్రి బాధ్యతలని కొన్నయినా అతడు తలకెత్తుకుని చెల్లెళ్ళను చదివించి ఉండేవాడు. పాపం, అసలు అలా జరగకపోయుంటే ఎంత మంచి భవిష్యత్తు ఉండేదో అతనికి…”
“ఎలా జరక్కపోయుంటే?” కీచుగా వచ్చింది నా ప్రశ్న. వాచ్‌మన్ అలాగే స్థిమితంగా కొనసాగించాడు తన కథను. “అదేనమ్మా. ఆ బాంబ్ షెల్ అతని మీద పడి అతను పేలిపోయాడు కదా.”
అతను ఆ సంఘటనని కవితాత్మకంగా కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తున్నాడు. ‘అతను పేలిపోయాడు’ అనే పదప్రయోగం ఇంతకుముందు ఎక్కడా వినలేదు నేను. బహుశా ఇది యుద్ధ పరిభాష అయి ఉండాలి. సందేహం లేదు, ఇది యుద్ధ భాషే. అతను చెప్తూ ఉంటే, ఆ సంఘటన నా కళ్ళ ముందే జరిగినట్టు, నేను అప్పుడు అక్కడే ఉన్నట్టుగా, అదంతా స్లో మోషన్‌లో జరిగినట్టు నా కళ్ళముందే కనిపిస్తోంది.
శరణార్థుల శిబిరంలో బయట అంతా ప్రశాంతంగా ఉండటంతో కాల్పుల విరమణ ఏదైనా జరిగి ఉండచ్చని అతను బయటికి వచ్చాడు. ‘మన కారుని కాస్త భద్రమైన చోట పెట్టి వస్తాను’ తల్లికి చెప్పి అలా వచ్చాడో లేదో, వరసగా పేలిన రెండు బాంబులు అతన్ని ముక్కలు చెక్కలు చేసి గోడకి విసిరికొట్టాయి. తండ్రి పరిగెత్తుకు వచ్చి అతడి శరీరాన్ని చేతుల్లోకి తీసుకునే సమయానికి కూడా మరో వైపు నుంచి బుల్లెట్ల వర్షం కురుస్తూనే ఉంది. తండ్రి ఒక రాత్రంతా కొడుకు శరీరంలో ఛిద్రమై మిగిలిన భాగాల్ని చేతుల్లో పెట్టుకుని ఆ రక్తపు మడుగులో కూచుండిపోయాడు. మరుసటి ఉదయం అతడి చేతుల్లోంచి బలవంతంగా శరీర భాగాల్ని అంత్యక్రియల కోసం లాక్కోవాల్సి వచ్చింది.
ఆ రాత్రంతా ఆ తండ్రి కొడుకుతో మాట్లాడుతూనే ఉన్నాడు. ‘బాగా చలేస్తుంది కదూ నాన్నా? ఇక్కడంతా చలి, చీకటి. ఆ ఉరుముల శబ్దం విన్నావా? వర్షం ఇక్కడంతా. వదలండి నా కొడుకుని. వాడికి చలేస్తోంది. నా చేతుల్లో వెచ్చగా పడుకోనివ్వండి వాడిని.”
ఇరుగుపొరుగుల వాళ్ళు అతన్నుంచి కొడుకు శరీరాన్ని తీసుకోడానికి చాలా శ్రమపడ్డారు. ముత్యపుచిప్ప బలవంతంగా తెరిచి ముత్యాన్ని తీసుకున్నట్టు ఉందా దృశ్యం.
వాచ్‌మన్ గొంతు మళ్ళీ నన్ను స్పృహలోకి తెచ్చింది మెల్లిగా మసకబారుతున్న ఆ సన్నివేశం నుండి. “ఇదిగో, ఇలా ఇప్పుడు ఇక్కడున్నాడమ్మా. తన ఇల్లుని, శిబిరాన్ని అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఆ రాత్రి కొడుకు తాలూకు రక్తపు మడుగులో తన మతి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా అతని దగ్గరకు వెళ్తే ‘మీకు కనపడ్డాడా వాడు?’ అని అడుగుతాడు.
‘ఎవరు?’ అని మనం అడిగామనుకోండి. అంటాడూ, ‘అదే, ఆకుపచ్చ పిట్ట. రండి ఇలా కూచోండి. ఆ పిట్ట ఏ క్షణమైనా రావచ్చు.’
మీరెవరు, అతని మాటలకు మీ స్పందన ఏమిటన్నది అతనికి అనవసరం. మీరు అతని భార్యో, కూతురో లేక అతనిలాగే ఎదురుచూస్తున్న మరో వ్యక్తో అనుకుంటాడు. అతని పక్కగా ఎవరు వెళ్తున్నా అతను ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తాడు. వచ్చి కూచుని ఆకుపచ్చని పిట్ట కోసం చూడమంటాడు. అతని చూపులు మాత్రం వీధిలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ అతుక్కుని ఉంటాయి…
ఆకుపచ్చని పిట్ట కోసం చూస్తూ…”
(మూలం: The green bird.)